నా నగరం పలు అందాలు ఆరబోయ
పలు రాజ్యాల అందగత్తెలకి స్వాగతం పలుకుతుంది
దేహాలన్నీ ఒక్కటే
అంగాంగాల ధర్మాల్లో తేడా వుండదు
మందులు సూదులు శస్త్రచికిత్స లతో పరిమితుల్లో
కుంచించ బడ్డ కొలతల్లో చిక్కిన అందానికే కిరీటం
చూసే చూపుల్లో అందం ప్రతిబింబిస్తుంది
కంటికంటికి మారే అందాన్ని ఓ నలుగురు న్యాయనిర్ణేతలు
కాగితంపై మార్కుల పట్టిక లతో
ప్రపంచ పటంపై ఆమెను చిత్రీకరించగా పెట్టుబడి జుర్రుకుంటుంది
వెచ్చించిన ధనం పర్యాటకం లో కొల్లగొట్ట రాజ్యం చూస్తుంది
బజారోడు కాపు కాస్తున్నాడు
అంగట్లో అమ్మకానికే ఆమె అనేది ఈ తంతు కార్య అంతిమ లక్ష్యం
నాగార్జునుడు నడయాడిన నేలలో
ఆమె ల సంచారం తో ప్రపంచం దృష్టిలోననే హ్రస్వ దృష్టి
వేల ఏళ్ళ కిందటే ఈ నేల లో విశ్వవిద్యాలయం
బౌద్ధం విరాజిల్లిన శ్రీ పర్వతం
అబద్దాలే చరిత్ర గా చలామణి అవుతున్న నేటి రాజ్యంలో
చెరపలేని చరిత్ర విజయపురి దే!
మదనిక నాగిని శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటిన
తేలే ఇటుకల నిర్మాణం రామప్ప సొంతం
రంకెవేయ సిద్ధం గా నున్న నంది ఆమెల వయ్యారి నడకలజూచి చిన్నబోనున్నది
లోకమెరిగిన రామప్ప ని నేడు పరిచయం చేసుడేంది?!
లక్నవరం తీగల వంతెన వీణలా ధ్వనించేనా?!
చెర్ల చేప బెస్తకి దక్కేనా!!
ఎల్లలు ఏనాడో దాటిన పోచంపల్లి ఇక్కత్
ఇప్పుడామెలు కట్టుకుంటేనే సరుకమ్ముడు పోతుందనే
కల్లబొల్లి కబుర్ల దళారీల రాజ్యంలో మోసపోవడం సాలెన్నకేం కొత్త కాదులే!
కట్టుకున్న చీరలతో ఆమెలంతా యాదగిరి నరసన్న చెంత
సేద తీరితే నల్లగొండ ఫ్లోరోసిస్ కష్టాలు తీరేనా?!
పిల్లలమర్రి మానెక్కడో తెలియదు
పాలమూరు వలస గోస తీరేదెక్కడో తెలియదు
ఆమెలు ఊడల ఉయ్యాలలూగితే
పాలమూరు యాతన తీరేనా?! నీరు దక్కేనా!?
ఆమె అందాలు కాదిక్కడ
ఓసారి కొంగు నడుముకి చుట్టిన ఐలమ్మ తెగువ కావాలే
జగిత్యాల జైత్ర యాత్ర
ఇంద్రవెల్లి జాతర
కడవెండి స్థూపం గిట్లెన్నో గీతాలై నేలంతా నిండిపోయిన
ఎర్రని మోదుగు పూల వారసత్వం కదా బాహ్య ప్రపంచానికి తెలియాల్సింది
ఓ సారి అక్కడికి తీసుకెళ్ళి పిడికిలి బిగించమని చెప్పండి!!
ఎన్నాళ్ళని దాస్తావు నిప్పు
పొగ చుట్టేస్తూనే ఉంటుంది
తూర్పున ఎరుపు కదా! అసలుసిసలైన అందం!!
Prasad ji —- nice one
=================