కాలాన్ని నిలబెట్టే ప్రయత్నం…

కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీతగా కాకుండా మెర్సి మార్గరెట్ గారిని ఒక సాదాసీదా కవిగా అనుకుని ఆమె ‘కాలం వాలిపోతున్న వైపు’ పుస్తకాన్ని చదవడం ప్రారంభించి, చివరి పేజీ పూర్తిచేసే సమయానికి చాలా గొప్పగా అనిపించింది. చక్కని వ్యక్తీకరణలు, అవసరానికి సరిగ్గా పొందే పదాలు చిన్న వ్యక్తీకరణల్లో సూటిగా చెప్పిన విషయం వంటివి ఆమె కవిత్వంలో చెప్పుకోవాల్సిన ప్రత్యేకతలు.

మొదటి పేజీలోనే…
‘ఇరు దేహాల మధ్య
ఒకే సామీప్యం
ఒకే ఏకాంతం
ఒకే నిశ్శబ్ధ సామూహిక మూల్గుల రోదన’ అంటూ సూటిగా చెప్తూ కాలం వాలిపోతున్న వైపు చూపు సారించమంటారు.

‘ఎంతటి ఆశ ముడుచుకుపోయే దేహానికి ముడతలు పడ్డ ఇంటికి దొంగిలించిన రెండు కిరణాల్ని జేబులో పెట్టుకొని దారంతో కుట్టేస్తూ
ఉదయానికి విత్తనాన్ని నాటాలనే ఆశ’ అనడంలో ఈ యాంత్రిక జీవనంలో చిన్నచిన్న కోరికలే గొప్ప ఆశలుగా మిగులుతాయని చెప్పడం.

మెర్సి మార్గరెట్ ఈ పుస్తకంలోని చాలా చోట్ల దేశభక్తి మిథ్ ను డి-కన్ స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేశారు.
దేశం అంటే కేవలం భూమే అనే హిందుత్వ ఫాసిస్ట్ శక్తులు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో దేశమంటే మనిషి, అతనికి సంబంధించిన అస్తిత్వం అని కుండబద్దలు కొడుతుంది ఆమె కలం.

‘దేశానికి కళ్ళుoడవు
మనిషి కళ్ళు వందలు వేలుగా మారి
దేశాన్ని స్వప్నంగా బొమ్మగా గీస్తాయ్’ అని, కశ్మీర్ సందర్భంలో ప్రజల సామూహిక అసమ్మతిని ‘రొట్టెబొమ్మ’ కవితలో అక్షరీకరిస్తూ,

‘ఒక సామూహిక గీతం
ఇప్పుడే రొట్టెలా మారింది దాన్ని ఆకలి చేతుల్లో పెట్టి సినిమా ప్రదర్శన ముందటి వేషధారణని
బహిష్కరించు’ అంటారు.
మరో చోట కూడా దేశభక్తి కంటే మంచితనమే గొప్ప అని చెప్తారు.

‘నువ్వెప్పుడైనా పాట పాడావా?
బుగ్గలమ్ముకునే అమ్మి శ్వాసనాలంలా
మేస్త్రి అన్న చేతి పొక్కుల చర్మంలా
బుడగ జంగాలక్క పాత బట్టల బుట్టబరువులా
బీడిచుట్టే చిన్నారుల చేతివేగంలా’ అంటూ,

‘పేటీఎం యాప్ లా
ప్లాస్టిక్ కార్డు అంకెలా మారబోతున్న
దేశభక్తుడా
దేశభక్తిగీతం కన్నా ముందు మనిషి పాట పాడు
ఒక్కసారి ఒకే ఒక్కసారి రక్తమాంసాల పాట పాడు’ అని స్పష్టంగా దేశభక్తి ఈజ్ లెస్ దాన్ మనిషితనం అని ప్రకటిస్తారు.

దేశభక్తి మీది మరికొన్ని వాక్యాలు ‘వాళ్లు మళ్లీ మోసపోయారు’ లో కనిపిస్తాయి.

