‘కొలిమంటుకున్న‌ది’ న‌వ‌ల‌ నేప‌థ్యం- ప్రాసంగిక‌త‌- ఉప‌క‌ర‌ణాలు – 3

‘కొలిమంటుకున్నది’ నవల నాటి నుండి ఈనాటి వరకు స్థలకాలాల్లో ఏం జరిగిందో ముందు చర్చించాను. అలాంటి పరిణామాల మూలకంగా ఇపుడు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులున్నాయి? ఆ పరిస్థితుల గతిక్రమం అర్థం చేసుకోవడానికి శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ‘కొలిమంటుకున్నది’ నవలలో ఆరంభమయిన విప్లవోద్యమం, అందులో పాల్గొన్న ప్రజలు, అమరులైన విప్లవకారులు, తమ అనుభవసారంగా కొన్ని ఉపకరణాలు మనకందించారు. ఈ ఉపకరణాలు కార్ల్ మార్క్స్, లెనిన్‌, మావో నుంచి నేటిదాకా పోరాడుతున్న ప్రజలు రూపొందించినవే అయినా స్థలకాలాల్లో ఈ గుణపాఠాలు ప్రపంచ విప్లవోద్యమానికి చేర్పు. అర్థభూస్వామిక, అర్థవలస రాజ్యాధికారాన్ని కూలదోసి- వ్యవసాయ విప్లవం ఇరుసుగా- నూతన ప్రజాస్వామిక విప్లవం జయప్రదం చేయడం. స్థూలంగా తెలంగాణలో, భారతదేశంలో సుధీర్ఘకాలంగా ఉత్పత్తిలో సహజ పరిణామక్రమం లుంగలు చుట్టుకపోయి నెలకొన్న ప్రతిష్టంభన- అందుకు కారణమైన నిచ్చెనమెట్ల కులవ్యవస్థ- పీడిత ప్రజలను చీలదీయడమే కాక, కులానికి, కులానికి మధ్య వైరుధ్యాన్ని పెంచి పోషించింది. అదనపు విలువ, సంపద కులప్రాతిపదికనే కేంద్రీకరించబడినది. అందుకే సుదీర్ఘకాలం భూస్వామ్యం కొనసాగింది. అదనపు విలువ పెట్టుబడిగా అభివృద్ధి చెందలేదు. ఇంగ్లీషువాని ప్రవేశం ద్వారా వలస పెట్టుబడి, వ్యాపారపెట్టుబడితో దళారీ బూర్జువావర్గమే ఏర్పడి భూస్వామ్యంతో మిలాఖత్‌ అయి కొనసాగుతోంది. తొలిదశలో జాతీయ బూర్జువాలుగా కొనసాగిన వాళ్లందరిని ఇంగ్లీషు వలసవాదులు, దళారీ బూర్జువావర్గం కలిసి అణచివేయడమో, తమలో కులుపుకోవడమో చేశారు. భూస్వామ్యంతో దళారీ బూర్జువావర్గం ఘర్షణ పడకుండా మిగతా చోట్ల నిర్మూలించినట్లుగా నిర్మూలించలేదు. ఇవి భారతదేశ ఉత్పత్తి సంబంధాల్లో సుదీర్ఘకాలంగా నెలకొన్నాయి. కనుక భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం తద్వారా సోషలిజం సాధించడం రైతాంగం, ఆదివాసీల మీద పడింది.

