క్వాక్… క్వాక్!

‘అసలు నేనెందుకు ప్రత్యక్షమయ్యాన్రా దేవుడా?’ అనుకున్నాడు దేవుడు!

అంతటి దేవుడి ముఖం కూడా దీనంగా పాలిపోయింది! కళా కాంతీ లేకుండా పోయింది! దిక్కులేని వాడిలా దేవుడు చోద్యం చూస్తూ నిలబడ్డాడు!

‘క్వాక్ క్వాక్… క్వాక్ క్వాక్…’ శబ్దాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది! ఏదో పెను విపత్తు ముంచుకు వస్తున్నట్టు దిక్కులన్నీ పిక్కటిల్లేలా బాతులన్నీ ఆందోళనగా అరుస్తున్నాయి! బాతుజాతి యావత్తూ బావురుమంటోంది!

పిల్లబాతు తన రెక్కలతో దేవుడికి దండం పెడుతూ వో చెక్కిన శిల్పంలా కదలకుండా అలానే వుండిపోయింది! కనురెప్ప కూడా కదల్చని పిల్లబాతు యేదో పెద్ద ప్రమాదమే తెచ్చి పెట్టనున్నట్టు భావించాయేమో మిగతా బాతులన్నీ నెత్తీ నోరూ కొట్టుకుంటున్నాయి!

దేవుడికి కూడా విసుగొచ్చినట్టుంది! ‘ఏం వరం కావాలో కోరుకో’ అని మళ్ళీ నీరసంగా అన్నాడు!

కనురెప్పలు మెల్లగా తెరచి చూసింది పిల్లబాతు!

అంతే… బాతులన్నీ వొక్కసారిగా ‘క్వాక్… క్వాక్’ అని దిక్కులు దద్దరిల్లేలా అరచి అర్ధించడం మొదలు పెట్టాయి, దేవుణ్ణి మానేసి పిల్లబాతుని! పిల్లబాతుని దాని తల్లీ దండ్రీ గురువూ పక్కన చేరి ‘మేమే కదా నీ మొదటి దైవాలం… మా మాట వింటే నువ్వే కాదు, మన బాతు జాతే బంగారంలా బతికేస్తుంది’ అని నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి! ఎంతగా ముడ్డీ మూతీ పట్టుకు బతిమలాడినా ఫలితం లేకపోయింది!

అడిగేకొద్దీ పిల్లబాతు అడ్డంగా తలూపింది!

‘దేవుడా! ఇదో పిల్ల పిచ్చుక! దానికేం తెలీదు! దాని మాట మీరు వినకండి! ఈ బుడ్డి బాతు అమ్మ కడుపులోంచి పడ్డప్పుడే నెత్తి నేలకు గుద్దుకొని చిన్న మెదడు చితికిపోయింది! దానివి పిచ్చి ప్రేలాపనలు! పిచి పిచ్చి ఆలోచనలు! ఈక తెంపితే కడేదో మొదులేదో చెప్పలేని దీనికి మీరు వరాలివ్వకపోయినా ఫరవాలేదు! బుద్ధి యివ్వండి! అంతే చాలు!’ అని బాతుజాతి మొత్తం యేక కంఠం వినిపించి విలపించాయి!

పిల్లబాతు మోరెత్తి ఆకాశంకేసి చూస్తూ చలించకుండా వుంది!

దేవుడు తేలే తగువు కాదని నీరసించాడు! నిలబడ్డవాడల్లా కాళ్ళు పీకినట్టు కూర్చున్నాడు! కూర్చొని పిల్లబాతుని తన వొడిలోకి తీసుకొని తలని మెల్లగా సున్నితంగా నిమిరాడు! నిమిరి ‘తపస్సు చేసింది నువ్వు! వరం పొందే హక్కు నీకే వుంది! అయితే ఆ వరమేదో నీకూ నీ జాతికీ వుపయోగాపడాలని నీ జాతి ఘోష…’ దేవుడు బోధపరిచాడు!

ఔనన్నట్టు ‘క్వాక్… క్వాక్’మని తలలాడిస్తూ ఆశగా అరిచాయి బాతులు!

అప్పుడు అక్కడ నిశ్శబ్దం ప్రవేశించి ప్రవహించడం మొదలైంది!

పిల్లబాతు ముఖం విజయగర్వంతో విప్పారగా ఆనందం తాండవించింది!

‘ఈ భూలోకానికీ ఆ బ్రహ్మలోకానికీ యెంతో దూరం లేదు, కేవలం వో తపస్సంత దగ్గర దారి వుంది! ఆ దారి నాదయినందుకు నాకెంతో సంతోషంగా వుంది…’ పిల్లబాతు దేవుడికే చెప్పిందో తన జాతినే వుద్దేశించి అన్నాదో గాని దాని వుద్దేశమూ దారీ తీరూ వేరని మిగతా బాతులు యిట్టే గ్రహించాయి!

అంతలోనే తొందరపడ్డ వో పడుచు బాతు ‘మనం బాతులం! మన జాతి బాతుజాతి! కానీ మన గుడ్లని కోళ్ళు పొదగడమేమిటి? చెప్పుకుంటే సిగ్గేస్తోంది! తలెత్తుకు తిరగలేకపోతున్నాం! ఇది మనజాతికే తీరని అవమానం! ఇకనైనా మన గుడ్లని మనమే పొదుగుకొని ఆత్మగౌరవాన్ని పొదువు కోవాలి…’ శ్రావ్యమైన కంఠంతో చెప్పింది!

పిల్లబాతు చలించక పోగా చిద్విలాసంగా నవ్వింది!

‘మనం భూమ్మీదా నీటిలోనూ హాయిగా బతికేస్తే సరిపోదు, గాల్లోకి కూడా యెగుర గలిగితే అదీ బాతు జన్మకు సార్ధకత! అలాంటి వరమడిగితే అది పరమార్ధకత…’ చెప్పిందో నడీడు బాతు! ‘ఈ సంసారాన్ని యీదలేక పోతున్నా, యెగిరిపోతే యెంత బాగుంటుందీ?’ అని!

ఆ కోరికను గుర్తించ నిరాకరించినట్టు పిల్లబాతు తలతిప్పి కూడా చూడలేదు!

‘ఏ పక్షినయినా రెక్కలతో కలిపి కుద్దుగా పట్టుకుంటే ముద్దుగా వుంటుంది! కాని మన బాతుల్ని అలా పట్టుకుంటే చచ్చూరుకుంటాయి! అంచేత ఆ తేడాని భగవంతుడు తీసెయ్యాలని…’ వో సంసారి బాతు కోరిక కోరమని అనీ అనకముందే ‘పీక పట్టుకున్నా ప్రాణాపాయం లేకపోవడమే మన జాతి ప్రత్యేకత’ అని గొప్పగా మెడలు సాచి పైకెత్తాయి కొన్ని కుర్రబాతులు!

ఇంకా కోరికలు యేమైనా వుంటే చెప్పండి అన్నట్టు దర్జాగా చూసింది పిల్లబాతు!

‘క్వాక్… క్వాక్… బాష కాకుండా కో-వోయ్… అని కోయిలలా కూసే గొంతు కోరు…’ అని బండబాతు కోరకముందే ‘ఛీ… కోయిల గొంతు వింటే కర్ణభేరి పేలిపోతుంది, మన క్వాక్… క్వాక్ లో వున్న లయమైన సొంపు మరెక్కడా రాదు, వరాన్ని వృధా చేయవద్దు’ అని మరికొన్ని బాతులు కోరాయి!

అయిందా? ఇంకా వుందా?- అన్నట్టు నిర్లక్ష్యంగా చూసింది పిల్లబాతు!

‘హంసలు అనేవే లేవని అంటారు! రాజ హంసలు అంటే మన పూర్వీకులే అని నా ప్రగాఢ నమ్మకం! అంచేత మన బాతుల జాతిని హంసల జాతిగా పేరు మార్చి ఖ్యాతిని యివ్వమని వరం కోరవే’ అని నాజూకు బాతొకటి హొయలు పోయింది!

పిల్లబాతు పగులబడి నవ్వింది! పొలమారింది! దేవుడు తల నిమిరాడు! ‘క్వాక్… క్వాక్’మంది!

వరం పొందడమే కష్టం అని తెలుసు గాని వరం యివ్వడం కూడా యింత కష్టమని యిప్పుడే దేవుడికీ తెలిసొచ్చినట్టుంది! ‘చెప్పు… నీ జాతి పక్షుల ఆకాంక్షలు సరే, నీకేం వరం కావాలో చెప్పు…’ దేవుడికి కూడా ఆసక్తిగా వుంది!

అప్పుడు అక్కడ గూడుకట్టుకున్న నిశ్శబ్దం బాతుల గుండెల్లో ఫిరంగులు పేలుస్తూ వుంది!

పిల్లబాతు రెక్కలాడించి ముడ్డి వూగించి మోరను నిటారుగా నింగిని తాకించి దేవుణ్ణి వొక కంట, తన బాతు జాతిని మరో కంట చూసి అప్పుడు యిలా కోరింది!

‘దేవుడా! నాకూ నా బాతుజాతి సమస్తానికి బంగారుగుడ్లు పెట్టే వరమియ్యవా తండ్రీ…’ వరం కోరీ కోరకముందే బాతులన్నీ ఘొల్లుమన్నాయి! ప్రాణం తెగినట్టుగా ‘వద్దూ… వద్దూ…’ అని అరిచి గీ పెట్టాయి! దిక్కులు ప్రతిధ్వనించాయి!

పిల్లబాతు తెల్లమొహం వేసింది!

‘ఇదేంటిది?, నా తప్పస్శక్తితో వరాన్ని పొందితే, ఆ వరం నా వొక్కదానికే కాక స్వార్ధం చూసుకోక మన జాతి మొత్తానికి అందించాలని ఆశపడితే…’ పిల్లబాతుకు అంతకు మించి నోట మాట రాలేదు!

‘మనజాతి అందరి తరపునా వరం కోరడానికి అసలు నువ్వెవరని?’ మిగతా బాతులది వొకేమాట!

‘నీ వరం నువ్వు కోరుకోవచ్చు! ఆ హక్కు నీకుండొచ్చు! కానీ మాకు వద్దు మొర్రో అన్నా వినకుండా వర ప్రసాదాన్ని వర ప్రభావాన్ని మాకు పంచడానికి నీకు అధికారం లేదు! మేం వొప్పుకోం గాక వొప్పుకోం…’ బాతులది వొకే తీర్మానం!

వీటికేం పిచ్చి పట్టలేదు కదా?- అన్నట్టు మిగతా బాతులవంక చూసింది పిల్లబాతు! దాని చూపు చూసి మిగతా బాతులకు వొళ్ళు మండింది! కొన్ని కుర్రబాతులు రెండడుగులు ముందుకేసి ‘నువ్వు దేవుడి వొడిలో వుండిపోయి బతికిపోయావ్… లేకుంటే నీ జీవాలార్పేసి నిన్ను గొయ్యి తీసి యిక్కడే పాతరేసేవాళ్ళం’ అని హెచ్చరించాయి! దేవుడు వున్నాడని కూడా తోటిబాతులు జంకలేదు!

కుర్రబాతుల్ని ఆపి ముందుకొచ్చిన ముసలిబాతు ‘బంగారు బాతుగుడ్లు పెట్టిన మన పూర్వీకుడేమయ్యాడో తెలుసునా?’ అని అడిగింది!

‘పాత చింతకాయ పచ్చడి దంచడమయిందా?’ పిల్లబాతు విసుగ్గా అంతకు మించి నిర్లక్ష్యంగా చూసింది!

‘నువ్వు నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటే తెచ్చుకున్నావ్… కాని మా ప్రాణాల మీదకి మాత్రం తేకు! అదే నువ్వు మాకిచ్చిన వరం!’ విద్యాబుద్దులు నేర్పిన గురువుబాతు వొక దండం పెట్టేసి వెళ్తుంటే-

‘నువ్వు కోరింది వరం కాదు, శాపం!’ మరో బాతునేస్తం బావురుమంది!

ఒక్కొక్క బాతుదీ వొక్కో మాట!

