తీయటి ఖీర్ తాగలేక
ఈ దేశం పండగరుచి మరచిపోయింది
తోబుట్టువుల ముంజేతి గాజుల సవ్వడి లేక
గాజా వీధులు మూగబోయాయి
ఒక సుందర మానవ స్వప్నసౌందర్యం
కాలిబూడిదైపోయింది
తరగతి గదిలో పగిలిపోయిన నల్ల బోర్డంతా
బాంబుల మూర్ఖత్త్వం రాల్చిన దుమ్ము దుమ్ము
అక్కడి హృదయాల నిండా
కనికరం లేని యుద్ధసర్పం చిమ్మిన
కాలకూట విషం
రక్తపు బట్టలతో కట్టిన టెంటులలో
నడిజామున అమ్మలందరిదీ ఒకే కల
పాపాయి ఆకలి ఏడుపుతో
రేపు తెల్లవారుతుందని
త్వరగా ఇల్లు చేరగలమని
మిగిలినవారైనా కలిసి అన్నం తినాలని
బ్రతుకు పై ఆశ ఒక ఆరని దీపం
సూర్యుడు ఈ యుద్ధనేలపై
సిగ్గుతో తల వంచుకు ఉదయిస్తున్నాడు
చంద్రుడికి పిల్లలతో కలసి ఈ రేయి నిదురించాలని కోరిక
శిధిలాలూ, శిబిరాల మధ్య ఎటుచూసినా విధ్వంసపు గాయాల గాజా నగరం
మసీదు బురుజులోంచి అజా పావురమై ఈరోజు
మళ్లీ పైకెగురుతోంది
గెలుపోటముల పెనుగులాట మధ్య
ఎక్కడో గుండె మూలల్లో
ఆశ చిగురిస్తున్న పోరాటం పరిమళిస్తోంది
కవిత బాగుంది. మీ వాక్యాలలో శబ్ద సౌందర్యం ఎక్కువ.