కార్మికుడు

చికాగోలో అలనాడు
పనిగంటలు తగ్గింపుకు
రక్తం చిందించెనెవడు ||కార్మికుడు – కార్మికుడు ||

తరతరాల దోపిడీకీ
తలవంచక ఎదిరించిన
ప్రాణమెవడు త్రాణ ఎవడు ||కార్మికుడు – కార్మికుడు ||

క్షుద్బాధకు సమ్మెకట్టి
సమ్మెలో సొమ్మసిల్లి
నడుంకట్టి నడుచునెవడు ||కార్మికుడు – కార్మికుడు ||

రాక్షసులకు గోరీకట్టి
రష్యాలో ప్రప్రధమున
గెలిచెనెవడు నిలిచెనెవడు ||కార్మికుడు – కార్మికుడు ||

చీనాలో రైతన్నల
చేతులలో చేయి కలిపి
విప్లవాలు నడిపెనెవడు ||కార్మికుడు – కార్మికుడు ||

దౌర్జన్యం పీకనులిమి
హింసనెల్ల ధ్వంసించీ
స్వేచ్ఛకొరకు పోరునెవడు ||కార్మికుడు – కార్మికుడు ||

సాయుధుడై భారతాన
విప్లవ రథసారధియై
నడుస్తున్న యోధుడెవరు ||కార్మికుడు – కార్మికుడు ||

*1973 ఏప్రిల్ 25

అస‌లు పేరు బ‌ద్ధం భాస్క‌ర్‌రెడ్డి. పేద రైతు కుటుంబంలో పుట్టాడు. హైద‌రాబాద్‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేశాడు. ఆరుగురు దిగంబ‌ర క‌వుల్లో ఒక‌రు. 'న‌న్నెక్క‌నివ్వండి బోను'తో క‌వితాకాశంలో సూర్యుడిలా పొడుచుకొచ్చాడు. విర‌సం వ్య‌వ‌స్థాప‌క కార్య‌వ‌ర్గ స‌భ్యుడు. 1971-72లో విర‌సం కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాడు. శ్ర‌మ‌జీవుల జీవితాల‌పై ఎన్నెన్నో పాట‌లు రాశాడు. విర‌సం మీద ప్ర‌భుత్వం బ‌నాయించిన సికింద్రాబాద్ కుట్ర‌కేసులో ముద్దాయి. క‌వితా సంపుటాలు: 'దిక్సూచి', 'ముట్ట‌డి', 'గ‌మ్యం', 'జ‌న్మ‌హక్కు'. న‌వ‌ల‌లు: ప్ర‌స్థానం, మా పల్లె. గంజినీళ్లు(నాటిక‌), చిరంజీవి, మ‌రికొన్ని క‌థ‌లు రాశారు. . ప్ర‌భుత్వం చెర‌బండ‌రాజుని నిరుద్యోగానికీ, అనారోగ్యానికీ గురిచేసి బ‌లితీసుకుంది. మెద‌డు క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించాడు.

 

Leave a Reply