‘కొలిమంటుకున్నది’ నవల నాటికి గ్రామాల్లో ఉత్పత్తి వనరుల్లో కదలిక మొదలైంది. ఒకపుడు 65శాతం దాకా భూమి భూస్వాములు, ధనిక రైతుల యాజమాన్యం కింద ఉండేది. ఇపుడు 65 శాతం భూమి సన్నకారు, పేదరైతులకు చేరింది. ఇందులో అధికభాగం బహుజనులు. ‘దున్నేవారికి భూమి’ నినాదం దళిత ప్రజలకు భూమి పంచలేదు. 90శాతం దళితలు రైతు కూలీలుగానే ఉన్నారు. ఇది ఈనాటి పరిస్థితి. ఇలాంటి స్థితిని మార్చడానికి తెలంగాణ జనసభగానీ, విప్లవోద్యమంగానీ గ్రామీణ భూయాజమాన్య స్థితిని మార్చాలనుకున్నది. అందుకే దళితులకు మూడెకరాల భూమి నినాదమిచ్చింది. ప్రభుత్వ, అటవీబంజరు, శిఖం భూములు ఉమ్మడిగా సాగుచేయడం గురించి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉపకరణాలు, ఎద్దులు, పెట్టుబడి, విత్తనాలు, నీటివనరుల అభివృద్ధి, పశువులు, కుటీరపరిశ్రమల లాంటి అనేక అనుబంధ విషయాలు అభివృద్ధి చేయాలనుకున్నది. ఈ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో వాళ్లకు తగిన శాస్త్రీయ పరిజ్ఞానంతో జరగాలని ప్రజలే నిజమైన చోదకశక్తులని గుర్తించింది. ఉత్పత్తి అయిన పంట ధరలు నిర్ణయించడంలో ప్రజల పాత్రను తప్పనిసరి చేయాలని వీటన్నిటిని నిర్మిస్తే గ్రామాల్లో తప్పనిసరిగా ఉత్పత్తి శక్తులు అభివృద్ధి తద్వారా ఉత్పత్తి సంబంధాల ప్రజాస్వామీకరణ జరుగుతుంది. కాని ఇలాంటి ప్రజాస్వామిక సంబంధాల అభివృద్ది అంటే 73% భారతీయ ఉత్పత్తిని 10% మంది దేశ విదేశ శక్తులు దోపిడిచేయడం ఆగిపోతుంది. ప్రజలు ఒకసారి ప్రజాస్వామిక సంబంధాల్లోకి రావడమంటే, హేతుబద్దమై, కరుడు గట్టిన అర్థవలస- అర్థ భూస్వామ్య శక్తుల గురించి ఆలోచించడం. అది జరిగితే భారతదేశంలోని వనరులను, ఖనిజాలను, అదనపువిలువలను దోచుకొని, చెత్త సరుకుల మార్కెట్టును అంటగట్టిన సామ్రాజ్యవాదుల, వారి దళారుల ఆటలు సాగవు.

కనుక తెలంగాణ ఒక కొత్త పరిణామంలోకి వెళ్ళడాన్ని, మారడాన్ని నిరోధించడానికి, అన్ని ముసుగులు తీసేసి పూర్తిగా నిర్దాక్షిణ్యంగా అణిచివేయడం తెలంగాణాలో కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి అనివార్యం.

అదెట్లా…

“కొలిమంటుకున్నది” నాటికి మొరటు భూస్వామ్యం కొనసాగుతోంది. విద్యుత్తులాంటి మౌళికసౌకర్యాలు కల్పించాలనుకున్నా కూడా, భూస్వాములు రైతులకు అందకుండా చేశారు. వాళ్ళే అన్ని రకాల అభివృద్ధికరమైన అంశాలను ఉపయోగించుకొని ప్రజలను అణిచివేశారు. యంత్రాంగం వారికే సేవలు చేసింది.

ఇవ్వాళ అట్లా కాదు. ఉత్పత్తి యాజమాన్య స్థితి మార్చకుండా ఉత్పత్తి వనరులను అభివృద్ధి చేస్తున్నారు. అదీ బహుజనుల దాకనే చేరుతుంది. దళితులకు మూడెకరాల భూమి, వ్యవసాయానికి మద్దతు మాటలకే పరిమితమయ్యింది. గ్రామాలు తరిమేసిన దొరలు ‘కొలిమంటుకున్నది’ లోని మొరటు దొరలు కాదు. పైగా వాళ్ళు ఇప్పుడు క్షేత్రస్థాయిలోయుద్ధరంగంలో లేరు. వాళ్ళు దళారులుగా, బడా పెట్టుబడిదారులతో కలువడమే కాదు, రూపాంతరం చెందుతున్నారు.

ఒకప్పుడు పశువులు, తమ రెక్కల కష్టం, తమవే విత్తనాలు, మొత్తంగా తమ ప్రమేయంతో, తమ ఆధీనంలో వ్యవసాయం చేసిన రైతులు ఎక్కువ భాగం సన్నకారు రైతులుగా, పేద రైతులుగా మారిపోయారు. విత్తనం, ఎరువులు, దున్నడం, గింజలు తీయడం అమ్మడం దాకా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ యంత్రాలు వచ్చాయి. ఇలాంటి యంత్రాలు డిజిల్ నుండి, స్పేర్ పార్ట్స్ దాకా సామ్రాజ్యవాదుల మీద అధారపడుతున్నాయి. ఫలితంగా రైతులను ఇబ్బడి ముబ్బడిగా దోపిడి చేయడంలో ఈ యంత్రాలు వాహికలయ్యాయే కాని ఉత్పత్తి సంబంధాలలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఈ మొత్తం వ్యవహారమంతా అంతర్గతంగా కులప్రాతిపదికన జరుగుతోంది.

గిట్టుబాటు ధరలు లేకపోవడం మరొక రకమైన మార్కెట్టు దోపిడి. మన చుట్టు పక్కల గల దేశాలు పెట్రోలు, డిజిల్ ధరలు లీటర్ కు మనకన్నా సుమారు 40 నుండి 50 రూపాయల దాకా తక్కువగా అమ్ముతున్నాయి. ఈ దోపిడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నాయి. ఫలితంగా సన్నకారు రైతులకు నెలకు ఆరువేలు లేదా ఎనిమిదివేలు గిట్టే పరిస్థితి లేదు. పైగా వ్యవసాయంలో ఖర్చులు, విద్య, వైద్యం ఖర్చులు పెరిగి దివాళా తీస్తున్నారు. ఈ మొత్తం రోజ్ గార్ పనులుగాని, మరే యితర రైతుకూలీ మొత్తాల కన్నా తక్కువ. అందుకే రైతులు ఆత్మహత్యలకు పాలుపడుతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. రాయలసీమలో నీళ్ళు లేక వ్యవసాయం దండుగమారిగా మారింది.

కాని తెలంగాణలోని కొత్త దొరలు – లేదా కేంద్ర ప్రభుత్వం – ఇలాంటి రైతులను లబ్ధిదారులుగా చేసే రుణమాఫి, రైతుబంధు పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇవికూడా కౌలు రైతులకు అందవు. ఉత్పత్తి వనరులను అభివృద్ది చేసి అప్పులు చేసైనా- ఉత్పత్తి పెంచి- వాళ్ళ శ్రమనుండి ఎక్కువగా అదనపు విలువ కొల్లగొట్టే ఎత్తుగడలే ఇవి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, సామ్రాజ్యవాదులు వేస్తున్న మోసపూరితమైన పథకాలు.

బహుశా ఇలాంటి సన్నివేశంలో, గ్రామీణ ప్రాంతాలల్లో, పట్టణ ప్రాంతాలల్లో 1972 నాటికి నిరుద్యోగం పెరిగింది. అంతకుముందటి సంక్షేమ పథకాలైన విద్య, వైద్యం ప్రైవేటు పరమయ్యాయి. వ్యాపారపంటలు, బహుళ జాతి కంపెనీల విత్తనాలు, మందులు విలయ తాండవం జరుగుతోంది. ఉత్పత్తి రంగం అతలాకుతలమయిపోయింది. పరిశ్రమలుకుంటుతున్నాయి. దళారులుగా బహుళ జాతి కంపెనీలను ఆహ్వానాలు పలికే కార్యక్రమంలో ప్రభుత్వాలున్నాయి. కాని తెలంగాణ ప్రజలు గత యాభై సంవత్సరాలుగా విప్లవోద్యమంలో తర్ఫీదై ఉన్నారు. వారికి నాయకత్వం వహించగల శ్రేణులు – తీవ్రమైన నిర్బంధంలో వైరుద్యాలను వెనువెంటనే పరిష్కరించగల నిర్మాణాలు లేక – వెనకంజలో ఉన్నారు.

కొలిమి అంటుకొని మండుతున్న దశలో, ఒక గెంతుతో మరో రూపం తీసుకొని ముందుకు సాగాల్సిన తరుణంలో దళితులు, మహిళలు, మతమైనారిటీలు, బహుజనులు ముందుకు సాగే ఎత్తుగడలు ముందుకుసాగని ప్రతిష్టంభన దశలో ప్రజలు కోపోద్రిక్తతలో ఉన్నారు. చిటపటలాడుతున్నారు. దారులు వెతుకుతున్నారు. పూర్తిగా భూస్వామ్య, పెట్టుబడి కట్టుకథలతో నిండిపోయిన పత్రికలు, మీడియాలు ఈ స్థితులను వక్రీకరిస్తున్నారు. ప్రజల భాషలో ప్రజాస్వామిక చిలుక పలుకులు పలుకుతూనే, సాయుధ బలగాల పెంపు, సాంకేతిక పెంపు చేసి దేశమంతా జైలుగా మారుస్తున్నారు. అన్నిచోట్ల ఆ నిర్బంధం కనిపిస్తుంది.

తెలంగాణలో ప్రజలు ఈ అన్ని రకాల స్థితులను అనుభవిస్తూనే, అత్యంత సుదీర్ఘమైన, సాహసోపేతమైన, త్యాగపూరితమైన విప్లవోద్యమ అనుభవంతో ముందుకు సాగగలరని ‘కొలిమంటుకున్నది’ నవల ఒక నిర్మాణాన్నిఅందించిన ఆనాటి విప్లవోద్యమ స్ఫూర్తిని, ఉపకరణాలను మూడో తరమైన యువకులకు అందిస్తోంది. అది ఒకే ఒక్కమాటలో చెప్పాలంటే ‘ప్రజలే చరిత్ర నిర్మాతలు.’

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply