ఒక సంఘటన:
కాలిఫోర్నియాలో ఒక అంతర్జాతీయ సదస్సులో సైన్స్ పరిశోధన ఏ విధంగా పెట్టుబడిదారి వ్యవస్థ కబంధహస్తాలలో చిక్కుకొని పోయింది, అది ఏ విధంగా జాతి, లింగ వివక్షను పెంచిపోషిస్తుంది అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఆడియన్స్ చాలా జాగ్రత్తగా వింటుంటే, నాకు కూడా కొంత ఉత్సాహంగా వుంది. ముఖ్యంగా అక్కడ భారతీయ రూపురేఖల్లో వున్న ఒక వ్యక్తి మొఖం నీను మాట్లాడుతుంటే వెలిగిపోతుండడం చూసి కొంత సంతోషం, కొంత ఆశ్చర్యం అనిపించాయి. ఆ సదస్సు అయిపోయి కాఫీ బ్రేక్ రాగానే అతను నేరుగా నా దగ్గరికి వచ్చి తనకి నా ప్రసంగం బాగా నచ్చిందని, తన అనుభవంలోకి వచ్చిన జాతి వివక్ష గురుంచి మాట్లాడడం బాగుందని చెప్పాడు. తాను స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మెడికల్ జెనిటిక్స్ రంగంలో పరిశోధన చేస్తున్నానని చెబుతూ “ఈ కాలంలో కూడ జాతి పేరిట, రంగు పేరిట వివక్ష వుండటం చాలా దారుణం” అని తన అభ్యుదయ భావాలు పంచుకున్నాడు.
అతను అలా మాట్లాడుతుంటె చాలా ముచ్చటేసింది. ఎందుకంటె అమెరికాలో ఉండే ఎక్కువ మంది ప్రవాస భారతీయులు ఇక్కడ వుండే జాతి వివక్ష నల్ల వాళ్ళకే కాని తమకు సంబంధించినది కాదనుకుంటరు. అంతేకాదు నల్ల జాతీయులు అంటే చులుకన భావన కూడా ఎక్కువే వుంటది. వాళ్ళు గ్రహించనిది ఏమంటే తెల్ల జాత్యాహంకారుల దృష్టిలో మనము కూడా నల్ల జాతికి దగ్గరి వాళ్ళమనే విషయం. ఏదిఏమైనా మొదటిసారి, అందులో సైన్స్ పరిశోధనలో వున్న ఒక వ్యక్తి జాతి వివక్ష మనిషిని ఎట్లా కుంగదీస్తది, వ్యక్తి విశ్వాసాన్ని ఎట్లా దెబ్బతీస్తది అనే విషయాలు మాట్లాడుతుంటె చాలా బాగనిపించింది. బహుశా కొన్ని విషయాలు అనుభవిస్తే కాని వాటి సారం అర్థం కావేమో.
కాని అతను మాట్లాడుతున్నంత సేపు నా దృష్టి అంతా అతని నొదుటి మీది నిలువు బొట్టు మీదనే వుంది. దానితో నాకేమి అభ్యంతరం లేదు. కాని దేశం దాటగానే వేషం, భాష మార్చే వాళ్ళను ఎంతో మందిని చూసిన. కాని ఈ మనిషి అలా లేడు. ఏదో ప్రత్యేకత వుంది. లేదంటె నిలువు బొట్టును తన అస్తిత్వంగా ప్రకటించుకునే ధైర్యం చేయడు. నీను అతని ఆవభవాలను, భాష తీరును పరిశీలుస్తుండగానే అతను “మనం టచ్ లో వుందాము…” అంటూ ఎదో చెప్పబోతుంటె “సారి ఇంతకు ముందు మీ పేరు సరిగ్గ వినపడలేదు, మళ్ళోసారి చెప్పండి” అని అడిగాను. అతను వెంటనే మూరెడంత వున్న పేరు మొత్తం చెప్పి, “మీరు షార్ట్ గా శర్మ అని పిలవండి” అని చెప్పి మరోసారి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
ఆ అరక్షణంలో నాలోని సోషియాలజిస్ట్ కి మేలుకొచ్చి ఒక సామాజిక ప్రయోగం చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆ కరచాలన బిగువు సడలక ముందే కావాలనే “నా పేరు అశోక్ మాదిగ” అని పరిచయం చేసుకుంటున్నట్లుగా చెప్పిన. ఆశ్చర్యమేసింది, అతని మొఖంలో ఒక్కసారిగా ఏదో విపత్తు జరిగిన సంకేతం. “మాదిగ” శబ్దం మందుపాతరై గుండెల్లో పేలినట్లుంది. కరచాలన బిగువు సడలింది. వెంటనే విడిపించుకోని ఒక అడుగు వెనక్కి వేశాడు. నాకు ఒక్కసారిగా చెప్పరాని కోపం, బాధ కలిగాయి. అరనిమిషం ముందు నాతో “అభ్యుదయవాది” గా మాట్లాడిన ఈ మానవతావాదికి అంతలోనే “అంటరాని” వాడినయ్యాను కదా. ఇక ఆ మనువాది కూడా తేరుకొని ఏదో అర్జెంట్ పనివుందని అక్కడి నుండి వెళ్ళిపోయిండు. అణువు, పరమాణువు రహస్యం తెలిసినోడు, జాతి వివక్షను ఈసడించుకున్నోడు, గొప్ప మానవ విలువలు వల్లించినోడు ఎందుకు కుల “మైల సిద్దాంతం”లో మునిగిపోతుండు?
ఇంకా ఆశ్చర్యం ఏమంటే మాటల సందర్భంలో నేను ఐదు దేశాలలో అర్థ రూపాయి ఖర్చు పెట్టుకోకుండ, కేవలం మెరిట్ స్కాలర్షిప్స్ తో (అంటే ప్రపంచ ప్రజల సొమ్ముతో) చదువుకోని అమెరికాలోనె అత్యంత ప్రతిష్టాత్మక వైద్య పరిశోధనా సంస్థలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాని కూడా చెప్పాను. అందుకు అతను అబ్బుర పడిపోయాడు. కాని నా పేరు చివరన కులం చెప్పేసరికి ఊరు చివరన ఉండాల్సినోడు ఇక్కడిదాకా ప్రతిభతో రావడమేంటనుకున్నాడేమో (సంకల్పితమో, అసంకల్పితమో కాని) తనకు తానుగా నాకు దూరంగా విసురుకున్నాడు. మొదటిసారిగా “అంటరానితనాన్ని” నా అనుభవంలోకి తెచ్చిండు. కేవలం రాజకీయంగా దళిత అస్తిత్వంతో ఐడెంటిఫై అయ్యే నాకే అంత బాధైతే, అంటరానితనాన్ని నిత్యం తమ జీవితాలలో అనుభవించే వాళ్ళ పరిస్థితి ఏంటి?
పెద్ద పెద్ద చదువులు చదివి కూడా “కుల మలాన్ని” తలనిండా నింపుకొని “కులమెక్కడుంది?” అని అభ్యుదయ పోజులు కొట్టే ప్రవాస భారతీయులు ఎందరో! అందరూ అడ్డ నామాలో, నిలువు నామాలో పెట్టుకోని తిరుగరు. కాషాయం కప్పుకోని కనబడరు. కాని కుల, మత మౌఢ్యం వాళ్ళ నిత్య జీవితాలను, మనుషుల మధ్య ఉండే సంబంధాలను నిర్దేశిస్తాయి. “వాళ్ళు మనవాళ్ళే” అని కులం పేరుతో సామాజికంగా పోగవుతూ, అంతటితో ఆగక పెద్ద పెద్ద సంఘాలు పెట్టుకొని నిస్సిగ్గుగా కుల రాజకీయాలు చేస్తారు. కుల, మత ఆధిపత్యాన్ని నగ్నంగా ప్రదర్శించే వాళ్ళు కొందరైతే, నల్ల జాతీయుల మీద దాడులు, హత్యాకాండ జరిగినప్పుడు ఎక్కడలేని మానవత్వంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ, అదే కళ్ళతో దళితుల, మత మైనారిటీల విషయంలో నిప్పులు చిమ్మేవాళ్ళు ఇంకొందరు. ఒక్కోసారి అక్కడ “హిందూ”సముద్రంలో ఉండే తిమింగలాల కంటే, ఇక్కడ బురదకుంటలో వుండే కప్పల చప్పుడే ఎక్కువుంటది. ఇక ఇంటర్నెట్ కాలంలో ఈ కప్పల బెడద మరీ ఎక్కువయ్యింది.
వీటన్నింటిని విడివిడిగా చూస్తె పెద్ద సమస్య అనిపించకపోవచ్చు. కాని వీటన్నింటిని కలిపే ఒక ఆధిపత్య భావజాల ధారను పరిశీలిస్తే కాని ఈ పోకడలు ఎంత ప్రమాదకరమైనవో అర్థం కావు. వీటికి హిందుత్వ ఫాసిజానికి ఉన్న సంబంధం ఏంటో అర్థం కాదు.
***
ఫాసిజం కొన్నింటిని తిరస్కరిస్తుంది, మరికొన్నింటిని నెత్తిన పెట్టుకుంటుంది. తిరస్కరించే వాటిలో ఉండేవి ప్రజాస్వామిక విలువలు, సాంసృతిక బహుళత్వం, ఉదారవాదం, కమ్యూనిస్ట్ భావనలు, ఆచరణ. వీటిని కేవలం తిరస్కరించడమే కాదు, వాటిని పూర్తిగా రద్దు చేయడానికి ప్రజల మీద ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఇక ఫాసిజం ముందుకు తీసుకుపోయేది ఏకత్వం, అతిజాతీయవాదం, ఒక మతం లేదా జాతి అన్నిటికంటే ఉన్నతమైనదనే ఆధిపత్య సిద్ధాంతం, తమ జాతి తీవ్రమైన సంక్షోభంలో ఉందనే భావనను సృష్టించి దానికి కారణంగా ఒక ఉమ్మడి “శతృవును” తయారుచేయడం, తాను శతృవుగా ఎంచుకున్న అన్ని ప్రజా సమూహాల మీద అణిచివేత, హింసను కొనసాగించడం. ఈ ప్రక్రియలకు అన్నింటికి సమ్మతిని కూడగట్టే భావజాలాన్ని కూడ నిర్మాణం చేయడం. దానిని అన్ని వ్యక్తిగత, సామాజిక ప్రక్రియల ద్వార సమాజంలోకి పంపడం. సాంప్రదాయం పేరు మీదనో, సనాతన ధర్మం పేరు మీదనో పుట్టుక, చదువు, కొలువు, పెండ్లి, చావు ఇలా అన్ని ప్రక్రియల్లో వ్యక్తిని తన వశం చేసుకోవడం.
ఫాసిజం అన్ని ఆధిపత్య, అణిచివేత భావాలను గొప్ప సంసృతిగా ప్రజల మెదళ్ళలోకి భావదారిద్యాన్ని ఎక్కిస్తుంది. ఆ “సాంసృతిక విలువలతో” దేశం దాటగానే, ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచంలోకి అడుగుపెట్టగానే, మనిషిలో ఏమి మార్పురాదు. చాలా చైతన్యవతంగా ఆ విలువలను ధ్వంసం చేసుకుంటే తప్ప. అలా చేసేవాళ్ళు చాలా తక్కువే. వాటిని వదిలించుకోవడం చేయకపోగా ఆ విలువలే ఒక అస్తిత్వంగా మార్చుకుంటారు. వాటి పరిరక్షణ కోసం కొత్త సమూహాల కోసం పాకులాట మొదలుపెడుతారు. ఈ ప్రయాణంలో తాము బతికే చోట ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు, కాని తమ “పుణ్యభూమిలో” మాత్రం శక్తివంతుడైన నియంతను కోరుకుంటారు. ఇవేవి కొత్తగా జరగడం లేదు, ఎలాంటి పథకం లేకుండ జరగటం లేదు. చరిత్ర పైపొరలను కొద్దిగా తొవ్వినా ఎన్నో కుట్రల విషయాలు బయటపడుతాయి.
హిందూమతాన్ని దేశం బయట ప్రచారం చేయడం ముందుగా అర్యసమాజ్ ఉపదేశకులు చేసినప్పటికి, దానిని ఒక ఆధిపత్య భావజాలంగా నిర్మాణ రూపాన్ని ఇచ్చింది సంఘ్ పరివార్ శక్తులే. హిందూమత విశ్వవ్యాప్తిని దృష్టిలో ఉంచుకొనే ఆర్ఎస్ఎస్ నాయకుడు గోల్వాల్కర్ తన “Bunch of Thoughts” అనే గ్రంధంలో దేశం బయట బతికే హిందువులు నిత్యజీవితంలో మన వారసత్వ సంపద స్పృహతో బతకండని పిలుపునిచ్చాడు. మన “మూలాలు” మరిచిపోవద్దని హితువు పలికాడు. ఆయన దృష్టిలో “వారసత్వ సంపద,” “మూలాలు” అంటే సనాతన ధర్మంగా చెప్పబడే హిందుత్వ భావజాలం.
దాని కోసం పోయినకాడల్లా సంఘ్ పరివార్ శాఖలు పెట్టమన్నడు, గుళ్ళు కట్టి హిందూ జీవిత విధానాన్ని తమ తర్వాత తరాలకు సజీవంగ అందివ్వమన్నడు. ఆ ప్రయత్నంలో భాగమంగానే దేశం బయట 1947లో మొదటి ఆర్ఎస్ఎస్ శాఖ కెన్యాలో ఏర్పాటు అయ్యింది. వలసవాద కాలంలో వ్యాపారం రీత్య కెన్యా, ఉగండా లకు వెళ్ళిన సంఘ్ కార్యకర్తలు అక్కడ “భారతీయ స్వయం సేవక్” పేరిట హిందుత్వ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అక్కడి నుండి ఇంగ్లాండ్ కు ఆ ప్రచారం చేరి, అక్కడ “హిందూ స్వయం సేవక్” గా పేరు మార్చుకొని, ఊపందుకొని పాశ్చాత్య ప్రపంచంలోనే పెద్దదైన “విరాట్ హిందూ సమ్మేళనం” ఏర్పాటు వరకు జరిగింది.
హిందూ స్వయం సేవక్ సంస్థ (హెచ్ఎస్ఎస్) మొత్తంగా ఆర్ఎస్ఎస్ నిర్మాణాన్ని, పని విధానాన్ని నమూనాగా తీసుకొని బాగా బలపడింది. 1975-77 మధ్య ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో ఆర్ఎస్ఎస్ కూడా రెండవసారి నిషేధింపబడినప్పుడు హెచ్ఎస్ఎస్ ఆర్థిక వనరులు సమకూర్చడమే కాకుండా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రాజకీయ ప్రచారం కూడా చేసింది. వాస్తవానికి, ఆర్ఎస్ఎస్ నాగపూర్ హెడ్‌క్వార్టర్ లో విదేశాలకు వలసపోయే సంఘ్ కార్యకర్తల కోసం ఒక రిజిస్టర్ ను ఏర్పాటు చేశారు. వాళ్ళను బయట పనిచేసే తమ సంస్థలకు పరిచయం చేయడం కోసం. “స్వయంసేవకుల” సంఖ్య క్రమేపి పెరగడంతో సంఘ్ శక్తులు అన్ని రంగాలలో తమ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. అలాంటి సంస్థల్లో ఒకటి, Friends of India Society. దీనిని 1976లో ఇంగ్లాండ్ లో ఏర్పాటు చేసినప్పటికి, అది ఇప్పటికి యూరప్ మొత్తంగా పనిచేస్తూ ఇండియాలో ఉన్న సంఘ్ శక్తులకు కావల్సిన ఆర్థిక మరియు ఇతర సహాయం చేస్తావున్నారు.
అమెరికా లో 1971లో హిందుత్వ శక్తులు మొదట “విశ్వ హిందూ పరిషత్ – అమెరికా” ను ఏర్పాటు చేశారు. అతి త్వరగా అది వందకు పైగా బ్రాంచులుగా విస్తరించింది. ఆ తర్వాత 1990 లో “హిందూ స్టూడెంట్ కౌన్సిల్” ను ఏర్పాటు చేశారు. ఇది అక్కడ ఏబివీపి చేసే పనిని అమెరికన్ విశ్వవిద్యాలయాలో చేస్తుంది. కొత్తగా వచ్చే భారతీయ విద్యార్థుల “మూలాలు” చెదరకుండా చూసే పని ఈ సంస్థ చేస్తుంది. ఈ విద్యార్థి సంస్థకు హిందుత్వ శక్తులతో పాటుగా, కొంతమంది హిందూ అధ్యాపకులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు.
ఈ సంస్థలతో పాటుగా స్వామీ చిన్మయానంద మిషన్, స్వామినారాయణ గుళ్ళు, సత్యసాయి సంఘాలు, మందిరాలు మొత్తంగా అన్ని సంస్థలు చేసే పని తమ హిందుత్వ పునాదిని పదిలం చేసుకోవడం, విస్తరించుకోవడం. ఇక ఇప్పుడు “సైబర్ హిందుత్వ” కూడా వచ్చేసింది. ఆన్‌లైన్లో సమూహాలను ఏర్పాటుచేసుకొని హిందూ మత ప్రచారంతో పాటుగా, సంఘ్ పరివార్ శక్తులకు ఆర్థిక, సామాజిక వనరులను సమకూరుస్తూ ఉంటాయి. కోట్ల రూపాయలను పంపడమే కాదు, ఓట్లను సమకూర్చడమే కాదు, ప్రత్యక్షంగ హిందుత్వాన్ని ఎత్తిపట్టే కార్యక్రమాలు కూడా చేపడుతారు. బాబ్రీ మసీదును కూల్చి రామ మందిరం కడుతామంటె వేలాది ఇటుకలను అమెరికా నుండి పంపారంటే ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదు. అమెరికాలో, బ్రిటన్ లో పనిచేసే అనేక హిందుత్వ సంస్థలు “స్వచ్ఛంద సంస్థల” పేరుతో రిజిస్టర్ చేసుకోని ఆర్థిక వనరులను సంఘ్ శక్తులకు సమకూరుస్తున్నాయి. “సేవ” పేరుతో ద్వేషాన్ని పోషించే సంస్థలకు సహాయం చేయడం చట్టరీత్య నేరమని ఈ రెండు దేశాల చట్టాలు చెబుతున్నాయి.
వీటితో పాటుగా ఇప్పుడు విదేశాల్లో ఉన్న భారతీయులకు ఓటు హక్కు కూడా వచ్చింది. దీని వెనకాల హిందుత్వ శక్తులు చాలా బలంగా ఉన్నాయని వేరేగా చెప్పనక్కరలేదు. ఎందుకంటే దాని మూలంగ బాగా లాభపడేది సంఘ్ రాజకీయ శక్తులే.
***
హిందుత్వ శక్తులు ఇంత బలంగా ఉన్న చోట దళితులు, ఆదివాసులు తమ అస్తిత్వాన్ని ఎలా ప్రకటించుకోగలరు? ఒకవేళ చేసినా వారి ఆత్మ గౌరవం దెబ్బతినకుండా వ్యవహరించే సంస్కారం హిందుత్వలో ఎక్కడుంది? అందుకే కదూ ఆ నిలువు నామాల “శర్మ” నేను మాదిగ మనిషిని అని చెప్పగానె తనేమో ‘ఏ దేశమేగినా నేను మనువాదినే, మనిషిని కాదు’ అంటూ వెళ్ళిపోయిండు. ఖండాంతరాలలో కూడా కాషాయ ఫాసిజం పీడ విరగడం లేదు.
It’s a very good article. Thank you.
Thank you, Sreekanth!
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
మనకు పట్టిన మకిలి వదులునా..?!
Thank you for the sharing your experience & wonderful article
Thank you, Shanti garu!
very good and educative article.
Thank you!
కుల పిచ్చిని పెంచి పోషించేది రాజకీయ నాయకులు. దానికి తోడు రిజర్వేషన్లు గుర్తు చేస్తుంటాయి. వాటి భారిన పడి, నష్ట పోయిన ఎవడు కూడా కులాన్ని మర్చిపోలేక పోతున్నాడు.
Can I get this book?
9441348111
ఆలోచనలు చాలా తాజాగా ఉన్నాయి. మీలాంటి బుద్ధిజీవులు అవసరం సమాజానికి ఎంతో వుంది.