గజ్జెగొంతుకు నా కనుగుడ్లు

నా దేహమ్మీద కత్తిపోట్లను ముద్దాడటానికి పసి పిట్టలున్నాయి
నా గొంతుపై వాలి గోసను అనువాదం చెయ్యడానికి అనేక కోకిలలున్నాయి
నా కనురెప్పలపై వాలి చూపును వాగ్దానం చెయ్యడానికి నల్లరేగళ్ల మట్టిపెళ్ళలున్నాయి
సగం తెరిచివున్న నా కండ్లల్లో కనుగుడ్లు పాడుతున్న నిశ్శబ్ద పాటకు
చప్పుడ్ల పాలు పట్టడానికి నా కనుగుడ్లను పీకి
గజ్జెలు వాటి గొంతుకు అతికించుకుంటాయి
నా పొట్ట శాశ్వత నిద్రలో వున్నదని ప్రకటించిన వేళ
జైలు గోడల్లో ఉరుముతున్న పాట
నా బొడ్లో నుండి అందంగా పొంగుతూవుంటుంది
అందము లేని వసంతం నా పొట్టపై వాలి అందంగా మారుతుంది
నా చన్నుల్లోంచి దుకుంతున్న అలల రాగాలను తాగడనికి
ఊరేవిష్కలు దండుగా బయల్దేరుతుంటాయి
నా ముక్కు రంధ్రాల్లో వున్న శంకాలను ఊదటానికి
నా దేహమ్మీద ఎర్రజెండాలు వాలి నన్ను ముద్దాతూవుంటాయి
రాజ్యం ఎర్రకోటలో దేశద్రోహి అని నాకు బిరుదునిస్తుంది
మీడియా మిత్రులు శవమంటారు మట్టిబిడ్డెలు వీరుడంటారు
నా ప్రియురాలు ఎర్రగులాబీలతో ఏదో చివరి కవిత చెప్పడానికి
పావురమై ఎర్రజెండాను సరిచేస్తూ
పోరాటానికి మరింత ఎరుపునిస్తుంది.

అవును నీ అనుమానం నిజమే
నేను పక్షినై
కొన్ని గజ్జెలను భూమిలో విత్తానలుగా వేస్తూ ఎగురుతుంటాను
నా పుర్రెలోంచి ఆకాశానికెగిరే అనేక పక్షులుంటాయి చూడు
అవన్నీ నాకు తోడుగా వస్తుంటాయి
మేమంతా కలిసి మళ్ళీ అడవి చెట్లుగా మోలుస్తాము
బహుశా మళ్ళీ మళ్ళీ మొలవటానికే కావొచ్చు
ఈ అమరత్వం.

పుట్టిన ఊరు వింజమూరు, నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. ఎనిమిదో తరగతి నుంచే కవిత్వం రాస్తున్నాడు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం  ప్రాచ్య కళాశాల(నల్లకుంట, హైదరాబాద్)లో డిగ్రీ చదువుతున్నాడు.

Leave a Reply