క్షమించండి. శీర్షిక లేదు!

బస్సులోనో రైల్లోనో పక్కింట్లోనో
ఆ ఐదేళ్ళ పాప
రెండు భూగోళాల్లాంటి కనుగుడ్లను తిప్పుకుంటూ
నాకు రెండు ప్రపంచాల్ని చూపిస్తుంది
ఒకటి నాది. మరొకటి తనది!

ఆమె కనుపాపలలో
నేనో చిన్న పిల్లాడినై కనబడతాను
ఆ పసిపాప చిట్టి చేతులలో
నేనో ఆటబొమ్మనై పరవశించాలనుకుంటాను
ఆ పసి బుగ్గల్ని నిమిరితే
నా పసితనాన్ని చేతుల్లోకి తీసుకున్నట్లనిపిస్తుంది

బహుశః వాళ్ళమ్మ కావొచ్చు
ఆ పాప కోసం మురిపెంగా చాచిన నా చేతిని చూసి
నిలువునా కోయటానికి ఎత్తిన రంపాన్ని చూసినట్లు వణుకుతున్నది
వాళ్ళ నాన్న కావొచ్చు
తోడేళ్ళ మందని చూసినట్లు భయపడుతున్నాడు

రంపాలు గొడ్డళ్ళు కేవలం పనిముట్లే కదా
తాచుపాములు, పెద్ద పులులు, తోడేళ్ళు పాపం ఎక్కడో అడవిలో కదా వుండేది?

అవును! మాంస వాంఛతో మగాడు రగులుతున్నప్పుడు
వాడు మావయ్య కాదు. బాబాయి కాదు. తాతయ్య కూడా కాదు.
బహుశః కొన్ని సార్లు వాడు నాన్న కూడా కాకపోవచ్చు
కొమ్ములు కోరలు పంజాలు మొలిచిన మానవ జంతువు వాడు

పరిచితుడో అపరిచితుడో ఎవరైతేనేం?
ఇంటనో బైటనో ఎక్కడైతేనేం?
పెద్దరికం మారణాంగాలతో వెంటపడుతున్నది

పసిపిల్లల చుట్టూ
కంచెలు వేసుకోవాల్సిన కాలం దాపురించింది

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply