చైనాలో కరోనావైరస్ తన ప్రతాపం మొదలుపెట్టినప్పటి నుండే మా ఇంట్లో దాని ప్రస్తావన, దిగులు మొదలయ్యింది. ఎందుకంటే ఐదేండ్ల కిందట మా ఇంటి పక్కనే వుండిపోయిన ఒక చైనీస్ కుటుంబంతో కొనసాగుతున్న స్నేహం, అందులోను ఆ భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లు కావడం, వాళ్ళు కరోనావైరస్ విజృంభించిన రాష్ట్రంలో వుండటం. ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి (ఆంజుల) మా పిల్లలకు మంచి స్నేహితురాలు. ఇక్కడినుండి వెళ్ళిపోయి ఐదేండ్లు అయినా కూడా వాళ్ళు వీడియో కాల్స్ ద్వారా ఇంకా ఆ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. కరోనావైరస్ వార్తలు వినగానే పిల్లలు ఆంజులతో మాట్లాడారు. అప్పటికే వాళ్ళ స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. నేను కూడా ఆంజుల నాన్నతో కొద్దిసేపు మాట్లాడాను. అతను ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను చూసే పల్మోనాలజిస్ట్. కరోనావైరస్ దాడి చేసే అవయవాలలో ఊపిరితిత్తులు ప్రధానమైనవి. అతను విరామం లేకుండా పనిచేస్తున్నాడు. మూడు, నాలుగు రోజులకు ఒక్కసారి ఇంటికి వస్తున్నాడు. ఆ రోజుకు వాళ్ళ ఒక్క హాస్పిటల్లోనే డెబ్భై మంది చనిపోయారని చెప్పాడు. పరిస్థితి చాలా దారుణంగా వుంది, అయినా అందరం కష్టపడుతున్నామని అన్నాడు. ఎప్పుడు చలాకీగా మాట్లాడే అతని గొంతు బాగా అలిసిపోయినట్లు, చాలా పెద్ద బాధ్యతను మోస్తున్నట్లు గంభీరంగా పలికింది. చాలా అలసటగా కనిపించాడు. అతని భార్య చిన్నపిల్లల వైద్యురాలు. మామూలుగా అయితే తప్పకుండ మాతో మాట్లాడే ఆవిడ క్షణం తీరిక లేకుండ పనిచేస్తుంది. కనీసం ఫోన్ దగ్గరికి కూడా రాలేదు. ఆంజులను ఇంట్లో చూసుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ వుంది. ఇంట్లోనుండి బయటికి వెళ్లక చాలా రోజులు అవుతుందేమో ఆంజుల పిల్లలతో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడింది. అప్పటికే వాళ్ళకు మధ్యరాత్రి అవ్వడంతో అయిష్టంగానే “బాయ్” చెప్పింది. ఆ తర్వాత చైనా పరిస్థితి గురించి పిల్లలు భయపడకూడదని దాని గురించి వాళ్ళతో చాలా సేపు మాట్లాడినం. అయినా కూడా వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. ఎంతైనా పిల్లలు కదా.
ఆ రోజంతా మమ్ముల కరోనావైరస్ ఆవహించేవుంది. ఆ రాత్రి పడుకోని లేవగానే మా బిడ్డ అక్షర “డాడీ నాకు రాత్రి ఒక కల వచ్చింది చెప్పాలా?” అన్నది. “చెప్పు తల్లీ” అన్నాను. తను చెప్పడం మొదలు పెట్టింది. “నాకు, అన్నకు ఆంజుల మీద దిగులు పట్టుకుంది. అసలు చైనాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనిపించింది. అలాగే వాళ్ళకు ఏమైనా చెయ్యగలమా అని ఆలోచించినం. చైనాకు పోవాలని డిసైడ్ చేసుకున్నం. మనం నలుగురం మనిషికి ఐదు బ్యాగుల చొప్పున ఇరవై బ్యాగుల నిండా మాస్కులు, హ్యాండ్ సానిటైజర్, తినే పదార్థాలు తీసుకోని పోయినం. అక్కడికి పోయిన తర్వాత నేను అంజుల ఇంటి చుట్టూ మాస్క్ వేసుకోని మొత్తం తిరిగి చూసిన. ఎక్కడా కరోనావైరస్ కనపడలేదు. బహుశా కేవలం రాత్రి పూటనే అది కనబడుతదేమో అని టార్చ్ లైట్ వేసుకోని రాత్రి కూడ తిరిగిన. కరోనావైరస్ కనబడలేదు. కాని దాని బదులు మరొకటి కనబడింది. అది కరోనా దయ్యం. అందరు ఇన్ని రోజులు అది వైరస్ అని భయపడ్డారు కాని. అది నిజానికి దయ్యం. అది పోయినంత దూరం అందరు అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఊపిరి ఆడక చనిపోతున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. దయ్యం మీద కోపం వచ్చింది. నా దగ్గర వున్న లేజర్ లైట్ తో దాన్ని కొట్టాను. అంతే అక్కడే పడి చనిపోయింది. అందరూ చాలా హ్యాప్పీ ఫీల్ అయ్యారు. అందరూ నన్ను మెచ్చుకున్నరు. అమ్మ, అన్న, నువ్వు నన్ను ఎత్తుకోని ముద్దులు పెట్టినరు. అంజుల మాత్రం చాలా విచారంగ కూర్చుండి పోయింది. ఎందుకో తెలుసా?! తెళ్ళారి నుండి స్కూల్ కి పోవాలి కదా అని.” తన కలంతా చెప్పి ఎంతో గర్వంగ ఫీల్ అయ్యింది అక్షర. కల చివరిలో అంజుల పరిస్థితి గుర్తుచేసుకొని ముసిముసి నవ్వుకుంది.
పిల్లల ప్రపంచం ఎంత విచిత్రంగ వుంటుంది కదా. ఎంత సంక్లిష్టమైన సమస్యకైనా సులభమైన సమధానాలు ఉంటాయి. ఎంత దుర్భల స్థితిలో సహితం మానవీయ ఆలోచనలు ఉంటాయి. నిరాశను తుదిముట్టించే ఆశలు చిగురిస్తుంటాయి.
తన కల మొత్తం విన్న తర్వాత “దయ్యాలు ఉండవు కదా, చిట్టితల్లి” అన్నాను. తను వెంటనే “నేను చెప్పింది నిజ జీవితం అనుకున్నావా డాడీ? అది నా కల” అన్నది. ఆ క్షణానికి “కల నిజమైతె బాగుండు” అని అనుకున్నాను కాని అక్షరకు చెప్పలేదు.
ఈ కథలు పిల్లలు చెబితె బాగుంటుంది. కాని పాలకులు చట్టసభల్లోనే నిసిగ్గుగా కరోనావైరస్, దాని బాధితుల మీదా కామెడీ చేస్తుంటే వినడానికి చాలా అసహ్యంగ ఉంటుంది. నలుగురు నవ్వుతున్నారు కదా అని కౄరమైన హాస్యం చేయడం అనాగరికం. అమానవీయం.
ఇక కరోనావైరస్ విషయానికొస్తే దానికి సంబంధించిన పూర్తి పరిశోధన 1960ల లోనే జరిగింది. కిరీటం రూపంలో ఈ వైరస్ వుండటంతో “కరోన” అని పేరు పెట్టారు. ఆ వైరస్ ను నాలుగు రకాలుగా వర్గీకరించారు: ఆల్ఫా కరోనావైరస్, బీటా కరోనావైరస్, గామా కరోనావైరస్, డెల్టా కరోనావైరస్. ఇందులో మొదటి రెండు కేవలం క్షీరదాలనే (మనుషులు, పందులు, గబ్బిలాల మొదలినవి) ఇన్ఫెక్ట్ చేస్తాయి. గామా కరోనావైరస్ కోళ్ళలాంటి పక్షులను మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తుంది. డెల్టా కరోనావైరస్ క్షీరదాలను, పక్షులను ఇన్ఫెక్ట్ చేస్తుంది. కరోనావైరస్ ఎప్పటినుండో మనుషులను ఇన్ఫెక్ట్ చేస్తుంది. దాని మూలంగ తేలికపాటి అస్వస్థతకు గురయ్యేవాళ్ళు. కేవలం జ్వరం, దగ్గులు, తుమ్ములతో తగ్గిపోయేది.
కాని మొదటి సారిగా 2002 లో కొత్త రకం కరోనావైరస్ [Severe Acute Respiratory Syndrome, (SARS)] చైనాలో మొదలై 26 దేశాలకు వ్యాపించి 8000 ల మందిని పైగా ఇన్ఫెక్ట్ చేసి దాదాపు 800 మందిని చంపించింది. మరలా 2012లో సౌదీ అరేబియాలో మొదలై 27 దేశాలలో 2500 మందికి సోకి దాదపు 860 మందిని చంపింది. దీనిని Middle East Respiratory Sydrome (MERS) అని పిలిచారు. ఎందుకంటె దాని ప్రభావం ఎక్కువగా మిడిల్ ఈస్ట్ లోనె ఉండింది.
మరలా డిసెంబర్ 2019లో చైనాలోని Hubei రాష్ట్రంలో కోటి మంది నివసించే పోర్ట్ సిటీ యూహాన్ లో మరో కొత్త రూపంలో బయటపడింది. కొత్త రోగమయ్యింది: COronaVIrus Disease 2019 (COVID -19). ఈసారి అక్కడ ఫుడ్ మార్కెట్ లో అమ్మే పాముల నుండో, గబ్బిలాల నుండో వచ్చి వుండొచ్చు అని ఒక అంచన. ఇప్పుడు వాళ్ళు తినే తిండిని తిట్టుకుంటె వచ్చే ప్రయోజనం ఏమి వుండదు. అయితే ఈసారి వచ్చిన ఈ కొత్త వైరస్ స్వభావం గురించి శాస్త్రవేత్తలు ఇంకా ఒక అంచనాకి రాలేదు. ఇది కొత్తది కాబట్టి దాని ప్రభావాన్ని తట్టుకునే శక్తి ఎవ్వరికి లేదు. హోదా, స్థాయితో పనిలేదు. అమెరికా అధ్యక్షుడైనా అడ్డా మీది కూలీ అయినా దానికి తేడా లేదు. అజాగ్రత్తగా ఉంటే ఎవ్వరికైన సోకుతుంది. వైరస్ సోకినోళ్ళ “సన్నాసి, దరిద్రుడు” అని షేమింగ్ చేయడం అనాగరికం. ఆజ్ఞానం. మనకు చైనా నుండి అన్ని వస్తువులు తక్కువకు కావాలి, కాని వాళ్ళ వైరస్ వాళ్ళ దగ్గరే ఉండాలంటే కుదురదు. అది “అక్కడ పుట్టి కాలబెట్టినా” దానికి చైనా దేశపు పౌరసత్వం లేదు. మన దగ్గరకి రావాలంటే పాస్ పోర్ట్, వీసా అవసరంలేదు. కాసింత ఇంగితంతో ఆలోచిస్తే ఈ విషయం అర్థం కానిది కాదు.
కొన్ని శాస్త్రీయమైన మాటలు మనకు తెల్వకుండనే మన వాడుకలోకి వచ్చి పడుతాయి. ఒక సోషియాలజిస్ట్ గా నాకు ప్రపంచీకరణ అనే పదం అలాగే నిత్యపదమయ్యింది. ఒకరోజు నా పదకొండేళ్ళ కొడుకుతో మాట్లాడుతూ “ప్రపంచీకరణ” అనే పదం వాడాను. వాడు వెంటనే “అదేంటిది” అని అడిగాడు. పాఠం చెప్పేటప్పుడైతె పెద్ద పెద్ద విషయాలు చెప్పి అర్థం చేయించొచ్చు. “వీడికి ఎట్లా చెప్పాలి” అనుకుంటూ వాడి గదిలోకి పోయి తన బట్టలు, పుస్తకాలు, బొమ్మలు ఎక్కడెక్కడ తయారయ్యాయో ఒక లిస్ట్ వేసుకొని రమ్మన్నాను. ఒక పది-పదిహేను నిమిషాలలో మొత్తం లిస్ట్ వేసుకొచ్చాడు. అందులో పది దేశాల పేర్లు వున్నాయి. ఎక్కువ శాతం చైనా నుండే వున్నాయి. నేను పెద్దగా చెప్పకుండానే తాను ప్రపంచీకరణలో ఒక వినియోయదారుడిగా ఎట్ల భాగమయ్యిండో అర్థమయింది. చైనాలో కరోనావైరస్ వ్యాప్తి మొదలయ్యింది అనగానే మావాడు “మన దగ్గరికి కూడా త్వరలో వస్తుంది” అన్నాడు ఎందుకంటె ప్రపంచీకరణ ఆలోచన వచ్చింది కాబట్టి. ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 20 శాతం చైనాలోనే జరుగుతుంది. 70 శాతం మొబైల్ ఫోన్స్, 80 శాతం ఎయిర్ కండీషనర్స్, 80% శాతం షూ, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇన్ని పుట్టుకొచ్చే చోట కొత్త వైరస్ లు పుట్టుకు రావడం ఆశ్చర్యం ఏమి కాదు. అవి ప్రపంచం మీదికి ఎగపాకడం అంతకన్నా ఆశ్చర్యం కాదు. ఈ కొత్త వైరస్ తో మార్చ్ 15 నాటికి 146 దేశాలలో 1,65,000 మందికి సోకి 6,065 మంది చనిపోయారు.
ఈ కొత్త వైరస్ గాలితో కాని, నీళ్ళతో కాని, లేక దోమలతో కాని వ్యాప్తి చెందదు. వైరస్ సోకిన వ్యక్తులు దగ్గడం, తుమ్మడంతో వచ్చే తుంపర్లు మరో వ్యక్తి మీద పడినప్పుడో లేదా ఆ తుంపర్లు పడిన చోట వేరే వ్యక్తి ముట్టుకోని ఆ చేతిని ముక్కు, నోరు, కండ్ల దగ్గర పెట్టుకుంటే ఆ వైరస్ సోకే అవకాశం వుంటుంది. The New England Journal of Medine ప్రకారం ఆ వైరస్ మనిషి బయట 24 గంటల నుండి 72 గంటల వరకు బతికేవుంటుంది. ఆలోపు ఎవరికైనా అది సోకవచ్చు. అది ఒక్కసారి మనిషి లోపలికి వెళ్ళిన తర్వాత 2 నుండి 14 రోజులలో ఎప్పుడైనా COVID-19 రోగ లక్షణాలు (పొడి దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం, కొందరికి విరోచనాలు, చలితో వణికిపోవడం) బయటపడుతాయి. కొత్తగా వస్తున్న నిర్థారణల ప్రకారం రోగికి వ్యాధి లక్షణాలు తెలువక ముందునుండే మరొకరికి ఆ వైరస్ ను అంటించే అవకాశం వుందని డాక్టర్స్ చెబుతున్నారు. కాబట్టి ఎవ్వరికి సోకిందో, ఎవ్వరికి వ్యాపిస్తుందో తెలువని పరిస్థితి.
అయితే వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉన్నప్పటికి దాని మూలంగా అరవై సంవత్సరాలు దాటి వేరే ఆరోగ్య సమస్యలు (గుండె సంబంధిత రోగాలు, క్యాన్సర్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు) ఉన్నవారికి ప్రమాదం ఎక్కువని ఇప్పటి వరకు వచ్చిన పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా తొమ్మిది ఏండ్ల లోపున్న పిల్లలకు వ్యాధి సోకినా ఇంతవరకు ఒక్కరు కూడా చనిపోలేదు. పది నుండి ఇరవై సంవత్సరాల లోపు వున్న వాళ్ళు 0.2 శాతమే చనిపోయారు. అలాగే నలభై ఏండ్ల లోపున్న వాళ్ళు కూడా. అలా అని నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకంటే ఈ వైరస్ రేపు రేపు ఎలా మారనుందో ఎవ్వరికి తెలియదు. ఇప్పటికే తన రెండో రకం (strain) తయ్యారయిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అంతకుమించి అరవై ఏండ్లకు పైబడిన జనాభాను, ఇతర వ్యాధులతో వున్న వాళ్ళను కాపాడుకోవడానికి ఈ వైరస్ వ్యాప్తిని ఆపాలి. దానికి మనిషికి మనిషికి మధ్య ఆరు అడుగుల దూరం వుండే విధంగా చూసుకోవాలని చెబుతున్నారు. దీనిని “social distance” అని పిలుస్తున్నారు. పద్దతి బాగానే వుంది కాని ఆ పేరే బాగలేదు. కావాల్సింది physical distance మాత్రమే social distance కాదు. ఈ క్లిష్ట కాలంలో మనుషుల మధ్య సామాజిక దూరం తగ్గాలి. ఒకరికొకరు తగు జాగ్రత్తలతో సహాయం చేసుకునే పరిస్థితి వుండాలి.
చైనాలో ఈ రోజుకి 80,000 మందికి వైరస్ సోకి 3,199 మంది చనిపోయినా ఆ వైరస్ ను కట్టడి చేయడంలో కొంత విజయం సాధించారనే చెప్పాలి. కొత్తగా వైరస్ సోకే కేసులు పదిలోపే పడిపోయాయి. వాళ్ళు ఆ పని చేయగలగడానికి ముఖ్య కారణం వాళ్ళు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు. అసందర్భమైన మాటయినా ఇది “ప్రజా యుద్ధం” అని చైనా నాయకత్వం ప్రకటించింది. పట్టణాలకు పట్టణాలు మొత్తంగా మూసేశారు. రవాణా స్తంభించి పోయింది. పది రోజుల్లో వేల పడకలుండే రెండు ఆసుపత్రులు నిర్మించారు. వేలాది డాక్టర్లను, ఇతర హెల్త్ కేర్ వర్కర్లను దేశం మొత్తం నుండి కదిలించారు. ఎవ్వరి ఇండ్లళ్ళో వాళ్ళు దాదాపు 40-50 రోజులు వుండిపోయారు. అవసరానికి మందులు సరఫరా చేయడానికి లక్షలాది వాలంటీర్లు రంగంలోకి దిగారు. ఎవ్వరి కమ్యునిటీలో వారికి కూరగాయలు, నిత్య అవసరాలు తీర్చడానికి కొన్ని మొబైల్ షాపులు, కమ్యునిటీ షాపులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడ ధర పెరగకుండ చూడగలిగారు. మొత్తం జనాభా ఆరోగ్యం, వాళ్ళ కదలికలు మానిటరింగ్ చేసే విధంగా ప్రభుత్వమే ఒక ఆప్ ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ప్రజలందరు తమ ఆరోగ్య విషయాలు ఆ ఆప్ లోకి ఎంటర్ చేయాల్సి వుంటుంది. రోజుల కొద్ది ఇంట్లోనే వుండలేక ఎవరైనా బయటకు పోతారేమో అని ప్రతి అపార్ట్మెంట్ కు ఒక గార్డ్ ను పెట్టింది. అలాగే ప్రతి కమ్యునిటీలో వాలంటీర్లు కూడా ప్రజలు బయటకు రాకుండ కాపలా కాశారు. నిజమే, వ్యక్తి స్వేచ్ఛ, హక్కులు దెబ్బతిని వుంటాయి. కాని అక్కడ మరో మార్గం లేదు. లేదంటే మహావిపత్తు జరిగే ప్రమాదం వుంది. ప్రజలు చేసింది ఒక ఎత్తు అయితే, హెల్త్ కేర్ వర్కర్లు చేసిన కృషి మరో ఎత్తు. రోజుల తరబడి హాస్పిటల్స్ లోనే నిద్రాహారాలు మాని పనిచేశారు. ఎంతోమంది విపరీతమైన ఒత్తిడి మూలంగా వున్నపలంగా కుప్పకూలి చనిపోయారు. తీవ్ర మానసిక వ్యధ అనుభవించారు. అందులో మహిళల పరిస్థితి మరీ దారుణం. వీటికి తోడు వైరస్ సోకి డజన్లలో చనిపోయారు. ఇది మరే దేశంలో నైనా సాధ్యమవుతుందా? కాదని ఇప్పటికే తేలిపోయింది.
ఇప్పుడు విజృంభిస్తున్న వైరస్ సరిగ్గా వంద సంవత్సారాల కింద (1918-1920) ప్రపంచవ్యాప్తంగా సోకిన స్పానిష్ ఫ్లూ తో పోల్చదగినదని మెడికల్ హిస్టారియన్స్ అభిప్రాయపడుతున్నారు. స్పానిష్ ఫ్లూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మందికి సోకి తక్కువల తక్కువ 5 కోట్ల మంది చనిపోయారు. ఒక్క అమెరికాలోనే 6,75,000 మంది చనిపోయారు. అప్పటి శాస్త్రీయ పరిజ్ణానానికి అంత నష్టం జరిగిందంటే ఒక అర్థం వుంది, మరి ఇప్పుడున్న పరిస్థితికి వంద ఏండ్ల క్రిందటి దానితో పోలికేంటి అనేది సర్వసాధారణంగా వచ్చే ప్రశ్న. అది ప్రకృతి విధ్వంసం. ఇది పెట్టుబడిదారి మార్కెట్ విధ్వంసం.
అగ్రరాజ్యమని విర్రవీగే అమెరికాలోనే రాబోయే పరిస్థితులను తట్టుకునే స్థితి లేదు. ఇప్పటికీ కనీసం వ్యాధి సోకిందా లేదా అని తెలుసుకోవడానికి చెసే మెడికల్ కిట్స్ కావాల్సినన్ని లేవు. సౌత్ కొరియ లాంటి దేశాలు రోజుకు 15 వేల పరీక్షలు చేస్తుంటె అమెరికాలో ఇంతవరకు మొత్తంగా నెల రోజులుగా అన్ని టెస్టులు చెయ్యలేదు. వారం రోజుల్లోనే వైరస్ ను తుదిముట్టిస్తామని వైట్ హౌజ్ సాక్షిగా ట్రంప్ చెప్పిన వారానికే మూడు వేల కేసులు బయటపడ్డాయి. ఇంకా రాబోయే రోజుల్లో వేలల్లో కేసులు బయటపడుతాయి ఎందుకంటే ఇంకా టెస్టులు అంతగా అందుబాటులోకి రాలేదు కాబట్టి. The John Hopkins Center for Health Security అంచనాల ప్రకారం 3.8 కోట్ల మంది అమెరికన్స్ కు వైరస్ సోకే అవకాశం వుంది. అందులో దాదాపు ఒక కోటి మంది హాస్పిటల్ లో చేరాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బెడ్ కు పదిహేడు మంది పోటీ పడాల్సివస్తుంది. అందులో మూడో వంతుకు ICU ట్రీట్ మెంట్ అవసరం అవుతుంది. దానిని తట్టుకునే సామర్ధ్యం అమెరికాకు లేదు. ఇటువంటి స్థితిలో మరణాలు లక్షల్లో వుండొచ్చు అన్నది అంచన.
ఈ లెక్కలు తప్పు అని అనిపించే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. చాలా హాస్పిటల్స్ లో వారానికి సరిపడే మాస్కులు, వెంటిలేటర్లు, ఇతర కనీస అవసరాలు లేవు. అన్నీ వున్నా వైద్యానికి సరిపడే హెల్త్ కేర్ వర్కర్లు లేరు. ఈ పరిస్థితి రావడానికి అమెరికా లో కనుమరుగైన ప్రభుత్వరంగ వైద్యం, దానికి సహకరించే పరిశోధన. ఇప్పుడు ఆపద వచ్చిందని యాభై బిలియన్లు కుమ్మరిస్తే రాత్రికిరాత్రి వాక్సిన్ పుట్టుకురాదు. దానికి సంబంధించిన ప్రాధమిక పరిశోధన వనరులను అన్నింటిని లేకుండ చేసి మార్కెట్ లో విలువుండే పరిశోధనలే ప్రైవేట్ రంగంలో ప్రోత్సహించి ఇప్పుడు మోకాళ్ళ మీద కూలబడి ప్రభువా అంటే ఏమి లాభం. ఇప్పుడు రోడ్ల మీద అందరు సోషలిస్టుల్లాగే మాట్లాడుతున్నరు. ప్రభుత్వం ఏమి చేస్తలేదని ఎదలు బాదుకుంటుండ్రు . ఏమి లాభం. మొన్నటికి మొన్న శాత్రవేత్తలు మాకు రీసర్చ్ కు ఫండ్స్ కావాలని రోడ్లు ఎక్కితే పౌరసమాజం నవ్వుకుంది. ఇప్పుడు వాళ్ళకు మిగిలింది ట్రంప్ చెప్పే అబద్ధాలే. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాన్ హాప్ కిన్స్ మెడికల్ స్కూల్ లో ఒక సంక్షోభ సందర్భంలో నాయకులు ఎలా ప్రజలతో మాట్లాడాలి అనే అంశం మీద ఒక కోర్స్ చెప్తారు. ఇప్పుడు ఆ కోర్స్ లో “ఎలా మాట్లాడ కూడదో” అని ట్రంప్ ఉదాహరణగ చెబుతున్నారు. వాళ్ళకు మన తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన కామెడీ వ్యాఖ్యలు కూడా బాగా ఉపయోగపడుతుండొచ్చు.
ఇది ఒక అగ్రరాజ్య పరిస్థితి. ఇక “మాదేశంలో అన్నీ చక్కగా వున్నాయి, మోడీ లాంటి ఉక్కు మనిషి ప్రధానిగా వున్నాడు, వీటన్నింటికి తోడు గోవు మల మూత్రాలు అండగా వున్నాయి” అంటూ నిర్లక్ష్యం చేస్తే ఊహించని జన నష్టం జరుగుతుంది. వీలయినన్ని జాగ్రత్తలు తీసుకోని ఈ విపత్తు నుండి సామూహికంగా బయటపడాల్సిందే. మంత్రాలకు, బాబాల మాటలకు లోకల్ చింతకాయలే రాలవు, ఇక చైనాలో పుట్టిన వైరస్ వింటుందా. అజ్ఞాన, అశాస్త్రీయ పోకడలను ఎండకడుతూ శాస్త్రీయంగా ఈ వైరస్ మీద ప్రజలు పోరాడి గెలుస్తారని ఆశిద్దాం.
Very good article.
Can imagine the thought process behind every word.
Thanks, Sreekanth!
Nice article… contemporary and thought provoking
Comprehensive, practical information. Man’s helplessness correctly said.