క‌విత్వ విమ‌ర్శ‌- ఒక రోజు వ‌ర్క్‌షాప్‌

ప్రజాస్వామిక రచయిత్రులవేదిక, తెలంగాణ శాఖ
ఎస్ ఆర్ అండ్ బి జీ ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఖమ్మం
సంయుక్త నిర్వహణలో కవిత్వ విమర్శ – ఒకరోజు వర్క్ షాప్
తేదీ:21-7-2019 సమయం ఉదయం 9.30 నుండి సాయంత్రం 6 వరకు
వేదిక : కళాశాల సెమినార్ హాల్, ఖమ్మం

రచనా రంగంలో ఆసక్తి, సామాజిక సమస్యల పట్ల ఆర్తి, సామాజిక న్యాయం పట్ల ఆకాంక్ష ఉన్న స్త్రీల వేదికగా దశాబ్ది చరిత్ర గల ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక లక్ష్యాలలో స్త్రీలను సాహిత్య సృజన విమర్శన రంగాలలో ఎప్పటికప్పుడు సుషుక్షితులను చేసుకొనటం ఒకటి. అందుకు అనుగుణంగానే లోగడ కథా, కవిత్వ కార్యశాలలు నిర్వహించుకొన్నాం. 2019 వార్షిక సదస్సు తీర్మానాల ప్రకారం ఈ సంవత్సరం విమర్శ కార్యశాలలు నిర్వహిస్తున్నాం. కథలను, కవిత్వాన్ని ఎట్లా చదవాలో, వ్యాఖ్యానించాలో, రచయితల ఆంతర్యాన్ని , అభిప్రాయాన్ని పట్టుకొనే మార్గమేమిటో, సామాజిక సందర్భానికి అన్వయించటం ఎలాగో తెలిసేకొద్దీ సాహిత్యాభిరుచి మెరుగెక్కుతుంది. అది స్వీయ సృజనను కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్లనే మే 11న వరంగల్ లో కథావిమర్శ కార్యశాల నిర్వహించిన తరువాత ఇప్పుడు జులై 21 న ఖమ్మం లో ఎస్ ఆర్ అండ్ బి జీ ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, తెలుగు విభాగం వారితో కలిసి కవిత్వ విమర్శ కార్యశాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నది ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక.

స్త్రీవాదంలో శరీరం కీలకమైన అంశం. అస్తిత్వానికి ప్రథమ ఆకరం. ఉత్పత్తి పునరుత్పత్తి ప్రక్రియలో దోపిడీకి, హింసకు గురి అవుతున్న క్షేత్రం. దీనిని కప్పి పుచ్చే ఇల్లాలు, మాతృమూర్తి, సహనశీలి, త్యాగశీలి వంటి భావనలెన్నో ఉనికిలోకి వచ్చాయి. ఇదంతా పితృస్వామ్యపు మాయాజాలం, ఈ క్రమంలో మానవ వ్యక్తిగా స్త్రీ తనను తాను కోల్పోతున్నది అన్న అవగాహనతో 1980ల నుండి స్త్రీవాద సాహిత్య ఉద్యమం ఊపందుకున్నది. కనుక మహిళలు విమర్శకులుగా పదునెక్కాలన్న లక్ష్యంతో ఈ కవిత్వ విమర్శ కార్యశాల ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు కేటాయించే కవితావస్తువుతో స్వానుభవ సంసర్గం ఉండటం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందనుకొన్నాం. మహిళల శరీరం, మనస్సు ఇంటిపని, బయటి పని ఒత్తిడుల వల్ల హింసకు గురి అవుతున్న స్థితి వస్తువుగా గల కవితలను ఎంపిక చేస్తాం. అదే సమయంలో ఇటీవలి సమాజంలో పితృస్వామ్యం కావచ్చు, మతం కావచ్చు, కులం కావచ్చు ఆడపిల్లల మీద లైంగిక అత్యాచారాలు ప్రబలి పోవటం మనం చూస్తున్నాం. సమకాలీనమైన ఈ సమస్య వస్తువుగా వచ్చిన కవితలు కూడా ఈ కార్యశాలలో చర్చకు రావాలని వాటిని కూడా ఎంపిక చేసాం. ఏమైనా స్త్రీల శరీరం పురుషాధికార ప్రతిష్టాపనకు యుద్ధభూమిగా చేయబడిన సందర్భాలను కవి సమయాల నుండి అధ్యయనం చేయటానికి దీనిని ఒక సందర్భంగా చేసుకొంటున్నాం.

ఎంపిక చేసిన కవితలలో స్త్రీలు వ్రాసినవే కాదు పురుషులు వ్రాసినవి కూడా ఉన్నాయి. కవులు జనజీవిత సంవేదనలతో సాధారణీకరణం చెందే వాళ్ళు కదా మరి.

కవితా విమర్శకు సూచనలు :
కవి గురించి, కవితా సందర్భం గురించి నాలుగు మాటలు చెప్పాలి.
వస్తువుకు సంబంధించిన ఆలోచన, అనుభవం, అనుభూతి,కవిత ఆద్యంతాలలో ఎలా విస్తరించింది పరిశీలించాలి.
కవితలోని పదబంధాలను, భావచిత్రాలను, అలంకారాలను గుర్తించి విశ్లేషించాలి.
కవిత లక్ష్యం ఎంతవరకు నెరవేరింది అంచనా వెయ్యాలి.
కవిత సాధించిన ప్రయోజనం గురించి చెప్పాలి.
కవి దృక్పథం ఏమిటో చెప్పాలి.

గమనిక: చేరాతలు నుండి ఒకటి రెండు వ్యాసాలైనా చదివితే విమర్శ నమూనా తెలుస్తుంది.

Leave a Reply