కుల అస్తిత్వం – సాంస్కృతిక రాజకీయాలు

‘సిలక్కొయ్యకు జమిడికె నిశ్శబ్ద సముద్రం వోలే వేలాడుతుంది.’

సరిగ్గా రెండు సంవత్సరాల కింద ‘సారంగ’ వెబ్ మ్యాగజైన్ లో ‘బైండ్ల సెంద్రెయ్య కథలు’ ప్రారంభమైనప్పుడు సిలక్కొయ్యకి నిశ్శబ్ద సముద్రంలా వేలాడే జమిడికె సృష్టించబోయే తుఫాను కోసం ఆసక్తిగా యెదురుచూసిన జ్ఞాపకం యింకా తడిగానే వుంది. అతి పురాతన సమాజానికి చెందిన బైండ్ల సంస్కృతీ సంప్రదాయాల్నీ కళారూపాన్నీ ఆధునిక/ఆధునికోత్తర సమాజంలోకి రచయిత యే విధంగా అన్వయిస్తాడా అన్నది నా ప్రధానమైన జిజ్ఞాస. గతం నుంచి వర్తమానానికి పరిత్యజించాల్సిన – పరిగ్రహించాల్సిన విషయాలపట్ల అంబేద్కరైట్ రాజకీయాల్లో తలమునకలుగా వున్న జిలుకర కథారచయితగా యెలా స్పందిస్తాడో తెలుసుకోవాలనే కోరిక కూడా బలంగా వుండింది. బహుజన సాహిత్య సామాజిక వుద్యమ నేపథ్యంతో విమర్శకుడిగా పేరొంది ‘తత్వ’ కవిగా తనదైన ముద్ర సృష్టించుకొన్న శ్రీనివాస్ తన కథల్లో బైండ్ల సెంద్రెయ్యని వొక జానపద చారిత్రిక వీరుడిగా తీర్చిదిద్దుతున్నాడేమో అన్న అనుమానం తొలుత కల్గిన మాట వాస్తవమే గానీ కొంత విరామం తర్వాత ఆ కథలు సిరీస్ గా మారినప్పుడు – యిప్పటివరకూ సాహిత్యంలోకి యెక్కని మాదిగ వుపకుల అస్తిత్వ సంస్కృతిని పునర్నిర్వచించడానికి అతనీ మాధ్యమాన్ని యెన్నుకున్నాడని అర్థమైంది. మాదిగ దండోరా వుద్యమంలో సైతం చిందు డక్కలి బైండ్ల మాష్టీడు వంటి వుపకులాల సాంస్కృతిక జీవితం కళలు సాహిత్యంలోకి యెక్కలేదు (చిందు గడ్డం మోహన్ రావు ‘కొంగవాలు కత్తి’ వంటి రచనలు చాలా యిటీవలవి). ఆ లోటు తీర్చే దిశలో వచ్చిన ‘బైండ్ల సెంద్రెయ్య కథలు’ తెలుగు సాహిత్యంలో కొత్త వొరవడి సృష్టిస్తాయి అనిపించింది. కథలన్నీ వొకచోట చూసినప్పుడు యీ దేశ మూలవాసి సాంస్కృతిక చరిత్రని దళిత దృష్టి కోణం వ్యాఖ్యానించడం వెనక జిలుకర శ్రీనివాస్ కి వొక నిర్దిష్టమైన రాజకీయ యెజెండా వుందని స్పష్టమైంది.

ఒక వ్యక్తినీ అతని కుటుంబాన్నీకేంద్రం చేసుకుని కుల అస్తిత్వాన్ని యెత్తి పట్టటడం సామాజిక చరిత్రని నమోదు చెయ్యడం సామాజిక చలనాన్ని పట్టుకోవడం అంత తేలిక కాదు. అవి గతానికి చెందినప్పుడు ఆ పని మరింత కష్టం. జిలుకర ఆ కష్టాన్ని నెత్తికెత్తుకోవడమే కాదు; మరొక అడుగు ముందుకేసి సెంద్రెయ్య కథల్ని సాంస్కృతిక రాజకీయ కథలుగా తీర్చిదిద్దాడు. అందుకే తొలి కథల్లో సబాల్ట్రన్ సంస్కృతికి ప్రతీకగా కనిపించిన సెంద్రెయ్య రానురానూ బహుజన రాజకీయాలకు ప్రతినిధిగా పరిణమిస్తాడు. దాంతో బైండ్ల సెంద్రెయ్య నామవాచకంగా కాక అన్యాయాన్నీ దుర్మార్గాన్నీ యెదిరించే వాళ్ళందరి సర్వనామంగా రూపొందాడు. అయితే వ్యక్తిగా సెంద్రెయ్యకు యీ చైతన్యం యెక్కడినుంచి వచ్చింది – అతని చుట్టూ అలుముకొని వున్న సామాజిక రాజకీయ వాతావరణం యెటువంటిది అన్న ప్రశ్నలకి కథల్లోనే అంతర్గత సాక్ష్యాలు లభిస్తాయి.

*

నిజాం రాష్ట్రంపై పోలీసు చర్య జరిపిన నెహ్రూ సేనలు వెనక్కి మళ్ళిన కాలానికి సెంద్రెయ్య కౌమారం నుంచి యౌవనం లోకి అడుగు పెట్టాడు. ఆ విధంగా సెంద్రెయ్య ప్రయాణం డెబ్భై సంవత్సరాల పూర్వం మొదలైంది. కానీ కథల్లో యెక్కువ భాగం ఎన్టీయార్ తెలుగు దేశం అధికారంలోకి వచ్చాకా నడిచాయి. అలా చూసుకున్నా నలభై సంవత్సరాల పూర్వపు సామాజిక చలనానికి యివి ప్రతిస్పందనలు. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే ప్రాంతీయ సాంస్కృతిక చరిత్రకి ప్రతిబింబాలు. నలభైల నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికీ డైబ్బైల్లో వుత్తర తెలంగాణ రైతాంగ వుద్యమానికీ గుణాత్మకంగా వచ్చిన పరిణామాలకు ప్రతిఫలనాలు. అంతేకాదు; సంస్కృతి స్థిర బిందువు కాదనీ స్థల కాలాలకు అనుగుణంగా అది యెన్నో మార్పులకు గురౌతుందనీ కథల గమనంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యక్తమౌతోంది.

బైండ్ల కళకారులు శక్తి సాధకులు. జమిడిక మీద ఎల్లమ్మ కథా గానం చేస్తారు. మాదిగ జాంబపురాణం చెబుతారు. ఎల్లమ్మ ఉప్పలమ్మ లాంటి గ్రామదేవతలకు పూజలు చేస్తారు. కొలుపులు నిర్వహిస్తారు. ఆ సందర్భాల్లో పట్నాలు వేస్తారు. గావు పడతారు. మంత్రాలు వేస్తారు. యంత్రాలు కడ్తారు. ఆ కారణంగా వూళ్ళో యెవరికైనా కీడు జరిగితే బైండ్ల కులస్తుల్ని చెట్టుకి కట్టేసి పండ్లు పీకడం సజీవ దహనం చేయడం వంటి ఘటనలు కూడా జరుగుతూంటాయి. అందుకే ‘వూరన్నంక అన్ని కులాలు వుంటయి. బైండ్లోడు వూరికి అదృష్టం. మీకు మంచి చేసేటోడే గానీ కీడు చేసేటోడు కాదు’ (బురుదగుంట) అని ప్రత్యేకంగా చెప్పాల్సివచ్చింది.

సెంద్రెయ్య కుటుంబానికి అతని తండ్రి నర్సయ్య కాలానికే పదెకరాల వ్యవసాయ భూమి వుంది. బావుల కింద సాగు చేసే వసతి వుంది. ఆర్థికంగా వొక స్థిరత్వం వుంది. కాబట్టి వూళ్ళో గౌరవం వుంది. మంది బలం కూడగట్టగలరు. రాజకీయంగా యెంతో కొంత పలుకుబడి వుంది. సెంద్రెయ్య తమ్ముడు వెంకటయ్య పోలీసు పటేలు అయ్యాడు. పంచాయితీలో తగువులు చెప్పే పెద్దమనిషి స్థాయికి యెదిగాడు. అయినా కులవృత్తి ‘బైండ్లరికం’వదులుకోలేదు. నియ్యతిగల మనుషులుగా చాకలి మంగలి గొల్ల గౌండ్ల పెరికె ముత్రాసి వంటి వెనకబడ్డ శూద్ర కులాల వారితో చిన్నాయనా మామా అని వరసలతో పిలిపించుకుంటారు. సెంద్రెయ్య అందుకే యంపిపి అధ్యక్షుడు దామోదర రెడ్డితో కలబడి నిలబడగలిగాడు(బోనాలపండుగ). ఊరి దొర గోపాలరావుతో సన్నిహితంగా వుండగలిగాడు. కోల్కొండ లింగారెడ్డికి బుద్ధి చెప్పగలిగాడు (బురదగుంట). ‘బొడ్రాయి’ కథలో బ్రాహ్మణీకరణానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవస్వరం వినిపించగలిగాడు (“అయ్యగారు, మీరు యీ వూళ్లనే వుండాలే ఇప్పటి నుంచి. జమిడికె యేసుకుంటా మాతో పాటే బతుకాలే. లేదంటే, పాలకుర్తి గుట్టకింద అంజనేయుని గుడికాడ హక్కు వొదులుకోవాలె మీరు. ఆడ మా బైండ్లోళ్లే అర్చకం చేస్తం”- బొడ్రాయి). ఏకలవ్యుడి తెగిన బొటనవేలి సాక్షిగా బొందిలి రామయ్య లాంటి వాళ్ళు ప్రచారం చేసే భావజాలపరమైన పరాయీకరణని తిరస్కరించగలిగాడు. ద్రోణాచార్య వారసుల్ని అడ్డుకోగలిగాడు (“మాకు గ్నానం వొద్దన్న కతను మాతో ఆడిత్తావా? నిన్ను నువ్వు మోసం చేసుకునేదిగాక మమ్మల్ని కూడా మోసం చేత్తవా? నువ్వు చెప్పిన ధర్మం లెక్కన మా వూరిలోని ప్రతి కులం వాళ్లు సదువుకోవద్దు. యిట్లా రెక్కల కష్టం చేస్తా, మా తలరాత యింతే అనుకుంటా బతకాలే. అంతేకదా?”-కిరాత విజయం). ఆ యా సందర్భాల్లో సెంద్రెయ్య ప్రకటించిన ధిక్కారం వూరి జనంలో చైతన్యాన్ని నింపుతుంది.

మాదిగ – బైండ్ల సమాజంలో వ్యవస్థీకృతమైన పోషక ఆశ్రిత సంబంధంలోని ఆధిక్య న్యూనత్వాల్ని అధిగమించిన ఆత్మగౌరవ స్వరం జిలుకర రచన అంతటా వినిపిస్త్తూనే వుంటుంది. కుల – వుపకులాలు పరస్పరాధీనాలైనప్పటికీ స్వతంత్రంగా వుండగలవు. స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకోగలవు. మాదిగ బైండ్ల – యిద్దరి మధ్య సామాజికంగా సాంస్కృతికంగా గౌరవ మర్యాదలు యిచ్చిపుచ్చునే అన్యోన్యతనీ వొకరికొకరు చేదోడు వాదోడుగా వుండే సందర్భాల్నీ కథలోకి ఐచ్ఛికంగానే తీసుకువచ్చాడు. దళిత కుల ఐక్యత వొక రాజకీయ ఆచరణగా పరిణమించాల్సిన అవసరాన్ని కూడా శ్రీనివాస్ గుర్తించాడు అనడానికి అటువంటి వుదాహరణలు కథల్లో కనిపిస్తాయి (బోనాల పండుగ, బురుదగుంట). అదే సందర్భంలో బిసి యస్సీ సమైక్యతకి ఆటంకంగా వున్న వైరుధ్యాల్ని ప్రముఖంగా యెత్తిచూపడానికి రచయితగా అతనెక్కడా సంకోచించలేదు.

మల్లంపల్లి కేంద్రంగా దర్దేపల్లి కొడకండ్ల పాలకుర్తి తమ్మడపల్లి మద్దిరాల వావిలాల కొలన్ పల్లి కోల్కొండ నిడిగొండ ఎనూతుల కొండాపూర్ తొర్రూర్ వర్ధన్నపేట హన్మకొండ వరంగల్ వరకు భౌగోళిక చిత్రపటం వొకటి యీ కథల్లో కళ్ళముందు సాక్షాత్కారమౌతుంది. చుట్టుపట్ల పల్లెల్లో వుండే సబ్బండ వర్ణాల సాంస్కృతిక జీవితం కులం కట్టుబాటులతో సహా పరిచయమౌతుంది. ఒక తెలీని అన్వేషణలో పయనించిన సెంద్రెయ్య బెజవాడ చేరుకోవడంతో కథా క్షేత్రం విస్తృతమైంది. కోస్తా తెలంగాణ ప్రాంతాల మధ్య సామాజిక సాంస్కృతిక జీవితాల వైవిధ్యాన్ని చిత్రించడానికి రచయితకి అవకాశం కలిగింది. అయితే అతను దాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు. కానీ ఒక రాజకీయ వైరుధ్యం పైకి పాఠకుల దృష్టిని ప్రసరింపజేయగలిగాడు.

బెజవాడ కాళేశ్వరరావు మార్కెట్లో హమాలీ నాయకుడు మోహనరావు నోట తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నాటి పాలకుర్తి ఐలమ్మ ఠానూ నాయక్ దొడ్డి కొమురయ్య నల్లా నర్సింహులు ప్రస్తావనకి వస్తారు. తెలంగాణ గడ్డకు పోరాడే గుణం వుందని అతనా సందర్భంలో ప్రశంసిస్తాడు. అయితే పార్లమెంటరీ వామపక్ష ట్రేడ్ యూనియన్ రాజకీయాల్లో కులం కారణంగా నాయకులు దోపిడీ వర్గాలతో మిలాఖత్ అయ్యి కార్మికులకు ద్రోహం చేసే వైనాన్ని రచయిత మోహనరావు పాత్ర ద్వారా బహిర్గతం చేస్తాడు (హమాలీ సెంద్రెయ్య). అంతేకాదు చాలా చోట్ల అయ్యప్ప మాలేసుకుంటే సామాజిక హోదా పొందొచ్చు అన్న అపోహ బహుజన కులాల్లో ఉంది. దాన్ని’బెజవాడ అయ్యప్పా’ కథనం పటాపంచలు చేస్తుంది. కథలో –
“అవును గనే, సెంద్రెన్న. మాదిగోళ్లు, మాలోళ్లు ఎవన్నో చూసి వాతలు పెట్టుకునుడెందుకే? సూదరోళ్లయినా, యింకెవరైనా మనతో యియ్యంపెట్టుకునేటోళ్లా? అంతా కయ్యం పెట్టుకొనేటోళ్లే ఆయే. ఆళ్ల దేవుళ్లు మనకెందుకు? ఆల్ల పండుగలు మనకెందుకు?” అన్న ఏర్పుల రామచెంద్రం మాటలతో మొదలైన సంవాదం “అసలు దేవుడనేటోడున్నాడే సెంద్రెన్నా. వానింట్ల నా పెండబొయ్య. మనుషులను యిట్టా విడదీసేటోడు దేవుడెట్టయితడు?” అన్న ప్రశ్నతో పూర్తవుతుంది. ప్రశ్నలోనే సమాధానం దాచుకున్న యెరుక యిది. ఇటువంటి యెరుక యీ కథలంతటా పరివ్యాప్తమై వుంది.

*

“వూరేం బాలేదే. అంతా సెడిపోయింది. ఎవలికీ పని లేదు. ఎవలికీ తినే తిండిలేదు. పొట్ట సేతపట్టుకొని తలా వో దిక్కుకు పోతండ్లు. అంతా దిక్కులేని పచ్చులయ్యిండ్లు. బాయిలు ఎండిపోయినయి. చెరువులు నెర్రెలు బాసినయి. గొడ్లకు గాదం దొరుకత లేదు. యెగుసాయం ఏట్లె గలిసింది. కాపోళ్లు యగుసాయం చెయ్యలేక పోతండ్లు. మన మాదిగోళ్లను జీతం పెట్టుకుంటలేరు. వాడల యిండ్లన్నీ సగం ఖాళీ అయినయి. వొరంగల్లుకు, హైదరాబాదుకు పనెతుక్కుంటా పోయిండ్లు. గొల్లోల్ల రామసెంద్రన్న కూడా యిల్లొదిలి పట్నం పోయిండు. గౌండ్లోళ్ల సత్తెయ్య వూళ్లనే వుండు. వాళ్లిద్దరు అన్నల్దమ్ములు తాడి చెట్లు ఎక్కుతండ్లు. గడీని వొదిలేసి దొరలు నువ్వీడికి రాకముందే వొరంగల్లు యెల్లిపోయిండ్లు.” బెజవాడ అయ్యప్పా కథలో ఏర్పుల రామచెంద్రం మాటల్లో వూళ్ళో వచ్చిన పరిణామాలు తెలుస్తాయి. కొత్తగా దొరలూ గడీలు వొదిలిపోవడానికి కారణమైన నక్సలైట్ వుద్యమం వూళ్ళో ప్రత్యామ్నాయ మార్గం చూపలేకపోయింది అన్న పరిశీలన కూడా యిందులో నిబిడమై వుంది. కానీ దొర వూరు వదిలి వెళ్లిన తర్వాత వూరి సామాజిక చిత్రం మారింది. పెత్తనం కొన్ని శూద్ర కులాల వారి చేతిలోకి వెళ్ళింది. దళితుల జీవన పరిస్థితిలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఊరి సర్పంచ్ అయిన వాసు నాయక్ కొత్త భూస్వామిగా అవతరించాడు. ఉత్పత్తి శక్తుల గుణాత్మకమైన యెదుగుదలకూ సాంస్కృతిక పరిణామాలకూ వుండే అన్యోన్య సంబంధాన్ని అర్థంచేయించే ఘటనలూ వ్యాఖ్యానాలూ సెంద్రెయ్య కథల్లో నిక్షిప్తమై వున్నాయి.

ఆ నేపథ్యంలో వచ్చిన ‘సెంద్రయ్య విప్లవం’ కథ కుల – వర్గ వైరుధ్యాలెన్నిటినో చర్చకు పెట్టింది. వ్యావసాయిక సమాజంలో నూతన ప్రజాస్వామిక విప్లవం భూమి కేంద్రంగా నడుస్తుంది. అయితే మన దేశంలో ఆ భూమి సమస్య చుట్టూ కులం అల్లుకుని ఉంది. ఇదొక చేదు సామాజిక వాస్తవం. ఈ వైరుధ్యాన్ని పరిష్కారించే దిశగా జరగాల్సిన కృషి సమాంతరంగా జరగాలి. ఆర్థిక రాజకీయ పోరాటాలు సాంస్కృతిక పోరాటాలు జమిలిగా యేకకాలంలో నిర్వహించాల్సిన అవసరాన్ని యీ కథ గుర్తించింది.

“ప్రతీ సూదరాయనకు పక్కన ఓ మాదిగాయనకు తలం ఎందుకు ఇవ్వరు? అట్లా ఇస్తే కదా విప్లవం వచ్చేది? మీరు కూడా కులం పాటిత్తే, ఇగ సమాజం మారేదెట్లా?” – అన్న సెంద్రెయ్య ప్రశ్న , సామాజిక సమానత్వం కోసం పోరాడే ప్రతి ఒక్కరినీ/ ప్రతి పార్టీనీ నిలదీసేదే. సెంద్రయ్య కథల్లో ప్రతి సంఘటనలో సెంద్రెయ్యలో కనిపించే చైతన్యానికి వున్న మూలాలు ఈ కథలో బలంగా వ్యక్తం అయ్యాయి. ఇటువంటి వైరుధ్యాలు ఆ కాలంలో చాలాచోట్ల వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్ లో మరాఠా లంబాడాలకూ గోండి కొలాములకూ మధ్య తలెత్తిన వివాదాల్ని పార్టీ పరిష్కరించుకోగలిగింది. వేంపెంటలో మాదిగలు పోరాటంలో అగ్రభాగాన నిలిచిన చోట అది మరింత ఘర్షణకు దారి తీసింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వుద్యమాచరణని నిర్వచించుకోవాల్సిన అవసరాన్ని యిటువంటి ఘటనలు నిరూపించాయి. కుల వాస్తవికతని గుర్తించకుండా వర్గ పోరాటం సఫలం కాదనే యెరుకని కలిగించాయి. కులం పునాదిలో భాగమని విప్లవ పార్టీలు గుర్తించాయి. “మీరు తెచ్చే విప్లవంల కులాన్ని యిట్లాగే బతకనిస్తరా?” – అన్న సెంద్రయ్య మరో ప్రశ్న విప్లవ సంఘానికి సంధించినదే గానీ, “సూదరోళ్ల పక్కన చిన్న స్థలమే యివ్వనోళ్లు రేపు విప్లవం వొత్తే కుర్చీకాడికి రానిత్తరా?” – అన్న వెంకటయ్య ప్రశ్న పార్లమెంటరీ రాజకీయాల్ని విశ్వసించే బిసిలను సైతం వుద్దేశించింది.

‘బేక్ వర్డ్ కు మోర్ బేక్ వర్డ్ కు మధ్య ఘర్షణని కుల సమస్యలో ఇన్ హెరెంట్ గా ఉండే కాంట్రాడిక్షన్స్’ని చిత్రించిన యీ కథని ‘ఆఫ్ బీట్’ కథగా విక్టర్ విజయకుమార్ పేర్కొన్నాడు. అయితే 1980 లలో తెలంగాణలో భూమి సమస్య తాత్కాలికంగానైనా మరోలా పరిష్కారం కాలేదా అన్నది యిక్కడ చర్చకు రాలేదు. సెంద్రయ్యను తీర్చి దిద్దిన అనుభవ చైతన్యాన్ని ఆవిష్కరించడమే ప్రధానాంశమైంది. దాని వెనక బహుజన రాజకీయ వ్యూహం వున్నప్పటికీ అణచివేతకు గురవుతున్న దళిత జాతి జీవన అస్తిత్వ ఆవేదన స్వరాన్ని బైండ్ల సెంద్రెయ్య కంఠంలో పలికించడమే రచయిత వుద్దేశ్యం. నాకు తెలిసినంతవరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఆచరణలో వున్నప్పటికీ జిలుకరకు సాయుధ పోరుని ఆచరించే విప్లవోద్యమం పట్ల విమర్శనాత్మక వైఖరే తప్ప విద్వేషం లేదు (అరుణోదయ విమలక్క వరవరరావుల గురించి రాసిన వ్యాసాల్ని గుర్తుచేసుకోవడం అప్రస్తుతం కాదేమో! అంతేకాదు బహుజన రాజకీయ సమీకరణలో ఐక్యతకి ఆటంకంగా మారిన ఆధిపత్య ధోరణుల్ని వ్యతిరేకిస్తూ సైతం అతను వ్యాసాలు రాశాడు).

ఈ సంపుటిలో ‘పురా వీరగాథ’ వొక్కటే ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఆది జాంబవుడి పౌరాణికతని చారిత్రిక వాస్తవికతలోకి అనువర్తించిన జిలుకర రాజకీయ వ్యూహానికి దర్పణంగా అది నిలుస్తుంది. ‘ఓల్గా సే గంగా’ వంటి అద్భుత కథనం జిలుకర శ్రీనివాస్ కలం/గళం నుంచి వెలువడింది. సమాంతర పురాణం ప్రత్యామ్నాయ చరిత్రల మేలిమి మేళవింపు ఇది. కథలో ఇంద్ర ఉపేంద్రుల చావు వంటి యెన్నో ప్రతీకలు వర్తమాన రాజకీయాలపై జిలుకర చేసిన తీక్షణమైన వ్యాఖ్యానాలుగా గోచరిస్తాయి. రాహుల్ సాంకృత్యాయన్ ఆర్య వీరుడిగా పేర్కొన్న సుదాసుని మూలవాసీ యోధుడిగా మలచడం కథలో ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం.

‘బహుజనోద్యమ చరిత్ర పునర్మూల్యాoకనంలో’ యీ కథ (గాథ) వొక మలుపుగా భావించడం తప్పు కాదేమో! కలలకైనా ఆలోచనలకైనా భౌతిక పునాది వుంటుంది. ఆర్య ద్రవిడ ఘర్షణలో మనదైన మూలవాసుల సంస్కృతిని శ్రీనివాస్ యిప్పటికి యిలా కథగానే రాసి వుండవచ్చు. కానీ రేపటి చరిత్ర ఆవిష్కారానికి యిదొక ఆలంబన. నవలకి సరిపడే పెద్ద కథ యిది. వస్తువుకి తగ్గట్టే మారిన కథా శిల్పాన్ని అందులో చూస్తాం. అనేక కుట్రలు, వక్రీకరణల వల్ల యితిహాసపు చీకటికోణాల కింద పడి కాన్పించని నేలతల్లి బిడ్డల పురా గాథల్ని తప్పక అక్షరీకరించాలి. బలి హిరణ్య కశిప రావణ మైరావణ నరక మహిష బాణాది అసుర చక్రవర్తుల పౌరాణిక గాథలు జిలుకర వంటి రచయితల ముఖతా పున: కథనాలుగా రూపొందాలి. అది యివాళ్టి రాజకీయ అవసరం. వుత్తరాది ఆధిపత్యానికి దీటైన ప్రత్యామ్నాయం నిర్మించడానికి సాంస్కృతిక సైన్యం తయారుచేసుకోవాలి. ఏకధ్రువ సాంస్కృతిక జాతీయ వాదానికి సైద్ధాంతిక సమాధానం యివ్వాలి. నిజానికి రచన – రచయిత అన్న పరిధిని దాటి రాజకీయాల గురించి కూడా మాట్లాడుకోవలసిన సందర్భంలోనే అందరం వున్నాం. అది సాంస్కృతిక సామాజికోద్యమాలకు మేలు చేస్తుంది. తద్వారా ప్రగతిశీల సాహిత్యానికి కూడా వుపయోగపడుతుంది.
అణచివేతకీ దోపిడీకికీ గురైన కులాల మధ్య యేర్పడే వైరుధ్యాల్ని పరిష్కరించుకొనే ఐక్యతా సూత్రం యేది అనే ప్రశ్న యీ సందర్భంగా ముందుకొస్తుంది. వర్గంలో యెదురయ్యే కుల సమస్యకి పరిష్కారం పీడిత వర్గాల మధ్య సయోధ్య సమన్వయం ద్వారా లభించవచ్చు. బిసిలని తమ ఫోల్డ్ లోకి తెచ్చుకుని వారితో దళితులపైనా దాడులు చేయించే పన్నాగాల్ని బ్రాహ్మణీయ శక్తులు చాలా నేర్పుతో అమలుచేస్తున్నాయి. అదే సమయంలో దళితుల గుడిసెల్లో బంతి భోజనాల వ్యూహాలు రచిస్తున్నాయి. ఎస్టీల మీద కార్పొరేట్ దళారీగా రాజ్యం అమలు చేస్తున్న హింసకి బిసి ఎస్సీలు స్పందిస్తున్నది కూడా తక్కువే. మైనారిటీల జీవించే హక్కుపై మతోన్మాద శక్తుల దాడిలో బిసి యస్సీ యస్టీలు పావులుగా మారడం కూడా చూస్తున్నాం. అటువంటి సందర్భంలో లౌకిక ప్రజాస్వామ్య శక్తులు బలపడటానికి జిలుకర కథలు వుపయోగపడతాయని నమ్మకం. అంతర్గత వైరుధ్యాల్ని పరిష్కరించుకుంటూ కులపోరాటాలు అంతిమంగా వర్గపోరాటంలోకి పర్యవసించినప్పుడే బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలాన్ని అన్ని కులాల్లోకీ ఇంజెక్ట్ చేసి బలపడుతున్న కార్పొరేట్ దోపిడీ సామ్రాజ్యాన్ని యెదుర్కోగలమని బలంగా అనిపిస్తుంది. అటువంటి ఐక్యత సాధించే క్రమంలో కలిసి వచ్చే బాధిత శక్తుల్ని కూడగడుతూ సమూహాలుగా భిన్నమార్గాల్లో పోరాటాలు చేయక తప్పదు. ఇది యివాళ్టి అవసరం.

*

వాస్తవ జీవితాన్ని కథీకరించడానికి అవసరమైన దినుసుల్ని సమకూర్చుకోవడంలో జిలుకర శ్రీనివాస్ ప్రదర్శించిన నేర్పు ప్రతి కథలోనూ గోచరిస్తుంది. మనుషుల మధ్య అల్లుకున్న ప్రేమలు వెల్లువెత్తే వుద్వేగాలు వాటిని వ్యక్తీకరించడానికి అనువైన సన్నివేశ కల్పన సంభాషణ రచన కథా రచయితగా జిలుకర సాధించిన పరిణతికి అద్దం పడతాయి. కథల ముగింపులు అతని దృక్పథాన్ని పట్టిస్తాయి. నిర్మాణపరంగా అడుగడుగునా రచయిత చూపిన నేర్పు మెలకువ యీ కథల్ని intellectual stories గా తయారుచేశాయి. నర్సయ్య ధ్యానం, సెంద్రయ్య స్వప్నం, అన్వేషణ కథల్లో ప్రస్తావించిన శకునాలు మాంత్రికత పాల్ కోయిలో పరుసవేది నవల్లో శాంటియాగోనీ అతని ప్రయాణాన్ని గుర్తుచేస్తాయి. సెంద్రెయ్య జీవితంలో చోటుచేసుకున్న ఘటనల్ని శకలాలుగా చెప్పినప్పటికీ వాటి వెనక వున్న వాస్తవికతని కేవల యథార్థతగా మాత్రమే మిగిలిపోకుండా కాల్పనిక తలంలోకి కళాత్మకంగా మళ్లించడానికి రచయిత ఈ మాంత్రిక శైలిని ఆశ్రయించాడు. అది ఈ కథలకు విశిష్టతని సాధించింది.

జిలుకర కథన శైలి విలక్షణమైనది. జానపదుల మౌఖిక సంప్రదాయం నుంచి రూపొందిన భాషా వ్యక్తీకరణ రీతులు; వాక్య నిర్మాణం పదాల యెంపిక కూర్పు యాస లయ; ఆ విలక్షణతను సాధించాయి. వెనుకటి తరానికి చెందిన కథా గాయకులెవరో తమ పురా జ్ఞానపకాలను తవ్వి పోస్తే వాటిని యథాతథంగా లేఖనంలోకి నమోదు చేస్తూనే తనదైన వాక్యంలోకి తర్జుమా చేసినట్టు వుంటుంది. ఊకుడు కథకి ఆధునిక వచనశైలిని అద్దినట్టుంటుంది. ఈ కథా కథన కళా నైపుణ్యం అతనికి వారసత్వంగా లభించిన విద్య. కథని కూడా కయిగట్టునట్టు అల్లే అచ్చమైన దేశీయ శిల్పమిది. కన్నడ తమిళ మలయాళ భాషల్లో యిటువంటి శిల్ప రీతులు యెక్కువగా వుపయోగిస్తారు (శివరాం కారంత్ పెరుమాళ్ మురుగన్ మొ.). మన దగ్గర చిత్తూరు మాండలికంలో డాక్టర్ కేశవరెడ్డి (మూగవాని పిల్లనగ్రోవి), అనంతపురం మాండలికంలో బండి నారాయణస్వామి (గద్దలాడతండాయి, రంకె) వంటి యే వొకరిద్దరో మాత్రమే చేసిన శిల్ప ప్రయోగానికి యిది బలమైన కొనసాగింపు. దానికి మరింత సొబగు దిద్దడానికి శ్రీనివాస్ మాంత్రిక వాస్తవికతని జోడించాడు. తెలంగాణ తెలుగు కథకి జిలుకర అందిస్తున్న అదనపు చేర్పు బైండ్ల సెంద్రెయ్య.

సాహిత్యానికీ రాజకీయాలకూ మధ్య సృజనాత్మక సంబంధాన్ని నిర్వచించుకోడానికి బైండ్ల సెంద్రెయ్య కథల వాచకం దోహదం చేస్తుంది. అందుకు జిలుకర యెంచుకున్న వ్యూహం ప్రత్యేకమైంది. ఒక వ్యక్తి జీవితాన్ని నెపం చేసుకుని కుల అస్తిత్వ సాంస్కృతిక రాజకీయాలకు సమ్మతిని సాధించడం అతని వ్యూహం. కులం వర్గం మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి యీ కథల్లో చేసిన చర్చ పాఠకుల చైతన్యంలోకి/ఆచరణలోకి యెలా ప్రతిఫలిస్తుందో చూడాలి. జమిడికె తుఫాన్ యిప్పుడు తీరాన్ని తాకుతోంది. అప్రమత్తంగా వుండాలి.

‘బైండ్ల సెంద్రెయ్య కథలు’ తెలుగులో మాదిగ వుపకుల సంస్కృతినీ జీవితాన్నీ అందిస్తున్న తొలి కథా సంపుటి. కథా రచయితగా జిలుకరకి కూడా యిదే తొలి పుస్తకం. సమాజంలో భిన్న సమూహాల మధ్య సంభాషణకు పురిగొల్పే రచనల్ని స్వాగతించడంలో ముందుండే ప ర్ స్పె క్టి వ్స్ కి యీ కథలు ప్రచురించడానికి అవకాశం యిచ్చినందుకు రచయిత జిలుకర శ్రీనివాస్ కి జై భీములు – రెడ్ సెల్యూట్స్.

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply