సర్వసాధారణమనిపించే అంశం ప్రపంచంలో ఏదైనా ఉన్నదా అంటే అది “మరణం” అని చెప్పొచ్చు. ప్రమాదాలు, రోగాలు, హత్యలు వంటి కారణంగా సంభవించిన మరణాల్లో కొంత ప్రత్యేకత ఉంటుందేమో గాని కాలం తీరి మనిషి చనిపోవడం కంటే సహజమైన విషయం ఏమిటుంటుంది? “కనకమ్మ చచ్చింది, చచ్చి స్వర్గానికి వెళ్లింది” అని కథ మొదలుపెడతారు. అతి సాధారణమైన సంఘటనను తీసుకుని, అతి మౌలికమైన ప్రశ్నల వైపు మనని నడిపించడమే ఈ కథలోని ప్రత్యేకత. స్వర్గం అంటే ఒక్కో మతం, ఒక్కో సంస్కృతి ఒక్కోలా వర్ణిస్తుందేమో కానీ భూమ్మీద గడిచిన జీవితానికి కొనసాగింపుగానూ, పర్యవసానంగానూ స్వర్గవాసం ఉంటుందని మాత్రం దాదాపు అన్నీ మతాలూ రూఢిగా చెప్తాయి.
చనిపోయిన కనకమ్మకు దొరికిన ఆదరణ చూస్తే, నాకు 1859లో వచ్చిన ‘రెండు మహానగరాలు’, దానిలోని డాక్టర్ మానెట్ పాత్ర గుర్తొచ్చింది. ఫ్రెంచి విప్లవం – బాక్‌డ్రాప్‌గా ఛార్లెస్ డికెన్స్ రాసిన నవల అది. రాజకుటుంబీకుల నేరాలకు సాక్షి అయినందుకు డాక్టర్ అలెగ్జాండర్ మానెట్‌ని ఫ్రాన్స్‌లోని బాస్టిల్ కారాగారంలో రహస్యంగా బంధిస్తారు. ఏమి హింసలు పడతాడో గాని, పిచ్చివాడిలా మారతాడు. అతను బ్రతికున్న సంగతి కూడా బయట ప్రపంచానికి తెలియదు. 18 సంవత్సరాల తర్వాత ఎలాగో తెలుసుకుని, కూతురు అతన్ని బయటకి తీసుకువచ్చి ఇంగ్లాండ్ తీసుకువెళుతుంది. నెమ్మదిగా కోలుకుని చాలా కాలానికి మనుషుల్లో పడతాడు. కొంతకాలానికి ఆ కూతురి భర్త పనిమీద ఫ్రాన్స్ వెళతాడు. అప్పటికి విప్లవం తారాస్థాయిలో ఉంటుంది. ఒక రాజవంశీకుడన్న కారణంగా మానెట్ అల్లుడిని బంధిస్తారు. కూతురితో కలిసి అతన్ని విడిపించడానికి మానెట్ తిరిగి ఫ్రాన్స్ వెళతాడు. బాస్టిల్ జైలులో ఉండి, హింసలు అనుభవించిన అతన్ని ఎంతో గౌరవంగా చూస్తారు. అక్కడ అతని పలుకుబడి అంతా ఇంతా కాదు. అంత వరకూ కూతురి సంరక్షణలో అతి దీనంగా, నిస్సహాయంగా ఉన్న మనిషి ఒక్క సారిగా మారిపోతాడు. మహా చురుకుగా అల్లుడి విడుదల కోసం ప్రయత్నాలు సాగిస్తాడు.
“భూలోకంలో అన్ని రకాల యీతిబాధలకూ లోనై, ఒక్క క్షణం కూడా సుఖమన్నది ఎరగని ప్రాణులకు అక్కడ ఉత్తమ స్థానం లభిస్తుంది. ఇది అందరూ అనుకునే మాట.” ఈ విశ్వాసం ప్రాతిపదికన మన కథ నడుస్తుంది.అన్యాయంగా కష్టాలు అనుభవించిన వారికి ఎప్పుడో ఒకప్పుడు మంచిరోజులొస్తాయని, అప్పుడు అంతకంతా సుఖపడతారని – మనుషులకి ఎక్కడో ఒక చిన్న నమ్మకం. ఒకవేళ చనిపోయేలోగా ఆ సుఖం దొరక్కపోతే – చనిపోయాకైనా సరే దొరుకుతుందని నమ్ముతారు. అలాగే కనకమ్మ పడ్డ కష్టాలకి పరిహారంగా స్వర్గవాసం దొరుకుతుంది. రష్యన్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ కష్టజీవులకి స్వర్గం అని ప్రపంచం ఎంతో ఆశ పడింది. దానిని ప్రతిఫలిస్తూ, 1948లో వచ్చిన ఈ కథలో – స్వర్గాన్ని సోవియట్ తో పోలుస్తారు కొకు. మానెట్‌కి ఫ్రెంచి విప్లవం వల్ల దశ తిరిగితే, కనకమ్మకి సోవియట్ స్వర్గం దొరికిందనుకున్నాను.
అయితే సోవియట్ యూనియన్ పరిపాలనా వ్యవస్థ మీద అప్పటికే అనుమానాలు కలిగి ఉంటాయి, అందుకే దానిలో ‘మడత పేచీ’లున్నాయి అంటారు కొకు. కనకమ్మకి న్యాయం చెయ్యడం మాత్రమే విచారణ లక్ష్యం కాదు, ఆ కేసును విడ్డూరంగా చూపించి, ఆ వంకన సెన్సేషన్ సృష్టించి ప్రజల దృష్టిని ఆకర్షించడం కూడా వారి ఉద్దేశం అని సూచిస్తారు. ఆ పేచీలేమిటో మనకి ఇలా వివరిస్తారు:
“కనకమ్మ కేసులో మొదటి భాగమంతా (ఉన్న రికార్డులు కోర్టులో చదవడం) పత్రికల ద్వారా అదివరకే స్వర్గ వాసులు తెలుసుకుని ఉన్నారు. అయినా ప్లీడరుగారు మూడు నాలుగు స్వర్గమాసాలు ఈ రికార్డు పఠనంతోనే సరిపుచ్చాడు. స్వర్గ వాసులు యీ విచారణ చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. రహస్యమేమిటంటే స్వర్గంలో పరిస్థితులేమీ బాగాలేవు. రాజకీయాందోళన జాస్తిగా ఉంది. ప్రజల దృష్టిని రాజకీయాల మీద నుంచి మరల్చటానికి పత్రికలు ఈ కేసు గురించి మరింతగా రాసినై. విచారణ కూడా సాధ్యమైనంతగా పొడిగంచవలసిందిగా ప్రభుత్వం ఉత్తరువు చేసినట్టు ఒక వదంతి పొక్కింది.
“ఎగ్జిక్యూటివుకు జూడిషియరీ ఇంత లోకువైతే ఇంకేం డెమోక్రసీ?” – కథలో అక్కడక్కడా చేసే ఇలాటి వ్యాఖ్యానాల వల్ల ఇది ఏదో ఊహాజనితమైన స్తలం కాదని, స్తల కాలాదులతో సహా గుర్తు పట్టగలిగే వ్యవస్తేనని మనకు నిస్సందేహంగా తెలుస్తుంది. భవిష్యత్తును సూచిస్తున్నాయనిపించే వాక్యాలు కూడా ఉన్నాయి. – “ఎబ్బే, ఇది స్వర్గమే కాదు. నువ్విప్పుడు స్వర్గం పొలిమేరలోనే లేవింకా!” – ప్రపంచం అనుకుందే తప్ప ‘శ్రామికుల స్వర్గం’ అనే భావపు అంచులను కూడా సోవియట్ ఇంకా తాకలేదన్న ధ్వని ఉందా వాక్యంలో. “గ్రహాలలో మాకు నమ్మకం లేదు. ఉంటే ఈ స్వర్గమే ఉండదు. పుణ్య పాపాలన్నీ మనిషివే అనే ఉద్దేశంతో స్వర్గనరకాలు ఏర్పడ్డాయి” అనే ప్లీడరుగారి మాటలు అంతా విధిలిఖితం అనే వాదనకీ స్వర్గ భావనకీ మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఎత్తి చూపిస్తాయి.
