కులదురహంకార హత్యలను ప్రతిఘటిస్తు పోరాడుదాం

ప్రియమైన ప్రజలారా !

తెలంగాణ రాష్ట్రంలో మరో దళిత యువకుడి తల తెగిపడింది. తనకు నచ్చిన నెచ్చెలిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు అమ్మాయి అన్న, బావలు కలిసి దారుణంగా కొట్టి చంపేశారు. కుల, మత , వర్గ భేదాలను లెక్కచేయకుండా పరస్పర ప్రేమనే పునాదిగా పెళ్లి చేసుకున్న మరో యువజంట ” ప్రేమ కథ ” విషాదాంతమైంది. SC మాల కులానికి చెందిన యువకుడు ముస్లిం కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి  పెళ్లి చేసుకున్నందుకు అతని ముస్లిం బామ్మర్ది , తోడల్లుడు దారుణంగా కొట్టి చంపారు. తెలంగాణ రాష్ట్రం కరడుగట్టిన అగ్రకుల దురహంకారానికి మరో నవయువకుడి తల తెగిపడింది. వెచ్చని నెత్తురు ఏరులై పారింది.  హైదరాబాద్ నగరం , సరూర్ నగర్ నడి రోడ్డు మీద ఒక  ప్రేమ జంటపై ఇద్దరు ఉన్మాదులు దాడి చేస్తుంటే వందలాది మంది మౌనంగా చూస్తూ కదలకుండా నిలబడ్డారు తప్ప వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించలేదు. సాయం కోసం కాళ్ళు మొక్కినా కనికరించని మూర్ఖ జనం. హంతకులతో పెనుగులాడినా , భర్తను కాపాడుకోలేకపోయిన భార్య, ఒంటరిగా మిగిలిన యువతి .

ఆశ్రిన్ పోరాటానికి సంఘీభావాన్ని తెలిపి , నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి ,  ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించడం కోసం కుల నిర్మూలనా పోరాట సమితి (KNPS) తెలంగాణ రాష్ట్ర కమిటీ , KNPS వికారాబాద్ జిల్లా కమిటీ సభ్యులు, తెలంగాణ అంబేడ్కర్ సంఘం(TAS) , డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్ (DSU) లు అతని స్వగ్రామం మర్పల్లి గ్రామానికి వెళ్ళడం జరిగింది. నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న ఆశ్రిన్ కలిశాం. తల్లి, తండ్రి, చెల్లెలు బందువులు మరియు ఇతర గ్రామస్థులు, మిత్రులను కలిసి పూర్తి వివరాలు సేకరించాం. కుటుంబం యొక్క సామాజిక ,ఆర్థిక స్థితి, మరియు ఇప్పుడు అక్కడ నెలకొన్న సామాజిక  పరిస్థితులు, పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం.

నిరుపేద దళిత శ్రామిక కుటుంబం 

తల్లిదండ్రులు, ఒక్క చెల్లె ఉన్న నాగరాజు కుటుంబం కడు పేదరికంలో మగ్గుతోంది. ఒక్క చూరు కింద నాలుగు గదుల్లో నాలుగు కుటుంబాలు జీవిస్తున్నాయి. వాళ్ళ నాన్న వాటాకి వచ్చిన ఒక ఇరుకైన గదిలో నాగరాజు కుటుంబం నివసిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం లాంటి ప్రభుత్వ పథకాలకు నోచుకోని నిరుపేద మాల (SC) కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ దినసరి వ్యవసాయ కూలీలు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితి. ఇంట్లో సరైన వాకిలి గానీ వసతులు గానీ లేని పేదరికంలో పెరిగిన నాగరాజు ఎంతో చురుకైన వాడు. మంచి మనసున్న బుద్దిమంతుడు. స్కూల్ విద్యా నుండి ITI వరకు ఊరికి దూరంగా ఉండి చదువుకున్న నాగరాజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి తోడుగా ఉండేవాడు. చెల్లెలి పెళ్ళి చేసారు కానీ అత్తారింట్లో సమస్యల వల్ల ఆమెకూడా ఇక్కడే ఉంటోంది. నాగరాజు సంపాదన మీదనే మొత్తం కుటుంబం ఆధారపడి బ్రతుకుతుంది. దాంతో నాగరాజు ఉపాధిని వెతుకుకుంటు హైదరాబాద్ కి వలస వెళ్ళాడు. ఎంత కటినమైన పనులైనా సరే చేసి కొంచెం మెరుగైన ఇంటిని కట్టుకోవాలని నాగరాజు తపన పడేవాడు. తన కుటుంబం కోసం నిరంతరం శ్రమించేవాడు.

ఆశ్రిన్ తో ప్రేమపెళ్లి !

మర్పళ్ళీ మండలం, ఘనపురం, ముస్లిం కుటుంబానికి చెందిన ఆశ్రిన్ తో నాగరాజుకు స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త క్రమంగా ప్రేమగా ఎదిగింది.  పై చదువుల కోసం ఆశ్రిన్  హైదరాబాద్ కి వెళ్ళింది. ఒకరిపట్ల ఒకరు సంపూర్ణ అవగాహనతో గత 10 ఏళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వేరు వేరు వర్గాలకు చెందిన తమ కులాలను, మతాలను పట్టించుకోకుండా ఇద్దరూ మనస్పూర్తిగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి పెళ్లికి కులం, మతం రెండూ అడ్డుగా నిలిచాయి. అయితే చిన్న కూతురు అయిన ఆశ్రిన్ ఏదీ కోరినా కాదనకుండా ఇచ్చే తన తండ్రి తమ పెళ్లికి అడ్డు చెప్పడనీ నమ్మింది ఆమె. అదే నమ్మకంతో  ఉన్న ఆశ్రిన్ ధైర్యంగా రాజును  ప్రేమించింది. కానీ అనారోగ్యం పాలైన ఆశ్రిన్ తండ్రి నాలుగు ఏళ్ల కిందటే మరణించారు. దాంతో  ఇంటి బాధ్యతలతో పాటుగా పెత్తనం మొత్తం  కూడా ఆశ్రిన్ అన్న మీద పడింది. దాంతో ఉపాధిని వెతుక్కుంటు ఆశ్రిన్ కుటుంబం కూడా హైదరాబాద్ కి వలసపోయింది. చిరు వ్యాపారులుగా పండ్లు అమ్ముకుంటూ  కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆశ్రిన్ తన ఉన్నత చదువును కొనసాగిస్తోంది. నాగరాజు కూడా హైదారాబాద్ లో ఉండి ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆ క్రమంలో ఆశ్రిన్, నాగరాజుకు పంపిన మెసేజ్ వాళ్ళ అన్నయ్యకి తెలిసింది. ఇలాంటి ప్రేమ వ్యవహారాలు మన కాందాన్ లో కుదరదు, మానుకో అని చెప్పాడు. కాదంటే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. దాంతో ఆశ్రిన్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నాగరాజుతో తన ప్రేమని కొనసాగించింది తప్ప భయపడి మానుకోలేదు. అయితే  పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి కులం, మతం అడ్డుగా మారింది. దాంతో  తమ పెళ్లి కోసం నాగరాజు ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారడానికి సిద్ధ పడ్డాడు. అదే విషయాన్ని ఆశ్రిన్ తన తల్లికి చెప్పి తమ పెళ్లి జరిపించమని కోరింది. కానీ అందుకు అన్న ఒప్పుకోడు కనుక నాగరాజును మరచిపొమ్మని చెప్పింది. 29 జనవరి రోజున, నాగరాజు కూడా ఆమెతో ఫోన్ లో మాట్లాడి తాను ముస్లింగా మారతాను మా పెళ్లి జరిపించమనీ కోరాడు. కానీ మా పెద్ద కొడుకు ఒప్పుకోడు అని చెప్పింది. ఇంటి పెద్దవి నువ్వే కనుక అన్నయ్యకి చెప్పమని ఆశ్రిన్ తల్లిని కోరింది. కానీ “నాన్న చనిపోయిన తర్వాత పెత్తనం అంతా అన్న చేతిలోకి పోయింది, నేనేమీ చెయ్యలేను,  అన్నకి తెలిస్తే చంపేస్తాడు. అతన్ని మరచిపో” అని ఆశ్రిన్  కు  నచ్చ చెప్పింది. ఆశ్రిన్ తల్లితో జరిగిన ఈ చర్చ మొత్తాన్ని  వాళ్ళ  పిన్ని ద్వారా  ఆమె అన్నయ్యకి తెలిసింది. దాంతో  30 జనవరి రోజున నిద్రిస్తున్న ఆశ్రిన్ ను ఉదయం 4 గంటలకు లేపి 7 గంటల వరకు తీవ్రంగా కొట్టాడు. “నీ పెళ్లి ముస్లిం యువకుడితోనే జరగాలి. వేరే వాళ్ళతో జరిగితే మన ముస్లిం సమాజంలో మన ఇజ్జత్ పోతది. కనుక అతన్ని మరచిపో లేదంటే చంపేస్తాను” అని బెదిరిస్తూ కొట్టాడు. ఆశ్రిన్ మూతి పగిలి ఒళ్ళంత రక్తసిక్తమైంది. 

అక్కను కొట్టొద్దు అని అడ్డం వచ్చిన వాళ్ళ తమ్మున్ని సైతం అన్న కొట్టాడు. ” మీరెక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి అక్కా” అంటూ ఆమె తమ్ముడు మద్దతుగా నిలబడ్డాడు. అదేరోజు, 30 జనవరి రోజున , రాజుకి ఫోన్ చేసి విషయం చెప్పింది. దాంతో రాజు వచ్చి ఆశ్రిన్ ను హైదరాబాద్ తీసుకెళ్ళాడు. 31 జనవరి 2022 రోజున హైదరాబాద్ ఆర్య సమాజ్ లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి కోసం ఆశ్రిన్ హిందువుగా మారాల్సి వచ్చింది. తమ ప్రేమ కోసం  కులం, మతం అనే పట్టింపులు లేవు కనుక ఆశ్రిన్ హిందువుగా మారడానికి ఒప్పుకుంది.

రాజుపై కిడ్నాప్ కేసు పెట్టిన ఆశ్రిన్ కుటుంబం 

ఇంట్లో కనబడకుండా పోయిన ఆశ్రిన్ ను వెతుక్కుంటూ వాళ్ళ అన్నా, బావలు మర్పల్లిలోని నాగరాజు ఇంటికి వెళ్ళారు. “మీ కొడుకు మా బందువుల అమ్మాయిని తీసుక వచ్చాడు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పమంటూ” రాజు తల్లిదండ్రులను అడిగారు. ” వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదని” నాగరాజు తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళ అమ్మాయిని వాళ్లకు అప్పగించకపోతే మీ కొడుకును వాళ్ళు చంపెస్తారని బెదిరించి వెళ్ళారు. తమ బిడ్డను 

నాగరాజు కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోమిన్ పేట్ పోలీసులు ఫోన్ చేసి ప్రేమ జంటను పిలిపించారు. మేజర్లు అయిన మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదని ఆశ్రిన్ ఇచ్చిన స్టేట్మెంట్ తో పోలీసులు కిడ్నాప్ కేసు రద్దు చేశారు. వాళ్ళ పెళ్లిని గుర్తిస్తూ , రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అందరితో కలిపి ఒక గ్రూప్ ఫోటో కూడా తీశారు. ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని  ఒప్పందాలు రాయించుకున్నారు. కానీ పెద్దలకు ఇష్టం లేకుండా  ప్రేమ పెళ్లి చేసుకున్న మాకు, మా కుటుంబం నుండి ప్రాణ భయం ఉందని పోలీసులకు చెప్పారు. వాళ్ల రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టిన పోలీసులు, వారికి కానరాకుండా దూరంగా వెళ్లి బ్రతకండని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఊరిలోసరైన రక్షణ , వసతులు , ఉపాధి లేని కారణంగా వాళ్ళు హైదరాబాద్ వెళ్లి కాపురం పెట్టారు. రాజు ఒక కార్ల షో రూంలో పనిచేసే వాడు.3 నెలలు సంతోషంగా గడిపారు.పెళ్లి తర్వాత ఆశ్రిన్ కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి.  వాళ్ళు కూడా వీరిని సంప్రదించలేదు. వాళ్ళ అన్నయ్య కూడా వీళ్ళ జోలికి రాలేదు. కానీ ఈ ఘటన జరిగిన రోజు రాజు ఆశ్రిన్ కు ఆఫీస్ నుండి ఫోన్ చేసాడు. “మా ఆఫీస్ ముందు మీ బావ కనిపించాడు ” అని అనుమానంగా చెప్పాడట. ఎప్పుడూ సరిగ్గా చూడనీ బావని సరిగ్గా గుర్తుపట్టాడో , లేదో అనుకుని చిన్న అనుమానంగానే తీసుకున్నారు. ఆఫీస్ పని పూర్తి అయిన తర్వాత ఇంటికి బయలు దేరిన నాగరాజు తమ బందువుల ఇంట్లో ఉన్న ఆశ్రిన్ బైక్ మీద ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు వారిపై దాడి జరిగింది.

రోడ్డు  మీద వెళ్తున్న వారి బైక్ ను వెనుక నుండి వచ్చిన దుండగులు  కింద పడేశాడు. కింద పడ్డ నాగ రాజు లేచి లోపే అతనిపై తలపై ఇనుప రాడ్ తో బలంగా కొట్టారు. దాంతో రాజు పైకి లేవలేక కిందనే గిల గిల కొట్టుకున్నాడు. ఈ దాడిని చూస్తూ రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళ అందరి దగ్గరికి ఆశ్రిన్ వెళ్ళి సాయం కోరింది. చేతులెత్తి వేడుకుంది. కాళ్ళు మీద పడి మొక్కింది. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. పదునైన ఇనుప రాడ్ తో బలంగా దాడి చేసి కొట్టడం వల్ల నాగరాజు అక్కడికక్కడే మరణించాడు. అతని తల పగిలి మెదడు బయట పడ్డది. ఇంతటి దారుణాన్ని అడ్డుకోవడానికి ఒక్క చిన్న రాయిని కూడా విసరలేని పిరికి జనం మధ్య ఆశ్రిన్ నిస్సహాయంగా రోదిస్తూ, తన భర్తను కాపాడుకోవడానికి వాళ్ళ అన్నయ్యతో పెనుగులాడింది. పట్టరాని కోపంతో ఉన్మాదిలా మారిన వాళ్ళ అన్నయ్య ఆశ్రిన్ కూడా దొబ్బేసి నాగరాజును దారుణంగా కొట్టి చంపాడు. ఆశ్రిన్ ఒంటరినీ చేశాడు. “…చుట్టూ వందల మంది ఉన్నా మహా నగరంలో నేను ఒంటరిగా దట్టమైన అడవిలో ఉన్నట్టే అయ్యింది. ఈ సమాజం పిరికిది. ఏ ఒక్కరూ ముందుకు వచ్చినా నా నాగరాజు బ్రతికేవాడు..” అంటూ రోదిస్తున్న ఆశ్రిన్ ను ఓదార్చే శక్తి ఎవరికీ లేకుండా పోయింది.

ఆసరా కరువైన కుటుంబం

కొత్త ఇల్లు కట్టుకుని ఆశ్రిన్ తో కలిసి జీవించాలనుకున్న నాగరాజు అదే పాతింటికి శవమై వచ్చాడు. పుట్టెడు దుఃఖంలో మునిగిన ఆ కుటుంబం మరిన్ని కష్టాల్లో కూరుకుపోయింది. పనికి వెళ్లలేని స్థితిలో మిగిలిన ఆ కుటుంబం పిడికెడు మెతుకులు కరువై పస్తులు ఉండేస్తితికి నేట్టివేయబడ్డారు. మార్చుకోవడానికి మరో డ్రెస్ కూడా లేని స్థితిలో ఆశ్రిన్ ఉంది.  కుటుంబం బాధ్యతలు మోసే నాగరాజు మరణం తర్వాత ఆసరా కోల్పోయిన కుటుంబం తమని ఆదరించే ఆప్తుల సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.

బాధ్యత మరచిన రెవెన్యూ అధికారులు

ఆగ్రకులోన్మాదానికి బలైన దళిత కుటుంబాలకు అన్ని విధాల ఆదుకొని అండగా నిలవాల్సిన రెవెన్యూ అధికారులు ఆ కుటుంబానికి నయా పైసా కూడా ఇవ్వలేదు. స్థానిక మండల తహశీల్దార్ కి ఫోన్ చేసి నిలదీస్తే,  వారికి దక్కాల్సిన నష్టపరిహారం కలెక్టర్ నుండి అందిన వెంటనే అకౌంట్ లో వేస్తామని బుకాయిస్తున్నారు తప్ప తక్షణ సహాయంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 25 కిలోల బియ్యం, కిలో నూనె, తదితర వస్తువులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఇంటి అవసరాలకు ఒక్క పైసా ఇవ్వలేదు. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంటికి ఎన్ని అవసరాలు ఉంటాయో పట్టించుకోలేదు. 

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్పూర్తితో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని కుల దురహంకార హత్యలకు బలవుతున్న నిరుపేద దళితులయువకుల కుటుంబాల జీవన చిత్రం ఇదీ. అంతులేని వ్యధ.

సామాజిక వ్యవస్థల పట్ల, ప్రభుత్వ యంత్రాంగం పట్ల సరైన అవగాహన లేని తనం , ఒక్కసారిగా ఆవరించిన ఒంటరితనం వల్ల ఆశ్రిన్ బాగా నలిగిపోతోంది. ఇలాంటి స్థితిలో ఉన్న ఆశ్రిన్ కు భరోసాను ఇచ్చి, ధైర్యాన్ని కల్పించే ఆసరా కావాలి. ఆ ఆసరా ఎంతో బలమైంది కావాలి. కనుక ఆ ఆసరా పౌర సమాజం నుండి కూడా అందాలని కోరుకుందాం. 

కులాంతర ప్రేమికుల హత్యా పరంపర
కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలపై దాడులు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయి. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ కుల దురహంకార హత్యల పరంపర పెరిగింది. అది నేటికీ నిరాటంకంగా సాగుతోంది. నాగరాజు చిందించిన నెత్తుటి తడి ఆరక ముందే 20 మే రోజున హైదరాబాద్, బేగంబజార్ లో నీరజ్ పన్వార్  అనే రాజస్థాన్ యువకున్ని దారుణంగా పొడిచి చంపారు. నడిరోడ్డు మీద వందలాది మంది చూస్తూ నిలబడ్డారు తప్ప రక్షించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. దాంతో ఆ యువకున్ని కత్తులతో 20 సార్లు పొడిచారు, గ్రానైట్ రాయి తలపై ఎత్తేసి అత్యంత క్రూరంగా చంపారు. యాదవ కులానికి చెందిన సంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆమె సోదరులు ఈ హత్య  చేశారు. వీరికి రెండున్నర నెలల పసిబాబు ఉన్నాడు. నీరజ్ హత్య జరిగిన మరుసటి రోజే, 21 మే నాడు హైదరబాద్ , అల్కాపురి టౌన్ లో  సయ్యద్ నసీర్ అనే ముస్లిం యువకుడిని  నలుగురు వ్యక్తులు కత్తులతో పొడిచారు.  నశీర్ ప్రేమిస్తున్న ముస్లిం యువతి బంధువులు ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సయ్యద్ కి ఉస్మానియా జనరల్  హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది. వారం రోజులు గడవక ముందే 27 మే రోజున ఆదిలాబాద్ జిల్లా నార్ణూర్ మండలంలో రాజేశ్వరి పవార్ అనే గిరిజన యువతిని ఆమె తల్లిదండ్రులు హత్య చేశారు. ముస్లిం యువకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో ఈ హత్య జరిగింది. హంతకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపి చేతులు దులుపుకుంటున్నారు తప్ప కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి అక్రమంగా నిర్బంధించారు అంటూ అగ్రకులాలు చేసిన ఫిర్యాదులను సాకుగా చేసుకున్న పోలీసులు, ప్రేమ జంటలను పట్టుకొచ్చి అమ్మాయిలను బలవంతంగా కుటుంబాలకు అప్పగిస్తున్నారు.  “కులం తక్కువోన్ని” పెళ్లి చేసుకునీ తమ పరువు తీసిందనే కోపంతో యువతులను కుటుంబమే హతమారుస్తోంది. ప్రేమించిన యువకులను నిలువునా నరికి చంపుతున్నారు. ఈ హత్యల నివారణకు ప్రభుత్వం ఎలాంటి కటిన చర్యలు తీసుకోవడం లేదు. దాంతొ ఇలాంటి హత్యల పరంపర నిరాటంకంగా సాగుతోంది. ఇలాంటి స్థితిలో ఇంకెన్ని తలలు తెగిపడనున్నాయో అనే ఆందోళన అధికమవుతున్నది.

మిత్రులారా !
రోజు రోజుకీ ఘనీభవిస్తున్న కుల వ్యవస్థ వల్ల అత్యాచార హత్యలు నిత్యకృత్యం అవుతున్నాయి. మహిళలను సొంత ఆస్తిగా , ఇంటి పరువుగా భావించే మనువాద పితృస్వామ్య వ్యవస్థలో మహిళలు తమ జీవిత భాగ స్వామిని ఎన్నుకునే స్వేచ్చ లేదు. ఇతర కులాలకు , మతాలకు చెందిన యువకులతో ప్రేమ, పెళ్లి నేడు ప్రాణాంతకంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతోటే జీవితాన్ని కోరుకున్నందుకు  రోజా రెడ్డి , స్వాతి రెడ్డి , రాజేశ్వరి పవార్ లాంటి ఎందరో యువతులు కన్న తల్లిదండ్రులే గొంతు పిసికి సజీవ దహనం చేశారు. నేటి కుల దురహంకార హత్యలు ఏ ఒక్క కులం వారి సమస్యనో కాదు. ఒకప్పుడు
OC-SC
OC- ST
OC-BC
హిందూ – ముస్లిం
హిందూ – క్రిస్టియన్ల మధ్య జరిగిన ఈ కుల దురహంకార హత్యలు నేడు ఆ స్థాయి దాటి
OC-OC
BC-BC
SC-SC
ST-ST
ముస్లిం – ముస్లిం
క్రిస్టియన్ – క్రిస్టియన్ ల మధ్య కూడా కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. ఒకే కులానికి చెందిన ప్రేమ జంటలు కూడా హత్యలకు బలవుతున్నారు. కులం, వర్గం, మతం అని చూడకుండా ఒక అమ్మాయి తనకు నచ్చిన యువకున్ని ఎంచుకొని, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు తమ కుల సమూహం అంగీకరించడం లేదు. వ్యక్తి యొక్క ఆస్తి, హోదా, ఉద్యోగం, గుణం కంటే కులానికి, మతానికే ప్రాధాన్యతను ఇస్తూ ఇతర కులాల, మతాల వారితో పెళ్లికి నిరాకరిస్తున్నారు. ప్రగతిశీల ఆలోచనలతో కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ముందుకు వస్తున్న యువతను అభినందించి  అండగా నిలబడాల్సిన పౌర సమాజం వారిపై కక్ష గట్టినట్టుగా తరుముతోంది. ఆదరించే అండ కరువైన జంటలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. అలాంటి యువత కుటుంబాలను సైతం ఈ పౌర సమాజం అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తోంది. మన కులం పరువూ పోతుంది అంటూ హింసిస్తోంది. వాళ్ళను దొరక వట్టి చంపకుండా ఎలా బ్రతుకుతున్నారు అంటూ కులోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇలాంటి అవమానాలను ధైర్యంగా ఎదుర్కోలేనీ కుటుంబాలు కరకు కత్తులు పట్టి హత్యలకు పాల్పడుతున్నారు. జీవిత కాలం జైల్లో మగ్గుతున్నారు. అతి సామాన్య శ్రామిక వర్గ ప్రజలు కూడా మారణాయుధాలు చేత బట్టి పట్టపగలే నడి రోడ్డు మీద తలలు నరుకుతుంటే పోలీస్ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. ఇది వాళ్ళకి శాంతి భద్రతల సమస్యగా కనిపించడం లేదు.


ఒక పరంపర లాగా సాగుతున్న ఇలాంటి హత్య సంస్కృతి పట్ల పౌర సమాజంలో ఆందోళన కరువైంది. అగ్రకులోన్మాదంతో, మతతత్వంతో రెచ్చిపోయి ఆగ్రహావేశాలతో హత్యలు చేస్తున్న వారిని సమర్థించే వైఖరి పౌర సమాజంలో పెరిగిపోయింది. హంతకులకు మద్దతుగా  ప్రకటనలు, ప్రదర్శనలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ చర్చలు చేసే కులోన్మాద మీడియా, టీవీ ఛానెల్స్ కూడా పెరిపోతున్నాయి. హత్యలను సమర్ధించడం కోసం ప్రేమికులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. మంథని మధుకర్ , మిర్యాలగూడ ప్రణయ్ హత్యల సందర్భంగా మొదలైన ఈ చర్చ నేటికీ కొనసాగడం వెనుక అగ్రకులోన్మాదల కుట్ర ఉంది. “తక్కువ” కులానికి చెందిన యువకులను  క్రూరంగా హింసించి దారుణంగా హత్య చేస్తున్నారు. “తక్కువ” కులానికి చెందిన యువతి అగ్రకులానికి చెందిన యువకున్ని ప్రేమిస్తే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ తీవ్రంగా అవమానిస్తారు. ఇలా హంతకులను సమర్థించే కులోన్మాద మూర్ఖులను కూడా అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలి.


మిత్రులారా…
ఈ దోపిడీ సమాజం మార్పు కోసం, కుల, వర్గ నిర్మూలనా, సమ సమాజ స్థాపన , దళితులకు రాజ్యాధికారం , మహిళా విముక్తి లాంటి లక్ష్యాలతో పని చేస్తున్న వివిధ పార్టీలు , దళిత , బహుజన , గిరిజన , మైనారిటీ , ప్రజా సంఘాలు, ముఖ్యంగా యువజన సంఘాలు ఈ దారుణ మారణ కాండలకు వ్యతిరేకంగా ముందుండి పోరాడాల్సిన అవసరం ఉన్నది. పౌర సమాజంలో చైతన్యాన్ని పెంచడం కోసం అందరూ కృషి చెయ్యాలి. కులతాత్వాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టే ఉన్మాద గుంపులను ప్రతిఘటించాలి. కుల నిర్మూలనకు దోహదపడే కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలి. కుల దురహంకార హత్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీస్ వ్యవస్థను నిలదీయాలి. కుల దురహంకార హత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పరోక్షంగా సహకరిస్తున్న పాలకవర్గాల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలి.  కులదురహంకార హత్యలను ప్రతిఘటిస్తు పోరాడుదాం. మరో ప్రేమ జంట బలి కాకుండా కాపాడుకుందాం. మరో యువకుడి తల తెగిపడకుందా జాగ్రత్త పడదాం. కుల నిర్మూలనా పోరాటాలను మరింత పదునెక్కిద్దాం.అందుకు అవసరమైన ఒక విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మిద్దాం. 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుల నిర్మూలనా పోరాట సమితి ( KNPS), తెలంగాణ.

Leave a Reply