రేపటి ప్రాణభయాన్ని తలచుకొని జాతి మొత్తానికి పెను ప్రమాదం దాపురించినట్టు కాపాడమన్నట్టు ‘క్వాక్… క్వాక్’మని బాతులన్నీ అరచి గీపెట్టాయి!

దేవుడలాగే కళ్ళు మూసుకున్నాడు!

పిల్లబాతు సమస్య తనది కాదన్నట్టు సరదాగా సందడిగా ముడ్డి వూపుతూ అటూ యిటూ వూగింది, మైకం కమ్మినట్టు!

కొంతసేపటికి అరచిన బాతులన్నీ అలసి నోరు నొప్పెట్టి శాంతించాయి!

దేవుడు కళ్ళు తెరిచాడు! పిల్లబాతుని వొడిలోంచి కిందకు దించాడు! అది మిగతా బాతుల్ని పిచ్చిమొద్దుల్ని చూసినట్టు చూసింది!

‘చెడిపోయిన వాళ్ళని బాగు చెయ్యలేరు… బాగుపడిన వాళ్ళని చెడగొట్టలేరు’ అనుకుంది పిల్లబాతు! ఆగక ‘నేను పొందిన వరం వదులుకున్నందుకు వద్దనుకున్నందుకు మీరంతా రేపు కుళ్ళి కుళ్ళి యేడవాలి’ అని నమ్మకంగా అంది!

పిల్లబాతు దేవుడి పాదాల్ని రెక్కలతో తాకి మోకరిల్లి ‘దేవుడా! నాకు బంగారుగుడ్లు పెట్టే వరమియ్యవా తండ్రీ…’ అని అడిగింది!

‘తథాస్తు’ అనేశాడు దేవుడు!

బాతుజాతి యావత్తూ వుగ్గబట్టుకు చూస్తోంది!

‘నీ కోరిక నెరవేరు గాక’ అనేసి దేవుడు మాయమైపోయాడు!

దేదీప్యమానమైన కాంతి మాయమైపోయింది! బాతులన్నీ మాయమైనట్టు వాటి వాటి బతుకు పొదల్లోకి అవి వెళ్ళిపోయాయి! పిల్లబాతు వొక్కటీ మిగిలింది!

ఎందుకనో పిల్లబాతుకి సాధించాల్సింది యేదో సాధించాక తెలీని వెలితి వొక్కసారిగా కమ్ముకుంది తప్పితే మునిపటి ఆనందం అంతా ఆవిరైపోయింది!

ఎంత బంగారు గుడ్లు పెట్టే శక్తివున్నా యెటు వెళ్తుంది? తిన్నగా ఇంటికే వెళ్ళింది!

ఇంటికి వెళ్ళేసరికి తల్లి యేడుస్తోంది! తండ్రి తిడుతున్నాడు! బంగారు బాతు గుడ్ల కత దీనికి యెందుకు చెప్పావని?!

ఎందరు బెంగపడ్డా పిల్లబాతుకి అవేమీ పట్టలేదు! కానీ కడుపు నకనకలాడింది! ఆకలి వేస్తోందని తల్లికి చెపుతూనే గింజలు వెతుక్కుంది! తింది!

‘బంగారు గుడ్లు పెట్టే నీకూ ఆకలేనా?’ బాతుమావ నవ్వాడు!

పిల్లబాతు ఆలోచనల్లో పడింది!

‘బంగారు గుడ్లు పెట్టూ మామూలు గుడ్లు పెట్టూ ఆకలి ఆకలే!’ అంది దాని తల్లి!

‘ఆకలేస్తే అన్నమే తినాలి గాని బంగారం తినలేవు’ అంది గురువు!

చేతకాని వాళ్ళే సుభాషితాలు మాట్లాడుతారని యెవ్వరినీ లెక్క చేయలేదు పిల్లబాతు!

