కొన్ని అడుగుల దూరంలోనే…

దు ఫు (712 – 770), చైనీయ మహాకవి
అనువాదం: పి. శ్రీనివాస్ గౌడ్

ఈ ఏడాది ముగియవచ్చింది.
గడ్డి ఎండిపోతోంది.
కొండ అంచుల్ని కోసుకుంటూ
గాలి ఊపుగా వీస్తోంది.
చచ్చే చలిలో ఈ అర్థరాత్రి
నేనీ రహదారి మీద చిక్కుపడ్డాను.

చలిపదునుకి
నడుముపట్టీ తెగింది.
ముడి వెయ్యడానికి రాక
చేతివేళ్ళు నీలుక్కుపోయాయి.

తెల్లారేపాటికి ‘లీ’ పర్వతాల వద్ద
చక్రవర్తి ఇష్టభవంతి దగ్గర
వేడినీటి బుగ్గల్ని దాటుతాను.

ఆకాశం నిండా ఎగురుతూ
సైనికుల జెండాలు…
ఆ తావులో తిరుగుతూ
బలగాల సడిలేని కోలాహలాలు…

వసంత వేసంగి మీదుగా ఆవిరి లేస్తోంది.
చలిబయళ్ళ గుండా సంగీతం తేలుతోంది.

రక్షక భటులు మోచేతులు రుద్దుకుంటూ వుంటారు.
గౌరవ అమాత్యులు అక్కడ నివశిస్తారు.

ఇక్కడ వేడినీటి స్నానాదులు
కేవలం ప్రత్యేకించినవాళ్ళకే…
సామాన్య ప్రజానీకానికి ఏదీ లేదు.

రాజప్రసాదంలోని వాళ్ళు తొడిగే
మేలి ఉన్నివస్త్రాలు పేద స్త్రీలు నేసినవి.
కానీ, వారి భర్తల్ని పన్నుల కోసం
రాజభటులు వేధిస్తారు.

మా చక్రవర్తి మంచివాడే కావొచ్చు…
ఆయన మాకు శ్రేష్టమయినదే కావాలనుకుంటాడు.
రాజాస్థానంలో రాజరికాల కారణంగా
రాజ్య ప్రతిష్ట భంగపడుతుందేమోనని
ఆస్థానంలో కొంతమంది కలత పడతారు.

సిల్కువస్త్రాలు…పరిమళద్రవ్యాలు…
అతిథుల వెచ్చని ఉన్నికోట్లు…
రుచిగల ఫల పానీయాల వడ్డింపులు…
ఫిడేలు రాగాలు…
లోపల…దేవతల్లా నృత్యం చేస్తున్న పడతులు…

ఆ కోట ఎర్రగేటు లోపల…
అలా వ్యర్థంగా వదిలేసి మాంసమూ…మద్యమూ…
ఆ కోట ఎర్రగేటు ఇవతల…
అలా వ్యర్థంగా వదిలేసి
గడ్డకట్టి, ఆకలికి చస్తున్న పేదల బొమికలు…

కొన్ని అడుగుల దూరంలోనే…
అటు ఆడంబరాలు…
ఇటు ఆకలి ఆర్తనాదాలు…

తలుచుకుంటుంటేనే…
హృదయం కొంకర్లు పోతుంది.

కవి, కథకుడు, విమర్శకుడు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయుడిగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నాడు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నాడు. రచనలు : 8 కవిత్వ పుస్తకాలు, మార్జినోళ్ళు (కథా సంపుటి), శ్రీనివాసం-కవిత్వ విశ్లేషణలు, ఉపవాస పద్యాలు (అనువాదం). త్వరలో మరికొన్ని అనువాదాలు రానున్నాయి. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

One thought on “కొన్ని అడుగుల దూరంలోనే…

Leave a Reply