కూటికుంటే కోటికున్నట్లే

ప్రపంచమంతా కరోనా భయంతో వనికి పోతాఉంది. జనాలు ఇంట్లోనించి కాలు బయట పెట్టాలంటే పానాలకి ఏం జరుగుతుందో ఏమో అనే అనుమానం తోనే తిరగాడతా ఉండారు.

మాది బురుజు మాదిగ పల్లె. మా ఊర్లో మావి అరవై కుటుంబరాలు ఉంటాయి. మేం పుట్టి బుద్దెరక్క ముందు నుంచి అంటే మా తాత ముత్తాతల కాలం నుండి కూలి చేసేవాల్లం. మాకు ‘కూలిచేస్తే కుండ గాలు లేదంటే ఎండ గాలు ‘. మేము కూలికి పోయి పండిన పంట వొడప కంటే అట్లా జనాలకి తిండికి కష్టం ఇట్లా రైతులకు పంట నష్టం. నాలుగు ఊర్లకు నమ్మిన కూలీలము మేము.

ఈ పొద్దు మా ఊరి రెడ్డోల్లకు టమాటాలు పీకను పదైదు మందిమి ఎలబారినాము. దావంటి నడుస్తా మా పెద్దమ్మ ఉండుకుని ”రేయ్ అందురూ ఉడ్డ జేరకూడదంట. మనిషి మనిషి ఆనుకోకుండా దూరంగా ఉండాలంట. ఇంట్లో కూడా మొగుడు పెల్లాలు మాట్లాడుకోకూడదంట” అనె. ఆ యమ్మన్న మాట్లకి అందరూ నగతా నడుస్తా పని కాడికి పోతిమి.

ఆ టమాట చెట్ల కల్ల చూస్తే చెట్లో ఎన్ని కాయలు కాసింటే అన్ని కాయలూ ఎర్రగా మాగి పోయినాయి. ఈ కరోనా వచ్చి జనాలు తిరగనీ కుండా, బండ్లు పోనీకుండా చేయడంతో సరైన రేటు లేక కాయలు పెరక్క చేల్లోనే వదిలేసినారు. అవి ఎర్రగా మాగిపోయినాయి. మేము డబ్బాలు ఎత్తుకొని ఎవరి సాలులో వాళ్లం ఒంకోని కాయలు పెరకతా ఉండాము.

మా కాంతత్త ఉండుకోని ” కాదరా ఇట్లాంటి బిక్క ట్టు దినాల్లో తల్లులు బిడ్డలు అంతా వొగ తావన ఉంటే చచ్చినా బతికినా అది ఒక ధైర్నం. నా కూతురు అల్లుడు ఈడ బతకలేమని బెంగళూరుకి పనికి పోయినారు. ఈడ పచ్చని పొలాల్లో పని చేసుకోకుండా, కల్ల ముందర ఉండకుండా ఆడ కంపెనీలలో చెత్త లు తోయను, బాత్రూములు కడగను కానరాని దేశానికి పోయినారు. ఆడ వాల్లకు ఏమన్నా జరిగితే ఈడ మాకు ఏమన్నా జరిగితే ఎవరు చూసేది. దినామూ ఫోన్ చేస్తా ఇసారిస్తా ఉన్నాము “అని కండ్ల నిండా నీల్లు పెట్టుకుండె. మేమందరం ఊరుకోత్తా నీబిడ్డట్లా వాల్లు ఎంతమందో. దేశమంతా అట్లే ఉంది. బస్సులు వదిలినప్పుడు వస్తారులే. గుడి సుట్టూ తిరిగినా గుల్లోకి రావాలంటారు అట్లా ‘ఉండూరు నష్టం పొరుగూరు లాభం రెండు ఒకటే’ లా ఉందే అనుకుంటిమి.

కాదు నాయనా రేపు మేమేమన్నా అయితే వాళ్ళ సావు నోములు మేము చూసే పనిలే మా సావు నోములు వాల్లు చూసేపనిలే. అయినా దేవుడు మన ముసర మనకు ఏసే ఉంటాడు కానీ ఇరుగుపొరుగునుచూసి వాళ్లు ఇవి సంపాదించినారు. ఈల్లు ఇవి తెచ్చుకున్నారు. ఈడ సంపాయించలేం. బయటయితే ఎక్కువ డబ్బులు వస్తాయి అని పోతారు. ఈ పొద్దు కంటి నిండా నిద్ర లేదు. ఒకటే యసనం అయిపోతా ఉంది. నాకు ఇప్పటికీ గెవనం ఉంది. నాకు పెండ్లి చెయ్యాలనుకున్నపుడు కర్ణాటక నుండి మంచి సంబంధం వచ్చింది. బాగా జరుగుబాటు వాల్లు. కూటికి గుడ్డకు నవిసే పనిలేదు. కాందారి బాగుందని మా నాయన తలకాయి వాలేసి సంబంధం కాయం చేసుకుని వచ్చినాడు. మా అమ్మ అంత దూరం నా బిడ్డను ఇవ్వను, మనూరి మామిడి గుట్ట ఎక్కి చూస్తే నా బిడ్డనిచ్చిన ఊరు కొండలు కనపడాల. నా బిడ్డ నగిన ఏడిసిన నా సెవిన పడాలని ఆసంబంధం ఇరగ్గొట్టింది. మీ ఊరికిఇచ్చింది. ఇప్పుడు నా బిడ్డ కాన రాని దేశం పోయింది అని వాపోయే మా కాంతత్త. మా కాంతత్తకి ఇద్దరూ ఆడబిడ్డలే. ఒకబిడ్డను ఉండూరులోనే ఇస్తే ఇంకోబిడ్డను పక్కనూరిలో ఇచ్చింది. పక్కనూరి బిడ్డే మొగునితో బెంగళూరికి పనికి పోయింది.

టమాట కాయలను నడింతరానా ఒంకొని పీకి పీకి నడుములు నొస్తా ఉంటే పైకి లేసి దిక్కులు పార చూస్తి. ఒక పర్లాంగు దూరంలో ప్యాంటు చొక్కా ఏసుకొని గెనిమింటి నడిసి వస్తా ఉండాడు ఒక మొగాయన. నాకు దూరం సూపు అంతగా కనబడదు. మాజయక్కకు బాగా కనపడుతుంది. ఆడ వస్తా ఉండేది ఎవరో చూడు అంటే జయక్క లేసి ఎదురెండకు చేయి అడ్డం పెట్టుకొని ఆడ వచ్చేది సుబ్బు మామ గతం ఉండాడు. ఆయప్ప టౌన్ లో గదా ఉండేది ఇక్కడ ఏమిటికి వస్తా ఉండేది అనే. ఆ మాటకి పని చేసే మిగిలిన వాల్లందరూ కూడా లేసి చూసిరి. ఆ కుందికి ఆయప్ప మా కాడికి రానే వచ్చె.

మా అక్కుండుకోని “ఏం మామా బాగున్నావా అయినా మీరు బయటూరోల్లు కదా మా ఊరికి రాకూడదు. పోలీసులు నిన్ను ఎట్లంపించింరి వాళ్ళ కళ్ళల్లో దుమ్ము కొట్టి వచ్చినావా” అని కుసాలంగా మాట్లాడే. ఈ సుబ్బు మామ అందరికీ తెలుసు. మా ఊర్లో పుట్టినోడే. మా ఊర్లో తొలీత బేల్దారి పని నేర్చుకొంది కూడా ఈనే. టౌన్లో బాగా సంపాదిస్తామని ఎలిపోయాడు. పొయినా కూడా ఉండూరులో పెండ్లి గాని సావు గాని పసిబిడ్డ చెప్పినా కూడా వచ్చేస్తాడు. అందుకే ఆ యప్పంటే మా ఊరోల్లకి అభిమానం. మా సాలక్క ఏం సుబ్బు మామ ఇదేనా రావడం ఎన్నాలై నీ మొకం చూసి, నీ పెల్లాము పిల్లలు బాగున్నారా, ఎండన పడి వచ్చినావు నీల్లు తాగు అంది. పని చేసేవాల్లు అంతా తలాకు ఒక మాట మాట్లాడారు.

ఆ యప్పఉండుకోని ” మేము బాగున్నాము మీరు బాగున్నారా. నేను పల్లిడిసి ఇప్పటికి 40 ఏండ్లు అయితాంది, ఇప్పుడనిపిస్తోంది టౌన్కి ఏంటికి పోతిమా అని. ఇండ్లలో నుండి బయట అడుగు పెడితే పోలీసులు కొడతా ఉండారు. పనులు లేవు చేతిలో డబ్బుల్లేవు. బతుకుతారో చస్తారో అని ఎవుడూ పది రూపాయలు అప్పీయడం లేదు. పల్లిలో కూరగాయలు పెరక్క పోదామని వస్తి. టౌన్ లో సగలమూ కొనాల్సిందే మిమ్మల్నిచూస్తుంటే కడుపు సల్లబడుతాంది. ఎండకు గాలికి కష్ట పడుకుంటా ఉండారనే.

నా చెల్లెలు ఉండుకోని పోనీలే మా రైతులకూ ఒగ టైం వస్తుందని తెలిసినట్టుంది. పెద్ద పెద్ద మత్తేపులంతా కాలీగా ఉంటే రైతుకు మాత్రం చేతినిండా పనుంది. చావు బతుకులు వస్తే గాని రైతుల ఇలువ తెల్లే అనే. నువ్వు బయటూరు నుండి వచ్చినవని ఎవరన్న పోలీసులకు ఫోన్ చేస్తే నిన్ను ఎత్తుకుపోయి లోపల ఏస్తారు. కావల్సిన కూరగాయలు పెరుక్కొని పో అంటిమి. యిక్కన పక్కనపొలాల్లో ఉన్న టమాట కాయలు, పచ్చి మిరపకాయలు , వంకాయ, కూరాకు, మునక్కాయలు, కాకరకాయలు అన్నీ ఒక సంచికి పెరుక్కొని పాయ.

ఆ యప్ప ఎల బారిపోతానే మాచెన్నపెద్దమ్మ ఉండుకోని ” టౌన్లో అన్నీకొని తినేపనే. ఆ పూటకా పూటకు తెచ్చుకొని తినే వాల్లు కూడా ఉంటారు. రెండు మూన్నెల్లు ఇంట్లో కాలు బయట పెట్టకూడదు అంటే వాళ్ళ పని ‘యాడంత ప్యాడంత’. పల్లెన్నా అయితే ఇరిగింట్లోనో పొరుగింట్లోనో బొదులడిగి తెచ్చుకొని తిని కాలం గడపచ్చు. ఇరుకిరుకు ఇల్లల్లో ప్యాండ్డు గాలికి ఆ టీవీలు కల్లా ఎగచూసుకొని బతుకుతాఉంటారు. టౌనే మేలు అని పోయినోల్ల కంతా ఇప్పుడు తెలుస్తా ఉంటుంది. ‘సావుకారి పని సచ్చేటప్పుడు తెలుస్తుందంట’ ఇదే నేమో అనే.

ఆ మాటకు మా గెంగి పెద్దమ్మ ఉండు కొని “నా పెండ్లి అయ్యి ఇప్పటికీ నలబై యాబై ఏండ్లు కావస్తోంది. పెల్లై న సంవత్సరానికంతా మా అత్త తో కుదరక నేను, నా మొగుడు వారగా వచ్చేస్తిమి. మేము వారగా పోయినాపొద్దు మాయత్త రెండు మొక్కసట్లు, పైడు గింజలు ఇచ్చింది. మా నాయన సచ్చి సల్లని పొద్దున తలి పిచ్చుకుంటా ఉండాడు. నేను వారగా పోయిన నెల కంతా మా నాయన పాలావు నమ్మి నూటా యాబై రూపాయలు ఇచ్చి ఐదు వరుసల దొంతులు చేపిచ్చి కొచ్చి ఇచ్చినాడు. ఒగొగ వరసకు అయిదు బానలు ఉంటాయి. ఆ ఐదు బానలు అడుగు నుంచి పైవరకు సైజుల వారీగా ఉంటాయి. అడుగున పెద్దవి పోనుపోను ఒగ చుట్టూ తగ్గతా బోతుంది. అబ్బుట్లో దొంతులు ఉండే ఇల్లు అంటే అది గొప్పగా జెప్పుకునేవాల్లు . ఎప్పుడైతే అడ్డపిండ్లు సుట్టిండ్లు పెరికి గవర్నమెంట్ ఇచ్చిన కాలనీ ఇండ్లు కట్టుకొని ఆ కాలనీ మిద్దె ల్లోకి పోయే సంబరాన ఇంట్లో మొంటి బోకులుంటే మొరిటి గుంపు అంటారని ఉన్న దొంతిలన్నీ పారేసి సత్తు బోకులు, స్టీలు బోకులు, లబ్బరు బోకులు అయిని కాడికి దుడ్డు పెట్టి కొని ఏసుకున్నారు ఇంట్లో . అడ్డం తప్పితే అవి ఏంటి కన్నాపని కోస్తా ఉండాయా. నేను మాత్రానికి నూరుమంది జెప్పినా కూడా ఆ దొంతులు పోగొట్టలా. మా ఇంట్లో ఆ కడవలు నల్లగా మాగి పోయినాయి. ఆ దొంతులే నాబింకం. నా సంపాదనంతా ఆ డొంతులలోనే ఉండేది .

ఆ దొంతుల్లో వరుసగా అడుగున ఐదు బుడ్డ కాగులు. వాటిలోకి బాగా ఎండ పోసి యాపాకు గంజరం చల్లిన నెంబరు ఓడ్లు ఐదు కాగులునిండా కూరి పోస్తే ఐదు మంది సంవత్సరం అంతా తొక్కి తొక్కి తిన్నా కూడా అయిపోవు. బుడ్డకాగులు పైన ఉండే పెద్ద బానలకు రెండు మూటల రాగులు బోసినా, సుమారు ముపై సేర్లు. ఎట్ల తిన్నా రెండేళ్లు అయిపోవు. వాటిపైకడవల్లోఒట్టి మిరపకాయలు. అవి రెండేండ్లకు సరిపోతాయి. వాటిపైన చింతకాయ కడవ. చింతకాయి పోపొండు చేసి ఉప్పు కలిపి కడవకు అదిమదిమి కంట్లం కాడికి పెడితే రెండేళ్ల తిన్నా అయిపోదు. ఆ వచ్చిన చింత గింజలు ఉప్పోనికి అమ్మితే పది పదిహేను సేర్లు ఉప్పు వచ్చేది. ఆ ఉప్పు ఒక కడవకు పోసేది. చెని క్కాయలు రెండు బాన్ల కు, ఇరవై ముద్దల బెల్లం ఒక బానకి పెట్టుకున్నా. ఎర్రగడ్డ తెల్లగడ్డ ధనియాలు కందులు అలసందలు అనుములు ఉలవలు ఇవన్నీ దొరికిన కాడికి ఎత్తి పెట్టుకున్న. అవి సంవత్సరానికి వస్తాయి. ఇది తప్పితే నేను దుడ్డు బంగారు జమ జేసుండలే. “యాది రట్టు సంసారం గుట్టు ” అన్నారు పెద్దలు. ఇట్లాంటి బికట్టు కాలం వస్తే దేవుడు గెట్టి ఆయుసు ఇచ్చింటే ఏమి లేకపోయినా ఉప్పు చింతకాయ మిరపకాయ గుజ్జు పిసుక్కోని గంజి అయినా తాగి పానాలు నిలుపుకుంటాము. మనం తిని మనల్ని ఆశించిన వాళ్ళ ఆకులో కూడా అంతెయ్యచ్చు. కూటికుంటే కోటికున్నట్లు అనే గెంగి పెద్దమ్మ. ఆ మాటకు అందరూ నిజమే టౌన్ వాళ్లతో పోలిస్తే మనమే మేలు. కచ్చాకో బుచ్చాకో తిని అయినా ఉంటాం. ఎంత దుడ్డు ఉన్నా అది తిని నీళ్లు తాగలేం కదా అనుకున్నాం.

మా నాగి పెద్దమ్మ ఉండు కోని “చావుకు భయపడితే అవుతుందా. యా పొద్దు అయినా ఒగ గుంత బాకీనే. మానాగ తాతకు ఏడేండ్లు ఉంటాయంట. అప్పుడు ఈ ఊరికి కలరా తగిలిందంట. అది ఎట్లా జబ్బు అంటే వాంతులు బేదులు ఎత్తుకునేది, గంటల మింద సచ్చిపోతా ఉండిరంట మనుషులు. ఫలానా ఊరికి కలరా వచ్చింది అంటేనే జనాలు వనికి పాతా ఉన్నారంట. ఒగ ఊరోల్లు ఇంగో ఊరికి పోయేది లేదంట. ఊర్లోని పెద్దపెద్ద మగవాళ్ళు ఫుల్లుగా తాగి మన ఊరి ఏట్లోని పెద్ద గుంటి కాడ గుంతలోడి ఒగర్ని పూడ్సి వస్తే మల్లొక శవం ఎదురుచూసేదంట. ఒగొగర్ని పూడ్సలేక అందర్నీ ఒకరిమీద ఒకర్ని ఏసి మొన్ను తోసి వచ్చినారంట. అప్పుడు గవర్నమెంట్ కలమేలుకొని మిగిలిన వాళ్లకు సూదులు ఏస్తే బతికినారంట. ఇప్పుడు కూడా మన ఊరి పెద్ద గుండు కాడికి ఎవరన్నా యాలకాని యాలలో తలపైకి నీల్లు బోసుకొని పోబోతే ఆ గుంటి కాడ కలరా వచ్చి సచ్చినోళ్లందర్నీ పూడ్చినారు పోవద్దంటారు. కలరావల్ల మా తాత ఇంట్లో ముగ్గురు సచ్చిపోయి ఈ అప్ప ఒక్కడే మిగిలాడంట. ఇబుడు ఆ యప్పకు నలుగురు కొడుకులు ఇద్దరు కూతుర్లు. వాల్ల బిడ్లు వాల్లకు బిడ్లు మొత్తం యాభై మంది అయినారు. ఒకరు చస్తే నలుగురు పుడతారు. అట్లా చావుకి భయపడితే ఎట్లా” అనే.

ఇంతలో రాజమ్మ ఉండు కొని పాపా ఈ కరోనాలో సావకుండా బతికింటే నిరుటికి ముదివేడు తిరనాలకు పావల్ల. ఆ తిరనాలు బలే సాగుతుంది సూడాల్సిన తిరునాల్లు అనే. ఆయమ్మ మాటకు అందరం నగితిమి. దాంతో మాకు కాసింత బింకం వచ్చే. పని పూర్తి చేసుకొని అందరం ఇండ్లకు పోతిమి.

…………………….

(అర్థాలు)

ముసర = ముద్ద, తిండి
వొ డప = బాగుచేసి ఎత్తిపెట్టడం
బిక్క ట్టు = కష్టం
మత్తే పులు = గొప్పోళ్ళు
నవిసే = వెతుక్కునే
కాందారి = భూమి
వాలేసి = ఒప్పుకొని
మొంటి బోకులు = మట్టి పాత్రలు
కంట్లం = గొంతుకాడికి

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర  బురుజు మాదిగపల్లె. కథా రచయిత్రి. వ్యవసాయ కూలీ కుటుంబం. ప్రధాన వృత్తి వ్యవసాయం. రచనలు వీరి వ్యావృత్తి. ముప్పై కథలతో 'ఎదారి బతుకులు' కథా సంపుటి ప్రచురించారు. ఇప్పటివరకు అరవై కథలు రాశారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 'నవోదయం' మాస పత్రిక నిర్వహిస్తున్నారు.

4 thoughts on “కూటికుంటే కోటికున్నట్లే

  1. Good narration in chittoor accent with naked truth of village life in olden days

  2. భారతి కథ చాలా బాగుంది. మదనపల్లె ప్రాంత గ్రామీణ పలుకుబడులు కథకు మంచి సింగారం అయితే, అక్కడి జీవితం ఉన్నది ఉన్నట్టు చెప్పడం కథకు ఊ పిరి.

  3. “చావుకు భయపడితే అవుతుందా. యా పొద్దు అయినా ఒగ గుంత బాకీనే” మంచి భావం చెప్పారు భారతి గారు. భారతి గారి కథల్లో జీవిత సత్యాలెన్నొ వుంటాయి. పల్లె జీవితం ఆమె కథలనిండా తోడుకొని వుంటుంది.కథ చాలా బాగుంది

  4. rayalaseema manadaleekamuloo jaruguthunnaa karoona kalavaraanni vaarimatalloo adubuthanga rasindi aakka chakkaati saambashanatoo chikkani kathanmu

Leave a Reply