***
ఏదో పాపం స్వర్గానికి వెళ్లిందనుకుని మనం నిట్టూర్చేలోగా, ఆమె జీవితం గురించిన వివరాలు తెలుస్తాయి మనకి. ఆమె కష్టాలు ఆమె తోటి వారిని కదిలించలేదని కూడా తెలుస్తుంది. 1934లో శ్రీశ్రీ రాసిన భిక్షువర్షీయసి కవిత గుర్తువచ్చింది. బండరాతిలాగా పడి ఉన్న అవ్వలాగానే కనకమ్మ కూడా దిక్కూమొక్కూ లేకుండా మరణించి ఉంటుందని తట్టింది. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి”దని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది! ఎముక ముక్క కొరుక్కుంటు ఏమీ అనలేదు కుక్క! ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగె తొండ! క్రమ్మె చిమ్మ చీకట్లూ, దుమ్మురేగె నంతలోన. “ఇది నా పాపం కా”దనె ఎగిరి వచ్చి ఎంగిలాకు! పాపం ఎవరిదై ఉంటుందని ఆలోచించాను.
కానీ కనకమ్మకు ఎవరి మీదా కోపం లేదు. ఆమె తప్పు ఏమీ లేకుండానే ఆమె అన్ని కష్టాలు అనుభవించిందని ప్లీడరు అంటే -“గ్రహచారం చాలకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు” అంటుంది ఆమె ఏమనడానికీ తోచక. అది వింటే మన అమ్మమ్మలూ, నాయనమ్మలూ – వారి మాటలూ గుర్తురాక మానవు. ఎవరి కారణంగానైనా బాధ కలుగుతూంటే, ఏం చెయ్యాలో తెలియక – నా కర్మ బాగుండకపోతే, అవతలివాడికి దుర్బుద్ధి పుడుతుంది అని సర్దుకుపోవడం అందరం విన్నదే, కొత్తేమీ కాదు. అయితే దానిని పూర్తిగా మనసులోకి ఇంకించుకుంది కనకమ్మ పాత్ర. ఆమె ద్వారా – అంత వరకూ ఆ సిద్ధాంతంలో మనం చూడని కోణాలను చూసేలా చేస్తారు కొకు.
ఆ సిద్ధాంతం మంచిచెడ్డలు పక్కన పెట్టి, కొకు ఈ కథలో ప్రవేశపెట్టిన కొత్తకోణాన్ని పరిశీలిద్దాం. ఒక దోమకున్నపాటి అర్హత కూడా తనకు లేదనే నమ్మకం తెచ్చిపెట్టుకున్నది అని రాస్తారు. జీవితమూ, ప్రకృతీ, భగవంతుడూ కట్టుకట్టి తనను, ఒక్కసారిగా కాకుండా, ఒక్కొక్క అణువే నిర్మూలిస్తున్నారని తోచాక, ఈ బ్రహ్మాండంలో తనకు ఎక్కడా స్థానం లేదని నమ్మకం కలిగాక, తనను ప్రపంచం విడిచేసి వూరుకోవటం ఆవిడకు సహజంగానే కనిపిస్తుంది కదా. జంతువు కన్నా తాను హీనమని కనకమ్మకు అనిపించడం కేవలం సానుభూతి కోసం రాసారని నేను అనుకోవడం లేదు. దానిని లోతుగా పరిశీలించాల్సి ఉంది.
