గంగా నది కడుపున
తొలి శవం పడ్డాక గానీ
తెలియలేదు
భ్రమల పునాదుల మీద
దేశాన్ని కట్టుకున్నామని
దేశాన్ని చెదలు తినేస్తున్నాయి
ఇప్పుడు
గట్టి గుండెలే మిగులుతాయి
నువ్వొక్కడివీ వెళ్ళిపోతే
దేశమేమీ ఆగిపోదు
నీ కుటుంబ దేశంలో మాత్రం
ఒక అగ్నిపర్వతం పేలుతుంది
నిర్లక్ష్యాలను తినీ తినీ
బలిసిన కార్చిచ్చు
వేల నాల్కలతో ఎగసిపడుతోంది
కవచం ఆయుధాలు ధరించి సిద్ధంగా వుండు
కష్టాల ఎదురీతలో
నోళ్ళు తెరుచుకున్న నల్లబజార్లు
ఎదురవుతాయి
భయపడకు పోరాడు
తెలుసు కదా
ఇప్పుడు భయం మరణం
రెండూ సమానార్ధకాలు
అల్లోపతో ఆయుర్వేదమో
మందులతో పాటు
గంటకోసారి గోరువెచ్చని నమ్మకాన్ని
తాగుతూ వుండు
తుపాను రాబోతుందంటేనే
ట్యాంకులనిండా నీళ్లుపట్టుకొని
ఫోన్లనిండా ఛార్జింగ్ నింపుకొని
జాగ్రత్తపడే వాళ్ళం
మృత్యువు రాబోతుందంటే మాత్రం
ఎందుకనో
నిరాయుధులమై నిలబడిపోయాం
ఇక మీదట పీల్చే గాలినీ
వేసే అడుగునీ తరచి తరచి చూడు
గుడ్డిగా ముందుకుపోవడంలో
వివేకమేముంది?
ఈ వెనకడుగు
ఏ కొత్త అధ్యాయానికి ఉపోద్ఘాతంగా
పనికొస్తుందో ఆలోచించు.
వేల నాల్క లతో ఎగసి పడుతోంది
Thank you sir