కాశ్మీర్ ప్రజల ఆజాదీ ఆకాంక్ష రాజద్రోహం – దేశ ద్రోహం కాజాలదు

భారతదేశ చరిత్రను పురాణాలూ, భారత రామాయణాలూ వంటి కావ్యాలలో అరకొర ఆధారాల ద్వారా నిర్మాణం చేయవలసిందే తప్ప పురాతత్వ శాస్త్రం, ఇతర చారిత్రక ఆధారాల ద్వారా నిర్మించడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ. అయితే, రెండు మూడు వేల సంవత్సరాల చరిత్ర నిర్మాణానికి మాత్రం బోలెడు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అటువంటి చరిత్రను ఆర్.ఎస్. శర్మ, కోశాంబి, రోమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ వంటి వాళ్లు ఎంతో ప్రామాణికంగా నిర్మించి ఉన్నారు. అయితే, ఇవాళ అఖండ భారత్ అని మాట్లాడుతున్న సంఘ్ పరివార్ వాళ్లకు గానీ, అటువంటి భావజాలం కలవాళ్లకు గానీ ఇటువంటి చరిత్ర కన్న విశ్వాసాలు, పురాణాలు మాత్రమే ఆధారం. వాళ్ల స్వీయాత్మక నిర్ణయాలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది గనుక జమ్మూ కాశ్మీర్ సందర్భంగా వాళ్లు గౌరవించే ఆధారాల నుంచే ముందుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం.

గత నలభై ఏళ్లకు పైగా మార్క్సిస్ట్ – లెనినిస్ట్ భావజాలానికి చెందిన వాళ్లు గానీ, నలభై ఏళ్లుగా విప్లవ రచయితల సంఘం గానీ, అరవై ఏళ్లుగా జాతి విముక్తి పోరాటాలు చెప్తున్న విషయాలనే జమ్మూ కాశ్మీర్ గురించి, ఈశాన్య రాష్ట్రాల గురించి చెబుతున్నాయి. ఇటీవల చరిత్ర విద్యార్థిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా అరుంధతీ రాయ్ కూడా అదే మాట చెప్పడం సంఘ్ పరివారు గానీ, ప్రభుత్వాలకు గానీ ఆమె అంతర్జాతీయ ఖ్యాతిగలిగిన రచయిత కావడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. అదేమంటే, కాశ్మీర్ ఎన్నడూ భారత భూభాగంలో భాగం కాదు. కాశ్మీర్ మాత్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాలు కూడా ఎన్నడూ భారత భూభాగంలో భాగం కాదు. ఎన్నడూ స్వచ్ఛందంగా భారత ప్రభుత్వాల కింద, ఢిల్లీ పాలన కింద లేవు అనేదే జాతి విముక్తి పోరాటాల చారిత్రక అవగాహన. అదే నాలుగు దశాబ్దాలకు పైగా విప్లవోద్యమ అవగాహన.

జంబూ ద్వీపే భరత ఖండే అని సత్యనారాయణ వ్రత కల్పం చెబుతుంది. చప్పన్నారు దేశాలు అని భారత ఉపఖండం ఎన్నో దేశాల సమాఖ్య అనే భావన పౌరాణిక కాలం నుంచి కూడా ఉన్నది. భారతదేశం ఉపఖండం అనే విషయం ఇవాళ కొత్తగా ఎవరో స్థాపించనక్కర్లేదు. ఈ సత్యాన్ని 1920 నుంచి 35-36ల వరకు దేశంలోని అఖిల భారత స్థాయి పార్టీలన్నీ స్పష్టంగా గుర్తించాయి కాబట్టే ఇంగ్లిష్ వాళ్లు వెళ్లిపోయిన తరువాత ఈ దేశాన్ని ఒక జాతుల సమాఖ్యగా రూపొందించాలని తమ ప్రణాళికల్లో రాసుకున్నాయి. జాతి సర్వోతోముఖ వికాసమనేది పెట్టుబడిదారీ విధానం వల్లనే సాధ్యమయ్యేది అయినా మనం వలస పరిపాలన కిందికి రావడం వల్ల, యూరప్ లోని జాతుల, దేశాల అభివృద్ధి మన దృష్టిలో ఉండడం వల్ల మన ప్రాచీన, రాజకీయ జాతుల, భాషల సమాఖ్యగానే రూపొందించుకోవాలనే భావనను అధికారం రాకముందు అన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహించాయి. అంతమాత్రమే కాదు, కొన్ని వేల సంవత్సరాల జాతుల, భాషల పరిపాలన గల రాజ్యాలను ఆ భావన బలపడకుండా ఉండడం కొరకే బ్రిటిష్ ఇండియాలో చెదరగొట్టి, పరిపాలన పునర్నిర్మాణం చేశారనే తీవ్రమైన వ్యతిరేకత మన దేశంలో స్వాతంత్య్రేచ్ఛ గల అందరిలో ఉండేది.

