కోవిడ్ కాలంలో అమెరికా ఆరోగ్య, ఆర్థిక వైఫల్యాలు

సగటు తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే మొదటిస్థానంతో అగ్రరాజ్యంగా చలామణీ అవుతూ ఉన్న అమెరికా ప్రపంచవ్యాప్తంగా మరణాలసంఖ్యలోనూ మొదటి స్థానంలో ఉంది.

అమెరికా ఎప్పటిలానే ఆరోగ్యం పట్ల కంటే ఆర్థిక వ్యవస్థ పట్లే అధికదృష్టి సారిస్తోందన్నది నిర్వివాదాంశం. ఒకపక్క ఆరోగ్య విధానవైఫల్యాల వల్ల దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉండగా దేశ ఆర్థిక పరిస్థితి “సత్వరంగా” మెరుగుపరచడం వెనుక అసలు కారణం రాజకీయ కుత్రంత్రమేనని స్పష్టమవుతూ ఉంది. ముందుచూపు లేని దూకుడు ఆర్థిక విధానాల వల్ల ఆర్థికంగానూ ఘోర వైఫల్యాలను ఎదుర్కొంటూ ఉంది.

అమెరికాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2 మిలియన్లు దాటగా మరణాల సంఖ్య 115,000 ని దాటింది.

అమెరికాలో ఆరోగ్య వైఫల్యాలు చర్చించుకునే ముందు అసలు అమెరికాలో హెల్త్ కేర్ వ్యవస్థ ఎలా ఉంటుందో చూద్దాం.

అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ ప్రధానంగా ప్రెవేటు సంస్థల గుత్తాధిపత్యంలో ఉంటుంది. మొత్తం దేశంలో దాదాపు 30 కంపెనీలకు మాత్రమే ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు అనుమతి ఉంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే కొన్ని రీజినల్ ఆసుపత్రులు ఉన్నా అమెరికన్ సిటిజన్లకు మాత్రమే రక్షణ కల్పిస్తాయి ఇవి.

ఆసుపత్రులన్నీ హెల్త్ ఇన్స్యూరెన్స్ వ్యవస్థతో అనుబంధంగా నడుస్తాయి. ఇది మరొక గుత్తాధిపత్యం. ఇందులో ప్రధానంగా 25 కంపెనీలు ఉంటాయి.

హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ప్రధానంగా H.M.O (health maintenance organization), P.P.O (preferred-provider organization) అనే రెండు రకాలుగా ఉంటుంది. H.M.O తక్కువ ప్రీమియం కలిగి ఉన్నా అదే సంస్థలోతప్ప బయటెక్కడా చికిత్స పొందడానికి వీలుండదు. అంతేకాకుండా ప్రతిసారీ ప్రైమరీ ఫిజీషియన్ అనుమతితో మాత్రమే స్పెషలిస్టులు ఇతర సర్వీసులు పొందాల్సి ఉంటుంది.

ఇక రెండవ P.P.O ఎక్కువ ప్రీమియం ఉన్నా P.P.O నెట్ వర్కు లో ఉన్న ఏ ఆసుపత్రికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. స్పెషలిస్టులు, ఇతర సర్వీసుల వద్దకు నేరుగా వెళ్లే వీలుంటుంది. అయితే బిల్లు వడ్డన కూడా అదే విధంగా ఉంటుంది. ఇందులో అవుటాఫ్ పాకెట్, డిడక్టబుల్ వంటి పేకేజీలు ఉంటాయి.

ఇదంతా వినడానికి గందరగోళంగా ఉన్నా స్థూలంగా వ్యవస్థ ఒకపద్ధతిలోనే నడుస్తూ ఉంటుంది. ఇన్స్యూరెన్స్ సాధారణంగా ఉద్యోగులకు తాము పనిచేసే కంపెనీల ద్వారా లభిస్తుంది.

అమెరికాలో మామూలుగానే ఆరోగ్యవిధానం ఎలా ఉంటుందంటే ఏదైనా వ్యాధి లక్షణాలు బయటపడినప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చూపించుకోవడానికి, చేరడానికి అర్హత ఉంటుంది. ప్రివెంటివ్ కేర్ ఉన్నప్పటికీ అది సంత్సరానికో సారో రెండు సంత్సరాలకోసారో నిర్ణీత వ్యవధిలో మాత్రమే పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పిస్తుంది.

ఇక రీజినల్ ఆసుపత్రులలో అర్హులైనవారికి ఉచిత సదుపాయం ఉన్నప్పటికీ ఈ ఆసుపత్రులు అతితక్కువ ఉండడం, కొన్నిసార్లు ఈ ఆసుపత్రులు వందల మైళ్ళ దూరంలో ఉండడం కూడా పరిపాటి. ఇక అందుబాటులో ఉన్న ఇతర కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం పొందాలంటే ఇన్స్యూరెన్స్ ల మోత. ఇన్స్యూరెన్స్ కట్టలేని పేద అమెరికన్లు ప్రభుత్వ ఆరోగ్య పథకాల మీదే ఆధారపడతారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలకు అర్హతలేని కొందరు ఇన్స్యూరెన్స్ లేకుండానే జీవిస్తూ , ఏదైనా సమస్య వస్తే సొంత వైద్యం మీద ఆధారపడి ఉంటారు.

అమెరికాలో 2018 లెక్కల ప్రకారం 34% అమెరికన్లు మాత్రమే ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా ఆరోగ్య భీమాని పొందుతూ ఉన్నారు. అంటే మిగతా 66% (అధికభాగం) ప్రయివేటు ఇన్స్యూరెన్స్ ల ద్వారా మాత్రమే ఆరోగ్య రక్షణ పొందుతూ ఉన్నారు. మొత్తం 91.5 % శాతం ఏదో ఒక ఇన్స్యూరెన్స్ పొందుతూ ఉన్నారు. ఇందులో 50 మందిలో ఒకరికంటే ఎక్కువ మందికి ఇన్స్యూరెన్స్ కట్టగా సంవత్సరానికి దాదాపు $5000-$10,000 ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది.

ఇటువంటి వారికి నిరుద్యోగిత తోడైనప్పుడు ఖర్చు భరించలేక పూర్తిగా రోడ్డున పడడం, ఆరోగ్య పర సమస్యలు అధికం కావడం జరుగుతుంది.

ఇక కరోనా ఒక్కసారిగా దండయాత్ర చేసినప్పుడు అంతవరకూ ప్రెయివేటు ఆసుపత్రులు తాము అందజేసే అత్యాధునిక, అత్యద్భుత ఫెసిలిటీస్ పై దృష్టి పెట్టినంతగా ఇటువంటి అత్యవసర పరిస్థితికి ముందే సంసిద్ధం కాలేకపోవడం వల్ల సమస్యల్ని ఎదురొన్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు సరేసరి. మొత్తం చేతులెత్తేసేయి. అందుకే అప్పటికప్పుడు కనబడ్డ ప్రతి స్థలాన్ని ఆసుపత్రిగా మార్చివేసేరు.

అమెరికాలో ఆరోగ్య వైఫల్యానికి కారణాలు:

మొదటగా చెప్పుకోవలసినది అధ్యక్షుడి నిర్లక్ష్యధోరణి, కార్పరేట్ రాజకీయాలు. దీనికి ప్రత్యక్ష తార్కాణంగా కోవిడ్ కాలంలో సంతకాలు చేసిన రెండు ప్రెసిడెన్షియల్ యాక్టుల గురించి చెప్పుకోవాలి.

అందులో మొదటిది N -95 మాస్కుల తక్షణ తయారీకి సంబంధించినది. ఈ ప్రెసిడెన్షియల్ యాక్ట్ పై సంతకం చెయ్యడానికి రెండు నెలల సమయం తీసుకోగా, రెండవదైన కార్పొరేట్ సంస్థలు లాభపడే మాంసం ఉత్పత్తి కేంద్రాల నియమావళికి రెండే రెండురోజుల్లోసంతకం చేసేరు.

ఇక దేశంలో కరోనా రాదనే అధ్యక్షుడి ధీమా వ్యాఖ్యల వల్ల N -95 మాస్కులని మార్చి నెలలో చైనాకి ఎగుమతి చేసేరు. అందువల్ల సరిగ్గా అవసరమైన సమయానికి దేశీయంగా N -95 మాస్కులు అందుబాటులో లేకుండా పోయేయి. ఎవరు మాటా వినకుండా రోజుకొక విధంగా స్పందిస్తూ స్వీయ రాజకీయాలకి మాత్రమే ప్రాధాన్యత నివ్వడం, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాల్లో స్పందించడం, దుయ్యబట్టే మీడియా పై ముఖనిందకి పాల్పడడం వంటివి అగ్నికి ఆజ్యంపోసినట్టు దేశ పరిస్థితుల్ని చక్కదిద్దకపోగా ప్రజల్ని నిరాశకి గురయ్యేటట్లు చేసేయి.

ఇక ఫిబ్రవరి, మార్చి లలో పరిస్థితిని సీరియస్ గా తీసుకుని సత్వరంగా చర్యలు తీసుకోకపోవడం మరొక ప్రధాన కారణం. ఒక పక్క వ్యాధి తీవ్రత కొనసాగుతూ ఉన్నా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఆలస్యంగా “షెల్టర్ ఇన్ ప్లేస్” (లాక్ డౌన్) ని విధించడమే కాకుండా , ఆరోగ్య పరంగా రాష్ట్రాల్ని సమన్వయం చెయ్యలేకపోయేరు. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు “షెల్టర్ ఇన్ ప్లేస్” నిబంధనలు ముందుగానే పాటించినా, కొలరెడో వంటి రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభ భయంతో అసలు పాటించలేదు. అదే సమయంలో అంతర్రాష్ర్ట విమాన సర్వీసులని రద్దు చెయ్యకపోవడం వల్ల వైరస్ దేశవ్యాప్తంగా అతివేగంగా వ్యాప్తి చెందింది.

వెంటిలేటర్లు, మెడికల్ కిట్లని చవకగా ఇతరదేశాల నుండి దిగుమతి చేసుకోవడంపైనే ఆధారపడడం మరొక కారణం. ఆరోగ్యపరమైన ప్రధాన ఉత్పత్తులైన మెడికల్ కిట్ల వంటివి చవకగా చైనా నుండి దిగుమతి చేసుకుంటూ ఉండడం , కరోనా వల్ల చైనాలోని ఉత్పత్తి కేంద్రాలు మూతబడడం, సరకు రవాణాలు ఆపివెయ్యబడడం వల్ల దేశీయంగా మెడికల్ పరికరాలకు, ఉత్పత్తులకు విపరీతంగా కొరత ఏర్పడింది.

స్థానిక ఉత్పత్తులని సత్వరం చెయ్యలేకపోవడంలో ఉన్న లయబిలిటీ సమస్యలు మరొక కారణం. FDA (Food and Drug Administration) పరిధిలోని Tort లయబిలిటీ సమస్య వల్ల స్థానిక ఫ్యాక్టరీలు మెడికల్ కిట్లని సకాలంలో అందజేయలేక పోయేయి. టార్ట్ లయబిలిటీ అనేది ఏదైనా పరికరాల వల్ల మనుషులకు నష్టం వాటిల్లితే ఆయా పరికరాలు తయారుచేసిన కంపెనీలపై వ్యాజ్యం వేసేలా న్యాయపరమైన రక్షణని కలగజేస్తుంది. అంటే డాక్టర్లకు, హెల్త్ కేర్ వ్యవస్థలో పనిచేసే వారికి తాము వాడే మెడికల్ పరికరాల వల్ల నష్టం వాటిల్లితే పరికరాల తయారీ కంపెనీలమీద దావా వెయ్యొచ్చన్న మాట. ఇటువంటి వంటి దావాల్లో కంపెనీలు అధిక మొత్తం చెల్లించాల్సి రావడమే కాకుండా కొన్నిసార్లు కంపెనీలు మూతబడే ప్రమాదమూ ఉంది. ఇందువల్ల కంపెనీలు పనిముట్లని అత్యంత జాగరూకతతో FDA (Food and Drug Administration) జారీ చేసిన నిబంధనలకు లోబడి తయారు చెయ్యడంలో జాప్యం జరగడం పరిపాటి అయ్యింది.

సరైన సమయానికి డాక్టర్లకి సహాయక PPE కిట్లు కూడా వెంటనే అందివ్వలేకపోవడంతో డాక్టర్లు చెత్తవెయ్యడానికి వాడే ప్లాస్టిక్ సంచులని చుట్టుకుని వైద్యం అందించవలసిన దుస్థితి ఏర్పడింది.

ఇక ఇలాంటి మహమ్మారులు వచ్చినపుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం మరొక కారణం. నేషనల్ రిజర్వులో ఎప్పుడూ N -95 మాస్కులు సిద్ధంగా ఉంచుకోవాలన్న నిపుణుల సలహాల్ని పెడచెవిన పెట్టడమే కాకుండా దశాబ్దాలుగా బడ్జెట్, నాణ్యత మొ.న కారణాలతో ”అప్పటికప్పుడు” తగిన పరికరాల్ని అమర్చుకునే పద్ధతిని అవలంబిస్తూ ఉండడం వల్ల అనుకోకుండా విరుచుకు పడ్డ ఈ పరిస్థితికి వెంటనే సిద్ధంకాలేకపోయింది దేశం.

ఇక కార్పొరేట్ ఆర్థిక లబ్ధికి తోడ్పడే ఇన్సూరెన్స్ విధానాల్ని అవలంబించడం, ఒబామాకేర్ రద్దు చేసే యత్నాలు కొనసాగడం వల్ల ప్రజలకి ఆరోగ్య భద్రతా కరువయ్యింది.

ఒబామా ప్రవేశపెట్టిన The Affordable Care Act (ACA) ని “ఒబామాకేర్” అని పిలుస్తారు. దీని ప్రకారం అందరూ కట్టదగిన అనువైన ఇన్స్యూరెన్స్ పొందే అవకాశం కలిగింది. ఇది ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ప్రీమియమ్ లు పెంచకుండా అడ్డుకట్ట వేసింది.

అంతేకాకుండా అంతకు ముందు వరకూ వున్న ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నవారికి హెల్త్ కేర్ కవరేజ్ తిరస్కారాన్ని ఆపివేసింది. తక్కువ కోపేలు, తక్కువ అవుటాఫ్ ప్యాకెట్లు , తక్కువధరకే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ పొందే అవకాశాన్ని కలిగించింది. అనేక అదనపు టెస్టులు ఇన్స్యూరెన్స్ లో కవర్ అయ్యేటట్లు చర్యలు చేపట్టింది.

అలాగే అంతవరకూ ఉన్న లిమిట్స్ ని తొలగించి ఇన్స్యూరెన్స్ తప్పకుండా కవర్ చేసే వీలు కల్పించింది. దీనివల్ల దాదాపు 16 మిలియన్ల మంది కొత్తగా ఇన్స్యూరెన్స్ పొందగలిగారు.

ఒబామాకేర్ వల్ల మహిళలకు మగవారితో సమానమైన ప్రీమియం కే ఇన్స్యూరెన్స్ లభించింది. మామూలుగా అమెరికా మహిళలు మగవారి కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావడం గమనార్హం.

ఇక ఈ కేర్ వల్ల 26 సంవత్సరాల వరకు పిల్లలకు తల్లిదండ్రుల ఇన్స్యూరెన్స్ తోనే కవరేజీ లభించింది.

అంతేకాకుండా 50 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఇన్స్యూరెన్స్ ఆఫర్ చెయ్యాలని ఆదేశించింది ఒబామాకేర్.

ఒబామాకేర్ ఇప్పటికీ కొన ఊపిరితో అమలులో ఉన్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇన్స్యూరెన్స్ కలిగి ఉండాలనే అంశాన్ని రద్దు చేసింది ఇప్పటిప్రభుత్వం. తక్కువ ఆదాయం కలిగినవారికి ఇన్స్యూరెన్స్ కల్పించే కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే cost-sharing reduction (CSR) పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆపివేసింది.

ఈ రెండిటి వల్ల ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రీమియమ్ లు నచ్చిన విధంగా పెంచివేసుకునే అవకాశం కల్పించింది.

అంతేకాకుండా ఉద్యోగులకు Association Health Plans (AHPs) అనే తక్కువ కాలపరిమితి కలిగిన మరో రకమైన ఇన్స్యూరెన్స్ ఇచ్చే అవకాశం కంపెనీలకు కల్పించింది. ఇందులో ఒబామాకేర్ లో ఉన్న ఏ నిబంధనలూ వర్తించవు.

ఇక ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకమైన మెడిక్ ఎయిడ్ కు ఆదాయ పరిమితిని పెంచివేసింది. అందువల్ల చాలా మంది ఉచిత భీమాని కోల్పోయేరు.

అత్యంత సంపన్నులున్న అమెరికా లో పేద ప్రజల ఆరోగ్య ప్రమాణాల పట్ల మొదట్నుంచి శ్రద్ధ వహించకపోవడం అనేది విచార కరం. అమెరికాలో సగటున ప్రతీ పదివేల మందిలో 17 మంది

హోమ్ లెస్ గా ఉన్నారని అంచనా. ఈ సంఖ్య కరోనా గడ్డుకాలంలో గణనీయంగా పెరగడం దురదృష్టం. ఇక్కడ ఇల్లు, అడ్రసు లేకపోతే ఏ పథకానికి అర్హత లేనట్లే. కోవిడ్ కారణంగా మరణించిన హోమ్ లెస్ జనానీకాన్ని పెద్ద మొత్తంలో సామూహిక ఖననం చెయ్యడం వంటి దయనీయమైన దృశ్యాలు మీడియాలో ప్రసారం అయ్యేయి.

వీటన్నిటితో బాటూ అమెరికాలో 80 సం.లు పైబడి ఉన్న జనాభా అధికం. అసలే వృద్ధాప్యం వల్ల వ్యాధి నిరోధకశక్తి తక్కువ ఉన్న వీరికి కరోనా సోకడంతో ఎక్కువగా మృత్యువాత పడ్డారు. చాలా మందికి అంతర్లీన వ్యాధులు ఉండడం, ఎంతోమంది ఊబకాయంతో బాధపడుతూ ఉండడం అనేవి కూడా మృత్యువు శరవేగంగా కబళించడానికి కారణాలయ్యేయి.

ఆర్థిక పేకేజీలు ఫుల్- ఆరోగ్య పేకేజీలు నిల్:

వ్యాధిని సత్వరంగా కనుగొనే నేషనల్ టెస్ట్ కిట్ల తయారీకి, అందుకు సంబంధించిన నిపుణులైన వ్యక్తుల నియామకానికి సరిపడే నిధుల సరఫరా చెయ్యడంలో విఫలమయ్యింది అమెరికా.

Coronavirus Aid, Relief, and Economic Security Act (CARES) ప్రోగ్రాం ని చాలా వరకు నిరుద్యోగాన్ని ఆదుకునే ఆర్థిక పేకేజీ గా మాత్రమే వినియోగించుకుంది.

ఇక ఫెడరల్ రిజర్వ్ $ 454 బిలియన్ల డాలర్లని చిన్నా పెద్ద వ్యాపార సంస్థల్ని ఆదుకోవడానికి ఉపయోగించింది.

CARES Act ద్వారా విడుదల అయిన $2 ట్రిలియన్ల డాలర్లలో 5 వ వంతు కంటే తక్కువ ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కోవడానికి వినియోగించేరు. అందులోచాలా భాగం అత్యవసర ఆసుపత్రులు నెలకొల్పడానికి, కోవిడ్ కేసుల వల్ల సాధారణ కేసుల్ని తీసుకోలేక ఆర్థికంగా దెబ్బతింటున్న హెల్త్ కేర్ సంస్థలు మూతబడకుండా ఆదుకోవడానికి ఉపయోగించేరు.

వచ్చే ఏడాదికల్లా పూర్తి స్థాయిలో ప్రతీ ఒక్కరికీ టెస్టింగ్ కి దాదాపు 50 బిలియన్ల డాలర్లు అవసరం ఉండగా ఫేస్ మాస్కులు, వెంటిలేటర్లు , టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లకు రాష్ట్రాలకు 1.5 బిలియన్ల డాలర్లు మాత్రమే ఇవ్వగా మరో 1.5 బిలియన్ల డాలర్లు Disease Control and Prevention (CDC) పరిధిలోని నేషనల్ సెంటర్లలో టెస్టింగ్ ప్రోగ్రాముకి అందజేసేరు.

సత్వర ఆర్థిక పథకాల పేరుతో ట్రిలియన్ల డాలర్లు కుమ్మరించినా ఆర్థిక వైఫల్యాలూ వెల్లువెత్తేయి.

అమెరికాలో ఆర్థిక వైఫల్యానికి కారణాలు:

సప్లై చెయిన్ లో లోపాల వల్ల ఉత్పత్తి, రవాణా, హోల్ సేల్, రీటైల్ రంగాల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా అతలాకుతలం అయ్యింది. అగ్రరాజ్యంలోఉత్పత్తి, రవాణా, సరకు అమ్మే పద్ధతులు, హోల్ సేల్ విధానం లోని లోపాల కారణంగా ఒక పక్క రైతులు పంటని భూమి పాలు చేస్తూ ఉంటే, మరోపక్క దుకాణాల్లో సరకులు నిండుకొని షెల్ఫులు ఖాళీగా వెక్కిరించాయి. ఒక పక్క శరవేగంగా ప్రాణాలు కోల్పోతూ ఉంటే, మరోపక్క లక్షలాది మంది ఉపాధి కోల్పోయి ఉచిత భోజనం కోసం బారులు తీరి నిల్చున్నారు.

గత నాలుగైదు నెలలుగా కోవిడ్-19 దెబ్బకి ప్రపంచ అగ్ర రాజ్యం అమెరికా అటు ఆరోగ్య పరంగాను, ఆర్థిక పరంగానూ కోలుకోలేని దెబ్బ తింది. ప్రధానరంగాలైన హోల్ సేల్, రీటైల్, ఉత్పత్తి- రవాణా, హోటల్, టూరిజం రంగాలు అతలాకుతలం కావడంతో నిరుద్యోగిత 14% కు చేరువగా అంటే 22 మిలియన్లను మించింది.

2019 లెక్కల ప్రకారం అమెరికా మొత్తం జనాభా 328.2 మిలియన్లు కాగా ఇందులో ఉద్యోగుల సంఖ్య దాదాపు 160 మిలియన్లు మాత్రమే.

అమెరికా ఆర్థికవ్యవస్థని సత్వరమే ఆదుకోవడానికి 2 ట్రిలియన్ల డాలర్లని (సుమారుగా 140 లక్షల కోట్ల రూపాయలు) గుమ్మరించింది. కోవిడ్ రిలీఫ్ ఫండ్ గా నిర్ణీత ఆదాయపు పరిమితి ఉన్న వారికి మనిషికి $1200 చొ.న పంచిపెట్టింది. ఇందుకు రానున్న అధ్యక్ష ఎన్నికలు ప్రధానమైన రాజకీయకారణం. ఇలా రాజకీయ కారణాలతో దేశాన్ని సత్వరంగా ఆదుకోవాలని ఒక్కసారిగా డబ్బు కుమ్మరించడం వల్ల రానున్న రోజులకి విపత్కర పరిస్థితులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం వల్ల రానున్న దశాబ్దంలో ఆర్థికసంక్షోభం తలెత్తవచ్చు.

చిన్నాపెద్దా సంస్థల్ని ఆదుకోవడానికి PPP (Paycheck Protection Program) ని ప్రవేశపెట్టింది అమెరికా . అయితే ఇందులోని లోపాల వల్ల నిజంగా సహాయం అవసరమైన స్థానిక చిన్నవ్యాపార సంస్థలకు ఇది ఉపయోగపడకుండా పోయింది.

ఈ పేచెక్ ప్రొటెక్షన్ పథకం ప్రకారం 500 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు లోన్ సదుపాయాన్ని పొందవచ్చు. అంతే కాకుండా ఎనిమిది వారాల పాటు ఉద్యోగుల్ని తొలగించకుండా ఉంటే సంస్థలకి ఈ లోన్లు మాఫీ చెయ్యబడతాయి కూడా. ఈ మొత్తాన్ని సంస్థలు ఉద్యోగుల జీతభత్యాలకే కాక కరెంటు, నీళ్లు వంటి బిల్లులు కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

అయితే అనేక స్థానిక చిన్నాచితకా వ్యాపార సంస్థలైన రెస్టారెంట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు వంటివి అప్పటికే జీతభత్యాలను భరించలేక ఉద్యోగులను పనిలో నుంచి తొలగించి వేసిన కారణంగా లోన్లు తీసుకున్నా మాఫీ చెయ్యబడడం లేదు. ఉద్యోగులకి జీతాలే చెల్లించలేక దాదాపు దివాళా తీసిన ఈ చిన్న సంస్థలు లోన్లు తీసుకున్నా తిరిగి కట్టలేని పరిస్థితుల వల్ల మొత్తం మూతపడ్డాయి.

పెద్ద సంస్థలు మాత్రమే పరిమిత ఉద్యోగులతో నడిపిస్తూ ఉన్న కారణంగా వారంతా ఈ పథకానికి అర్హులయ్యేరు. ఈ విధంగా ఈ పథకం కార్పొరేట్ సంస్థల్ని ఆదుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది.

ఇక మైనార్టీల పట్ల వివక్ష ఆర్థిక వ్యవస్థలోనూ పాతుకుపోయిందనడానికి ఉదాహరణగా ఏలియన్ వర్కర్స్ గురించి పేర్కొనవచ్చు.

నేటివ్ వర్కర్స్ & ఏలియన్ వర్కర్స్: అమెరికాలో 1996 లో బిల్ క్లింటన్ ప్రవేశపెట్టిన “మేన్ మేడ్ లా” ప్రకారం ఏలియన్ వర్కర్స్ Individual Taxpayer Identification Number (ITIN) ఉపయోగించి టాక్సు కట్టవచ్చు. 2015 లెక్కల ప్రకారం వీరి సంఖ్య దాదాపు నాలుగున్నర మిలియన్ల కాగా వీరు కట్టిన టాక్సులు 13. 7 బిలియన్ డాలర్లు. కానీ వీరెవరూ ఇక్కడి నేటివ్ వర్కర్స్ (సిటిజన్ల) తో సమానమైన పబ్లిక్ ఫండ్ బెనిఫిట్స్ అయిన హెల్త్ ఇన్స్యూరెన్స్, ఫుడ్, హౌసింగ్, ఎడ్యుకేషన్ కి అర్హులు కారు.

అమెరికాలో పబ్లిక్ ఫండ్ లో 55% ఎల్డర్ కేర్ ( సోషల్ సెక్యూరిటీ & హెల్త్ ఇన్స్యూరెన్స్) కి, 29% లో ఇన్ కమ్ టార్గెట్ ప్రోగ్రామ్స్ ( హెల్త్ కేర్ & ఫుడ్) కి ఇవ్వబడుతుంది. మిగిలిన తక్కువశాతం వెటరన్స్, విద్య,హౌసింగ్ మొ.న వాటికి ఇవ్వబడతాయి. అయితే ఇవన్నీ అమెరికాలో సిటిజన్లకి మాత్రమే పరిమితం.

సామాజిక భద్రత లోపించిన ఏలియన్ వర్కర్స్ ఆరోగ్యపరమైన సమస్యలే కాక, ఆర్థిక పరమైన సమస్యల్లోనూ ముందు వరుసలో ఉంటున్నారు.

అధ్యక్షుని నిర్లక్ష్య వైఖరి, తెంపరితనం తో బాటూ ఆరోగ్య విధానాల వైఫల్యాల వల్ల ఆర్థిక వైఫల్యమూ తోడై అల్లకల్లోల పరిస్థితికి దోహదం చేసింది.

ముందు చెప్పుకున్నటు వ్యాధి తీవ్రంగా ఉంటే మాత్రమే ఆసుపత్రిలో చూపించుకోవడానికిగానీ, చేరడానికి అవకాశం లేని పరిస్థితుల వల్ల, వ్యాధి లక్షణాలు ముదిరే వరకు వైద్య చికిత్స అందకపోవడం వల్ల అధికమరణాలు నమోదవ్వడం, వ్యాధి నిర్ధారిత కిట్స్, ఎమర్జెన్సీ వైద్య చికిత్స యూనిట్ల కొరత, సరైన సమయంలో అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసుల్ని కట్టడి చెయ్యకపోవడం, అన్ని రాష్ట్రాలూ ఒకేసారి రాకపోకల్ని నిషేధించక పోవడం, వైరస్ వ్యాప్తిని సత్వరమే కట్టడి చెయ్యలేకపోవడం వంటివన్నీ అమెరికా స్వయంకృతాపరాధాలే.

ఇప్పటికీ వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ఉన్నా వ్యాధిని అరికట్టే చర్యలు సత్వరం చెయ్యలేకపోతూ ఉండడం వల్ల అమెరికాలో వ్యాధి విరుచుకుపడే పరిస్థితి మళ్లీ రాదనే నమ్మకం లేదు!

రచయిత్రి. గాయని. భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు. ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017) కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవిత్వం, కథలు, కాలమ్స్, ట్రావెలాగ్స్, వ్యాసాలు అనేకం ప్రచురింపబడ్డాయి. కవిత్వంలో అజంతా అవార్డు, దేవులపల్లి అవార్డు, కుందుర్తి అవార్డు మొ.న ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో పొందారు. వీరి రచనలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి.

One thought on “కోవిడ్ కాలంలో అమెరికా ఆరోగ్య, ఆర్థిక వైఫల్యాలు

Leave a Reply