కొత్త మనుషులు

కొత్త ఇల్లు ప్రవేశానికిరమ్మని కొడుకు ఫోను చేస్తే రాత్రంతా ప్రయాణంచేసి వచ్చింది మార్తమ్మ.

బస్సులో సరిగా నిద్రపోలేదు కళ్ళు మండుతున్నాయి. అయినా అలసట తెలియకుండా “గృహప్రవేశాని”కి కావాల్సిన సరుకులన్ని అడిగి తెప్పించింది.

రక్త సంబంధీకులను ఎవర్నీ పిలవకపోయినా…తను పనిచేసేచోట స్నేహితులను, ఆఫీసర్లను, ఊళ్ళో కొందరు రాజకీయ నాయకులను, తమ క్రీస్తు సంఘ సభ్యులను, ప్రత్యేకంగా పాష్టర్ని వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించాడు కొడుకు.

ప్రార్ధన అయినాక “గృహప్రవేశం” జరగగానే భోజనాలు ఉంటాయి గనుక, క్యాటిరింగ్ వాళ్ళకి భోజనాలు చెప్పారు. ఇంటిముందు టెంట్లేసి ఇల్లంతా అలంకరించే కాంట్రాక్టర్లు వచ్చారు.

ఇంట్లో మార్తమ్మ ఏ పని ముట్టుకోబోతున్న ”నీకెందుకత్తయ్యా… అవన్ని వాళ్ళు చూసుకుంటారుగా, నీకెందుకు కదలకుండా కూర్చో”మంటుంది కోడలు.

ఐదు సెంట్ల స్థలంలో మూడు సెంట్లలో ఇల్లు దక్షిణం సరిహద్దు చేసి కట్టుకోవడంవల్ల ఉత్తరపక్క, తూర్పుక్క కాళీ స్థలం, చుట్టూ ప్రహరీ ఉండడంవల్ల చాలా అందంగావుంది ఇల్లు. లోపల నాలుగు రకాల చలువరాతి బండలు గోడలకు, నేలమీద పరిచారు.

డబల్ బెడ్ రూముల్లో ఏసీలు బిగించారు. వంట రూములో, డ్రస్సింగ్ రూముల్లో కబోర్డులతో దాదాపు ముఫై లక్షలు పెట్టి ఇల్లు కట్టించాడని లోలోపల మురిసిపోయింది మార్తమ్మ.

అబ్బాయ్ చంద్రా.! నేను ఇక్కడ ఊరికే వుండలేనురా! మీరేమో ఏ పని చేద్దామన్నా పనివాళ్ళు ఉన్నారని నన్ను పని ముట్టుకోవద్దుంటున్నారు.

”అయ్యా! నేను గృహప్రవేశం సమయానికి తిరిగివస్తాను నన్ను బండి మీద పల్లెల్లోని ఆ పాత ఇంటిదగ్గర దింపిరారా”! అంది మార్తమ్మ.

“ఇప్పుడు అక్కడెందుకమ్మా! మేమందరం ఇక్కడ వుంటే, కదలకుండా ఇంట్లో కూర్చోకా… వచ్చినకాడ్నించి ఇల్లెమ్మెటి తిరుగుతానంటావ్” కాస్త కటువుగా అన్నాడు కొడుకు.

అంత సంతోషంలో కూడ మార్తమ్మ మనసు చివుక్కుమంది. కొడుకు అలా మాట్లాడతాడని అస్సలు ఊహించలేదు.

ఒక అరగంట తరువాత కొడుకు, కోడలకు తెలియకుండా మనమడ్ని బతిమాలుకోని బండి మీద పల్లెల్లో పాత ఇంటికివెళ్ళింది.

అయ్యో…! కాసేపు అయినాక వచ్చి మళ్లీ తీసుకుపోయ్యా! అని మనవడితో చెప్పి పంపింది.

పల్లెల్లోకొచ్చిన మార్తమ్మను చూడగానే పాత ఇంటి ఓనరమ్మోళ్ళు వాళ్ళ పిల్లలు, చుట్టుపక్కల ఇళ్లల్లోవాళ్ళు గుమికూడారు.

యోగ క్షేమాలు అడుగుతూ మంచం వాల్చి కూర్చోబెట్టారు. టిఫిన్ తినమంటే వద్దంది. ‘టి’ తాగి లేచి, అందరితో మాట్లాడింది. మధ్యలో అలా లేచి ప్రక్కన పాత ఇంటిలోకి అడుగుబెట్టి చుట్టూ కలయతిరిగింది. దాదాపు ఇరవై సంవత్సరాల దృశ్యం కళ్ళ ముందు కదిలాడాయి. ఈ ఇంట్లోకొచ్చేటప్పుడు కొత్తగా పెళ్లిచేసుకొని చెరొక బట్టల బ్యాగులు తగిలించుకొని సంకలో చాపతో వచ్చారు కొడుకు, కోడలు.

***

పిల్లలు చిన్నప్పుడే చంద్రయ్య వాళ్ళయ్యకేదో కోలుకోలేని జబ్బునపడి చనిపోయాడు. ముగ్గురు పిల్లలను మార్తమ్మ ఎదానేసిపోయాడు.

ఇద్దరు మగపిల్లలు తర్వాత ఆడపిల్ల. పెద్దోడు చదువులో బుద్దిగావుంటే, చిన్నోడు చంద్రయ్య బడికిపోకుండా గాలికి తిరిగేవాడు. మార్తమ్మతో కూలి పనులకు వెళ్లిపోయేవాడు. వయస్సు పెరిగేకొద్ది పక్కూళ్ళో పనులు వెతుక్కుంటూ పోయేవాడు.

అట్టా కొన్ని కాంట్రాక్ట్ పనులకనిపోయి నెలకి పైగా ఇంటికి వచ్చేవాడుకాదు. అలా రానప్పుడుల్లా మార్తమ్మ చాలా కంగారు పడిపోయేది. చర్చీలో మోకరిల్లి కొడుకు క్షేమం గురించి యేసయ్యకు మొరపెట్టుకునేది.

ఓతూరి ఆదే మాదిరిగా పనులకనిబోయి పూర్తిగా ఇంటికిరావడం మానేశాడు చంద్రయ్య. చిన్న వయసులో సంపాదించడం, సొమ్ము చేతిలోపడడం వలన చంద్రకు దురలవాట్లు అబ్బినాయి. ఎక్కడో గ్రానైట్ కంపెనీల్లో పనిచేస్తూ వ్యసనాలపాలయ్యాడు.

కొడుకు బ్రతికి ఉన్నాడో, లేదో తెలియక ఏళ్ల తరబడి చర్చీల్లో ప్రార్ధనలు చేస్తూ చుట్టాలందరికి కొడుకుజాడ కనుక్కోమని చేతులెత్తి దండం పెట్టేది మార్తమ్మ.

ఐదేళ్ళకి మార్తమ్మ ప్రార్థన యేసు ప్రభువు విన్నాడేమో! చంద్రయ్యను మార్తమ్మ దగ్గరకు నడిపాడు. మార్తమ్మ సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. కొడుకు రూపం పోల్చుకోలేక చాలా సేపు ఎగాదిగా చూసింది. ఆనక గుర్తుపట్టి ఒళ్లంతా తమిడి బోరుమని ఏడ్చేసింది.

చిలకలూరిపేట దగ్గర క్వారీల్లో పనిచేస్తున్నానని కొడుకు చెప్పగానే ఆందోళన పడింది. ఆ ప్రమాదం పనులు వద్దునాయనా అని చెప్పింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని ఆ రోజు పల్లెంతా పిలిచి కుటుంబ ప్రార్థన పెట్టించింది.

నెలరోజులు కొడుకును ఇంట్లో నుండి బయటకుపోనియ్యలేదు. మళ్లీ పేటకి పోతానంటే, ససేమిరా ఒప్పుకోలేదు. చంద్రయ్య తల్లికి నచ్చచెప్పాడు. వద్దురా నాయనా… పెళ్లి చేసుకొని ఇక్కడే ఏదైనా పనిచేసుకోరా! అని తల్లి పోరుపెట్టింది. ఈసారి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి చంద్రయ్య వెళ్లిపోయాడు.

అపట్నుంచి మార్తమ్మ చర్చీలో కోడలు కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. ఒక ఏడాదిగ్గాని ఆమె ప్రార్ధనలు దేవుడు ఆలకించినట్టులేదు.

ఒక రోజు చంద్ర హఠాత్తుగా ఊడిపడ్డాడు. పక్కన వేరోక అమ్మాయితో వచ్చాడు. ‘పేట’లో చర్చీకివచ్చే ‘బలిజ’ కులం అమ్మాయి పార్వతిని ఇష్టపడి అక్కడ పాష్టర్ సమక్షంలో పెళ్లి చేసుకున్నానని తల్లికి చెప్పాడు.

మార్తమ్మ అవాక్కయ్యింది. మేము చచ్చావనుకున్నావంటర్రా! నీకేవరూ లేరనుకున్నావా! అని శోకండాలు పెట్టింది వారం రోజులు కొడుకుతో మాట్లాడలా!

కొన్నాళ్ళకు కోడలు ముఖం చూసి పార్వతితో మాట్లాడింది. మరుసటి రోజు కోడలి కోసం నెల్లూరెళ్ళి కొత్త బట్టలు తెచ్చింది. పదిహేను రోజులు తర్వాత కొడుకూ, కోడలితో కలసి చిలకలూరిపేటలో “ఆదిఆంధా కాలనీ”లో అద్దె ఇల్లు తీసుకొని కొత్త కాపురం పెట్టిచ్చింది. కొడుకు గురించి కోడలుకి అన్ని జాగ్రత్తలు చెప్పింది. కోడలని జాగ్రత్తగా చూసుకొమ్మని ఇంటి ఓనరమ్మకు బాధ్యతలు చెప్పి వచ్చేసింది.

అత్త చెప్పినందుకు కాదుగానీ, తనను ప్రేమించి పెళ్లాడినందుకేమో చంద్ర మీద విపరీతంగా అభిమానం చూపేది పార్వతి.

డ్యూటీకి పోయేటప్పుడు ఎదురొచ్చి సాగనంపేది. పోయినంతలెక్క తొంగిచూస్తావుండేది. సాయంత్రం వచ్చేటయ్యానికి టంచెనుగా బయట అరుగుమీద కూర్చుని ఇరుగు పరుగోళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని చూస్తావుండేది. చంద్ర రాగానే ఎంత యవ్వారంలోవున్నా లటక్కన లోనకెళ్ళేది. ఎప్పుడన్న చంద్ర రావడం లేటయితే విపరీతంగా ఆందోళన పడేది.

అలాంటిది పార్వతి ఒకరోజు రాత్రి మొగుడి కోసం కూడూ, నీళ్లు లేకుండా రాత్రి పదిదాక ఎదురుచూసింది. ఏమయ్యిందోనని ఆందోళన పడింది. ఒక్కతే భయపడి తలుపేసుకొని డొక్కల్లో కాళ్లు ముడుచుకు చంద్రను తలచుకుంటూ పడుకుంది. ఏ అర్ధరాత్రికో తలుపుచప్పుడైంది. చివుక్కునలేచి తలుపుతీసింది. ఎదురుగా చంద్ర. పూటుగాతాగి తూలుతూ కనిపించాడు. పార్వతి హడలిపోయింది. కంగారుగా లోపలకి తీసుకొచ్చి తలుపులేసింది. మొగుడు అవతారం చూసి ఆ రాంత్రంతా కుమిలి కుమిలి ఏడ్చింది.

తెల్లారి చంద్ర పార్వతితో ఏదో చెప్పబోయాడు. పార్వతి ఏడుస్తూ మాట్లాడలేదు. తాను చేసింది తప్పని ఇంకెప్పుడూ మందు తాగనని ‘ఒట్టు’ వేయించుకుంటే గానీ చంద్రతో మాట్లాడలేదు.

కొన్నాళ్ళకి ‘ఒట్టు’ తీసి గట్టు’ మీద పెట్టాడు చంద్ర. ఏదొక వంకతో తాగి వచ్చేవాడు. కొన్నాళ్ళకి చంద్రని మార్చలేక పార్వతి మారిపోయింది. తాగొచ్చిన మొగుడి మీద అరవడం, అలగడం ఇవన్నీ అనవసరం అనుకుంది. దీనివలన ప్రక్కనోళ్ళకి చులకనవుతాం గానీ, ఒరిగేది ఏమీలేదనుకుంది. తాగేదేదో గట్టుగా ఇంట్లోనే తాగమంది.

చంద్ర తీసుకొచ్చిన జీతం పార్వతి చేతిలో పెట్టేవాడు. అలా చీటి పాటలు, వడ్డీలకు తిప్పడం చేసేశారు. ఎప్పుడూ ఇంట్లో డబ్బు వుండడం వల్ల తిండికి ఇబ్బందులు పడలేదు.

చంద్ర మాటకారి కావడంచేత, ఇరుగు పొరుగులతో మాటలు కలిపుతూవుండేవాడు. అందరూ కాదుకానీ, చంద్ర చెప్పే అబద్దపుమాటలు నిజమని కొందరు నమ్మేవారు. క్వారీలో తనకులం ప్రస్తావన వస్తే మాదిగ అని చెబితే గౌరవం ఉండదని “కమ్మోళ్ళ”మని తడుముకోకుండా చెప్పేవాడు. ఎమ్మార్వోలు, ఎమ్మెల్యేలు తనకు తెలుసని చెప్పేవాడు.

ముఖ్యంగా ఆడోళ్ళతో మాట్లాడ్డానికి ఆసక్తి చూపుతాడు. చంద్ర వస్తున్నాడంటే “ఎచ్చులుకోరోడు” వస్తున్నాడే ఇక పదండని అప్పటి దాక మాట్లాకునే ఆడోళ్ళు, చంద్రని చూచి లేచిపోయేవారు. అలా వెళ్లిపోతున్నవాళ్లను ఏదోకటి అనకుండా ఉండేవాడుకాదు చంద్ర

ఆ బజార్లో రెండు ఇళ్ల అవతల ఒకామెతో చంద్ర చనువుగా వుండేవాడు. ఆ చనువు పార్వతి పసిగట్టి ఇద్దరినీ హెచ్చరించింది. మాది అన్నా చెల్లెల సంబంధమని నమ్మబలికారిద్దరు. చంద్రని చర్చీలో ప్రార్థనలతో తలమునకలగా ఉండేట్లు చేసింది పార్వతి. అప్పటిగ్గానీ చంద్రని నమ్మలేదు.

కడుపుతో వున్న పార్వతి చంద్రను వదిలిపోలేక తొమ్మిదో నెలలు వరకు ఇక్కడేవుంది. అమ్మలక్కలు మొదటి కాన్పు పుట్టింట్లో చేసుకోవడం ఆనవాయితీ అంటే, తప్పనిసరిగా తల్లి వచ్చి బతిమాలితే అయిష్టంగానేపోయింది. పార్వతి అడిగినంత డబ్బులు, వారానికొకసారి తన దగ్గరకు వస్తానని భరోసాతో పురుడికి పోయింది.

***

ఆరు నెలల చంటి పిల్లోడ్నేసుకొని చిలకలూరిపేటకు తిరిగి వచ్చింది పార్వతి వల్ల ఇన్నాళ్ళకు చంద్ర తిండికిపడ్డ తిప్పలు తప్పినాయి. తల్లీ, బిడ్డని పలకరించడానికి పార్వతి స్నేహితురాళ్ళు ఆ బజారువాళ్ళు వచ్చిపోతున్నారు. అలా వచ్చిన వారిలో పార్వతితో బాగా దోస్తీగా వుంటే ఇద్దరు. ఏదో మాటల సందర్భాంగా చంద్ర విషయంలో కాస్త జాగ్రత్తగావుండు పార్వతి అంటూ హెచ్చరించారు. వాళ్ళు ఎందుకు అలా చెబుతున్నారో పార్వతికి ఆ రోజు అర్థం కాలా! బాలింతను కదా అందుకే చెబుతున్నారని అనుకుంది. ఎప్పటిలాగే పార్వతి, చంద్రలు అన్యోన్యంగా వున్నారు.

ఒకరోజు పిల్లోడ్ని పక్కలో ఏసుకొని పార్వతి పడుకుంటే, చంద్ర ఒక్కడే వేరే మంచం మీద పడుకున్నాడు. అప్పటి దాక కబుర్లు చెప్పుకోని పడుకున్నారు. అర్ధరాత్రి పక్కలో పిల్లోడు కదిలాడితే గబక్కున మెలుకువ వచ్చింది పార్వతికి. పిల్లోడ్ని సముదాయిస్తూ లేచి కూర్చుంది. మంచం మీద చంద్ర కనిపించలేదు. దొడ్డి తలుపు ఓరగా వేసింది. ఒంటికి పోయుంటాడులే అనుకుంది. పిల్లోడికి తడిబట్టలు మార్చి మళ్ళీ పడుకుంది. ఎందుకో నిద్రపట్టక పార్వతి కూడ ఒంటికి లేచింది. తలుపు తీసిచూస్తే అవతల చప్పుడైది. ఆ చీకట్లో చంద్రని, ప్రక్కింటామెతో ఉండడం చూసింది. తనను చూసి గోడదూకి వచ్చాడు చంద్ర. అదిరిపోయింది పార్వతి. అరవవద్దని బతిమాలుకున్నాడు చంద్ర. ఆవేశంలో తమాయించుకొని చంద్రని అసహ్యహించుకుంది పార్వతి. దగ్గరికి వచ్చి ఏదో సముదాయించబోయాడు. ముట్టుకోనియ్యలేదు పార్వతి.

ఆ రాత్రంతా కంటిమీద కునుకులేదు. ఇట్టాంటి గాలిముండాకొడుకు దాపరించినందుకు, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు, తనను తానే నిదించుకోని కుమిలి కుమిలి ఏడ్చంది.

ఈ సంఘటనను పార్వతి తన మనసులోనే దాచుకుంది. పుట్టింట్లోనూ, అత్తింట్లోనూ చెప్పలేదు. చెబితే అన్యోన్యంగా ఉంటున్నారనుకుంటున్నా తమ మీద నమ్మకం పోతుందని, వాళ్ళు “చంద్ర” ని చులకన చేస్తారని, తనను అమితంగా ప్రేమించే పుట్టింటోళ్ళు బాధపడతారనీ చెప్పలేదు. ప్రతి ఆదివారం చర్చీకిపోతున్నా వీడి బుద్దిమారలేదని సరిపెట్టుకుంది.

చంద్రతో మామూలుగా ఉండలేకపోయింది. కానీ, చంద్ర ఈ సంఘటనను చాలా సహజంగా తీసుకొని మామూలుగా ఉన్నాడు.

కొన్నాళ్ళకి పార్వతి తన పట్టుదలతో, యేసయ్య సేవలతో చంద్ర త్రాగుడు, తిరుగుబోతుతనాన్ని పూర్తిగా మాన్పించగలిగింది. కానీ, ఆ దొంగ చూపుల్ని, ఆ కొంకెర మాటల్ని మాన్పించలేకపోయింది.

ఎప్పుడో ఎడాదికొకసారి వచ్చే మార్తమ్మ కొడుకు నడవడికను గమనిస్తుంది. వాడికెప్పుడు డబ్బు యావేతప్ప మనుషుల ఆలనా పాలనా పట్టడంలేదు. తోబుట్టువుల ఎలా ఉన్నారనే అడిగిన పాపానాపోవడంలేదు. వాడికితోడు ఇప్పుడు కోడలు అలాగే తయారైయిందని తెగ బాధపడేది మార్తమ్మ.

చంద్ర పాస్ట‌ర్‌ కూడ కావడంతో డ్యూటీ అయిపోయినాక, దైవసన్నిధిలోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. చందాలు వస్తున్నాయి. వడ్డీల మారకం, చీటీ పాటలు, క్వారీలో వచ్చే ఆదాయంగాక, స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చేతినిండా సంపాదించాడు. చాలా తక్కువకాలంలోనే చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు.

వచ్చిన సంపదంతా, తన వంటిమీద బంగారమంతా దేవుని కృపవల్ల, యేసయ్య చేసేమేలుగా కొనియాడుకుంది పార్వతి. అదే చుట్టుపక్కలవాళ్ళతో ఘనంగా చెప్పుకుంది.

చర్చీలో చెప్పే దేవుని నీతిభోధనలన్నీ కుటుంబ ఆరాధనలూ, చందాలు వసూలుకోసం ఉపయోగడుతున్నాయి. క్వారీ ఓనర్ల, రాజకీయ నాయకుల దగ్గర వచ్చే డొనేషన్లు మంచి ఆదాయవనరు అయ్యింది.

అమ్మా…మనం ఏముట్లం! అంటే ఏ కులం వాళ్ళం! మనం మాదిగ పల్లెల్లో ఉంటున్నామని మనం మాదిగోళ్ళమని మా ప్రెండ్స్ అంతాఎగతాళి చేస్తున్నారు? నిజమేనా..? అని ఒకరోజు కొడుకు అడిగిన ప్రశ్నకు మనం “క్రిస్టియన్స్”మమ్మా అని గర్వంగా చెప్పింది పార్వతి.

పిల్లల మీద మాదిగ కుల ప్రభావం పడుతుందని గ్రహించి, వారం రోజుల్లోనే కళామందిర్ సెంటర్లో మంచి ఇల్లు తీసుకొని, అలా “ఆది ఆంధ్ర కాలనీకి” దూరమయ్యారు చంద్ర పార్వతులు.

చర్చీ ముసుగులో ఆర్ధికంగా ఎదుగుతున్నకొద్దీ సొంత వాళ్ళకు దూరమవుతున్నాడు చంద్ర. తల్లిగా మార్తమ్మన్నా… తోబుట్టినోళ్ళన్నా పట్టించుకోవడం మానేశాడు. ఆ విషయమే మార్తమ్మను పదేపదే ఆందోళనకు గురిచేస్తుంది.

ఎన్నో ఏళ్ల నుండి యేసుక్రీస్తును తాను నమ్ముకుంది. ఆయన్నెప్పుడూ ఒకటే కోరుకుంది. తన బిడ్డలకు ఏ లోటు రానివ్వద్దనీ, మంచి బుద్దులు ప్రసాదించమనీ. కానీ చంద్ర లాంటి మోసపూరితమైన బిడ్డని ఎందుకిచ్చావయ్యాని… చాలాసార్లు ఏకాంత ప్రార్థనలో అడిగేది.

***

అమ్మా… అమ్మా… అని కొడుకు పిలవడంతో పాత ఇంట్లో నుండి బయటకు వచ్చింది మార్తమ్మ.

ఎంత సేపమ్మా ఇక్కడ వుండేది…? అక్కడ “గృహప్రవేశం” అయిపోయి భోజనాలు కూడ అయిపోతుంటే! చిరాకు పడుతూ అన్నాడు అప్పుడే కారు దిగిన చంద్ర.

అయ్యో…”గృహప్రవేశం” అయిపోయిందా…!. మరి నన్ను పిలవలేదేందియ్యా! అంది

ఎవరికి తెలుసు నువ్వుక్కడ తగలబడ్డావని! రోషంతో అన్నాడు చంద్ర.

పిల్లోడికి చెప్పేను కదయ్యా… పిలవమని! మీకు చెప్పేను కదా! అంది దిగులుగా

నువు ఈడంటే ఎట్టా పిలిచేము. అక్కడ పెద్దేళ్ళు రాజకీయ నాయకులు వచ్చారు, మా పెద్ద పాష్టరి ఫ్యామిలీ కూడ వచ్చారు. అనుకున్నవాళ్ళందరు వచ్చారు. నువ్వొక్కదానికోసం వాళ్ళందర్ని అక్కడ ఆపలేంకదా! అన్నాడు చంద్ర.

ఆ మాటలకు నోట మాటరాలేదు మార్తమ్మకు. రక్త బంధువులు, తోడబుట్టినోళ్ళు, కన్నతల్లి రాకపోయినా వీడికి పర్వాలేదు. రాజకీయ నాయకులు, పాష్టర్లు, వాళ్ళ పెళ్లాలు, పిల్లలు వస్తేనే ముఖ్యం.

తల్లిని గౌరవించనోడు, బయటోళ్ళకు విలువిస్తున్నాడంటే వీడికి రక్త సంబంధాలకన్నా సంపదే ముఖ్యమయింది. అని మనసులో కుమిలిపోయింది మార్తమ్మ.

దా.. వచ్చి కూర్చో… వచ్చిన దానివి ఇంటి పట్టున ఉండమంటే ఉండవుకదా! అని విసుక్కుంటూ… కారు స్టార్ట్ చేశాడు.

మార్తమ్మ మారు మాట్లాడకుండ ఎక్కి కూర్చుంది.

ఇంటి దగ్గర భోజనాలు పెట్టడం కూడ అయిపోయి. అన్నీ సర్దే పనిలో పనోళ్ళున్నారు.

మటన్ పాలావ్, ఏడు రకాల పిండి వంటలతో ఇస్తర్లో మార్తమ్మ ముందు పెట్టి, కోడలూ, కొడుకు తినమన్నారు.

ఎందుకో… మార్తమ్మకు ఆ తిండి సహించలా!

పుట్టింది ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, చవటపాలెం. తాను ప‌నిచేస్తున్న‌చోట స‌హ‌చ‌ర కార్మికుల జీవితాల‌ను క‌థ‌లుగా మ‌లుస్తున్న‌క‌థ‌కుడు. ప్ర‌స్తుతం మైనింగ్ ఫోర్ మ‌న్ గా ప‌నిచేస్తున్నాడు.

2 thoughts on “కొత్త మనుషులు

Leave a Reply