బెంగాల్ విభజన పట్ల వచ్చిన నిరసన గానీ, సెంట్రల్ ప్రావిన్సెస్, పెప్సూ, మద్రాస్ ప్రావిన్స్ వంటి పరిపాలనా నిర్మాణాల పట్ల వ్యతిరేకత గానీ ఆ విధంగా వచ్చిందే. ఇటు ఆంధ్ర మహాసభ గానీ, అటు ఆంధ్రోద్యమం గానీ ఈ నేపథ్యం నుంచి వచ్చినదే. ఆంధ్ర మహాసభ నైజాం వ్యతిరేకతతో పాటు, తెలుగుజాతి ఐక్యతను ఆకాంక్షించింది. ఆంధ్రోద్యమం జాతీయోద్యమంతో పాటు కలిసి నడిచింది. 1920లలో వచ్చిన జాతీయోద్యమ కవిత్వం గానీ, తెలంగాణలో కాళోజీ, దాశరథి కావ్యాలు గానీ ఈ భావనకే తిరుగులేని దాఖలాలు.

ఫ్యూడల్ భూస్వామ్య భావజాలం నుంచే కావచ్చు గాని, వలస పాలన కింద సామ్రాజ్యవాద పదఘట్టనల కింది జాతి భావన నలిగి పోవడం గురించి ఆంధ్రప్రశస్తి కావ్యంలో విశ్వనాథ సత్యనారాయణ ‘వేంగీ క్షేత్రం’లో పద్యాలు ఇవ్వాళ ప్రజాస్వామిక వాదులు జాతుల స్వాతంత్య్రేచ్ఛ గురించి చెపుతున్న భావాలకు దగ్గరగా ఉండడం ఆశ్చర్యం కాదు. సామ్రాజ్యవాదం అనే మదపుటేనుగు పాదాల కింద పడి జాతులనే కమలం ఛిద్రమై, జాతి భావం అనే పరాగం నలిగిపోతున్నదని ఆయన తెలుగుజాతి వలస పాలనలో అణగారిపోతున్న విషయాన్ని ప్రస్తావిస్తాడు.

భారత దేశం ఇవ్వాళ జాతుల బందిఖానాగా ఉన్నది. ఇది జాతుల ఉద్యానంగా రూపొందాలనేది మార్కిస్ట్ – లెనినిస్ట్ అవగాహన. ఇది ఒకప్పుడు వలసపాలన సంబంధించి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల అవగాహన కూడ. ఒక ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా, ముఖ్యంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వలసపాలనకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కార్మికవర్గం నాయకత్వలోనో, ప్రజాస్వామిక శక్తుల నాయకత్వంలోనో సాగినప్పుడు జాతులు ఆ పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొనే అవకాశం కలుగుతుంది.

సోవియట్ రష్యాలో లెనిన్ నాయకత్వంలో జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా కార్మికవర్గం నాయకత్వంలో పోరాడడానికి 1917లో జాతులు అట్లా సహకరించాయి. ఆ పోరాటంలో పాల్గొన్నాయి. లెనిన్ ఆ జాతులకు ఉమ్మడి శత్రువుతో పోరాటంలో కలిసి రమ్మని చెప్పి, ఆ తరువాత కోరుకుంటే విడిపోవచ్చునని కూడా చెప్పాడు. కార్మికవర్గ ప్రయోజనాలూ, ఫలాలలోనే తమ ఆకాంక్షలూ, ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయనుకున్నంత కాలం అవి కార్మికవర్గ నాయకత్వంలో జాతుల ఉద్యానంగానే వెలిసిల్లాయి. అది బందిఖానాగా మారినప్పుడు విడిపోవడం ప్రారంభించాయి.

బ్రిటిష్ పాలన నాడు కూడా భారత ఉపఖండంలో ఐదు వందలకు పైగా సంస్థానాలు బ్రిటిష్ ఇండియాలో ప్రత్యక్షంగా భాగం కావు. 1950 దాకా కూడా అవి ఢిల్లీ పరిపాలన కిందికి రాలేదు. ఐదు వందల సంస్థానాలలో మూడు మినహా మిగిలినవన్నీ 1950లో భారత గణతంత్ర రాజ్యాంగం అమలు కాలానికి భారత సమాఖ్యలో చేరినవి. అన్నిటికంటే పెద్దదైన హైదరాబాద్ సంస్థానం, కాశ్మీర్, జునాఘడ్ మూడూ చేరడానికి నిరాకరించాయి. మూడిటి మీద భారత ప్రభుత్వం సైనిక చర్యకు పూనుకున్నది. వీటిలో హైదరాబాద్ సంస్థానానికి రాజు ముస్లిం-ప్రజలు హిందువులు అనే సాకు వెతుక్కున్నది. జమ్మూ కాశ్మీరు రాజు హిందువు కావడమనేది అనుకూల అంశంగా మార్చుకున్నది. హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల నెపంతో నలభై వేల నుంచి రెండు లక్షల దాకా ముస్లింలను చంపింది. మూడు వేల మంది కమ్యూనిస్టులనూ, సానుభూతిపరులనూ చంపింది. ఆ విధంగా హైదారాబాద్ సంస్థానంలో ఒక దెబ్బకు రెండు పిట్టలు కాల్చిన చందంగా దురాక్రమణ చేసింది.

నైజాం పాకిస్తాన్లో చేరుతానని అనుకోవచ్చు, స్వతంత్రంగా ఉంటానని అనుకోవచ్చు, ఒక తాత్కాలిక సందర్భంలో హైదరాబాద్ నగర కమ్యూనిస్టు పార్టీ కూడా ఆజాదీ హైదరాబాద్ అనే తీర్మానం చేయవచ్చు. మూడు వేల గ్రామాలను విముక్తం చేసి, పది లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ఎర్రరాజ్యాన్ని చవిచూసిన తెలంగాణ ప్రజలు, ఆ సాయుధ పోరాటాన్ని దీర్ఘకాలికంగా నడిపితే ఎటువంటి జాతి విముక్తి పోరాటానికి దారితీసేదో, వియత్నాం వలె అది జాతి విముక్తి మాత్రమే కాకుండా, విప్లవ పోరాటం కూడా అయ్యేదో, ఇవ్వాళ ఊహించడమే అవుతుంది. ఎందుకంటే, అది భారత ప్రభుత్వ సైనిక దురాక్రమణకే కాకుండా, నాయకత్వం వహించిన కమ్యూనిస్టు విద్రోహానికి కూడా 1951 అక్టోబర్ లో గురయింది గనుక ఇప్పుడేదైనా ఒక స్వీయాత్మక ఊహాగానమే అవుతుంది.

భౌగోళికంగా కూడా తెలంగాణ వియత్నాం వలెనో, కాశ్మీర్ వలెనో కాకుండా, భారత ఉపఖండం మధ్యన ఉండడం వల్ల కూడా ఇది ఊహగానే కనిపించవచ్చు. ఇప్పుడయితే నలభై ఏళ్లుగా భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడుతున్న విప్లవ పార్టీలు అన్నీ భారత కమ్యూనిస్టు పార్టీలుగానే ఉన్నాయి. కనుక, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలన్నీ దేశం నుంచే విడిపోతాయనో, ఇదేదో దేశ విచ్ఛిన్నతకి దారితీస్తుందనో గగ్గోలు పెట్టడమయినా, ఈ కారణంగా కాశ్మీర్ ఆజాదీ ఆకాంక్షను అడ్డుకోవడమయినా జాతీయ దురహంకారమే అవుతుంది. అయితే, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాల సైనిక దురాక్రమణలో 1948 నాటికే స్పష్టంగా వ్యక్తమయిన హిందూత్వ దురాక్రమణ కాంక్ష ఎంత తీవ్రమైనదంటే జాతులను అది మత ప్రాతిపదికననే చూస్తున్నది. అందులోనూ భారత పాలకవర్గాలు హిందూత్వ భావన నుంచే ఇతర దేశాల ఆంతరంగిక విషయాలలో కూడా జోక్యం చేసుకుంటున్నాయి. కాశ్మీర్ భారత భూభాగంలో ఎన్నడూ అంతర్భాగం కాదన్న చారిత్రక వాస్తవాన్ని దేశద్రోహంగా చిత్రీకరిస్తున్న వాళ్లే, 1947లో ఏర్పడిన పాకిస్తాన్ (ఎవరి ఇష్టనిష్టాలు ఎట్లా ఉన్నా) బంగ్లాదేశ్ యుద్ధం పేరుతో తూర్పు పాకిస్తాన్లో తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రోత్సహించడమే కాదు, ముక్తి ఫౌజ్ పేరుతో జోక్యం కూడా చేసుకొని, పాకిస్తాన్ విచ్ఛిన్నం కావడానికి చేయవలసినంత చేసాయి. బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్ష ఒక అంశం. అది బంగ్లాజాతి ఆకాంక్ష. కానీ, దానిని భారత పాలకవర్గాలు, ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రోత్సహించడం మరొక అంశం. వాళ్లే మళ్లీ ఇవ్వాళ కాశ్మీర్ ఆజాదీ ఆకాంక్షలో పాకిస్తాన్ ప్రోద్బలాన్ని చూడడం ద్వంద్వ నీతి.

దేశభక్తి ఒక గుత్తాధికారంగా మారడం దురహంకారం అవుతుంది, ఫాసిజం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోతానని అనడమే దేశద్రోహంగా కనిపిస్తున్న ఆధిపత్య భావజాల వాతావరణంలో కాశ్మీర్ ఆజాదీ ఆకాంక్షను ఆవేశకావేశాలకు లోనుకాకుండా అర్థం చేసుకోవడం కష్టమే కావచ్చు కానీ, అరుంధతీ రాయ్ మాటల్లో చెప్పాలంటే అది కాశ్మీర్ కోసమే కాదు. భారత దేశ ప్రజల స్వేచ్ఛాకాంక్షకు కూడా అవసరమైంది. భారత దేశ భూకా, నంగా ప్రజల ఆకాంక్షలకు కూడా అవసరమైంది.

‘కాశ్మీర్‌ను ఆక్రమించుకున్నాం, అందుకు హిందూ రాజు సమ్మతి మాత్రమే ఉన్నది. కానీ, ప్రజల ఆమోదం కూడా కావాలి’ అని కనీసం 1948 పాలకుల మనసుకైనా తెలిసిన విషయం కాబట్టే కాశ్మీర్‌లో ఐక్య రాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) చేస్తామని భారత ప్రభుత్వం భద్రతామండలికి తెలిపింది. కాశ్మీర్ పండిత్ అయిన జవహర్‌లాల్ నెహ్రూ అప్పుడు భారత ప్రధాని. గాంధీజీ కాశ్మీర్ భవిష్యత్తు కాశ్మీర్ ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పాడు. ఇప్పుడు హురియత్ నాయకుడు ఇంతకన్నా మించి చెపుతున్నది లేదు. గాంధీ, నెహ్రూల వాగ్దానాలను, ఆయా కాలాలలో భారత ప్రభుత్వాలు, ప్రధానులు ఇస్తున్న వాగ్దానాలను నిలబెట్టుకోవాలంటున్నారు.

ఆరంభంలో కాశ్మీరు స్వయం ప్రతిపత్తిని ఆమోదించిన ఆర్టికల్ 370 గానీ, భారత దేశానికి ఉన్నట్టే కాశ్మీరు కూడా ఒక ప్రధానిని గుర్తించడం గానీ, భారత ప్రభుత్వానికి తాను కాశ్మీరు రాజు ఇష్టంతోనే కాని, ప్రజల ఇష్టంతో కలుపుకోలేదనే భావన స్పష్టంగా ఉన్నందు వల్లనే. షేక్ అబ్దుల్లాను కాశ్మీర్ ప్రధానిగా గుర్తిస్తూనే పదకొండేళ్లు భారత ప్రభుత్వ జైళ్లలో పెట్టడం లొంగదీసుకోవడానికేనని స్పష్టమే. ఆ విధంగా 1975 నుంచి షేక్ అబ్దుల్లా కుటుంబాన్ని భారత ప్రభుత్వం తమకనుకూలంగా మార్చుకున్నది. అయినప్పటికీ ఇవ్వాళ కాశ్మీర్‌లో జరుగుతున్న ఎన్నికలను ఏ ప్రజాస్వామిక వ్యక్తీకరణగా సంఘ్ పరివార్ వాళ్లు చెపుతున్నారో అట్లా ఎన్నికయిన ఉమర్ అబ్దుల్లా కూడా కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి, కాశ్మీర్ వివాదాంశం, కాశ్మీర్ విషయంలో కాశ్మీర్ ప్రజలతో పాటు, భారత పాకిస్తాన్ ప్రభుత్వాల త్రైపాక్షిక చర్చలు ఉండాలనడం ఏం సూచిస్తున్నది? పోనీ, కాశ్మీరు ఏ ఎన్నికయిన ముఖ్యమంత్రి అయినా, భారత దేశంలోని ఇంకే రాజకీయ పార్టీ వలైనైనా ఆలోచిస్తున్నారా? నిన్నటి ముప్తీ మొహమ్మదే కావచ్చు, ఇవ్వాల్టి ఉమర్ అబ్దుల్లానే కావచ్చు. వీళ్లు కాశ్మీర్ ప్రజల ఆజాదీ ఆకాంక్షలను వ్యక్తపరచకపోవచ్చు గానీ, కాశ్మీర్ స్వయంప్రతిపత్తి, కాశ్మీర్ వివాదాంశం అనే అంశాలనైనా భారత పాలకవర్గాలకు ఇబ్బందికరంగానే ప్రతిపాదిస్తున్నారు.

మరొక వైపు నుంచి చూస్తే కాశ్మీర్ భారతదేశంలో ఇతర ఇండియన్ యూనియన్లోని మరే రాష్ట్రం వంటి రాష్ట్రమైతే అక్కడ సైన్యం ఎందుకు? ప్రపంచంలో కాశ్మీర్ అంతటి ఏ భూభాగంలోనూ ఇంత సైన్యం లేదు. ఏడుగురు ప్రజలకు ఒక సైనికుడు ఉన్న స్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. తొంభై వేల మంది రాజకీయ ఖైదీలు అంత చిన్న భూభాగంలో, అంత తక్కువ జనాభాలో ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేదు. పాలస్తీనా మినహా బహుశా ప్రపంచంలో ఎక్కడా అరవై వేల మంది సైన్యం చేతిలో చనిపోయిన స్థితి ఉండి ఉండదు. స్త్రీలపై అత్యాచారాలూ, యువకులు, పసిపిల్లల హత్యలూ, అరవై ఏళ్లు జెనోసైడ్ తన ప్రజలనుకొనే భారత ప్రభుత్వం కొనసాగిస్తున్నదా? అది తన భూభాగంలో సహజమైన అంతర్భాగమే అయితే, సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యానికి అక్కడ చట్టం ప్రకారమే ప్రత్యేక అధికారాలు ఎందుకిచ్చినట్టు? ఈ విషయాలన్నీ ఈశాన్య రాష్ట్రాలకూ వర్తిస్తాయి గానీ, మనం ఇప్పుడు కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాం గనుక దానికే పరిమితం అవుదాం.

కాశ్మీర్ ప్రజలు అడిగినప్పుడు అది ఇండియన్ యూనియన్లో భాగమనీ, ఈ రాజ్యాంగానికి లోబడే చర్చలనీ అధికారంలో ఉన్నవాళ్లు అంటున్నారు గానీ, అమెరికా మాట్లాడమన్నప్పుడు భారత – పాకిస్తాన్ ప్రభుత్వాలు కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాయి. నెహ్రూ కాలం నుంచి, ఇందిరా భుట్టోలు అయినా వాజ్ పాయ్ ముషక్రాస్టు అయినా కాశ్మీర్ గురించి మాట్లాడుకున్న వాళ్లే. ఇప్పటికీ ఐక్య రాజ్య సమితిలో అమెరికా భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలను కూర్చోబెట్టి కాశ్మీర్ గురించి మాట్లాడిస్తూనే ఉంది. భారత, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు సడలడానికయినా కాశ్మీర్ సమస్య కాశ్మీర్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా పరిష్కారం కావాలనేది కాశ్మీర్ ప్రజల ఆజాదీ కోరేవాళ్లు మాత్రమే కాదు, మూడు దేశాల ప్రజల శాంతి కోరేవాళ్లు కూడా విజ్ఞతతో అంగీకరించే విషయం.

కాశ్మీర్ ప్రజలు ప్లెబిసైట్ కోసం అరవై ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నారు. అది వివిధ రూపాలలో వ్యక్తమయింది. ఎన్నికల బహిష్కరణగా వ్యక్తమయింది. హురియత్ ద్వారా వ్యక్తమయింది. వివిధ మిలిటెంట్ పోరాటాల ద్వారా వ్యక్తమయింది. ఒక పదేళ్ల పాటు సాయుధ పోరాటంగా వ్యక్తమయింది. ఈ క్రమమంతా మరింత సైన్యం, మరిన్ని కర్ఫ్యూలు, మరింత మారణకాండతో భారత ప్రభుత్వం కాశ్మీర్ ప్రజలను శత్రువులుగా చూసింది. తన ఆక్రమిత ప్రాంతంలో ఉన్న బందీలుగా చూసింది. అయినా, వాళ్లు తమ స్వాతంత్ర్యాకాంక్షను వేల, లక్షల సంఖ్యలో వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటు భారత దేశంలో, పాకిస్తాన్ బూచి చూపి టెర్రరిస్టులుగా చిత్రించి, కాశ్మీర్ ప్రజలను భారత ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేసింది. కాశ్మీర్ భారత భూభాగంలో భాగం అనీ, కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో చేరాలనుకుంటున్నారు అనీ మధ్య తరగతి మనస్తత్వానికి భారత పాలకవర్గాలు నారు, నీరు పోశాయి. కానీ, ఇవ్వాళికీ అత్యధిక శాతం కాశ్మీర్ ప్రజలు కోరుతున్నదల్లా స్వయం నిర్ణయాధికారం. కాశ్మీర్ ప్రజలు అన్నప్పుడు కాశ్మీర్‌లో లోయలోని అధిక శాతం ముస్లింలు కావచ్చు, జమ్మూలోని అధిక శాతం హిందువులు కావచ్చు. లద్దాలోని బౌద్ధ మతస్తులు కావచ్చు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ ప్రజలు కావచ్చు. సరిహద్దుల్లో ఉన్న ప్రజలు కావచ్చు. ఎవరయినా కావచ్చు. వాళ్లందరూ ఒక కాశ్మీరియత్ భావన గల, సూఫీ భావన గల కాశ్మీర్ రాష్ట్రాన్ని కోరుతున్నారు. అందరూ కాకపోయినా అత్యధికులు జమ్మూకాశ్మీర్ గవర్నర్‌గా జగ్ మోహన్ ఉన్న కాలంలో కాశ్మీర్ పండిత్ లను హిందూ భావనతో వేరుచేసే ప్రయత్నం తీవ్రంగా జరిగి కొందరి కాశ్మీర్ పండిలు వెళ్లిపోయి, కొందరు జమ్మూలో శిబిరాలలో ఉండి ఇండియాలోకి వచ్చి ప్రభుత్వ ప్రోత్సాహంతో, సంఘ్ పరివార్ ప్రోత్సాహంతో కాశ్మీర్ ఆదీ భావాలను పాకిస్తాన్ అనుకూల భావాలుగా ప్రచారం చేయవచ్చు. కానీ, శిబిరాలలో ఉన్నవాళ్లు గానీ, బయటికి వెళ్లిపోయిన వాళ్లు గానీ తిరిగి వచ్చి, జమ్మూ కాశ్మీర్ లో తమతో పాటు స్వతంత్రంగా జీవించాలని అక్కడ అత్యధిక ప్రజలు కోరుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో అత్యధిక ప్రజలు ఒక లౌకిక స్వతంత్ర రాజ్యాన్ని ఆకాంక్షిస్తున్నారు.

ఇవి స్వకీయ ఊహలనుకుంటే జమ్మూ కాశ్మీర్ లో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వాలకు అడ్డు వస్తున్నదేమిటి? చివరికి వాళ్ల కేంద్ర ప్రభుత్వం పంపించిన ముగ్గురు మధ్యవర్తులు కూడా కాశ్మీర్ లో ఒక చర్చల వాతావరణం ఏర్పడాలంటే, రాజకీయ ఖైదీలను విడుదల చేసి, సైన్యాన్ని ఉపసంహరించాలని అడుగుతున్నారు. చర్చలలో ఆజాదీ కోరుతున్న వాళ్లనూ, జైళ్లలో ఉన్న వాళ్లనూ, జమ్మూలో కాశ్మీరీ పండిట్ల శిబిరాలలో ఉన్న వాళ్లనూ భాగం చేయలంటున్నారు. ఎవరినీ మినహాయించ వద్దని అంటున్నారు. అట్లాగే, పాకిస్తాను చర్చలలో భాగం చేయాలని అంటున్నారు.

బి.జె.పి. మినహా, సంఘ్ పరివార్ మినహా దేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ ఒక అనుకూల వాతావరణం ఏర్పడి, త్రైపాక్షిక చర్చలు జరగడమే పరిష్కారం అంటున్నారు. అటువంటి బేషరతు చర్చలకు స్వయం నిర్ణయాధికారం ఒక ప్రాతిపదిక కావాలి. అందుకు కాశ్మీర్ ఒక వివాదాంశం అని మొదలు అంగీకరించాలి. ఢిల్లీలో జరిగిన ‘ఆజాదీ మాత్రమే మార్గం’ అనే సదస్సులో హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ వాస్తవానికి ఆజాదీ నినాదం ఇవ్వలేదు. స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడాడు.

కాశ్మీర్ ప్రజలు ఆజాదీ కోరితే ఆజాదీ అనీ, ఇండియన్ యూనియన్లో చేరదామంటే అదేననీ, పాకిస్తాన్లో చేరతానంటే అదేననీ – అక్కడి ప్రజలు ఏది కోరితే దానికి తాము కట్టుబడి ఉంటామనీ, ఆ చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయమన్నాడు. ఆయన కాశ్మీర్ పాకిస్తాన్‌లో చేరాలని కానీ, అక్కడ ఇస్లాం మత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కానీ అనలేదు. ఆయన అన్నదల్లా స్వయం నిర్ణయాధికారం అమలు చేయడానికి సైన్యాన్ని ఉపసంహరించి, సైన్యానికి ఇచ్చిన ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేసి, రాజకీయ ఖైదీలను విడుదల చేసి, ఇది వివాదాంశం, త్రైపాక్షిక పరిష్కారం కావాలి అనే విషయాన్ని గుర్తించి, గత నాలుగు నెలలో జరిగిన 111 సైనిక హత్యల విషయంలో న్యాయ విచారణ జరగాలని మాత్రమే డిమాండ్ చేశాడు.

ఢిల్లీలో రాజకీయ ఖైదీల విడుదల కోసం ఏర్పడిన కమిటీ ఏర్పాటు చేసిన సదస్సులో ఏడెనిమిది వందల మంది కాశ్మీరీ ఆజాదీ ఆకాంక్షలను వ్యక్తం చేసే ప్రజాస్వామ్య వాదులే ఉన్నారు. వాళ్లంతా కాశ్మీరీలు కాదు. దేశంలోని వివిధ ప్రజాస్వామ్య శక్తుల, జాతి విముక్తి పోరాటాల, విప్లవాల ప్రవాహాల నుంచి వచ్చినవాళ్లు. అందులో కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ మాత్రమే కాకుండా, లాల్ , జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో ప్రజాస్వామిక, విప్లవ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే వాళ్లున్నారు. ఆదివాసీ, దళిత, బహుజన ఆకాంక్షల ప్రతినిధులున్నారు. మైనారిటీ ప్రజల ఆకాంక్షల ప్రతినిధులున్నారు. వాళ్లందరూ ఇవ్వాళ భారతదేశంలో లాలడ్ మొదలు విజయనగరం వరకు గ్రీన్‌హంట్ ఆపరేషన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసుల పక్షాన, సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ పోరాట శక్తుల పక్షాన, కాశ్మీర్ ప్రజల ఆజాదీ ఆకాంక్షలకు సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలు ఒంటరిగా లేరని వాళ్లకు, సామ్రాజ్యవాద దళారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత ప్రజలకు ఉమ్మడి శత్రువు ఒక్కరేననీ, అది అమెరికా సామ్రాజ్యవాద అనుకూల భారత ప్రభుత్వమేననీ స్పష్టం చేశారు.

నిన్నటి చరిత్ర నిన్నటి లాగానే ఉండనక్కర్లేదు అనుకున్నా, ఇవ్వాటి చరిత్రను ఎట్లా మలచుకోవాలి అనే నిర్ణయం కూడా చరిత్ర నిర్మాతలైన ప్రజల చేతుల్లోనే ఉంటుంది, ఉండాలి అని భావించే చరిత్ర విద్యార్థులయినా, స్వేచ్ఛా ప్రజాస్వామ్యాలు కోరుకునే వాళ్లయినా, మౌలికంగా గుర్తించవలసింది ప్రజలకుండే స్వయం నిర్ణయాధికారాన్ని. కాశ్మీర్ సందర్భంలో అది ఆయా కాలాల్లో ప్రభుత్వాలు కూడా ఆమోదించిన విషయం. ఇవ్వాళ దేశ భక్తి పేరుతోనో, అఖండ్ భారత్ పేరుతోనో ఆ ఆకాంక్షలను దేశద్రోహంగా భావించడం పాసిజమే అవుతుంది. అది రాజద్రోహమైతే కావచ్చు గానీ, ఆ రాజద్రోహానికి పూర్తి ప్రజామోదం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజామోదంతో రాజద్రోహం చేయడం దేశ ద్రోహం మాత్రం కాజాలదు.

అక్టోబర్ 21న ఢిల్లీలో జరిగిన సదస్సు ఒక విధంగా కాశ్మీర్ ప్రజల పట్ల భారత ప్రజల సంఘీభావానికి అద్దంలో చూపిన కొండలాంటి నిదర్శనం. ఏడెనిమిది వందల మందిలో ఇరవై మంది నుంచి డెబ్బై మంది దాకా మాత్రమే ఆజాదీ ఆకాంక్షను వ్యతిరేకించారు. నినాదాలు ఇస్తూ ప్రతి వక్తనూ అడ్డుకోవడానికి చూశారు. ముఖ్యంగా, సుజాత భద్రో, అరుంధతీ రాయ్ లను. సయ్యద్ అలీ షా గిలానీ సభలో ప్రవేశించి, వేదికపై కూర్చోగానే సభలోకీ, వేదిక పైకీ చెప్పులు విసిరేశారు. గిలానీ పక్కనే కూర్చున్న నామీంచి ఒక చెప్పు వేదికపై వచ్చి పడింది. సభలో నిర్వాహకులకు కూడా చెప్పులు తాకాయి. సభలో ఒక అరవై ఐదేళ్ల మహిళ పదే పదే వక్తలను అడ్డుకున్న సమయం సయ్యద్ అలీ షా గిలానీ మాట్లాడిన సమయం కన్న ఎక్కువ. అంటే, పదిశాతం మంది మొత్తం సభను నినాదాలతో, చెప్పులతో భంగపరిచే ప్రయత్నం చేసినా తొంభై శాతం మంది సంయమనంతో స్వయం నిర్ణయాధికార ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సహనమే సంస్కృతి అని చెపుతున్న వాళ్లకు ఎవరు సహనం ప్రదర్శించారో, ఎవరు సంస్కారంగా వ్యవహరించారో బహుశా ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినవాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే, దురదృష్టమేమిటంటే, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం సదస్సును ఆసాంతం దృశ్యీకరించవచ్చు కానీ, తను చూపదల్చుకున్నదే చూపుతుంది గనుక, వాస్తవాలు ప్రజల దృష్టికి రాకపోవచ్చు. కానీ, తమకు తాము ఆ మీడియా, పాలకవర్గాలు, ప్రభుత్వం చూసుకోవచ్చు. ఇదే ఇవ్వాళి ఐరనీ, లేదా, విరోధాభాసం. దేశంలో గానీ, కాశ్మీర్‌లోగానీ ప్రజల ఆకాంక్షలేమిటో పాలకవర్గాలకూ, ప్రజలకూ తెలుసు. కానీ ఆ ప్రజలకే ఆ పాలకవర్గాలు తాము కోరుకుంటున్నదీ, అనుకుంటున్నదీ అత్యధిక ప్రజల అభిప్రాయమని చెప్పడానికి ఎల్లకాలం ప్రయత్నిస్తుంటారు.

ఇవ్వాళ ప్రజాస్వామ్యంలోని మూడు స్తంభాలే కాకుండా, మీడియా అనే నాలుగో స్తంభం కూడా ఆ అబద్దాన్ని నిజం చేయడానికే కంకణం కట్టుకున్నదనేది చాలా స్పష్టం. అంత మాత్రాన ఇవ్వాళ అణచబడిన ఆకాంక్షలు ఎల్లకాలం అణగిపోయే ఉండవు. అవి ఎప్పుడో తప్పకుండా విస్ఫోటనం అవుతాయి. అంత దూరం రాకుండానే ప్రజల స్వేచ్ఛా ప్రజాస్వామిక భావాను గౌరవించి, మన్నించడం శాంతి కాముకులైన ప్రజాస్వామ్య వాదుల కర్తవ్యం. అది, భారతదేశానికీ వర్తిస్తుంది, కాశ్మీర్ కూ వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది.

  • 29 అక్టోబర్, 2010.

జననం: వరంగల్లు జిల్లా లోని చిన్నపెండ్యాల. ఉద్యోగరీత్యా వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు (Friends of Literature) స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు కార్యదర్శిగా పనిచేశాడు. 1983లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా, 1993 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. రచనలు: చలినెగళ్లు (1968), జీవనది (1970), ఊరేగింపు (1973), స్వేచ్ఛ (1977), స్వేచ్ఛ (1977), భవిష్యత్ చిత్రపటం (1986), ముక్త కంఠం (1990), ఆ రోజులు (1998), ఉన్నదేదో ఉన్నట్లు (2000), ఉన్నదేదో ఉన్నట్లు (2000), బాగ్దాద్ చంద్రవంక (మార్చి 2003), మౌనం యుద్ధ నేరం (ఏప్రిల్ 2003).

Leave a Reply