కా.రా. ను కథల దేవుడిగా చేసే ప్రయత్నం జరుగుతుందా?

కా.రా మరణానంతరం ఆయన కథల మీదా, తెలుగు కథకు ఆయన చేకూర్చిన అదనపు అంశాలమీదా, కోణం మీదా చర్చ జరుగుతూ ఉంది.ఈక్రమంలో కా.రా ను దోష రహితుడిగా కథల దేవుడిగా చూపుతూ ఆయన మీద ఈగ వాలనివ్వని వారు ఎక్కువయ్యారు.అలాగే ఆయన్ను సెకండ్ రేట్ కధకుడిగా, ఈనాడు అనుగుణ్యత లేనివాడుగా కొట్టి పారేసే వాళ్ళూ కొంతమంది తయారయ్యారు.ఈ రెండు ధోరణులూ కా.రా.కథల్ని సరిగా అంచనా వేయడంలో సఫలమైనట్లు కాదు.కారాను సర్వ సంపూర్ణుడిగా చూపటం ఎంత తప్పో ఆయన్ను అనామకుడిగా తేల్చిపారేయడమూ అంతే తప్పు.ఆయన కథల్లోని గొప్పతనాన్నీ, పరిమితుల్నీ గుర్తించి విశ్లేషించుకోవడం వల్ల ప్రయోజనం కానీ ఏకపక్ష నిర్దారణలవల్ల ఫలితం లేదు.

మధ్య తరగతి ఎగువ కుల కథకులు పట్టణ మధ్య తరగతి సమస్యలతో సంస్కృతితో కుస్తీ బడుతున్న 60లలో కథను గ్రామాల బాట పట్టించిన వాడు కా.రా. అందులోనూ పీడితకుల వాస్తవికతను, ముఖ్యంగా దళిత వాస్తవికతను తన కథలకు నేపథ్యంగా స్వీకరించి తెలుగు కధకు ఇతివృత్తపరమైన కొత్త దారి చూపించాడు.సేనాపతి వీరన్న,యజ్ఞం,ఆర్తి,చావు,హింస, భయం లాంటి కధల్లో ఆయన చూపిన దారి ఇదే.పెత్తందార్ల పడగ నీడలోని గ్రామీణ నిరుపేద పీడితకులాల రోజువారీ సమస్యలూ, ఆవేదనలూ,ఘర్షణలూ, ఆకాంక్షలూ,మానసిక సంక్షోభాలూ వాటి పర్యవసానాలూ కథకు ముడిసరుకుగా చేసుకోవడంలో కా.రా. వైతాళిక పాత్ర నిర్వర్తించాడు. అయితే ఈ పని ఇంతకు ముందు చేసిన వారు లేకపోలేదు. కరుణకుమార ఏం చేశాడు.దిగువతరగతి,దళిత జీవితాలను అతి దగ్గరగా ఉండి పరిశీలించి వాటిని తెలుగు కథలోకి తీసుకొచ్చాడు.సన్న జనం పలుకుబడిని కధ కోసం వాడవచ్చని నిరూపించాడు.మా గోఖలే అయితే గుంటూరు జిల్లా గ్రామీణ నుడినీ, బడినీ దిగువ జనం మాటల సొగసునీ కథలోకి తెచ్చి మెప్పించగలిగాడు.మునుపెన్నడూ ఎరుగని పల్లె బాస రుచిని చదువరులకి చూపించాడు.ఇక జాతీయ స్థాయిలో ప్రేమ్ చంద్ రాసిన గ్రామీణ పీడిత కులాల కథలు అప్పటికే తెలుగులోకి వచ్చి ఉన్నాయ్.

కళింగాంధ్ర గ్రామీణ పేద పీడిత కులాల జీవితాన్ని కథలోకి కా.రా వట్టిగా పట్టుకు రాలేదు.మార్క్సిస్టు విప్లవ దృక్పధం నుంచి ఆ జీవితాన్ని దర్శింపజేశాడు.తద్వారా ఆ తరహా సృజనలో లైట్ హౌస్ లా నిలిచాడు.కరుణకుమారా, గోఖలేలు ఆ పని చేయలేదు.ప్రేమ్ చంద్ కథలూ అంతే. అయితే ప్రేమ్ చంద్ కథల్లోని మానసిక వత్తిడి ప్రేరేపితమైన పాత్రల వింత వైపరీత్య ప్రవర్తన కా.రా.కథల్లోనూ చూస్తాం.యజ్ఞంలో సీతారావుడు, హింసలో సంగి,నో రూమ్ లో నూకరాజు, ఆర్తిలో ఎర్రెమ్మా, – ఇలాంటి పాత్రల ప్రవర్తన మీద ప్రేమ్ చంద్ కథల్లోని పాత్రల ప్రభావం ఉండి ఉండొచ్చు. సేరుంబావు గోధుమలు,సద్గతి, కఫన్ తదితర కథల పాత్రల వ్యవహార శైలిని కాస్త గుర్తుకు తెచ్చుకోండి.

అయితే కా. రా.ప్రత్యేకత ఎక్కడ ఉన్నదంటే తన మేజర్ కధలన్నింటిలోనూ మార్క్సిస్టు పొలిటికల్ ఎకానమీని చొప్పించి ఆనాటి పాఠకులకు విప్లవ పాఠాలు చెప్పడంలో ఉంది అని చెప్పొచ్చు. శాంతి, వీరుడూ- మహావీరుడూ, కుట్ర, తీర్పు,భయం, హింస లాంటి కాన్సెప్చ్యువల్ కధల్లో గానీ, సేనాపతి వీరన్న, యజ్ఞం, ఆర్తి, చావు, నోరూమ్ లాంటి జీవిత చిత్రణ కధల్లో కానీ ఆయన కథల అసలైన కేంద్రీకరణ మార్క్సిస్ట్ రాజకీయ ఆర్ధిక దృక్పధం పైనే.తన దృక్పధం అర్ధం చేయించడానికి వాస్తవికతను కూడా దృక్పధానికనుగుణంగా ఎడిట్ చేసిన లేదంటే వక్రీకరించిన ఉదంతాలు కొన్ని కధల్లో ఉన్నాయి.ఉదాహరణకు సేనాపతి వీరన్న, ఆర్తి, చావు కథలు.

కుల సమస్య ను కేవలం ఆర్ధిక సమస్య గా కుదించి చూపిన ధోరణి 1953లో రాసిన’ సేనాపతి వీరన్న’ కథనుంచే కనపడుతుంది.నేత పనిజేసే సాలీల జీవితం కధ ఇతివృత్తం. వృత్తిని పట్టించుకోకుండా సాము గరిడీల పిచ్చిలో పడటం వల్ల నేతగాని జీవితం కూలిపోయినట్లు ఇందులో చిత్రిస్తాడు రచయిత.వృత్తిని విడవకుండా చేసే నేత పనివారంతా బాగా బతుకుతున్నట్లు వృత్తిని నిర్లక్ష్యం చేయడమే నేత పనివారి సమస్యకు కారణమని చూపించడంలో వాస్తవికతను పక్కన బెట్టినట్లు ఉంటుంది.వెనకబడ్డ కులాలూ, దళిత కులాలూ వాటికి అంటగట్టబడిన వృత్తుల వల్లే ఆర్ధిక లేమిలో కూరుకుపోయింది.ఈ వాస్తవాన్ని వదిలి వృతిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ కులస్తులు నాశనమైనట్లు చూపటంలో వ్యక్తమయ్యేదేమిటి? ‘కుల వృత్తిని మించినది లేదు గువ్వల చెన్నా’ అనే బ్రాహ్మణవాద సామెతను అంగీకరించినట్లేకదా ఇది.

‘ఆర్తి’ కథలో దళితుల్ని ఆర్ధిక పీడితులుగా తప్ప ఆత్మగౌరవ మానవులుగా చూపలేకపోయాడు రచయిత. సన్నెమ్మ కాపురం కన్నా ఆమె సంపాదించగల కూలి డబ్బులే ముఖ్యంగా భావించి తల్లి ఎర్రెమ్మ వాటికోసం వ్యూహాల మీద వ్యూహాలు వేయడం కథలో చూస్తాం.ఎక్కడో ఒకచోట తారసపడే ఇలాంటి విషయాన్ని దళిత జీవితంలో సాధారణంగా జరిగేట్లు చూపించడం ఎంతవరకు సబబు?పేదరికం మానవ సంబంధాల్ని విచ్చిన్నం చేసి వికృతీకరిస్తుందనే ఆర్ధిక నిర్ణాయక వాదాన్ని చొప్పించటానికి దళితుల ఆర్ధిక సమస్యకు కారణమైన అంటరానితనాన్నీ దానికి ఆలంబనగా ఉన్న కుల సమస్యనూ రచయిత పక్కన బెట్టడం ఈకథలో కనిపిస్తుంది.దళితుల్ని ఆర్ధిక పీడితులగానే తప్ప కుల పీడితులుగా చూడలేని ఆనాటి మార్క్సిస్టు అవగాహనకు లోబడే కా.రా. ఈ కథను రాశాడనే దానికి ఇంతకన్నా ఏ నిదర్శన కావాలి. వియ్యపురాళ్ల మధ్య ఎంత గొడవున్నా ఆ గొడవ కోసం కూతురి జీవితాన్ని ఏ తల్లీ అశాంతి పాలు చేయదు.కూతురికోసం వియ్యపురాలికి తగ్గి మసలుకొనటం మనం చూసే వాస్తవం.ఈ వాస్తవాన్ని ఆర్ధిక నియతివాదం కోసం తారుమారు చేసి కూతురు కూలి డబ్బులకోసం ఎత్తుకు పై ఎత్తు వేసే స్కీమర్ గా తల్లిని చూపటం మార్క్సిస్టు ఆర్ధిక సూత్రాన్ని సంతృప్తి పరచిన మాట నిజమే కానీ దళిత జీవితాన్ని అది వక్రీకరించింది. తాత్వికత కోసం మానవీయతను బలిపెట్టింది. శ్రమ సొమ్ముగా లేక సరుకుగా మారే క్రమంలో జరిగే వికృతానికి దళిత వాస్తవికతను వికృతీకరించే సృజనకు ఈ కధ ఇలా దోహదపడింది.

ఇదే ఆర్ధిక ఇతివృత్తపు వ్యూహం’చావు’ కథలోనూ కనబడుతుంది.మాలపల్లెలో ముసలమ్మ చావు వార్త విన్న నారమ్మ స్పందనని అసహజంగా చూపాడు రచయిత.శవాన్ని కాల్చడానికి తన కడియాలు అమ్ముకోవాల్సి వస్తుందేమో అని భయపడుతుంది. “గోయిందా .. నా సేతెండి కడియాలు గోయిందా” అని వాపోతుంది.తెల్లారి కూలిపనికి ఆటంకం లేకుండా ఉండటం కోసం ఆ రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేయడానికి కట్టెల్ని దొంగిలించే దానికి పూనుకోవటంలో శవాన్ని పూడ్చి పెట్టే అవకాశాన్ని కొట్టిపారేయడంలోనూ ఆర్ధిక వాద సృజన లేదని చెప్పలేం.దీన్ని కప్పిపుచ్చటానికా అన్నట్లు ముసలమ్మ కొడుకు ఎరకయ్య చేత ఒక ముచ్చట చెప్పిస్తాడు కధకుడు. ” ఒక్కోపాలి మాయమ్మ అనీది. అయ్యా నానెప్పుడేనా యీ సలికే సచ్చిపోతాన్రా, ఈ సలి సంకటం తోనే సచ్చిపోతాను.సీతాకాలం – కర్రలెక్కడా దొరకవు.కర్రల్దొరకవనికప్పెట్టీ కిమీ – ఎక్కడేనా కొనే, కాసింత అడుక్కునో, సివరికి దొంగతనవే సేసినా సరే, నన్ను కాల్సీయాల, బండెడు కర్రల్తెచ్చి కాల్చీ – నా యిన్నాళ్ల సలీ కాష్టమ్మీ నైనా కాలిపోవాల అనీది మా యమ్మ” అని ఎరకయ్య చెప్పిన ముచ్చట రచయిత తన ఆర్ధిక నియతి వాదాన్ని జస్టిఫై చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినట్లుగా ఉంది. ఇలా ఈ రెండు కథల్లోనూ దళిత పాత్రల్లో మానవీయ స్పృహ కంటే ఆర్ధిక స్పృహ ప్రబలంగా ఉన్నట్లు చూపటంలో రచయిత దళిత వాస్తవికతను తన దృక్పధానికనుగుణంగా ఎడిట్ చేసుకున్నట్లు అర్ధమౌతుంది.

తొలి నాళ్ళలో రాసిన ‘అభిశప్తులు’ కథలో మానవ సంఘర్షణ కు మూలాలు కుల భేదాల్లో, లింగ భేదాల్లో, వర్గ భేదాల్లో ఉన్నాయనే దృష్టి వ్యక్తమయ్యింది.’నో రూమ్’ కథలో దళిత జంటకు హోటల్ లో బసకు రూములు కూడా దొరకని పరిస్తితిని వాస్తవికంగా చిత్రించడం ఉంది. అంటరానితనంతో, పేదరికంతో బతికిన గోలీ నూకరాజు కష్టపడి కొంచెం, కొంచెం డబ్బు దాచుకుని తన భార్యతో ఒక్క రోజు లాడ్జింగ్ గదిలో రోజువారీ కసాటుకు దూరంగా సేద తీరాలనుకోవడంలోని సహజ జీవితేచ్ఛను సహజంగా చిత్రించగలిగాడు.ఇక్కడ కులసమస్యను కేవల ఆర్ధిక సమస్య గా కుదించ లేదు.ఇదే ధోరణి ‘యజ్ఞం’ లోనూ కనబడుతుంది.కుల వ్యవస్థ లో భాగంగా వస్తున్న కంబరితనాన్నీ దాని భయంకర ఆర్ధిక, మానసిక పర్యవసనాల్నీ సీతారావుడి పాత్ర ద్వారా గొప్పగా పలికించాడు కధకుడు.ఈ కథను నిర్మించే క్రమంలో అనేక అర్ధాల పొరలకు చెందిన అనేక సంకేతాల్ని పొందుపరిచాడు కా.రా.కవిత్వం స్థాయికి ఎదిగిన కధ ఇది.ఆ క్రమంలో అంతంలేని చర్చకు తావిచ్చిన కధ.ప్రపంచ స్ధాయి కథగా నిలిచిపోయింది.అయితే ఈ కథను విశ్లేషించిన మార్క్సిస్టు మేధావులు చాలామంది అందులోని అభివృద్ధి తాలూకు విషాదాన్నీ, వ్యవసాయ రంగ వ్యాపరీకరణనీ తదితర ఆర్ధిక అంశాల చట్రంలోనే విశ్లేషించారు.కథలో చిత్రితమైన కులవ్యవస్థాధారిత పీడననూ, అన్యాయాన్నీ మైనర్ అంశంగా పక్కకు నెట్టారు.

“కొట్టే చేతిని పట్టుకోడమూ, తిట్టే నోటికెదురు తిరగడం కూడా శాంతికి భంగకరాలంటారు .క్రూర మృగం నిన్ను పట్టుకు తింటోంది.కదిల్తే కల్లోలం తప్పదు కదా, కదల కుండా భోంచేయనియ్.అదేనా నువ్వుకోరే శాంతి? బాకో చాకో చూపి దోపిడీ దొంగ నిన్ను దోస్తాడు. తిరగబడితే రక్తపాతం తప్పదు…. అంచేత కిక్కురుమనకు” శాంతి కథలో ఇలాంటి జీవిత సత్యాలు కోకొల్లలు.ఇలాంటి రాజకీయ, నైతిక సత్యాలే భయం, హింస, తీర్పు కధల్లో ఉన్నాయి.అయితే ఈ సత్యాలను చెప్పటానికి కథను లూజుగా విస్తరిస్తూపోతాడు కా.రా. చెప్పాల్సింది చెప్పి కధనంలోకి వెళ్లకుండా సందర్భం వచ్చిన ప్రతిసారీ, కొన్నిసార్లు సందర్భం కల్పించి మరీ, పేజీలకు పేజీలు మాట్లాడతాడు.ఈ పురాణ పద్ధతి ఈనాటి పాఠకులకు రుచించకపోవచ్చు.భయం లాంటి కధల్లోనయితే ప్రధాన వృత్తాంతం నుంచి ఉప వృత్తాంతం లోకి వెళ్లి వాటిని సరిగా కలపలేకపోవటం చూస్తాం.ప్రధాన కధ లన్నింటిలోనూ పంచాయతీ లూ,ఉపన్యాసాలు, సమాచార విస్తరణలూ లేదా ఆ తరహా చర్చలు నడవటం చూస్తాం.ఈ మూస కథనం ఇప్పటి పాఠకుల్ని కధ అధ్యయనంలో ముందుకు పంపటం కష్టమే.కా.రా.పాత్రలకు కూడా స్వతంత్రత తక్కువ.పాత్రలు రచయిత చిటికినవేలు పట్టుకుని నడవటాలే ఎక్కువ.ఈమేరకు వాటి ప్రవర్తన లో సంభావ్యత, (నమ్మశక్యత) తక్కువ.

మొత్తంగా చూసినప్పుడు కా. రా.కధల్లో ఎన్ని సుగుణాలున్నాయో అన్ని కాకపోయినా కొన్నైనా పరిమితులున్నాయి.లోపాలున్నాయి.ఎనభైల వరకూ ఎంతో మంది విద్యార్థుల్నీ, కార్యకర్తల్నీ,మేధావుల్నీ విప్లవోద్యమాలవైపుకు మరలించటంలో కా. రా. కథల పాత్ర ఉంది. యజ్ఞం, కుట్ర, తీర్పు,జీవధార, శాంతి, వీరుడూ-మహావీరుడూ, నోరూమ్, భయం,హింస లాంటి కథలు సానుకూల ప్రభావాన్ని వేయగలిగినట్లే సేనాపతి వీరన్న,ఆర్తి, చావు లాంటి కథలు చిత్రిత జీవితం పట్ల కృతక ప్రభావం వేయగలిగాయి. కనుక కా. రా.ను కథల దేవుడిగా కొలవడం అపి కధకుడిగా ఆయన్ని పుంర్మూల్యాంకనం చేయటం ప్రయోజనకరం.ఆయన కధల్లో కొంతవరకు వ్యక్తమై మధ్యలోనే గండీ పడిన కళింగాంధ్ర ప్రాంతీయతని కూడా చర్చలోకి తేవాలి.

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

11 thoughts on “కా.రా. ను కథల దేవుడిగా చేసే ప్రయత్నం జరుగుతుందా?

 1. మీ విమర్శలో ఏకీభవించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. పీడిత కుల వాస్తవికతను, ముఖ్యంగా దళిత వాస్తవికతను తన కథలకు నేపథ్యంగా స్వీకరించినా వర్గ వ్యత్యాస అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నది నా అభిప్రాయం కూడా. నిమ్న కులాలన్నీ ఆర్ధిక అసమానతలకు బలైనవే, కనుక మాస్టారికి ఆ అంశం బాగా కలిసొచ్చినా దాన్ని ఫుల్ లెంగ్త్ లో వాడుకోవడైనికి భావజాల పరిమితులు అడ్డొచ్చినట్టు ఖచ్చితంగా తెలుస్తుంది. దాదాపు అన్ని కథలలోనూ మార్క్సిస్టు విప్లవ దృక్పధాన్ని చొప్పించి కుల వివక్ష కోణాన్ని విస్మరించినటిటు చేస్తుంది.
  కుల సమస్య ను కేవలం ఆర్ధిక సమస్య గా కుదించి చూపిన ధోరణి కధాసాహిత్యన్ని కుంటి పరిచిన మాట కూడా వాస్తవమే. ఇది ఉద్దేశ్య పూర్వకంగ జరిగిందని మాత్రం అనలేను.
  పరోక్ష్యంగా కులాన్ని సమర్ధిస్తూ అభ్యుదయ వాదులగా చలామణి అయ్యేవారికీ వామపక్ష భావజాలం ఒక వరం. కుల వివక్షకు బలౌతూ కుల నిర్మూలన వాదాన్ని మోస్తున్న వారికి ఇది బాగా అర్ధం అవుతుంది.

 2. చాలా మంచి విశ్లేషణ లక్ష్మీనరసయ్య గారు. అన్ని కోణాలనుంచి చాలా బాగా రాశారు మీ సమీక్ష. అభినందనలు

 3. కారా కథలను విశ్లేషించినతీరు బాగుంది సర్.కథకునికుండే పరిమితుల్ని చక్కగా తెలియజేశారు.ధన్యవాదాలు

 4. Lakshmi Narasaiah garu, though I am not entering into validation of other stories of Kara Mastaru, I venture to speak something of a story ‘Chaavu’ on which I once tried to make a film and even now I feel like I had written a wonderful screenplay for that. The crux of the story is a clear and lucid point that how cultural hegemony instigates psychological confusion and chaos in executing diktat among the toiling masses. And your usage of Economic centred creativity as a negative entity is unwanted. Frankly speaking Narasaiah garu, is there any realistic story of dalit, muslim, women, not hang economic reflections?
  PS. sorry I am not good in typing Telugu.

 5. Krishna kanuri 7981305779

  నిశిత విశ్లేషణ. రచయితలోని ఆర్థిక, సామాజిక దృష్టికోణాల మధ్య అంతరాన్ని,పాత్రలపై దాని ప్రభావాన్ని అద్భుతంగా చెప్పారు.”60లలో కథను గ్రామాల బాట పట్టించిన వాడు కా.రా. అందులోనూ పీడితకుల వాస్తవికతను, ముఖ్యంగా దళిత వాస్తవికతను తన కథలకు నేపథ్యంగా స్వీకరించి తెలుగు కధకు ఇతివృత్తపరమైన కొత్త దారి చూపించాడు” అంటూ కా.రా.లోని మౌలిక స్వభావాన్ని బాగా విశ్లేషించారు. కాలేజి రోజుల్లో నన్ను బాగా ఆకర్షించిన మొదటి కొద్ది మంది రచయితల్లో కా.రా.గారు ఒకరు. యజ్నం తర్వాత నో రూమ్ కథ చాలా సంవత్సరాలు మదిలో నిలిచిపోయింది. స్వానుభవం నుంచి గాకుండా సహానుభుతితో ఎంత గొప్పగా రాశారు అనిపిస్తుంది. మనుషులు, సమాజం పట్ల ఎంతో స్వచ్చమైన, ప్రేమ,కరుణ,దయ ఉంటే తప్ప ఇటువంటి కథలు రావేమో.

   1. సర్,
    కారా కథల్లోని పాజిటివ్, నెగిటివ్ అంశాల్ని చాలా చక్కగా చర్చించారు.

 6. కథలోని పాత్రల మానసిక సంఘర్షణలైనా,కథను వాస్తవిక కోణంలో నిలపాల్సిన కథాంతర్గతంగా సాగే సంఘటనలైనా,కథకు ప్రాణప్రదమైన ముగింపు అయినా,కార్యకారక సంబంధాలకు అతీతంగా ఉన్నప్పుడు.. కథకుని సైధ్ధాంతిక అవగాహనను,తార్కిక చింతనను మూడో కన్నుతో పట్టుకుంటాడు విమర్శకుడు. మీరు ఆ పనిని సునిశిత పరిశీలనతో చేశారు.అభినందనలు

 7. ఇతరుల ప్రభావ ప్రవాహంలో కొట్టుకుపోతున్న పాఠకుల్ని, కారా అభిమానుల్ని ఆలోచింప చేస్తుంది మీ విశ్లేషణ. చాలా సూక్ష్మంగా లోతుగా సోదాహరణంగా వివరించారు. మంచి సమయోచిత వ్యాసం.

Leave a Reply