కొందరి కథ – అందరి కోణం

సాహిత్యంలో అంతిమ తీర్పులు యివ్వడం యెప్పుడు మొదలయ్యిందో గానీ పాఠకుల పఠనానుభూతికి అదొక పెద్ద గుదిబండ. కాస్తంత ధ్యానానికో మౌనానికో చోటివ్వమని కదా మహానుభావులు చెప్పింది. అయితే చాలా సందర్భాల్లో మౌనానికి తావివ్వని వాక్యాలే మనకీ మధ్య తారసపడుతున్నాయి. అర్థాన్ని మింగేసే శబ్దం అనర్థమని మొత్తుకున్నా వినని రొదలో లోపలికి చూసుకోడానికీ దాన్ని బయటితో ముడివేయడానికీ సాహిత్యంలోనే కాదు జీవితంలోనూ అవకాశం వుండటం లేదు. ఆ లోటుని కొద్దిమేరకైనా తీర్చిన నవల వివిన మూర్తి గారి ‘కొంత మంది .. కొన్ని చోట్ల’.

‘భాష యథార్థం కోసం ప్రయత్నిస్తుంది. మరోవైపు యథార్థాన్ని కప్పెడుతుంది.’ అంటుంది కవిత అనే పాత్ర యీ నవల్లో వొకచోట. యథార్థతని తవ్వి వెలికి తీసి దగ్గరయ్యే ప్రయత్నంలో కొన్ని మాటలు :

మార్క్సిజం ఆచరణాత్మక సామాజిక తత్త్వశాస్త్రం. అది సాహిత్యమైనా సమాజమైనా వ్యక్తుల ఆచరణ గీటురాయిపై పరీక్షించి మాత్రమే సత్య నిర్ధారణకు రావాలి. అంతిమ సత్యం యెప్పుడూ సాపేక్షమే. మార్పు నిరంతరం. అది గుణాత్మకమైనప్పుడు అనివార్యంగా ఆహ్వానించాలి – యీ యెరుకని మరోసారి నిరూపిస్తుంది ‘కొంతమంది.. కొన్ని చోట్ల’. వ్యక్తుల జీవితాల్ని నెపంచేసుకుని అనేక సామాజిక దృగంశాలనీ రాజకీయ సిద్ధాంతాలనీ వాటి మధ్య వున్న వైరుధ్యాల్నీ చర్చకు పెట్టిన నవల యిది. పరస్పర విరుద్ధమైన భావజాలాల మధ్య వొక సమన్వయం కోసం చేసిన ప్రయత్నం సైతం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకీ సామాజిక నియంత్రణలకీ మధ్య చోటుచేసుకునే తాత్విక సంఘర్షణ గురించి, ఘర్షణ ఐక్యతలకి సంబంధించి అనేకమైన ఆలోచనలకు అవకాశం యీ నవల కల్గించింది. సామాజికంగా ఐక్యతకు చోటులేని కేవల ఘర్షణ శకలీకరణకీ వొంటెత్తు విధానానికీ మొండి వాదనకీ దారితీయవచ్చు. అదే విధంగా అందర్నీ కలుపుకుపోవాలి అనే షరతుల్లేని ఐక్యతాగీతం వుదారవాదంగా పరిణమించి గమ్యాన్ని దూరం చేయొచ్చు. మానవసంబంధాల్లో ఐక్యత ఘర్షణ అనివార్యం. అవి రెండూ విరుద్ధ అంశాలు కూడా కావు. ఒకే నాణేనికి వున్న బొమ్మా బొరుసుల్లా అవిభాజ్యాలేనేమో! కేవల ఘర్షణ కేవల ఐక్యత ప్రాక్టికల్ గా అవాంఛితాలు. అసాధ్యాలు కూడా. ఆలోచనల్లో అభిప్రాయాల వినిమయం జరగాలి. ఆచరణలో ప్రజాస్వామిక వాతావరణం వుండాలి. రాపిడి సత్యావిష్కరణవైపు దారితీయాలి. ఫలితం బహుజన హితం కోసం తోడ్పడాలి. ఇది యీ నవల సారం.

నిబద్ధత వొక విలువ. అది వ్యక్తిగతమైనపుడు కేవలం నిజాయితీ మాత్రమే. భార్యా భర్తల మధ్య ప్రేమికుల మధ్య మిత్రుల మధ్య దాని భూమిక పరస్పరాశ్రితంగా రెసిప్రోకల్ గా వుంటుంది. స్థిరత్వాన్ని కోరుకుంటుంది. అదే విలువ సామూహిక ఆలోచనల పునాది నుంచి పుట్టినప్పుడు అది మొత్తం సమాజానికి అంతటికీ చెందుతుంది. అప్పుడది వ్యక్తిగత విలువగా గాక భావజాలంగా మారుతుంది. భావజాలాల మధ్య ఘర్షణా ఐక్యతా ఆదాన ప్రదానాలు రెండూ సహజమే. సమాజ అవసరాలను బట్టీ భావజాల పరమైన మార్పులు రావొచ్చు. స్థిరీకృత విలువలు సైతం అప్పుడు ప్రశ్నకి గురౌతాయి. మౌలిక భావనల చుట్టూ కొత్త అన్వయాలు రూపొందుతాయి. కొత్త చేర్పులు సంభవిస్తాయి. గుణాత్మక పరిణామాలకు దారులు యేర్పడతాయి. అందుకు సంసిద్ధతని అలవరచుకోవాలి. లేకుంటే డాగ్మాగా బిగుసుకుపోయే ప్రమాదం వుంది. దానర్థం గాలివాటానికి కొట్టుకుపొమ్మని కాదు. కెరీర్ కోసం ట్రెండ్ వెనక పరుగెత్తమనీ కాదు. అవకాశ వాదాన్ని ప్రోత్సాహించే అనిబద్ధతని సమర్థించడం కాదు. మంచికి దోహదం చేసే మార్పుని స్వాగతించమని మాత్రమే.

మనిషి యేం చేస్తే వొప్పు యేం చేస్తే తప్పు? ఈ నిర్ధారణ యెలా చేయాలి? నిర్ధారణకి దోహదం చేసే అంశాలేవి? తప్పు వొప్పుల తీర్పు వైయక్తిక అస్తిత్వమా – సాంఘికమా? అది మనిషి లోపలిదా – బయటిదా? బయటిది అయితే అన్ని సమాజాల్లోనూ అది వొకే రీతిగా మూసపోసినట్లు వుంటుందా భిన్నంగా వుంటుందా? భిన్నంగా వున్నప్పుడు వాటి మధ్య సమన్వయం యెలా సాధించాలి…వంటి ప్రశ్నలు అనేకం యీ నవల పొడవునా రచయిత పరుచుకుంటూ పోతారు. పాత్రల బాహ్య సంభాషణల ద్వారా ఆంతరిక ఆలోచనల ద్వారా యీ ప్రశ్నల్ని రచయిత మనముందు గుమ్మరిస్తారు. కొన్నిటికి సమాధానాలు లభిస్తాయి. అవి కూడా అప్పటికి తోచినవే గానీ శాశ్వత పరిష్కారాలు కావు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలే లభించవు. మరి కొన్ని ప్రశ్నలు సమాధానం కోసం యెదురు చూస్తుంటాయి. కొన్నైతే కొత్త ప్రశ్నలకు ఆస్కారమిస్తాయి. సరిగ్గా అక్కడే పాఠకుల చైతన్య పరిధి విస్తరిస్తుంది. అందుకు దోహదంచేసే సంఘటనలు సందర్భాలు నవల్లో పలుచోట్ల యెదురౌతాయి. బుర్రకి పదును పెడతాయి.

వ్యక్తిగతంగా, కుటుంబంలో, సమాజంలో విలువలు రూపొందే క్రమంలో వాటిని తిరస్కరించి వ్యతిరేకించడంలోనే కాదు; అంగీకరించి ఆచరించడంలో సైతం ఘర్షణ వుంటుంది. అన్ని ఆమోదాలు ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా జరగవు. ఆహ్లాదకరంగానూ వుండవు. ఒక్కోసారి ఆ ఘర్షణ యేదో వొక మేరకు హింసాత్మకంగా పరిణమించవచ్చు. కొంతమంది కొన్ని చోట్ల దాన్నొక సవాలుగా స్వీకరించి బయటపడవచ్చు, మరి కొందరు మరి కొన్నిచోట్ల లొంగిపోవచ్చు. లొంగుబాటు మానవ సంబంధాలని దెబ్బదీసి గూడుకట్టుకునే ఆవేదనకు కారణమై వ్యక్తి వినాశానికి దారి తీయవచ్చు. ఆ వ్యక్తినే కాదు; వ్యక్తి చుట్టూ వున్నవాళ్ళని సైతం మానసిక క్షోభకు గురిచేయవచ్చు.

విలువల మంచి చెడులు సాపేక్షికాలే కాబట్టి నవల్లో యిద్దరు బిడ్డల తండ్రి శివరామారావు వివాహేతర సంబంధం గురించి (మరో స్త్రీకి కూడా అతను తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చట్ట వ్యతిరేక బంధం అనాలేమో!) అతని భార్యా పిల్లలకి తెలిసినప్పుడు వాళ్ళు వేర్వేరుగా స్పందించారు. సహజమైన సానుభూతితో పిల్లలిద్దరూ తల్లి పట్ల అనుకంపతో స్పందించినప్పటికీ పెద్ద బిడ్డ కవిత తండ్రిని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే చిన్న కూతురు నవత మాత్రం అతణ్ణి నీతి బాహ్యుడిగా నిందించి ద్వేషించింది. ఆ ద్వేషాన్ని ఆమె తమ కుటుంబంలోకి ప్రవేశించిన ‘పరాయి’ వ్యక్తి జయ పట్ల కూడా ప్రదర్శించింది. ఈ ద్వేషాన్ని/వ్యతిరేకతని దాదాపు నలభై సంవత్సరాలు మోసింది. మగ ప్రపంచాన్నంతటినీ అదే దృష్టితో చూసింది. తండ్రిలో లేని నైతికత పాటించే పురుషులు తారసపడినప్పుడు తనకు తెలీకుండానే వాళ్ళకి దగ్గరైంది. తాను వ్యతిరేకించే ఆరెస్సెస్ భావజాలానికి బలంగా కట్టుబడి వున్న కాలేజి లెక్చరర్ (బసవ)రాజుపై ప్రేమ కలగడానికి అతనిలోని నిజాయితీ తప్ప వేరే కారణం కనిపించదు. దాన్ని కామజుష్టం కాని పవిత్ర ప్రేమగా ఆమె, విధి వేసిన ముడిగా అతను భావించారు.

అయితే కేవల వ్యక్తిగత అనుభవం ప్రపంచపు తీరుతెన్నుల గురించి అర్థం చేసుకోడానికి గానీ వ్యాఖ్యానించడానికి గానీ నిర్ధారించడానికి గానీ అర్హత అవుతుందా అన్నది వొక ప్రశ్న. స్వీయ జీవితానుభవం నుంచి లేదా కొందరి అనుభవాల కేంద్రంగా చేసే మూల్యాంకనాలు సూత్రీకరణలు కూడా సాపేక్షాలే కానీ సార్వత్రికాలు కావు. నిర్దిష్టతల నుంచి సాధించే సాధారణీకరణాలు అంతిమ సత్యాలు కావు. అందరి కోణం నుంచి కొందరి కథనాలు సార్వకాలిక సత్యాలు కాబోవు. అసలు అంతిమ సత్యం వుంటుందా అన్నది మరో ప్రశ్న. ఉంటుందని కొందరి అన్వేషణ. ఉండదని తెలిసీ మరికొందరి ఆరాటం.

కొంత మంది కొన్ని చోట్ల యిలా ప్రవర్తించారు. అందరూ అన్ని చోట్లా యిలాగే ప్రవర్తించకపోవచ్చు. స్థల కాలాలను దృష్టిలో వుంచుకోక చేసే సిద్ధాంతాలు ప్రతిపాదనలూ తమ అర్థాన్ని కోల్పోతాయి. అటువంటి ప్రయత్నం చేసే సాహిత్యం కూడా అలాగే ప్రాసంగితకి దూరమౌతుంది. నిర్దిష్టత సాధారణీకరణాల మధ్య సమన్వయంలో సాహిత్యం నెరవేర్చే పాత్ర బలమైంది. మనకు యే విధంగానూ సంబంధం లేని వ్యక్తుల జీవితాలను సాహిత్యంలో తెలుసుకుంటున్నప్పుడు వారి వుద్వేగాలతో తాదాత్మ్యం చెందుతాం. మన అనుభవాలతో బేరీజు వేసుకుంటాం. కోపిస్తాం. దు:ఖిస్తాం. ఆనందిస్తాం. ఆలోచిస్తాం. ఏదో అందిపుచ్చుకుంటాం. సాహిత్య పఠనం ద్వారా యిటువంటి Carry along యేదో లేనప్పుడు అది కేవలం కాలక్షేపం కోసం చేసే వ్యర్థ కలాపం అని నా నమ్మకం. కథని కథగానే చదవాలి. సినిమాని సినిమాగానే చూడాలి అనే వాదన అత్యాధునిక భావనగా బలపడుతున్న కాలంలో వివిన మూర్తి రాసిన ‘కొంతమంది.. కొన్నిచోట్ల’ చదవాల్సిన అవసరం వుంది. సాహిత్య ప్రయోజనం గురించిన మౌలిక ఆలోచనలకు అది మరోసారి సాహిత్య మాధ్యమం ద్వారానే తెరలేపింది.

సాహిత్య పఠనం ద్వారా కలిగే యెరుకను జీవితాలకు అన్వయించుకోవడం గురించిన ప్రస్తావన శివరామరావు – జయ, కవిత – నవత, నవత – సంకేత్, నవత – వేణూ ప్రసాద్, నవత – రాజుల మధ్య చాలా సార్లు వస్తుంది. ‘వాస్తవ జీవితం వేరు కథలు వేరు అని చెప్పలేం’, ‘కల్పన కన్నా వాస్తవం సంక్లిష్టమైనది – రచయిత లక్ష్యం ఆ సంక్లిష్టతని విడమరచడం’ వంటి నిశ్చిత అభిప్రాయాలతో పాటు ‘తెలుగు సాహిత్యంలో వాక్య భ్రమ స్వైర విహారం ఎక్కువ. అర్థగాంభీర్యానికన్నా వాక్యం భ్రమకు చలామణి ఎక్కువ’ వంటి చర్చనీయమైన ప్రవచనాలు కూడా వుంటాయి. ఆచరణకు ఆటంకంగా పరిణమించే పుస్తక జ్ఞానాన్ని తిరస్కరించడం కూడా గమనిస్తాం. నవల ప్రారంభం నుంచి చివరి వరకూ నవత అదే అభిప్రాయాన్ని ప్రకటించింది.

నవల్లో పాత్రలు భిన్న భావజాలాలకి ప్రతినిధులు. తాము యే భావజాలానికి చెందిన వాళ్లమో వాళ్ళు స్వయంగా ప్రకటించుకుంటారు. ఎదుటివాళ్ళు అలాగే గుర్తిస్తారు. పాఠకులకు శ్రమ ఉండదు. భావజాలాల మధ్య ఘర్షణ వుంటుంది. అది కూడా బరి గీసి బరికి అవతల ఇవతల అన్నంత స్పష్టంగా వుంటుంది. ఆశ్చర్యం యేమంటే వారి వారి చోటుల్లోంచి యెవరూ కదలరు. స్థిరమైన బలమైన అభిప్రాయాలు కలిగి వుంటారు.

రచయిత పూర్తిగా తటస్థుడు. తాటస్థ్యం సాధ్యమేనా అన్నది నా ఆలోచన. అది సంశయమే అని రుజువు చేస్తాడీ రచయిత. అన్ని ఆలోచనలు ఆశయాలు ఆదర్శాలు ఆకాంక్షలు పాత్రల ముఖత:నే పలికించాడు. ఈ టెక్నిక్ ని పాటించడానికి కాన్షియస్ గా ఎఫర్ట్ పెట్టినప్పటికీ రచయిత దొరికిపోతాడు. కళాత్మక దృష్టితో చూసినా అలా దొరికిపోవడం కూడా తప్పు కాదేమో!

ఆ క్రమంలో రెండు బలమైన పాత్రలను రచయిత సృష్టించారు. ఒకటి: సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పురోగమి స్వభావంగల జయ బావ శర్మ. రెండు: విప్లవోద్యమ భావజాలాన్ని అత్యంత నిబద్ధతతో స్వీకరించిన ‘విశాఖ’ వేణుప్రసాద్ (జయ బావలో కారా మాస్టార్ని వేణుప్రసాద్ లో చలసాని ప్రసాద్ ని కనపరచాలని రచయిత ఆశించకపోయినప్పటికీ నాకెందుకో ఆ పాత్రల చిత్రణలో తీరుతెన్నుల్లో వైఖరిలో వాళ్లే గుర్తుకు వచ్చారు). ఇద్దరూ వ్యక్తి స్వేచ్ఛని గౌరవించేవారే. జీవితంలో జయ నవత తీసుకున్న నిర్ణయాలపై వారి పరోక్ష ప్రభావం వున్నప్పటికీ వాళ్ళు యెప్పుడూ తమ అభిప్రాయాల్ని యెదుటివారి మీద రుద్దలేదు. వారిద్దరి యెంపికల్లో నిర్ణయాల్లో కేటలిస్టులుగా వ్యవహరించారు. వ్యక్తుల నిర్ణయాలు యెంపికలు వ్యక్తి పురోగమనానికి ఆటంకం కారాదని యిద్దరూ భావించారు. అయితే ఆ నిర్ణయాలు వైయక్తిక వికాసానికో ఆనందానికో దోహదం చేసేవి అయినప్పటికీ యితరులకు బాధ కలిగించేవి కాకూడదని శర్మ భావిస్తే అవి సామాజిక పురోగమనానికి కూడా తోడ్పడాలని వేణుప్రసాద్ బలంగా నమ్మాడు. ఇద్దరూ నాల్గు రోడ్ల కూడలిలో సైన్ బోర్డుల్లా నిలిచి దారి చూపారు తప్పితే ఆ దారిన నడవమని బోధించలేదు. అందుకే నవత ఆరెస్సెస్ భావజాలాన్ని నమ్మిన రాజుని ప్రేమించినపుడు వేణుప్రసాద్ అడ్డుచెప్పలేదు. ఉద్యమం బాట పట్టమని ప్రేరేపించనూ లేదు. నవత మనోధర్మాన్ని వేణుప్రసాద్ బాగా అర్థం చేసుకున్నాడు. లేదా కులాంతర మతాంతర ప్రేమాల్లాగానే భావజాలాంతర ప్రేమలు కూడా వుంటాయనీ స్త్రీ పురుష సంబంధాలు ప్రజాస్వామ్యీకరణ చెందే క్రమంలో అటువంటివి కూడా భాగమేననీ రచయిత చెప్పదల్చుకున్నాడేమో!

నవల్లో కవితా నవతా అక్కచెల్లెళ్లుగా వొకే గూడు కింద పెరిగినప్పటికీ భిన్న అభిరుచులతో ఆలోచనలతో స్వభావాలతో కనిపిస్తారు. కవిత అంతర్ముఖురాలు. ఆచి తూచి మాట్లాడుతుంది. నవత బహిర్ముఖురాలు. మనసుకు అనిపించింది అనేస్తుంది. కవిత అధ్యయనశీలి. తన అధ్యయనాన్ని జీవితానికి అన్వయించుకునే నేర్పు కలది. నవత ఆచరణశీలి. ప్రతి ఫలితాన్నీ ఆచరణ గీటురాయి మీద పరీక్షిస్తుంది. ఆచరణ ద్వారా కలిగే అనుభవం వెలుగులో సమాజాన్ని అధ్యయనం చేసి మార్పు కోసం ప్రయత్నించాలి అని భావిస్తుంది. ఆమె స్వభావం ఆలోచనల వుద్వేగాల సమ్మిశ్రణం. నవత జీవిత ప్రయాణాన్ని మూడు భాగాలుగా, వుద్యమంలోకి వెళ్ళక ముందు వుద్యమం లోపల వుద్యమం నుంచి బయటికి వచ్చాకగా, చూసినప్పుడు ఆమెలో స్వీయ మానసిక ధోరణి యెక్కువ అనిపిస్తుంది. గుర్తింపు ఆరాటంలో వున్నట్టు కూడా తోస్తుంది. ఆమెలోని ప్రతిభనో ప్రత్యేకతనో మరో గుణాన్నో గుర్తించినవాళ్లకు లేదా యితరుల్లో అటువంటి ప్రత్యేకత ఉందని తాను గుర్తించినవాళ్లకు వెంటనే అటాచ్ అవుతుంది. రాజుకు గానీ వేణుప్రసాద్ కి గానీ అందువల్లే సన్నిహితం కాగలిగిందేమో. ఈ మనస్తత్వం కారణంగానే అక్క ప్రేమించిన బాలుని అసంకల్పితంగా హత్తుకుని ముద్దుపెట్టి అతని మరణానికి కారణమైంది. నిజానికి మనోవైజ్ఞానిక దృష్టితో ఆ రంగంలో నిష్ణాతులు నవత శివరామరావు పాత్రల్ని విశ్లేషిస్తే నవల్లో యెన్నో కొత్త కోణాలు ఆవిష్కారమౌతాయి.

‘సమాజంలో పేదరికం పోవాలి. ఆడదానిపై వివక్ష పోవాలి.’ అని నవత మొదట్నుంచీ నమ్మింది. అయితే యేది ముందు యేది తర్వాత అన్నదే నవల పొడవునా ఆమె అన్వేషణ. తన తల్లిలా పిన్నిలా కుటుంబంలో స్త్రీలు యెదుర్కొనే హింస అణచివేత తొలగిపోడానికి ఆమె దారులు అన్వేషించింది. మొత్తం సమాజం మారితే గానీ సమస్త అసమానతలు ఆధిపత్యాలు తొలగిపోతే గానీ స్త్రీ విముక్తి సాధ్యం కాదని ఆమె విశ్వసించింది. అడవి బాట పట్టింది. సాయుధమైంది. ఆమె ప్రేమించిన రాజు ఆచరించే సనాతన ధర్మం పట్లో ఆరెస్సెస్ భావజాలం పట్లో ఆమెకు ఆశ లేదు నమ్మకం లేదు. ఆ విషయం ఆమె స్పష్టంగానే చెప్పింది. శకలాలుగా మిగిలి పోయిన అస్తిత్వవాద వుద్యమాల పట్ల ముఖ్యంగా స్త్రీవాదం పట్ల అది సృజించిన సాహిత్యం పట్ల కూడా ఆమెకు గౌరవం కలగలేదు. విప్లవకారుల ‘మొత్తం’ మీది దృష్టి స్త్రీ సమస్యల సత్వర పరిష్కారానికి ఆటంకం అని భావించి పద్నాలుగు సంవత్సరాలు నడిచిన సాయుధ విప్లవోద్యమ మార్గాన్ని వదులుకుని బయటికి వచ్చింది. ఉద్యమం లోపల చేసే ఆచరణకు త్యాగాలకు ‘గుర్తింపు’ గురించి నవత సంకేత్ ల మధ్య జరిగిన చర్చలో ఐడెంటిటీ రాజకీయాలకు చెందిన అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. పారిస్ కమ్యూన్ దగ్గర్నుంచి రష్యాలో చైనాలో యేర్పడ్డ కమ్యూనిస్టు ప్రభుత్వాల వరకు అవి విఫలం కావడానికి ఐడెంటిటీ పాలిటిక్స్ కారణమని నవత అభిప్రాయం. పోవాల్సింది పేదరికమా వివక్షా యేది ముందు యేది వెనుక అన్న ఆమెను పీడించే ప్రశ్నలకు వుద్యమంలో జవాబు దొరకలేదు. ఆమె బయటికి రావటానికి అది ప్రధాన కారణం కావచ్చు.

విప్లవోద్యమం హామీ యిచ్చిన భవిష్యత్తు పట్ల ఆమెకు ఆశే గానీ నమ్మకం కలిగినట్టు లేదు. సంశయం కలిగాక కూడా సంకేత్ లాంటి వుద్యమ సహచరుల మీద ఉన్న అభిమానంతో కొన్నాళ్లు కొనసాగింది. కానీ చివరికి బయటికి వచ్చేసింది. దాదాపు పదహారు సంవత్సరాలు రాజు ఆశ్రమంలోనే (?) స్త్రీల సమస్యలకు పరిష్కారాలు చూపే కౌన్సిలింగ్ లో వుంది. అక్కడ కూడా ఆమెకి అసంతృప్తే. మధ్యలో మళ్ళీ వుద్యమంలోకి తిరిగి వెళ్ళాలి అనుకుంది. కానీ తనలాంటి సంశయాత్మురాలు వుద్యమం లోపల వుంటే వుద్యమానికి కీడు జరుగుతుందేమో అన్న ఆలోచనతో మానుకుంది.

ఉద్యమం నుంచి బయటికి వచ్చినప్పటి ఆమెను చూసి ‘అనుభవాలతో అలసిపోయినట్టుగా లేదనీ కొత్త అనుభవాల్ని కోరుకుంటున్నట్లుంద’ని వేణుప్రసాద్ భావిస్తాడు. కొత్త అనుభవం అంటే మార్పు కోసం పోరాడటమే. ఆచరణశీలిగా వుండటమే.

నవత కోరుకునే /ఊహించే సమాజంలో –

‘ఏ నిబంధనలూ శృంఖలాలూ లేని స్త్రీ తన ఇచ్ఛ మేరకు ప్రవర్తిస్తుంది. దేహం ఆమెది. మనసు ఆమెది. వాటి మీద ఆమెకు సార్వభౌమాధికారం ఉంటుంది. … తన ఆనందాన్నీ విషాదాన్నీ ప్రకటిస్తుంది. తన ఎంపిక తాను ప్రకటించుకుంటుంది. ఆ ఎంపిక తక్షణానిదా శాశ్వతమైనదా అన్న జంఝాటం ఉండదు. సమాజానికి ఏ ఎంపికనైనా అంగీకరించే పరిణతి ఏర్పడుతుంది. వ్యక్తికి ఏ రకమైన బలవంతానికీ దిగని పరిణతి కలుగుతుంది.’

మరి జయ చేసింది అదే కదా! జయ జీవితాన్నీ శివరామరావు జయల మధ్య సమాజం ఆమోదించని ప్రేమనీ చిత్రించడానికి రచయిత ప్రత్యేకంగా వొక అధ్యాయాన్ని కేటాయించడం చూస్తే వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని ఆశించినట్లు తోస్తుంది.

‘జీవితం నేను నిర్మించుకున్నాను ఈ భావం నాలో కలిగించిన తృప్తి అమూల్యమైనది.’

ఇది జయ మాట. ఈ మాటలోని పరిణతిని గుర్తించడానికి నవతకి చాలా కాలమే పట్టింది.

నిజానికి నవత వుద్యమంలో వున్న ఆ కాలంలోనే కుటుంబంలో తండ్రి నిర్వహించిన/నిర్వహించని పాత్ర పట్ల అవగాహన యేర్పడి వుండాల్సింది. వ్యక్తి కుటుంబం సమాజం వాటి నైతికత విలువలు కట్టుబాట్లు గురించి సరైన నిర్ధారణలు ఆమెకు కలగకపోవడం ఆశ్చర్యమే. అన్నిటికంటే మించి సాటి స్త్రీగా జయ పట్ల ఆమె ఆలోచనల్లో మార్పు రావలసి వుండింది. కనీసపు సానుభూతి అయినా కలగాల్సి వుండింది. జయ కూడా అనసూయ శకుంతల వంటి బాధిత స్త్రీయేనేమో అన్న సంశయం అన్నా ఆమెకు కలగలేదు. పోనీ వుద్యమ సహచరుడు సంకేత్ తో ఆమె శారీరికంగా మానసికంగా దగ్గరైన తర్వాతైనా,

‘ఒక వ్యక్తి ఏకకాలంలో ఇద్దరిని ప్రేమించడం సాధ్యమా?’

అని నవత నవతని ప్రశ్నించిన తర్వాతైనా, ఆమెకు తండ్రి జయల వివాహం గురించి అర్థమై వుండాలి. సమాజపు కట్టుబాట్లన్నింటినీ యెదిరించినప్పటికీ రహస్య సహజీవనం చేయడంలో వారు అనుభవించిన క్షోభ తెలిసి వుండాలి.

పద్నాలుగు సంవత్సరాల వుద్యమాచరణ ప్లస్ మరో పదహారు సంవత్సరాల అధ్యయనం మొత్తం ముప్పై సంవత్సరాల సామాజిక జీవితం ఆమెకు జయకు దగ్గర కావడానికి వుపయోగ పడలేదు. అమెరికా నుంచి వొకే వొక సంభాషణ వినడం ద్వారా అదీ యెటువంటి యెదురు ప్రశ్నలకీ ఆస్కారం లేని రికార్డెడ్ వీడియో వినడం ద్వారా గతాన్నంతటినీ పక్కన పెట్టి ఆమె మారిపోవడమే వింత. అదే నవలకు ముగింపుగా రచయిత నిర్ణయించుకోవడం వల్ల యీ మార్పు మధ్యలోనే కలగలేదేమో!

*

అసలీ నవలని కవిత కథగానో నవత కథ గానో జయ శివరామరావుల కథగానో చూడటం కూడా తప్పేమో. వాళ్ళ జీవితాల్ని నెపంగా పెట్టుకుని రచయిత మరింత పెద్ద సామాజిక రాజకీయ తాత్త్విక చర్చ చేయదల్చుకున్నాడు. వ్యక్తికీ సమాజానికీ మధ్య వుండే వైరుధ్యాల గురించీ వ్యక్తివాదానికీ సమష్టి చైతన్యానికి మధ్య చోటుచేసుకునే ఘర్షణ గురించీ సాహిత్యానికీ సమాజానికీ వుండాల్సిన సమన్వయం గురించీ శకలీకరణకు దారి తీసే అస్తిత్వ వాదాల గురించి మాట్లాడదలచుకున్నాడు. కమ్యూనిస్టులు మొత్తం గురించి ఆలోచిస్తున్నారు. అందులో శకలం గురించి స్త్రీలు ఆలోచిస్తున్నారు అని ఒక చోట సంకేత్ ముఖతా పలికించాడు. దానికి నవత ఆమోదం కూడా వుంది. కానీ ఆమెకు అస్తిత్వ వాదం పట్ల వున్న సంశయమే తన విప్లవాచరణ పట్ల కూడా యెక్కడో కలిగింది. అయితే స్త్రీలకులాగే అణచి వేతకు గురయ్యే కులాలు మతాలు అల్పసంఖ్యాకులు … ఇలా ఈ సమాజపు లోగడ విధానాల మీద బాధితులకు కలిగే చైతన్యం తొలి ప్రతిక్రియ ముక్కలు ముక్కలు గానే వుంటుందనీ వారి తక్షణ వ్యతిరేకతతో వారి సాహిత్యం ఆరంభం అవుతుందనీ అది ద్వేష ప్రకటనతో కొంతకాలం సాగుతుందనీ రచయిత భావించాడు. అదే సందర్భంలో ప్రతి శకలం చెప్పే కథనాలు అవసరమే అనీ సామాన్యంగా సమాజ హితాన్ని కోరే అందరికీ అది సహాయకారి అవుతుందనీ ఫిర్యాదులు తోటి శకలాలపై అయితే అది ఎమోషనల్ దశ అనీ అక్కడితో ఆగిపోయి సమాజం మీద ఫిర్యాదుగా మారకపోతే దాన్ని పునరాలోచించాలి అనీ నిర్ధారించారు. సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్యాన్నీ, సాహిత్యంతో సమన్వయం చేస్తూ సమాజాన్నీ అధ్యయనం చేసే ప్రక్రియ వొకటి ప్రత్యేకమైన పొరగా నవల్లో అనేక సందర్భాల్లో కనిపిస్తుంది.

ఒకానొక దశలో సంకేత్ వంటి విప్లవాదులు రాజు లాంటి రాష్ట్రీయ స్వయం సేవకులు కలిసి సమాజ నిర్మాణంలో భాగం వహిస్తే బావుంటుంది అన్న ఆచరణ సాధ్యంకాని ఆలోచన కూడా నవతకు వస్తుంది. అది రచయిత ఆలోచన కూడానేమో. ఆ మాట ఆ వ్యక్తుల్లో ఆమె చూసిన నిజాయితీ కారణంగా కలిగిందా లేదా నిజంగానే భిన్న భావజాలాల మధ్య వున్న వైరుధ్యాల్ని తొలగించుకొని పనిచేస్తే బాగుంటుంది అన్న సమన్వయ దృక్పధం నుంచి యేర్పడిందా? మార్క్సిజం వర్గ పోరాటం పునాదిగా నిర్మితమైన భౌతిక వాదం. ఆరెస్సెస్ ది మతం పునాదిపై కట్టిన భావవాదం. సామాజికంగా గాని రాజకీయంగా గాని రెండూ భిన్న ధ్రువాలు. జాతి జాతీయత వంటి భావనల గురించిన ఆలోచనలు కూడా వొకరితో వొకరికి పొసగవు.

కొంతమంది కొన్నిచోట్ల విడివిడిగా కాక అందరూ కలిసి దేశ పురోగతికి పాటుపడాలి అనే కోణం నుంచి ఆలోచించడం వల్ల నవతకి (రచయితకి) యిటువంటి పొంతన లేని వూహ కలిగిందేమో! నవత ఆలోచనలు గమ్మత్తుగా వుంటాయి. శంకరాచార్యులు తన మతాన్ని ప్రచారం చేయడానికి అవసరాన్నిబట్టీ సగుణ నిర్గుణ బ్రహ్మల్ని వుపయోగించుకున్నాడని సంకేత్ దగ్గర ప్రస్తావిస్తుంది. ఇటువంటి సూత్రీకరణకు యెంతో అధ్యయనం చేయాలి కానీ ఆమె హిందూత్వ వాదాన్ని సాంస్కృతిక జాతీయవాదాన్ని ముందుకు తెచ్చిన ఆరెస్సెస్ ప్రముఖులు సావార్కర్ హెగ్డేవార్ గోల్వాల్కర్ ల గురించి కనీసం విని వుండదు. రాజు చెప్పాల్సిందే. కమ్యూస్టులు విదేశీ సిద్ధాంతాలు తెలుసుకుంటారు గానీ దేశీయంగా ప్రాచీన సంస్కృతినీ దార్శనికతనీ అధ్యయనం చేయరని రాజు అధిక్షేపిస్తాడు. అయితే గుజరాత్ నరమేధం వల్ల గాయపడిన రాజు కమ్యూనిస్టుల పట్లే కాదు; బిజెపి ఆరెస్సెస్ ల ఆచరణ పట్ల విమర్శనాత్మకంగా ఆలోచించడం గమనిస్తాం. రెండు భావజాలాలకు సంబంధించిన వారూ రాజ్యాధికారంలోకి వచ్చినా విఫలమయ్యారని చెబుతాడు. అంతేకాదు; కమ్యూనిస్టులు సాహిత్యం ద్వారా చైతన్యం కలిగిస్తారు కానీ ఆ పేరుతో సాహిత్యాన్ని విభజించారనీ రచయితల్లో చీలికలకు కారణమయ్యారనీ అవమానితులకు అణచివేతకు గురవుతున్న వాళ్ళకీ రాయితీలు కల్పించారనీ ఆరోపించాడు. ఇలా రాజు మౌలిక ఆలోచనల్లో మార్పు రాలేదు గానీ కొంతమేరకు ఆత్మవిమర్శకు లోనయ్యాడు. ఆ ఆత్మ విమర్శలో నిజాయితీ కనిపిస్తుంది. బిజెపి ఆర్ఎస్ఎస్ చేతిలో వుందని అది ఫాసిస్టు శక్తి అని కొంతకాలం క్రితం వొక కార్టూనిస్ట్ వూహించిన కార్టూన్ గురించి పేర్కొని – ‘ఆర్ఎస్ఎస్ ఇప్పుడు బిజెపి పార్టీ చేతిలో ఉందని నా అనుమానం. మేము రాజకీయంగా ఓట్ల పోగేతకి ఆర్థికంగా ప్రపంచ పెట్టుబడిదారుడి సంపద పోగేతకి కేవలం పనిముట్లుగా మిగిలిపోయామా? మూడు దశాబ్దాలకు పైగా సాకిన జాతి వ్యక్తి శీలాల పునర్నిర్మాణం నిష్ఫలమా? పగటి కలా?’ అన్న విచికిత్సకు గురయ్యాడు. అయితే రాజు చేసిన విమర్శ గానీ ఆత్మవిమర్శ గానీ పదిహేను సంవత్సరాల పూర్వపువి. అదానీ ఆర్థిక అవినీతి సామ్రాజ్యానికి పాలకుల మద్దతు గురించి మాట్లాడటం దేశద్రోహంగా యిటీవల ఆరెస్సెస్ ప్రకటించడానికి అతను యెలా స్పందిస్తాడో మరి! మౌనంగా వుండే నేరాన్నే కొనసాగిస్తాడా? ఆ మౌనాన్ని నవతా ఆమోదిస్తుందా? నిజానికి నిత్య నిర్బంధాల సమకాలీన ఫాసిస్టు రాజకీయాల వూసు నవల్లోకి యెక్కలేదు. అకస్మాత్తుగా కథ 2005నుంచి 2019కి లాంగ్ జంప్ చేసింది.

భారతదేశం ఒక జాతిగా నిర్మాణం కాకపోవడానికి ఆటంకం అవుతున్న విషయాన్ని రచయిత నవల్లో ప్రధానంగా చర్చకు పెట్టాడు. చివరికి అమెరికాలో వున్న గోపి(జయ కొడుకు) చెప్పిన మాటల ద్వారా ‘గతాన్ని మర్చిపోయినప్పుడే మనం ఒక జాతిగా రూపొందగలమని అమెరికా ఆదిశగా విజయం సాధించిందని’ నవలని ముగించాడు. నిజానికి అమెరికా వొక జాతి కాదు. అది భిన్న జాతుల సమూహాలతో కూడిన విశాల జన సముదాయం. అక్కడక్కడా వర్ణ విద్వేషపు అవశేషాలు వున్నప్పటికీ ప్రతి జాతి మరొక జాతిని గౌరవిస్తుంది. అలా గౌరవించే ప్రజాస్వామిక సమాజాన్ని రచయిత కోరుకుంటూ వుండవచ్చు. ఆయన కోరికలో మన దేశం కూడా భిన్న జాతుల సమాఖ్యగా రూపొందాలనే ఆశయం కనిపిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రాంతాల మధ్య వైషమ్యం లేని సమాభివృద్ధిని సాధించవచ్చేమో! కానీ యిటీవలి రాజకీయ పరిణామాలు ఆలోచనలు అందుకు భిన్నంగా వున్నాయి. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే విధానాలు దేశంలో అమలౌతున్నాయి. రాష్ట్రాలు బలహీనపడి కేంద్రం బలపడాలనే దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇది ఆరెస్సెస్ లక్ష్యాల్లో ముఖ్యమైనది. దాన్ని అమలు చేయడానికి పాలకులు హింసాత్మక పద్ధతులు అవలంబిస్తున్నారు. భిన్న అభిప్రాయాన్ని బుల్డోజ్ చేస్తున్నారు. పౌర సమాజాన్ని భయానికి గురిచేస్తున్నారు. సాంస్కృతిక జాతీయవాదం పేరున భిన్నత్వాన్ని సహించలేని ఫాసిస్టు ధోరణి ప్రబలింది. నిజానికి భారతదేశం యెప్పుడూ ‘అఖండం’గా వొక దేశంగా లేదు. బ్రిటిష్ పాలనలోనే అనేక రాజ్యాలుగా వైషమ్యాలతో యుద్ధాలతో కునారిల్లుతున్న వుపఖంఢానికి వొక ‘దేశం’ రూపం యేర్పడింది. ఇక్కడ జాతుల మధ్య భారత జాతి అనే భావన కలగటం కష్టం. భిన్న జాతుల మధ్య వైవిధ్యాన్ని గుర్తిస్తూ బహుళత్వాన్ని గౌరవిస్తూ దాన్నొక ప్రజాస్వామిక విలువగా రూపొందించుకోవాల్సిన తక్షణ రాజకీయ అవసరం మన ముందుంది. లేని పక్షంలో జాతి వైవిధ్యాన్ని హరించే ఏకధ్రువ వాదం ఫాసిజంగా పరిణమిస్తుంది. ఇప్పుడు రాజకీయాలు ఆ దిశగా నడుస్తున్నాయి. ఒకే జాతి ఒకే సంస్కృతి ఒకే భాష ఒకే దేశం ఒకే మార్కెట్ చివరికి ఒకే దేవుడు ఒకే మతం నినాదంతో యితర మతాల జాతుల సంస్కృతుల భాషల వైవిధ్యాన్ని నాశనం చేసే లక్ష్యంతో హింసకు పూనుకుంటున్నారు. భిన్నత్వాన్ని సహించని అసహనం మూక స్వామ్యానికీ దాడులకూ దారి తీస్తుంది. మనోభావాల పేరుతో మౌఢ్యం కత్తులు ధరించి వీథుల్లో స్వైరవిహారం చేస్తుంది. బహుళత్వాన్ని ధ్వంసం చేసే కుట్ర అందులో యిమిడి వుంది. రాజు విశ్వసించి ఆచరించిన ఆరెస్సెస్ మౌలిక విధానం ఆశయం అవే. దానికి తొలి మెట్టే గుజరాత్ ప్రయోగం. మరిక రాజు మౌనానికి అర్థం లేదు. గోవాల్కర్ కోరుకున్న ‘హిందూ రాజ్’ వైపు నడవడానికి రాజు వ్యతిరేకి కాదు. అది హింసాత్మకంగా పరిణమించడం అతనికి నచ్చలేదు. గుజరాత్ గాయాలు అతణ్ణి కలచివేశాయి. మౌనాన్ని ఆశ్రయించాడు. కానీ సంఘ పరివారం గుజరాత్ మోడల్ నే మరింత క్రూరంగా దేశమంతటా అమలు చేస్తోంది. రాజు మౌనమే నవత అతని ఆశ్రమంలో వుండటానికి కారణమైతే పదహారేళ్లు అక్కడ వుండి స్త్రీ విముక్తికి ఆమె చేపట్టిన కార్యక్రమాలు యెటువంటివి? వాటి పట్ల రాజు వైఖరి యేమిటి? ఆమెలోని సంశయాత్మక స్వభావాన్ని తుడిచిన భౌతిక పరిస్థితి అయితే సమాజంలో సంభవించలేదు, సరికదా సంఘ పరివార చోదిత దుర్మార్గాలు మరింత క్రూరంగా పర్యవసించాయి. సాయుధపోరాటంలోకి వెళ్ళకముందు యౌవన సహజమైన వుద్వేగ ప్రధానమైన స్వభావం వల్ల కలిగిన ఆకర్షణలో ఆమె అతనికి దగ్గరైందేమో గానీ పద్నాలుగు సంవత్సరాల వుద్యమ జీవితం తర్వాత కూడా భావజాలపరమైన వైరుధ్యం వొకచోట కలిసి వుండటానికి ఆటంకం కాలేదా? లేదా సంకేత్ కి శారీరికంగా దగ్గరైన కారణంగా యేర్పడ్డ గిల్ట్ నుంచి బయటపడడానికి రాజు నీడన వుండటమే పరిష్కారంగా భావించిందా? ఇటువంటి ప్రశ్నలు పాఠకుల్లో మిగిలిపోతాయి. ఈ అంశం వొక విధంగా నవల నిర్మాణంలోని ఖాళీగానే భావించాలి.

*

నవల నిర్వాహణ విషయంలో వివిన మూర్తి పాటించిన శిల్పం గురించి కూడా వొకట్రెండు అంశాలు ప్రస్తావించుకోవాలి. నవత వుద్యమంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి వుద్యమ జీవితం గురించి యెక్కువగా రాయలేదు. సాయుధోద్యమంలో ప్రజా సంబంధాల గురించి గానీ దళ చర్యల గురించి గానీ యెదుర్కొన్న ఆచరణపరమైన ఘర్షణ గురించి గానీ యెక్కడా ప్రస్తావన లేదు. నవత తన ఆలోచనల్ని అక్క కవితతో, ప్రేమికుడు రాజుతో, గురువు లాంటి వేణుప్రసాద్ తో వుత్తరాల ద్వారా పంచుకుంది. ఇది వొక తెలివైన టెక్నిక్ అని నాకు అనిపించింది. కవితకి రాసిన లేఖలో గతానికి సంబంధించి తన ప్రవర్తన పట్ల ఆత్మ విమర్శ వుంది. బాలు మరణం విషయంలో తన ప్రమేయం గురించి చెప్పి అపరాధ భావన నుంచి బయటపడింది. వర్తమానంలో ఆమెలో రేగే ఆలోచనలు వున్నాయి. ఆచరణ ద్వారా నేర్చుకున్న అంశాల క్రోడీకరణ ఉంది. వాటిని వేణుప్రసాద్ రాజులతో పంచుకుంటూ తనను తాను క్రాస్ చెక్ చేసుకుంది. ఈ టెక్నిక్ పాటించటం వల్ల నవలకు బ్రీవిటీ సాధించగలగడం అటుంచితే సంకేత్ నవతల మధ్య జరిగిన సంవాదాల్లో రచయిత తటస్థుడిగా వుండే అవకాశం లభించింది. జయ శివరామారావుల ప్రేమా పెళ్లీ వాటి మంచీ చెడుల చర్చకు ఫ్లాష్ బ్యాక్ కథనం చక్కగా వుపయోగపడింది. పాఠకుల్లా రచయిత కూడా ప్రేక్షకుడే. ప్రేక్షకులకు పాత్రలతో కలిగే తాదాత్మ్యం చర్చ వేరే సంగతి.

‘ఒక నది నడక తెలియాలంటే నువ్వు ఎంత ఎత్తునుంచి దాన్ని చూడగలిగితే అంతగా తెలుస్తుంది. దాని పక్కనే ప్రయాణం చేస్తూ దాని నడకని ఊహించగలవు గాని.. చూడలేవు’

ఆశ్యర్యంగా సంకేత్ రాజు యిద్దరూ నవత ముందు యిదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

సాహిత్యంలో రచయిత జీవితంతో సంఘటనలతో పాటించాల్సిన తాటస్థ్యం గురించి మమేకత గురించి నాలో కలిగే ఆలోచనలకి యీ ప్రతీకలకీ యెక్కడో లింక్ వున్నట్టు అనిపించింది. నిజానికి నదితో నది పక్కన నడిస్తేనే ఆ నది అలజడి వినగలం. దిగితేనే దాని గాంభీర్యాన్ని తెలుసుకోగలం. ప్రవాహ వుద్ధృతినో మంద్రతనో అనుభవించగలం. దాని పైనుంచీ వీచే గాలిని స్పృశించగలం. ఆస్వాదించగలం. పై నుంచీ నదిని వొకానొక కోణంలో మాత్రమే చూడగలం. దూరం మోసం చేయొచ్చు. ఎత్తున వున్నవారికి లోతు తెలీదు. మమేకత వుద్వేగానికి దారితీసే ప్రమాదం వుంటుందని హెచ్చరించేవారు వుంటారు. కానీ సృజనాత్మకతకి తార్కికతా వుద్వేగం రెండూ అవసరమే. యెంత యెడంగా వుండాలనేది సమయానుగుణంగా నిర్ణయమౌతుంది. నిమగ్నత నిబద్ధతల వంటి పెద్ద విషయాలపై చర్చించే అర్హత నాకు లేనప్పటికీ సాహిత్యానికీ జీవితాచరణకీ పొంతన లేని వ్యాసంగం వ్యర్థమని నా అభిప్రాయం. ఒక సామాజిక ఆచరణలో వున్నవాళ్ళకి అసలు సాహిత్యమే వుపయోగపడదు అని నవత లాంటి వాళ్ళు భావించడం యెంతవరకు సమంజసమో తెలీదు. ఆచరణలో పాటించాల్సిన రాజకీయ వాస్తవికతకీ సాహిత్య కాల్పనికతకీ పొంతన కుదరదని ఆమె అభిప్రాయం కావచ్చు. ఉద్యమాచరణలో నిమగ్నమై వున్న రచయితల రచనలకీ వొడ్డున వున్న బయటి వారి రచనలకీ మధ్య వ్యత్యాసం కూడా మరో గమనించాల్సిన అంశం.

ఏదైనా వొక సిద్ధాంతాన్ని ఆచరణని విమర్శనాత్మకంగా తెలుసుకోవాలంటే కాస్త యెడంగా వుండి పరిశీలించాలి అన్నది రచయిత అభిప్రాయంగా కనిపిస్తుంది. ఆ యెడం పాటించడం వల్లే భిన్న భావజాలల్ని వాటి మంచి చెడుల్ని బలాన్నీ బలహీనతనీ గుర్తించే అవకాశం కలుగుతుంది అన్నది నిజమే.

గతం సంకెల కాకూడదు. గతం ఊబిలో కూరుకుపోయినవాళ్ళు వర్తమానంలోనే జీవించలేరు, భవిష్యత్తు వైపు ఏం చూడగలుగుతారు?! రాజు లాంటివాళ్ళు గతంలోనే జీవిస్తారు. గతం నుంచే పరిష్కారాలు ఆశిస్తారు. గతాన్ని గతితార్కికంగా వివేచన చేసుకుని వర్తమానాన్ని మార్చుకుని భవిష్యత్తుని నిర్మించుకునే ఆలోచనల్ని అందించే సామాజిక శాస్త్రం మార్క్సిజం మాత్రమే అన్న అవగాహన రచయితకు వుందనే ఆయన యితర రచనలు నిరూపిస్తాయి. అది ఆచరణ శాస్త్రం అనే నమ్మకం కూడా మూర్తిగారిలో బలంగా వున్నప్పటికీ ఆచరణ పద్ధతుల పట్ల యేవో కొన్ని అనుమానాలు ఆయనకు కలుగుతున్నట్టున్నాయి. మార్క్సిజానికి చేర్పులు అవసరమనీ వాటిని ప్రాచీన భారతీయ సంస్కృతి నుంచి దార్శనికత నుంచి అందిపుచ్చుకోవచ్చనీ భావిస్తున్నట్టున్నారు. వాటినే యీ నవల్లో ముందుకు తెచ్చారు. అవునో కాదో విమర్శకులు తరచి చూసి చెప్పాలి.

భిన్న భావజాలాల్లో వున్న చెడుని పరిహరించి మంచిని స్వీకరించి ఆత్మవిమర్శ నుంచే గాక పరస్పర అధ్యయనం ద్వారా సమకూరే విమర్శ నుంచి కూడా పాఠాలు నేర్చుకుని వ్యక్తుల బలహీనతల కారణంగా ఆచరణలో చోటుచేసుకునే లోపాల్ని సవరించుకోవాలన్నది కూడా రచయిత ఆశయంగా చివరికి అనిపించింది.

‘ఒక రచన సృజనాత్మక మనటానికి నిదర్శనం – అది మరో సృజనకి బీజం వేయటమే’

అని రచయిత యీ నవల్లోనే వొకానొక సందర్భంగా వొక పాత్ర ద్వారా చెప్పిస్తారు. సాహిత్య విమర్శ కూడా సృజనాత్మక వ్యాసంగమే అని అంగీకరిస్తే అటువంటి బీజం వేసినందుకు రచయిత వివిన మూర్తి గారికి కృతజ్ఞతలు.

(21 మే 2023 వివిన మూర్తి గారికి 75 ఏళ్ళు. ఆ సందర్భంగా.)

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

4 thoughts on “కొందరి కథ – అందరి కోణం

  1. ఇటివల కాలంలో ఇంత విపులంగా వస్తున్న సమీక్షలు లేవు … అందుకు ప్రభాకర్ గారిని తప్పకుందా అభినందించాలి .

Leave a Reply