కొ.కు – ‘అద్దెకొంప’

ఈ కథని కొకు 1948లో రాశారు. 1940లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించాక, 1942లో మద్రాసు మీద విమానదాడి జరగబోతుందన్న వార్త బయలుదేరింది. అప్పటికే వైజాగ్, కాకినాడలపై చిన్నపాటి దాడి జరిగి ఉండడంతో – ప్రాణభయం చేత చాలా మంది తెలుగువాళ్లు కుటుంబాలతో సహా స్వగ్రామాలకు పారిపోడం మొదలైంది. ఆ ప్రత్యేక కాలవ్యవధికి సంబంధించిన కథ ఇది. మరో సంగతి ఏమిటంటే – ఆ కాలంలో అత్తవారు వెళ్లగొడితే తప్ప, మధ్యతరగతి వివాహిత స్త్రీలు పుట్టింటిలో గడపడం అనే వాడుక లేదని మనం గుర్తుచేసుకుని ఈకథని చదవాలి. కథకుడు తన చెల్లెలు శారదాంబ కాపురం గురించి చెప్పడంతో కథ మొదలౌతుంది. ఆమె మాటపడదని, ఆత్మాభిమానంతో పెరిగిన పిల్లని మనకి ముందే చెప్తాడు.

శారదాంబ అత్తగారు కామాక్షమ్మ మహా ఘటికురాలు. జప్తు కాబడిన తండ్రి ఇంటిని భర్త పార్వతీశం చేత కొనిపిస్తుంది. దాని కోసం అతను తన ఆస్తిని తెగనమ్ముకుని, నిరాధారంగా కామాక్షమ్మ పంచనే చేరవలసివస్తుంది. ఆమె అక్కచెల్లెళ్లు అగ్నికి ఆజ్యంలా తోడవుతారు. అంగబలాన్నీ, అర్థ బలాన్నీ సమకూర్చుకుని చక్రం తిప్పుతూ ఉంటుంది.  ఆమె చాతుర్యాన్నీ, ఆధిక్యతనీ వివరించే క్రమంలో మనం పట్టించుకోకుండా వదిలేసే కొన్ని అసంగతాలని యధాలాపంగా గుర్తు చేస్తారు కొకు. మచ్చుకు ఈ కింది వాక్యాలని చూడండి:
కామాక్షమ్మ నోరు చెడ్డది ఆమె హృదయం చాలా మంచిదని చెబుతారు గాని, దాన్ని గురించి సాక్ష్యం దొరికేది కాదు.”

పార్వతీశంలాంటి నోరూవాయీ లేనివాడిలో వెయ్యి మంచిగుణాలున్నా గమనించే వాళ్లుండరు. కామాక్షమ్మలాంటి గచ్చపొదలో ఏమాత్రం మంచి ఉన్నా వెంటనే ప్రచారం అవుతుంది”. ఆవిడ కోడళ్లను కోసుకుతినేది. ఆ మాటంటే “కోడళ్ల కావిడ ఇచ్చే శిక్షణ తల్లులు కూతుళ్లకు కూడా ఇవ్వరు!” అనేవాళ్లు. అధికారం చెలాయించే వారిని ఎలాగోలా సమర్ధించడానికి ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. ఇలాటి మాటలని విని తలలూపేవారు కూడా  ఒక్కొక్కప్పుడు తెలియకుండానే ఆ ప్రయత్నంలో భాగం పంచుకుంటూ ఉంటారు.  వెరసి, ఆ కుటుంబంలోకి కథకుడు తన చెల్లెలిని పెళ్లి చేసి పంపించాడు. తొందరపడి నేరం మోపితేనే సహించని మనిషి, ఆ కామాక్షమ్మ కవాతుకు ఎట్లా లొంగుతుంది?”   ఇక ఆ పిల్ల కామాక్షమ్మ వంటి అత్తగారు, ఆవిడ అక్కచెల్లెళ్ల సామ్రాజ్యంలో ఎలా బతికి బట్టగడుతుందో అనే భయం కథకుడితోపాటూ మనకూ వేస్తుంది.

శివకామయ్యకి మద్రాసులో ఉద్యోగం వల్ల శారదాంబకి తాత్కాలికంగా విముక్తి దొరికింది. కానీ విమానదాడి భయం ఒకటి పులిమీదపుట్రలా వచ్చిపడింది. శివకామయ్య అక్కడ నుండి కదల్లేదు కానీ, శారదాంబ మాత్రం పుట్టింటికి వచ్చేసింది. ఆ రావడం రావడం – ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది, తొమ్మిది నెలలూ గడిచి బిడ్డను ప్రసవిస్తుంది. మూడు నెలల బిడ్డను తీసుకుని అత్తవారింటికి వెళ్లి ఇరుక్కుపోతుంది. ఇక అక్కడ నుండి వెడితే శివకామయ్య దగ్గరకు మద్రాసు పోవలసిందే తప్ప, వెనక్కి పుట్టింటికి రాలేదు. అలా వస్తే, అంటే అత్తవారు ఆరళ్లు పెడుతున్నట్టు, అక్కడ సుఖంలేకనే పుట్టింటిలో గడుపుతున్నట్టు నిశ్చయంగా ప్రపంచానికి తెలుస్తుంది. అలా తెగించి ఆమె రావడం కథకుడికి సైతం అంగీకారం కాదు కనక అతను శివకామయ్యను తొందరపెడుతూ ఉత్తరం రాస్తాడు.

అసలు శివకామయ్య భార్యను ఎందుకు తీసికెళ్లడంలేదు, అతని సమస్య ఏమిటన్నది కథలో తర్వాత తెలుస్తుంది. యుద్ధ భయంతో సగం నగరం ఖాళీ అయి, ఇంటివారు సైతం పారిపోయినప్పుడు ఆర్నెల్ల పాటు శివకామయ్యే ఒక్కడూ ఇంటిని కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ కృతజ్ఞతతోనే – వారు వెనక్కి వచ్చాక, నాలుగునెలల అద్దె కూడా పుచ్చుకోలేదు శివకామయ్య దగ్గర. అదే మర్యాదతో, వారు అవసరపడి అడిగారు కదా అని – భార్య ఎలాగూ ప్రసవమయ్యే దాకా వెనక్కి రాదు కనక – తన వాటా మూడు గదులలోంచీ రెండు గదులు ఖాళీ చేసి వారికి ఇచ్చాడు.  బిడ్డకి మూడునెలలు వచ్చే సరికి అక్కడ మద్రాసులో పరిస్థితులు మారడం మొదలైంది. పట్నం నుంచి వెళిపోయిన వాళ్లంతా తిరిగి రాసాగారు. పట్నంలో ఇళ్లన్నీ గబగబా అయిపోతున్నాయి. భార్య ఫలానా తేదీకి వస్తుందనీ, తన రెండు గదులూ తనకి వెనక్కి ఇమ్మని వారిని అడుగుతాడు.  అప్పటి వరకూ ఉన్న సత్సంబంధానికి ఏ విలువా లేకుండా పోతుంది. ఇంటివాళ్ల డబ్బుదాహమూ, దగాబుద్ధీ చూస్తే  శివకామయ్యకు ఆశ్చర్యం వేస్తుంది. యుద్ధం తర్వాత ఇళ్లరేట్లు పెరిగిపోయాయి కనక అతను ఉన్న వాటాకి కూడా రెండింతలు అద్దె పెంచాలని చూస్తున్నారు వాళ్లు. శివకామయ్య అంత ఇవ్వలేడు, ఇల్లు వదులుకోలేడు. పైపెచ్చు ఇప్పుడు భార్యకి – నిప్పుల కుంపటిలో కూర్చున్నట్టుందని బావమరిది నుండి ఉత్తరం వచ్చింది. ఇక చేసేదేమీ లేక అతను చట్టసహాయం తీసుకున్నాడు. తన దగ్గర మూడు గదులకూ అద్దె పుచ్చుకుంటూ, తన రెండు గదులనూ మరొకరికి అద్దెకిచ్చారని రెంటు కంట్రోలర్ దగ్గర ఫిర్యాదు చేశాడు. ఆ రెంటు కంట్రోలర్ ధర్మాత్ముడవడంతో, ఇంటివారికి వీరి వాటా ఇవ్వక తప్పలేదు. అంత జరిగి, శారదాంబ వెనక్కొచ్చింది. అయితే  ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది కనక ఎలాగైనా వెళ్లగొట్టాలనే కసి పెరిగింది ఇంటివారిలో.

కథా నిర్మాణం గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకోవలసి ఉంది. కథ ఒక భాగంలో అత్తవారిల్లు, మరో భాగంలో అద్దెయిల్లు – ఇలా రెండు భాగాలుగా విభజించబడినట్టు కనిపిస్తుంది. రెండు చోట్లా శారదాంబకి ఇబ్బంది కలుగుతోంది, అత్తవారింట్లో ఎవరెవరి మీదో పేరు పెట్టి ఆమెను నానా మాటలు అంటారు. అద్దెకున్న చోట మొహం మీదే శాపనార్దాలూ, రంకెలూ. సుఖంగా శాంతిగా బతికే హక్కుకు భంగం కలిగించే రెండు ‘ఇక్కట్ల’నూ చెరోవైపు నుండి పేర్చుకుంటూ వస్తారు కొకు.  ఒక్కొక్క మెట్టూ దిగి చూసుకుంటూ వస్తే  – రెండిటికీ మధ్య శారదాంబ నిలబడి కనిపిస్తుంది మనకి. రెండు రకాల వికృత ధోరణులను, వాటి నేపథ్యాన్ని వివరించి – వాటికి ఒక వ్యక్తి ప్రతిస్పందన ఎలా వేర్వేరుగా ఉందో మన దృష్టికి తీసుకువస్తారు.

సమాజానికి తప్పుకు దొరక్కుండా కోడళ్లను కాల్చుకుతినడం ఆమె అత్తవారింటి ప్రత్యేకత. ఎందుకంటే కొట్టటమూ, తిట్టటమూ, వాతలు వెయ్యటమూ,  అన్నం పెట్టకుండా మాడ్చి చంపటమూ మొదలైన మొరటు పద్ధతులు వాడదట కామాక్షమ్మ. కానీ రచయిత ఆ మాటలు వాడారంటే – అంత బాధా కలిగించగలదనే కదా అర్థం. అయినా ఫిర్యాదు చెయ్యడానికి సరైన ఆధారాలు దొరకవు. మద్రాసులోని ఇంటి వారి సంగతీ ఇంచుమించు అటువంటిదే. చట్ట పరిమితిలోకి రాని హెరాస్‌మెంట్ అక్కడ. దొడ్లో పొరపాటున చంచా వదిలేసినా, ఎత్తుకుపోతారు. వాళ్లకు పనికిరానిదైతే విరగగొడతారు. కొళాయి గొట్టం చిల్లిపొడిచి మా పక్క సందంతా నీళ్లప్రవాహం చేశారు. అలగా కుర్రవాళ్లకు కానీ అర్ధణాచేతిలో పెట్టి మా కిటికీముందునుంచి బండబూతులు అనిపిస్తారు! అని చెప్తుంది శారదాంబ.

రెండు చోట్లా సయోధ్యకి ఏ మాత్రమూ ఇక అవకాశం లేదనే  విషయాన్ని కారణసహితంగా వివరిస్తారు. కామాక్షమ్మ ఇంట్లోవున్న పదిమందీ ఒక్క మనిషి మాట మీద పోవటం వల్ల పైకి కాపరం చాలా గుంభనగా కనిపించేది. కాని లోపల ఏ ఒక్కరికీ సుఖం ఉండేది కాదు. ఇంటి కొడుకులకు తల్లిని చూస్తే చెడ్డ భయం. పెళ్లాలతో మాట్లాడాలన్నా వాళ్లు తల్లి అనుమతి పొందవలసిందే. లోకం ఎంత ఆ ధాష్టీకాన్ని ఎత్తుకు తిరిగినా, ఇంటి కోడలికి నొప్పి తెలియకుండా ఉండదు కదా. కేంద్రీకరించబడిన అధికారం బయట నుంచి చూడడానికి బహు ముచ్చటగా కనిపించవచ్చు కానీ దానికి లొంగి జీవించేవారు ఎంత వత్తిడికి లోనౌతారో మనకి మరోసారి గుర్తు చేస్తారు కొకు. యుద్ధం మూలంగా ప్రజల మనస్తత్వంలో కలిగిన మార్పును ప్రత్యక్షంగా చూస్తుంది శారదాంబ మద్రాసులో. అద్దెఇల్లును వదులుకునే పరిస్థితి లేదు. వేరే ఇల్లు కావాలంటే – వందలకొద్దీ లంచాలు పెట్టాలి. లేదా ఇచ్చే బాడుగలో సహానికే రశీదు తీసుకోటానికి ఒప్పుకోవాలి. అదీకాకపోతే రెండు సంవత్సరాల అద్దె- అంటే ఇల్లు కట్టటానికి అయ్యే ఖర్చులో ఏ అయిదోవంతో ఆరోవంతో ముందుగా అర్పించుకోవాలి. నలభై దశకంలో వచ్చిన విపత్తును ఎంతో నిపుణతతో కథలో భాగంగా మలిచారు రచయిత. కథకుడు చెల్లెలిని చూడడానికి మద్రాసు వెళతాడు. ఇంటావిడ తిట్లను విని తన చెవులను తానే నమ్మలేకపోతాడు. మరి అంత ఆత్మాభిమానం ఉన్న శారదాంబకు ఎలా అనిపించాలి? కానీ శారదాంబ నవ్వి ఇంకెవర్ని? మమ్మల్నే! చావనీ గింజుకోనీ! మేం ఇల్లు ఖాళీ చేస్తే ఈ భాగాన్నే నలభై రూపాయలకి ఎవరికన్నా ఇవ్వాలని వాళ్ల ఆలోచన. డబ్బుదాహం నోటంట అట్లా పలుకుతున్నది అంటుంది.

చుట్టుపక్కల పరికించేందుకు ఒక కొత్త దృక్కోణం ఇక్కడ మనకి దొరుకుతుంది. ఇంటిలో అత్తమామల పెత్తనాన్ని ధిక్కరించిన మహిళ, ఆఫీసులో హెరాస్‌మెంట్‌ని కింది పెదవి పైకి ఎత్తకుండా భరించడం చూస్తుంటాను. ఇంట్లో తల్లిదండ్రులు అనవసరంగా జోక్యం చేసుకుంటే సహించని ఒక టీనేజ్ అమ్మాయి – కాలేజ్‌లో తోటి పిల్లలు చేసే బుల్లీయింగ్‌ని ఎదుర్కోక పోవడం చూశాను. చాలా మంది ఒక చోట స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి మరోచోట చతికిల బడుతూ ఉంటారేమని ప్రశ్నలేస్తూ ఉంటుంది మనకి. శారదాంబని చూస్తే వారందరూ గుర్తుకు రావచ్చు.

కథని ఇంత వరకూ చెప్పి ఆపేసి ఉంటే – కొకు మన కొత్త సాహిత్య వేత్తలకి ఎంతో యిష్టులైన  రచయిత అయి ఉండేవారేమో. ఒక చోట ఒకలా మరో సందర్భంలో మరోలా  ప్రతిస్పందించే – వ్యక్తి ప్రవర్తనలోని యాదృచ్ఛికతనీ, పొసగనితనాన్నీ వర్ణించి, మానవస్వభావం ఏ వివరణలకీ, నియమావళికీ లొంగదని ముక్తాయించడం – అత్యాధునిక ధోరణి.

కానీ కొకు శారదాంబ ధోరణిలోని ద్వంద్వాన్ని గమనించి, మనకు వివరించడమే కాకుండా -దాని గురించి ఆయన పరిశీలన, అనుభవం ఏం చెప్తున్నాయో, వాటి సారం ఇలా మనకి తెలియజేస్తారు:

ఎలా భరిస్తున్నదో, శారదాంబ ఎంతవరకు మారినదో నేనర్థం చేసుకోగలిగాను. మా శారదాంబ అత్తవారింట్లో అమలులో వున్నది క్షీణించిపోతున్న సంస్కృతికి చెందిన వికృత ఆచారం. కనుకనే శారదాంబ దాన్ని అతిక్రమించి అసహనం ప్రకటించగలిగింది. ఇక్కడ ఈ మద్రాసులో అద్దెయింటి సమస్య అటువంటిదికాదు. దీని మూలకందమేమిటో, ఎలా దీన్ని ఎదుర్కోవాలో  శారదాంబకు తెలియదు, తెలియలేదు. అందుచేతనే దీన్ని సులభంగా భరించగలిగింది.  కేవలం ఒక కథ చదవడం వల్లనే నాకు గ్రహింపులోకి వచ్చిన జీవిత పార్శ్వాలలో ఇది అతి ముఖ్యమైనది. సాహిత్యం, జీవితం ఒక దానిని మరొకటి ఎలా ప్రభావితం చేసుకుంటాయో తెలిసిన సందర్భం ఇది నా వరకూ. ఏ ఇబ్బంది అయినా తప్పనిసరి కాదనీ, పరిష్కారమవుతుందనీ స్పష్టంగా తెలిసేవరకూ మనం తిరుగుబాటు చెయ్యలేము గద! అనే వాక్యాన్ని ఎన్ని సార్లు గుర్తు చేసుకుంటానో లెక్క చెప్పలేను. ఈ వాక్యానికి ఉన్న ప్రాసంగికత అపరిమితం. మీకున్న నమ్మకాలలో – మిమ్నల్ని కుంగదీసేవి, వెనక్కి లాగేవీ ఏవని ఒక్కసారి తైపారు వేసుకుని చూడండి – మీ ఇబ్బంది తప్పనిసరి అనీ, పరిష్కారం కాదనీ నమ్మడం వాటిలో ఒక భాగమై ఉంటుంది. కలుపుమొక్కలు అసలు మొక్క సారాన్ని ఎలా పీల్చేస్తాయో –మన స్వశక్తి మీద పరిమితిని విధించే ఈ విశ్వాసాలు (limiting beliefs)  మన జీవశక్తిని పీల్చి పిప్పి చేస్తాయి. కొన్నిసార్లు సమస్యను ఎదుర్కోవడానికి మన విశ్వాసబలం చాలకపోవచ్చు. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న కరోనాలాటివి మన వ్యక్తిగత స్థాయిని మించి ఉండొచ్చు. ఆ సమస్యల ‘మూలకందం’ గుర్తించాలంటే విజ్ఞానశాస్త్రం, సామాజిక శాస్త్రాలు అందించే ఉపకరణాలను తెచ్చుకోవాలి. ఆలోగా, పరిమితులకు విరుగుడుగా సాహిత్యం మనకి ఉపకరించగలదు. ప్రపంచ యుద్ధమైనా, కరోనా లాంటి అంటువ్యాధైనా – మనుషులతో ముడిపడిన చిక్కుముడులు వేటినైనా విడదీసుకునేందుకు సాహిత్యం తప్పకుండా సహకరిస్తుందని గట్టి నమ్మకం నాకు.

పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.

3 thoughts on “కొ.కు – ‘అద్దెకొంప’

  1. అంతర్లీనం గా నాలో వున్న ఒక సందేహానికి నీ పైకథ సమాధానం గా అనిపించింది, కనీసం నా సమస్య ఏమిటో అర్థం అయ్యింది, పిల్లి మెడలో గంట కట్టడం గురించి, అది పులి, సిం హం లా కనిపిస్తోంది, కార్పొరేట్ బుల్లీయింగ్ గురించి నాలాంటి పల్లెటూరి నేపధ్యం వున్న సాదాసీదా పిల్లగానికి అర్థం చేయించింది, ఇలాంటి కథలు వివరణలు అద్భుతం గా వుపయోగ పడుతాయి

  2. ధన్యవాదాలు సుధీర్ గారూ … మీ స్పందన రాసినందుకు.
    నాకూ అలాగే ఎక్కడిదో ఏదో ప్రశ్నకి జవాబు దొరికిందనిపిస్తూ ఉంటుంది KoKu కథలు చదువుతున్నప్పుడల్లా.
    మరో పాఠకుడికి అదే అనుభవం అయిందని.
    చదివి సంతోషపడ్డాను. 🙂

  3. కొ.కు. కథ.. దాన్ని పరిచయం చేస్తూ మీరు చేసిన విశ్లేషణ – రెండూ బాగున్నాయి. ఈ కథ సారాన్ని ఇప్పటి పరిస్థితులకు చక్కగా అన్వయించారు. జీవిత సమస్యలకు సాహిత్యం సూచించగల పరిష్కారాలపై మీ వ్యాఖ్య అర్థవంతం.

Leave a Reply