‘కొందరుంటారు
దేశభక్తిని
ఉదయాన్నే చదివిన వార్తా పత్రికని చేసి
చంకలో పెట్టుకు తిరిగే వాళ్లు’

‘దేశభక్తిప్పుడు
బ్యాంకు లైన్ల దగ్గర కుళాయిలా మారి పంపిణీ అవుతుంటే పడిగాపుల చూపుల విస్తళ్లలో మాకింత భవిష్యత్తునియ్యండని దీనంగా అడిగే ఈ దేశపు సగటు జీవులకు చూడలేనివాళ్లు’ అంటూ దేశ భక్తి పేరిట జరుగుతున్న పీడితుల ఎలియనేషన్ ను ఆర్ద్రంగా చెప్తారు. ఈ పీడితులే ‘దేశపు వెన్నముకకు సమాంతరంగా రెండుచేతులై నిలబడే వాళ్ళు, వాళ్ళు మళ్ళీ మోసపోయారు’ అంటారు.

నిరుపేదలకు దేశం ఎట్లా పరాయి అయిపోయిందో చెప్తూ,

‘డొక్కేండిన బక్కతాతకి దేశమాత
ఎప్పుడూ చుట్టం కాదు ఓటేసిన ప్రతీసారి
అతని వేలుపై స్నానమాడిన దేశభక్తి
ప్రజాస్వామ్యాన్ని పరిత్యజించి నోటుస్వామ్యంగా మారుతున్నప్పుడు
ఆ బక్కతాతకి
కన్నీళ్ల పాఠం కొద్ది కొద్దిగానే అర్థమైనట్టుంది’ అంటారామె. నిజమే, అంతరాలు ప్రారంభమైనాక మానవ నాగరికత నిండా పేద కడుపులకు దేశం ఎప్పుడూ పరాయిదే. ఏనాడు ఈ దేశం వాళ్లను అక్కున చేర్చుకున్నది లేదు.వాళ్ల రూపాన్ని, వాళ్ళ స్పర్శను, వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళ అస్తిత్వాన్ని అసహ్యించుకొని,వాళ్లను నిషేధించి, వాళ్ళను అంటరాని సమూహంగా చేసింది ఈ దేశమే.
ఇదే అర్థాన్నిస్తూ రాజ్యస్వభావాన్ని వివరిస్తారు ‘రాజ్యమా ఉలికిపడకు’ లో.

‘కన్నీళ్లు
కరెన్సీనోట్ల ముందు మంచుగడ్డలై మౌనం వహిస్తుంటే
కుబుసం విడిచిన రాజ్యం
కొత్త నవ్వులు నవ్వుతుంది’

నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశమంతా హిందూత్వ బ్రాహ్మణీయ దౌర్జన్యాలు పరుచుకున్న విధానాన్ని రెండు వాక్యాల్లోనే చెప్తారామె.

‘ఆశలని మోసిన భుజాలు ATM లముందు
కనబడని శిలువతో కూలబడుతుంటే
అచ్చేదిన్ స్టాంపును వీపులపై ముద్రిస్తూ
కాషాయపు చువ్వలు
రాజ్యమా ఉలికిపడకు
నీ ఓటే అది కళ్ళు పెద్దవి చేసిచూడు’ అనే వాక్యాలు వివిధ రూపాలలో ఈ ఆరేళ్లలో నోట్ల రద్దు నుంచి 370 రద్దు దాకా అనేక కాషాయపుచువ్వల ప్రయోగాలను కళ్ళ ముందుంచుతాయి.

ఇక కులాన్ని నిరసిస్తూ చాలా కఠినంగా రాసిన వాక్యాలూ ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మనిషిని మనిషిగా కాకుండా బానిసగా, హీనంగా చూసిన వేలాది సంవత్సరాల కులం, దానికి బాసటగా నేటికీ నిలిచి వస్తున్న మనుధర్మం ఇంకా వెలి జీవితాల మీద ఉరితాడై వేలాడుతూనే ఉన్నాయి. ‘మనువు గాడి నోట్లో ఉచ్చ పోయమ’ని కసిగా పిడికిలెత్తినా, దళితసమాజం ఇంకా ఇంకా మనుధర్మాన్ని తుత్తునియలు చేయడానికి పోరాటాలు కొనసాగించాల్సే వస్తున్నది. ఈ మనుధర్మాన్ని వదిలించుకునే ప్రయత్నాలకు తాను కూడా చోదకమవుతానని

‘ఇప్పుడు నా చేతులు చాపుతున్నాను
నరికిన నా చేతులిప్పుడు భూమిని చీల్చే ఆయుధాలు తెగనరికిన నాల్కలు వారికి ఆసరాగా స్వస్థతనిచ్చే అగ్నికీలలు
వివస్త్రను చేసిన అస్తిత్వానికి నేను కప్పబడ్డ వస్త్రాన్ని విముక్తి గీతం ఎత్తుకొని ముందుకు నడుస్తున్న కేతనాన్ని
రండి నాలో మీరు కూడా ఐక్యం కండి
ఒక కొత్త విప్లవగీతంలా పునరుత్థానం చెందుదాం’ అని చెప్తూ ఆ దిశగా సాగే ఉద్యమాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ‘నిశ్శబ్ద శిలను దాటడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో వాళ్లే వినిపిస్తున్నారు’ అని కులంతో మోసగించబడిన వాళ్ల తో సహానుభూతి చెందుతున్నారు.

మెర్సి గారి కవిత్వం లో కులం కోణం ఇది.
పుస్తకంలో జెండర్ అంశాలను ఎత్తిపట్టిన కవితలు కూడా ఉన్నాయి.
రజస్వలవడం నుంచి లైంగికంగా స్త్రీపై పురుషాధిక్య సమాజం ఎంతగా మానసిక దాడి చేస్తుందో కళ్ళు చెమర్చేలా చెప్తారు. స్త్రీత్వం ఫిజికల్లీ కాంక్రీట్,ఫిలాసఫికల్లి అబ్ స్ట్రాక్ట్ అనే మిథ్యా భావనను ఫెమినిస్ట్ సైన్స్ ఎంతగా తుత్తునియలు చేసిందో దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. స్త్రీత్వం ఫిలాసఫికల్ గా కూడా కాంక్రీటే అనడానికి పురుష స్వామ్యం స్త్రీపై స్త్రీత్వాన్ని రుద్దే అనేక సందర్భాలను ఉదాహరణలుగా చూపించిందా సైన్స్.

‘చేతుల మీద మొలిచిన తెల్లటి దట్టమైన వెంట్రుకలు
నా భుజాలపై మొలిచిన
రెండు రెక్కలు
కూర్చొనివ్వక నిలబడనివ్వక ఒక ఆశ్చర్యం
సలుపుతున్న దేహం గురించిన ఒకానొక దుఃఖానందం’

ఎంత అద్భుతమైన వ్యక్తీకరణ ఇది!
‘రాత్రంతా ఏ దేవదూత తోనో కలిసి ఒక అద్భుతలోకం లో సంచరించిన కల’ లాంటి ఆనందమయమైన ఘటనగా దాన్ని వర్ణిస్తారు.
కానీ ఆ స్త్రీత్వం పై ఎన్ని ఆంక్షలు ఉంటాయో కూడా చెప్పారు.
ఈ ఆంక్షలు ఏమిటని ప్రశ్నిస్తే ధ్వంసం చేయబడ్డ తన స్త్రీత్వపు శైథిల్యాలను చూపిస్తుంది తల్లి.

‘అంతే..
అమ్మ తన భుజాలపై కప్పుకున్న పై వస్త్రం తొలగించింది
నేను చూసాను
విరగ్గొట్టబడ్డ రెక్కలతో అమ్మ కళ్ళలోoచి కారుతున్న నీటితో అమ్మ’

జీవితమంతా అణిచివేతే అయిన స్త్రీ జీవితం లోని ప్రాథమిక కష్టాన్ని విడమరచి చెప్పారు ఈ ‘రెక్కల ఆకాశం’లో.

మరో చోట కూడా ఇలాంటిదే.. బ్లీడింగ్ ను శరీరం మీదికి ఆహ్వానిస్తూ, ‘హ్యాపీ టు బ్లీడ్’ ఉద్యమ నేపథ్యంలో,

‘వాళ్ల గర్భం స్రవిస్తున్న రక్తం ఎండిన నేల పై మానవ బీజం మొలకెత్తిస్తూ
కాళ్ళమీదుగా పిరుదులపై నుంచి కారుతున్న రక్తoతో రక్తపుటడుగులు వేస్తూ
మరో ప్రపంచం వైపు నడుస్తున్నారు వాళ్ళు’

అని స్వాభిమాన ప్రకటన చేస్తారు.

‘చూడండి వాళ్ళముందు వాళ్లకు అడ్డు చెప్పలేక
గుడి గోడలు వణుకుతూ కూలుతున్నాయి’

అంటూ బ్లీడింగ్ ని అసహ్యించుకుని, మూడు రోజులపాటు దూరముంచి,రక్తం అంటూ ముక్కులు చీదిన బ్రాహ్మణీయ భావజాలాన్ని బద్దలుకొట్టేలా ‘గుడిగోడలు కూలుతున్నాయి’ అంటూ ధ్వంస రచనకు బీజం వేస్తారామె.

పుస్తకంలోని ఈ దేశభక్తి, కులం, జెండర్ అంశాలు చాలా శక్తివంతంగా గా కనిపిస్తాయి.అయితే వీటితోపాటు మరికొన్ని కవితలు కూడా పురోగామి అంశాలను ప్రతిబింబింప జేస్తాయి.

నిజాలను,నిజ జీవితాలను పాశవికంగా అణిచి వేస్తున్న వర్తమానంలో ఊహలే సురక్షితం అంటారు.

‘ఇప్పుడు
కానీ ఖరీదు చేయనివి ఊహలే యేమో
రేపు
వాటిపైనా
తుపాకుల కళ్ళు మొలవచ్చు’ అని ఊహలనూ వదలని ప్రమాదం మున్ముందు రాకపోదని హెచ్చరిస్తారు.

బందీ అయిన జీవన ప్రయాణాన్ని స్వేచ్ఛా విపణిలో నిలిపే క్రమంలో ఎదురయ్యే అనేక నిషేదాల్లోంచి ప్రతిసారీ స్వేచ్ఛకు అర్థాలు నిర్వచనాలు మారుతూ మరింత శక్తివంతమై వస్తుంటాయి.

‘స్వేచ్ఛ
పక్షిలానో నదిలానో ఆకాశంలానో రూపుదాల్చడమంటే
విధ్వంసం గావింపబడ్డ తర్వాత శకలాలుగా మిగిలిన అక్షరాల్లోoచి
ఓ కవిత కొత్త దేహాన్ని తొడగడమే’ అంటారు.
అక్షరాలను నిషేధించిన కాలంలో నిషిద్ధ దేహాలను విత్తి నిరంతరo మొలకలు గా మారుద్దామంటారు.

‘మనం వదిలొచ్చిన దారుల్లో
వెలుగు జాడలు
ప్రశ్నల్ని అలలు అలలు గా కంటూనే ఉంటాయి
మనం నిషిద్ధ దేహాల్ని విత్తనాలు చేద్దాం’

మరోచోట…

‘నువ్వొదిలొచ్చిన అక్షరాలు నీ నీడలా మిగిలిపోతే
నువ్వూ (నిన్ను అనుసరిస్తూ నడిచి వేడెక్కిన) నీటిబుడగ ఒకేసారి పగిలిపోతారు సిరా అయిపోయిన కలాన్ని
కాలం తన సంచిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుంటుంది’ అంటారు.మనిషిగా, కవిగా, రచయితగా ఏ సందర్భంలో అయినా బాధ్యతారాహిత్య స్థితి పతనానికి బాటలు వేస్తుందని చెప్తారు.

రాస్తూ పోతే ఒక్కో కవితకు ఒక్కో విశ్లేషణ,చాలా చోట్ల ప్రతి వాక్యంలోపలి భావార్ద్రతలను మనిషితనపు చెమటవాసనలకు తూకం వేస్తూ ప్రతి అక్షరంలోనూ నిర్నిబంధితంగా అట్టడుగు ప్రజల పక్షపాతాన్ని బహిర్గత పరిచవచ్చు.ఇప్పటికైతే జ్వలిత,ప్రెగాన్యూస్ వంటి మంచి అర్థవంతమైన కవితల పైన కూడా రాయాలని మరీమరీ ఆసక్తిగానే ఉంది కానీ ఇంకాఇంకా రాయాలనిపించే పుస్తకంలోని అనేక స్థలాలను స్పృశించలేక స్థలాభావంతో ఇక్కడికి ఆపివేయదల్చుకున్నాను.

లోపాలు కాదుగానీ ముగించే ముందు కొన్ని పరిమితులను, నా కళ్ళకే కనిపించాయేమో గానీ కొన్ని ఖాళీలను చూపించదల్చుకున్నాను.

1) కొన్నిచోట్ల రాసేధార(flow) లో ప్రమత్తత వల్ల మార్గం, భావం విషయంలో చాలామంది కవులు దారి తప్పే అవకాశముంటుంది. బ్యాలెన్సింగ్ కత్తి మీద సాము. అందులో కాస్త ఏమరుపాటుగా ఉన్నా సరే, మార్గాన్ని బైపాస్ చేసే అర్థాలు ముప్పిరిగొంటాయి. మెర్సి మార్గరెట్ గారి పుస్తకం చదువుతున్నంతసేపూ ఆమె రాతల్లోని ధైర్యం,మొండితనం అనేకచోట్ల కనిపించాయి. అయితే బహుశ పైన చెప్పిన ప్రమత్తతే కారణమేమో గాని ఒకచోట ఆ ధైర్యం నుంచి కాస్త పక్కకు జరిగినట్టు కనిపిస్తుంది.

సమకాలీనంగా నిరంతరం ఆవరించే నిరాశల పట్ల దుర్మార్గపు వ్యవస్థల పట్ల విసుగెత్తినప్పుడు పారిపోవడం అనే escapism చాలాసార్లు మనసును ఆవహిస్తుంది.కానీ జీవితంలోని ఎంతటి ప్రతికూల పరిస్థితులలోనైనా escapism పరిష్కారాన్ని చూపించదు. పైగా సమస్యను మరింత జఠిలం చేసి శత్రువును బలోపేతం చేస్తుంది.ఇంతింతై బలపడే శత్రువును ఎదుర్కోవడo పారిపోయిన అడుగు నుంచే ప్రారంభించినా చాలా కష్టమైన పని. కానీ ఓ చోట తప్పిపోవడం బాగుంటుందని చెప్తారామె.

‘అప్పుడప్పుడు
భవిష్యత్తు అరణ్యమైన చోట నక్షత్రాల దారుల మధ్య తప్పిపోవడం బాగుంటుంది’ అనీ,
‘మానవత్వం మరిచిన తావుల్లో
మొలిచిన గచ్చుపొదల్ని చూసి దాక్కోవాలనుకోవడం సమంజసంగానే అనిపిస్తుంటుంది’
అనీ,
దారి తెలియని అరణ్యాలను, అమానవీయత నుంచి జనించిన గచ్చుపొదలను వదిలేసి తప్పిపోవాలని, దాక్కోవాలని కోరుకోవడం ఆశ్చర్యం కలిగించిననూ, వెంటనే సర్దుకుని,

‘అప్పుడప్పుడు
మనిషి మట్టివాసనేసే చోటుకి రెక్కలు తొడిగిన మొక్కలా కాళ్ళోచ్చిన మేఘంలా మాట్లాడే మట్టిపలకలా రూపాంతరంచెంది తప్పిపోవడం బాగుంటుంది’ అని సవ్యమైన దారిలోకి వచ్చేస్తారామె.

2) నాకున్న బలమైన నమ్మకం ఏమిటంటే భాష,శైలి, భావం మూడూ ఎంత సరళంగా ఉంటే కవి పాఠకునికి అంత చేరువ అవుతాడు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి సంక్లిష్టమైననూ వారిద్దరి మధ్య పూడ్చుకోలేని అగాధం ఏర్పడిపోతుంది. ఇది అనేకసార్లు,అనేక కవుల, రచనల సందర్భంలోనూ నిరూపించబడిన విషయం. మెర్సి గారి భాష చాలా సరళం.అయితే చాలా చోట్ల ఒక వాక్యం నుంచి ఇంకో వాక్యానికి వెళ్లే సమయంలో కొన్నిసార్లే అయినా భావంలో కొన్ని చోట్ల లుప్తత,కొన్ని చోట్ల అస్పష్టత,కొన్ని చోట్ల వెనకది,మళ్ళీ మళ్ళీ ముందుది చదవనిదే అర్థంకాని అసందిగ్ధతలు కనిపిస్తూoటాయి. మచ్చుకొకటి. నవతెలంగాణ వాళ్ళు అచ్చువేసిన ‘కలకనపడని చోట!’ లో

‘ఉదయం మంచుతెరలను నీ శ్వాసతో కత్తిరిస్తూ సూర్యునిపై కేకలేస్తుంటే పోటీనిస్తున్నావనుకున్నా పావురమా..!’
తోపాటు పావురమా..! అంటూ చెప్తూ పోయినప్పుడు ఆ క్రమమంతా చివరి పంక్తులకు చేరనిదే మొదట్లో,మధ్యలో స్పష్టమైన భావాన్ని పంచలేకపోయింది.

3) పుస్తకం లోని అనేక కవితలలో బాధాతప్తుల కన్నీళ్లను బాధ్యతాయుతంగా సృజించారు.అయితే కన్నీళ్లు లేని సాఫీ కవితల స్థానే కన్నీళ్లను, వాటిని నింపుకున్న మనుషుల వృత్తాంతాలనే చేర్చిఉంటే పుస్తకానికి మరింత చెమటవాసన చేరి ఉండేది.

మొత్తంగా ‘కాలం వాలిపోతున్న వైపు’ ఒక మంచి పుస్తకం.సాహితీ స్పృహ ఒకటిలో వెయ్యోవంతు ఉన్న వారు కూడా వదలకుండా చదవాల్సిన పుస్తకం.ఆ మాత్రమూ లేని వాళ్లనూ వదలకుండా చదివించాల్సిన పుస్తకం.కవిత్వ ప్రక్రియ పట్ల బాధ్యతగా రాస్తున్న మెర్సి గారు తన కవితలోనే చెప్పినట్లుగా,

‘రాతి యుగాలను దాటొచ్చి ఉనికి కోసం కాలం వేళ్ళ కింద తడితడిగా మిగిలిపోయే చరిత్రను
చేతుల్లోకి తీసుకుని డేర్సూ ఉజాలలా
మంచుకాలాల
దట్టమైన అడవి మధ్యన దీపంలా
బతికింది బతికించిందీ కవిత్వమే’

అందుకే కవిత్వం రాయాలి. రాసింది అందరితో చదివించాలి. చదివింది అందరితో కలిసి ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణే కవిగా మన కవిత్వానికి గీటురాయి అవుతుంది. ఆ ప్రయత్నంలో మెర్సి గారు సఫలీకృతులవ్వాలని ఆశిస్తున్నాను.

(మెర్సి మార్గరెట్ గారి ‘కాలం వాలిపోతున్న వైపు’ పుస్తక సమీక్ష…)

పెద్దపల్లి జిల్లా మంథని. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వివిధ పత్రికలు, ఆన్లైన్ మ్యాగజీన్ లలో దాదాపు 300 వ్యాసాలు, 50 కవితలు ప్రచురితమయ్యాయి.

2 thoughts on “కాలాన్ని నిలబెట్టే ప్రయత్నం…

  1. మెర్సీ కవిత్వంలో చురకలు చాలా వరకూ మంట పుట్టిస్తాయి..ఆలోచింపజేస్తాయి.కొన్ని రాతల్లో ఎందుకిలా రాస్తుందీమె, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా అని అప్పుడప్పుడూ కొంచెం బాధ కలుగుతుంది. ఏమైనా పుష్కలమైన చిక్కని కవిత్వాన్ని ఆస్వాదించగలం. మరిన్ని అద్భుతమైన రచనలను మెర్సీ కలం నుండి ఆసిస్తూ….చిన్నారి

  2. Breathtaking, soul-stirring, and thought-provoking! Mercy challenges the social status quo with words gentle and yet profound

Leave a Reply