గద్దర్ పాట రాగం అమ్మ అనురాగం

1970లలో తెలంగాణ వ్యవసాయక విప్లవోద్యమం నుండి పుట్టి పెరిగిన బిడ్డ గద్దర్. విప్లవ రాజకీయాలలో సాహిత్యకళారంగాలు ఆయన కార్యక్షేత్రం. అతను కవి. గాయకుడు. పాటలే కాదు, వచనకవిత్వం కూడా వ్రాసాడు. రాజకీయ సిద్దాంతాన్ని చెప్పటానికి కవిత్వాన్ని, ఆచరణ దిశగా సమీకరణకు, ఆచరణలోని సత్య సౌందర్యాల ఆవిష్కరణకు పాటను సాధనాలుగా తన రచనా గాన ప్రయోగాలతో శక్తిమంతం చేసాడు. యుద్ధనౌక గద్దర్ తల్లీబిడ్డల రాగ సంబంధాన్నిపాటలోకి ప్రవహింపచేసిన తీరును విశ్లేషించటం ఈ వ్యాసం లక్ష్యం.

“ఎన్ని జన్మాలకైన ఏ జన్మ కైనా /కన్నతల్లి చనుబాల రుణమెట్ల తీరో” అనే పల్లవితో ప్రారంభమయ్యే పాటలో తొమ్మిది చరణాలు ఉన్నాయి. ఎనిమిది చరణాలలో తల్లి బిడ్డకు ఇచ్చే పోషణ, రక్షణ, లాలన విస్తరిస్తూ ఆ క్రమంలో ఆమె ప్రేమైక హృదయ ఆవిష్కరణ చేస్తాయి. తల్లి పిల్లలను పెంచే ఈ సామాన్యలోక రీతి కథనం తొమ్మిదవది, చివరిది ఆయిన చరణంలో అసామాన్యతలోకి ఒక గంతు వేస్తుంది.

“నన్ను కనీ పెంచి- పాలిచ్చినందుకూ
తల్లి కన్నుల్లోన కన్నీళ్లు లేని
లోకాన్ని సృష్టించే – పోరులో చేరి
నీ చనుబాలతో చరిత రాసి పెడ్తాను
కన్న తల్లి చనుపాల రుణం తీర్చుతాను” – అని ముగిస్తాడు పాటను. అప్పడు కానీ కన్నతల్లి గురించి మాట్లాడుతున్నది కవి కాదు, విప్లవోన్ముఖుడు అవుతున్న కొడుకని మనకు అర్ధం కాదు. ప్రతి ప్రసవం ఒక పునర్జన్మగా కని, కళ్ళల్లో వత్తులేసుకొని, బాలారిష్టాలు నుండి శిశువును కాపాడుకొంటూ, పెంచి పోషించి బిడ్డలు ప్రయోజకులు అయ్యేవరకు కనిపెట్టుకొని వుండే తల్లి రుణం తీర్చుకోలేనిది అని లోకరూఢి. ఇక్కడ కొడుకు పోరులో చేరటం ద్వారా ఆ రుణం తీర్చుకొంటాను అంటున్నాడు. “తల్లి కన్నుల్లోన కన్నీళ్లు” చూసిన కొడుకు ప్రతిజ్ఞ అది. తల్లి కన్నుల్లో కన్నీళ్లు ఎందుకు? లోకంలోని అసమానతలకు, దోపిడీకి, పీడనకు గాయపడ్డ హృదయం కార్చే కన్నీళ్లు అవి. తల్లి కళ్ళల్లో కన్నీరు లేని లోకాన్ని సృష్టించటం విప్లవోద్యమం వల్లనే సాధ్యం. అందువల్లే కొడుకు ఆ మార్గం ఎంచుకొనటం. ఈ పాట ముగిసేసరికి కన్నతల్లి ఒక వ్యక్తి మాత్రమే కాదు,దేశమాత అన్న స్ఫురణ కూడా కలుగుతుంది. దేశంలోని అసమానతలు శ్రమ దోపిడీ పీడనలు దేశమాత కన్నీళ్లకు కారణాలు. అవిలేని దేశాన్ని నిర్మించటం నిజమైన అర్ధంలో తల్లి రుణం తీర్చుకొనటం.

తల్లి కన్నీళ్లు తుడవటానికి విప్లవోద్యమ బాట పట్టే కొడుకు శ్రామిక మహిళగా తల్లి కష్టాల బతుకు విముక్తి ఆ విప్లవోద్యమంలో భాగం కావటం వల్లనే సాధ్యమవుతుందని కూడా చెప్పగలడు. గద్దర్ తన తల్లిని ఉద్దేశించి వ్రాసినట్లుగా చెప్పబడుతున్న ‘సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో/ లచ్చుమమ్మా/ సినబోయి కూర్చున్నవెందుకమ్మో / ఎందుకమ్మా” అనే పాట ఇందుకు నిదర్శనం.

“మోకాళ్ళ మట్టూ కు
బురదలో దిగబడి
ఎద్దోలె ఎనుకాకు
ఒక్కొక్క అడుగేసి
అయ్యో! నాట్లేసి నాట్లేసి
లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ నడుమూలె యిరిగేన
లచ్చుమమ్మో లచ్చుమమ్మా” అన్న చరణంతో మొదలు పెట్టి పదకొండు చరణాలలో సాగిన ఈ పాట లచ్చుమమ్మ జీవన వ్యథలను, జీవిత విషాదాన్నికథనం చేస్తుంది. ‘కోతలప్పుడు కాల్జారి పడి కాళ్ళు చేతులు విరగటం, జొన్న కొయ్యబోతే జొన్నకొయ్య దిగి దిగి కాలు వాయడం, ఎరువు జల్లెటప్పుడు ఎర్రతేలు కుట్టడం వంటివి ఆమె పనిని, పని పరిస్థితులను, పని స్థలాలలో ప్రమాదాలను సూచిస్తాయి. మన్నులో మన్నయి ఇంత పనిచేసినా చిరిగిన బట్టలు, పాసిపోయిన బువ్వ, మాడిపోయిన గట్క తప్పగతిలేకపోవటం, చలికి కప్పుకోను బొంత లేకపోవటం ఆమె జీవితం. ఈ పరిస్థితులలో ఆమె ఏమి చెయ్యాలి? కర్మ , గాచారం అనుకొని తీర్థాలు, క్షేత్రాలు తిరగటం కాక “కొమిరెల్లి కొండల్ల కొలిమి రాజేసిన తోడి స్త్రీలతో కలిసి ఎర్ర దండులో” చేరాలని ఆ కొడుకు ఆశిస్తాడు.”

ఎన్నాళ్ళు ఏడ్చేవు/ ఎంతాని ఏడ్చేవు
ఏడ్చినా తూడ్చినా/ ఏమి సాధించేవు
నీతోటి చెల్లెండ్లు / నీ సాటి తమ్ముల్లు
ఎర్రదండు లో జేరి/ ఎత్తిండ్రు కొడవండ్లు
కొడవండ్లు నూరుకొని/ లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నువు కూలిదండలో కలువు / లచ్చుమమ్మో లచ్చుమమ్మా” అన్న చరణంతో ముగిసే ఈ పాటలో గద్దర్ లచ్చుమమ్మ అనే ఒక ప్రత్యేక నామవాచకం కలిగిన స్త్రీని విప్లవ మార్గంలో ఉన్న బిడ్డలందరి తల్లిగా ఒక సర్వనామం చేసాడు.
విప్లవ ఆచరణలో ఉన్న కొడుకు తల్లిని విప్లవోద్యమంలోకి రమ్మని ఆహ్వానించాడు కదా! ఆ తల్లి స్థితి ఏమిటి? స్పందన ఏమిటి? అని ఆలోచిస్తే సమాధానంగా కనబడే పాట ‘మా బిడ్డెలాను అడిగినానని సెప్పుతావా’? “మా బిడ్డెలాను అడిగినానని సెప్పుతారా / నా కూనలాకూ ముద్దులానీ సెప్పుతారా” అనే పల్లవితో ప్రారంభమై ఆరు చరణాలలో విస్తరించిన ఈ పాటలో ఉన్నదంతా అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లి ఎన్నాళ్ళుగానో, ఎన్నేళ్ళగానో కనబడకుండా పోయిన బిడ్డల కోసం ఎదురుచూపుల కాలపు భారమైన మాతృహృదయ సంవేదనే. అదంతా ప్రకృతిని ఉద్దేశించి తల్లి చేసే సంభాషణ.

గుమ్మడి కాయ బరువుతో కదులుతున్న తీగను ఉద్దేశించి ‘తీగకు కాయబరువు తీపిగుర్తు రూపమని’ తన బిడ్డలకు నచ్చ చెప్పి తల్లి ప్రేమ ఎంతటి భారాన్నైనా కడుపులో పెట్టుకోగలదని చెప్పమనటం మొదటి చరణం. “ధరణికి గిరిభారమా / గిరికి తరువు భారమా / తరువుకు కాయ భారమా / కనిపెంచే తల్లికి బిడ్డ భారమా” అనే పాట నేపథ్యం లో ఎక్కడో సన్నగా వినబడుతున్నట్లు అనిపిస్తుంది. తల్లికి బిడ్డ భారం కాదు అని చెప్పటానికి కడవంత గుమ్మడికాయను మోసే తీగను మించిన ఉపమానం ఏముంది? ఆ ఉపమానం ద్వారా గద్దర్ విప్లవోద్యమంలో ఉన్న బిడ్డల రహస్యాలను మోయటానికి తల్లులు సంసిద్ధతను సూచిస్తున్నట్లు అయింది. అందువల్ల ఎప్పుడైనా వచ్చి తమను చూసి వెళ్ళటానికి వాళ్ళు సంకోచించవలసింది లేదని బిడ్డలకు నచ్చచెప్పమని తల్లులు గుమ్మడి తీగను సంబోధించి చెప్తున్నారన్న మాట.
రెండవ చరణంలో మక్కజొన్న చేను తల్లి గా రూపించబడింది. కంకులు బిడ్డలు. గాలికి ఊగుతున్న చేలు బిడ్డలను ఎత్తుకొని జోలపాట పాడుతున్నట్లుంది. ఆ చేలను ఉద్దేశించి తల్లి నా బిడ్డను చూసావా అని అడుగుతూ ఒకసారన్నా వచ్చి తనను చూసి పొమ్మని చెప్పమని కోరుతుంది.

మూడవ చరణంలో నిండుగా పూసిన మల్లె చెట్టు తల్లి అయింది. మల్లెలు బిడ్డలు. నెత్తి మీద పిల్లలను ఎక్కించుకొని ఆడుతున్న తల్లి ఆ మల్లె చెట్టు. మల్లెలు తెంపుకొనటానికి పిల్లలు ఎప్పుడైనా అక్కడకు వస్తే ‘మెల్లంగ పల్లె కు కబురు పంప’మని వేడుకొంటుంది తల్లి. మెల్లంగ కబురు పంపటం వాళ్ళు అక్కడ ఉన్న విషయం మరెవరికీ తెలియకుండా ఉండటానికి, తానొచ్చి చూసి పోవటానికి. వచ్చి చూసి పోవటంలో ఆ తల్లికి తృప్తి లేదు. ‘నెత్తి దూసి పులుముడ్సి ముద్దు పెట్టుకోవాల’న్న అ పేక్ష ఆతల్లిది. ఈ చరణం పోతన భాగవతం లో ( దశమ స్కంధం) కాళిందీ నదీతీరపు అడవులలో కృష్ణుడికోసం వెతికే గోపికలు మల్లె పొదలతో చేసే సంభాషణను గుర్తుచేస్తుంది. “నల్లనివాడు, పద్మ నయనమ్ముల వాడు…” అని మొదలయ్యే ఆ పద్యంలో ప్రధాన భాగం శ్రీకృష్ణుడి విశేష రూపగుణ వర్ణనమే.. అలాంటి వాడు “మల్లియలారా మీ పొదల మాటున లేఁడుగదమ్మ చెప్పరే” అని గోపికల వేడుకోలు మాత్రమే ఉంది.గద్దర్ పాటలో మల్లెపూల మీద మనసుపడే మనుషుల సౌందర్య దృష్టి ఉంది. అది విప్లవ కారులలోనూ ఉంటుందన్న సూచన ఉంది. తల్లికి మరీ నమ్మకం మల్లెలకు పిల్లలకు మధ్యవుండే హృదయ సంబంధం. అందుకే మల్లె పూలు తెంపే వేళ తనకు కబురు చేయమని చెప్పగలిగింది ఆ తల్లి.
“పరుగు పరుగున వొచ్చె
పిల్ల ఏరు నెత్తుకొని
కొండెక్కి దుంకుతున్న
తల్లీ గంగమ్మ తల్లి
ఎండల్లో అల్సిన బిడ్డలు
నీ గుండెల్లో దాగుండ వొస్తే
నే స్నానం చేపిస్తనని సెప్పుతవా
నా కొంగుతో ముఖం తుడ్సి ముద్దాడనా” నాలుగవ చరణం. ఏర్లు నదులలో కలవటం, ప్రవాహ ఉధృతి పెరగటం, కొండలను దాటుకొంటూ దూకుడుగా సాగటం ప్రకృతి సహజ దృశ్యం. ఏర్లను బిడ్డలుగా, వాళ్ళను అక్కున చేర్చుకొని సాగుతున్న గోదావరిని తల్లిగా సంభా వించటం గోదావరిలోయ పోరాటాల స్ఫూర్తి నుండే. విప్లవోద్యమ రహస్య స్థావరం అది. బిడ్డల చిరునామా అది అని తెలిసిన తల్లి అక్కడెక్కడో ఎప్పుడైనా వాళ్ళను కలిసే అవకాశం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నది. నదీ సందర్భం కనుక స్నానం చేయించాలన్నఆలోచన. కొంగుతో ముఖం తుడిచి ముద్దాడాలన్న అపేక్ష. అలా రహస్య విప్లవోద్యమంలో భాగమైన పిల్లల కదలికలకు మౌన సాక్షులుగా ఉండే ఆ తీగెలు, ఆ చేలు , ఆచెట్లు, ఆ నదులు అన్నీ ఈ పాటలో తల్లులు అయ్యాయి. తల్లికే సాటి తల్లుల కడుపు తీపి, హృదయవేదన అర్ధం అవుతాయి.
ఆ తరువాతి చరణం పిల్లలను చూడాలని ఆశపడే తల్లి పిల్లలకు ఇచ్చే వాగ్దానం. అప్పుడే పుట్టిన పిల్లలను పిల్లుల బారి పడకుండా పొదలలో దాచి పోరాడే తల్లి కోడి పెట్టను సంబోధించి ‘తల్లి ప్రేమకు అది గుర్తు’ అని చెప్పి “నా బిడ్డల యుద్ధంలో నేను గూడ రెడీ” అని సంసిద్ధతను వ్యక్తం చేస్తుంది తల్లి. అది ముక్తాయింపు.

ముగింపు చరణంలో ఒక ఈతకు బహుళంగా పిల్లలను పెట్టె కుక్క ఉపమానం కావటం చూస్తాం. దానికున్న వాసనా శక్తి తెలిసిన తల్లి ‘కడ్పు నిండ కనుకున్న / ఓ నా కుక్క తల్లీ అని సంబోధించి బిడ్డల బాట తెలుసుకొనటానికి దాని సహాయం అర్ధిస్తుంది. ఆ బాటలో సాగి పోవటానికి సంకల్పం అది.

విప్లవోద్యమంలో నిమగ్నులైన బిడ్డల కోసం కళ్ళలో వత్తులేసుకొని ఎదురు చూసే తల్లులు ఒక్కొక్కసారి వాళ్ళ అమరత్వాన్ని వినవలసి వస్తుంది. అలాంటి ఒక సందర్భాన్ని గద్దర్. ‘సూర్యుడూ సెంద్రుడూ’ అనే పాటలో కథనం చేసాడు.విప్లవోద్యమంలో పనిచేస్తూ ఎన్కౌంటర్లో మరణించిన పెద్దశంకర్ గురించిన పాట అది. విప్లవోద్యమంలోకి వెళ్ళిన బిడ్డల క్షేమం గురించిన సందేహం తల్లిదండ్రులకు నిత్యదుఃఖం. బిడ్డల క్షేమవార్త కోసం నిరంతరం ఆశతో ఎదురుచూపులు.ఈ పాటలో అలాంటి తల్లులకు ప్రతినిధి పెద్దశంకర్ తల్లి. పెద్ది శంకర్ తండ్రి ఆదిలాబాద్ బొగ్గు గనులలో పనిచేసే వాడు. చాలా చిన్నతనంలోనే విప్లవరాజకీయాలతో ఆకర్షితుడై మహారాష్ట్ర లోకి వెళ్లిన తొలిదళాలలోపెద్ది శంకర్ ఉన్నాడు. గడ్చిరోలి లో పారామిలటరీ జరిపిన కాల్పులలో 1980 నవంబర్ లో అమరుడయ్యాడు. అప్పటికి అతనికి 23 ఏళ్ళ వయసు.

పెద్ది శంకర్ మరణ వార్త చెప్పి ఆ తల్లిని ఓదార్చేందుకు శంకర్ సహచరమిత్రులు వెళ్లిన సందర్భం నుండి పాట మొదలవుతుంది. వాళ్ళను చూచి, వాళ్ళల్లో తన కొడుకులేడని కన్నీరు వచ్చిందిఆమెకు. ఇంటికొచ్చిన పిల్లలను ఆదరించాలి కదా !కన్నీరు తీస్తూనే కాళ్ళకు నీళ్ళిచ్చింది. కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు తీసింది. అడివన్నల క్షేమం అడిగింది. వాళ్ళలో ఒకడుగా తన కొడుకు క్షేమంగా వుండాలన్న ఆశ ఆ తల్లిది.
“సూర్యుడూ సెంద్రుడు సుట్టమైరాంగో/
కాల్లకూ నీల్లిచ్చి కన్నీళ్ళు దీసే
ఎర్రమల్లడవిని పూసినదన్నా
అడవన్నలందరూ ఎట్టున్నరన్నా..” అన్న పల్లవితో ప్రారంభమవుతుంది ఈ పాట.

అడవన్నలందరి క్షేమం అడిగిన తల్లి నిర్దిష్టంగా కొడుకు గురించి ఆరాటం వ్యక్తం చేయటం మొదటి చరణం. “పెదతోట్ల పెదమల్లె వాడిపోయింది/ పెద్ది శంకరన్న యాడున్నాడన్నా” అన్నది ఆమె ప్రశ్న. జానపద కథలలో ప్రపంచం చుట్టి రావటానికో , ఏదో సాధించుకొని రావటానికో వెళ్లే నాయకుడికి ప్రతినిధిగా ఒక చెట్టు ఉండటం, ఆ చెట్టు వాడిపోతే, నిలువునా ఎండిపోతే అది అతనికి సంభవించిన ప్రమాద సంకేతం అనుకొనటం ఒక సాహిత్య భావన. కవి సమయం. ఆ జానపద విశ్వాసమే తల్లిది. తమతోటలోని పెదమల్లె పొద లో ఆమె కొడుకును చూసుకొంటుంది. అది వాడిపోవటం చెడు శకునంగా తోచింది. పెదమల్లె వాడింది, వచ్చిన పిల్లల్లో శంకర్ లేడు. కీడును శంకించే మనసుతో కొడుకు గురించి ఎక్కడున్నాడో చెప్పమని ఆరాతీస్తున్నది ఆ తల్లి.

“మరఠ్వాడ పల్లెలో మల్లె బూసింది / ఏ తల్లి కడుపులో అన్న వెలిసిండో” అన్న జవాబుతో ఇక్కడ వాడిన పెదమల్లె మరెక్కడో పూసింది అని చెప్పటం ద్వారా అతని మరణ వార్తను, అతని ఆచరణ కొనసాగింపును ఏకకాలంలో తల్లికి తెలియచేసారు సహచరులు. మరఠ్వాడ, గోండు గూడెం, బెల్లం పల్లి, బొగ్గు గుట్టలు పెద్దిశంకర్ విప్లవోద్యమ కార్యాచరణ విస్తరించిన క్షేత్రం. ఆ క్షేత్రంలో అతను మళ్ళీ ఎందరు తల్లుల కడుపునో బహువచనమై ప్రభవించి విప్లవాగ్నిని రాజేస్తునే ఉంటాడు అని తరువాతి చరణాలు చెప్తాయి. పెద్దశంకర్ లేడు అన్న భౌతిక వాస్తవం అర్థమైన స్థితిలో తల్లి దుఃఖాన్ని సూచిస్తూ, పరిణామాలను ధ్వనింపచేస్తూ “శంకరన్న తల్లి కడుపుగాలిందీ. ఇందిరా గద్దెకు నిప్పంటుకుందీ” – అని ఆ పాటను ముగించాడు గద్దర్.

పదార్థం రూపం మార్చుకొంటుందే కానీ నశించదు అని భౌతిక తత్త్వశాస్త్రం చెబుతుంది. ప్రజల విశ్వాసాలు కూడా ఈ భౌతిక తత్త్వశాస్త్రం మీదనే అభివృద్ధిచెందాయి. పునర్జన్మకు సంబంధించిన విశ్వాసంలోనూ అది బీజభూతంగా వుంది. విశ్వాసాలను విప్లవీకరించటమే గద్దర్ ఈ పాటలో చేసింది. మరణించిన పెద్దిశంకర్ మరొక విప్లవ కారుడిగా మరొక చోట మరొక తల్లి కడుపున పుడుతూ నిరంతరం జీవిస్తూనే వున్నాడన్న భావనను అంచెలంచెలుగా బలోపేతం చేస్తూ పాట చరణాలను నిర్మించాడు.

”కడుపుకాలటం” ఒక జాతీయం. పిల్లలు చనిపోయిన తల్లి దుఃఖాన్ని చెప్పటానికి ఉపయోగించే జాతీయం. కడుపున తొమ్మిది నెలలు మోసి రక్తమాంసాలిచ్చి పెంచి పురిటినొప్పులు పడి ప్రసవించిన శిశువు చనిపోతే కలిగే దుఃఖం అది.కాలటం కార్యం, కాలటానికి కారణం నిప్పు అనుమాన ప్రమాణంతో ఊహించబడింది. “శంకరన్న తల్లి కడుపుగాలిందీ/ ఇందిరా గద్దెకు నిప్పంటుకుందీ” అన్నముక్తాయింపుతో పెద్దశంకర్ వంటి వాళ్ళ మరణాలైనా, పెద్ది శంకర్ వంటి కొడుకులను కోల్పోయిన తల్లుల దుఃఖాలైన వృధాగా పోవు, ప్రజలపై హింసను ప్రయోగించే రాజ్యాన్ని అంతంచేసే దిశగా విప్లవోద్యమాలను మరింత బలోపేతం చేస్తాయి అని సరళ సుందరంగా చెప్పిన పాట ఇది.

ఆ పాట, ఆ కథనం ప్రదర్శన కళగా కలిగించే అనుభవం చెప్పకపోతే ఈ పాట గురించి పూర్తిగా చెప్పినట్లు కాదు. 1980-82 మధ్యకాలంలో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ఆడిటోరియంలో సాయంత్రపు కళాశాల రాడికల్ విదార్థి సంఘం గద్దర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దానిని ముందువరుస కుర్చీలలో కూర్చుని చూసే అవకాశం ఆ కళాశాల అధ్యాపకురాలిగా నాకు దొరికింది. గుండుసూది కిందపడితే వినిపించే నిశ్శబ్దంలో గద్దర్ ఒక్కడే చిన్నగా కంజీర మోగిస్తూ ‘సూర్యుడూ సెంద్రుడూ సుట్టమై రాంగో’ అంటూ ఈ పాట ఎత్తుకున్నాడు. ఆ పాట అలలు అలలుగా ఆడిటోరియం అంతా వ్యాపించి, నా సర్వేంద్రియాలను ఆక్రమించి, ఏకంచేసి, గుండెను పట్టి పిండేసి, ఊపిరిని ఆపేసి, ఆత్మను కుదిపేసి, గాలిలోకి లేపేసి, ఒకింతసేపు తేల్చి కూలేసిన ఒకానొక అనుభవం నాకు కలిగించింది. ఆ అనుభవాన్ని తలుచుకుంటే ఒళ్ళూ, గుండె రెండూ జలదరిస్తాయి ఇప్పటికీ. పాట రచన ప్రయోగాలతో మాటలకు మంత్రశక్తినిచ్చాడు గద్దర్.

‘పెదతోట్ల పెదమల్లె వాడిపోయింది’ అని చరణాన్ని ఎత్తుకుంటూనే శ్రోతలను ఒక విషాద సన్నివేశంలోకి ప్రవేశపెట్టి, పెద్దశంకర్ తల్లి దు:ఖోద్వేగాలతో సాధారణీకరణం చెందేలా పదాలను, పాదాలను నడిపి, పెద్దిశంకర్ తల్లి అన్న వ్యక్తి స్థాయిని దాటి గోర్కీ అమ్మవంటి ఒక విశ్వజనీనమైన అమ్మ స్థాయికి విస్తరింపచేసి, అమ్మ దు:ఖాన్నిరాజకీయశక్తిగా పదునెక్కించి గురిపెట్టాడు గద్దర్. బీభత్స కరుణ రసాలు, వీర అద్భుత రసాలు ఏకకాలంలో అనుభవానికి వచ్చేట్లు చేయగలిగిన పాట ఇది.

అమరులను తలచుకొనటం, వాళ్ల త్యాగాలను కీర్తించటం, ఎర్రెర్ర దండాలు సమర్పించటం ఉద్యమంలో సర్వసాధారణం. కొన్ని పాటల్లో వాళ్ళను సమూహంగా కీర్తించటం జరిగితే మరికొన్ని పాటల్లో వాళ్ళను పేర్లతో పేర్కొంటూ లాల్ సలాం చెప్పటం జరుగుతుంటుంది. అమరులు ఎవరైనా ఒకతల్లి కనిపెంచిన బిడ్డలే. ఆ తల్లులు పెద్ది శంకర్ తల్లికి బహువచనం. ఆ తల్లుల కోణంనుండి వచ్చిన అమరుల సంస్మరణ గీతం ‘వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు’
“వీరులారా వీరులారా రాడికల్లా శూరులారా
రాడికల్లా శూరులారా రైతుకూలీ బిడ్డలారా
ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్ల కలిసినారా
ఏ దిక్కు లేనోళ్లకు మా బిడ్డలు మీరు దిక్కుసూపే సుక్కలయ్యిండ్రా మా బిడ్డలు” అని ప్రారంభమై కొనసాగే ఈ పాటలో వర్ణితమైనది బిడ్డల మీద కన్నకడుపు మమకారం, కడుపుకోత హాహాకారం. వాటన్నిటినీ మించి ధ్వనించేది జీవితం పై ఆశ. భవిష్యత్తు పై నమ్మకం.

“కావు కావుమని కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం
ఎవ్వరొస్తరో చెప్పుమాని ఎదురుచూస్తూ నిలుచుంటం
మీరు కాకమ్మలై వస్తారా మా బిడ్డలు
మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు” కాకి అరుపు వినబడితే ఇంటికి చుట్టాలు వస్తారన్నది ప్రజలలో ఒక విశ్వాసం. విప్లవోద్యమంలో పిల్లలు అమరులయ్యారనే వార్త తెలియని తల్లులు కొందరైతే తెలిసినా వాళ్ళ చివరి చూపులు దొరకక పోవటం సర్వసాధారణమైన పరిస్థితులలో తమ పిల్లలు ఎక్కడో ఉన్నారన్న ఆలాపనలో జీవించేవాళ్ళు అనేకులు. కాకి అరుపు వినబడిందంటే తలుపు తెరవటం వాళ్ళు వచ్చారేమోనన్న ఆశతోనే. వచ్చి కడుపు తీపి తీర్చి పోతారేమోనన్న నమ్మకంతోనే.

“ఇంటి ముందర పెరడులోన మక్క చేనై మేము పుడుతం
ఒంటి కాలు మీద నిలిచి కొడుకునిమ్మని వ్రతం పడుతం
మక్క కంకులై పుడతారా మా బిడ్డలు
మా సంకలల్ల బిడ్డలవుతారా మా బిడ్డలు” పునరుత్పత్తి మాతృక అయిన తల్లికి ఉత్పత్తికి అభేదం చెప్తున్నాడు కవి. విప్లవోద్యమం లోకి వెళ్ళిపోయిన బిడ్డలను, అమరులైన బిడ్డలను మళ్ళీ మళ్ళీ కడుపు నిండా కనాలన్న తల్లి తనపు వెల్లువ ఈ చరణం. మక్కజొన్న చేల నేలలో మాతృత్వ సారాన్ని, మక్క కంకుల పంటలో విప్లవోద్యమ శక్తులను, అమరులైన కొడుకులకు తల్లులుగా తాము, చంక బిడ్డలై వాళ్ళూ మళ్ళీ పుట్టాలన్నస్త్రీల ఆకాంక్షా తీవ్రతను ఏక కాలంలో మన అవగాహనకు అందిచ్చే భావచిత్రాల మాలిక ఈ చరణం.

“కట్టిన ఆ తెల్ల ఆవును కంటిపాపలా చూసుకుంటాం
పచ్చి గడ్డి పిండి పెట్టి పాణమోలే పెంచుకుంటం
పురిటి నొప్పులు దానికొస్తే కాపలుండి కాన్పు చేస్తం
తల్లి లాగను నాకుతుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చె
మీరు పురిటి నొప్పులై వస్తారా మా బిడ్డలు
మళ్లీ జన్మై మాకే పుడతారా మా బిడ్డలు” అనే చరణంలో కూడా వ్యక్తమైంది ఆ మహత్తర మాతృత్వ గాఢతే.పురిటినొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపిస్తాయి. ఆవు వ్యవసాయక సంస్కృతిలో భాగం. ఉత్పత్తి కారకం. ఆవు ఈనిందంటే ఉత్పత్తి కారకాల పెంపు. అది రైతుకు ఆనందకరం. ఆవు పడే పురిటి నొప్పులు బిడ్డలను గుర్తుకు తెస్తుంటే కడుపు కోతలకు ప్రత్యామ్నాయంగా పురిటి నొప్పులను, పునర్జన్మలను ఆవాహన చేస్తున్న తల్లులు వాళ్ళు.

“ఊర పిచ్చుక చెంతకొస్తే గూడు కట్టుకోనిస్తం
మీరు ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు
ఆ గుడ్డులో మా బిడ్డలవుతారా మా బిడ్డలు” అనే చరణం కూడా విప్లవావసరాల రీత్యా మానవ వనరుల అభివృద్ధి ఆకాంక్షను ప్రదర్శించేదే.

“దసరా పండుగ దగ్గరుంది దర్జీ వాళ్ళు కుట్టరాని
తమ్మునికి ప్యాంటు తెస్తాం నీకు షర్ట్ తెస్తామంటే
ఏది వద్దని జిద్దు చేస్తివి అలిగి అన్నం తినక పోతివి
తెల్ల ప్యాంటు ఎర్ర షర్ట్ తెచ్చి కుట్టి పెట్టినాం
పాలపిట్టలై చూసి పోతారా మా బిడ్డలు
మీరు జమ్మి ఆకై కలిసిపోతారా మా బిడ్డలు” అనే చరణం బిడ్డల జ్ఞాపకాల నెమరువేత. దసరా పండగకు షర్ట్ తెస్తానంటే ఏదివద్దని జిద్దు చేసి అలిగి అన్నం తినని కొడుకు జ్ఞాపకం. ఆ నాడు కొడుకు ఎందుకు అలిగాడో ఆ తరువాతి పంక్తిని బట్టి వూహించుకోవలసిందే. “తెల్ల ప్యాంటు ఎర్ర షర్ట్ తెచ్చి కుట్టి పెట్టినాం” అనే ఈ పాదం వర్తమానం. ఈ వర్తమానాన్ని బట్టి ఆ నాటి ఆ పిల్లవాడి ఆందోళన, ఆంతర్యం పసికట్టాలి. అప్పటికే వాడు అసమానతల పట్ల అసహనంతో ఆందోళనా మనస్కుడు. పండగలు, కొత్తబట్టలు ఆనందాన్ని ఇచ్చే స్థితి లేదు. అందరికీ అవి అందేవి కానప్పుడు కలిగే కోపం అలిగి అన్నం తినకపోవటంలో సూచితం. అలిగి అన్నం తినకపోవడం వల్ల సాధించేదేమీ లేదు అని అర్ధమై అందరికీ తిండీ బట్టా ఇయ్యగలిగిన నూతన సమాజ నిర్మాణం కోసం తనను అంకితం చేసుకొన్న కొడుకు అతను. వస్తాడో రాడో తెలియని కొడుకు మనసెరిగిన తల్లులు తండ్రులు ‘తెల్ల ప్యాంటు ఎర్ర షర్ట్ తెచ్చి కుట్టి పెట్టి’ నారన్నమాట.

దసరా అంటే తెలంగాణాలో స్నేహితులు, బంధువులు కలిసి పాలపిట్టను చూడటం. పెద్దలకు జమ్మి ఆకు ఇచ్చి మొక్కటం .. ఆశీర్వాదాలు పొందటం. ఏనాడో ఇళ్ళు వదిలి అడవి బాట పట్టిన పిల్లల కోసం ఎదురు చూసే తల్లులు వాళ్ళు పాలపిట్టలై చూసిపోతారా అని ఆశపడుతున్నారు. పాల పిట్టలై రావటం అంటే విజయులై రావటమే. అది వాళ్ళ ఆకాంక్ష. జమ్మి ఆకై కలిసి పోవటం అంటే విజయాల పై విజయాలు సాధించటానికి ఆశీర్వాదాలు పొంది వెళ్ళటమే.
“తలుపు గొళ్ళెం సప్పుడైతే కంటి రెప్పలు తెరుచుకున్నయి
ఎవరో పోయ్యింట్లకచ్చి పిలిచినట్టు అలికిడాయే
అయ్యా అన్నకు చెప్పకుండా వంతు అన్నం దాపెట్టిన
ఇంటి దర్వాజ దగ్గరేసి గొల్లెము బేడము వేయలే
మీరు పిల్లి అడుగులై వస్తారా మా బిడ్డలు
దాగుడుమూతలు ఆడిపోతారా మా బిడ్డలు” అని బిడ్డల కోసం ఎదురు చూపులు చూసే తల్లి జీవితకాలపు ఆరాటం ఈ చరణం.

“వద్దురా వద్దు రా కొడకా దొరలతోటి యుద్ధమద్దని
నెత్తినోరు మొత్తుకున్న
ఎంత చెప్పినా వినకపోతివి
మొండివాడవు దండివాడవు
నెనరు నిండిన గుండె వాడవు
పట్టిన ఆ ఎర్ర జెండాను ప్రాణముండగా వదలలేదు
నెత్తురు జెండా ఇచ్చి పోతారా మా బిడ్డలు
ఎత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు” పాట ముగింపుకు పూర్వ చరణం ఇది. కీలకమైంది. పట్టిన ఆ ఎర్ర జెండాను ప్రాణముండగా వదలని కొడుకులు తాము లేకపోయినా తమ రక్తంలో తడిసిన ఎర్రజండాను మిగిల్చి పోయారు. ఆ జెండాను ఎత్తుకొని అమరులకు ఆత్మశాంతిని ఇయ్యటానికి తల్లులు సన్నద్ధం అవుతున్న దృశ్య ఆవిష్కరణ ఈ చరణం. బిడ్డల కోసం వేదనపడి , ఎదురుచూపులతో వేసటపడిన తల్లులు బిడ్డలు తీసిన బాటలో సాగటానికి సిద్ధం కావటం అంటే తల్లీబిడ్డల పేగు బంధాన్ని, అన్యోన్య రాగ సంబంధాన్ని విప్లవ పోరాటాల సందర్భం నుండి ఉన్నత శిఖరాలపై జెండాగా ఎగరవేయటమే.

గద్దర్ ప్రదర్శనలో తరచు, ప్రధానంగా అమరుల గురించి పాడేటప్పుడు చేతిలోని ఎర్రజెండాను పసిపాపగా రెండు చేతులలో పొదివి పట్టుకొని అపురూపంగా చూస్తూ నెమ్మదిగా ఊపుతూ లాలించటం చూస్తాం. ఆ సమయంలో ఆయన కన్నుల్లో మాతృ పారవశ్యం, ముఖం లో చిరునవ్వు మార్దవం చూసి తీరవలసినవే. ఉత్తర తెలంగాణా విప్లవోద్యమ గతిక్రమంలో ప్రభవించిన గద్దర్ ఆ విప్లవోద్యమ చలనశీల అభివృద్ధికి పసిబిడ్డ ఎదుగుదలను చూసి మురిసే తల్లివలె మురిసిపోవటం అందులో కనబడుతుంది. అందువల్లే గద్దర్ పాట అశేష ప్రజానీకపు హృదయాన్ని గెల్చుకోగలిగింది.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply