కోవిడ్‍ విపత్తులో కాషాయీకరణ దిశగా విద్య

కరోనా కష్టకాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి బదులుగా తమ స్వంత ఏజెండాను రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో విద్యను ప్రైవేటుకు విడిచిపెట్టి, కార్పొరేట్‍ పాఠశాలలు, కళాశాలలు దశాబ్ధాలుగా భారీ ఫీజులతో పీల్చిపిప్పి చేస్తున్నా నామమాత్రం చర్యలతో పాలకులు పొద్దుపుచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలల్ని పరోక్షంగా తూట్లు పొడిచారు. ఈ విధానం ఇప్పట్లో మారుతుందో లేదోగానీ… కరోనా మహమ్మారి పుణ్యమా అని సిలబస్‍లో మూడో వంతు తగ్గిస్తున్నట్టు సిబిఎస్‍ఈ ప్రకటించింది. 2020-21 విద్యా సంవత్సరానికి 9 నుంచి 12వ తరగతి వరకూ ఉన్న సిలబస్‍లో 30 శాతాన్ని తగ్గిస్తూ జూలై 8న ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‍ మహమ్మారి కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల పర్యవసానంగా 190 సబ్జెక్టుల్లో సిలబస్‍ కుదించారు.

ఇప్పటికే ఆర్థిక రంగంలో కార్పొరేట్ల ఖజానాలు నింపే విధానాలు ప్రారంభించిన మోడీ సర్కారు విద్యారంగంపై దృష్టి సారించింది. కరోనా విస్తరణ నేపథ్యంలో విద్యాసంస్థలు కోల్పోయిన పని దినాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పేరిట టక్కుటమార విద్యలకు దిగుతోంది. ఒక వ్యూహం ప్రకారం ప్రగతి నిరోధక, మతోన్మాత అజెండాను ముందుకు తీసుకు వస్తోంది. నిజానికి జ్ఞానంతోనే ప్రపంచాన్ని జయించాలి అని సోక్రటీస్‍ చెప్పిన మాటలు మనకు శిరోధార్యం కావాలి. సమాజ రుగ్మతలను అధిగమించి మానవీయ విలువలతో కూడిన విజ్ఞానాన్ని నేర్పడం ప్రభుత్వాల బాధ్యత, కర్తవ్యంగా స్వీకరించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లలకు నేర్పడం ఎంత అవసరమో, ప్రజాస్వామ్య, లౌకిక, మానవీయ విలువలను వారి మదికెక్కించడం అంతకన్నా ముఖ్యం. ఇప్పటికే బిజెపి పాలిత రాష్ట్రాల్లో పిల్లల్లో మత మౌఢాన్ని పెంచే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు.

తాను ఎక్కిన కొమ్మను నరుక్కోడం మూర్ఖులు చేస్తారు. ప్రజలెక్కిన చెట్టునే మూలమట్టంగా కూల్చివేయడం జనహితం గిట్టని పాలకులు మాత్రమే చేయగలరు. ప్రజల కళ్లకు గంతలు కట్టడం, మెదడుకు పదును పెట్టే అంశాలను బోధన నుండి తుడిచిపెట్టడం వంటివన్నీ అటువంటి ఏలికలకే సాధ్యం. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం రంగు మార్చకుండా దిక్కు మార్చడమనే ద్రోహ చింతన, ఆచరణ వారికే చెల్లుతుంది. విద్యార్థులను పరిపూర్ణ విజ్ఞాన వంతులుగా చేసే ఉన్నత విద్యకు ప్రవేశ ద్వారమైన సెకండరీ స్థాయి చదువును ఉత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దాల్సిన సెంట్రల్‍ బోర్డు ఆఫ్‍ సెకండరీ ఎడ్యుకేషన్‍(సిబిఎస్‍ఇ) మరియు ఎన్‍సిఇఆర్‍టి (జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి) చాకచక్యంగా చివరి నాలుగు సంవత్సరాల పాఠ్య ప్రణాళికను కుదించారు. ఇందులో కమిటీల ప్రభు పక్షపాతం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నిరవధికంగా, నిరాఘాటంగా ప్రజల ప్రాణాలతో ఆదుకుంటున్న కరోనా వైరస్‍ సకల జీవన రంగాలను నెలల తరబడిగా క్రుంగదీస్తూ కరాళ నృత్యం సాగిస్తున్న విపత్కర నేపథ్యంలో విద్యార్థులపై సిలబస్‍ భారాన్ని 30 శాతం తగ్గించే బాధ్యతను స్వీకరించిన ఈ కమిటీలు అందులోని ప్రజాస్వామిక చైతన్య దీప్తులన్నింటినీ ఆర్పి వేశాయి. విద్యా లక్ష్యాలకు తూట్లు పొడిచాయి. ఆధునిక విద్య స్థానంలో ప్రాచీన సంప్రదాయ విద్యను ప్రవేశపెట్టాలన్నది బిజెపి ధ్యేయం. ఒక రకంగా పాఠ్యాంశాల కుదింపును పై పైనే చూస్తే అందులో ఏముంది ఒక సంవత్సరమే కదా అనిపిస్తుంది. తరచి చూస్తే గాని అసలు విషయం బోధపడదు. కుదించిన పాఠ్యాంశాలను గమనిస్తే అవి బిజెపి భావాజాలానికి ఏమాత్రం గిట్టనివి అని అర్థమవుతుంది.

కేంద్ర ప్రభుత్వం తొలగించిన పాఠ్యాంశాల్లో సమాజ పురోగమనానికి, మానవ వికాసానికి, ప్రజాస్వామిక వ్యవస్థ పరిఢ విల్లడానికి తోడ్పడే కీలకాంశాలను తొలగించడం దిగ్భాంతికరం. పదో తరగతిలో తొలగించిన వాటిలో ప్రజాస్వామ్యం. వైవిద్యత, లింగం, కులమతాలు, ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు, సమస్యలు వంటి అంశాలు ఉన్నాయి. 11వ తరగతిలో సమాఖ్య విధానం, పౌరసత్వం, జాతీయవాదం, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు లౌకిక వాదం అనే అంశాలను తొలగించారు. 12వ తరగతిలో భారత్‍తో పాకిస్తాన్‍, మయన్మార్‍, బంగ్లాదేశ్‍, శ్రీలంక, నేపాల్‍ వంటి ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు, భారతదేశ ప్రణాళికబద్ధమైన ఆర్థిక అభివృద్ధి, భారత్‍లో సామాజిక ఉద్యమాలు, కులం, మతం, లింగ వివక్ష, వైవిద్యం, ప్రపంచీకరణ విధానాలు, దేశవిభజన, స్థానిక ప్రభుత్వాలు. పర్యావరణం, సహజవనరులు, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. ఇందులో కొన్ని పాలకుల వైఫల్యాలను తెలియజేసెటివి ఉన్నందున వాటిని తొలగించారు.

విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించే పాఠ్యాంశాలను సమూలంగా తొలగించారు. విద్యార్థిలోకి సృజన చొరబడనీయకుండా చేశాయి. 2020-21 విద్యా సంవత్సరం ఫైనల్‍ పరీక్షలకు గాని, అంతరంగిక మదింపు టెస్టులకు గాని చదివి తీరవలసిన పాఠ్యాంశాల జాబితా నుంచి సెక్యులరిజం, జాతీయవాదం, సమాఖ్య(ఫెడరలిజం) వ్యవస్థ, పెద్ద నోట్లరద్దు, వస్తు సేవల పన్ను(జిఎస్‍టి), పౌరసత్వం, ప్రజాస్వామిక హక్కులకు సంబంధించిన అధ్యాయాలను తీసి పారేశారు. విద్యార్థులు కోరితే ఉపాధ్యాయులు వారికి వీటి గురించి అవగాహన కల్పించవచ్చు గాని పరీక్షల్లో కృతార్థులు కావడానికి ఇవి చదివి తీరవలసిన అవసరం లేదని ఎన్‍సిఇఆర్‍టి స్పష్టం చేసింది. కేవలం మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడమే లక్ష్యంగా పాఠ్య పుస్తకాలు చదివే విద్యార్థులు అత్యధికంగా ఉండే వర్తమానంలో ఈ అంశాలను తెలుసుకోవాలనే ఆసక్తిని వారు కనబరుస్తారని ఎంతమాత్రం అనుకోలేము. ఆ విధంగా రాజ్యాంగానికి ప్రాణవాయువు లాంటి ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఫెడరలిజంల గురించి చదవనక్కరలేని స్థితిని కలిగించడమంటే దేశ భవితను నడిపించే భావి పౌరులను చైతన్య రహితులుగా చేయదలచడమే. ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి ప్రాణాన్ని తొలగించి దానిని మృత కళేబరంగా మిగల్చడమే అవుతుంది.

ఈ సారికి సిలబస్‍ తగ్గించాలన్న డిమాండ్‍ తొలిసారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మానిష్‍ సిసోడియా నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు తొలగించిన అంశాలు చూశాక ఆయనే ఆశ్చర్యపోతున్నారు. అన్నింటి మూలాలు రాజకీయాలతో ముడిపడిన వర్తమానంలో సిలబస్‍ కుదింపు అంశం వివాదం కావడంలో ఆశ్చర్యం లేదు. అన్నింటా సిలబస్‍ కుదించాం కదా అన్న కేంద్రమంత్రి పోఖ్రియాల్‍ వాదన సరైందే కావొచ్చు. కానీ ఇతర సైన్స్ సబ్జెక్టులకూ, సామాజిక శాస్త్రాలకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. పరస్పరం సంఘర్షిస్తున్న సిద్ధాంతాలు, భావనలు సమాజంలో అనేకం ఉంటాయి. ఏకీభావం కుదిరే అంశాల్లో సైతం భిన్న దృక్పథాలుంటాయి. వాటిని గురించి చర్చించేవి, వివరించేవి, విద్యార్థికి అవగాహన కలిగించేవి సామాజిక శాస్త్రాలు. కనుక సహజంగానే ఆ శాస్త్రాల్లో తొలగించిన సిలబస్‍పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పలానా అంశం కాకుండా ఇదే ఎందుకు తొలగించవలసివచ్చిందన్న సంశయం వస్తుంది. ఆ తొలగింపు వెనకున్న ప్రయోజనాలేమిటన్న సందేహాలు మిగిలే ఉంటాయి.

విద్యారంగ నిపుణుల నుంచి ఎలాంటి అభ్యంతరం రాకుండా ఉండాలంటే సిబిఎస్‍ఈ అయినా, మరెవరైనా సిలబస్‍ తొలగింపు విషయంలో పారదర్శకంగా ఉండాలి. అసలు ఫలానా అంశం లేకపోయినా ఫర్వాలేదనో… తొలగించి తీరాలనో ఏ ప్రాతిపదికన నిర్ణయానికొచ్చారో, అందుకు అనుసరించిన విధానంలోని హేతుబద్ధత ఏమిటో చెప్పాల్సిన బాధ్యత సిబిఎస్‍ఈకి ఉంటుంది. సిబిఎస్‍ఈ తొలగించిన పాఠ్యాంశాలు చూస్తే ఆశ్చర్యం కలగడం సహజం. ఏ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకైనా తొలగించబడిన పాఠ్యాంశాలు అత్యంత ప్రాథమికమైనవి. మరోవిధంగా చెప్పాలంటే అవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు. ఈ అంశాల్లో సమాజం వైఖరి ఎలా ఉందన్నదాన్ని బట్టే ఆ సమాజం ప్రజాస్వామికమైనదా, కాదా అన్నది తేలుతుంది.

సామాజిక శాస్త్రాలు చదివే విద్యార్థులు ఆ అంశాల జోలికిపోకుండా ప్రజాస్వామ్యం గురించి ఏం అవగాహన చేసుకుంటారు? నిజానికి సామాజిక శాస్త్రాల అధ్యయనంతోనే విద్యార్థులకు సామాజిక, ఆర్థిక సమస్యలు అర్థమవుతాయి. తద్వారా రాజకీయ చైతన్యం పెరుగుతుంది. పన్నెండో తరగతి సిలబస్‍లో ‘ఇరుగు పొరుగుతో భారత్‍ సంబంధాలు’, ఆర్థిక సంస్కరణలతో ఆర్థికాభివృద్ధి, సామాజిక ఉద్యమాలు, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. తొలగించబడిన అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగేందుకు అనువుగా ఎన్‍సిఈఆర్‍టి రూపొందించిన ప్రత్యామ్నాయ విద్యా విషయక క్యాలెండర్‍లో పొందు పరిచారు గనుక ఆందోళన పడొద్దని సిబిఎస్‍ఈ వివరిస్తోంది. పాఠ్య ప్రణాళికలో ఈ అంశాలను లోతుగా అధ్యయనం చేయడం, చర్చించడం ఎలా సాధ్యం?

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో రెండవసారి ఎన్‍డిఎ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాని రెండో పాలనా శకం మొదలయినప్పటి నుంచి దేశంలో ప్రజాస్వామిక వాసనను మచ్చుకైనా లేకుండా చేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. మనది కేంద్రీకృత పాలన కాదు, సమాఖ్య వ్యవస్థ అని భ్రమింపచేసేందుకు వీలుగా అమలులో ఉంటూ వచ్చిన వాటిలో ఒకటె•న అమ్మకపు పన్నును కబళించి జిఎస్‍టి అనే కేంద్ర గుత్తాధిపత్య వ్యవస్థలో కలుపుకోవడం ఇందులో భాగమే. అప్పటి నుంచి రాష్ట్రాల వనరుల సమీకరణ వెసులుబాటు కుదించుకుపోయి జిఎస్‍టి వసూళ్లలో న్యాయమైన వాటా కోసం కేంద్రం వద్ద దేహీ అని అడుక్కునే స్థితిలోకి రాష్ట్రాలు నెట్టివేయబడ్డాయి. ఆ క్రమాన్ని సిబిఎస్‍ఇ విద్యార్థులు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం లేకుండా సిలబస్‍ కత్తిరింపు కాండను సిబిఎస్‍ఇ, ఎన్‍సిఇఆర్‍టి కమిటీలు విజయవంతంగా జరిపించేశాయి. మొత్తం ఫెడరల్‍ వ్యవస్థ లక్షణాల గురించి అవగాహన చేసుకునే అవకాశం లేకుండా చేశాయి. మాది ప్రజాస్వామ్య పాలన అని చెప్పుకొని గర్వించే దేశంలో ప్రజాస్వామిక హక్కులనేవి ఎంత ముఖ్యమైనవో, వ్యక్తి స్వేచ్ఛకు, గౌరవానికి, హుందాతనం కూడిన జీవన హక్కుకు హామీ ఇవ్వడంలో వాటి పాత్ర ఎంత గొప్పదో విద్యార్థులకు వివరించనక్కర లేదా?

ప్రాథమిక హక్కుల నుంచి సానుకూల వివక్ష (పాజిటివ్‍ డిసిక్రిమినేషన్‍)వరకు, పాలకుల ఉక్కు పాదాన్ని, పోలీసు దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి, ప్రశ్నించడానికి అవి ఎంతటి ప్రాతిపదికలుగా, ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయో తెలిసిందే. అటువంటి కీలకాంశాన్ని సిబిఎస్‍ఇ సిలబస్‍ నుంచి తొలగించారంటే మన కేంద్ర పాలకులు ప్రజాస్వామ్యం వెన్నెముకను ఎలా విరిచి వేయదలచారో అర్థం కాక మానదు. మత ప్రాతిపదిక పౌరసత్వ హక్కుకు అవకాశం కల్పిస్తూ పార్లమెంటు చేత చట్టం చేయించిన బీజేపీ పాలకులు మొత్తం పౌరసత్వ అంశాన్నే సిలబస్‍ నుంచి తొలగింపు చేయాలనుకోడంలోని దురుద్దేశం గురించి చెప్పనక్కర లేదు. ఈ కుదింపు ప్రధాని మోడీ ప్రభుత్వం స్థిరపరచబోయే భావి విద్యా వ్యవస్థ లక్షణాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయనడానికి సందేహించవలసిన పని లేదు. విమర్శకులు అంటున్నట్టు ఇది ముమ్మాటికీ విద్యావ్యవస్థను బిజెపి సైద్ధాంతిక భావజాలానికి అనుగుణంగా మార్చివేయబూనడమే తప్ప మరోటి కాదనేది స్పష్టం. కాకుంటే పాఠ్య ప్రణాళిక నుంచి వీటినే తొలగించడానికి కారణాలేమిటి? తొలగించి ఏం సాదిద్దామనుకున్నారు అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి. విద్యార్థులు చైతన్యవంతులు కాకుడదా? తొలగించిన పాఠాలు విద్యార్థులకు తెలియకుంటే ఇక తమ విధానాలకు తిరుగే ఉండదన్న నమ్మకమా? చరిత్ర పురోగమిస్తుంది. చరిత్ర పురోగమనానికి ప్రతిఘాత శక్తులు ఎవరన్నది ఈ పక్రియతో బట్టబయలు అయింది.

ఈ కరోనా కాలం కొత్త అనుభవాలను కలిగిస్తోంది. ఎన్నడూ ఊహించడానికి శక్యంకానివి కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఒకప్పుడు మోడరేషన్‍ కింద ఒకటి రెండు మార్కులు కలపాలంటే ఉద్యమాలు చేయాల్సివచ్చేది. కానీ ఇప్పుడు బడికి వెళ్లాల్సిన భారం లేకపోవడం, చదవకుండానే, పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం, ఇప్పటికే ఫెయిలై సప్లిమెంటరీ రాయవలసినవారు కూడా పైతరగతులకు అర్హులు కావడం వంటివన్నీ జరిగిపోతున్నాయి. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‍డిఎ ప్రభుత్వం ఉంది. గనుక, నిరుడు ఏప్రిల్‍లో కూడా సిబిఎస్‍ఈ కుల ఘర్షణలు, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి ఎదురయ్యే సవాళ్లు, భిన్నత్వం వంటి అంశాలు తొలగించింది. విద్యార్థులకు సిలబస్‍ భారాన్ని తోలగించాలనే పేరుతో అసలు ఆలోచించే భారాన్ని కుదించాలనుకోవడం మంచిది కాదు.

ముగింపు :
కొవిడ్‍ విపత్తును ఆసరాగా చేసుకొని రాజ్యాంగంలోని అధునిక విలువల్ని మార్చేందుకు ప్రయత్నించడం హిందూత్వ బ్రాహ్మణీయ ఫాసిస్టు భావజాలంలో భాగంగానే పాఠాంశాల కుదింపు జరిగిందన్నది అక్షర సత్యం. అధునిక విజ్ఞానం కంటే ప్రాచీన మతపరమైన పురాణాల్లోనే విజ్ఞానం ఉందని భావించే సంఘ్‍ పరివార్‍ శక్తులు, దాని భావజాల ప్రతినిధి అయిన రాజకీయ పార్టీ బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుండే విద్యావ్యవస్థలో మితవాద భావజాలాన్ని చొప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హిందూత్వ భావాజాలానికి అనుగుణ్యమైన నూతన విద్యావిధానాన్ని రూపొందించి అమలు చేయడానికి ఐదు సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వాలు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. త్వరలోనే కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణలతో కూడిన నూతన విద్యా విధానం బిల్లు కెబినెట్‍ ముందుకు వెళ్లనుంది.

దేశ ప్రజల బాగోగులు పట్టించుకోని పాలకులు పిల్లలను ఆలోచనపరులుగా, విజ్ఞానులుగా మలవాలని ఎలా అనుకుంటారు? మతగ్రంథాలు, పురాణాల్లో అన్ని ఉన్నాయనే భావన కలిగిన ఏలికలు వైజ్ఞానిక సమాచారానికీ, సాంకేతిక నిపుణతకు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తారు. ఈ ఆలోచనే లేనివారికి ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగంపై ఎందుకు గౌరవం ఉంటుంది? సైన్స్ను, మానవీయ విలువలను అందిపుచ్చుకున్న మనిషే వికాసం వైపు పరుగులు పెడతాడని మత చాంధసులు ఎలా విశ్వసిస్తారు? ‘మతం మత్తుమందు లాంటిది అంటారు’ మార్కస్. మతం మనిషిని మూర్ఖుణ్ణి చేస్తుంది. మూర్ఖత్వాన్ని వ్యాప్తిచేస్తుంది. ఎవరైనా ఆ మూర్ఖత్వాన్ని ప్రశ్నిస్తే అసహనంతో పెట్రేగిపోతుంది. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నదదే.

బీజేపీ మన దేశ బహుళ సంస్కృతులను తిరస్కరిస్తోంది. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే సంస్కృతి, ఒకే పన్ను, ఒకే మార్కెట్‍, ఒకే జాతి అదే హిందూ జాతి అన్నది ఆర్‍ఎస్‍ఎస్‍ భావజాలం. అంతిమంగా హిందూ రాష్ట్ర నిర్మాణమే వారి ధ్యేయం. అందుకే విద్యార్థులకు మేలు చేసే పేరుతో రాజ్యాంగపరమైన అంశాలను సిలబస్‍ నుండే కాదు, భావితరాల మస్తిష్కాల నుండే తొలగించే కుట్ర ఇది! ఈ చర్య వెనుక ప్రజలను చీల్చి, అసహనం పెంచి, మతతత్వ, నిరంకుశ భావజాలాన్ని పంచే సంఘ్‍పరివార్‍ శక్తులున్నాయి. ప్రజలను మత ప్రాతిపదికగా చీల్చి, మతతత్వ, నిరంకుశ భావజాలాన్ని పెంచడమే దీని ఉద్దేశం. సైన్సు అనునిత్యం ప్రశ్నను ఆహ్వానిస్తుంది. మతమేదైనా ప్రశ్నించడాన్ని సహించదు. కాబట్టి మేధావులు, ప్రజాతంత్ర శక్తులు, లౌకికవాదులు ఐక్యమై ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతిఘటించాలి. ప్రజాస్వామ్యాన్ని భావిభారతాన్ని పరిరక్షించుకోవాలి. అందుకు భావి భారతాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు సన్నద్ధం కావాలి

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply