కొలకలూరి ఇనాక్ కథలు – భిన్న వృత్తుల జీవనం; భిన్న సామాజిక సమస్యల చిత్రణం

మాల మాదిగల సంప్రదాయ వృత్తి జీవితాన్ని, సాంఘిక జీవితాన్ని, ఆహార సంస్కృతిని – కథాక్రమంలో భాగంగా తాను నమోదు చెయ్యకపోతే ఆ జీవితం, అందులోని మానవీయ పరిమళం ఎవరికీ తెలియకుండా పోతుంది అన్న అవగాహన, ఆ సామజిక వర్గాలకు తాను సాహిత్య రంగంలో బలమైన ప్రతినిధి గా నిలబడాలన్న ఆకాంక్ష నడిపిస్తే రాసిన కథలు కొలకలూరి ఇనాక్ వి. అదే సమయంలో ఆయన బహుజనుల వృత్తి జీవన చిత్రణ పట్ల చూపిన ఆసక్తి కి నిదర్శనాలు ‘పిండీకృత శాటి’, ‘పశ్చాద్భూమి’, ‘తలలేనోడు’, ‘మెదడు వాపు’, ‘ఉగ్గుపాలు’ వంటి కథలు.

వీటిలో మొదటి మూడుకథలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. ఒక్కొక్కకథకు మధ్యఎడం ఏడాది. 1968-69 ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో ప్రచురించబడిన ‘పశ్చాద్భూమి’ కథకు పాకీ పని వారి జీవితం ఇతివృత్తం. మనుషులు విసర్జించే మలాన్ని ఇల్లిల్లూ తిరిగి తట్టలకు ఎత్తి, వాటికోసం నిర్దేశించబడిన డ్రమ్ములలో పోయటం, ఆ డ్రమ్ములను బండ్లకు, లారీలకు ఎక్కించి నిర్దిష్ట భూభాగానికి చేర్చటం, అక్కడ పెద్దపెద్ద గుంటలు తవ్వి డ్రమ్ములలోని మలాన్ని వాటిలో కుమ్మరించటం, తగిన పద్ధతుల ప్రయోగం ద్వారా పంటపొలాలకు ఎరువుగా దానిని రూపొందించటం ఇలా దశలవారీగా జరిగే పనిలో జీవిక కోసం భాగస్వాములయ్యే వాళ్ళు పాకీ వాళ్ళు. వాళ్ళు వాల్మీక కులం. దళితులలో భాగం అనిఅంటారు. ఇళ్లల్లో, పాఠశాలల్లో, రైల్వే మార్గం వెంబడి, ఇనప రేకులు చీపుళ్లు సహాయంతో మానవ మలం ఎత్తిపోసే మనుషులు, డ్రైనేజీలలోకి దిగి శుభ్రం చేసే మనుషులు. వీళ్లంతా సఫాయి కర్మచారులు. పారిశుధ్య కార్మికులు. భారతదేశం 1993 నుండి నిషేధించినప్పటికీ అత్యంత దారుణమైన, రక్షణ ఏర్పాట్లు, సహాయం ఏమీ లేని అత్యంత హేయమైన ఈ మానవ శ్రమ లో ఇప్పుడు అయిదు మిలియన్ల జనం నిమగ్నమై ఉన్నారు. రెండు మిలియన్ల మంది అత్యంత ప్రమాదకర పరిస్థితులలో పని చేస్తున్నారు. ఈప్రపంచాన్ని పరిశుద్ధం చేసేందుకు అశుద్ధాన్ని మోసే శ్రామిక వర్గం సంక్షేమం కోసం, పని భద్రత, పని స్థలాలలో భద్రత, రక్షణ ఏర్పాట్లు, ఆరోగ్యం, కనీస మానవ హక్కులు, న్యాయమైన వేతనాలు మొదలైన వాటికోసం ఈనాడు ఉద్యమాలు జరుగుతున్నాయి. బెజవాడ విల్సన్ వంటివారు ఈ ఉద్యమాలకు చురుకైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. ఈ వర్తమానంలో నిలబడి చూస్తే యాభై ఏళ్ల క్రితపు ఇనాక్ కథ ఎంత ముందు చూపుతో వ్రాసినదో అర్ధం అవుతుంది.

ఒకరోజు తెల్లవారటం దగ్గర ప్రారంభమై సూర్యుడు నడినెత్తికి వచ్చేవేళకు ఒక కష్టజీవి బతుకు తెల్లవారటంతో ముగిసిన కథ పశ్చాద్భూమి. తెల్లవారుతున్నప్పుడు వేరువేరుచోట్ల జరిగినట్లు రచయిత వర్ణించిన దుశ్యాలు అన్నీ మలమూత్రాదులను ఎత్తిపోయటానికి సంబంధించినవే. ఒక చోట తల్లి జబ్బు పడ్డ పిల్లవాడు మలమూత్రాలతో పాడుచేసిన బట్టలు బాత్రూములో వేసివస్తుంది. మరొక చోట మంచం పట్టిన భర్త మలమూత్రాలతో నిండిన బకెట్ తీసుకొనివెళ్ళి భార్య లావెట్రీ లో పోసి నీళ్ళుపోసి కడిగి వచ్చే దృశ్యం. మరొకటి దొడ్డికి పోయిన తమ్ముడిని తీసుకువచ్చి అక్క ముడ్డి కడగటం. మామ వాంతులూ విరోచనాలు శుభ్రం చేస్తూ రాత్రంతా నిద్ర కాచిన కోడలు కునికిపాట్లు పడటం వేరొక దృశ్యం. హాస్పటల్ లో రోగి పేన్ తీసే నర్సు, తోటీలు. ఈ దృశ్యాలన్నిటిలో మలమూత్రాది అశుద్ధాలనుండి మనిషిని సంరక్షించేది ప్రధానంగా స్త్రీలు. శిశువు పుట్టినప్పటి నుండి సహనంతో , ప్రేమతో కుడి ఎడమ అనుకోకుండా సేవ చేసే స్త్రీత్వం గురించిన, మాతృత్వం గురించిన ఈ వర్ణన తరువాతి కథకు ఉపోద్ఘాతం వంటింది. తన రక్త సంబంధీకులకు, కుటుంబ సభ్యులకు స్త్రీలు చేసే ఈ సేవలను సకల సమాజానికి అందిస్తున్న పారిశుధ్య వృత్తి పని వారి గురించిన అసలు కథ చెప్పటానికి తెర ఎత్తటంగా చేసిన వర్ణన ఇది.

కథ పేరు పశ్చాద్భూమి. పశ్చాత్ అనేది సంస్కృత పదం. వెనక, వెనక వైపు అని ఆమాటకు అర్ధం. భూమి అనే పదంతో కలిపి పశ్చాద్భూమి అనే సమాసం చేశారు రచయిత. వెనక వైపు భూమి అంటే మలమూత్ర విసర్జన భూమి. అదే పారిశుధ్య వృత్తి పనివారికి పనిస్థలం. రాంకోటి, అతని కుటుంబ సభ్యులు ప్రతినిధులుగా ఆ వృత్తి పని వారి ఆర్ధిక సాంఘిక సమస్యలు ఇందులో చిత్రితమైనాయి. విశాలమైన పేటలలో ఇళ్ల వెనక భాగాలనుండి మలం తట్టలు నెత్తి మీద మోసుకొచ్చి సందులు గొందులు దాటి మూల మలుపులలో ఉన్నతారు డబ్బాలలో పోసి పోవటం అతని భార్య, కోడలు చేసేపని. వాటిని లారీలకు ఎక్కించి ‘డంపింగ్ యార్డ్’ కు చేర్చటం పాతికేళ్ల చిన్నకొడుకు చేసే పని. చిన్నకొడుకు తెచ్చిన మానవ వ్యర్ధాన్ని నిల్వచేయటానికి పెద్దపెద్ద గోతులు తీయించి సిద్ధం చేసి వచ్చిన సరుకును ఆ గుంట ల్లోకి దొర్లించి తారు డబ్బాలు మళ్ళీ లారీకి ఎత్తటం, ఏడాదికి ఎరువుగా మారే ఆపదార్ధాన్ని పొలాలకు తోలటానికి కొనుక్కొనటానికి వచ్చే రైతులను విచారించటం, ఎరువు తోలుకుపోయే బండ్లను లెక్కించుకొనటం తండ్రి రాంకోటి పని.
ఏకథలోనైనా పని సౌందర్యాన్ని చిత్రించటంలో అందెవేసిన చేయి అయిన ఇనాక్ ఈకథలోనూ ఆపనిచేసేవాళ్లను లయాత్మక కదలికలో మన కళ్ళముందు దృశ్యమానం చేస్తాడు.

పైట చెంగు నడుం చుట్టూతిప్పి రొంటిలోదొపుకొని మలంతట్టనెత్తిన పెట్టుకొని వచ్చే రాంకోటి భార్య ముక్కుముడుపు మీద క్షణ కాలం నిలిచి జారిపడిన చెమటబిందువు పెదవిని తడిచేస్తే మోచేతితో తుడుచుకొంటుంది.ఈవర్ణన చాలు నిలువెత్తు చిత్రపటం గా ఆమెపాఠకుల కళ్ళకు కట్టటానికి. వ్రేలి మట్టెలు కాళ్ళ కడియాలు చప్పుడు చేస్తుండగా తట్టలు మోసే కోడలి యవ్వన సౌందర్యాన్ని ముక్కుమూసుకొని, ముఖం చిట్లించి చూచీ చూడకుండా ఆమెవైపు చూచే యువకుల చూపులను గురించి చెప్పటం ద్వారా పాఠకుల ఊహకు ఉప్పందిస్తారు రచయిత. టైరుబండి నుండి నిండు మలం తారు డబ్బాలు దించుకొనే రాంకోటి కొడుకు జబ్బపుష్టిని, పిక్కబలాన్ని ఒళ్ళంతా తొణికిసలాడే యవ్వన శక్తి కాంతి మెరుపుగా కళ్ళ ముందు ఆవిష్కరిస్తారు. ఆపనిలో మిగలపండిన రాంకోటి అనుభవాన్నిఅతని శరీర వర్ణన, కాళ్ళు బారజాపి కూర్చొని మోకాటి చిప్పలు చేత్తోరుద్దుకోవటం, చుట్టకాల్చుకొనటం..చెప్పకనే చెపుతాయి. అతని నివాసం, తిండీ అన్నీఆ మల నిల్వల సమీపంలోని గుడిసెలోనే.

ఈ పనిలో ఉన్నవాళ్ళ పట్ల అంటరానితనం ఎట్లా అమలవుతుంటుందో సూచిస్తూ రావటం ఈ కథలో మరొక విశేషం. ఎరువు తోలుకుపోవటానికి వచ్చిన రైతులు తాము ఎన్నిబళ్లకు డబ్బుచెల్లించారో ఆ కాగితం రాంకోటి చేతికి ఇస్తారు కానీ అతని గాలి సోకితే నైచ్యం, హైన్యం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఎరువు ఎత్తుకొనే తావున రైతువిడిచిన బళ్లను లెక్కచూడటానికి రైతు వెంట రాంకోటి వెళ్ళేటప్పుడు “వాళ్ళిద్దరికీ ఎప్పటికీ పదిగజాల దూరం” అని రచయిత అమలవుతున్న అస్పృశ్యతను గురించిన స్పృహ కలిగిస్తారు. భార్యా, కోడలు పండగరోజుల్లో ఇంటింటి నుండి వంటకాలు అడుక్కొని రావటం గురించి చెప్తూ రచయిత ఆయా ఇంటి ఇల్లాళ్లు వాళ్ళకదలికలను నియంత్రిస్తూ ‘ఆడేవుండు’. ఈడకు రాబాకు. ఏందీ మరీదగ్గరకొత్తా? దగ్గరకి రాకే మొద్దు. అని మాట్లాడే మాటలు అస్పృశ్యతా సూచకాలే అని సూచిస్తారు. ఒంట్లో బాగాలేక ఆసుపత్రికి పోతే అక్కడ హాలులోకి రాంకోటికి ప్రవేశం ఉండదు. కాంపౌండర్ వచ్చి మందివ్వటమే. వృత్తిపరంగా అతను అస్పృశ్యుడు అయ్యాడు డాక్టరుకు, ఆసుపత్రికి కూడా.

రాంకోటికి పనిని వారసత్వం గా తీసుకొన్న చిన్నకొడుకు కాక పెద్దకొడుకులు ఇద్దరుఉన్నారు. వాళ్ళు ఏదో కాస్త చదువుకొని ఏవో ఉద్యోగాలుచేస్తున్నారు. వాళ్ళసంసారాలు చూసిరావటానికి వెళ్లిన తండ్రి అనుభవాల నుండి పాకీ వృత్తి పనికి సంబంధించిన అంతర్గత దృష్టికోణాలు రెండు పాఠకుల దృష్టికి తెచ్చారు రచయిత. పెద్దకొడుకు రంగన్నఇంటికి వెళ్ళినప్పుడు అతనితోపాటు అక్కడ అద్దెకు వుండే పోర్షన్ల వాళ్ళందరూ రెండురోజుల నుండీ రాని పాకీ మనిషి ఆరోజు వచ్చేసరికి అరిచి గోలచేశారు. భర్తకూ, పిల్లలకూ ఆరోగ్యం బాగాలేక రాలేకపోయానన్నఆమె గోడు ఎవరూ పట్టించుకోకపోవటం రాంకోటి కి కష్టం కలిగించింది. వృత్తి సమానత నుండి ఆమెబాధను అతను సహానుభూతితో స్వీకరించగలిగాడు. ఆరాత్రి కొడుకును నువ్వయినా కలగ జేసుకొని ఆమెను ఆడుకోవలసింది అనిహెచ్చరికగా అన్నప్పుడు ఇంకా నయం, నేనెవరో ఈడఎవరికీ తెలియకుండా నెట్టుకొస్తున్నా, ఇలాంటి విషయాలు పట్టించుకొని గుట్టు రట్టు చేసుకోలేను అంటాడు. తన కులవృత్తి తెలిస్తే బావిలో నీళ్లు కూడా తోడుకోనియ్యరు అంటాడతను. ఒకరకమైన అస్పృశ్యతకు జంకి తన అస్తిత్వం మరుగుపరచుకొనటానికి సిద్ధమయ్యాడు అతను. ఆక్రమంలో తనవర్గపు మనిషి బాధ అతనికి అప్రస్తుతం, అనవసరం అయినాయి. వృత్తికి సంబంధించిన నైచ్యం మనిషికి ఆపాదించే దుష్ట శ్రమ విజన మనిషిని మానవత్వానికి పరాయీకరించటం గురించిన హెచ్చరిక ఇది.

రెండో కొడుకు చింతయ్య ఇంట్లోకి పాకీ పనిచేసే ఆడమనిషి వచ్చి నీళ్లు తోడి కుండలకు పోసి, గిన్నెలు తోమి, అన్నంపెట్టించుకుని తినిపోవటం చూసిన రాంకోటి ఆమె ఇంట్లోకి రావటమేంది, ఎవరైనా ఏమనుకోరా, నిన్ను ఫలానా అని తెలిసి చులకనగా చూడరా అని మందలిస్తే తండ్రి మాటను తీసిపారేసాడు అతను. ఒకడెవడో ఏందో అనుకుంటారని పుటక దాచుకొనటానికి నేనేమన్నాఅడ్డదిడ్డంగా పుట్టి నోన్న అని ఆత్మగౌరవ ప్రకటన చేసాడు. సంపాదన పెరిగే కొద్దీ మనిషికి లభించే ఒక ధీమా చింతయ్యలో వ్యక్తం అవుతుంది.

“ పోయినేడు లారీలు తోలిందీ ఏటికి ఎరువయింది.ఇప్పుడు తోలేది వచ్చే ఏటికి ఎరువు! ఇప్పుడు పనికిరాని అసహ్యం వచ్చే ఏటికి పనికివచ్చే ఎరువు” ఈ వాక్యం కథలో కీలకమైనది.పనికి రాని అసహ్యాన్ని మోసే మనుషులను , అది ఎరువుగా మారే పర్యంతం అనేకదశలలో పనులుచేసే మనుషులను అసహ్యించుకొని దూరం పెట్టె మనుషులే ఎరువుగా అది ఒక విలువను సంతరించుకొనేసరికి దానిని దోచుకొనే అల్పత్వానికి దిగజారడం ఒకపెద్ద వైరుధ్యం. అమానుషమైన ఈవైరుధ్యాన్ని అంచలంచెలుగా నిరూపించటం వల్ల ఈ కథ ఒకతాత్వికస్థాయిని సమకూర్చుకోగలిగింది.

ఎరువు ఎక్కువ పట్టేలా పెద్ద జల్లలు గల బళ్లను తెచ్చుకొనటం, నాలుగు బళ్లకు డబ్బుగట్టి, అయిదో బండి కూడా నింపుకొని పోవటానికి ప్రయత్నించటం, సాగనప్పుడు ఎంతో కొంతఇచ్చి సర్దుబాటు చేసుకొనటం , దొంగతనంగా తోలుకుపోవటం వంటి దృశ్యాల చిత్రీకరణ ద్వారా ఏదైనా మన అనుభవానికి, మనలాభానికే అనుకొనే స్వార్ధపర వర్గ స్వభావాన్ని కేంద్రంలోకి తెచ్చారు రచయిత. దొంగతనంగా ఎరువు తోలుకు పోతున్న బండి ని ఆపాలని అరుస్తూ, పరుగెత్తుతూ రాంకోటి మానవ వ్యర్థం నింపిన గుంటలోకి జారిపడి నిస్సహాయంగా మునిగిపోతున్న భీభత్స దృశ్యంతో కథను ముగించి సమాజం, మానవసంబంధాలు ఎంత జుగుప్సావహంగా ఉన్నాయో చూపించారు ఇనాక్.

‘ఆ తరువాతి ఏడు, 1969-70 ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో ప్రచురితమైన కథ పిండీకృత శాటి’. ఇది శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద లో ప్రయోగించిన మాట. ఆముక్తమాల్యద కథాస్థలం అయిన విల్లిపుత్తూరు నగరాన్ని వర్ణిస్తూ కవి చెప్పిన “తలబక్షచ్చటగ్రుచ్చిబాతువులు” ( ప్రథమాశ్వాసం -65) పద్యంలో పిండీకృత శాటి అనే పదబంధ ప్రయోగం ఉంది. వరి మళ్లకు నీళ్లుపోయేకాలువ గట్లమీద తలను రెక్కల లోకి జొనిపి నిద్రించే బాతులనువర్ణించిన పద్యం ఇది. ‘పిండబడిన బట్ట, అని దానికి అర్ధం. శాటి అంటే వట్టి బట్ట మాత్రమే కాదు. యతులు మొదలైన మహనీయులు కట్టుకొనే వస్త్రం..తలలు కనపడకుండా గుండ్రంగా ముడుచుకొని ఉన్నట్లు ఉన్నఆ బాతులు పిండీకృత శాటికలని భ్రమపడి ఉదయమే స్నానానికి వచ్చిన బ్రాహ్మణులు పిండిపెట్టుకొన్నపంచెలు కాబోలు అనుకొని రక్షక భటులు వాటిని వారి ఇళ్లకు చేర్చాలని సమీపించగానే ఆ సవ్వడికి ఆ బాతులు లేచి పరుగెత్తాయిట. అది చూసి వరి పొలాలలో పనిచేసుకునే రైతులు నవ్వారని ఆపద్యం తాత్పర్యం. ఆపద్యంలోని పిండీకృత శాటి అనే సమాసం ఇనాక్ కథకు పేరయింది.

ఆ పద్యానికి ఈకథకు సంబంధంఏమిటి? ఇందులో బాతులు లేవుకానీ, పంచెలు, పట్టు పంచెలు ఉన్నాయి. ఆపట్టు పంచెలను మిగిలిన బట్టలతో పాటు ఉతకటానికి చెరువు గట్టు మీది మోట బావి దగ్గరకు ఇంకా సూర్యోదయం కాక ముందే వచ్చిన చాకలి గూగడు ఉన్నాడు.అతను బట్టలు ఉతకటం, ఆరెయ్యటం, వీపు చెట్టుకు ఆనించి కాసేపు విశ్రాంతి తీసుకొనటం, తోటి చాకలిని అడిగి బీడీ కాల్చటం- ఈపనిక్రమం అంతా వివరిస్తూనే సమాంతరంగా గూగడి జీవిత విషాదాన్నికూడా కథనం చేశారు రచయిత. గూగడి పనే కాదు, జీవిత ప్రయాణం కూడా పాఠకులకు దృశ్యమానం అవుతుంది.


పుట్టగానే తండ్రిని కోల్పోయాడు… పుట్టుకతో వచ్చిందో, మురికిబట్టల మూటలు మూపున మోసీ మోసీ పెరిగిందో కానీపెద్దవాడయ్యేకొద్దీ పెరిగిన గూని అతనిని అవహేళనకు, అవమానానికి గురిచేసింది. తల్లి చనిపోయి వంటరి వాడయ్యాడు. పెళ్లి, సంసారం లేని ఏకాకి జీవితంలో బట్టలు ఉతికి బతుకుగడుపుతూ అవసరాలకు ఊరి పెద్దరైతు రత్తయ్య దగ్గర అప్పుడప్పుడూ తీసుకొన్న డబ్బుకు రెండెకరాల పొలం , ఇల్లుకూడా అతనికి రాసిచ్చి వారసత్వం గా వచ్చిన ఇంట్లో అతని దయదాక్షిణ్యం మీద ఆధారపడి ఆశ్రయం పొందిన అసహాయుడు గూగడు అని మనకు తెలిసి వస్తుంది. బట్టలను శుభ్రం చేసే అతను ఒంటిమీద శుభ్రమైన – మురికి లేని, చిరుగు లేని- బట్టకు పరాయీకరింపబడిన వాడు.

మూడు పూటల కడుపునిండా తిండికి కరువైనవాడు. శ్రమ దోపిడీ దానిమూలమన్న చైతన్యం రచయిత కథనంలో అంతర్వాహిని. శ్రమను తక్కువచేసి తీసిపారెయ్యటం ద్వారా విలువను తగ్గించటం, శ్రమ చేసేవాళ్లను ఆత్మన్యూనతకు గురయ్యేట్లు చేయటం వాళ్ళ శ్రమ విలువను దోచుకొనటానికే అన్న అవగాహన కూడా రచయితకు ఉంది. గూగడు ఉతికిన బట్టలు తీసుకువెళితే మురికి పోలేదని, మడత సరిగా లేదని బూసమ్మ పేచీకి దిగటంలో అతనికి ఆపూట పెట్టవలసిన అన్నం ఎగ్గొట్టటానికే అని సూచించే ఘట్టం అంతరార్ధం అదే. మురికి బట్టలు గూగడి ముందు కుప్పవేసే ఆమె పద్ధతి ధర్మంచేసేవాళ్లుధోరణిగా ఉండేదని, ఆబట్టలు ఉతుక్కొని రాకపోతే గూగడికి నరకం వచ్చేసినట్లూ, దాన్నుంచి కాపాడటం కోసమే బట్టలు వేస్తున్నట్లు ఉండే ఆమె ప్రవర్తనను గురించి ప్రత్యేకంగా చెప్పటం ద్వారా ఎవరి శ్రమ లేనిది తమకు రోజు గడవదో ఆ వాస్తవాన్ని తలకిందులు చేసి, తాము లేకపోతే వాళ్లకు ఇహమూలేదు, పరమూ లేదన్నట్లుగా భ్రమను కల్పించి భయంలో పెట్టె పెత్తందారీ వర్గస్వభావం బూసమ్మ లో నిరూపించిచూపారు రచయిత.

ఇక ఈకథలో అసలు విషయం పట్టుపంచెలు.ధోవతి, ఉత్తరీయం.అవి ఎవరివి? రత్తయ్యవి.రత్తయ్య ఎవరు? ఊరంతటిని గడగడలాడించే సంపన్న రైతు. అతను సంపన్నుడు ఎలా అయ్యాడు? ఇతరుల సంపదలను దోచుకొనటం వల్లనే. గూగడి పొలం, ఇల్లు తనపేరుమీద వ్రాయించుకొన్నట్లుగానే ఎంతమంది ఆస్తులు తనవిగా చేసుకొంటేనో అంతసంపన్నుడైనాడు. అతని పంచెలు అవి. విలువైనవి. శ్రమ విలువలను దోపిడీచేసే రత్తయ్యకు చెందినవి కనుక వాటిని జాగ్రత్తగా ఉతికి ఆరబెట్టి మడతపెట్టి ఆయనకు భద్రంగా అప్పచెప్పటం బానిసగా గూగడి కర్తవ్యం. ఆకర్తవ్యం ఎలా నిర్వహించాడన్నదే ఇందులోకథ.

భద్రంగా పులిమి, నీళ్లుపోయేట్లు ఒత్తి పసిపిల్లలను చేతులమీద ఆడించటానికి వేసుకున్నట్లు వేసుకొని చిటికేసరం చెట్టుమీద అతిజాగ్రత్తగా ఆరేసాడు. అవి ఎండకూడదు, ఆరాలి. పొద్దుపొడవక ముందే ఆరిపోతే భద్రం చేయవచ్చని మొదటనే వాటిని ఉతికి ఆరేసాడు. ఆబట్టలు సుడిగాలికి ఎగిరి కొట్టుకు పోతుంటే అవిపోయే మార్గాన్ని మోర ఎత్తి గమనిస్తూ పడుతూ లేస్తూ కంచెలు దాటుతూ పరుగులెత్తిన గూగడు ఏదో ఆవేశం నడిపిస్తే నడిచిన మనిషివలె పంచె కోసం తాటిచెట్టు ఎక్కటం- ఇవన్నీ ఒకఉద్వేగ భరిత, ఉత్కంఠ పూరిత అనుభవం గా పాఠకులకు అందివచ్చే శిల్పమార్మికత ఈకథలో సహజంగా అమరిపోయింది.

పంచెను చేజిక్కించుకొనటానికి ప్రాణమైనా పణంగా పెట్టె తెగింపు పంచె మీద గానీ, పంచె స్వంతదారు మీద గానీ ప్రేమవల్ల రాలేదు. పంచెలు భద్రంగా అందించకపోతే ప్రాణాలు తీస్తాడన్నభయంవల్ల వచ్చింది. అరవై డెబ్బై ఏళ్ల వయసులో పొద్దుటినుండి కడుపుకు ఆసరాలేక, ఎండన బడి శ్రమచేసిన అలసట తోడై, సుడిగాలి సృష్టించిన ఆందోళనలో పరుగులుపెట్టి చెట్టెక్కి దిగేసరికి పోతుందనుకొన్నప్రాణం తోటిమనిషి సహాయం వల్ల తేరుకోనటం వేరే విషయం.భయం ఆత్మహత్యా సదృశం అయినది అని చెప్పటమే అసలు కథ ఉద్దేశం. మరణం అంచులకు వెళ్లివచ్చిన గూగడు ఉదయంచెరువు గట్టుమీదికి వచ్చిన మనిషికాదని, కొత్తమనిషి అని రచయిత అతనిలో ఒకమార్పును సూచిస్తూ ఈకథను ముగించారు.ఆమార్పు ఏ ప్రస్థానానికి దారితీస్తుందో మన ఊహకే వదిలివేశారు.

1970- 71 భారతిలో ప్రచురించబడిన కథ తలలేనోడు. ఈ కథకు కేంద్రం మంగలి వృత్తి. తల గొరిగే మంగలి వృత్తి నైపుణ్య ప్రదర్శన ఎంతఉన్నా నిజానికి ఆ విజ్ఞాన ప్రదర్శన కథకు లక్ష్యం కాదు. వృత్తి పనివాళ్ళు పెత్తందారుల దోపిడీకి గురవుతున్న తీరును , దోపిడీ చేసే వర్గం పట్ల పీడితులలో పెరుగుతున్న కసిని చిత్రించి ఆ రెంటి మధ్య సంఘర్షణ తీవ్రమయ్యే కొద్దీ ఉత్పన్నమయ్యే సంక్షోభాల సంగతిఆలోచించమంటారు ఇనాక్ ఈ కథ లో . మంగలి పని కానీ , మరే పని చేసేవాడు కానీ ఆ పని మాత్రమే చేసుకొంటూ ఉన్నంత కాలం పెత్తందారీ వర్గాలు వాళ్ళ జోలికి రావు. కానీ వాళ్ళు ఇంత భూమికి స్వంతదారులైతే మాత్రం అది ఎక్కడో ఎప్పుడో పెత్తందారుల పెత్తనం ధిక్కారానికి గురవుతుంది. అధికార పునాదుల ప్రకంపనంగా అది తోచి ధిక్కారానికి ధైర్యం ఇచ్చిన భూమి నుండి వాళ్ళను పరాయీకరించే పర్యంతం కనపడని కుట్ర అంచలంచెలుగా నిర్మించబడుతుంటుంది. ఆ సాలెగూటి నిర్మాణంలో చిన్నరైతు గిలగిల లాడవలసినదే.

తల లేనోడు కథలో కథ అదే. ఇనాక్ కథలు చాలావరకు తెల్లవారటం దగ్గర ప్రారంభం అవుతాయి. ఈ కథ కూడా అంతే . తెల్లవారుతుండగా పొలం నుండి ఇంటికి వస్తున్న తండ్రి కోటి, ఇంటి నుండి మునసబు వీరన్న తలజుట్టు, గడ్డం తీసెయ్యటానికి మంగలి పొది పట్టుకొని పోతున్న కొడుకు కోటిలింగం ఎదురుపడటం తో కథ మొదలవుతుంది. తలజుట్టు తీసేపనికి రమ్మని వీరన్న పంపిన కబురును నిరసిస్తున్నట్లుగా పోని నాగలింగం వూళ్ళో ఉండాలంటే పని చెయ్యాల్సిందే నన్న వీరన్న బెదిరింపు వార్తను తెచ్చి వూళ్ళో ఉండాల్సిన వాడివి మునసబును ఎదిరించి బతకలేవన్న మోతాదు ఉపదేశం విని వీరన్న తలగొరగటానికి సిద్ధపడి వెళ్తున్న నాగలింగం సంక్షుభిత హృదయ చిత్రణ ఈ కథ.

నాగలింగం ఊరి మంగలి వాడై మునసబు తల గొరగటానికి నిరాకరించటం వెనక పెద్ద కథ ఉంది. అది రచయిత కథనంలాగా కొంత, నాగలింగం జ్ఞాపకాల కదలికలాగా కొంతకొంత గా కథ మొత్తం పూర్తయ్యేసరికి పాఠకులకు పూర్తిగా తెలుస్తుంది. నాగలింగం కోటికి ఒక్కడే కొడుకు. కొడుకు చదువుకొని ఉద్యోగస్థుడు కావాలని తండ్రి కలగన్నాడు. కానీ నాగలింగానికి చదువు అబ్బలేదు. వృత్తిపని నేర్పించాడు. దాని మీదా శ్రద్ధ పెట్టలేదు. వాడెట్లా బతుకుతాడా అని దిగులుపడి కాయకష్టం చేసి రెండెకరాల భూమి సంపాదించాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని చేసాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయినాడు కానీ నాగలింగానికి కుదురు ఏర్పడలేదు. రెండెకరాల రైతు అయిన కోటి ఒకనాడుపొలంలో ఉండగా మునసబు వీరన్నపొలం నుండి ధాన్యం బస్తాల బండ్లు దగ్గర దోవ అని కోటి పొలం గుండా బయల్దేరినాయి. వేరుశెనగ, కందుల పంటను తొక్కుకుంటూ బండ్లు సాగుతుంటే చూసి, ఆపి, మందలించి వెనక్కు పంపాడు కోటి. అది తన అధికారం పై ధిక్కారంగా తోచి వీరన్న ప్రతీకారానికి పన్నాగం పన్నాడు. రైతు మీద ప్రతీకారం తీర్చుకొనటం అంటే రైతును భూమినుండి పరాయీకరించటమే. బాధ్యత పట్టకుండా తిరుగుతున్న నాగలింగాన్నిచేరదీసి కలిసి తాగుతూ, చేబదుళ్ళు చేయవలసిన అవసరాన్ని కల్పిస్తూ తానే అప్పు ఇస్తూ కొన్నాళ్ళకు ఆ అప్పుకు కాయితం వ్రాయించి సంతకంచేయించి చివరికి ఒకనాడు ఆ అప్పు చెల్లింపుకు కోటి పొలం తన స్వంతం కావాలని పట్టుబట్టాడు. నాగలింగానికి అది మిత్రద్రోహంగా, అవమానకరంగా అనిపిం చింది. కోటి పొలం స్వాధీనం చేయటానికి మొరాయించాడు. దానితో కోర్టుకు ఎక్కాడు వీరన్న. ఆకేసు గెలవటం తనపరువుకు, ప్రతిష్టకు, వంశ గౌరవానికి సంబంధించిన సవాల్ గా భావించిన వీరన్న కేసు గెలిస్తే జుట్టు వెంకటేశ్వర స్వామికి ఇస్తానని మొక్కి ఆ రోజు నుండి క్షౌరం చేయించుకోకుండా పెంచుకొంటూ వచ్చాడు. ఆరునెలలకు కేసు అతని పక్షమే అయింది. పంతంనెగ్గి జుట్టు తీయించుకొనే రోజు వచ్చింది. ఆముహూర్తమే కోటి పొలం పోగొట్టుకొనే దుర్దినం కూడా. నిజానికి కథ మొదలైంది ఇక్కడ.

పొలం దక్కించుకొనటం ద్వారా కోటి మీద విజయం సాధించిన వీరన్న అధికార గర్వం ఆ విజయానికి గుర్తుగా తీయించు కోవలసిన తలజుట్టును పరాజితులైన కోటి, నాగలింగాలలో ఎవరో ఒకరు వచ్చి తీసేయాలని పంతం పట్టటం దగ్గర పరాకాష్ఠకు చేరింది. తనను వంచించి తండ్రి పొలం లాగేసుకొన్నాడని వీరన్న మీద కలిగిన కోపం వల్ల అతనింటికి వెళ్లి క్షురకర్మ చేయటానికి నాగలింగానికి మనసు ఒప్పలేదు.కానీ జీవితవాస్తవం బాధితులకు, పరాజితులకు మనసు ఉండకూడదని పొట్ట, బతుకు తెరువు భయం మాత్రమే ఉండాలని మొహంమీద కొట్టిచెప్పేసరికి మంగలిపొది చేతబట్టి వీరన్న ఇంటికి బయలుదేరక తప్పలేదు అతనికి. కొడుకు చేసిన అప్పుకింద వీరన్న కు భూమిని వదిలివెయ్యవలసిన పరిస్థితిలో రాత్రంతా పొలంలో తుది వీడుకోలు చెప్తున్నట్లుగా గడిపి నిస్సహాయ దుఃఖం మూర్తీభవించినట్లు తిరిగి వస్తున్న తండ్రి అతనికి ఎదురు పడటం దగ్గర కథను ప్రారంభించి ఇనాక్ ఒకానొక అసమ అమానవీయ సామాజిక స్థితి ఫలితమైన విషాదం నేపధ్యంగా ఈ కథను నడిపారు.

వంచనతో తనమీద విజయాన్నిసాధించి తన అధికారానికి తిరుగులేదని మీసాలు మెలేసిన వీరన్న తలపని తానే చెయ్యాల్సి రావటం నాగలింగంలో ఎంత కసిని రగిలిస్తున్నదో ఆ మనసంక్షోభాన్ని వ్యక్తీకరించే శిల్పం క్షురకర్మ క్రమంతో కలిపి సాధించటం ఈకథలో విశేషం.నాగలింగం తలజుట్టు తీసెయ్యటానికి మెడవంచి ముచ్చెన గుంటలో కత్తి పెట్టినప్పటి నుండి తలజుట్టు తీసి,గడ్డం , మీసం తీసేసి మెడ కింద మిగిలిన చివరి వెంట్రుకను మెడ పైకెత్తి కత్తితో తీసేసి ‘అయ్యిపొయ్యింది’ అనే వరకు ఏక్షణం ఆకత్తి వీరన్న తలను తెగనరుకుతుందో అన్న భ్రమను కలిగిస్తూ కథనం సాగింది. ఈరోజు అది భ్రమగా కనిపించవచ్చు. కానీ ఏ పనికైనా శ్రామిక వర్గం మీద ఆధారపడిన పరాన్నజీవులుగా దోపిడీ వర్గం ఒక నిస్సహాయ స్థితిని ఎదుర్కొనే రోజు ఎప్పుడో ఒకరోజు అనివార్యమన్న సూచన ఇందులో ఉంది. వ్యక్తి కసి వర్గకసిగా మారటం గురించిన సూచన అది. తామే భువికి అధినాధులమని విర్రవీగే వర్గపు బతుకు ఎంత తలలేని వ్యవహారమో చెప్పటం ఈకథ అంతరార్ధం.

మెదడు వాపు వ్యాధి మరణాలు సృష్టించిన ఒక భయోద్విగ్న స్థితిలో పందులు వాటికి మూలకారణం కనుక వాటిని పట్టి చంపాలన్నకార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఇనాక్ ఆ సమస్యను పందుల పెంపకం పై ఆధారపడి అదే జీవనం గా ఉన్న వర్గాల కోణం నుండి ఒకసామాజిక వాస్తవికతను వైరుధ్యాలను చిత్రిస్తూ వ్రాసిన కథ ‘మెదడు వాపు’ భిన్న జీవన వృత్తులు గల సామాజిక వర్గాల మధ్య ప్రేమ, పెళ్లి తెచ్చే పెనుమార్పుల గురించిన కథ ఉగ్గుపాలు. మేకలను, గొర్రెలను పెంచే గొల్ల ఇంటి ఆడపడుచు మేకలను, గొర్రెలను బేరమాడి కొని మాంసం వ్యాపారులకు విక్రయించే వృత్తిలో ఉన్న యువకుడిని ప్రేమించి పెళ్లాడుతుంది. కొలిమి పెట్టుకొని బతుకు తెరువు మార్గంలో అతను ప్రతి ఆదివారం మాంసం కొట్టునుండి వచ్చే మేక తలకాయలు, గొర్రె తలకాయలు, కాళ్ళు కాల్చి ఇచ్చేపనికి ఒప్పుకున్నాడు.ఆమె పెరిగిన వాతావరణానికి సరిపడని పని అది. ఆవాసనలు, భీభత్సము భరించలేక భర్త ఆపని పూర్తి చేసేవరకు ఆమెబిడ్డను తీసుకొని ఏపార్కు కోవెళ్లివస్తుంటుంది.

అతను జబ్బు పడ్డప్పుడు తమతిండికి, భర్త మందులకు డబ్బు అవసరం పెట్టిన ఒత్తిడిలో ఆమె పడిన ఘర్షణ, పొందిన సమాధానం, పనికి సిద్ధపడటం ఈకథలో విషయం.పని ఏదైనా ఎవరికీ పుట్టుకతో రాదనీ, వీళ్ళు ఈపనికే నిర్దేశించబడినవాళ్లు అన్ననియమం కూడా ఏమీ లేదని, బ్రతుకు తెరువు అవసరాలే మనుషులను ఏదో ఒక పనిని ఎంచుకొని చేయటానికి పురికొల్పుతాయని చెప్పటం రచయిత ఉద్దేశం కావచ్చు. ఏమైనా ఏ వృత్తిలో నైనా అంతర్వాహిని అయిన జీవన లాలస సౌందర్య మూలమన్న దృక్పథం ఇనాక్ కథలలో కనబడుతుంది.

ఇనాక్ బాహిర వాస్తవాల వైపు చూపున్న రచయిత. ఆర్ధిక అసమానతలు, కుల లింగ అసమానతలతో పాటు వ్యవసాయరంగ సంక్షోభం, సమకాలపు ప్రాంతీయ అసమానతలు , ఉద్విగ్నతలు,భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుల విధ్వంసం వంటివి కూడా ఆయనకు కథా వస్తువులైనాయి.

రాయల సీమ రచయితల కథలకు కరువు , రైతు జీవిత విషాదం వస్తువైనట్లు మరేదీ కాలేదు అన్నది కాస్త అతిశయోక్తిగా కనిపించినా అందులో కొంత వాస్తవం వుంది. అయితే సాపేక్షంగా కొలకలూరి ఇనాక్ కథలలో అది తక్కువే. అయినా విముక్తి , దొంగ , కొలిమి వంటి కథలలో ఆ జాడలు కనబడతాయి. విముక్తి కథ రైతు ఆత్మహత్యలు పెరిగిన తొంభయ్యవ దశకపు ఆర్ధిక సంక్షోభ పరిణామాల చుట్టూ అల్లబడిన కథ . వ్యవసాయం లో విత్తనాల దగ్గర నుండి రసాయన ఎరువులవరకు అన్నిటినీ సమకూర్చుకొనటానికి అప్పులు చేయటం , పంట సరిగా చేతికి అందిరాకనో , మద్దతు ధర లభించకనో ఆదాయం లేక , అప్పులు తీర్చలేక నిస్సహాయుడైన రైతు పంటను పరిరక్షించుకొనటానికి కొనుక్కొచ్చిన పురుగు మందును తాగి ఆత్మహత్యలు చేసుకొంటుంటే ఈ అన్యాయం గురించి రైతు సంఘాలు , ప్రజాసంఘాలు చేసిన ఆందోళనలు ప్రభుత్వాలు ఆత్మహత్య చేసికొన్న రైతులకు పరిహారాలు ప్రకటించటానికి కారణమయ్యాయి. ఈ పరిహారం కోసమే రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారని పాలక వర్గాలే అనటం కూడా వినబడింది. ఈ నేపథ్యంలో వచ్చిన కథ విముక్తి . తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా రామప్ప అనే పాత్రను , కాంగ్రెస్ ప్రతినిధిగా రమణప్ప అనే పాత్రను సృష్టించి వాళ్లిదరిమధ్యా సంవాదం లో ఈ కథకు బీజం వేశారు ఇనాక్ . రెండు లక్షలిస్తానంటే ఏ రైతు అయినా ఆత్మహత్యకు సిద్ధమని తెలుగుదేశం ప్రతినిధి, ప్రాణం ఎవరికైనా తీపే , డబ్బుకోసం ఎవడూ ప్రాణాలు తీసుకోడు, రైతు ఆశతోనే జీవిస్తాడు అని కాంగ్రెస్ ప్రతినిధి వాదించుకొని మూడు లక్షలు పందెం కూడా కాయటంతో ప్రారంభమైన కథ ఎత్తులు పై ఎత్తులతో ముందుకు సాగుతుంది. రైతులను చావటానికి ప్రేరేపించే రామప్ప ఆత్మహత్య కథకు ముగింపు. బతకాలని బోధించే రమణప్ప ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకుండా హెచ్చరిస్తూ , రామప్ప విష ఆలోచనల నుండి , వికృత చేష్టలనుండి ఊరి జనాన్ని కాపాడుకొంటూ వచ్చిన తీరు రైతు వ్యక్తిత్వాన్ని ,గౌరవాన్ని, సంఘటిత చైతన్యాన్ని సముజ్వలంగా నిలబెట్టినవి.

మట్టి నుండి ధాన్యపు సిరిని గంపలకెత్తి గాదెల నింపే రైతు కలిసిరాని కాలంతో , మార్కెట్ శక్తులతో పోరాడుతూ ఎంత సంఘర్షణకు లోనవుతున్నాడో ఆ వాస్తవాన్ని గుర్తించ నిరాకరించే పెత్తందారీ వర్గాలు ఆత్మహత్యలు చేసుకొనే పిరికివాళ్ళుగానో, ఆత్మవంచన పరులుగానో కనబడ్డట్లే దొంగలు గా కూడా కనబడతారు. భూమి మీద శ్రమచేయగల సర్వశక్తులు ఉన్న రైతు ఆకలికి అలమటించే పరిస్థితులను సృష్టించిన ఆర్ధిక నిర్మాణం అతనిని దొంగను చేస్తుంది. తలవంచుకొనేట్లు చేస్తుంది. ప్రకృతి శక్తులతో పోరాడిన తన వ్యక్తిత్వంలో ఈ పతనానికి తానే నివ్వెరపోయేట్లు చేస్తుంది. ‘దొంగ’ కథా వస్తువు ఇదే. ఈ కథలో ప్రస్తావనకు వచ్చే ‘కాలమిట్లా యేల మారిపోయే’ అన్న ప్రశ్నను రైతు జీవితాన్నిబండ బర్చిన ‘కాలమహిమ’ ను సమకాలీన సామాజిక ఆర్ధిక పునాది నుండి విశ్లేషించుకొంటూ పోతే రైతు దొంగ కావటానికి కారణాలు సులభంగా బోధపడతాయి. వ్యవసాయ రంగ సంక్షోభం రైతుకు అతని మీద ఆధారపడిన కమ్మరి మొదలైన వృత్తి పనివాళ్లకు మధ్య సంబంధాలలో ముందుకు తెస్తున్న వైరుధ్యాలను, మానవీయతను ఇంకా సజీవంగా నిలుపుకోగలిగిన సహజ ప్రవృత్తి వల్ల వాళ్ళు ఆ వైరుధ్యాలను అధిగమిస్తున్న తీరు కొలిమి కథలో చిత్రితం అయ్యాయి.

1969 నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వనరుల పంపిణీలో అసమానతలకు , ఉ ద్యోగ అవకాశాల అసమానతలకు వ్యతిరేకంగా రగులుకొని కొంతకాలం నివురు గప్పిన నిప్పయినా 1997 లో మళ్ళీ ప్రజాస్వామిక ఆకాంక్షగా వ్యక్తం అయి ప్రజాఉద్యమాలు రూపొందుతూవచ్చాయి. రాష్ట్ర సాధనకు ప్రతేకం ఒక రాజకీయ పార్టీ వెలసింది. తెలంగాణా రాష్ట్ర సాధన పర్యంతం 2014 వరకు కొనసాగిన ఉద్యమం ఇది. ఈ కాలంలో ప్రాంతీయ అస్తిత్వ స్పృహ స్వరూప స్వభావాలను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష వెనుక వున్న అధికార వర్గ స్వభావాన్ని అర్ధం చేసుకొంటూ ఇనాక్ వ్రాసిన కథలు మూడు ఉన్నాయి. 1997 నుండి 2009 మధ్యకాలం లో వ్రాయబడినాయి. ప్రాంతీయ అస్తిత్వ అహం రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య మాత్రమే కాదు, ఒకే రాష్ట్రంలోని భిన్న జిల్లాల మధ్య కూడా ప్రవర్తిస్తూనే ఉంటుంది. తోటి ప్రయాణికుడు అనంతపురం వాడని తెలిసి ఒక వ్యక్తి తనను కడప ప్రతినిధిగా నిలుపుకొని అనంతపురం జిల్లా తమ ప్రయోజనాలకు ఎంత భంగకరంగా ఉందో చెప్పుకొంటూ పోవటం, అనంతపురం జిల్లా వాళ్ళను అవమానిస్తున్నట్లు మాట్లాడుతూ ఆధిక్యతను ప్రదర్శించటం ఒక అమానవీయ స్వార్ధ మనస్తత్వ విషయంగా పరిచయం చేసే కథ ‘ ప్రయాణం’. మిగిలిన రెండు కథలు తెలంగాణ ఉద్యమ నేపధ్యం నుండి వ్రాయబడినవి.

అసలు రహస్యం కథలో కథా స్థలం కార్ల షో రూమ్. క్వాలిస్ కారు కొంటున్న లక్ష్మికి, కార్లు చూడటానికి వచ్చిన మరొక వినియోగదారుడు సుందరరావు కు మధ్య ప్రారంభమైన పలకరింపు సంభాషణగా మారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించిన చర్చగా కొనసాగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై వ్యతిరేకత లోని అసలు రహస్యాన్ని బయటపెడుతూ ముగుస్తుంది. ఈ కథలో లక్ష్మి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేక వాదులకు ప్రతినిధి. తెలంగాణా రాష్ట్రం రాదు, రాకూడదు అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం . వింటున్న సుందరరావును ఆమె మాటలలోని అప్రజాస్వామిక ధోరణి కలత పెడుతుంది కానీ అది అందరూ కలిసి ఉండాలన్న ఆమె ఆలోచన వ్యక్తీకరణ కావచ్చు అని తనను తాను సమాధాన పరుచుకొనటానికి ప్రయత్నిస్తుంటాడు. తెలంగాణ వస్తే హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాలు తెలంగాణా కు విడిగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలని కూడా ఒక దశలో ఆమె అంటుంది . ఆమె వూరు రాజమండ్రి కాగా భర్త ఆదిలాబాద్ వాళ్ళు పిల్లలు హైదరాబాద్ లో స్థిరపడ్డారు అని తెలిసి అందువల్లనే ఆమె సమైక్యవాది అయిందని కూడా అనుకుంటాడు, అంటాడు సుందరరావు.

కానీ ఆమె సర్కారు రాయలసీమ జనం హైద్రాబాదు ను అభివృద్ధి చేశారు అని చెప్తుంటే సుందరరావు ఇక మాట్లాడలేకుండా ఉండలేకపోయాడు. వాళ్ళే తెలంగాణ భూముల్ని చవగ్గా కొని వ్యవసాయం చేసి, అడవులను కొట్టి కట్టెలు అమ్మి ఆస్తులు పెంచుకొని కోటీశ్వరులై రాజకీయాలు చేస్తూ స్థానికుల అవసరాలు, అవకాశాలు, ప్రయోజనాలు అన్నీ కొల్లగొట్టటమే కాక తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, పేదరికాన్ని , భాషా సంస్కృతులను చిన్న చూపు చూశారన్న వాస్తవాన్ని గురించి చెప్పాడు. వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకొనటానికి తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోరటం ఎంత న్యాయమైనదో చెప్పాడు . అయినా ఆమె తెలంగాణ రావటం తనకు ఇష్టం లేదన్న వాదన నుండి కిందికి దిగలేదు. ఎందుకని? రాష్ట్ర ఉద్యమం వల్ల పొలాలు స్థలాల కొనుగోళ్లు తగ్గిపోయాయి. కోట్లు చేతులు మారే- భూములు, ఇళ్ల స్థలాల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రార్ అయిన భర్తకు వచ్చే అనధికార రాబడి తగ్గి పోయి బెంజి కారు కొనాలనుకొన్న తాను క్వాలిస్ తో సర్దుకుపోవాల్సి వచ్చిన పరిస్థితి నుండి కలిగిన అసంతృప్తి, వర్గ అసహనం వలన. అదే ఆమెను తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వ్యతిరేకిగా నిలబెట్టింది అన్న అసలు వాస్తవం కథ చివరికి వచ్చేసరికి సంపూర్ణ వికసనం చెంది కనిపిస్తుంది. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేక అభిప్రాయంలో సమైక్యత భావన భ్రమ అనీ, ఆస్తిపరవర్గాల స్వప్రయోజనా కాంక్షలే దానిని నిర్మించి ప్రచారం చేస్తున్నాయని స్పష్టం చేసినట్లయింది. కోస్తాఆంధ్రలో పుట్టిపెరిగి ,రాయలసీమలో ఉద్యోగ జీవితం గడిపిన రచయిత ఈ అవగాహన ఆయన ప్రజాస్వామిక దృక్పథానికి గీటురాయి.

ఓడు కథలో ప్రత్యేకంగా తెలంగాణలో రాజకీయ అధికారం కోసం సర్కారు ప్రాంతాల నుండి వట్టి చేతులతో వచ్చి, భూములు కొని స్థానిక భూమిపుత్రులను బికారులను, కూలీలను చేసి సంపన్నులైన వర్గం పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలను ఉపయోగించుకొంటున్న తీరును ప్రశ్నించి ప్రతిగటించగల చైతన్య వికసనానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే వాతావరణాన్ని సిద్ధం చేసిందన్న సూచన వుంది.

నిర్వాసితత్వం ఈ నాటి ప్రధాన సమస్య. అది చేసే గాయాల నొప్పి తీవ్రత బ్రతుకంతా ఎలా వెన్నాడుతూనే ఉంటుందో పుట్టినూరు కథకు వస్తువు అయింది. భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, ధర్మల్ పవర్ ప్లాంట్లు, బాక్సయిట్, యురేనియం మొదలైన భూగర్భ వనరుల తవ్వకాలు, బహుళజాతి కంపెనీల కు సకల సౌకర్యాలు, స్వతంత్ర హక్కులు కల్పించిన ప్రత్యేక ఆర్ధిక మండలులు అన్నీ గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయించి భూమిని ఆక్రమించుకొనటానికి సంబంధించినవే. ఆయా గ్రామాలలో జనం జీవితం భూములను, జీవన వృత్తులను కోల్పయి, ఊరితో ముడిపడ్డ అనుభవాలను జ్ఞాపకాలను తెంపుకొని వలసపోవటం అనివార్యమవుతుంది. ఆ ప్రయాణంలో వాళ్ళు పడే కష్టం, దాచుకొనే దుఃఖం ఎలా ఉంటాయో చూపిన కథ పుట్టినూరు.

నాగార్జున సాగర్ డాం నిర్మాణం లో పొలాలు, ఇల్లు, నోటికాడి కూడు పోగొట్టుకొని యాభైఏళ్ల క్రితం ఊరు వదిలి బతుకు తెరువుకు హైదరాబాద్ చేరిన శివన్నారాయణ ఈకథలో నిర్వాసితుల ప్రతినిధి. మూటలు మోయటం దగ్గరనుండి జీవితాన్నిప్రారంభించి రిజిస్ట్రార్ఆఫీసుదగ్గర డాక్యుమెంట్ రైటర్ గా స్థిరపడి పెళ్లిచేసికొని పిల్లలను ప్రయోజకులను చేసాడు. వాళ్ళు స్వగ్రామం చూడాలని బయలుదేరదీసినప్పుడు యాభైఏళ్లుగా గడ్డకట్టిన అతని దుఃఖం ప్రయాణం పొడుగునాకరుగుతూ, నీటిమీద వ్రాతలను చదువుకొంటున్నట్లు నాగార్జున సాగర్ ముంచిన తన గ్రామం ఆనవాళ్లను వెతుక్కొంటున్న క్రమంలో ఫటిల్లున పగలటం చూస్తాం. ఇలాంటి దుఃఖాలు, ఇంతకంటే తీవ్రమైన జీవన్మరణ సరిహద్దుల సంఘర్షణలు అప్పటి నుండి ఇప్పటి వరకు పోలేపల్లి సెజ్లోనైతేనేమి, పోలవరం ప్రాజెక్టులో నైతేనేమీ వర్తమాన చరిత్రగా మన ముందు కదలాడుతున్నవే. భిన్న సామాజిక వర్గాలకు సంబంధించిన వైవిధ్యభరితమైన మానవ జీవిత చలన చిత్రాలు ఇనాక్ కథలు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply