కొత్త ఉదయం

చూస్తూ ఉండిపోతానలా
ఆకాశంలోకి –

నక్షత్రపు కళ్ళతో ప్రయాణిస్తున్న రాత్రిని
పూలకుండీలో ఒంటరిగా దిక్కులు చూస్తున్న పువ్వుని కూడా –

ఆలోచనకు
కాస్తంతా గాలిని
ఉగ్గుపాలుగా పట్టించి, రెక్కల్ని కట్టి
అటుగా వదిలేసాను.
ఎక్కడో దూరంగా
నక్క పెడుతున్న ఊల.
గుడ్లగూబ కళ్ళలో రాత్రి భయపడుతూ
నేలకు నొప్పి తెలియకుండా చీమంత నిశ్శబ్దంగా నడుస్తుంది.

నిద్రకళ్ళలో మత్తు ఇంకుతూ
కట్టె.
కట్టెమీద ఆకాశమంత విశాలంగా ఊపిరి తీసుకుంటున్నప్పుడు
ఆమె అటుగా స్వప్నంలోకి వస్తూ నవ్వుతుంది.

ఒక్కొక్క నక్షత్రం తనను తాను కోల్పోయి
తెలవారే వైపు మరో కొత్త రోజులా మొగ్గతొడుగుతుంది.
సన్నటి పొగమంచురేణువుల్లోంచి
తెగిన రెక్కలతో
నేలకొమ్మపై దిగిన వెలుగు.
ఒళ్ళంతా పసిడిరంగు అలుక్కుంటుంది మట్టి.

పక్కకు ఒత్తిగిల్లి పడుకున్న రాత్రిని
పొగమంచునవ్వుతో ఆమె ఉదయాన్ని నిద్రలేపుతుంటే
ఈ కవిత కూడా పసిడి పువ్వేనట!

ముచర్ల గ్రామం, ఖమ్మం జిల్లా. 2014 నుంచి కవిత్వం రాస్తున్నారు. 'ఇప్పుడేది రహస్యం కాదు' కవితా సంపుటి ప్రచురించారు. 2019 విమల శాంతి పురస్కారం, 2019 ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం అందుకున్నారు.

Leave a Reply