కొ.కు – ‘కాలప్రవాహపు పాయలు’

ఇది కథ మీద విశ్లేషణ కాదు. కథ గురించిన విమర్శ కాదు. ఈ కాలానికి ఆ కథ ప్రాసంగికత ఏమిటి? దాన్ని మనం ఏ రకంగా అన్వయించుకోవచ్చు అన్న విషయాన్ని చెప్పడానికి ఈ ఆర్టికల్ రాస్తున్నాను. ఇలాగే ఇంకొన్ని కథలు ఎంచుకొని ఆ కథల ప్రాసంగిత గురించి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకుంటాను.

‘కాలప్రవాహపు పాయలు’ కథ ఆడియో ఈ కింది యూట్యూబ్ లింక్ లో వినండి:

ఈ కథలోని కాలపరిధి ఒక రాత్రి. ఇది నిజంగా జరిగిందా? లేక పాత్ర ఆలోచనలకు ఇచ్చిన అక్షర రూపమా? అంటే ఇతమిద్ధంగా చెప్పలేం. హేరీ పోటర్ సీరీస్ లోని చివరి పుస్తకంలో ఒక వాక్యం ఉంటుంది. Of course it is happening in your head, Harry, but why on earth should that mean that it is not real? అని. మన ఆలోచనల్లో ఉన్న ప్రతి అంశానికి కూడా వాస్తవ భూమిక ఏదో ఒకటి ఉంటుంది. నా వరకు నేను, మనిషిలోని అనేక వ్యక్తిత్వాలలో ఒక రెండు పార్శ్వాలకు రూపమిచ్చి, ప్రయోగాత్మకంగా చర్చ సాగించినట్టు భావిస్తున్నాను.

ప్రయోగం వరకూ సరే. ఒక ఇద్దరు వ్యక్తుల జీవితం ఒకటే కావడం, అది తర్వాత విడిపోయి, వేర్వేరు దిశలో ప్రయాణించడం – అది నిత్య జీవితంలో సాధ్యమా?
జీవితం అనేక అనుభవాల సమాహారం అనుకున్నట్టైతే, మన ఎంపికలు మన అనుభవాల్ని నిర్దేశిస్తాయి అనే కార్యకారణ సంబంధాన్ని కూడా ఒప్పుకుంటే, ఒకేలాటి ఆలోచనల్ని కలిగి, ఒకే ఆశయాల్ని నమ్మి, ఒకే పరిసరాలలో ఉన్న వ్యక్తుల అనుభవాలూ, తద్వారా వారి జీవితాలూ – దగ్గర దగ్గరగా ఒకేలాగా ఉండవచ్చు అన్న హైపోథిసిస్ మీద ఈకథని అన్వయించుకోవచ్చుననుకుంటా. ఇంట్లోని చిన్న పిల్లలందరికీ – ఎవరి స్వంత ఆలోచన మీద వారి జీవితాల్ని వారు నిర్ణయించుకునే దాకా ఒకే ఇంట్లో ఒకే వాతావరణం, సుమారుగా ఒకే రకమైన అనుభవాలూ ఉంటాయనేది నమ్మదగ్గ విషయమే కదా. అలాగే 24ఏళ్ల వయసులో
కథలో ఉన్న ఇద్దరు పురుషోత్తాలు – రెండు అస్తిత్వాలు, entities, రెండు తత్వాలకు ప్రతీకలు. ఒకప్పుడు కలిసి ఉన్న రెండు వ్యక్తిత్వాలు (personalities) – వేర్వేరు దిశల్లో, వేర్వేరు మార్గాల్లో 25 సంవత్సరాలు ప్రయాణం చేసాక ఒకరికొకరు ఎదురైతే ఆ కలయిక ఎలా ఉంటుంది? ఏయే అంశాలు బయటపడతాయి? అన్నది కథాంశం. దానిని కథ శీర్షిక ఎటూ సూచిస్తూనే ఉంది. కథలో కొకు ఒక చోట రాస్తారు కూడా… కాల ప్రవాహపు మరొక పాయలో కొట్టుకుపోయి మరొక పరిణామానికి గురి అయింది అని.

ఆ అస్తిత్వాల ప్రధాన లక్షణాలేమిటి? అవి విడిపోయిన సందర్భం ఏమిటి? అన్న సంగతి వివరంగా చూద్దాం.

ఒక పాయ పురుషోత్తం. 50ఏళ్ల వాడు. అతని గురించి అతని మాటల్లో చెప్పాలంటే “వ్యాపారంలో పుష్కలంగా డబ్బొస్తోంది. ఇంకా మూడు తరాల వరకూ తన కుటుంబానికి ఢోకా లేదు. రాష్ట్ర మంత్రుల్లో తనకి భాయీ భాయీగా ఉండేవాళ్లు ముగ్గురున్నారు. అంచేత పలుకుబడికేం లోపం లేదు. మనిషి కోరదగ్గవన్నీ తనకున్నాయి” ఇతన్ని ఇప్పట్నుంచీ పురుషోత్తం1 అందాం.

మరొక పాయ పురుషోత్తం 2. ఒకప్పుడు దుర్భర దారిద్ర్యం అనుభవించాడు. అతని దరిద్రం అతని ఒక్కడిదనే నమ్మడం తనను తాను వంచించుకోడమే అని గ్రహింపునకు వచ్చింది. ఆ ఎరుక రావడంలో అతని భార్య పాత్ర కూడా ఉంది. ఇద్దరూ కలిసి సోషలిస్టు సాహిత్యం చదివారు. దానితో జీవిత సంఘటనలు పరస్పర సంబంధం గలవన్న విశ్వాసం కుదిరింది వారికి. ప్రెస్‌లో చేరాడు. ప్రెస్ వర్కర్ల యూనియన్ నాయకుడయ్యాడు. రాజకీయాల్లో ప్రవేశించాడు. ఎం.పీ అయ్యాడు.

ఇద్దరు పురుషోత్తాలూ వారు గడిపిన 25సంవత్సరాల గురించి మాట్లాడుకునే క్రమంలో- ‘పవర్‌’లో మంచిని వెతికే అవకాశవాద సిద్ధాంతాల ప్రవచనకర్తలను కొకు ఇలా హేళన చేస్తారు. – సత్యం గురించి ఎవరో వెటకారంగా పద్యాలు రాస్తే ఎన్నోసార్లు చదివి స్నేహితులతో ఆనందించావు. నువూ నీ స్నేహితులూ శాంతిని గురించి వేళాకోళంగా మాట్లాడుకున్నారు. నీ సంస్కారం ఏమిటి? నీ విశ్వాసాలకు పునాది ఏముంది? రేపు పోలీసుల చేతుల్లో తుపాకులు కమ్యూనిస్టు తుపాకులవుతే కమ్యూనిజంలో ఎంతో మంచి చూస్తావు నువు.

తాము నమ్మిన సిద్ధాంతాల గురించి చర్చకు సిద్ధమవగలగడం, ఒక ఉన్నత విలువగా కొకు ప్రతిపాదిస్తారు. సిద్ధాంతాల గురించి, ఆదర్శాల గురించి చర్చ రాగానే – మేమింతే, మాకిలాగ అనిపిస్తోంది, మేము మా వ్యక్తిగత పరిధిలోంచే దేనిపైనైనా స్పందిస్తాం, వ్యాఖ్యానిస్తాం– అనే తప్పించుకోజూసే వ్యక్తులుంటారు. వారి నుద్దేశించే కొకు ఇలా అంటారు. “అయితే అభిప్రాయాలు ప్రకటించకు. నీ అజ్ఞానం నాకు శాసనమైతే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడు.”

     **  **  **

పురుషోత్తం1- పాతికేళ్ల తన ప్రస్థానాన్ని ఒక తపస్సుతో పోలుస్తాడు. అంతకు ముందున్న అయోమయం వదిలిపోగానే, అతని జీవితం హైరోడ్డు పట్టిందంటాడు. అప్పటి నుంచి తన గమ్యస్థానాన్ని స్పష్టంగా, నిశ్చలంగా చూడగలిగాడట. తప్పుడు ఆశయాలనూ, తనకు పనికిరాని భావాలనూ, వ్యక్తులనూ, అలవాట్లనూ, విశ్వాసాలనూ దూరంగా ఉంచగలిగాడట. ఈ తపస్సు నిర్విఘ్నంగా సాగటానికి స్నేహితులను, వారి సలహాలనూ తృణీకరించాడట. ఒక్కొక్కసారి తన అంతరాత్మనే కఠినంగా శాసించవలసి వచ్చిందట –
అయితే ఏమిటా అయోమయం? ఏది సాధించడానికి అంత దీక్షగా కృషి చేసాడు? అంతగా తన అంతరాత్మను సైతం నోరు మూయించాల్సిన అగత్యం ఏం ఉండి ఉంటుంది? ఆ అసిధారా వ్రతం ఎలాటిది? వీటికి సమాధానాలు మాత్రం వాచ్యంగా కథలో చెప్పరు. పాఠకుడు తన చుట్టూ ప్రపంచాన్ని పరికించుకుని జవాబులు చెప్పుకోవాలి, ఒక పాఠకురాలిగా నాకు దొరికిన సమాధానాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఆ సమాధానాలను నేను చేరుకున్న క్రమంలో నా అనుభవాలు కూడా జోడిస్తాను.

తమ చుట్టూ జరుగుతున్న విషయాలకి తమకు తోచిన భాష్యం చెప్పుకునేవారు, తమ ఆలోచనలను ప్రపంచంతో పంచుకోగలిగే సమర్ధత ఉన్నవారిని – బుద్ధిజీవులని పిలుద్దాం.
ప్రపంచాన్ని, దానిలోని మనుషులనూ, వారి జీవితాలనూ – సజీవమైనవిగా భావించి – వాటికి ఏరోజుకారోజు తమ హృదయంతో స్పందించడం, ఆ స్పందనను నిజాయితీతో బహిరంగపరచడం, ప్రతిస్పందనల పట్ల ఆసక్తి చూపడం, వాటికి కారణాలను వివేచించుకోడం – బుద్ధిజీవికి ఇది మొదటి దశ. Innocence, తెలుగు పదం అమాయకత్వం పూర్తి అర్థాన్నివ్వదు. కాని, ప్రస్తుతానికి దానితో సరి పెట్టుకుందాం.

ఈ దశలో నుంచి పరిపక్వమవుతున్న కొద్దీ, ప్రపంచంలో తాము చూస్తున్న విషయాలు – పుస్తకాల్లో ప్రతిఫలిస్తున్న తీరు గుర్తించగలగడం, కవిత్వంలో నిక్షిప్తమైన దాఖలాలను గుర్తించి అనుభూతిపొందడం, చరిత్రలో కారణాలు వెతకడం, భవిష్యత్తుకు ప్రణాళికలు వేయడం జరుగుతుంది. క్రమంగా Innocenceకు Intelligence, ‘బుద్ధి’ జత పడుతుంది.

అయితే పురుషోత్తం-1 లాగా అసిధారా వ్రతం చేసేవారి మాటేమిటి? నాలుగువైపులా చూస్తే, రకరకాల పురుషోత్తాలు కనిపిస్తారు మనకి. తమ ‘ఇమేజి’కి భంగం కలిగించనిదిగానూ, తమ ‘కెరీర్’‌కి ఏమాత్రం ఆటంకం కలిగించనిదిగానూ, తమ ‘గ్రూపు’లను తమ నుండి దూరం చేయనిదిగానూ – ఉండేలా తమ ప్రతిస్పందన ఉండేలా చూసుకోడానికి ఈ బుద్ధిజీవులు అసిధారా వ్రతం చేస్తూ ఉంటారు. అందులో కొందరు ప్రతిభాశాలులు – శత్రువు శత్రువు మిత్రుడన్న సూత్రాన్ని గుర్తెరిగి – గుప్త వైరులకు హాని కలిగేలా, మిత్రులకు సహాయపడేలా, తద్వారా తమ పలుకుబడి హెచ్చేలా ప్రణాళికలు వేసుకుని మరీ ప్రతిస్పందించగలరు. ఆ తపస్సు వారు కఠోరదీక్షతో సాగిస్తారు. ఇంతకు ముందు దానిని గుర్తించడానికి సమయం పట్టేది. కాని, ఈ సోషల్ మీడియా వేదికల్లో ప్రతి ఒక్కరి ‘ఖాతా’ వారి వ్రతాన్ని సుస్పష్టంగా చూపిస్తుంది.

దగాపడ్డవారు జీవితాన్ని పునర్నిర్మించుకునే – “పరిణామానికి అనుకూలంగా నిలబడతావా లేక దానికి ప్రతికూలంగా నిలబడి మరింత రక్తపాతానికీ, మరింత దురన్యాయానికీ, మరింత హేయ చరిత్రకూ కారకుడవౌతావా?” అని ప్రశ్న వేసి, తన ధర్మం తానెలా నిర్ణయించుకున్నాడో పురుషోత్తం 2 మనకి చెప్తాడు. ఆ ప్రశ్నలు వారిని వారు వేసుకుని, జవాబులు కూలంకంషంగా తెలిసీ, బుద్ధిపూర్వకంగా అవతలి పక్షం చేరిన అతిలోక బుద్ధిజీవులుంటారు. లోకంలో జరుగుతున్న దురన్యాయాన్ని ఖండించకుండా, దానికి అతీతంగా ఉన్న సౌందర్యాన్ని వెతికి దాని గురించి రాయాలని తీర్మానించుకున్నవారు. వారి చాతుర్యం గురించి ఒక మిత్రుడు నాతో ఇలా అన్నాడు – తోడేళ్లతో కలిసి వేటాడి కుందేళ్లతో కలిసి చిగురు మేయడం తెలిసిన వారే ఇవి రాస్తారు.

ఈ అతిలోక బుద్ధిజీవులంటే అంతులేని గౌరవం – చాలామంది కాబోయే బుద్ధిజీవులకి. అంతేకాదు, ఇంకాస్త ముందుకు వెళితే – ఉద్యమాల కోసం, తాము నమ్మిన ఆదర్శం కోసం జీవితాలు గడిపిన వారి పట్ల అంతులేని నిరసన, కొండొకచో జాలి. ఇక్కడ విషయం ఆ జీవితాలను ఎంచుకున్న వారి గురించి కాదు. మనం వారినెలా చూస్తున్నాం అనేది. దీనిని వివరించడానికి రెండు ఉదాహరణలిస్తాను.
ఒక రచయిత్రి మాటలు – ఒక వివాహిత స్త్రీపాత్ర కుటుంబం కన్నా, సంతానం కన్నా కూడా తన ప్రేమ ముఖ్యమని, ఇంట్లోంచి వెళిపోతుందట. దానిని ప్రస్తావించి, తన కుమార్తె మాత్రం ఆ పాత్ర నిర్ణయాన్ని సమర్ధించలేదని బయటపెట్టారు. ఆ మాట విని రచయిత్రికి ఆశ్చర్యం కలిగిందట. “అయితే ఉద్యమ నాయకులకి వాళ్ల పిల్లలు ఉద్యమాల్లోకి రారని తెలిస్తే కలిగేలాటి ఆనందం కలిగింది”ట. “జీవితాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోగలదు అని ఒక ధైర్యం వచ్చింది”ట కూడాను. అంటే తన తరం వారు నమ్మిన ఆదర్శాలు తన పిల్లల తరం నమ్మకపోడమే మంచిదని చాలా మంది ప్రగతిశీల శిబిర వాసులలాగే ఆమె కూడా నమ్ముతున్నారన్న మాట.

మరొక రచయిత్రి స్వగతం – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సంవత్సరాలు వెనగ్గా నా జీవితం ఉత్తర భారతదేశంలో పుట్టి పెరిగిన ఆమెతో పారలల్ గా నడిచింది. ఆమె ఐఐటీ ఖరగ్ పూర్ లో ఎం ఎస్ సీ చేశారు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. ఈ నాడు కెరీర్ అని చెబుతున్న దాన్నిఎడమ కాలితో తన్ని ప్రజా జీవితాన్ని ఎన్నుకొన్నారు. నేను స్థిరమైన ఆదాయం ఉన్న ఉద్యోగంలో ఇమిడి పోయాను. ఆమిప్పుడు అర్బన్ నక్సలైట్ పేరుతో పుణె లోని ఎర్రవాడ జైల్లో ఉన్నారు. ఆమె జీవితాన్ని చదువుతుంటే ఎంత నిరర్ధకంగా బతికామా అని అనిపించిక తప్పదు. భద్రజీవులకు ఎవరికీ మింగుడు పడని అద్భుత పోరాట జీవితం ఆమెది.
రెండు అభిప్రాయాల్లోనూ ఒక ముఖ్యమైన భేదం ఉంది – ఒకరు, పోరాటం చేసేవారు పశ్చాత్తాపం చెందుతూ ఉంటారని భావిస్తే, మరొకరు, ఉద్యమకారులు స్వఇచ్ఛతో పోరాటమార్గాన్ని ఎన్నుకుని ఉంటారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సరే, ఇవి మన అభిప్రాయాలు. కథకుడి అభిప్రాయం ఏమిటి? ఈ నేపథ్యంలో కథని మరోసారి పరిశీలిద్దాం. కథలో రెండు మనస్తత్వాలూ, వాటి ఎంపికలు, జీవితాలు, సాధించిన ఫలితాలు వీలైనంత objectiveగా కొకు మన ముందుంచారు. ఇద్దరూ తాము నమ్మిన విషయాలని పట్టదలగా అమలుపరిచిన వాళ్లే. విజయాలు సాధించిన వాళ్లేనని మనకి ఒక అవగాహన ఏర్పడుతుంది. లోకరీతి ప్రకారం పురుషోత్తం 1 జీవితం విజయానికి ఒక ఉదాహరణ. అయితే పురుషోత్తం 2 జీవితం కూడా మరొక విధమైన విజయమే. తన తోటి వారి కోసం పోరాడి, వారి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు మరి. తనకు తాను సుఖపడితే తప్పు గాకున్నా, తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అని సినీ కవి రాయనే రాసాడు కదా.

అయితే కథలో చెప్పదలుచుకుంది అదేనా – పరోపకారార్థం ఇదం శరీరం అనే పాత నీతిని మరోసారి చెప్పడానికి కథ రాసారా కొకు?. కానేకాదు.

జీవితానికీ, రాజకీయాలకూ అవినాభావ సంబంధం గల చోట నేను మనస్ఫూర్తిగా రాజకీయాల్లో ప్రవేశించాను అంటాడు, పురుషోత్తం2. ఇతన్ని నేను ఈనాడు చూసే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో పోల్చుకోడం లేదు. కథాకాలం నాటికి అలాటి విశ్వాసాలతో ఉన్న నాయకులు పార్టీల్లో ఉండి ఉంటారని, వారి విశ్వాసాలను కొకు ఈ కథలో నమోదు చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఆ పురుషోత్తం ఇప్పుడు బతికి ఉంటే అతని వ్యక్తిత్వంలోని ఏ పార్శ్వం మనకు ఇప్పుడు మనకు ఉపయుక్తం అన్న విషయాన్ని చూద్దాం.

ఆ రెండో వ్యక్తిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక – పురుషోత్తం 1, 2ను తన భూతం అని పిలుచుకుంటాడు. తప్పనిసరి అయి ఇలా గుర్తిస్తాడు – ఈ భూతం తనకన్నా ఒక్క పిసరు యెక్కువే సజీవంగా ఉంది. ఈ సజీవం అన్న మాటకు అర్ధం ఏమిటి? సజీవత్వం దేనిని బట్టి నిర్ధారితమౌతుంది? స్పందనని బట్టి. Live audience అంటాం. అంటే వారి స్పందన మనకు తక్షణం అందజేస్తున్న ఆడియెన్స్. ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు చూసే శక్తి, అర్ధం చేసుకునే ప్రయత్నం – దానితో సజీవమైన సంబంధాన్ని కలిగి ఉండడం. ఈ విషయాన్ని మరికొన్ని చోట్ల కూడా స్పర్శిస్తారు కొకు. సోషలిస్ట్ సాహిత్యం చదవడం వల్ల కలిగిన మేలు – జీవితానికి ఒక తాత్కాలిక వ్యాఖ్యానం దొరికింది అంటాడు పురుషోత్తం 2. ఇక్కడ తాత్కాలికం అన్న మాటని గమనించండి – శాశ్వత వ్యాఖ్యానం ఎవరికీ ఎప్పుడూ అందదు. సజీవులైన వారందరూ ప్రతీ క్షణం ప్రశ్నిస్తూ బతకాలి. ఒకప్పటి తనున్న ఆ స్థితినే నిరసిస్తూ పురుషోత్తం1 ఇలా అంటాడు. – తనకు ఇరవై నాలుగు వెళ్లేదాకా జీవితం తడుముకోడమే అయింది. నిరంతరం స్పందన, నిరంతరం ప్రశ్నలు – అది అతనికి ఇబ్బంది అయింది. ఆ రెండు వ్యక్తిత్వాలూ విడివడిన క్షణం గురించి మరోసారి ఆలోచించాలి. 25ఏళ్ల క్రితం, ఒకామెకు ప్రేమలేఖ రాసి చించేస్తాడు, అప్పటినుంచి అతను తనలో ఉన్న అయోమయం తనను వదిలిపోయిందంటాడు. అదే అతనిలో ఉన్న ప్రశ్నించే తత్వం.

ప్రపంచంతో రాజీ పడక తప్పదని, ప్రశ్నించే తత్వం – మనిషికి శాంతినివ్వదేమోనని సందేహించే వారికి కథకుడు ఒక హామీ ఇస్తారు. ఎవరి జీవితాలు వాళ్లు అర్థం చేసుకుంటున్న కొద్దీ ఆ జీవితాలను మార్చుకునే చైతన్యం దానంతట అదే వస్తుంది. అలాగే బుద్ధిజీవుల కర్తవ్యం గురించి ఒక మాట అంటారు – వాళ్లు (ప్రజలు) జీవితాన్ని అర్థం చేసుకునేటట్టు చెయ్యటమే మన ధర్మం.

పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.

6 thoughts on “కొ.కు – ‘కాలప్రవాహపు పాయలు’

  1. కొకు ఎంత గొప్పగా నెరేట్ చేశారో ఈ కథని. ఓ పాతికేళ్ల క్రితం దీని గురించి ఒక ఇంగ్లీషు జర్నలిస్టుకి చెప్తే చాలా ఆశ్చర్యపోయాడు.

  2. విశ్లేషణ అంటే, ఒక పనిని వివరంగా అర్థం చేసుకోవడం అని, ఈనాటి చాలామంది విశ్లేషకలు మరిచిపోయారు. శ్రీ కళ్యాణి లాంటి వారి రచనలు వలన విశ్లేషకులు పై మళ్ళీ ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. పని కట్టుకొని తప్పు వెతకడం కాకుండా ఒక విషయాన్ని ఆమె/అతను ఎలా అర్థం అర్థం చేసుకున్నారు అనే విషయాన్ని కళ్యాణి గారు చాలా చక్కగా వివరిస్తారు. మీ నుండి మరిన్ని రావాలి అని కోరుకుంటున్నాను.

  3. కళ్యాణి గారి విశ్లేషణ నైపుణ్యానికి అభినందనలు. సునిశితమైన దృష్టితో ఒక కాలంలో ఆగిన కథను సమకాలీన వైఖరులతో ముడిపెట్టే ప్రయత్నం చేసారు. సమకాలీన వైఖరులను ఎత్తిచూపడం బాగుంది గానీ కథా వస్తువుతో ఆ వైఖరులు సింక్రనైజ్ అయ్యాయా? కొంత సందేహంగా వుంది.

    నేను కొ. కు ను పెద్దగా చదవలా. అయితే లింక్‌లో కథ విన్నా. కథ ఆఖరులో 'మీ క్లబ్ లో వుపన్యాసం యివ్వబోతున్నా గదా జనం యెలా స్పందిస్తారో నువ్వే చూస్తావ్' అనే అర్థం వచ్చే మాటతో భూతం పురుషోత్తం చెప్పడంతో కథ ముగుస్తుంది (నాకు యిలాగే అర్థం అయ్యింది.) కథ రెండు మార్గాల్లో ఒక వ్యక్తి ప్రయాణాన్ని చిత్రించింది. రెండూ పరస్పర విరుద్ధంగా వున్న మార్గాలే. ఒకటి క్యాపిటలిజం రెండు సోషలిజం. (పార్లమెంటరీ సోషలిజం). కథ మేరకు ఇద్దరు పురుషోత్తాలూ విజయం సాధించారు. కథలో "టోన్" ను గమనిస్తే కాపిటలిస్ట్ పురుషోత్తం కంటే సోషలిస్టు పురుషోత్తం లివ్లీ గా, బలంగా, చలాకీగా వున్నాడు. కాపిటలిస్ట్ పురుషోత్తం దాన్ని గమనిస్తాడు కూడా. కథ ఆఖరి డైలాగ్ మేరకు సోషలిస్టు పురుషోత్తం ఆధిపత్యాన్ని కూడా కథకుడు పైచేయిగా చేసాడు.

    కథాకాలం యిచ్చే పరిమితికీ కథావస్తువు చిత్రింపబడినంత మేరకే మాట్లాడితే, కథ ద్వారా సోషలిస్టు భావాల పాజిటివ్ నెస్ ను చెప్పడానికి మాత్రమే రాసినట్టు గ్రహించవచ్చు. మరి కళ్యాణి గారు చేసిన వర్తమాన వైఖరుల విశ్లేషణకు కథా వస్తువు సహకరించదా? అంటే కాదని చెప్పలేం. స్కోప్ వుంది. సృజనకున్న బలమదే. కథలో సంభాషణలు ఆ స్కోప్ ను యిస్తున్నాయి. వ్యక్తి ఆచరణ రెండు పాయలుగా చీలితే, అతను కోల్పోయిన విలువలేమిటీ, అతను సాధించిన మిథ్యా జీవితమేమిటీ అనేది ఆరోగ్య కరమైన ప్రగతిశీలత లోంచీ బేరీజు వేయబడిందీ కథలో. ఆ బేరీజును విశ్లేషకురాలు ఆ కథా స్థలం నుంచి నేటిదాకా విలువల రేఖను గీయగలిగింది. ఆ రేఖ మీద ప్రగతిశీల శిబిరానికి చెందిన అన్ని మిథ్యా వైఖరులనూ ద్వంద్వ ప్రమాణాలనూ ప్రశ్నించగలిగింది.

    ఒక కథను కలకాలం నిలిపే విశ్లేషణ చేసిన కళ్యాణి గారికి అభినందనలు. నాకు సంబంధించిన ఒక వైఖరిని కూడా చూసుకోగలిగాను. అందుకు ధన్యవాదాలు. సాహిత్యం చేసేది అదే కదా. మనల్ని మనం చేసుకోవడం. వీలైనంత సరిజేసుకోవడం.

  4. చాలా మంచి విశ్లేషణ..గొప్ప పరిశీలన…- ఈ కధను చదవలేదు ఇంతకుముందు – థాంక్యూ కళ్యాణి గారూ..

  5. లోతైన కథకి లోతైన విశ్లేషణ అందించారు. సాధారణ మాటల్తో అసాధారణ విషయాల గురించి చెప్పటం కొకు కే చెల్లింది. ఆయన కథల్ని చదివి, అర్ధం చేసుకున్నంత తేలిక కాదు విశ్లేషించటం. మీరు ఆ పని చాలా బాగా చేయగలిగారు.

Leave a Reply