మొత్తానికి పిల్లబాతు వరం యోగాన బంగారం గుడ్డు పెట్టింది! అన్నవాళ్ళూ అర్థంలేదన్నవాళ్ళూ అంతా వింతగా చూశారు! విడ్డూరంగా మాట్లాడుకున్నారు! కథల్లో కాకరకాయల్లో మన పూర్వీకుల్లో వొకరు బంగారం గుడ్డు పెట్టారని వినడమే గాని చూడడం యిదే! అందుకే బాతులన్నీ చూడడానికి వరస కట్టాయి! కొన్ని బంగారు గుడ్డుని తాకి జన్మ ధన్యమైందని అనుకున్నాయి! కొన్ని రెక్కలతో గుడ్డుని యెత్తు కొని చూశాయి! మరికొన్ని ముక్కుతో ముద్దు పెట్టుకొని చూశాయి!

గర్వంగా తలెత్తుకు చూసింది పిల్లబాతు!

‘ఈ గుడ్డు నాలా పిల్లవుతుందా?’ అని వో పసిగుడ్డు అడిగింది!

పిల్లబాతు గుండెలో పిడిబాకు దించినట్టయింది!

‘బంగారం గుడ్డు గనుక కరిగించుకోవచ్చు! కరిగించి వుంగారాలూ వడ్డాణాలూ కాసులపేర్లూ జువకాలూ పాపిడి బిళ్ళా పుస్తెల సేరూ యేది కావాలంటే అది చేయించుకోవచ్చు! చేయించుకొని ఆభరణాలు వొంటినిండా దిగేసుకోవచ్చు!’ వో ముసలి బాతు చెపుతుంటే, ‘యెవరూ?’ అని మధ్యలో అడిగింది మరో యిల్లాలి బాతు!

‘ఇంకెవరు? మనుషులు! మనం మన ముడ్డి మోసేసరికే సరి…’ నొచ్చుకుంటూ అంది నడీడు బాతు!

తను పెట్టిన బంగారం గుడ్డుకీ యేరిగిన మలానికీ పెద్ద తేడా లేదనిపించింది! ఆ ఆలోచన వచ్చేసరికి పిల్లబాతుకి గుండె బరువయిపోయింది!

ఇంతలో తమని పెంచే యజమాని వచ్చాడు! చూశాడు! పిల్లబాతు తన బంగారు గుడ్డుని పొట్టకింద దాచుకోబోయింది!

ప్చ్!

ఆ యజమాని బంగారు గుడ్డుని చేతుల్లోకి తీసుకొని ‘లక్ష్మీతల్లి’ అని కళ్ళకు అద్దుకున్నాడు! పెళ్ళాన్ని పిలిచాడు! పండగ చేసుకున్నారు! బాధగా అరుస్తున్న పిల్లబాతుని యెత్తుకున్నారు! హత్తుకున్నారు! దువ్వారు! నీకేం భయం లేదన్నారు! స్నానం చేయించారు! సాంబ్రాణి పొగ వేశారు! సువర్ణ అని పేరు పెట్టారు! బాతులనుంచి వేరు చేశారు! మిగతా బాతుల్లో కలవకుండా పోల్చుకొనేందుకు వీలుగా దుస్తులు తొడిగారు! ముక్కు కుట్టించారు! మువ్వల పట్టీలు తొడిగారు! ఎటు వెళ్ళినా కాళ్ళు కదిపినా తెలిసేలా! ఇంట్లోనే పంజరం కట్టి పెట్టారు! పంజరంలోంచి పైకి వచ్చినప్పుడు యెగిరిపోకుండా యెటూ వెళ్ళిపోకుండా వెండి గొలుసు వేయించారు! నమ్మకమైన అంగరక్షకుల్ని కూడా పెట్టారు! పురుగూ గిరుగూ గింజా గట్రా తినే పరిస్థితి లేదు! జీడిపప్పు బాదంపప్పు వేశారు! వైద్యుడే యింటికి వచ్చి బాతు బాగోగులు చూస్తున్నాడు! ఎందుకటే యజమాని ధనవంతుడై పోయాడు! రోజుకో బంగారం గుడ్డు! ఉన్న మిగతా బాతులన్నింటినీ అమ్మేశాడు! ఒక్కబాతూ వెయ్యి కాదు, లక్షబాతుల పెట్టు!

యజమాని నగరానికి చేరిపోయాడు! ఇల్లు కాదది రాజ భవంతి!

మొదట్లో రాణివాసం అనుకుంది ఖైదయిన పిల్లబాతు!

అలాగే అందంగా వుండడం కోసమే రెక్కలు కత్తిరించారని, వొంటి మీది పొడవాటి యీకలు పీకేశారని అనుకుంది! మెరిసింది! మురిసింది! తరువాత అర్థమయింది! తను యెగర లేనని! ఎగరకుండా వుండడం కోసమేనని!

పిల్లబాతుకి గుబులయ్యింది! దిగులు కమ్మింది! ఆరోగ్యంలో అది కనిపించింది, అద్దంలో చూసినట్టు! అప్పటికీ గోరువెచ్చని నీళ్ళలో యీతలాడించి శారీరక ధారుడ్యం తగ్గకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు! మనసు మెత్తబడకుండా మానసిక వైద్యడు చెప్పినట్టు చేశారు! ఆ పిల్లబాతు తను పుట్టిన బాతులతో నెలకీ పదికి కలిసేలా యేర్పాట్లు కూడా చేశారు! అది కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్యనే!

చుట్టపు చూపుగా వొచ్చిన పిల్లబాతుని చూసి తల్లిబాతు వొళ్ళంతా తడిమింది! తల్లడిల్లింది! ‘నువ్వింకా బతికే వున్నావంటే నమ్మలేకపోతున్నా’ అంది! ‘ఈ పేరాసయ్యలు బంగారానికి కక్కుర్తి పడి నీ పొట్ట కోసి నిన్ను పొట్టన పెట్టుకున్నట్టు కల వచ్చింది’ అని వలవల యేడ్చింది తల్లిబాతు!

దుఃఖమంతా పోయి నవ్వొచ్చింది పిల్లబాతుకి! ‘శనీ ఆదివారాలు శెలవు లేకుండా రోజూ రోజుకో బంగారం గుడ్డు పెడుతుంటే, దాన్ని నిలబెట్టుకోకుండా వెర్రిబాగులోళ్ళా వొకేసారి బాతును కోసే బాపతుగాళ్ళు యెవరూ లేరు! ఉండరు! అందరూ బంగారం గుడ్లు పెట్టే బాతు కత చదువుకున్నారు’ అంది!

తల్లిబాతుకి వూరటగా తోచింది! అంతలోనే ‘నీ బాతు కడుపున వొక బాతు గుడ్డు పడి అందులోంచి వో పసిగుడ్డు గాడు బయటకు వొస్తే చూడాలని వుంది’ అని బాధ పడింది! సహజమైన మామూలు కోరిక కూడా అసహజమైపోవవడం చూసి పిల్లబాతుని పట్టుకొని తల్లిబాతు పొగిలి పొగిలి యేడ్చింది! ‘దేవుడు దిబ్బయిపోయిన దేవుడు… నీరాత యిలా యెడమ చేత్తో వెనకెట్టి రాస్తాడని అనుకోలేదు’ అని రాగాలు తీసింది!

తిరిగి పంజరానికి చేరింది పిల్లబాతు! తనవాళ్ళని చూసిన ఆనందంలో హాయిగా ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోయింది! తెల్లవారు ఝామున దొంగలు పడ్డారు! చిన్నా చితకా దొంగలు కాదు! ఘరానా గాళ్ళే! కాల్పులు జరిపారు! తుపాకీ గుళ్ళకి వొక అంగరక్షకుడు అక్కడికక్కడే ప్రాణాలు వొదిలాడు! మరో అంగరక్షకుడు ఆసుపత్రిపాలయ్యాడు!

తనకోసమే దొంగలు పడ్డారని తెలిసినప్పుడు పిల్లబాతుకి గుండె వణికింది! కాని యజమాని గట్టివాడు! భద్రతని పెంచాడు! భాగంగా అంగరక్షకుల్నీ పెంచాడు! వాళ్ళనీ నమ్మడానికి లేనట్టు వాళ్ళమీదా నిఘా పెట్టాడు! తను సొంత తుపాకీ కలిగి వుండేందుకు అధికారపూర్వక అనుమతి కూడా పొందాడు!

అంతే కాదు, యెంతో నమ్మకంగా బతికిన యజమాని దంపతులు బాతు వచ్చాక వొకర్ని వొకరు నమ్మడం మానేశారు! తన భార్య బాతుని పట్టుకు యెక్కడ పారిపోతుందోనని భర్త భయపడితే, తన భర్త తనని వదిలేసి బాతుని పట్టుకు యెక్కడ పారిపోతాడోనని భార్య భయపడింది!

మొత్తానికి బాతు పెట్టే బంగారు గుడ్ల రహస్యం బహిరంగం అయ్యింది! అందరి కన్నూ పడింది! చూడడానికి వచ్చీ వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది! పిల్లబాతుని యెత్తుకు పోయే ప్రయత్నాలు సయితం జరిగాయి! అందులో భాగంగా యజమాని కూతుర్ని సహితం అపహరించారు! బాతుని యిస్తే మా పాపను మీకు అప్పగిస్తామని అన్నారు! కొన్ని బంగారు బాతుగుడ్లని ఖర్చుపెట్టి ప్రవేటు పోలీసు సైన్యం సాయంతో కూతుర్ని దక్కించుకున్నారు!

మీడియా బంగారు బాతు గురించి కోడై కూసింది! సెలబ్రిటీని చేసింది! పిల్లబాతు వాట్సాపుల్లో వాలింది! ఫేస్ బుక్కులోకి యెక్కింది! ట్విట్టర్లో జంతుప్రేమికులు జగడానికి దిగారు! ఇన్స్టాగ్రామ్లో దర్శనమిచ్చింది! బంగారు గుడ్లు పెట్టే బాతు మీద సినిమా తియ్యడానికి యానిమేషన్ స్టూడియో వాళ్ళు సిద్ధమైపోయారు!

మరోవైపు ‘జత కట్టకుండా బాతు గుడ్లు యెలా పెడుతోంది?’ అని శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు! ‘మన దేవుళ్ళలో మాత్రం అలా పుట్టిన వాళ్ళు లేరా?’ అని హేతువాదులు వత్తాసు పలుకుతూ వాదానికి దిగారు! టీవీల్లో చర్చలు! రచ్చలు! సవాళ్ళు! ప్రతి సవాళ్ళు!

బాతు మామూలు బాతు కాదని, ‘బంగారమ్మ’ అనే దేవత బాతు రూపంలో భూమి మీదకు వచ్చిందని కొందరు భక్తులు అప్పటికప్పుడు బాతుకు గుడి కట్టడానికి ముందుకు వచ్చారు! స్థలం దానం చెయ్యడానికి కొందరు దాతలు పోటీ పడ్డారు! భక్తులు తమ మనోభావాల్ని ప్రభుత్వం గుర్తించి గౌరవించాలని కోరారు!

అప్పటికీ యజమాని అది మామూలు బాతే, మా పెంపుడు బాతు అని చెప్పినా- ఆదాయపన్ను అధికారులు చేసిన దాడుల్లో బోలెడన్ని బంగారు గుడ్లు బయటపడ్డాయి!

‘ఆస్తులన్నీ ప్రభుత్వం జప్తు చేసినా నా బాతుని నాకిచ్చెయ్యండి’ అని యజమాని న్యాయస్థానాలని ఆశ్రయించాడు!

ఇటువైపు బంగారు గుడ్లు పెట్టే బాతువల్ల సమాజంలో హింస పెరిగిపోతోందని, ప్రభుత్వమే బాతుని స్వాధీనం చేసుకొని రక్షించి సంరక్షించాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి!

బాతుని యజమాని దగ్గరే వుంచి అసలు బాతు పెట్టేవి బంగారం గుడ్లేనా?- అనే విషయం నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది! అందులో భాగంగా కమిటీ సిఫార్సుల మేరకు బాతు రక్త నమూనాలను తీసి పరీక్షకు పంపించారు! అలాగే బాతు శరీరంలో మాంసాన్ని కూడా కోసి తీసి పరిశీలనకు పంపించారు!

ఒంట్లో వోపిక లేకపోయినా పిల్లబాతు ముడ్డoట బంగారం గుడ్డు పడింది, రోజూలాగే! వెంటనే ఆ బంగారపు గుడ్డుని రెక్కల మాటున దాచింది! అటూ యిటూ చూసింది! ఎవరూ చూడడం లేదని నిర్దారించుకుంది! అప్పటికే వచ్చిన నిర్ణయాన్ని తలచుకొని పిల్లబాతు కళ్ళ నీళ్ళు కార్చింది! తన తల్లీ తండ్రీ గురువూ నేస్తాలూ జాతిమొత్తం కళ్ళముందు కదలాడింది!

‘బంగారు గుడ్లు పెట్టే మా పూర్వీకుడు నాకన్నా యెంతో అదృష్టవంతుడు… వొక్కసారే హత్యకు గురయ్యాడు!’ అని పిల్లబాతు కుమిలిపోయింది! లేచింది! రెక్కలతో కళ్ళు తుడుచుకుంది! దేవుణ్ణి తలచుకుంది! ఏ బంగారం గుడ్డయితే పెట్టాలని కోరుకుందో ఆ బంగారం గుడ్డునే ఆత్మహత్యకు ఆయుధంగా వాడుకుంది! రెక్కలతో పట్టి గుడ్డుని నోట్లో వేసుకుంది! బలవంతంగా మింగింది!

బంగారం గుడ్డయినా గొంతుకి అడ్డం పడింది! ఊపిరాడక రెక్కలు కొట్టుకుంది! కాళ్ళు తన్నుకుంది! కళ్ళు తేలేసింది! పిల్లబాతు జీవం వొదిలేసింది!

దేవుడు దర్పణంలో యిదంతా చూస్తూ విరక్తిగా నవ్వాడు!

‘కథ మారలేదు… బాతుకు చావు తప్పలేదు! కాకపోతే అప్పుడు హత్య… యిప్పుడు ఆత్మహత్య అంతే తేడా!’ అంది దేవుడితో అతని పెళ్ళాం!

‘బాతు బాతుగుడ్డు పెడితే యింత విపరీతము జరిగేది కాదు…’ వణికిన గొంతుతో అన్నాడు దేవుడు!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

5 thoughts on “క్వాక్… క్వాక్!

  1. బాతు కోరికే ….ఆత్మ హత్య లా వుంది కదండీ.
    కాదేదీ కదకనర్హం సూపరో… సూపర్.

    1. కాదండీ… కోరిక ఆత్మహత్య కాదు! ఇది కోరికకు సంబంధించిన కథ మాత్రమే కాదు! సరే ‘కోరిక’ దగ్గరికే వస్తే, దుఃఖానికి మూలం కోరికలు అన్నాడు బుద్ధుడు! సర్వమూ క్షణికమనేది బౌద్ధ ధర్మ మూల సూత్రం! కాని కోరిక జీవన చక్రానికి చలన శీలి! సహజమైనది కూడా! కోరిక కోరకుండానే పురాకథలో బాతు బంగారు గుడ్లు పెట్టింది! ఇక్కడ బాతు తీవ్ర తపస్సుతో అది సాధించింది! కాని కథ మారలేదు! ఇక్కడ బాతులు బాతులు మాత్రమే కాదు! మనుషులు! అల్పులైన మనుషులు! పిల్లబాతు లాంటి అల్పుల బంగారుగుడ్లు వారి సొంతం కాదు! ఇక్కడ బంగారం బగారం కాదు! బంగారం కల కావచ్చు, కోరిక కావచ్చు, వృత్తి కావచ్చు, నైపుణ్యం కావచ్చు, అస్తిత్వం కావచ్చు, మరేదైనా కావచ్చు!

  2. అర్ధమైంది.
    బాతు కోరిక బంగారం. ఆ కోరికే దాని చావుకొచ్చింది. అదే దాని అస్థిత్వమైతే… ఆత్మహత్య లాంటిదయ్యింది కదా!

  3. ఎవరి కోరిక వారికి బంగారం! కోరికే అస్తిత్వం కాదు, అస్తిత్వంలో భాగం! అలాగే ‘ఆత్మహత్యలన్నీ హత్యలే’ అనే మాటని విస్తరించుకుంటే కథలో దాని ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి!

Leave a Reply