కొలిమి

బొగ్గులు బుక్కి
అగ్గి కక్కిన
ఆకలి రక్కసి నేపథ్యంగా
అక్షరాల కొలిమంటుకున్నది

ఇకిలించే ఇజాలు
బాకాలా బడాయి నైజాలు
నిండార్గ నివురుతో నీల్గు
నిజాల నిగ్గు తేల్చడానికి
కొలిమంటుకున్నది

బడుగు జీవుల గొడుగుగా
అబలలకు ముందడుగుగా
పీడనలపయి పిడుగుగా
కైతల సెగలు కక్కుతూ…
కొలిమంటుకున్నది

అర్థ బలపు కాటు
అంగ బలపు మాటు
అధికార బలపు పోటు
బుద్ధి బలాన్ని గద్దెనెక్కించడానికి
నిప్పు కణికల భావనలు చిమ్ముతూ…
కొలిమంటుకున్నది

అవినీతి హస్తపు జోరు
ఆశ్రిత పక్షపాత అంభుజపు హోరు
బంధుప్రీతి కారు చీకటి పోరు
పారదర్శకతా పాశుపతాస్త్రాన్ని పదునెట్టడానికీ
సాహితీ సమ్మెటను మోదుతూ…
కొలిమంటుకున్నది

సలసల మసిలే నెత్తుటి సిరా
చిటపటలాడే బొమికెల కలం మర
భగభగమండే భావనలను కుమ్మగ
దోపిడీని దాకలిగా వాడుకుంట
సమసమాజానికి సాగుతూ…
అక్షరాల పెనుమంటల కొలిమంటుకున్నది

స్వగ్రామం మద్దికుంట, కరీంనగర్ జిల్లా. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ(తెలుగు సాహిత్యం). అచ్చయిన తొలి రచన: "మన జాతికే వెలుగంట(క‌విత‌). రచనా ప్రక్రియలు: పద్యం, వచన కవిత్వం , వ్యాసం, పాట, కథ, నానీలు. ముద్రితాలు: 1."మేలుకొలుపు"వచన కవితాసంపుటి, 2. చదువులమ్మ శతకం, 3.పల్లె నానీలు, 4."ఎర్రగాలు వచన కవిత్వం. 5."ఆరుద్ర పురుగు"వచన కవిత్వం. సంపాదకత్వం: 1."నల్లాలం పూలు(బడి పిల్లల కవిత్వం) 2."సోపతి" ఎన్నీల ముచ్చట్లు ఐదేండ్ల పండుగ. 3."ఎన్నీల ముచ్చట్లు"కవితా గాన సంకలనాలు -10. ప్ర‌స్తుతం తెలుగు భాషోపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నారు.

8 thoughts on “కొలిమి

 1. మంచి కవిత కొలిమంటుకున్నది కూకట్ల సార్

  1. ధన్యవాదాలు అన్న

   మీ కవిత్వం కూడా కొలిమికి పంపండి

 2. సాహితీ రంగంలో “కొలిమి” ప్రత్యేకతను చాటుకుంటుదని విశ్వసిస్తున్నాను.

 3. కొలిమంటు కున్నది అక్షరాల సాక్షిగా ***ఎంతో బాగున్నది. ****@@@*సిరిసిల్లా గఫుర్ శిక్షక్ *****

 4. అర్ధ బలపు కాటు అంగ బలపు పోటు అధికార బలపు మాటు బుద్ధిబలాన్ని గద్దెనెక్కిన చేయడానికి నిప్పు కణికల భావనలు చిమ్ముతూ కొలిమంటుకున్నద

  చాలా పదునైన పదాలను వాడి మీ భావనలను తెలియజేశారు ధన్యవాదాలు ఇది కవి యొక్క కలానికున్న బలం

Leave a Reply