“కీచురాళ్ళ చప్పుడులో గొణుక్కుంటున్న రాత్రి కవిత్వం”

(రేణుక అయోల ‘ఎర్ర మట్టి గాజులు ‘)


“రాత్రీ పగలు
తెల్లటి భూతం వెంటాడితే
ఎలా పడుకోగలం?
కడుపులో దూరి కార్చిచ్చు పెడితే
తిండి ఎలా తినగలం?
అద్దం కూడా తెల్లగా నిగనిగలాడితూ
నల్లని నీడల్ని చూపిస్తే
ఎలా బతకగలం?
రాత్రి కల
అన్నం గుట్టల కింద
చక్కెర బస్తాల కింద నలిగిపోయినట్లు వస్తే
ఎలా నిద్ర పోగలం?”


రేణుక అయోల కవిత్వ సంపుటి “ఎర్ర మట్టి గాజులు” చదువుతున్నంత సేపూ ఒక దుఃఖ గీతం వెంటాడుతున్నట్లనిపించింది. సంపుటిలోని ప్రతి కవిత జీవితానుభవపు స్పర్శ నుండి వచ్చిందే. ఏవో ఒకట్రెండు ప్రకృతితో మమేకమై రాసిన భావుకతకి సంబంధించిన కవితల్ని మినహాయిస్తే గాఢమైన సంవేదనాత్మక అనుభూతితో రాసినవే అన్నీ. జీవితం ప్రమేయం లేని కవితలు ఈ సంపుటిలో లేవు. రేణుకగారి కవిత్వంలో ఆగ్రహం కనబడదు. అధిక్షేపం వుండదు. వ్యంగ్యానికి చోటు లేదు. దిశా నిర్దేశాల్లేవు. ఐతే నిరసన స్పష్టంగా వుంటుంది. వర్తమాన సమాజంలో మధ్య తరగతి జీవితానికి చెందిన స్త్రీ అనుభవం తాలూకు గాయాల సలపరింతే ఒక ఆర్తిగా వ్యక్తీకరించబడిన కవిత్వంగా ఆమె కవిత్వాన్ని చెప్పుకోవచ్చు. ఒక నిస్సహాయ, అసంతృప్త స్వరం కవిత్వమంతటా వినిపిస్తూ వుంటుంది. నోస్టాల్జియా, ఒంటరితనం, ఏకాకి భావన, మానవ సంబంధాల పట్ల కొంత సెంటిమెంట్, మరికొంత భంగపాటు, నిరాశ అనారోగ్యాలు, అసౌకర్యం, నొప్పి కలిగించే పురుషాధిపత్య భావజాలం స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో తనని కదిలించిన పుస్తకాలు, కొందరు వ్యక్తుల గురించి కూడా కవిత్వం రాసినప్పటికీ ప్రధానంగా సమాజంలో అడ్వంటేజియస్ సెక్షన్ కి చెందిన స్త్రీల జీవితంలో ఎదురయ్యే జెండర్ హింసని ప్రభావవంతంగా చిత్రించిన కవిత్వం రేణుకగారిది. అదొక పరిమితిలా కనిపించినా తన అనుభవాలకి, ప్రత్యక్ష పరిశీలనలకి లోబడి రాయటం ఆమె నిజాయితీని కూడా చెబుతుంది.

ఈ సంపుటిలో మనం చిరకాలం గుర్తుంచుకోదగ్గ కవితల్లో “నీలిరంగు హ్యాండ్ బ్యాగ్” ప్రధానమైనది. స్కూల్ బ్యాగ్ నుండి హ్యాండ్ బ్యాగ్ కి ప్రమోషన్ వచ్చిన తరువాత స్త్రీ జీవితంలోని రకరకాల దశల్లో ఆమెతో పెనవేసుకుపోయిన హ్యాండ్ బ్యాగ్ గురించిన కవిత ఇది. హ్యాండ్ బ్యాగ్ స్త్రీ జీవితంలో, ఆమె దేహంలో అత్యంత అనివార్యమైన భాగంగా మారిన వైనాన్ని చిత్రీకరించిన కవిత ఇది. కాలేజీ అమ్మాయిలా, కోడలులా, అమ్మలా, ఒంటరి తల్లిలా, అత్తగారిలా బహు పాత్రాభినయం చేసిన హ్యాండ్ బ్యాగ్ ఎదిగిన స్త్రీ జీవన చక్రం (లైఫ్ సైకిల్)లోని భిన్నమైన షేడ్స్ ని పట్టుకున్న కవిత ఇది. ఈ కవిత ఒక రకంగా రేణుకగారికి సిగ్నేచర్ పొయం వంటిది. స్త్రీవాద కవిత్వం ఉధృతంగా వచ్చే రోజుల్లో ఈ కవిత వచ్చుంటే చాలా పాపులర్ అయ్యుండేది. వాడ్రేవు చిన వీరభద్రుడు సూచించినట్లుగా ఈ కవితలో ఒక షార్ట్ ఫిల్మ్ కి కావలసినంత స్క్రీన్ ప్లే వుంది. ఈ కవిత శీర్షికనే ఈ సంపుటికి కూడా పెట్టి వుంటే బాగుండేది. ఈ కవిత ముగింపు చాలా టచింగ్ గా వుంటుంది.

“నీలం రంగు హ్యాండ్ బ్యాగ్ అల్మరాలో
పాతబడి…రాలిపడి…
గతాల కావడిలా వుంది”
ఈ కవికి మానవసంబంధాల పట్ల బలమైన సెంటిమెంట్ వుంది. తన తండ్రి మరణ సందర్భంలో రాసుకున్న కవిత “నాన్నని పోగొట్టుకొని”
“నిన్నటి వరకు నీది నాది ఒకే పేగు బంధం
ఇప్పుడది ఎముకలు బూడిద అనుకుంటే
దుఃఖం గొంతులోనే వుంది చినుకులా రాలకుండా-
మెత్తటి చేతుల జ్ఞాపకం మెడ చుట్టూ అల్లుకున్నాయి
ఇల్లు ఖాళీగా లేదు
ఓ చీకటి గుహ దేహంలోకి ప్రవేశించినట్లు వుంది
చిన్న వెల్తురు చొరబడని అడవిలా వుంది
నువ్వు గతం అనుకోవడానికి భయంగా వుంది
ఎన్నోసార్లు ఒక్క మాటతో పొందిన ధైర్యం ఇప్పుడు లేదు
బెంగ మాత్రమే రేపటిలోకి తొంగి చూస్తుంది
జీవితాన్ని బతికించే కించిత్తు ఆశ గురించి ఒక మంచి కవిత “ఏమీ లేని రోజు” రాశారు ఆవిడ.

“ఇంక ఏమీ లేదు ఈ రోజులో అనుకున్న ప్రతీసారి
సూదిలో దారం కొత్త రోజుని కుట్టి చూపిస్తుంది
ఇద్దరి మధ్యలో ఏమీ లేదు అనుకున్న ప్రతీసారీ
కొత్త ఊపిరి నీలం దేహం గల
నల్లని రెక్కల తూనీగలా ఎగురుతుంది”

టైటిల్ కవిత “ఎర్ర మట్టి గాజులు” కేవలం ఒక సెంటిమెంటల్ కవిత. అయినవాళ్ళని 108 వాహనంలో తీసుకెళ్ళటం ఎంతటి గగుర్పాటు కలిగించే అనుభవమో “108 రాత్రి” అనే కవితలో బాగా రాసారు. ఇబ్బంది, భయం, జీవితాన్ని ప్రశ్నార్ధకం లేదా నిరర్ధకం చేసే పరిస్థితి గురించి రాసిన మంచి కవిత ఇది.


“రాత్రి రెండు గంటలప్పుడు
భయం రెక్కలు కొట్టుకున్నాయి
108 గుమ్మంలో ఆగగానే
తనతో పాటు నేను నాతో పాటు రాత్రి
……..
తొలి వెలుగులో డెత్ సర్టిఫికేట్
కనీళ్ళు లేవు భయం లేదు
సూది మొన లాంటి దుఃఖం
బహుశా తరువాత గుచ్చుకుంటుందేమో”

“ఒక సండాసు కథ” పల్లెటూరి స్త్రీల బహిష్టు బాధల్ని ఆవేదనాత్మకంగా వివరించిన కవిత. ఈ సంపుటిలో అత్యంత గాఢమైన అభివ్యక్తి గల కవితల్లో ఇది ఒకటి.


“మూడు రోజుల హింస చెంబుడు నీళ్ళల్లో తేలింది
రాతిపొరల్లో చరిత్ర వెతికినట్లు
బహిర్భూమి యుద్ధం కళ్ళకి కట్టింది
నెత్తుటి వాసనకి వెంటబడే గ్రామ సింహాలు
మరుగు కోసం దాక్కునే శరీరం
కండ చీమల సామ్రాజ్యంలో శత్రువులా నిలబడడం
ఎండుటాకుల మీద ముళ్ళని తప్పించుకోవడం
కూర్చొని బట్ట మార్చుకోవడం
కొన్ని వేల కళ్ళతో ఎవరూ లేరని నిర్ధారించుకోవడం
జంతువు మీద నిఘా పెట్టిన వేట లాంటిదే
….
రాత్రి ముట్టు కొట్టులో ఆక్రమించుకున్న భర్త
నూతి మీద చేదడు నీళ్ళతో పవిత్రమై
తెల్లవారి “అసుంటా వుండు” అంటూ
తప్పుకు తిరుగుతున్న మగడి చేష్టల నుంచి పుట్టిన రవ్వ
తోటల్లో దొడ్లల్లో తిరిగిన మైలకి నిప్పు పెట్టింది”

ప్లాస్టిక్ కాలుష్యం మీద రాసిన “వాడిని కాస్తంత ఓపిగ్గా విను” చెప్పుకోదగ్గ కవిత.

“నగరం గుండెకి ప్లాస్టిక్ అడ్డం పడింది
కాలువల నరాలు రబ్బరు సంచులతో పూడుకున్నాయి
ఊపిరి ఆడని నగరం
తట్టుకోలేక కూలిపోయింది”
ఆడపిల్లల అక్రమ రవాణ మీద ఒక కదిలించే కవిత రాసారు “అమ్మకో ఉత్తరం” పేరుతో.

“ఇక్కడ దేహాలు
బలవంతంగా ఎదుగుతున్నాయి
బాదం పిస్తా తింటున్న
పందెం కోళ్ళు జ్ఞాపకం వస్తాయి
అసలు ఏదీ ఊహకి అందదు
శరీరం మాత్రం పెరుగుతోంది
కత్తులు కట్టిన రెక్కలని ఆడించాలి
విచ్చుకోని అవయవాలు
దాడికి నెత్తురు చిమ్ముతున్నాయి!
అమ్మా! ఈ ఆట క్రూరంగా వుంది”….

ఇలా చదువుకోదగ్గ, గుర్తుంచుకోదగ్గ మంచి కవితలెన్నో ఈ సంపుటిలో కనిపిస్తాయి. తనలోని కవితాత్మక ఆలోచనలకి తగ్గ మంచి భావనా పటిమ, భాషా చాతుర్యం, ఊహాశక్తి, ప్రతీకాత్మక వర్ణన, గాఢత, నడక కలిగిన కవిత్వం రేణుక అయోలది. ఆమె పూర్వ కవిత్వ సంపుటులతో పోలిస్తే ఇందులో కనిపించే ఎంతో మంచి కవిత్వం ఆమె భావి కవిత్వం కోసం మనం ఎదురుచూసేలా చేస్తుందనేది నిస్సందేహం.

(“ఎర్ర మట్టి గాజులు” రేణుక అయోల కవిత్వం. బోధి ఫౌండేషన్ ప్రచురణ. పేజీలు:115, వెల: 100 రూపాయిలు. ప్రతులకు: బోధి ఫౌండేషన్, కొత్తపేట, హైదరాబాద్. నంబర్: 9848254745)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

One thought on ““కీచురాళ్ళ చప్పుడులో గొణుక్కుంటున్న రాత్రి కవిత్వం”

  1. చక్కటి సమీక్ష సార్
    రేణుక అయెలా గారికి అభినందనలు

Leave a Reply