గద్దార్

మూలం : మౌమిత ఆలం
అనువాదం : ఉదయమిత్ర

వృక్ష శాస్త్రం, లెక్కలు ,ఇంగ్లీష్, చరిత్ర
ఒక్కటొక్కటిగా
ఆమె చుట్టూ తిరిగాడుతున్నాయి…
కణవిభజన చెప్పాలని
నిజ సంఖ్యల సమాసాలు వివరించాలని
ప్లాసీ యుద్ధాన్ని విశ్లేషించాలని
ఒథెల్లో డెస్డిమోనాని ఎందుకు చంపాడో
గుండెకు హత్తుకునేలా బోధించాలని
ఎంతగానో తాపత్రయపడ్డది…
వీలుగా లేదు
ఓడిపోయింది
కుప్పగూలిపోయింది…
అన్ని ప్రశ్నలు, జవాబులు, పరీక్షలు, కాపీలు
ఒక్కటొక్కటిగా
మస్తిష్కం నుండి మాయమైతున్నాయి.
ఉబికివొచ్చే కన్నీళ్ళ వెనక
కాల్చిన బూడిదా
గుప్పు మనే నల్లని పొగ మాత్రమే
మాటిమాటికి ప్రత్యక్షమవుతున్నాయి
ఉన్నచోట ఊపిరాడడం లేదు
రక్తం గడ్డకట్టుకు పోతున్నది
అన్ని జవాబులు ప్రశ్నలు మాయమై
అవేముఖాలు కనబడుతున్నాయి
రోజు తను చూసే ముఖాలు
స్కూలు కాడా బజారు కాడా
రోజు తారసపడే ముఖాలు
ఆ చీకటిరాత్రి
తన ఇంటికి వచ్చి తలుపుదట్టి
“గద్దార్, గద్దార్, గద్దార్”అనడమే యాదికొస్తున్నది
చెవుల్లో మార్మోగుతున్పది
యోధుడైన ఒథెల్లో సైతం
తీవ్రమైన ప్రశ్నలతో, జవాబులతో
తలపడ లేక పోతున్నాడు…
శివ బీహార్ లో
25 ఫిబ్రవరి నాడు
తన కుటుంబాన్ని కట్టేసినట్లే
ఆమె కలాన్ని గళాన్ని కట్టిపడేశారు…

*

మెల్ల మెల్లగా
ఒంట్లోని రక్తాన్ని కూడా తీసుకొని
తుపాకులు కత్తులు ధరించి
మాస్కులు వేసుకున్న మానవ మృగాలను
కొంత స్కెచ్ వేసింది
వాటి కింద
పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాసింది
“గద్దార్”

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply