పాతికేళ్ళు కూడా నిండని యాపిల్ ఫోన్ ఫ్యాక్టరీ కార్మికుని దుఃఖగీతాలు

కొలిమి పత్రిక ‘మే డే’ సంచిక కోసం ఈ సారి కొన్ని ప్రత్యేక కవితలను పాఠకులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

ఇవాళ మొబైల్ ఫోన్ చేతిలో లేని ప్రపంచాన్ని ఊహించలేము. అందులోనూ యాపిల్ ఫోన్ చేతిలో ఉండడం, చుట్టూ వున్న సమాజం తల తిప్పి చూసి కళ్ళెగరేసే హోదాకు చిహ్నం. కానీ, ఆ ఖరీదైన యాపిల్ ఫోన్ లక్షల కోట్ల సంఖ్యలో ఎక్కడి ఫ్యాక్టరీలలో  తయారై, ప్రపంచం నలుమూలలకూ చేరుతుందో ఎందరికి తెలుసు ?   

ప్రపంచ దేశాలన్నింటిలో విక్రయానికి వచ్చే అందమైన, నాజూకైన, ఖరీదైన యాపిల్ ఫోన్ల ఉత్పత్తిలో సింహభాగం చైనాలోని పరిశ్రమలలో జరుగుతుంది. కారణం, ఆ దేశంలో కారు చౌక జీతాలకు దొరికే సాంకేతిక  శ్రామికులు. ప్రతీ సంవత్సరం విడుదలయే కొత్త కొత్త యాపిల్ ఫోన్లను గడువు తేదీ లోగా ఉత్పత్తి చేసి, ప్రపంచమంతా సరఫరా చేసేందుకు వీలుగా కార్మికులతో రోజుకు 18 నుండి 20 గంటల పాటు పని చేయించినా  సహకరించే ప్రభుత్వ వ్యవస్థలు. ఇన్నేసి గంటల పాటు పని చేయించడం కోసం నాజీలు యూదులను హింసించడం కోసం ఏర్పాటు చేసిన కాన్సెంట్రేషన్ సెంటర్ వంటివి ఏర్పాటు చేసి, వాటిలో రోజుల తరబడి కార్మికులను నిర్బంధించినా పట్టించుకోని కార్మిక చట్టాలు. 

ఇటువంటి ఒకానొక యాపిల్ ఫోన్ ఫ్యాక్టరీ లో పని చేసిన యువ కార్మికుడు షు-లిజి. 1990 లో పుట్టిన లిజి ఆ ఫ్యాక్టరీ లోని హింసాయుత పనిని, జీవితాన్ని తట్టుకోలేక పాతికేళ్ళు కూడా నిండక ముందే 2014 లో ఫ్యాక్టరీ భవంతి మూడవ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

షు-లిజి సున్నిత మనస్కుడైన కవి 

యాపిల్ ఫోన్ ఫ్యాక్టరీలో రోజుకు దాదాపు 18 గంటల పాటు పనిచేసే నిర్బంధ కార్మికునిగా అక్కడి హింసాయుత జీవితాన్ని వర్ణిస్తూ కవితలు రాసాడు. అంత చిన్న వయసులోనే షు-లిజి జీవితాన్ని, జీవితంలోని దుఃఖాన్ని దర్శించిన తీరు అబ్బురపరుస్తుంది. యాపిల్ ఫోన్ ఫ్యాక్టరీలో మొదట కొంత కాలం పనిచేసిన షు-లిజి, ఆ పని నచ్చక మరొక నగరంలోని పెద్ద పుస్తకాల దుకాణంలో పని చేయాలని, అక్కడే పనిచేస్తున్న తన గర్ల్ ఫ్రెండ్ కు దగ్గరలో బతకొచ్చని కలగన్నాడు . కానీ, ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం వలన, అప్పటి వరకూ బతికించిన సేవింగ్స్ అయిపోవడం వలన తిరిగి ఫ్యాక్టరీలో పనికి కుదురుకున్నాడు. అయితే, రెండవసారి పనిలో చేరిన తరువాత, ఆ పని ఒత్తిడిని భరించలేకపోయాడు.  

షు-లిజి ఆత్మహత్య తరువాత అతడి తోటి కార్మికులు, అతడి కవితలు మొత్తం సేకరించి ప్రచురణకు ఇచ్చారు 

అప్పటికే ఆ ఫ్యాక్టరీలో అటువంటి ఆత్మహత్యలు 18 వరకు జరిగినట్టు అధికారిక నివేదికలు వున్నా, వాస్తవానికి జరిగినవి అందుకు 3-4 రేట్లు వుండి వుంటాయని అంటారు. 

ఆశ్చర్యం ఏమిటంటే, షు-లిజి ఆత్మహత్య తరువాత అతనితో వున్న జ్ఞాపకాలతో అతని మిత్రుడొకడు ఒక గొప్ప కవిత రాసాడు. 

షు-లిజి రాసిన కవితలతో పాటు, చివరన అతడి మిత్రుడు రాసిన కవిత ఇక్కడ ఇస్తున్నాను.

ఒక స్క్రూ నేలమీద పడింది

ఒక స్క్రూ నేలమీద పడింది
పనివేళలు దాటిన ఈ అర్థరాత్రి
నిరంతరం కార్మికులు పనిచేస్తున్న సమయంలో
నిలువుగా కిందకు దూకి
తేలికైన శబ్దంతో నేలను కరుచుకుని
ఒక స్క్రూ నేలమీద పడింది

ఇది ఎవరి దృష్టిలోనూ పడలేదు
క్రితంసారి కూడా ఇంతే
ఇటువంటి ఒక అర్థరాత్రి సమయంలోనే
ఒక కార్మికుడు నేలమీద పడ్డప్పుడు

జోస్యం

నేను పసివాడిగా వున్నపుడే
మా ఊరిలోని పెద్దలు చెప్పి వున్నారు
నాలో మా తాత పోలికలు వున్నాయని

నాకెందుకో అది
నమ్మశక్యంగా అనిపించలేదు
అయినా సరే,
ఆ పెద్దవాళ్ళు పదే పదే అదే చెప్పారు

మెల్లిగా వాళ్ళ మాటలలో
వాస్తవం వుందనిపించింది

మా తాతకూ నాకూ
కొన్ని పోలికలు వున్నాయి
ముఖ్యంగా, ముఖ కవళికలలో
ఆ పోలికలు మరింత స్పష్టం
స్వభావాలు, అభిరుచులు కూడా
ఇద్దరం ఒకే తల్లి కడుపు నుండి
ఊడిపడినట్టుగా

ఉదాహరణకు, మా తాతను
‘వెదురు బొంగు’ అని పిలిచేవాళ్ళు
నా ముద్దు పేరేమో ‘బట్టల హాంగర్’

తరచుగా మా తాత
తన భావాలను లోపలే అదిమిపెట్టేవాడు
ఎల్లప్పుడూ విధేయుడిగా వుండడమే నా లక్షణం

మా తాత ఎల్లప్పుడూ
ప్రమాదాలను ఊహించేవాడు
నేను జోస్యాన్ని ఇష్టపడతాను

1943 శరదృతువులో
జపాను దయ్యాలు దాడి చేశాయి
మా తాతను సజీవ దహనం చేశాయి

అప్పుడాయన వయసు 23
ఈ సంవత్సరం నా వయసు కూడా 23

ఇనుముతో చేసిన చంద్రుడు

ఇనుముతో చేసిన చంద్రుడిని మింగాను నేను
వాళ్ళు దానిని మేకు అంటారు
ఈ పరిశ్రమల మురుగునీటిని,
ఈ నిరుద్యోగ పత్రాలను మింగాను

యంత్రాల ముందు వంగిన యువతరం
ఆయుష్షు తీరకముందే అంతమై పోతుంది

నేను పేదరికాన్ని గందరగోళాన్ని మింగాను
పాదచారుల వంతెనలను,
తుప్పుపట్టిన జీవితాన్ని మింగాను
మరి ఇక దేనినీ మింగలేను

ఇప్పటిదాకా మింగినదంతా ఇప్పుడు
నా గొంతులోంచి బయటకు తన్నుకొచ్చి
నా పూర్వీకుల నేలపై జెండాలా పరుచుకుంటోంది
గౌరవం దక్కని కవితలా మారుతోంది

*

షు-లిజి మరణించిన తరువాత అతడిని తలచుకుంటూ ఒక సహా కార్మికుడు రాసిన స్మృతిగీతం –

షు-లిజి కోసం

నిష్క్రమించే ప్రతీ ప్రాణం
నా నుండి నిష్క్రమిస్తున్న
నాలోని మరొకరు

మరొక స్క్రూ వొదులవుతుంది
మరొక వలస కార్మిక సోదరుడు
కిందకు దూకాడు
నీవు నా స్థానంలో చనిపోయావు
నేను మీ స్థానంలో నిలిచి రాస్తున్నాను
రాసే క్రమంలో స్క్రూలను బిగిస్తున్నాను

ఇవాళ మన జాతి
అరవై అయిదవ పుట్టినరోజు
గొప్ప సంతోషంతో మన దేశం
వేడుకలు జరుపుకోవాలి

ఇరవై నాలుగేళ్ల వయసుకే నీవు
బూడిద రంగు ఫోటో ఫ్రేమ్ లోకి చేరి
చిన్నగా నవ్వుతున్నావు

శీతాకాలపు గాలులు
శీతాకాలపు వర్షం
జుత్తు నెరిసిన నీ తండ్రి
నీ చితాభస్మ కలశం పట్టుకుని
ఇంటికి వచ్చాడు

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply