కేతు విశ్వనాథరెడ్డి అభ్యుదయ సామాజిక చింతన

‘కేతు ఇస్ నోమోర్’  2023 మే 22 ఉదయం ఆర్వీఆర్ గారి వాట్స్ అప్ వార్త చూసాను.   యనభై ఆరేళ్ళ పరిపూర్ణ జీవితం ఆయనది. మరణించి జ్ఞాపకం అయ్యాడు. పుట్టుకకు చావుకు మధ్య జీవించిన జీవితంలోని సృజనాత్మకత, అభ్యుదయ సామాజిక చింతన కారణంగా చరిత్ర అయ్యాడు. ఆ జ్ఞాపకాలను తడుముకొనటం, ఆ చరిత్రను అధ్యయనం చేయటమే మనం ఆయనకు  ఇయ్యగలిగిన నివాళి. 

1

 కేతు ఇంటిపేరు. విశ్వనాథరెడ్డి అసలు పేరు. ఆయన పరిచయం, పంచిన స్నేహం, ఇచ్చిన సాహిత్య విద్యావిషయక మార్గదర్శకత్వం,  కలిసి పని  చేయటానికి కల్పించిన అవకాశాలు అన్నీ నాకు అపురూపమైనవే. ఆయనతో నా తొలి పరిచయం  పంథొమ్మిదివందల ఎనభై అక్టోబర్. అవి బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ నవలపై పరిశోధన చేస్తున్న రోజులు. బుచ్చిబాబుకు మిత్రు డైన  ఆచంట జానకీరాంను,  బుచ్చిబాబు తో ప్రభావితుడైన వడ్డెర చండీదాస్ ను ముఖాముఖి కలిసి మాట్లాడటానికి  తిరుపతి వెళ్ళాను. అప్పుడు నేను మొదట కలిసింది  శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యా లయంలో  తెలుగువిభాగంలో అధ్యాపకుడిగా ఉన్నకేతువిశ్వనాథరెడ్డి గారిని.ఆరోజు ఆయన నా పరి శోధన పని గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకోనటమే కాదు,నాకు తోడుగా వుండి అవసరమైన చోటికి తీసుకువెళ్లే బాధ్యత  ప్రసాద్ అనే పరిశోధకవిద్యార్ధికి  అప్పగించారు.  ఆరకంగా ఒక స్నేహితుడిని సంపాదించుకొని అనుకొన్న పనులు పూర్తిచేసుకొని వచ్చాను. ఆ తరువాత మూడేళ్లకు నేను సమర్పించబోయే సిద్ధాంతగ్రంథం పరీక్షకులలో కేతువిశ్వనాధరెడ్డి ఒకరు అవుతా రని ఆ రోజు నాకు తెలియదు. 

ఒకేఒక్క నవలమీద అనేక కోణాలనుండి సమగ్రంగా  వచ్చిన సిద్దాంత గ్రంధం  అని  అభి నందిస్తూనే తన నివేదికలో ఆయన వేసిన ప్రశ్నలు  చాలా కీలకమైనవి. నన్ను ఆలోచింపచేసినవి. అలంకారశాస్త్ర సూత్రాల ప్రకారం నవలా విమర్శ చేయవచ్చా? పాత్రలు ఏదో ఒక స్థితికి,ఉద్వేగానికి ప్రతీకలు  అవుతాయా? పాత్రలకు ఆర్కెటైప్స్  ఉంటాయా ? బుచ్చిబాబు మౌలిక తత్వం ఏమిటి? వంటి ఆయన ప్రశ్నలను సిద్దాంత గ్రంధం ప్రచురిస్తున్నప్పుడు (1987) ‘చెప్పవలసిన విషయాలు’  అనే శీర్షిక క్రింద చర్చించాను కూడా. ఆ పుస్తకం అచ్చువేసేనాటికి కేతు విశ్వనాథరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (అదే 1991 నాటికి డా.  బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవాయిద్యాలయం అయింది)ఆచార్యులుగా పనిచేయటానికి వచ్చి హైద్రాబాద్ లోనే ఉంటు న్నారు. ఆర్టిస్ట్ చంద్రగారు కూడా అదే యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఆయనను పరిచయం చేసి నా పుస్తకానికి చక్కని ముఖచిత్రం వేయించి ఇచ్చిందీ విశ్వనాథరెడ్డి గారే. 

1983 లో విశ్వనాథరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం కోర్సుల నిర్వహణ బాధ్యతలు చేపట్టటం నన్ను కొత్త పనులలోకి ప్రవేశపెట్టింది. 1977 నుండి నేను అధ్యాపకురాలిగా ఉన్నవరంగల్  ఆర్ట్స్& సైన్స్ కళాశాలలో  అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ  సెంటర్ పెట్టారు. అక్కడ  తెలుగు మౌలికాంశాలు పాఠాలు చెప్పటానికి కౌన్సిలర్ గా చేరమని చేకూరి రామారావు గారు, కేతు విశ్వనాథరెడ్డి గారు నన్ను ఆదేశించారు. మామూలు తరగతి గది కన్నా భిన్నంగా చుట్టుపక్కల ఊళ్ళ నుండి వచ్చే వేరువేరు నేపధ్యాలు,  వయసులు కల   వారికి  ప్రతి ఆదివారం పాఠాలు చెప్పటం అదొక కొత్త అనుభవం.  దానికి అనుబంధంగా చేయవలసిన పనుల మీద తరచు  అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి వెళ్ళటం కేతు విశ్వనాథరెడ్డి గారిని కలుసుకొనడం జరుగుతుండేది. ఒక సంవత్సరం కోర్సు కాగానే పరీక్షలు పెట్టటానికి ముందర ఒక సెంటర్ లో పనిచేసే కౌన్సిలర్లను మరొక సెంటర్లో విద్యార్థులకు జరిగే  పునశ్చరణ తరగతులలో పాఠం చెప్పటానికి  పంపుతుండేవాళ్లు. అలా ప్రతి వేసవిలో రెండు మూడు వూళ్లకయినా వెళ్లి కొత్తకొత్త విద్యార్థి సమూహాలకు పాఠాలు చెప్పటానికి లభించిన  ఆవకాశం  నా అనుభవ పరిధిని, నైపుణ్యాలను పెంచుకొనటానికి  శిక్షణా తరగతి అయిందనుకొంటాను. 

వీటినిమించి చెప్పుకోవలసింది సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థుల కోసం తయారుచేసే స్టడీ మెటీరియల్ తయారీలో కేతు విశ్వనాథరెడ్డిగారు 1984 నుండే నన్ను భాగం చేయటం. బి.ఏ తెలుగు ప్రత్యేక అంశంగా చదివే విద్యార్థులకోసం రూపొందించిన కోర్సులలో పాఠాలు వ్రాసే అవకాశం ఇచ్చారు. వ్రాసినవి చూసి తగిన సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. చలం ఓ పువ్వు పూసింది , ఇల్లిందిల సరస్వతీ దేవి మూగజీవులు, రంగనాయకమ్మ పెళ్ళానికి ప్రేమలేఖ వంటి కథలకు, మహీధర రామమోహనరావు గారి స్వయంవరణం వంటి నవలలకు , సమాజ సాహిత్య సంబంధాలు, సాహిత్య విమర్శ వంటి విషయాలమీద అప్పట్లో వ్రాసిన పాఠాలు తిరిగి చూసుకొంటే ఇప్పటికీ నాకు సంతోషమే. ఆడియో వీడియో పాఠాలు కూడా నాతో చెప్పించారు.  సాహిత్యానికి చరిత్రకు, సాహిత్యానికి  సమాజశాస్త్రాలకు అన్యోన్య సంబంధాన్ని గురించిన ఆయన  అవగాహన  పాఠ్య ప్రణాళికలను రూపొందించడంలో కనిపిస్తుంది. 

కేతువిశ్వనాథరెడ్డి 1997 లో రిటైర్ అయినా కూడా  చాలాకాలం విశ్వవిద్యాలయ  తెలుగు విభాగానికి తన మార్గదర్శకత్వాన్ని ఇచ్చారు. కోర్సు రచయితగా,  కోర్సు పుస్తకాల సంపాదకురాలిగా పాఠ్య ప్రణాళికా బృందం సభ్యురాలిగా, కేతు విశ్వనాథరెడ్డి గారితో  పాతికేళ్ళపాటు కలిసి పనిచేయటం నాకు ఎంతో ఇచ్చింది. కాకతీయ విశ్వవిద్యాలయం తరువాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నా రెండవ విశ్వవిద్యాలయం అయింది.   కేతు విశ్వనాథరెడ్డి  గారి   ప్రజాస్వామిక పని విధానం, నిబద్ధత ఆయన పరిధిలోకి వచ్చిన ఎవరినైనా ఆయన ప్రేమించిన పనిని, విలువలను ప్రేమించి స్వంతం చేసుకోనట్లు చేస్తాయనుకొంటా. 

ఎనభయ్య్యవ దశకంలోనే కొడవటిగంటి కుటుంబరావు  రచనా సంపుటాలు విశ్వనాథరెడ్డి గారి  సంపాదకత్వంలో వచ్చాయి. అప్పటి యువతరానికి కొకు  జీవిత తాత్వికతను, ఆర్ధిక రాజకీయ దృక్పథాన్ని, భావుకతను పరిచయం చేస్తూ వచ్చిన ఆ సంపుటాలలో కేతు విశ్వనాథరెడ్డి  శ్రమ, ప్రేమ  కనిపిస్తాయి. ఆ రకంగా అవి కొకు సాహిత్య అధ్యయన విమర్శల పట్ల నాలో కుతూహలాన్ని రెచ్చగొట్టాయి కూడా. ఆ రకంగా  నా సాహిత్య సంస్కారాల వికాసానికి పాదులు  తీసిన కేతు విశ్వనాథరెడ్డి గారు 1994 లో   నేను, జ్యోతిరాణి, శోభ కలిసి స్త్రీల సమస్యల పై  1982 నుండి వ్రాస్తూ వచ్చిన  వ్యాసాలను ‘మహిళాజన జీవన సమస్యలు మూలాల అన్వేషణ’  అనే శీర్షికతో పుస్తకంగా ప్రచురిస్తున్నప్పుడు  ముందుమాట వ్రాస్తే బాగుంటుంది అనుకొని అడిగితే సంతోషంగా ఒప్పుకొన్నారు. స్నేహ హస్తం … అనే శీర్షికతో వ్రాసిన ముందుమాటలో “ వీరు ముగ్గురూ కోరేది బీజయోనుల ప్రత్యేక ప్రతిపత్తులు కాదు;పరస్పర సంబంధాలు; ఆపేక్ష కేంద్రంగా వికసించవలసిన మానవ సంబంధాలు; పితృస్వామిక దురహంకార సంబంధాల విముక్తి;స్త్రీ పురుషుల్లో ఎవరూ ఎవరికీ బానిస కాకూడని సమానత్వం” అని సారాన్ని మెచ్చుకొంటూనే  సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో చూడటం, రాజకీయ పరిష్కారాలనే ముందుకు తీసుకొనిరావటం సంశ్లిష్ట భారతీయ సమాజంలో  సాంస్కృతిక రంగంలో కనబడకుండా  జరుగుతున్న నిరంతర ఘర్షణలకు పెడముఖం పెట్టటమే అవుతుందని హెచ్చరించారు కూడా. ఈ నాడు చాపకింద నీరులాగా జీవితంలోని సర్వ పార్శ్వాలకు విస్తరిస్తున్న  మనువాద బ్రాహ్మణీయ సంస్కృతి మానవ సంబంధాలలో సృష్టిస్తున్న   ఘర్షణలను , సంక్షోభాలను ఎదుర్కొనటానికి అవసరమైన కార్యరంగాన్ని నిర్మించుకొనవలసిన వర్తమాన సందర్భలో ఆ హెచ్చరికు   ఒక   ప్రాసంగికత ఉందనుకొంటా.   

2

కేతు విశ్వనాథరెడ్డి వృత్తి రీత్యా పరిశోధకుడు, విమర్శకుడు. ప్రవృత్తి రీత్యా సృజన రచయిత. అందులోనూ సామాజిక అసమానతలను, అన్యాయాలను ప్రశ్నిస్తూ బాధితులవైపు , పీడితులవైపు నిలబడి వాళ్ళవేదనలకు, ఆందోళనలకు స్వరం ఇచ్చిన రచయిత. ఆయన కథారచన 1960లలోనే ప్రారంభం అయినా  1991 లో రెక్కలు కథ తటస్థ పడే వరకు  నేను ఆయన కథాప్రపంచంలోకి ప్రవేశించలేదు. ఆధునిక స్త్రీ అవరోధాలను ఎదుర్కొంటూ ఎదగటానికి చేసే యుద్ధాన్ని ఒక ఆడపిల్లల తండ్రి కోణంనుండి వ్యాఖ్యానించిన సరళ సుందరమైన ఆ కథ రెక్కపట్టుకొని నను లాక్కుపోయింది. అప్పటి నుండి అడపాదడపా కేతువిశ్వనాథ రెడ్డి కథలు చదువుతూనే ఉన్నాను. ఆయన రాయలసీమ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి, చదువుకొన్న యువతరానికి  స్వచ్ఛంద ప్రతినిధిగా నిలబడి వాళ్ళ బాహిరప్రపంచ పరిణామాలను  , అందులోని సమస్యలను, వైరుధ్యాలను, ఆంతరిక ప్రపంచపు అల్లకల్లోలాను స్పృశిస్తూ  వ్రాసిన కథలు నన్ను ఆకట్టుకొన్నాయి. అందులో స్వీయాత్మక సంవేదన కొంత ఉండటానికి అవకాశం ఉంది.అయితే అంతగానూ ఆయన సాహిత్యం తనది కాని దళిత స్త్రీ అస్తిత్వ సంవేదనలను ప్రతిఫలించటం చూస్తాం. మార్క్సిస్టు దృక్పథం నుండి సానదేలిన జీవిత అవగాహన, అందరికీ గౌరవంగా జీవించే అవకాశాలు సమంగా లభించాలన్న రాజ్యాంగ నైతిక స్ఫూర్తి కారణంగానే అది సాధ్యం అయిందనుకొంటాను. ఈ క్రమంలో కులానికి, మతానికి జీవితంలో ఉన్న ప్రమేయాన్ని వ్యాఖ్యానిస్తూ  కేతు విశ్వనాథరెడ్డి వ్రాసిన సృజన సాహిత్యాన్ని – మనువాద బ్రాహ్మణీయ సంస్కృతీ వ్యాప్తి తీవ్ర ఘర్షణకు కారణమవుతున్న వర్తమాన సందర్భంలో- విశ్లేషించుకొనటం ఎంతయినా అవసరం.  

విశ్వనాథరెడ్డి వ్రాసిన నవలలు రెండు వేర్లు, బోధి. రెండు నవలలకు వస్తువు  ఎమ్మె చదువుకొని ఉద్యోగాల వేటలో ఉన్నగ్రామీణ  యువకుల జీవితానుభవాలే. బోధి లో కథ ప్రవర్తించే కాలం 1962 అని చెప్పే అంతర్గత ఆధారాలు  ఉన్నాయి. వేర్లు నవలలో కథాకాలాన్ని సూచించే ఆధారం ఏమీ లేదు కానీ నవల చివరలో వచ్చిన నెహ్రు ప్రస్తావన ను బట్టి ఈ నవల కథాకాలం కూడా ఇంచుమించు అదే అనుకోవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన  పదిహేనేళ్లకు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇద్దరు యువకుల అనుభవకోణం నుండి చూపించాయి ఈ నవలలు. వ్యవసాయం గిట్టుబాటుకాని పరిస్థితులు, కరువులు, అప్పులు, తరిగే భూమి, తండ్రి  బాధ్యతారాహిత్యం కారణంగా చదువుకొన్న తాను ఏదో ఉద్యోగం చూసుకొని వెళితే  ఇంట్లో భూమి మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గుతుందనుకొని  హైదరాబాద్ లో ఒక పత్రిక  కార్యాలయంలో ఉద్యోగం సంపాదించుకొని వెళ్లిన యువకుడు జీవితాన్ని నిర్మించుకొనటం బోధి నవలలో విషయం. ఆనవల 1984 లో ప్రచురించ బడింది. అప్పటికి ఆరేళ్లకు ముందే వ్రాయబడిన నవల  వేర్లు.  బోధి నవలలో కన్నా ఇందులో  జీవన సంఘర్షణ తీవ్రమైనది. అందుకు కారణం ఆ యువకుడు దళితుడు కావటమే. ఈ రెండు నవలల సంపుటి 1994 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణగా వచ్చింది.  1978 లోనే కేతు  దళిత జీవిత సమస్యల సమగ్ర చిత్రణగా ‘వేర్లు’ నవల  వ్రాయటం విశేషం . 

చదువు సదసద్వివేకాన్ని కలిగించటమే కాదు, ఉన్నత విద్య జీవనోపాధి సాధకమై ఉన్న స్థితి నుండి ఉన్నతస్థితికి మనుషులు ఎదగటానికి తోడ్పడుతుందని, జీవన ప్రమాణాలను పెంచుతుందని అంబేద్కర్ భావించాడు. మరీ ముఖ్యంగా తరతరాలుగా గ్రామాల చివరకు , మొత్తంగా  సమాజం అంచులకు నెట్టివేయబడిన దళితులు  కేంద్రంలోకి రావటానికి, అభివృద్ధిలో సమమైన వాటా పొందటానికి అవకాశం కల్పించేది విద్య అని నమ్మి చెప్పాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిరెండు మూడు దశాబ్దాలు గడిచిన తరువాత కూడా అంబేద్కర్ ఆశలకు ఆశయాలకు దళిత సామాజిక వాస్తవికతకు మధ్య ఎక్కడా పొంతనలేకపోవటాన్ని వేర్లు నవల చూపించింది. ఈ నవలలో వెంకట్రాముడు గ్రామీణ మాదిగ బానిసత్వం నుండి విముక్తికి పెనుగులాడుతున్న యువకుడు. తోడబుట్టిన నలుగురు అన్నదమ్ములలో  ఇద్దరుముగ్గురు చెల్లెళ్లలో ఎమ్మె వరకు చదివిన  వాడు అతను ఒక్కడే. పదేళ్ల తమ్ముడిని మినహాయిస్తే,  తండ్రి ఇంటి మాదిగ పనికి , తల్లి, అన్న, చెల్లెళ్లు ముగ్గురాళ్ళ గని పనులకు, ఇద్దరు తమ్ముళ్లు రైతుల  ఇంట  పాలేరు  పనికి  పోతే తప్ప గడవని కుటుంబం లో తనకు అబ్బిన చదువు కారణంగా ఉద్యోగాల వేటే ఒక్కటే పని అయిన వాడతను  

 ఆ చదువు వల్ల అబ్బిన నాగరికత,  భేషజం అతనిని తన అసలు జీవితానికి, అయినవాళ్లకు పరాయివాణ్ణి  చేసిందన్నది  ఎంత వాస్తవమో అదే సమయంలో ఆ చదువు వల్ల కలిగిన  ఆలోచనా జ్ఞానం దళిత జీవితానుభవాలలోని అవమానాలను,బాధాకరమైన వివక్షను విమర్శనాత్మకంగా  విశ్లేషించి చూసుకొనటానికి  అవకాశం ఇచ్చిందన్నది అంతే వాస్తవం. ఈ రెండు పార్శ్వాల నుండి వెంకట్రాముడు వంటి చదువుకున్న దళిత యువకులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో  ఈ నవలేతివృత్తగమనంలో నిరూపించబడింది. 

గొడ్డు ను కోయటం , కోసేటప్పుడు అక్కడ ఉండే వాతావరణం చిన్నప్పటినుండి చూస్తున్నదే అయినా ఎమ్మె పూర్తయి గ్రూప్ వన్ పరీక్షలు వ్రాసి ఫలితాలకు ఎదురుచూస్తూ  స్వగ్రామంలో ఉన్న వెంకటరాముడికి ఆ వాసన, ఆ దృశ్యం  భరించరానివి ఎందుకు అయ్యాయి? ఆ మురికి ప్రపంచం నుండి , ఆ పరిసరాల నుండి తనను తాను పెకిలించుకొని ఉద్యోగవర్గంలో చేరటానికి బౌద్ధికంగా సన్నద్ధుడు అవుతుండటం వలన అనుకోవచ్చు. ’సదువుకొని మారిపోయినాడు’ అని గూడెం మనుషులు అనుకొనటం దానిని గుర్తించటం వల్లనే కావాలి. 

రోజు వారీ దినచర్యగా పోస్టాఫీసుకు వెళ్ళాడు  వెంకట్రాముడు. అక్కడ కొలువుదీరి వున్న  రోశిరెడ్డి ‘మీ అమాసగాణ్ణి మా నాయన రమ్మన్నాడని చెప్పు’  అని చెప్పినమాట అతనిని కలవరానికి లోను చేసింది.తల్లి దండ్రి పెట్టిన పేర్లు మర్చిపోయి అగ్రవర్ణులు, అధికార వర్గులు తమ శరీరాన్నో , రంగునో, స్వభావాన్నో, పనులనో అవమానిస్తూ సంబోధించిన పేర్లతోనే చెలామణి కావలసివస్తున్న దళితుల అవమానకర చరిత్రను తలచుకొని సిగ్గుపడాడ్డు, బాధపడ్డాడు వెంకట్రాముడు.  తన అన్న నల్లగా ఉంటాడని అమాసగాడనటం అతనిని   న్యూన పరచటమే. గ్రామ పెత్తందార్లకు మాదిగిండ్ల వాళ్ళ పేర్లు దాదాపు ఇంతే. చిన్నప్పుడోక సారి తాను జొన్న పిసుకుళ్ల కోసం  జొన్నకంకుల్ని విరిచి తిట్లూ దెబ్బలు తిన్న ఘటన గుర్తుకువచ్చి నయం తనను జొన్న కంకులోడు  అని పిలవటం లేదు అని వెంకట్రాముడు అనుకొన్నాడంటే సాధారణంగా వాళ్ళను సంబోధించే పేర్లు వాళ్ళ ఓటములను, అవమానాలను సదా గుర్తుచేసేవే అనుకోవచ్చు. మాదిగపల్లె అని తప్ప తమ వూరికి ఒక ప్రత్యేకమైన పేరుకూడా లేకపోవటం  కూడా గుర్తుకువచ్చి అస్తిత్వ రాహిత్యంతో  ఆవేదన పడ్డాడు వెంకటరాముడు.  నాం నిశానీ లేని ఛండాలపు బతుకులపట్ల రోత కలిగింది. 

వెంకటరాముడు పల్లెల్లో సంబంధాలన్నీ కులంచుట్టూ తిరగటంగమనించాడు. సారా దుకాణంలో, టీ అంగళ్లలో రైతుల గ్లాసులువేరే. దళితుల సత్తు లోటాలు వేరే.   టౌన్లలో చదువుకొన్న వాళ్లలో కులం లేనట్లే కనబడుతుంది కానీ అంత మొరటుగా కాకపోయినా హేళనలుగా, ఎత్తిపొడుపులుగా అనుభవంలో అతనికి అదితెలుస్తూనే ఉంది.  బడులలో పంతుళ్లు గొడ్డుమాంసం  తినేవాళ్ళకు, మడత నాలిక గాళ్ళకు  చదువేం వస్తుంది అని చేసిన ఆక్షేపణలు, విశ్వవిద్యాల యాలలో కూడా కులాన్ని వేలెత్తి చెప్పే ప్రత్యక్ష పరోక్ష వేధింపులు,  ‘గవర్నమెంటు దత్తపుత్రులు’  అంటూ తమకు ఉన్న రిజర్వేషన్స్ గురించి, వచ్చే స్కాలర్ షిప్ లగురించి ఈర్ష్యపడుతూ చేసే వ్యాఖ్యలు  ఆ క్షణాన జ్ఞాపకాలై  కదిలి బాధించాయి. క్షణక్షణం ఇలా దళితులను ఆత్మన్యూనతకు లోను చేసే విషయం పట్టించుకోకపోతే అదేదో కథలో మాదిరి పేరు మరిచిపోయిన ఈగలాగా అవుతుంది తమ పరిస్థితి అనిపించింది అతనికి. ఆ సమయంలో అతనికి కులనిర్మూలనా సంఘం పరిచయం అయింది. 

ఇల్లలకుతూ పేరు మరచిన ఈగ తన పేరు ఏమిటో తెలుసుకొనటానికి ఎక్కడెక్కడికో వెళ్లి ఎవరెవరినో అడిగి తెలుసుకొన్న జానపద కథనే వెంకటరాముడు అదేదో కథ అని ప్రస్తావించాడు. పేరు మరచిపోవడం అంటే స్వీయ అస్థిత్వాన్ని కోల్పోవటం. కోల్పోయాం అన్న ఎరుక కోల్పోయినదానిని పొందే పర్యంతం మనిషిని తరుముతుంది. దానికి సంబంధించిన బీజరూప భావనను ‘అదేదో కథలో మాదిరి పేరు మరిచిపోయిన ఈగలా తన పరిస్థితి కాకూడద’న్న వెంకటరాముడి ఆలోచనాముఖంగా కేతు విశ్వనాథరెడ్డి దళిత అస్తిత్వ ఆకాంక్షల కోణంనుండి ఇక్కడ ప్రవేశపెట్టాడు. ఆ తరువాత పన్నెండు ఏళ్లకు పి. సత్యవతి దానినే స్త్రీల అస్తిత్వ ఆకాంక్షల కోణంనుండి తాత్విక స్థాయిలో సమగ్ర కథగా అభివృద్ధి చేసింది. అదే ‘ఇల్లలకగానే పండగౌనా’  కథ. 

దేవదానం పిలుచుకొని పోతే వెంకటరాముడు కడపలో జరుగుతున్న కులనిర్మూలన సంఘం సమావేశానికి వెళ్ళాడు. సర్వీస్ కమీషన్ సభ్యులు, ఎమ్మెల్యే లు, డిఆర్ ఓ వంటి ప్రభుత్వ ఉద్యోగులు, వాసు వంటి లెక్చరర్లు, దేవదానం వంటి టీచర్లు కార్యనిర్వాహక వర్గంగా ఉన్న కులనిర్మూలన సంఘం సర్వసభ్య సమావేశాన్ని, బహిరంగ సభను వివరంగా చూపించటంలో రచయిత ఆశించిన ఒక ప్రయోజనం  అస్తిత్వ అన్వేషణలో ఉన్న వెంకటరాముడి వంటివాళ్లకు తనను తాను తెలుసుకొనటానికి ఒక ఆలంబనను, దళితుడుగా తాను ఒంటరి కాదు, తనలాంటి వాళ్ళ అస్తిత్వ ఆకాంక్షలను సాకారం చెయ్యగల సమూహ బలం ఉందన్న  ఒక నమ్మకాని ఇయ్యటం.అదే సమయంలో మధ్య మధ్య పాత్రల ఆలోచనలనో, మాటలనో వ్యాఖ్యానించటం ద్వారా ఆ సంఘాలు  ఎన్ని పరిమితులమధ్య,   ఎవరి ప్రయోజనాల  కోసం నడుస్తున్నవో జాగ్రత్తగా పరిశీలించి తెలుకొనమని హెచ్చరించటం  కూడా ఆయన ఉద్దేశించారు. ప్రజా సంఘాలలో వ్యక్తుల సాంఘిక ఆర్ధిక రాజకీయ లబ్ది, ఉద్యోగ భద్రత, ప్రభుత్వానుకూల వైఖరి వంటివి దళితుల జీవితంలో మార్పుకు అభివృద్ధికి తోడ్పడతాయా అన్న ప్రశ్నను పాఠకులముందు నిలుపుతుంది. అంతే కాదు అంటరానితనం నేరం అని రాజ్యాంగం చెప్తున్నా హరిజన సంక్షేమ పథకాలు ఊళ్లల్లో నిచ్చెనమెట్ల కులవ్యవస్థకు భంగం కాని రీతిలో  అమలుచేయబడుతున్న వాస్తవాన్ని కూడా ఒక యువకుడు ప్రశ్నద్వారా సూచించింది ఈ నవల. అది  కులనిర్మూలన సంఘం ఉనికికే సవాల్.   ఆ యువకుడి నోట ఈ రకం సంఘాల మీద నమ్మకం పోయింది అని  చెప్పించటం అందువల్లనే కావాలి.   

సభా ప్రారంభానికి ముందు  వెంకటరాముడికి దేవదానానికి మధ్య విద్య,ఆరోగ్యం, అభివృద్ధి పట్ల క్రైస్తవులకుండే శ్రద్ధ గురించిన ప్రస్తావన వస్తుంది. ‘హరిజనుల విషయంలో సాటి హిందువుల దృష్టి చాలు , ఆ మతం ఎంత అన్యాయమైందో చెప్పటానికి అని దేవదానం అంటే ఈ విషయంలో అందరూ ఒకటే అంటూ వెంకటరాముడు  మాల మాదిగల మధ్య ఉన్న ఎక్కువ తక్కువ భేదాల ప్రస్తావన తెచ్చి క్రైస్తవం తీసుకొన్న మాలలు కూడా మాదిగల పట్ల ఆ న్యూనభావంతోనే ఉండటాన్ని,దూరంపెట్టటాన్ని నిరసన స్వరంతో ఎత్తి చూపాడు. దళితులలో ఈ అంతర్గత కుల భేదాలు యథాప్రకారం  ఉంటుండగా మొత్తంగా  సమాజంలో కులనిర్మూలన సాధ్యమయ్యేనా అన్న ప్రశ్నను ఆ రకంగా ముందుకు తెచ్చింది ఈ నవల. 

ఇక ఈ నవలలో రెండవ అంశం వెంకటరాముడు ఉద్యోగం. వ్రాసిన  గ్రూప్ వన్ పరీక్షలు  పాస్ అయి ఆర్డీవో ఉద్యోగం సంపాదించాలన్నది అతని కల. వూళ్ళో తండ్రి సంపాదించిన ఆస్తికి,  లీజుకు వచ్చిన ముగ్గురాళ్ళగని సంపాదనకు వారసుడుగా పెత్తనం చేస్తూ ఆ అధికారంతో దళితులను అవమాన పరచే హక్కును చెలాయిస్తూ తన అన్నను అమాసగాడని అవమానించిన  రోశిరెడ్డి పై ఆర్డీఓ అధికారంతో పై చేయి సాధించి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి దానికి తోడైంది. అయితే గ్రూప్ వన్ పరీక్షలలో పాసైతే అయినాడు , ఇంటర్వ్యూ కు వెళ్లాడు  కానీ అతనికి ఉద్యోగం రాలేదు. రిజర్వ్ డు ఖాళీలు మూడున్నా అతనికి రాలేదు ఎందుకు? తన కులం వాళ్ళే , కులనిర్మూలన సంఘంలో పెద్దలే,  తమకు కావలసిన తమ కులం వాళ్ళకే సిఫారసు చేసి ఇప్పించుకొన్నారు  కనుక. అందరూ దళితులే అయినా దళితులందరూ సమానం కాదన్న విషయం అర్ధమైన క్షణం అది. అటువంటప్పుడు ఐక్యతకు ఆస్కారం ఉండదు . అర్ధమూ ఉండదు. ఈ పరిస్థితులలో  తానెవరు అన్న అసలైన ఆత్మ శోధనలో పడ్డాడు అతను. తాను ఒక దళితుడు వెలివాడమనిషి. కానీ వెలివాడలో ఇమడలేకపోయాడు.ఆ జీవితాన్ని ప్రేమించలేకపోయాడు. చదువు పెంచిన భ్రమలు, స్వార్ధం, తనను తనవాళ్లకు పరాయీకరించాయి. ఇలా స్వస్వరూప జ్ఞానం కలుగు తున్న స్థితిలో  వెంకటరాముడికి కళ్ళు తిరుగుతూ, చెదురుతూ నెహ్రు , నెహ్రు చేతిలో పావురం, పావురం డేగగా మారటం దృశ్యాదృశ్యంగా కదలాడినాట్లు వర్ణించారు కేతువిశ్వనాథరెడ్డి. నెహ్రూ ప్రస్తావన ద్వారా ఆయన ప్రజలకు వాగ్దానం చేసిన  సోషలిస్టు సమాజ స్థాపన ఎంత మాయో  వెంకటరాముడి వంటి వాళ్ళను నడివీధిలో నిస్సహాయంగా వదిలేసిన సందర్భం నుండి సూచించినట్లయింది. వెంకట రాముడి సత్యశోధన సాగుతూనే వుంది … అన్న వాక్యం తో నవల ముగుస్తుంది.  

నవల ముగిసింది కానీ వెంకటరాముడు సరికొత్తగా తనను తాను నిర్మించుకొనటం మొదలైంది. సత్యశోధనలో ఉన్న వాళ్ళ సహజలక్షణం అది. ఆవెంకట రాముడే 1985 తరువాత ఆత్మగౌరవ చైతన్యంతో తన కులాన్ని , కూడును, సంస్కృతిని, చరిత్రను  ప్రేమిస్తూ వాటిని హీనంగా చూసే సమాజాన్ని తమ లోతు కనుక్కొనమని సవాల్ చేసే దళిత సమూహంలోకి కొన సాగివచ్చాడు అనుకోవచ్చు.   వెంకటరాముడి   తండ్రి అతని మిత్రులు ఒకరాత్రి వూళ్ళో తాము లేనిదే గడవని పెళ్లిళ్ల గురించి, చావుల గురించి,  శుచి శుభ్రతల గురించి చెప్పుకొంటూ తమది గొప్ప కులమని  సగర్వంగా చెప్పుకొన్నట్లు, కుల ఉత్పత్తి పురాణాలను చెప్పుకున్నట్లు రచయిత కల్పించిన సన్నివేశం ఒకటి నవలలో ఉంది. 1985 తరువాతి దళిత ఆత్మగౌరవ పోరాటానికి    నైతిక బలం ఆ వాస్తవం. ఆ చరిత్ర. ఆ రకంగా కేతు విశ్వనాథరెడ్డి మరొక ఏడెనిమిదేళ్లలో విస్పోటం కానున్న దళిత ఉద్యమ ప్రకంపనలను పసికట్టినట్లుగా వ్రాసిన నవల వేర్లు.

 3  

“నీకు తప్పకుండా వుద్యోగం వస్తుంది . మా బ్రామ్మలను ఎవరు పట్టించుకుంటారు? యీ రోజుల్లో మీది రెడ్లది, కమ్మవాళ్లది బాగుంది. మీకు కులముంది . వాళ్లకు డబ్బులున్నాయి! మంత్రులూ, ఏం. ఎల్. ఏ లు వున్నారు. వుద్యోగం వస్తే నన్ను మరిచిపోకు … నేను అయిదేళ్లనుండి ఉద్యోగం లేక చస్తున్నా”.  వేర్లు నవలలో గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగానికి  వెంకటరాముడితో పాటు ఇంటర్వ్యూ కు వచ్చిన నరసింహారావు మాటలు ఇవి. ఆర్ధిక సాంఘిక హోదాలలోని అసమానత్వం పైన, అవకాశాలలో అసమానత్వం పైన  చూపు లేని వర్గం మాటలివి. ఉద్యోగాలు తమవరకు రాకపోవటానికి కారణంగా వాళ్లకు కనబడేది దళితులకు ఉన్న రిజర్వేషన్లు. లంచాలు , పైరవీల గురించి వాటిని ఉపయోగించే వర్గంతో సవాల్ చేయగల  ధైర్యం ఉండదు. ఊరికి లోకువైన దళితుల ఉన్నతవిద్యా ప్రవేశాన్ని గానీ , ఉద్యోగ లబ్ధిని కానీ తేలిక చేసి మాట్లాడటం సులువు. అయిదేళ్ల నుండి ఉద్యోగం రాని బ్రాహ్మణయువకుడి ఆక్రోశం ఆ రకంగా వెంకటరాముడి మీదకు మళ్లింది. కేతు ఈ ఘట్టాన్ని ఎందుకు కల్పించినట్లు? రిజర్వేషన్లలో ఉన్న సామాజిక న్యాయ కోణం గురించి యువతను ఆలోచించనీయకుండా చేస్తున్న ఆధిపత్య సంస్కృతి లోని అసహజత  ఏదో ఆయనను బాధించింది కనుక. అది మనుషులమధ్య సహజ స్నేహ సహానుభూతుల సంబంధాల వికసానికి అవరోధంగా ఉందని  గుర్తించాడు కనుక. కుల వివక్ష తగ్గుతూ కుల రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా సాగవలసిన ప్రస్థానం పక్కదోవ పట్టే  ప్రమాదాన్ని పసిగట్టాడు కనుక. అయితే ఈ నవల ఇతివృత్తంలో  దానిని మరింత సూక్ష్మంగా చర్చించే వీలు లేకపోయింది. ఈ సమస్యను చర్చిస్తూ పాతికేళ్ళకు ఆయన ‘సంకట విమోచని’ (2003) కథ వ్రాయటం విశేషం.

ఈ కథలో బ్రాహ్మడి స్థానంలో రెడ్డి ఉన్నాడు. దళితుడి స్థానంలో బిసి మహిళ ఉంది. అతను చెన్నారెడ్డి. ఆమె చౌడేశ్వరి. ఇద్దరి  బాల్యం ఒకే వూళ్ళో ఆటపాటల మధ్య గడిచింది. ఒకే యూనివర్సిటీలో వేరువేరు విభాగాలలో అధ్యాపకులు అయినారు. బిసి రిజర్వడ్ పోస్టు ఉండటం వల్ల అతనికంటే నాలుగేళ్ల ముందే ఆమె రీడర్ అయింది. అతను సర్వీస్ సీనియారిటీని బట్టి రీడర్ గా పదోన్నతి పొందాడు. ఆమె నేడో రేపో ప్రొఫెసర్ అయిపోతుంది , తనకు సమీప భవిష్యత్తులో ఆ అవకాశం కనిపించటం లేదు. అది చౌడేశ్వరి మీద అసూయగా రిజర్వేషన్ల మీద వ్యతిరేకతగా మారి ఎవరి మీదో తెలియని కసితో తనను తాను హింసించుకొంటున్న చెన్నారెడ్డిని చౌడేశ్వరి ఆ సంకటం నుండి  విముక్తం చేయటమే ఇందులో కథ.  

చౌడేశ్వరి ఆ పని ఎలా చేయగలిగింది? సమస్యలను వ్యక్తుల స్వీయాత్మకత నుండి కాక సామాజిక ఉత్పత్తి సంబంధాల మూలాలనుండి అర్ధం చేసుకోగల వివేకం ఇచ్చిన అర్థశాస్త్ర  అధ్యయనం వల్ల  చెన్నారెడ్డి తనపై అసూయ పడుతున్నాడని అతనిని ద్వేషించలేకపోయింది. పైగా అతను తన చిన్న నాటి స్నేహితుడు. మిత్రసమ్మితంగా అతని ఆలోచనాధోరణిలోని పొరపాటు అతను గ్రహించేట్లు చేయాలి. అతనిని రక్షించుకోవాలి. ఇది ఆమె ఆంతర్యం అని రచయిత ఎక్కడా వాచ్యం చేయలేదు కానీ ఆమె ఆ సమస్యను ఎదుర్కొని పరిష్కరించిన తీరులో అది ధ్వనిస్తుంది. చెన్నారెడ్డి కి మద్రాసు నుండి తిరుపతి ప్రయాణంలో బస్సులో కలిసిన  ఫిలాసఫీ ప్రోఫెసర్ నాగరాజు అతని లెక్చరర్ ఉద్యోగమప్పుడు ఎక్స్ పర్ట్ గా వచ్చినవాడు. చౌడేశ్వరి భర్తవైపు మామయ్య వరుస బంధువు. ఆయన వచ్చి వెళ్లిన ఆ సందర్భాన్ని  చెన్నారెడ్డితో మాటకలిపి మర్మం విప్పటానికి  ఉపయోగించుకొన్నది.  యాభై ఎకరాల ఆసాముల కుటుంబం నుండి వచ్చిన అతనికి, వాళ్ళు అద్దె లేకుండా ఇచ్చిన ఇంటివెనక భాగంలో నేతగాళ్ల కుటుంబం నుండి వచ్చిన ఆమెకు మూలంలో ఉన్న తేడా చూడమంటుంది. “ఒకఎకరం మీద పెట్టె పెట్టుబడికీ , శ్రమకు, ఆదాయానికీ; అట్లాగే ఒక చీరనేతలో పెట్టే పెట్టుబడికీ శ్రమకూ, ఆదాయానికీ  మధ్య తేడాలు నీ కెప్పుడైనా కనిపించాయా?” అని అతని ఆలోచన ఏ దిశగా ఎదగాలో సూచించింది. యాభై ఎకరాల ఆస్తిపరుల ప్రేమ లభించినా ఆస్తి, కులం తనకు దొరకానివేగా అన్న ఒక వాస్తవం వైపు చూడమంటుంది. ఉండటం బరువు. అది ఆస్తి కావచ్చు , కులం కావచ్చు. అవి లేకపోవటం ఒత్తిడి. బరువు జీవితంలో స్వతంత్రంగా ఏదైనా సాధించాలన్న లాలసను అణచివేసి కర్మనుకొని కృంగిపోవటం నేర్పుతుంది. లేదా అన్నీ నాకే కదా ఉండాలి అన్న అహాన్ని మప్పుతుంది. అసూయ, ద్వేషం దాని నుండి పుట్టేవే. పరాకాష్ట స్థితిలో  అవి హింసకు, దోపిడీకి దారితీస్తాయి. అయితే ఇక్కడ చెన్నారెడ్డి అసూయ తనను తాను హింసించుకొనటంగా వ్యక్తమైంది. రీసెర్చ్ పేపర్లు వ్రాయటం మానెయ్యటం,  ఆఫీసర్స్ క్లబ్ లో పేకాట కాలక్షేపాలు దాని రూపాలే. ఒత్తిడి మనిషిని  తన పరిధిలో తాను సాధించుకొనవలసిన విషయాల వైపు నడుపుతుంది. చౌడేశ్వరి సుదీర్ఘ ప్రసంగం చేయలేదు. రెండు మూడు ప్రశ్నలు,  కాస్త  విశ్లేషణ తద్వారా ఆర్ధిక సాంఘిక వ్యత్యాసాల సమాజంలో తరతరాలుగా అణచివేయబడిన  , అవకాశాలు నిరాకరించబడిన జాతులకు జరిగిన నష్టాన్ని పూరించటానికి వచ్చింది రిజర్వేషన్ విధానం అన్న అవగాహనను కలిగించటం.   కుల రిజర్వేషన్ వలన అతని కన్నా నాలుగేళ్ల ముందే  తాను రీడర్ కావటం అతనికి దుఃఖ కారణం కానక్కరలేదని ఆమె చెప్పదలచుకొన్నది. ఎందుకంటే అది వ్యక్తుల సమస్య కాదు కనుక.  కనీస  అర్హతలు వుండి  తన కులం కంటే తక్కువ సాంఘిక స్థాయిలో ఉన్న వ్యక్తికి తనకంటే ముందుగా పై పదవి వస్తే తాను ఈర్ష్యపడను అని చెప్పింది. సాపేక్ష సామాజిక న్యాయ భావన అది. “ చరిత్రలో జరిగిన జరిగే తప్పులన్నీ పోయేవరకు ఇవి తప్పవు” అన్న వాక్యం ఇందులో కీలకమైనది.   మానవ సమాజం వర్గ సమాజంగా , కుల సమాజంగా రూపుతీసుకొనే క్రమంలో  అవకాశాలలో  సమానత్వం లేక అభివృద్ధిలో వాటా లేక సమాజం చివరి అంచులకు నెట్టివేయబడిన వర్గాలను కేంద్రంలోకి తెచ్చి అభివృద్ధి లో భాగస్వామ్యం చేసేవరకు రిజర్వేషన్లను చరిత్రలో దొర్లిన ఆ తప్పిదాలకు పరిహారంగా  భావించాలి అన్నది తాత్పర్యం. 

కులం, మతం పేరుతో  సాంస్కృతిక ఆధిపత్యం అత్యంత హానికర రూపాలలో ఆవిష్కృతం అవుతూ  మానవ సంబంధాలలో అపనమ్మకాన్ని  విద్వేషాన్నీ వ్యాపింప చేస్తున్న వర్తమాన సందర్భంలో   సహన సంస్కృతిని అలవరచుకొనటానికి, సమస్యను స్వీయాత్మకంగా కాక వస్తుగత దృష్టితో చూడటం నేర్చుకొనటానికి  చెప్పవలసిన   మంచికథ సంకట విమోచని.    

మతభావజాల సంస్కృతిని  నీతిని రక్షణ కవచంగా చేసుకొని  ఆర్ధిక రాజకీయ ఆధిపత్య శక్తులు  విచ్చలవిడిగా  విజృంభిస్తున్న కాలం ఇది. ప్రజా జీవితంలో  సాధారణ స్థాయిలో ఉండే భక్తి మత  భావాల ప్రమేయాన్ని ప్రధానాంశంగా ముందుకుతెచ్చి, మత్తులోకి దించి వదిలి పబ్బం గడుపుకొంటున్న అధికార శక్తులను నిలవరించటానికి సాంస్కృతిక రంగంలో చేయవలసిన పని మతనైతిక విశ్వాసాల మాయపొరలను విప్పి చూపటం. కేతు విశ్వనాథరెడ్డి వ్రాసిన అన్నదాతలు (1983), సింహాసనం(1994) వంటి కథలు  ఆ పనే చేశాయి. అన్నదాతలు కుటుంబ కథలా మొదలై శ్రమ దోపిడీకి దానధర్మాల నీతికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టటంతో ముగుస్తుంది. పరలోకం మతం కల్పించిన ఒక విశ్వాసం. చనిపోయిన వాళ్ళు పరలోకాలకు వెళ్తారు. వాళ్ళను అక్కడకు చేర్చటానికి సద్గతులు కల్పించటానికి కర్మకాండ నిర్దేశించబడింది. అందులో అన్నదానం ఒకటి. చనిపోయిన వాళ్ళ పరలోక ప్రయాణాలకు ఎంతెంత ఖర్చులు పెట్టె వర్గం ఈ లోకంలో సాటి మనుషుల జీవన యానం గౌరవకరంగా సాగటానికి ఏమి చేస్తున్నది? భర్తచనిపోయి కొడుకు కు ఆస్తి కొంత ఏదో ఇచ్చి దారి చూపకపోతాడా అన్న ఆశతో  తండ్రి ఇల్లుచేరిన స్త్రీ భంగపాటును సమాం తరంగా చూపిస్తూ ఈ విలువలను చర్చకు పెట్టిన కథ అన్నదాతలు. తండ్రి చనిపోయి నప్పుడు,  ఆ తరువాత అక్క చనిపోయినప్పుడు అంత్యక్రియలు, అన్నదానాలు శ్రద్ధగా చేసిన ఆ స్త్రీ అన్నదమ్ములు బతుకంతా ముందున్న మేనల్లుడి కోసం చేసిందేమిటి? వాడిని మిల్లు కార్మికుడిని చేశారు. జీతం పెంచమంటే గీచి గీచి బేరం ఆడిన వాళ్ళు  తద్దినాలు , అన్నదానాలు మాత్రం యధా ప్రకారం సాగిస్తూనే ఉన్నారు.  మిల్లు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి నష్టపరిహారం ఇయ్యటానికి గీచిగీచి ఇచ్చినవాళ్లు, కార్మికులు  సమ్మెకు దిగితే మిల్లు మూసేసి పనికి న్యాయమైన ప్రతిఫలం కోరినందుకు  అన్నం లేకుండా చేసిన వాళ్ళు అన్నదాతలు యెట్లా అవుతారు అన్నది ప్రశ్న.   

అన్నదానం దాత ఉదారతకు సంబంధించింది. కాళోజి అన్నట్లు “ధాన్యపు రాసులు ఒక చోట ఆకలి కడుపులు ఒక చోట”  ఉండే వ్యత్యాసాల సమాజమే  ఆకలికి ఇంత అన్నం పెట్టటాన్ని గొప్ప విలువగా చేసింది. దానం దయాధర్మ భిక్ష కనుక తీసుకొన్నవాళ్ళ నుండి  ఒద్దికను  , వినయాన్ని , కృతజ్ఞతను ఆశిస్తుంది. అది సరిపోలేదనో, బాగా లేదనో అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం వాళ్లకు ఉండదు. పెట్టె చెయ్యిని కరవకూడదు అని నిషేధ ముఖంగా చెప్పే నీతి దానినే సూచిస్తుంది. జీతాల కోసం, జీవితాల కోసం సమ్మెకు దిగటం  కార్మికుల హక్కు. అన్నదానం పుణ్యాన్ని మూటకడుతుంది. కార్మికుల హక్కులను గుర్తించటం అదనపు విలువను సవంతం చేసుకొనే అవకాశాలను తగ్గిస్తుంది.  జీతాలు పెంచటం కూడేసిన లాభాల మూట తరగటానికి కారణం అవుతుంది.  అందువల్ల అన్నదానాలకు అవకాశం ఇచ్చే  సంపద ఎందరి పొట్టకూటినో లూటీ చేసిన ఫలితం అవుతుంది. 

ఒక  మత సాంస్కృతిక విలువగా సామజిక సమ్మతిని పొందిన ‘అన్నదానం’ వెనక ఉన్న మాయను, అన్నదాతలుగా సామాజిక గౌరవాన్ని , ఆధిక్యతను అనుభవిస్తున్న వర్గాల దోపిడీ స్వభావాన్ని నిరూపించటం ఈ కథ చేసిన పని. ఇలా మన జీవితాలను ఆవరించి శాశించే సాంస్కృతిక విలువల అసలు తత్వం బయటకు వచ్చి ప్రజలలో వ్యాపించే కొద్దీ ఫాసిజం శక్తి హీనం అవుతుంటుంది. 

‘సింహాసనం’మానవులలోని అత్యాశకు,అధికార కాంక్షకు హేతురాహిత్యానికి ఉన్న సంబంధాన్ని చూపిన కథ. మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యంలో అన్ని వ్యవస్థలను మతభావాలు, చిహ్నాలు,ఆచారాలు ఆక్రమించి ప్రభావితం చేస్తున్న విధానం గురించి బుద్ధిజీవులు, హేతువాదులు ఆందోళన పడుతున్న కాలం ఇది. ప్రధాని నూతన పార్లమెంటు భవన ప్రవేశ ఘట్టం ఈ  ఆందోళనా స్థాయి మట్టాన్ని గరిష్టస్థాయికి  చేర్చింది. ఈ పరిస్థితులను అర్ధం చేసుకొనటానికి 28 ఏళ్ళ క్రితం కేతు విశ్వనాథరెడ్డి వ్రాసిన  ‘సింహాసనం’  కథ తోడ్పడుతుంది. భారతదేశంలో పేరుమోసిన ఒక పారిశ్రామిక సంస్థ ఏర్పాటు చేసిన కెమికల్ ప్లాంట్ లో జనరల్ మేనేజర్ రామారావు ఆఫీసు గది వర్ణనతో ప్రారంభమవుతుంది కథ.  మేనేజర్ పర్సనల్ గా ఉద్యోగంలో చేరినప్పుడు పూజలు చేసి చేరిన నాటి నుండి ఆ గదిలోనే ఉన్నాడంటే అది అచ్చివచ్చిన గది అన్నమాట. కూర్చునే కుర్చీ నుండి బీరువాలు ఫైల్ రాక్స్ వంటి వస్తువులన్నీ వాస్తుప్రకారం ఏ దిశను చూస్తూ ఎక్కడ ఉండాలో అలా అమర్చబడ్డాయి. గోడకు మిగిలిన ఫోటోలు, పెయింటింగ్స్ తో పాటు ఒక దైవజ్ఞుడి ఫోటో ఉందంటే అతనిని నడిపించేది భౌతిక  శాస్త్రవిజ్ఞానం కాదు, హేతువుతో సంబంధంలేని విశ్వసాలు అన్నమాట.  విదేశంలో  ఉన్న తన ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్   నుండి తన ఆరోగ్యం బాగాలేదని , వైద్యులు ఇచ్చే సలహాలనుబట్టి ఏర్పాట్లు చేసుకొంటానని, ఇంచార్జ్ గా ఆ బాధ్యతలు జాగ్రత్తగా నిర్వహించమని  ఫోన్ వచ్చినప్పటి నుండి అతని ప్రవర్తనలో వచ్చిన మార్పుల స్వభావాన్ని ప్రదర్శించటం అసలు కథ. 

వైస్ ప్రెసిడెంట్ అనారోగ్యం అతనికి ఏ మాత్రం విచారం కల్పించక పోగా అతనిక రాడు , రాలేడు,  రాకూడదు అన్న భావాలతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఆయన  అక్కడే … మరణిస్తే అన్న ఆలోచన వచ్చి తాను వైస్ ప్రెసిడెంట్ కావటానికి ఉన్న అవకాశాలగురించి ఊహిస్తాడు. దేవశర్మ ను పిలిపించి తాను ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ కావటానికి  గ్రహబలం అనుకూలత గురించి ఆరా తీస్తాడు.ఆశలు పెంచుకొంటాడు. ఈ కథలో ఆశ పదోన్నతి కి సంబంధించింది.రాజకీయ రంగంలో ఆశ  అధికారానికి  పదవికి సంబంధించినవి. ఆశ ఒక చోట మరణాన్ని కోరితే , మరొక చోట మరణ కారణమీ అవుతుంది. గ్రహబలం చూసి జాతకాలు చెప్పేవాళ్ళు,సర్వసంగ పరిత్యాగులైన  సన్యాసులు కూడా  స్వప్రయోజనాల పరిరక్షణకు అధికారవర్గాన్ని ఆశ్రయిస్తారు. అధికారానికి, రాజ్యానికి పురోహిత వర్గానికి ఉన్న అన్యోన్య సంబంధం చరిత్ర కాలాలనాటిది. అది స్థూల సూక్ష్మ రూపాలలో దృశ్యాదృశ్యంగా జీవితంలో భాగమయ్యే ఉంది. అది సింహాసనం లక్షణం అని సూచిస్తుంది ఈ కథ.  

అయితే ఈ కథను ఇక్కడ ఆపక వైస్ ప్రెసిడెంట్ ఆరోగ్యం కుదుటపడి స్వదేశానికి తిరిగివస్తున్నాడన్న వార్తకు షాక్ అయి రామారావు  ఆసుపత్రి పాలు కావటం వరకు కొనసాగించారు రచయిత. వైస్ ప్రెసిడెంట్ కోలుకొన్నది ఆధునిక వైద్య విజ్ఞానం వలన. రామారావు జబ్బు పడ్డది ఆశను బలపరిచి నమ్మకంగా స్థిరీకరించే హేతువుకు అందని జ్ఞానాభాస వలన. రామారావు తత్వం తెలిసినవాడు కనుకనే వైస్ ప్రెసిడెంట్ అతనికి  తన ప్రయాణపు గుర్తుగా లండన్ లో కొత్తగా రిలీజ్ అయిన ‘బియాండ్ సైన్స్’ అనే పుస్తకం తెచ్చిచ్చాడు. అది చేతితో  పట్టుకోలేని, చదవలేని శారీరక మేధో స్థితిలో అతను ఉన్నాడని డాక్టరు హెచ్చరించటం కథ ముగింపు. ఆ హెచ్చరిక  విజ్ఞాన శాస్త్రాలకు అతీతంగా ఆలోచించటం, ప్రవర్తించటం పెద్ద జబ్బు అని, అది సమాజపు మానవముఖాన్ని వికృత పరుస్తుందని సూచిస్తుంది.  

భారతదేశ తొలి రాష్ట్రపతి తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్  ‘సహనమే సంస్కృతి’ అన్నాడు. భిన్నజాతులు మతాలూ కులాలూ, ప్రాంతాలూ, వర్గాలూ ఉన్న అసమసమాజంలో వైరుధ్యాలకూ సంఘర్షణలకూ ఉన్న అవకాశాలను గుర్తించబట్టే ఆయన సంస్కృతి జీవలక్షణం సహనమని చెప్పగలిగాడు.భిన్నత్వాల మధ్య భిన్న సమూహాల మధ్య భిన్న అభిప్రాయాల పట్ల సహనం ప్రజాస్వామిక విలువ. అయితే  2014 లో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ప్రభుత్వాధికారంలోకి వచ్చాక అసహనమే హిందూ సంస్కృతిగా ప్రోత్సహించబడుతున్న దుస్థితి కనిపిస్తున్నది.   దాని  వెనుక ఉన్నవి స్వార్ధపూరిత ప్రయోజనాలు, అధికారం ,అహంకారం తప్ప మరొకటి కావు.  మరీ ముఖ్యంగా ముస్లింమతం పట్ల మెజార్టీ మతస్తుల అసహనం, భారతదేశ పౌరసత్వానికి వారిని పరాయీకరించి చూడటంగా, దేశద్రోహులుగా అనుమానిస్తూ అవమానించటంగా కనిపిస్తూనే ఉంది. ముస్లిముల ఆహారసంస్కృతి, ఆహార్యం, అలవాట్లు  హిందూ సమాజపు అసహనానికి గురిఅవుతున్నాయి.ఆవు వంటి  జంతువులకి పవిత్రతనీ  గౌరవాన్ని ఆపాదించటంతో ఆగక, మనిషిని జంతువుకన్నా హీనంగా పరిగణించి ప్రాణాలను తీయడానికి కూడా తెగబడిన స్థితి లో విషాదం అనుభవానికి వస్తూనే ఉంది.  ఈ రకమైన సామాజిక, మత అసమానతలనూ, మౌడ్యాలనూ ప్రశ్నించి హేతుబద్ధమైన చర్చలను లేవనెత్తినవారు మూకుమ్మడి దాడులకూ, హత్యాకాండలకూ బలవుతున్నారు. లౌకిక ప్రజాస్వామిక విలువలకు భంగకరంగా ఉన్న ఈ విధమైన సందర్భాలూ సంఘటనలు ఫాసిజం యొక్క వ్యక్తీకరణలే. రాజ్యాంగంలో 370 ఆర్టికల్ ను తొలగించటం ద్వారా కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయటం, దాని మీద నిరసన స్వరం వినబడకుండా సమాచారమాధ్యమాలన్నిటినీ దిగ్బంధించటం, ముస్లిముల ప్రయోజనాలకు భంకరంగా పౌరసత్వ చట్టంలో సవరణలు చేయటం వంటి ఏకపక్ష నిర్ణయాలన్నీ జాత్యహంకార సూచకాలే. 

ఈ విధమైన ముస్లిం  వ్యతిరేక విష  సంస్కృతి గురించిన ఎరుకతో 2002 ,2003 నాటికే కేతు విశ్వనాథరెడ్డి విరూపం , అమ్మవారి నవ్వు అనే  రెండు కథలను వ్రాసారు. విరూపం కథలో  కీలకమైనది ఒక గ్రామీణప్రాంతపు విలేఖరి పత్రికకు వ్రాసి పంపిన క్షేత్ర స్థాయి జీవనకథనం. సిమెంటు ఫ్యాక్టరీలు అభివృద్ధి లక్షణం అనుకొంటే చెట్లను తుడిచిపెట్టి సిమెంటు ధూళితో నిండిన పర్యావరణం , ఊపిరితిత్తులను చుట్టుకొని శిధిలం చేసే విధ్వంసం, రైతులు కార్మికులుగా మారి పోయిన చిత్రం మొత్తంగా ఒక భీభత్స జీవనచిత్రం ఆ కథనం. పత్రికకు  ప్రాంతీయ కేంద్రం బాధ్యుడు అది చదివి  ప్రధాన పత్రికలో ప్రచురించబడితే బాగుంటుందనుకొని హైదరాబాద్ పంపాడు. అది అచ్చు కాకపోగా అలా పంపినందుకు ఎడిటర్ నుండి చీవాట్లు తినాల్సి వచ్చింది అతను.  

అలా ఎందుకు జరిగింది? అలాంటి కథనాలు ప్రచురిస్తే రాజకీయంగానో , మరొకరకంగానో తాను ఇరుక్కొనే ప్రమాదం ఉంది కనుక.  సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల జరిగిన గ్రామీణ విధ్వంసం గురించిన రచన వల్ల ఎడిటర్ కు వచ్చే ప్రమాదం ఏమిటి? ఫ్యాక్టరీ యాజమాన్య వర్గాలతో , సంపన్న వర్గాలతో,  అధికార రాజకీయాలలో ఉన్నవాళ్ళతో పత్రికాధిపతులకు ఉండే అన్యోన్య సంబంధమే వాళ్ళ ప్రయోజనాలకు భంగకరమైన వార్తలను ప్రమాదకరమైనవిగా పక్కకు పెట్టేట్లు చేస్తుంది. పత్రిక ఎడిటర్ అందుకే ఆ కథనం గురించి మండిపడ్డాడు. రచయిత ఇస్మాయిల్ కనుక ‘మన హిందువులు సృష్టించుకున్న సంపదకు వ్యతిరేకంగా రాయటమేమిటండీ.. ‘  అని తిరస్కారంగా  ఆయన అన్న మాట ఒక్క సారిగా మనల్ని ఉలిక్కి పడేట్లు చేస్తుంది. అక్కడ అసలు సమస్య పర్యావరణ కాలుష్యాన్ని,  ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని పారిశ్రామిక విధానం. ఆ కథనం విలేఖరి క్షేత్ర పర్యటన అనుభవ జ్ఞానాలనుండి రూపొందింది. ఫ్యాక్టరీ పని క్రమం ప్రభావాలకు మారిన  గ్రామీణ ముఖచిత్రానికి వ్యాఖ్యాత ఉప్పర గురప్ప హిందువే. బాధిత ప్రజల  పక్షాన – మెజారిటీ హిందువుల పక్షాన – నిలబడి వ్రాసిన కథనం అది. పత్రికా సంపాదకుడు ప్రజల పక్షాన లేడు. పారిశ్రామిక వేత్తల పక్షాన ఉన్నాడు. నిజానికి సంపదను  వాళ్ళు సృష్టించటంలేదు. జీతాలకు, రోజు కూలీలకు పనిచేసేవాళ్ళు సృష్టిస్తున్నారు. శ్రామిక వర్గాల స్త్రీలు , పురుషులు సృష్టిస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యం ఆ సంపదను పోగేసుకొంటుంది. భారతదేశంలో ఈ తలకిందుల పెట్టుబడిదారీ వ్యవస్థ పై విమర్శను అడ్డుకొనే రాజకీయంలో  రచయిత ముస్లిం కావటం ఒక నెపం అవుతుంది. పత్రికా రంగంలోనే కాదు ఏ రంగంలోనైనా ‘ఇతరులు’ గా ముస్లిములు ఎదుర్కొనవలసి వస్తున్న వివక్షను, అవమానాన్ని ఆ ఒక్క మాటతో సూచించింది ఈ కథ. 

రాయలసీమ ముస్లిముల జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతం.మతం ఏదైనా  హిందూ ముస్లిముల మధ్య స్నేహ సహజీవనం సహజ వాస్తవం. అమ్మవారినవ్వు కథలో ఆ సహజీవన సౌందర్యం శంకర్ రెడ్డి జాఫర్ ల స్నేహంలో చూపిస్తారు రచయిత. తాతల నాటి స్నేహం వాళ్ళది. వాళ్ళగురించి చెప్తూ జాఫర్ నాయనమ్మ శంకర్ రెడ్డి తాత జాఫర్ తాతకు ఫకీర్ మాన్యం ఇప్పించి దర్గా పూజలు చేసుకొనే ఏర్పాటు చేస్తే కరణం మునుసుబులు కలిసి అది ఆంజనేయుడి మాన్యం అని తిరిగి స్వాధీనం చేసుకొనటం గురించి తలపోసుకొని బాధపడింది. ఇది రామజన్మభూమి అని బాబ్రీ మసీదును కూలగొట్టటాన్ని పోలిన ఘటన. గ్రామ స్థాయి భూమి సమస్య. భూదాహం ఫలితం , పరిణామం. మూడు తరాల నాటి ఘటన. శంకర్ జాఫర్ల తరానికి తాతల తరం అంటే ఒక్కొక్క తరానికి పాతికేళ్ల వ్యవధి అనుకొంటే వాళ్ళది 1950 లకు పూర్వపు తరం అవుతుంది. రామజన్మభూమి సమస్య 1990 నాటిది. 2003 లో కథ వ్రాస్తున్న రచయితకు తెలిసిన విషయమే అయినా పాత్రల జీవితకాలాన్ని బట్టి వాళ్లకు తెలియగలది కాదు. అది తెలుసా తెలియదా అన్నది కాదు సమస్య. ముస్లిములకు దేశంలో భూమి లేకుండా చేసే రాజకీయం మరీ కొత్తదేమీ కాదని అది ఒక సారి వ్యక్తుల మధ్య ఆర్ధిక ప్రయోజనాలకు సంబంధించినదిగా  ఉంటే మరొక సారి అధికార రాజకీయ ప్రయోజనాలు ప్రధానం కావచ్చు అని సూచించటమేరచయిత ఉద్దేశం.  

ఇటువంటి పరిస్థితులలోనే ముస్లిమ్  అస్తిత్వానికి జరుగుతున్న అవమానానికి అసంకల్పిత ప్రతీకార చర్యగా  మత చిహ్నాలు కొత్త ప్రాధాన్యతను సంతరించుకొంటాయి. రాయలసీమ గ్రామీణ రైతుగా జాఫర్ తలమీద తెల్లటోపీ ఎరగడు. శంకర్ రెడ్డికి అతను అట్లాగే తెలుసు. రెండేళ్ల తరువాత కలుసుకొనేటప్పటికి అతను తలకు ధరిస్తున్న తెల్ల టోపీ శంకర్ రెడ్డికి ఆశ్చర్య కారణం అయింది. పూల తోటలు పెట్టి హైదరాబాద్ మార్కెట్ లో  పూలమ్మటానికి పోతూ అక్కడి ముస్లిం వ్యాపారస్తుల మధ్య ముస్లింగా ఉండటానికి వాళ్ళ సూచన మీద తెల్ల టోపీ అలవాటు చేసుకున్నానని జాఫర్ వివరణ ఇస్తాడు. ఇతరులుగా సమాజంలో వేరేగా చూడబడుతున్నప్పుడు ప్రతీకారంగానో, ప్రత్యమ్నాయంగానో ముస్లిం అస్తిత్వ  గుర్తింపు చైతన్యం వికసిస్తుంది. ఆ క్రమంలోనే గ్రామాలలోకి మసీదులు వచ్చాయి. జాఫర్ వూళ్ళోసౌదీ చందాలతో కట్టిన  మసీదు ప్రస్తావన దానికే సూచన.  దానికి పోటీగా కొత్తగుడి, చర్చి కూడా వచ్చాయని చెప్తాడు అతను. సహజ స్నేహాలకు , మానవీయ సంబంధాలకు ఇదివరకు ఎన్నడూ ప్రతిబంధకం కాని మతం ఇప్పుడు ఉద్వేగాలను రెచ్చగొట్టే పోటీగా పరివర్తన చెందుతున్నదంటే మతం పేరుమీద మనుషులను ఒకరినొకరు విశ్వసించలేని ఒక కృత్రిమ స్థితి ఘనీభవిస్తున్నదన్నమాట.

పూలవ్యాపారం చేస్తూ పూల పందిళ్లు కట్టే వృత్తిలో ఉన్న జాఫర్ వ్యాపారం – ఎవరి వ్యాపారమైనా – కులమత పరిధులు గీసుకొంటే సాగదు. అందులోనూ అధిక సంఖ్యాకులైన   హిందువుల పెళ్లి బేరాలను ఒప్పుకొనే తీరవలసి ఉంటుంది. వాళ్ళ పెళ్లిళ్లకు వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం, అభిరుచి ప్రకారం పూలమండపాలను కట్టాలి. ఆ అల్లిక వాళ్ళకొక బ్రతుకుతెరువు కళ. తమ నైపుణ్యమంతా చూపి మరికొన్ని బేరాలు పొందగలిగితే బతుకు గౌరవంగా గడుస్తుంది. జాఫర్ అలా సుశిక్షితుడు అయినవాడు అందుకనే శంకర్ రెడ్డి చిన్నాయన కూతురి పెళ్ళికి పెళ్లి పందిరి కడితే అందులో అమ్మవారి పెదవులమీద విరిసీవిరియని నవ్వు చూసి ఆకర్షితుడైన ఒక వ్యక్తి గొప్ప హిందువు సంస్కారం అందులో కనబడుతుందని మెచ్చుకున్నాడు. అది రూపొందించింది ముస్లిం అని తెలిసి నోటమాటరాక నిలిచిపోయిన అతను సుందర రామానంద స్వామి. అప్పుడే బిడ్డ పెళ్లి చేసిన వెంకట స్వామి రెడ్డి వియ్యంకుడికి గురువు. ఆ వియ్యంకుడు బిజెపి లో ఉన్నాడు. వాళ్ళ ప్రాపకంలో వచ్చే ఎన్నికలలో పార్లమెంటు టిక్కెట్టు  పొందాలని వెంకట స్వామి రెడ్డి ఉవిళ్లూరు తున్నాడు.  హిందూముస్లిం సంబంధాలను స్వప్రయోజనాలకు శత్రు సంబంధాలుగా మలచనున్న వర్గం అధికారంలోకి రాబోతున్న కాలం వైపు వేలు చూపించిన కథ అమ్మవారి నవ్వు. 

ఈ విధంగా భిన్న కులాలు, మతాలు ఉన్న సమాజంలో సంక్లిష్టతలను సాహిత్య వస్తువుగా చేసుకొన్నకేతువిశ్వనాథరెడ్డి  చారిత్రక దృష్టితో, హేతుబద్ధమైన వివేకంతో వాటిని పరిష్కరించు కొంటూ మనుషులు ప్రజాస్వామిక సంబంధాలు నిర్మించుకోవాలని  ఆశించాడు. కులం, మతం మానవత్వానికి అపచారం చేసే వికృత శక్తులు కాకుండా చూసుకోవాలని హెచ్చరించాడు.  

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

One thought on “కేతు విశ్వనాథరెడ్డి అభ్యుదయ సామాజిక చింతన

  1. విజ్ఞాన శాస్త్రమునకు అతీతంగా ఆలోచంచడం ప్రవర్తించడం ఒక పెద్ద జబ్బు అది సమాజ ముఖాన్ని వికృతపరుస్తుంది
    కాత్యాయని విద్మహే కేతు విశ్వనాథ రెడ్డి గారిని గురించి చేసిన విశ్లేషణ చాలా గొప్పగా ఉంది

Leave a Reply