మనిషికీ, జంతువుకీ -నిద్రా, భయ, మైదునాదులలో పోలికలున్నాయి. మరి ప్రధాన భేదం ఏమిటి అంటే – అది ప్రతిస్పందన అని చెప్పుకోవచ్చు. బుద్దినీ, అనుభవం ఇచ్చిన అవగాహననీ, ఊహాశక్తినీ వినియోగించి మనిషి స్పందిస్తాడు, జంతువుది ప్రధానంగా తన సహజాతాల మీద ఆధారపడిన స్పందన (Instinct based response). అడవిలో పులి జింకని చంపబోతే, తప్పించుకోబోవడం దానికి సహజంగా వస్తుంది. ఒకవేళ పులికి చిక్కిపోతే, దానికి శోకమూ, ధర్మాగ్రహమూ వస్తాయని అనుకోలేం. దానికే గనక ఏదైనా వేదాంతం తెలిస్తే, ‘కర్మ బాగుండక జింకగా పుట్టాను, పులి చేతిలో చచ్చేను, దీనిలో పాపం పులి తప్పేముంది’ అని కూడా అనుకుంటుందేమో మరి మనకి తెలీదు. దానిని అలా ఉంచితే – ప్రాణ రక్షణ, ఆహారాన్ని అన్వేషించుకోవడం, జత కట్టడం -ఈ మూడింటితో పాటూ – జంతువును నిర్వచించే ప్రధాన లక్షణం – తన సంతానాన్ని శాయశక్తులా కాపాడుకోవడం.
మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, కనకమ్మలో అది తప్ప మరే సామర్ధ్యమూ లేనట్టు కనిపిస్తుంది. కథలో అనేక వాక్యాలు ఈ భావాన్ని బలపరుస్తాయి.
“కనకమ్మను మొగుడు పెట్టిన కష్టాలను గురించి చోద్యంగా చెప్పుకున్న అమ్మలక్కలు, కబుర్లు మానేసిన మరుక్షణం బేషరతుగా తమ తమ మొగుళ్ల పక్కలు చేరేవాళ్లు. నాలుగు రోజుల నుంచి ఆవిడకు తిండిలేదని వార్త తెలిసినాక “పాపం!“ అని విరక్తిగా చప్పరించేసి మరుక్షణం భోజనాలకి కూర్చుని షడ్రసోపేతంగా మూడుపూటలకి సరిపడా తిన్న అమ్మలక్కలున్నారు. తీరా కనకమ్మ చచ్చినాక ఆవిడ శవాన్ని దహనం చెయ్యడానికి ఇరవై రూపాయిలు ఇట్టే పోగుచేసిన ధర్మాత్ములు ఆవిడ జీవించి ఉండగా ఆవిడ అవసరాలకు గాను ఎన్నడూ వసూలు చెయ్యలేదు.” వారెవరిదీ తప్పు లేదని కనకమ్మ భావిస్తోంది ఆమె పరిచయస్తులు, ఇరుగుపొరుగులు ఎంత అమానుషంగా ప్రవర్తించారన్నది పాఠకులు గుర్తించడం కథకు చాలా అవసరం. అందుకేనేమో కొన్ని వ్యంగ్య విమర్శలు కొకు సహజ సమతౌల్యాన్ని మించి కనిపిస్తాయి. వాటిలో ధ్వనించిన నిందలో – వారి నిర్లిప్తత, నిష్క్రియత్వం వారిని కూడా మనుషుల స్థాయి నుండి కిందికి దించిందని మనకి స్ఫురిస్తుంది.
***
“నా మొగుడు ఒక్క నెల ముందు చచ్చివుంటే, నా పిల్లలిద్దరూ ఇంకో రెండు సంవత్సరాలు ఆలస్యంగా చచ్చేవాళ్లు! ఏమో, అప్పటికి వాళ్లకివాళ్లకి కాస్త రెక్కలొచ్చి ఏ మూటలయినా మోసి అట్లా బతికే వాళ్లేమో! అది తలుచుకుంటేనే నా గుండె అవిసిపోతుంది.” కడుపుతీపి తప్ప మరేమీ తెలియనితనంలో – కనకమ్మకీ, జంతువుకూ సామ్యం తీసుకుని వచ్చారు కొకు. అయితే, జంతువులు ఒక దానితో ఒకటి ఏ ఒప్పందానికీ వచ్చి, వ్యవస్థను నిర్మించుకోలేదు. మనుషులు మాత్రం ఒక సమాజంగా ఏర్పడతారు. కార్పొరేట్ వర్గపు మేధావిగా ప్రఖ్యాతి పొందిన మాల్కం గ్లాడ్వెల్ – సమాజం అంటే ఒక కాంట్రాక్టు అని నిర్వచిస్తాడు. ‘గౌరవం, న్యాయం, సమానత్వం‘ అనే మౌలిక విలువల మీద పౌర సమాజం నిలబడుతుందని చెప్తాడు. అలిఖిత నియమాలను ఎన్నింటినో – ప్రభుత్వం, చట్టంతో సంబంధం లేకుండానే, సమాజంలో భాగమవడం కోసం దాని సభ్యులు పాటిస్తారు. కనకమ్మ కూడా పాటించే ఉంటుంది బ్రతికి ఉన్నప్పుడు. చచ్చిపోయాక కూడా పాటిస్తుంది.భర్త వల్ల పడిన హింస, ప్రపంచం చేసిన మోసం, దారిద్ర్యం, జబ్బులు, ఆకలితో పిల్లలు చనిపోవడం, చివరికి 35 ఏళ్ల వయసులోనే కాలం చెల్లిపోవడం – ఇన్ని జరిగి ఆమె మరో లోకంలోకి అడుగుపెట్టింది. ఏమీ జరగనట్టు, అదో పెద్ద విషయమే కానట్టు ఆమె మాట్లాడుతుంది. తన బాధలకి కారకులైన చుట్టాలు అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నారని తెలిసి, “అందులో చాలా మందిని చూసి చాలా కాలమయింది. చూసొద్దామని! వాళ్లిక్కడున్నట్టు తెలిసి, చూడటానికి పోకపోతే బాగుంటుందా?” అని అంటుంది కనకమ్మ. ఏ సమాజం యొక్క సంబంధాలను, నియమాలను తాను పాటిస్తోందో, ఆ సమాజం తనకి కొన్ని హక్కులని కూడా ఇస్తుంది. ఆ సంగతి ఆమెకు తెలియక పోవడమే కథలోని అతి పెద్ద ట్రాజెడీ. కథ చెప్పే గొంతులో రెండు రకాల స్వరాలు వినిపిస్తాయి. ఒకటి కనకమ్మ అమాయకత్వానికి జాలిపడుతూ, ఆమె కష్టాలకు సానుభూతి చూపుతూ – ఆమె కడుపుకోతకు సహానుభూతిని పంచుతుంది. రెండో స్వరం ఆమె లాంటి అసంఖ్యాకులైన ‘అమాయకుల’ను చూస్తూ – వారి జీవితాలను సామూహికంగా దర్శించే స్వరం. అది ఈ సమాజం దాని నియమాలను అదే పాటించకపోవడం మీద విమర్శ చేస్తుంది, వ్యాఖ్యానిస్తుంది.
ఎప్పుడో 1948లో – స్వంతంగా పరిపాలన కొత్త అయినప్పుడు, వనరుల పంపిణీ, విద్యా వైద్య సదుపాయాలూ – అబివృద్ధి చెందని కాలంలో – కనకమ్మలాంటి భభ్రాజమానాలు ఉండి ఉంటారు గానీ ఈ 2020లో ఏ ప్రతిక్రియా చెయ్యలేకుండా, ఎవరినీ తప్పు పట్టలేకుండా – నోరెత్తకుండా భరించే అమాయక ప్రాణులుంటారా అనే సందేహం ఎవరికైనా కలగొచ్చు. నేను గమనించినదేమిటంటే, కాలం అనేది కష్టాల రూపురేఖలను మార్చిందేమో తప్ప, వాటికి ప్రతిస్పందించే శక్తులలో ఏ మార్పూ రాలేదని. మరీ ముఖ్యంగా కరోనా తెచ్చిన ఈ అత్యవసర పరిస్థితులు – ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
వలస కార్మికుల సంగతే తీసుకుందాం – ఏం జరిగింది?
రాత్రికి రాత్రి కర్ఫ్యూ అన్నారు – పని లేదు, తిండి లేదు. ఉరుము లేని పిడుగులా పడిన ఆ దెబ్బకి బిత్తర పోయారు. ఎవరి వైపు చూడాలో, ఏం చెయ్యాలో తెలియక తల్లడిల్లిపోయారు. తమ కుటుంబాలను తలుచుకున్నారు, స్వంత ఊరు వెళిపోవాలనుకున్నారు. వాహనాలు రద్దయినాయని తెలిసింది, మరింత బెంబేలెత్తిపోయారు. నడిచి వెళ్లిపోవాలనుకున్నారు. వందల కిలో మీటర్లు నడిచారు. దారిలో ప్రాణాలు కోల్పోయారు. సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రజల సహాయంతో వారిని ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేశారు. ఆ కార్యకర్తలలో కొందరు చెప్తున్నారు – “ఇక్కడ మా ఊళ్లల్లో పనులు లేవు, వెనక్కి వస్తాం, ఏదైనా పని దొరుకుతుందా” అని కార్మికుల ఫోన్లు వస్తున్నాయట వారికి. ఏమిటి ఇదంతా? బయలుదేరక ముందు – ఎలా చేరుకుంటాం? ఎక్కడ ఉంటాం? ఏం తింటాం? దారిలో ఏదన్నా జరిగితే ఎలా? అసలు వెళ్లి ఏం చెయ్యాలి?, అక్కడ ఎలా బతుకుతాం? – ఈ ఆలోచనలు రాలేదా వారికి?
అప్పుడు నాకనిపించింది, అలా ఆలోచించగలిగే శక్తి వారికి ఉంటే –
‘ఇక్కడ పనులు లేకపోతే మా తిండి తిప్పలు మేమెలా సంపాదించుకోవాలని ప్రశ్నించి ఉండేవారు కాదా?
మా యిళ్లకు మమ్మల్ని పంపే బాధ్యత ఎవరిది అని నిలదీసి ఉండేవారు కాదా?
మా యిళ్లకు మమ్మల్ని చేర్చి ఆ తరవాత కర్ఫ్యూ పెట్టమని డిమాండ్ చేసి ఉండేవారు కాదా?
ఊహించని పరిణామం ఎదురవగానే – తమ కుటుంబాలను తలుచుకుని మొండి ధైర్యంతో చావుకు సిద్ధపడి ఇంటిదారి పట్టిన వారికి – ఈ ప్రశ్నలు వేయడానికి ఏం భయం ఆపుతోంది?
భయం ఆపడం ఏమిటి, అసలు అలా అడగవచ్చని వారికి తట్టిందా? తమ హక్కుల గురించిన ఆలోచనే రాని ‘కనకమ్మ’లు కోటానుకోట్లు ఉన్నారని, సమాజంలో తమకూ ఒక స్థానం ఉందని వారికి తెలియనే తెలియదని నాకు తోస్తోంది.
నీ జీవితం ఎవరిమూలంగా, ఎందుమూలంగా కష్టాల పాలయిందో కోర్టుకు చెబితే, దానికి అనుగుణంగా నష్టపరిహారం జరుగుతుంది. అవమానం వల్లనా? నింద వల్లనా? హింస వల్లనా? మోసం వల్లనా? నిరాధారం వల్లనా? దేని వల్ల నీ జీవితం అధికంగా దుఃఖభాజనమయింది? దానికి కారకులెవరు? అని జడ్జీ కనకమ్మను అడుగుతాడు కానీ, పౌరుల స్థాయికి చేరని మనుషులకి చట్టం ‘న్యాయం’ ప్రసాదించడం అనేది హాస్యాస్పదం అనిపిస్తుంది. తన హక్కుల పట్ల గానీ, తన జీవితం పట్ల గానీ కనీస అవగాహన లేని కనకమ్మ వంటి వారికి న్యాయం చేస్తామని కేసులు నడపడమే ఒక బూటకంలాగా కనిపిస్తుంది.
***
అసమానతలకీ, భావజాలానికి సంబంధం ఉందని కొకు కథలో మనకు కనిపించడం యాదృచ్ఛికం కాదు, ఈ చర్చ ఎప్పటి నుండో సాగుతోంది. ఇక్కడ ‘థామస్ పికెటీ’ అనే ఫ్రెంచి ఆర్ధిక శాస్త్రవేత్త గురించి చెప్పడం అప్రస్తుతం కాదనుకుంటున్నాను. ఆర్ధిక శాస్త్రాన్ని – సామాజిక శాస్త్రాల పరిధిలోకి తీసుకు వచ్చి పరిశోధించాలని అతను ప్రతిపాదిస్తాడు. అసమానత్వం మూలాలను తెలుసుకోడానికి, ‘వరల్డ్ ఇనీక్వాలిటీ డేటాబేస్’ నుంచి సంవత్సరాల తరబడి సేకరించిన రికార్డులను కలిపి ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల విజ్ఞాన ప్రముఖుల సహాయంతో విశ్లేషించాడు. వందల ఏళ్ల చరిత్రనీ, ఆర్ధిక శాస్త్రాన్నీ, సామాజిక శాస్త్రాన్నీ – అనుసంధానించాడు. 2019లో ‘కేపిటల్ అండ్ ఐడియాలజీ’ బృహద్గ్రంధాన్ని ప్రచురించాడు. సమాజంలో ఉండే అసమానతలు సహజమైనవని ప్రజలు నమ్మడం ఈ సమాజాల ఉనికికి అత్యవసరం అని అంటాడు. అలా నమ్మించే ప్రయత్నంలో ఒక ఆరు రకాల ప్రధాన విచారధారలను (ఐడియాలజీ) అతను గుర్తించాడు. proprietarian (ఆస్తి హక్కును కాపాడే సంబంధాలు) social-democratic (సామ్యవాద – ప్రజాస్వామ్యం), communist (కమ్యూనిస్ట్), trifunctional (మతాధికారులు, పాలకులు, పాలితులు అనే త్రివర్గ విభజన), slaveist (బానిసలు – యజమానులు), and colonialist (వలస సంబంధాలు) అనే ఈ ఆరింటిలోనూ ఏదో విధంగా అసమానతను జస్టిఫై చేసే ప్రయత్నం, (అంటే అది అలా ఉండక తప్పదని చెప్పడం) జరిగిందని అంటాడు. అసలు అసమానతల వల్లనే సమాజం పురోభివద్ధి చెందుతుందని కూడా అవి ప్రచారం చేస్తాయని అంటాడు.
కథలో విడదీయలేకుండా కలిసి పోయిన రెండు అంశాలు – కనకమ్మ దీనస్థితి, ఆమె రాజీ ధోరణి. తన కష్టాలకు తన దురదృష్టమే కారణమని ఆమె మనస్ఫూర్తిగా నమ్ముతుంది. మరో అవకాశం వచ్చి, ఆమె మళ్లీ భూమి మీద జన్మించినా ఆమె అలాగే నమ్ముతుంది. ఆమెలో జీర్ణించుకుపోయిన ఆ నమ్మకం ఆమె స్వంతమా, దానికి వేరే ఏదన్నా కారణముందా అని ఆలోచించినప్పుడు -కథకి పెట్టిన శీర్షిక ‘నిజమైన అపచారం’ ఏమిటన్నది నాకు తెలిసినట్టైంది. “మగవాడై పుడితే తన బతుకు ఇంకొంచెం బాగుండేదేమోనని ఒకప్పుడు అనుకొన్నదిగాని, రానురాను అది గొంతెమ్మ కోరికగా కనపడసాగింది” ఈ వాక్యంలోఆమెకు కలిగిన ఒక చిన్న ఆశ, అది కూడా అడుగంటిపోయిన సంగతీ వింటే – ఆమె నిస్సహాయత ఎంత తీవ్రస్తాయిలో ఉందో మనం ఊహించుకోవచ్చు. “ఒకప్పుడు కనకమ్మలో కొంత అభిమానమూ, ఆత్మవిశ్వాసమూ, ఆశా ఉండి వుండవచ్చును. కాని, చచ్చే సమయానికి ఆమెలో మానవులు గర్వించే లక్షణాలేవీ లేవు” అని రాస్తారు కొకు. ఒక మనిషి జీవశక్తిని నిర్మూలించే నమ్మకాలను వారిలో ప్రవేశపెట్టడం కంటే వారికి చేయగలిగే అపచారం ఏముంటుంది? ఆమెకు న్యాయం జరగాలంటే ముందుగా ఆమెలో ఆశ ప్రవేశించాలి. తనకు కూడా ఈ సమాజంలో ఒక గౌరవపూర్వకమైన స్థానం ఉందని ఆమెకు నమ్మకం కలగాలి.
కథలో కనకమ్మ ఇరుగుపొరుగుల కంటే – వలస కార్మికుల విషయంలో మనం మానవత్వంతో ప్రవర్తించాం, నిజమే. అయితే, నిస్సహాయత, నిస్పృహ, నిరాశలతో రోడ్డు మీద నడిచిపోయిన జనసమూహాల నిశ్శబ్ధాన్ని, నిస్సత్తువనూ మనం గుర్తిస్తున్నామా? బెదిరిన జంతువులకుండే విహ్వలత కాక, నిలిచి సహాయం కోరగలిగిన నమ్మకం వారిలో కలగాలని ఆశిస్తున్నామా? “ముప్పైయైదేళ్ల జీవితంలో కనకమ్మ తన కుండదగిన హక్కులూ, స్వాతంత్ర్యమూ, జ్ఞానమూ, జీవశక్తీ అన్నీ పోగొట్టుకున్నది” – అని కథలో చదివేక మన హక్కులూ, స్వాతంత్ర్యమూ, జ్ఞానమూ, జీవశక్తీ కోసం బెంగ వేస్తుంది.
ఇప్పటికీ బుర్జవా పద్ధతులను పాటించే తుప్పు మనిషికి చదవలసిన ఓ మంచి వ్యాసం.. వారికి అవసరమైన కథ…వ్యాసం సోషలిజంతో మొదలైన మానవత్వంతో ముగింపు ఇవ్వడం నచ్చింది.
Thank you నరేష్
మంచి కథ. సరైన విశ్లేషణ. Tale of two cities ని పోలికకు తేవడం బాగుంది. నిజమే! అస్సహాయులైన జనం అప్పుడు ఇప్పుడు న్యాయం అంటే ఏమిటో, హక్కులంటే ఏమిటో తెలియకుండానే ఉన్నారు.
సామాజిక సమస్యలను కాల్పనికంగా ఇంత బాగా మార్చవచ్చా కొకు గారు!
Thank you రమ.
ఒక smiley 🙂 – కొకు తరపు నుంచి ఆయన కొత్త పాఠకులకి.
కొకుగారి కథగురించి, సమకాలీనతతో కూడిన మీ విశ్లేషణ, చాలా పటిష్టంగా, ఎడ్యుకేటివ్‌గా అనిపించింది. ధన్యవాదాలు.
Thank you శ్రీనివాస్ గారూ.
కథ చదివిన విధానం బాగుంది,విశ్లేషణ బాగుంది . ముఖ్యంగా tale of two cities కి దీనికి ఉన్న సామ్యం . అలాగే సోవియట్ భూమి గురించి , దాని పై ఆ రొజుల్లొ అందరికి ఉన్న ఆశలు గురించి ప్రస్తావించడం కరెక్ట్
ధన్యవాదాలు ప్రసూన గారూ. జైలులో ఉండి వచ్చాడని Manet మీద ఎంతో గౌరవం చూపిస్తారు అందరూ. ఆ పాత్ర ఒక్కసారిగా మార్పు చెందుతుందని గుర్తు వచ్చింది ఈ కథ చదివినప్పుడు.
కల్యాణి చాలా మందిని గుర్తుతెచ్చారు. చాలా బాగుంది
Thank you 🙂