కార్పొరేటీకరణ – అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు

చరిత్ర, న్యాయశాస్త్ర పరిశోధనలలో కార్పొరేషన్స్‌ మీద ఒక మాట వాడుకలో ఉంది. అదేమిటంటే ‘‘కార్పొరేషన్‌ కు ఆత్మ అంటూ ఉండదు’’ (corporation has no soul) అని. ఆత్మ లేక పోవడాన్ని మత పరమైన లేదా ఆధ్యాత్మిక అర్థంలో వాడటం లేదు. కార్పొరేషన్స్‌కు మార్కెట్‌ విలువ (పెట్టుబడుల నిరంతర అభివృద్ధి, విస్తరణ) తప్ప మరే విలువల పట్టింపు ఉండదని, తమ ఆర్థిక అధికారాన్ని పెంపొందించుకోవడానికి ఎంతటి నేరానికైనా ఒడికట్టుతాయని, మనిషిపై, ప్రకృతిపై తన ప్రయోజనాల కోసం ఎంతటి విధ్వంసానికైనా దిగుతాయనే అర్థంలో వాటికి ‘‘ఆత్మ’’ ఉండదనే మాట వాడుతుంటారు. ఆ మాట అలంకారికంగా వాడినప్పటికీ అది ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేషన్లు చేసిన, చేస్తున్న నేరాల, విధ్వంసాల మూలంగా రుజువయిపోయింది.

ఒకప్పుడు సూర్యుడు అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం గురించి విన్నాం. కాని ఇప్పుడు ప్రపంచంలో కార్పొరేషన్స్‌ తాకని నేలంటూ లేదనేది నిజం. అవి కేవలం మార్కెట్‌ రూపంలోనే కాదు, రాజకీయ, సాంస్కృతిక రూపాలలో ప్రపంచవ్యాప్తంగా తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్నాయి. కాబట్టి కార్పొరేషన్ల పూర్తి స్వభావాన్ని తెలుసుకోవాలంటే వాటికుండే రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మూలాలను అర్థంచేసుకోవాలి. అన్నింటిని కలిపి చూడాలి. వాటి మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోవాలి.

1990లో 50 టాప్‌ కార్పొరేషన్లు మార్కెట్‌ విలువ ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 4.7 శాతం వుండేది, కాని అది 2020 నాటికి 27.6 శాతానికి పెరిగింది. ఈ మొత్తం కార్పొరేట్‌ సంపదలో 69 శాతం అమెరికాలోనే పోగయివుంది. ప్రపంచమంతా పట్టు కలిగి ఉన్న 100 టాప్‌ కార్పొరేషన్లలో 59 అమెరికా ప్రధాన బేస్‌గా కొనసాగుతున్నాయి. ఒక్క ఆపిల్‌ వంటి కార్పొరేషన్‌ మార్కెట్‌ విలువ (2.7 ట్రిలియన్‌ డాలర్లు) భారతదేశం స్థూల దేశీయోత్పత్తి (2.6 ట్రిలియన్‌ డాలర్లు) కంటే ఎక్కువ. ప్రపంచంలో అతి పెద్ద 100 ఆర్థిక వ్యవస్థల్లో 49 దేశాలు ఉంటే 51 కార్పొరేషన్స్‌ వున్నాయి. ఒక్క వాల్‌ మార్ట్‌ అనే కార్పొరేషన్‌ ప్రపంచంలోని 161 దేశాలకన్నా పెద్ద అర్థిక సంస్థ.

మనం ఏం తినాలో, ఏ బట్ట కట్టాలో, ఏ వినోదాన్ని కోరుకోవాలో, ఏ వార్తలు వినాలో, ఎలాంటి ఆలోచనలు చెయ్యాలో, ఎక్కడ పనిచేయాలో, ఎట్లా చెయ్యాలో… ఒక్క మాటలో ఎట్లా బతకాలో, ఎలాంటి సమూహంలో ఉండాలో నిర్ణయించే స్థాయికి కార్పొరేట్స్‌ వచ్చేశాయి. కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాలను మాత్రమే కాదు దేశ రాజకీయాలను, అనేక పాలకవర్గ సంస్థలను (న్యాయవ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్‌, విద్య, మీడియా…) కూడా ప్రభావితం చేసే, నిర్ణయించే స్థితికి కార్పొరేషన్స్‌ మారాయి. ప్రపంచంలోని అనేక దేశాలను, సమాజాలను శాసించగల స్థాయిలో కార్పొరేషన్లు వున్నాయి. పిడికెడు కార్పొరేషన్లు మొత్తంగా ప్రపంచ సమాజాన్ని శాసించగలుగుతున్నాయి.

ఈ సందర్భంలో కార్పొరేటీకరణకు సంబంధించిన కొన్ని రాజకీయార్థిక అంశాలను స్థూలంగా చర్చించే పని ఈ వ్యాసం చేస్తుంది. (1) మారుతున్న సామాజిక, రాజకీయార్థిక పరిస్థితుల్లో కార్పొరేటీకరణను ఎలా అర్థం చేసుకోవాలి? (2) ప్రపంచంలోనే మొట్ట మొదటి కార్పొరేషన్‌ ఈస్ట్‌ ఇండియా కంపనీ పుట్టుక, అభివృద్ధి, పతనం మనకు ఏం పాఠాలను నేర్పుతుంది. (3) కార్పొరేషన్లకు, ఫాసిజానికి వున్న సంబంధం ఎటువంటింది? (4) కార్పొరేట్‌ పెట్టుబడులకు, రాజ్యానికి, సామ్రాజ్యవాద సంస్థలకు ఉన్న సంబంధం ఎలాంటిది? (5) కార్పొరేటీకరణ, విదేశీ పెట్టుబడుల మీద (నయా)ఉదారవాద మేధావులకు ఉండే భ్రమలను ఎట్లా అర్థం చేసుకోవాలి? (6) హిందుత్వ ఫాసిజానికి, సామ్రాజ్యవాదానికి వున్న మైత్రిని ఎట్లా అర్థం చేసుకోవాలి?


1

ఒక ప్రపంచ ప్రవాహంగా కొనసాగుతున్న ఈ కార్పొరేట్‌ పక్రియ ఒక భ్రమను కూడా కలిగిస్తుంది. అదేమిటంటే మొత్తం ప్రపంచమంతా పెట్టుబడి చేతుల్లోకికబంధహస్తాల్లోకి వెళ్లిపోయింది కాబట్టి ఇక దానికి బయట వుండి ఎదిరించడానికి, లేదా దాని బయట ఇంకా భూస్వామ్య, అర్ధ భూస్వామ్య వ్యతిరేక రాజకీయాలు చేయగలిగే పరిస్థితి ఉందనుకోవడం తప్పుడు అవగాహన అనే ఒక భ్రమలోకి నెట్టివేస్తుంది. ఈ వాదనలు చేసే వారికి ప్రపంచ పెట్టుబడి ఒక సర్వాంతర్యామిగా కనిపిస్తుంది. ఇక లోపల (పెట్టుబడి వ్యవస్థ), బయట (పెట్టుబడేతర వ్యవస్థ) అనే విభజన రేఖ వుండదు, ఎందుకంటే ఆ రేఖ తొలిగిపోయి ప్రపంచం మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగమయ్యింది అని చెబుతారు. ప్రపంచమంతా పెట్టుబడి చట్రంలోకి వచ్చేశాక పోటీపడి కొల్లగొట్టడానికి ఆ వ్యవస్థకు వెలుపల ఏది వుండదు కాబట్టి ఇక సామ్రాజ్యవాద పోటీ, ఘర్షణలు కూడా వుండవు అని ఒక నిర్ణయానికి వస్తారు. ఒకవేళ వుంటే కేవలం చిన్న చిన్న ఘర్షణలు మాత్రమే ఉంటాయనేది వారి అవగాహన. అయితే సర్వవ్యాపితమైన పెట్టుబడి (కార్ల్‌ కౌట్స్కీ ప్రతిపాదించినట్లుగా) పోటీ పరిస్థితులను ఘర్షణలతో కాకుండా శాతియుతంగా పరిష్కరించుకుంటుంది అని భావిస్తారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే పెట్టుబడి ఏక రూపంలో, ఒకే స్థాయిలో వుండదు. ముఖ్యంగా పెట్టుబడిదారుల మధ్య ‘‘స్వేచ్ఛాయుత పోటీ’’ వుంటుంది అనుకోవడం ఒక భ్రమ, ఎందుకంటే అదే నిజమైతే గుత్తాధిపత్య పెట్టుబడి చలామణిలో వుండకూడదు.

ముఖ్యంగా ఈ సర్వాంతర్యామి వాదన చేసే పెద్ద నష్టం ఏమంటే సామ్రాజ్యవాద పెట్టుబడి అనే శత్రువు మనకు కనబడడు కాబట్టి కనబడని శత్రువుతో పోరాటం చేయలేమనే నిరాశావాదంలోకి నెట్టివేస్తుంది. లేదా పెట్టుబడిదారి వ్యవస్థలోని ‘‘లోపలి’’ శత్రువును ఆ వ్యవస్థకు ‘‘బయట’’ వుండి ఎదుర్కొనలేము కాబట్టి ఆ ‘‘లోపలి’’ వ్యవస్థ ప్రతిపాదించే ‘‘శాంతియుత’’ ఉదారవాద పార్లమెంటరీ పద్ధతులే శరణ్యం అనే తీర్మానానికి చేరుతారు. లేదంటే రోజా లక్సంబర్గ్‌ ఊహించినట్లుగా పెట్టుబడికి ఇంకా ఆక్రమించుకోగల ప్రదేశమంటూ మిగలక పోవడంతో తన లాభాలను ఇంకా పెంచుకోవడం కోసం ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి పెట్టుబడి కృషి చేస్తుంది. దానితో ఉత్పత్తి కోసం పెట్టుబడి శ్రామిక శ్రమ శక్తిపై అధారపడటం తగ్గుతుంది. దీని మూలంగా అభివృద్ధి చెందిన, వెనుకబాటుకు గురైన దేశాలలో శ్రామికులు తమ ఉద్యోగాలు కోల్పోయి, శ్రమకు తగిన వేతనం పొందక ఉప్పెనలా ఉద్యమాలు చేస్తారు. ఈ ఊహ బాగానే వుంది కాని అలా జరగలేదు, జరగడం లేదు. ఎందుకంటే శ్రామికులు కేవలం శ్రామికులు మాత్రమే కాదు. అనేక రకాల భావజాలాల వినియోగదారులు కూడాను. వారి చైతన్యాన్ని, రాజకీయ ఆచరణను కట్టివేసే అనేక భావజాలాలను, వాటిని ఉత్పత్తి చేసే సంస్థలను పెట్టుబడిదారీ వ్యవస్థ నిరంతరంగా తయారుచేస్తుంది, ప్రోత్సహిస్తుంది. అందుకే ఇక్కడ విప్లవ సాహిత్య, సాంస్కృతిక, సిద్ధాంత ప్రక్రియల అవసరం వస్తుంది. వీటన్నింటిని మించి ఆ ప్రక్రియలకు జీవనాడిలా వుండే విప్లవ రాజకీయాల ప్రాధాన్యత తెలుస్తుంది.

విప్లవ రాజకీయాలు పెట్టుబడిదారి వ్యవస్థ లోపల, బయట అనే విభజన రేఖల గందరగోళంలో పడకుండా సామ్రాజ్యవాద పెట్టుబడి అభివృద్ధికి వివిధ తలాలలో (అంతర్జాతీయంగా, దేశీయంగా, స్థానికంగా) సాధనాలుగా పనిచేస్తున్న రాజకీయ, ఆర్థిక వ్యవస్థల నుండి తన శత్రువును పోల్చుకుంటుంది, అంచనా వేస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని (పడికట్టు పదంలా వుండొచ్చు కాని) సామ్రాజ్యవాద దోపిడీలో భాగంగా చూస్తుంది. రాజ్యవ్యవస్థకు, పాలక వర్గానికి, పెట్టుబడికి వుండే సంబంధాన్ని గుర్తించి తన ఎత్తుగడలను, వ్యూహాలను నిర్మాణం చేసుకుంటుంది. ఈ సందర్భంలో వచ్చే ప్రశ్నేమంటే ‘‘అర్ధ-భూస్వామ్య, అర్ధ-వలస సమాజం అనే అవగాహనే సరైనది కానప్పుడు, వాటి ఆధారంగా చేసే పోరాటాలతో ప్రయోజనం ఏమిటని’’ ఈ ప్రశ్నకు జవాబు కేవలం కొన్ని ఆర్థిక ప్రమాణాలను విశ్లేషించి చూస్తేనో, సమాజంలోని వివిధ అంశాలను విడివిడిగా, అచారిత్రకంగా చూస్తేనో దొరకదు.

కార్పొరేట్‌ పెత్తనాన్ని, విధ్వంసాన్ని అర్థం చేసుకోవాలంటే కార్పొరేషన్లకు, రాజ్యానికి ఉండే సంబంధాన్ని పరిశీలించాలి. కార్పొరేషన్లు తమకు తాముగా స్వతంత్రులమని, స్వీయ నియంత్రణలో పనిచేసే వ్యవస్థలని, ప్రభుత్వాల జోక్యం లేకపోతేనే అవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని ప్రగల్భాలు పలుకుతుంటాయి. ఇలాంటి వాదనలకు నయా ఉదారవాద మేధో మంద వత్తాసు పలుకుతుంది. కాని చరిత్రలో ఏ కార్పొరేషన్‌ కూడా రాజ్యం ప్రోద్బలం, సహకారం లేకుండా మనుగడలోకి రాలేదు. విస్తరించలేదు. రాజ్యానికి, కార్పొరేషన్లకు ఒక సజీవమైన సంబంధం (symbiotic relationship) ఉంటుంది. ఒకదాని మీద మరొకటి ఆధారపడి మనుగడ సాగిస్తాయి.

కాబట్టి కార్పొరేషన్ల ఎదుగుదల, విస్తరణ దానికదిగా ఒంటరిగా జరిగేది కాదు. దానిని సామ్రాజ్యవాద ప్రయోజనాలనుండి వేరుచేసి చూడలేము. నిజానికి కార్పొరేషన్లు పెట్టుబడి అభివృద్ధి విస్తరణ, సంక్షోభాల క్రమంలో ఒక రాజకీయార్థిక వ్యూహంగా పుట్టుకొచ్చినవే. ఈ సూత్రం వలసవాదంలో భాగంగా మొదలయ్యిన మొట్ట మొదటి కార్పొరేషన్‌ ఈస్ట్‌ ఇండియా కంపనీ నుండి ఇప్పుడు సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కార్పొ రేషన్ల వరకు కొనసాగుతుంది. ఈనాటి కార్పొరేషన్లకు, రాజ్యానికి వుండే సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఈస్ట్‌ ఇండియా కంపనీ పుట్టుక, విస్తరణ, పతనం ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆ చరిత్రను పరిమితంగానైనా పరిశీలించాలి. వలసవాదం ఏ విధంగా ఒక ఆర్థిక పక్రియగా మొదలయ్యి పూర్తిస్థాయి రాజకీయార్థిక వ్యవహారంగా మారిందో అర్థం చేసుకోవాలి.

2

మధ్యయుగాల నుండి బయటపడి ‘‘పునర్జీవన ప్రపంచంగా’’ ఎదిగిన యూరప్‌ తమ సమాజం దాటి అవతలి ప్రపంచం ఎలా వుందో తెలుసుకోవాలనే కుతూహలం, వీలయితే తమ రాజ్యాలను విస్తరించుకోవాలనే కాంక్ష అన్నీ కలిసి పద్నాలుగవ శతాబ్దపు చివరి కాలానికే సముద్రమార్గాన వ్యాపార దారులు (trade routes) కనుగొనే ప్రయత్నాలు మొదలయినాయి. ముఖ్యంగా స్పానిష్‌, పోర్చిగీస్‌ రాజరిక పాలకులు, అన్వేషకులు ఆ వేటలో ఎంతో ముందున్నారు. వాళ్లు వ్యపార మార్గాలను కేవలం వ్యాపారం కోసం మాత్రమే కాదు క్యాథలిక్‌ చర్చిని, క్రైస్తవ మత విశ్వాసాలను తూర్పు దేశాలలో వ్యాప్తి చెయ్యడం కూడా వారి ముఖ్య అజెండ అని చరిత్ర చెబుతుంది. కొంత అతిశయోక్తిగానే అనిపిస్తుండొచ్చు కాని కొందరు చరిత్రకారులు చేసే ఒక వ్యాఖ్యానం ఏమంటే ప్రపంచంలో మొట్ట మొదటి కార్పొరేషన్‌ ఏదైనా వుందంటే అది రోమన్‌ క్యాథలిక్‌ చర్చ్‌ అని. ఎందుకంటే బైబిల్‌ చేతిలో లేకుండా యురోపియన్‌ వలసవాదులు కాని, సామ్రాజ్యవాదులు కాని ఎక్కడ పోలేదు. సరే అది వేరే చర్చ.

ఏది ఏమైనా స్పానిష్‌, పోర్చిగీస్‌ అన్వేషకులు అసియా ఖండంలోని అనేక దేశాలకు సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. వాటి ద్వారా సుగంధద్రవ్యాలు, బంగారం, సిల్క్‌ వంటి కొత్త సరుకులను కనుగొన్నారు. భారతదేశానికి సముద్రమార్గాన్ని ‘‘కనిపెట్టడానికి’’ పోర్చుగీస్‌ రాజు (కింగ్‌ జాన్‌ II) సుప్రసిద్ధ అన్వేషకుడైన వాస్కోడిగామతో పాటు కొందరు కరడుగట్టిన నేరస్తులను, అప్పటికే శిక్ష అనుభవిస్తున్న వాళ్ళను ఆయనకు తోడుగా పంపాడు. ఎందుకంటే ఎంతో కష్టసాధ్యమైన ఆ ప్రయాణంలో వాస్కోడిగామకు ఎలాంటి ఆపదొచ్చినా ముందుగా ‘‘ప్రాణాలకు ఎలాంటి విలువలేని’’ ఆ తోడుగా వచ్చిన మనుషులు బలి కావడానికి సిద్ధపడాలని వాళ్లను పంపాడు.

నిజానికి పది నెలల ప్రయాణం తర్వాత 1498 మే నెలలో కేరళలోని మలబార్‌ తీరానికి చేరినప్పుడు ఆ తీరంలో మొదట అడుగుపెట్టింది, అక్కడ ప్రమాదం ఏమీ పొంచిలేదని నిర్థారణ చేసింది తోడుగా వచ్చిన ఆ మనుషులే. ఆ తర్వాతే వాస్కోడిగామ భారతదేశ నేల మీద అడుగుపెట్టగలిగాడు. ఆ తర్వాత అతి త్వరగానే తాను సుగంధద్రవ్యాల వనంగా పిలువబడే భారతదేశం చేరానని నిర్ణయించుకొని ఆ సుగంధ ద్రవ్యాలను, మసాల దినుసులను (ముఖ్యంగా ‘‘నల్ల బంగారంగా’’ పిలవబడే, యూరప్‌లో ఉన్నత వర్గాలు మాత్రమే వాడే అతి విలువైన మిరియాలు) ఎలా యూరప్‌ తీసుకుపోవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. చివరికి తిరుగు ప్రయాణంలో తనకు వీలయినంత మిరియాలు తీసుకొని వెళ్లాడు. దాని విలువ తాను ఒక సంవత్సరం ప్రయాణం చేసి వచ్చి పోవడానికి అయిన ఖర్చు కంటే 60 రెట్లు ఎక్కువ. సముద్రమార్గం తెలిసింది, భారతదేశంలో ఏం దొరుకుతున్నాయో కూడా తెలిసింది. ఇక అప్పటినుండి మొదలయిన ప్రయాణాలతో ఎనిమిది సంవత్సరాలలోనే కాలికట్‌ లో తమ పోర్ట్‌ను నిర్మాణం చేసుకోని తమ వ్యాపారాలను కొనసాగించడానికి ఒక వైస్రాయిని కూడా నియమించుకునే స్థాయికి చేరారు.

ఇక అక్కడితో పోర్చుగీస్‌ వలసపాలనకు తొలి అడుగులు పడ్డాయి. పోర్చుగీస్‌ వారి ద్వారా సముద్రమార్గం తెలుసుకున్న స్పానిష్‌ వర్తకులు కూడా భారతదేశంలోని సుగంధ ద్రవ్యాలను, మసాలా దినుసులను చౌకగా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోర్చుగీస్‌, స్పానిష్‌ పెత్తనం కేవలం భారతదేశం మీదనే కాదు మొత్తంగా అసియా ఖండమంతా వ్యాపించింది. ఆఫ్రికా నుండి బానిసల వ్యాపారం, బంగారు నిలువుల దోపిడీ కొనసాగించాయి. కాని క్యాథలిక్‌, ప్రొటెస్టంట్‌ తెగల మధ్య జరిగిన ఆధిపత్య పోరాటాలు యురోపియన్‌ సమాజంలో పెద్ద అలజడిని రేపాయి. ముఖ్యంగా బ్రిటన్లో తిరిగి క్యాథలిసిజాన్ని పునరుద్ధరించడానికి వచ్చిన నౌకాదళాన్ని (స్పానిష్‌ ఆర్మడ) 1588లో బ్రిటన్‌ ధ్వంసం చేసిన తర్వాత ఈస్ట్‌ ఇండీస్‌ లో పోర్చుగీస్‌, స్పానిష్‌ వ్యాపారం బాగా తగ్గిపోయింది. (కొలంబస్‌ భారతదేశం వెళ్దామని బయలుదేరి దారితప్పి చివరికి కరీబియన్‌ దీవుల్లో ఒక ‘‘కొత్త ప్రపంచాన్ని కనుక్కోని’’ వాళ్లే ఇండియన్స్‌..ఎరుపు రంగులో కనిపించారు కాబట్టి .. రెడ్‌ ఇండియన్స్‌ అని అనుకున్నాడు కాబట్టి ఆ దీవులను వెస్ట్‌ ఇండీస్‌ అన్నారు. దానికి తూర్పుగా వున్న భారతదేశాన్ని, ఇతర తూర్పు ఆసియా దేశాలను కలిపి ఈస్ట్‌ ఇండీస్‌ అని పిలువడం మొదలుపెట్టారు). అయితే ఈస్ట్‌ ఇండీస్‌తో స్పానిష్‌, పోర్చుగీస్‌ వ్యాపారం తగ్గింది కాని డచ్‌ వ్యాపారం పెరిగింది.

మొత్తంగా తూర్పు దేశాలలో పెరిగిపోతున్న డచ్‌ వ్యాపార సామ్రాజ్యాలను అడ్డుకోవడానికి బ్రిటన్‌లోని వర్తకులు ఎలిజబెత్‌ రాణి I కి ఒక విజ్ణప్తి చేసుకున్నారు. అది ఏమంటే ఈస్ట్‌ ఇండీస్‌తో వ్యాపారం చేయడానికి సర్వాధికార హక్కులు తమకే వుండేలా చేయమని. దానర్థం కేవలం బ్రిటన్‌ నుండి ఒక కంపనీగా ఏర్పడే వివిధ వాటాదారులు మాత్రమే ఈస్ట్‌ ఇండియాతో వ్యాపార లావాదేవీలు జరపాలి. అంటే ఒక వ్యాపార గుత్తధిపత్యాన్ని రాసి ఇవ్వమని అడిగారు. దాని కోసం కొద్దిమంది వ్యాపారస్తులు వాటాదారులుగా (stakeholders) పోగయ్యి ఈస్ట్‌ ఇండియా కంపనీని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఆమె అంగీకరించి ఒక ‘‘చార్టర్‌’’ను (ఒక కంపెనీ లేదా సంస్థ ఎలాంటి హక్కులు, బాధ్యతలు కలిగి వుండాలి అని తెలియచెప్పే ఒక లీగల్‌ డాక్యుమెంట్‌) డిసెంబర్‌ 31, 1600న ఏర్పాటు చేయించింది. దానితో ఈస్ట్‌ ఇండియా కంపనీ పుట్టుకొచ్చింది.

అయితే ఈస్ట్‌ ఇండియా కంపనీ చేసే వ్యాపారం రాణి ప్రతినిధులుగా మాత్రమే చెయ్యాలి అనే నియమం పెట్టారు. ఇలా బ్రిటన్‌ దేశం తరుపున వ్యాపారం చేయడానికి అనుమతి పొందడం అంటే ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపార దోపిడే ప్రథమ లక్ష్యంగా బయలుదేరినప్పటికి దానిలో ఒక భాగం రాజ్యం, మరో భాగం వ్యాపారసంస్థ కలగలిసి పోయాయి. అందుకే ఈస్ట్‌ ఇండియా కంపనీ తర్వాత కాలంలో ఏక కాలంలో రాజ్యంలా, దోపిడీ వ్యాపారసంస్థలా వ్యవహరించింది. అయితే ఆ కంపనీకి ఉండే వ్యాపార హక్కులను ప్రతి 21 సంవత్సరాలకు పరిశీలించి పునరుద్ధరించే విధంగా నిర్ణయించారు. ఈస్ట్‌ ఇండియా కంపనీ కేవలం కొంతమంది వ్యాపారుల సమూహం కాదు. అది తన కార్పొరేట్‌ నిర్మాణంలో భాగంగా కంపెనీ వాటాలను ప్రజలకు అమ్మి డబ్బును పోగుచేసింది. ఒక పెద్ద స్టాక్‌ కంపెనీగా రూపాంతరం చెందింది. దానికి ఒక అధ్యక్షుడు, బోర్డ్‌ ఆఫ్‌ ఆఫీసర్స్‌ ఉండేవారు. మొత్తంగా ఈస్ట్‌ ఇండియా కంపనీ ఒక ఆధునిక కార్పొరేషన్‌ లాంటి నిర్మాణం, పాలనా వ్యవహారం కలిగివుంది.

ఈస్ట్‌ ఇండియా కంపనీకి ఇతర బ్రిటీష్‌ వ్యాపర సంస్థలతో పోటీ లేదు కాని ఇంకా అప్పటికి తక్కువ స్థాయిలో నైనా పనిచేస్తున్న స్పానిష్‌, పోర్చుగీస్‌ వ్యాపార సంస్థలతో, 1602లో మొదలయిన డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపనీతో పోటీ తప్పలేదు. ఆ పోటీలో గెలవడానికి, తనను తాను రక్షించుకోవడానికి అవసరమైతే యుద్ధం చేయడానికి బ్రిటన్‌ ఈస్ట్‌ ఇండియా కంపనీకి అవకాశం ఇచ్చింది. అందుకు తగిన ఆర్మీని నిర్మాణం చేసుకోవడనికి అనుమతించింది. అందుకే కంపనీ తొలినాళ్ళలోనే 250 మంది కంపనీ క్లర్కులు ఉంటే వాళ్ల సైన్యం మాత్రం 20,000 మంది వున్నారు. ఆ సైనికులందరిని స్థానికంగానే నియమించుకున్నారు.

ఈ సైన్యాన్ని అవసరమైన చోట పోటీదారులైన స్పానిష్‌, పొర్చుగీస్‌, డచ్‌ కంపనీల నిలుపుదలకు వాడుకుంటూనే మొదటిసారిగా 1757లో మొఘల్‌ రాజ్యంలో భాగమైన బెంగాల్‌ను రాబెర్ట్‌ క్లైవ్‌ ఆధ్వర్యంలో ఈస్ట్‌ ఇండియా కంపనీ ఆక్రమించుకుంది. బెంగాల్‌కు గవర్నర్‌ ను నియమించుకోని తానే స్వయంగా టాక్స్‌ వసూలు చేసి వచ్చిన డబ్బుతో భారతీయ సరుకులు కొని వాటిని బ్రిటన్‌కు ఎగుమతి చేయడం మొదలు పెట్టారు. కంపనీ సైనిక బలాన్ని ఇంకా పెంచుకొని తమకు పోటీగా వున్న డచ్‌, ప్రెంచ్‌ వలసవాదులను భారత ఉపఖండం నుండి తరిమికొట్టింది. ఒక స్థాయిలో కంపనీ ఆర్మీ దాదపు రెండు లక్షల అరవైవేల మంది. ఇది బ్రిటిష్‌ స్టాండిరగ్‌ అర్మీ కాన్నా రెండు రెట్లు ఎక్కువ.

ఈస్ట్‌ ఇండియా కంపనీ సుగంధ ద్రవ్యాల వ్యాపారంతో మొదలయ్యి కాటన్‌, సిల్క్‌, నల్లమందు, బానిసల వ్యాపారం వరకు తన దోపిడీని విస్తరించింది. మరోవైపు వ్యాపారసంస్థగా వచ్చి రాజకీయ శక్తిగా మారడం మొదలయ్యింది. ఇటువంటి క్రమంలో 1784లో బ్రిటిష్‌ పార్లమెంట్‌ ‘‘ఇండియా చట్టాన్ని’’ తెచ్చింది. దాని ప్రకారం ఈస్ట్‌ ఇండియా కంపనీ కేవలం వ్యాపార విషయాలకే పరిమితం కావాలి, రాజకీయ విషయాలు బ్రిటిష్‌ ప్రభుత్వం చూసుకోవాలి. ఆ తర్వాత తెచ్చిన మరికొన్ని చట్టాలతో ఈస్ట్‌ ఇండియా కంపనీని బ్రిటిష్‌ ప్రభుత్వం కట్టడి చేస్తూ భారతదేశంపై తన రాజకీయ పెత్తనం పెంచుకోవడం మొదలుపెట్టింది. చివరిగా ‘‘1857 సిపాయిల తిరుగుబాటు’’ తర్వాత పరిస్థితి చెయ్యి జారిపోతుందని గ్రహించిన బ్రిటిష్‌ ప్రభుత్వం 1858లో ఈస్ట్‌ ఇండియా కంపనీ కార్యక్రమాలను భారతదేశంలో రద్దు చేసి మొత్తం భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక అప్పటి నుండి కంపనీ పాలన బ్రిటిష్‌ రాజ్యంగా మారింది.

ఈ మొత్తం వలసవాద పరిణామ క్రమం మనకు ఏం చెబుతుంది?
ఈస్ట్‌ ఇండియా కంపెనీ మాదిరిగా ఆధునిక కార్పొరేషన్లు తమ స్వంత మిలిటరీని కలిగి వుండకపోవచ్చు కాని మిలిటరీకి కావాల్సిన సాధనాలను, పరిజ్ఞానాన్ని అందించడానికి కార్పొరేషన్లు పని చేస్తున్నాయి. దాని కోసం ప్రభుత్వాలు కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున వ్యాపార డీల్స్‌ ఇస్తున్నాయి. ఈ వ్యవహారం military-industrial complex గా ప్రచారంలో వుంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ కాలంలో సుగంధ ద్రవ్యాల కోసం, నల్లమందు కోసం యుద్ధాలు జరిగితే ఇప్పుడు ఆయిల్‌ గురించి యుద్ధాలు జరుగుతున్నాయి. సరుకు మారింది కాని యుద్ధాలు ఆగలేదు. అయితే అప్పుడు మార్కెట్‌ విస్తరణలో పోటీ మూలంగా, లాభాల కోసం యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు యుద్ధాలే లాబసాటి వ్యవహారాలయ్యాయి.

ఇప్పుడు ప్రత్యక్ష వలస పాలనకు అవకాశాలు లేవు కాని అదే (అంతకు మించిన) దోపిడీ ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సందర్భంలో ఈ దోపిడీ అంతా మార్కెట్‌ ద్వారా నిర్మితమైన ఆర్థిక అనివార్యత (economic imperative) మీద ఆధారపడి కొనసాగుతుంది. ప్రతిదీ సరుకుగా మారి, ఆ సరుకుల ఉత్పత్తి అంతా కొన్ని కార్పొరేషన్ల చేతుల్లో ఉండి, ఆ ఉత్పత్తి చౌకగా దొరికే శ్రమశక్తి, ప్రకృతి వనరులు, పెట్టుబడి అనుకూల పాలసీ వాతావరణంలో జరుగుతుంది. ఇవన్నీ కార్పొరేషన్లకు అనుకూలంగా జరగాలంటే బలమైన రాజ్య వ్యవస్థ (extra-economic power) ఉండాలి. ఆ రాజ్య వ్యవస్థ ఇచ్చే పూర్తి సహకారంతోనే కార్పొరేషన్లు మనుగుడ సాగించగలుతాయి. ఈస్ట్‌ ఇండియా కంపని నుండి నేటి కార్పొరేషన్ల వరకు ఇదే జరుగుతుంది.

కాని ఉదారవాద, నయాఉదారవాద ఆర్థికవేత్తలు వారు ప్రతిపాదించే laissez-faire economics లో రాజ్యం మార్కెట్‌ వ్యవహారాలలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దు. మార్కెట్‌ కు స్వీయ నియంత్రణా శక్తి వుంటుంది. కాబట్టి అది చెయ్యగలిగే పని చెయ్యనియ్యాలి (ప్రెంచ్‌ భాషలో laissez-faire అంటేనె ‘‘చెయ్యనియ్యి’’ allow to do అని అర్థం) అని చెబుతుంటారు. కాని ఏ పెట్టుబడిదారీ, ఉదారవాద వ్యవస్థలో కూడా రాజ్యం సహకారం లేకుండా పెట్టుబడి అభివృద్ధ్ది జరగలేదు. నిజానికి మార్కెట్‌ వ్యవహారాలలో ఎలాంటి రాజ్య నియంత్రణ ఉండకూడదని కోరుకోవడమంటే తమ పని విధానాలను, మార్కెట్‌ విస్తరణలను, ట్రేడ్‌ యూనియన్‌ వ్యతిరేక ధోరణులను, శ్రమ దోపిడీని, ప్రకృతి దోపిడీని చూస్తూ ఊరుకోవాలే తప్ప అడ్డు చెప్పకూడదు అని చెప్పడం.


3

కార్పొరేషన్స్‌ అన్నింటిని ఒకే గాటికి కట్టలేము. ఒక (సామ్రాజ్యవాద) దేశంలో తన ప్రధాన కార్యాలయాన్ని పదిలంగా ఉంచుకుని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో అనుబంధ కార్యాలయాలను నడిపే బహుళజాతి సంస్థలు ఒకవైపు వున్నాయి. మరొకవైపు మొన్నటి వరకు స్థానికంగా, జాతీయంగా ప్రభుత్వరంగ సంస్థగా వున్నవాటిని మార్పు చేసి పబ్లిక్‌ రంగ కార్పొరేషన్లుగా మార్చివేయడం. ఈ సంస్థలకు కొంత స్వతంత్రత వున్నప్పటికీ అవి ప్రభుత్వ అదుపాజ్ఞలలోనే పనిచేయాల్సి వుంటుంది. ఈ కార్పొరీటీకరణ కూడా రాజ్యం ప్రజా సంక్షేమంలో తన ప్రత్యక్ష బాధ్యతను తప్పించుకునే పనిలో భాగమే. పబ్లిక్‌ రంగ కార్పొరేషన్లు చరిత్ర పొడువునా ఉనికిలో ఉన్నట్లుగా అనేక చారిత్రక ఆధారాలు వున్నాయి. కొందరు చరిత్రకారులు వాటి మూలాలను ప్రాచీన ఈజిప్ట్‌, రోమన్‌ సామ్రాజ్యంలోను చూస్తున్నారు.

మరో రకం ప్రైవేట్‌ కార్పొరేషన్లు. పబ్లిక్‌ రంగ కార్పొరేషన్లకు ఇవ్వాల్సిన సహకారం అందివ్వక, వాటిని నష్టాల బారిన పడేసి, ఇక ప్రైవేటీకరణే శరణ్యం అని చెప్పేసి వాటిని ప్రైవేట్‌ కార్పొరేషన్లకు చౌకగా అప్పగించేయడం. ఈ పని ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇలాంటి సంస్థలు ఒక నిర్మాణంగా మొదటిసారి అమలులోకి వచ్చింది మాత్రం ఇటలీలో ఫాసిస్టు ముస్సోలిని అధికారం హస్తగతం చేసుకున్న తర్వాతనే. తన మొదటి ఆర్థిక పాలసీలో (1922-1925) పొగాకు, అగ్గిపెట్టెల పరిశ్రమను, ఇన్సూరెన్స్‌ రంగాన్ని, మెటల్‌ పరిశ్రమను, టెలిఫోన్‌ నెట్‌ వర్క్‌ ను కార్పొరేషన్ల పేరిట ప్రైవేటీకరించాడు.

అన్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలను కార్పొరేటీకరించే పనిలో ఫాసిస్ట్‌ ఇటలీ నమూనాను అనేక నియంతలే కాదు, ‘‘ఉదారవాద ప్రజాస్వామ్య’’ రాజ్యాలు కూడా అనుసరించాయి. అనుసరిస్తున్నాయి. ఇటలీ ఫాసిస్టులు కార్పొరేటీకరణ సందర్భంలో రెండు మార్గాలను ఎంచుకున్నారు. అందులో మొదటిది, సామాజిక కార్పొరేటీకరణ. ఇందులో భాగంగా వర్కర్స్‌కు సమ్మె చేసే హక్కును రద్దు చేశారు. లేబర్‌ కోర్టులను మూసివేశారు. దీనితో పాటుగా ట్రేడ్‌ యూనియన్లను, వాటి పని విధానాలను నియత్రించారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కార్పొరేషన్స్‌ ద్వారా కొత్త కార్పొరేషన్ల నిర్మాణాన్ని ప్రోత్సహించారు. ఇక రెండవది, రాజకీయ కార్పొరేటీకరణ. ముస్సోలిని చాలా చాకచక్యంగా ముందుగా సామాజిక కార్పొరేటికరణను అమలు చేసిన తర్వాత రాజకీయ కార్పొరేటీకరణకు తెరలేపాడు. అతని ప్రధాన లక్ష్యం ముందుగా పార్లమెంట్‌ను కైవసం చేసుకోవడం. 1922లో పార్లమెంట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నప్పటికి ఆ వెంటనే తనకు తానుగా ఇటలీ నియంతనని ప్రకటించుకోలేదు. వాస్తవానికి ముస్సోలిని మొదటి మూడు సంవత్సరాలు అప్పటికే అమలులో వున్న రాజ్యాంగం, రాచరిక పద్ధతులకు అనుకూలంగా పనిచేసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే సమూలంగా ఇటలీ సమాజాన్ని ఫాసిజం విలువలతో నింపాలనేది అతని ముఖ్య ఉద్దేశం. “నూతన ఫాసిస్టు మానవుడి”ని నిర్మాణం చేయాలనేది అతని అంతిమ లక్ష్యం. అది జరగాలంటే మొత్తం సమాజాన్ని తన గుప్పిట్లోకి తీసుకురావడం ప్రధానం అని భావించాడు.

ముస్సోలిని రాజకీయంగా త్వరగా ముందుకు సాగడం లేదని విమర్శలు తన ఫాసిస్టు పార్టీలోనే రావడం మొదలు కావడంతో తన 1925 పార్లమెంటరీ ఉపన్యాసంలో ఇటలీలో అన్ని అధికారాలు నావేనని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక పోలీస్‌ రాజ్య నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. 1926లో ఒక 15 ఏండ్ల అబ్బాయి ముస్సోలిని మీద కాల్పులు జరిపాడనే నెపంతో దేశంలోని ఇతర అన్ని రాజకీయ పార్టీలను రద్దు చేశాడు. ఇక కేవలం ఒక్క నేషనల్‌ ఫాసిస్ట్‌ పార్టీ మాత్రమే దేశంలో మిగిలింది. దేశమంటే ఫాసిజం, ఫాసిజమంటే దేశమనే నినాదం అమలులోకి వచ్చింది. అయినా బూటకపు ఎన్నికల తంతు మాత్రం ఆగలేదు. 1928 నాటికి పార్లమెంటరీ సంస్కరణల పేరిట ఎన్నికలను రద్దుచేసి ప్లెబిసైట్‌ (ప్రజాభిప్రాయ సేకరణ) ను అమలులోకి తెచ్చాడు. 1929 జనరల్‌ ఎన్నికలుగా చెప్పే తంతులో 400 మంది సభ్యులుండే పార్లమెంట్‌ (చాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌)కు ఫాసిస్టులే తమకు అనుకూలంగా వుండే 800 మందిని సెలక్ట్‌ చేసి వాళ్ళలో సగం మందిని ఎన్నుకోమని ప్రజల దగ్గరకు పోయారు. అది ఏ రకంగా కూడా ఎన్నికా కాదు, ప్రజాభిప్రాయ సేకరణా కాదు. ఈ ‘‘ఎన్నికల’’ పద్ధతిలో ముస్సోలిని పెట్టుబడిదారులు లేదా వారి ప్రతినిధులను ప్రత్యక్షంగా అధిక సంఖ్యలో పార్లమెంట్‌ లోకి తీసుకు రాగలిగాడు.

ఇటలీ ఫాసిస్ట్‌ ప్రయోగం మనకు చెబుతున్న పాఠం ఏమంటే పెట్టుబడికి, ఫాసిజానికి ఉండే పేగు బంధం గురించి. అంతే కాదు, కార్పొరేటీకరణ అనేది కేవలం ఒక ఆర్థిక వ్యవహారాలకు మాత్రమే పరిమితమైనది కాదు. అది సామాజిక, రాజకీయ, సాంసృతిక రంగాలను కూడా కార్పొరేటీకరిస్తుంది. దానికి సంబంధించిన విలువలను సాధారీకరణ చేస్తుంది. సాంస్కృతిక, భావజాల రంగంలో కార్పొరేటీకరణను మామూలు విషయం చేయగలిగితే ఆర్థికరంగంలో కార్పొరేటీకరణ సులభమవుతుంది. దాదాపు ఇదే ఫార్ములాను జెర్మనీలో నాజీ హిట్లర్‌ ఎంచుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందే (1934-1937) ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత ఇదే మార్గంలో ఫ్రాన్స్‌, బెల్జియం కూడా నడిచాయి.


4

ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్దం తర్వాత పరిమితంగా వున్న ప్రాకృతిక, మానవ వనరులను సరిగ్గా ఉపయోగించుకుని సమర్థవంతమైన అభివృద్ధిని, సేవలను పెంపొందించాలంటే కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణే మార్గమని సామ్రాజ్యవాద పాలకులు ఒక బలమైన సిద్ధ్దాంతాన్ని ముందుకు తెచ్చారు. దానికి అనుకూలంగా ఉనికిలోకి వచ్చిన బ్రెటన్‌ వుడ్‌ సంస్థలు (ప్రపంచబ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ) కార్పొరేటీకరణకు సాధికారతను ఇచ్చాయి, ప్రపంచవ్యాప్తం చేశాయి.

స్వేచ్ఛా మార్కెట్‌ రాజకీయార్థిక అంశాలను సిద్ధాంతీకరించడానికి కొత్త సంస్థలు, ‘‘థింక్‌ టాక్స్‌’’ పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోలోని ఆర్థికశాస్త్ర విభాగంలో మిల్టన్‌ ఫ్రైడ్‌ మన్‌, ఆర్నాల్డ్‌ హర్బెర్గర్‌ వంటి ఆర్థికవేత్తలు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ఏ విధంగా దేశ ఆర్థిక రంగంపై అప్పుల భారాన్ని తగ్గించి అభివృద్ధికి దోహదపడుతాయో చెప్పే కొత్త మోడల్స్‌ను నిర్మాణం చేశారు. వాటిని లాటిన్‌ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల నుండి వచ్చే ఆర్థికశాస్త్ర విద్యార్థులకు నూరిపోసి ఒక స్వేచ్ఛా మార్కెట్‌ ఆలోచనాపరుల గుంపును తయారుచెయ్యగలిగారు. వీళ్ళనే ‘‘చికాగో బోయ్స్‌’’ అంటారు. (బహుశా అందరు పురుషులే అయివుంటారు!).

ఈ చికాగో బోయ్స్‌ సలహాల ప్రకారం ప్రభుత్వరంగ ఆస్తులను, సేవలను ప్రైవేటీకరించి, కార్పొరేటీకరించిన మొదటి దేశం చిలీ. 1950ల నుండే ‘‘చిలీ ప్రాజెక్ట్‌’’ పేరిట ఆర్థికవేత్తల ట్రైనింగ్‌ మొదలు పెట్టింది చికాగో ఆర్థికశాస్త్ర విభాగం. దానికి యూ ఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌ మెంట్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌, రాకొఫెల్లర్‌ ఫౌండేషన్‌ ఆర్థిక వనరులను సమకూర్చారు. సెప్టెంబర్‌ 11, 1973న ప్రజాస్వామికంగా ఎన్నికైన సాల్వడార్‌ అయెండే ప్రభుత్వాన్ని కూలదోసి నియంతృత్వాన్ని అమలు పరిచిన అగస్టో పీనోచే (1973 నుండి 1990 వరకు) రెండు విడుతలుగా దేశంలోని దాదాపు అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేశాడు. పీనోచే అధికారంలోకి రావడానికి అమెరికన్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (CIA) తోడ్పడితే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కొద్ది మంది చేతుల్లోకి పొయ్యేలా చికాగో బోయ్స్‌ చేశారు. మొత్తం బ్యాంకింగ్‌, మైనింగ్‌ వంటి రంగాలు గుప్పెడు మంది చేతుల్లోకి వెళ్ళిపోయాయి.

ఆచరణలో CIA, చికాగో బోయ్స్‌ వున్నప్పటికి ఆ మొత్తం వ్యవహారాన్ని డైరెక్ట్ చేసింది అమెరికన్‌ సామ్రాజ్యవాదం, బ్రెటన్‌ వుడ్‌ సంస్థలు. 1970ల తర్వతా ప్రపంచ ఆర్థిక సంస్థల దగ్గర అప్పులు తీసుకోని వాటిని వెనక్కి చెల్లించలేని అన్ని దేశాలకు చిలీని ఒక మోడల్‌గా చూపించారు. చికాగో బోయ్స్‌ సృష్టికర్త మిల్టన్‌ ఫ్రైడ్‌ మన్‌కు 1976లో ఆర్థిక రంగంలో నోబల్‌ బహుమతి వచ్చిన తర్వాత తాను బహుళ ప్రచారం చేసిన స్వేచ్ఛా మార్కెట్‌ పాలసీలకు మరింత బలం చేకూరింది. వాటిని ప్రశ్నించలేనంతగా ప్రపంచబ్యాంక్‌ వంటి సామ్రాజ్యవాద చేతి సంస్థలు ప్రపంచ సమాజంలోకి తీసుకుపోయాయి.

ఆధునిక కార్పొరేషన్ల గుత్తాధిపత్యం ఫాసిస్టులతో, నియంతలతో మొదలు మొదలయినప్పటికి 1980ల నుండి అన్ని రకాల ఉదారవాద రాజకీయ పాలకవర్గాలకు కూడా అది ఒక మంత్రదండమయ్యింది. ఈ కార్పొరేటీకరణ కేవలం ప్రజల నిత్యజీవితాలను మాత్రమే కాదు, మొత్తంగా రాజ్యానికి, పెట్టుబడికి, పౌరసమాజానికి ఉండే సంబంధాలను కూడా పూర్తిగా మార్చివేసింది. చిలీ మాదిరిగానే అనేక దేశాలలో సంపదను కేవలం కొంతమంది పెట్టుబడిదారుల చేతులల్లో కేంద్రీకృతం చేసి ఆ పెట్టుబడిదారులే రాజ్యాన్ని నియంత్రించే స్థాయికి పరిస్థితి మారింది. లేదా కేవలం కొద్ది మంది కార్పొరేషన్ల అభివృద్ధి కోసం రాజ్యం తన ఆర్థిక పాలసీలను తయారుచేసే స్థితి ఒకటి వచ్చింది. అంటే రాజ్యం పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారింది. అలా ఒకరికొకరు సహకరించుకోవడం రాజ్యానికి (పాలకవర్గాలకు, దాని సంస్థలకు), పెట్టుబడిదారులకు అత్యవసరమయ్యింది.

అయితే రాజ్యం, పెట్టుబడి ఎప్పుడు ఒకటిగా జత కట్టి కనిపించాల్సిన అవసరం లేదు. ఆ రెండూ అన్ని సందర్భాలలో హింసను కొనిసాగించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే పూర్తిగా హింసను ఆధారంగా చేసుకుని ప్రజలను అణిచివేయలేమని ఆధునిక రాజ్యానికి తెలుసు. అయితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి లేదా దోపిడీ, అణిచివేతలను ప్రజలు ప్రతిఘటించినప్పుడు రాజ్యం హింసనే ఆశ్రయిస్తుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే రాజ్యహింస బాధితులు మన కళ్ల ముందే వుంటారు, రాజ్యం నగ్నంగా తన క్రూరత్వాన్ని అనేక నిర్బంధ రూపాలలో చూపిస్తుంది.

అయితే రాజ్యం మనకు కనబడని హింసను కూడా తన రాజ్య యంత్రాంగం ద్వారా, ముఖ్యంగా కొంత సాపేక్ష స్వేచ్ఛ వున్నాయనుకునే సంస్థల ద్వారా (న్యాయవ్యవస్థ, విద్య, మీడియా) కొనసాగిస్తుంది. ఆ సాధనాల ద్వారా తన ఆధిపత్యానికి సాధికారిత కల్పించుకుంటుంది. ప్రజలలో సమ్మతి సంపాదించాక లేదా సమ్మతి దొరుకుతుందనే నమ్మకం రాజ్యానికి కలిగిన తర్వాత ఇక అది తనకు అడ్డు వచ్చిన అన్ని మానవ, సామాజిక నిర్మాణాలను బుల్డోజ్‌ చేసుకుంటూ పోతుంది. ఇలాంటి సూక్ష్మ ఫాసిస్టు ఎత్తుగడలు రేపటి స్థూల ఫాసిస్టు వ్యూహానికి వెన్నెముకగా మారుతాయి. ఈ రెండు పక్రియలు విజయవంతం కావడానికి రాజ్యం, కార్పొరేషన్ల సహజీవనం ఎంతో ఉపయోగపడుతుంది.

పెట్టుబడిదారుల చేతుల్లో రాజ్యం సాధనమయ్యిందంటే ఒప్పుకోని వాళ్లు ఉంటారు. వాళ్లు కేవలం కొందరు పెట్టుబడిదారుల మీద కాకుండా మొత్తం పెట్టుబడి మీద తమ ఫోకస్‌ పెడుతారు. ఎందుకంటే పెట్టుబడిదారులు ఏ వానకు ఆ గొడుగు పడుతారు. వాళ్ళకు రాజ్యాధికారం కాదు నిరంతరం సంపద పోగేసుకోవడమే ముఖ్యం. చిలీలో పీనొచే పాలనలో అత్యంత సంపన్నులుగా మారిన పెట్టుబడిదారులు అతను రాజకీయంగా పతనం కాగానే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి మద్దతు పలికి తమ పెట్టుబడిని మరింత పోగేసుకున్నారు. అయితే ట్రంప్‌ లాంటి బిలియనీర్లు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి అధికారం చేపట్టిన చరిత్ర కూడా మన ముందు వుంది.

ఏది ఏమయినా ప్రపంచ పెట్టుబడి దృష్ట్యా రాజ్యం అంటే పెట్టుబడులకు అన్ని దారులు తెరిచి, సానుకూల పాలసీ, న్యాయ వాతావరణాన్ని ఏర్పాటు చేసి, పెట్టుబడి ఎదుగుదలకు అడ్డుపడని శాంతి మండలాలను నిర్మాణం చేయడం. అంతర్జాతీయ పెట్టుబడులకు, దళారీ బూర్జువాలకు మధ్య ఒక సంధానుకర్తగా ఉండటం. అంతర్జాతీయ ఒప్పందాలలో పెట్టుబడి సానుకూల ప్రతినిధిగా పనిచేయడం.


5

మొత్తం కార్పొరేటీకరణలో ఒక వైరుధ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పాలకవర్గాలు ఒకవైపు అంతర్జాతీయ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూనే మరోవైపు జాతీయంగా తన కనుసన్నల్లో ఉండే కార్పొరేషన్లను పెంచి పోషిస్తారు. అంతేకాదు వాటిని రాజ్యానికి అత్యంత ప్రియమైన సంస్థలుగా మారుస్తారు. వాటి గుత్తాధిపత్యానికి రాజ ముద్ర వేస్తారు.

ఇటువంటి అనుకూల పరిస్థితుల మూలంగానే కార్పొ రేషన్లు, ముఖ్యంగా బహుళజాతి కార్పొరేషన్లు, ప్రపంచంలోని అన్ని ఉత్పత్తి, వినిమయ, సేవా రంగాలను తన గుప్పిట్లో పెట్టుకోగలుతున్నాయి. ఉదాహరణకు, కేవలం ఆరు కార్పొరేషన్లు 72 శాతం గ్లోబల్‌ విత్తనాల మార్కెట్‌ను కంట్రోల్‌ చేస్తున్నాయి. కేవలం ఆరు కార్పొరేషన్లే ప్రపంచ వ్యాప్తంగా 79 శాతం పురుగుమందుల తయారీ, మార్కెటింగ్‌ రంగాన్ని తమ చేతుల్లో ఉంచుకున్నాయి. టాప్‌ పది ఎరువుల మందు కార్పొరేషన్లు 50 శాతం మార్కెటింగ్‌ చేస్తున్నాయి. కేవలం ఆరు కంపనీలు 52 శాతం వ్యవసాయ యంత్రాల ఉత్పత్తి, సరఫరా ప్రపంచమంతా చేస్తున్నాయి.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సందర్భంలో బహుళ జాతి కంపెనీలకు ప్రపంచమంతా బల్లపరుపుగా ఉంటుంది. మొత్తం ప్రపంచాన్ని తాము విస్తరించగలిగినన, కొల్లగొట్టగలిగిన మార్కెట్‌ గానే చూస్తాయి. వాటి పెట్టుబడులకు, సరుకులకు, భావజాలానికి ఎలాంటి అడ్డు గోడలు ఉండవనే అనుకుంటాయి.

బహుళజాతి సంస్థలను సమర్థించే మేధావులు కొన్ని భ్రమలను ప్రపంచమంతా ప్రచారం చేస్తుంటారు. అందులో ముఖ్యమయినది కార్పొరేషన్లు తాము పోయే ప్రతి దేశానికి కొత్త శాస్త్ర పరిజ్ఞానాన్ని తీసుకొని పోతాయి. దాని మూలంగా పారిశ్రామిక అభివృద్ధి పెరగడమే కాదు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక్కడ అన్నింటికంటే ముందు తెలుసుకోవాల్సింది కార్పొరేషన్లు దాతృత్వసంస్థలు కావు. అవి తమ ప్రయోజనం తప్ప మరే ప్రయోజనాన్ని పట్టించుకోవు, విలువనివ్వవు. తన అవసరాల కోసం ‘‘అభివృద్ధి’’ చెందుతున్న దేశాలకు టెక్నాలజీ బదిలీ చేసినా అది ఎప్పుడు తమ ఖర్చులు తగ్గించుకోవడానికి ద్వితీయ స్థాయి టెక్నాలజీనే ప్రవేశపెడుతుంది. కార్పొరేషన్ల మూలంగా సేవా రంగంలో కొన్ని వర్గాలకు పరిమితంగానైనా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం వుంది. కాని ఉత్పత్తి రంగంలో అవి తీసుకొచ్చే టెక్నాలజీ మూలంగా శ్రామికుల ఉద్యోగాలు పోతాయి తప్ప పెరుగవు. ఎందుకంటే అవి తీసుకొచ్చే ఆటమేషన్‌ టెక్నాలజీ మూలంగా శ్రామికుల శ్రమ అవసరం లేకుండా పోతుంది. పెట్టుబడిదారి వ్యవస్థ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా శ్రమశక్తి,, ప్రకృతిని కొల్లగొట్టే పద్ధతినే ‘‘సృజనాత్మక విధ్వంసం’’ అంటాడు ప్రముఖ రాజకీయార్థికవేత్త జోసెఫ్‌ శంపీటెర్స్‌. ఉదాహరణకు, వ్యవసాయంలో ఒక ట్రాక్టర్‌ కనీసం ఐదుగురి రైతు కూలీలకు పనిలేకుండా చేస్తుంది.

అంతేకాదు కార్పొరేషన్లు ఎక్కడ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టినా దాని సంబంధిత సైన్స్‌ ఫార్ములా ఎప్పటికి పంచుకోవు. ఉదాహరణకు, మొదటిగా 1980లలోనే కోకకోలా కంపెనీ ఇండియాలో తన ప్లాంట్‌ పెట్టే ప్రయత్నం చేసింది. కాని భారత ప్రభుత్వం తప్పనిసరిగా ఆ కోకకోలా ఫార్ములా మాకు చెబితేనే ప్లాంట్‌ పెట్టుకోవడానికి అనుమతి ఇస్తామని చెప్పడంతో కోకకోలా కార్పొరేషన్‌ వెనుతిరిగి పోయింది. అదే కంపనీ 1992లో మారిన రాజకీయార్ధిక సందర్భంలో ఎలాంటి షరత్తులు లేకుండా ఇండియన్‌ మార్కెట్‌లోకి రాగలిగింది.

అంతర్జాతీయ పెట్టుబడులకు సంబంధించిన ఒక భ్రమ కూడా ఉంది. విదేశీ పెట్టుబడుల మూలంగా మెరుగైన టెక్నాలజీ దేశానికి వస్తుందని, మానవ వనరులు మెరుగవుతాయని, దేశీయంగా ఉత్పత్తుల పోటీ పెరిగి సరుకుల, సేవల నాణ్యత పెరుగుతుందని, ఎగుమతుల పెరుగుదల మూలంగా ప్రపంచ మార్కెట్లో భాగస్వామ్యం పెరిగి విదేశీ ద్రవ్య విలువలు పెరుగుతాయని, మొత్తంగా దేశ అభివృద్ధికి బాటలు పడుతాయని. ఇక్కడ మనం మళ్లీ గుర్తుచేసుకోవాల్సిన విషయం ఏమంటే బహుళజాతి కంపనీలు ఎవ్వరినీ ఉద్దరించడానికి ప్రపంచం మీదికి ఎగబాకడం లేదు, కేవలం తన స్వంత లాభాల కోసం తప్ప. తమ బేస్‌ దేశాలలో కాకుండా ‘‘అభివృద్ధి’’చెందుతున్న, ‘‘వెనుకబడిన’’ దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి కారణం అక్కడ చౌకగా దొరికే సహజ వనరులు, కార్మికులు, బలహీనమైన చట్టాలు, లాభదాయకమైన టాక్స్‌ పాలసీలు. వీటి మూలంగా తమ దేశాలలో కాకుండా ‘‘అతిధి’’ (హోస్ట్‌) దేశాలలో బహుళ జాతి సంస్థలు ఎక్కువ లాభాలు పొందుతాయి.

మొదటగా విదేశీ పెట్టుబడులు చేసే పని లోకల్‌గా వుండే కంపెనీలను చౌక ధరకు కొనడం కాని, లేదా ఆ కంపనీలలో పెద్ద షేర్‌ను కైవసం చేసుకోవడం. ఈ crowd out (ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ఆ ప్రాంతంలోని వాళ్లను నయానో భయానో బయటకు నెట్టివేయడం) పరిణామం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. దీని మూలంగా కేవలం లోకల్‌ కంపెనీలు మాత్రమే కాదు, జాతీయంగా రీసర్చ్‌ వ్యవహారాలన్నీ కుంటుబడుతాయి. తన సొంత కాళ్లపై ఎదగాల్సిన జాతి తన కాళ్లను తానే నరికేసుకుంటుంది. తన నడక కోసం విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడుతుంది.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమంటే చాలా దేశాలలో విదేశీ పెట్టుబడులు మొత్తంగా బయటి నుండి రావు. దేశీయ బ్యాంకుల నుండి, వర్కర్స్‌ పెన్షన్‌ నిధుల నుండి లోన్‌ తీసుకుంటాయి. అంతేకాదు విదేశీ పెట్టుబడులు ఎక్కువగా పెట్టేది వనరులను కొల్లగొట్టే రంగంలోనే. ఆ పని కోసం పెద్ద పెద్ద యంత్రాలను వాడుతారు కాబట్టి ఉద్యోగ ఉపాధి పెరిగే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి. వీటన్నింటికి మించి బహుళ జాతి సంస్థలకు టాక్స్‌ కట్టకుండా తప్పించుకునే నైపుణ్యం, చరిత్ర చాలా వుంది. అంతేకాదు, లాభాలు ఎక్కడ ఎక్కువ వుంటే అక్కడ వాలిపోయే డేగలు బహుళ జాతి సంస్థలు. అవి ఎప్పుడైనా, ఎక్కడినుండైనా వెళ్లి పోవచ్చు. అలా వెళ్లి పోవడం మూలంగా లోకల్‌ ఆర్థిక వ్యవస్థ ఏమయిపోతుంది అనే విషయాన్ని అవి పట్టించుకోవు. ముందే చెప్పుకున్నాం కదా అవి ‘‘ఆత్మ’’ లేని వింత జీవులని!

ఉదారవాద మేధావులు బహుళ జాతి కంపెనీలు వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని గొంతెత్తి పాడుతుంటే క్రిటికల్‌ సామాజిక శాస్త్రవేత్తలు export processing zones ల్లో కొనసాగుతున్న ఆధునిక బానిసత్వం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆధునిక బానిసత్వం అర్థం కావాలంటే ఈ రోజు గ్లోబల్‌ కాపిటలిజం తన ఉత్పత్తి, సరఫరా వ్యవహారాలను ఎలా చేస్తుందో ఆలోచించాలి. ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌ లో అమ్మబడుతున్న ఏ సరుకు పూర్తిగా ఒక్క ప్రాంతంలోనో, దేశంలోనో తయారవుతున్నవి కావు. ప్రతి సరుకు ‘‘గ్లోబల్‌ వాల్యూ చైన్‌’’ లో భాగంగా ఉత్పత్తి అయ్యి, పంపిణీ అవుతుంది. ఒక సరుకు తయారీని ముక్కలు ముక్కలు విభజించి వివిధ ప్రాంతాలలో వాటిని తయారుచేసి చివరికి వాటికి ఒక్క చోటికి చేర్చి పూర్తి సరుకుగా మారుస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కడ వనరులు, పరిజ్ఞానం, శ్రామికులు చౌకగా దొరుకుతారో, చట్టాలు అనుకూలంగా ఉన్నాయో చూసుకోని ఆ చైన్‌ను తయారు చేస్తారు.

ఈ గ్లోబల్‌ వాల్యూ చైన్ల పనిలో అనేక దేశాలలో అనేక నెట్‌ వర్క్స్‌ ఉంటాయి. వాటిని అన్నింటిని బహుళ జాతి సంస్థలే కోఆర్డినేట్‌ చేసుకుంటాయి. అవి అలా నడపడం కోసం సామ్రాజ్యవాద దేశాల, అలాగే లోకల్‌ ప్రభుత్వాల సహకారాన్ని తీసుకుంటాయి. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ లెక్కల ప్రకారమే ఆధునిక బానిసత్వం మూలంగా బహుళ జాతి కంపెనీలు ప్రతి సంవత్సరం 150 బిలియన్‌ డాలర్ల లాభం పొందుతున్నాయి. గ్లోబల్‌ వల్యూ చైన్‌ నెట్‌ వర్క్స్‌లో పని చేసే వారికి వారి శ్రమ ఫలితాలు ఎవ్వరు అనుభవిస్తున్నారో తెలువకపోవచ్చు, కొన్ని సందర్భాలలో వాళ్లు తమ ఆర్థిక పరిస్థితుల మూలంగా ఆయా కంపెనీలలో పనిచేస్తుండొచ్చు … ఏది ఏమైనా అక్కడ జరిగేది శ్రమ దోపిడీ.

ఆ శ్రమ దోపిడీ మూలంగా తయారయిన సరుకులు అందమైన లేబుల్స్‌తో ప్యాకేజులుగా మారి మార్కెట్‌లోకి వస్తాయి. వాటిని ఉపయోగించే మధ్య తరగతి, ఆ పై తరగతికి ఈ గ్లోబల్‌ దోపిడీ దొంగల గుట్టు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఏ కంపెనీ ఎక్కడ తన ‘‘వాల్యూ చైన్‌’’ వివరాలను బయట పెట్టదు. ఈ కార్పొరేషన్లకు కు కావాల్సిన మద్దతును పౌర సమాజం నుండి కూడగట్టడానికి ప్రభుత్వేతర సంఘాలను (ఎన్‌ జి వో) తమ పనిలో భాగం చేయడానికి ‘‘భాగస్వామ్యం’’ అనే అందమైన పదాన్ని తెర మీదికి తీసుకొచ్చారు ప్రపంచబ్యాంక్‌ అధ్యక్షుడు జేంస్‌ వల్ఫెన్సన్‌.

నిజానికి కార్పొరేటీకరణ మూలంగా పెట్టుబడి మాత్రమే ప్రపంచ వ్యాప్తం కావడం కాదు, కార్పొరేట్‌ నేరాలు కూడా ప్రపంచమంతా విస్తరిస్తున్నాయి. ఆ నేరాలకు సామ్రాజ్యవాద దేశాల, దళారీ ప్రభుత్వాల అండదండలు ఉంటున్నాయి. నిజమే, కార్పొరేషన్ల నుండి మానవ విలువలను, నైతికతను ఆశించడం పొరపాటే అవుతుంది. కాబట్టి ఆ సంస్థలు ప్రతి నిత్యం ప్రచారం చేసుకునే ‘‘కార్పొరేట్‌ సామాజిక బాధ్యత’’ లో ఉన్న వైరుధ్యాన్ని బయటపెట్టాలి. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం వాటికి వంత పాడే మేధావులను భావజాల రంగంలో ఎదుర్కొని ఓడించాలి.


6

ప్రపంచ రాజకీయార్థిక రంగంలో రోజురోజుకు పెట్టుబడి కేంద్రీకరణ జరుగుతావుంది. కార్పొరేషన్లు ఆ కేంద్రీకరణలో భాగంగా పనిచేస్తున్నాయి. పెట్టుబడులను పోగేస్తున్నాయి. వాస్తవానికి ఈరోజు ప్రపంచ పెట్టుబడిదారీవ్యవస్థలో వున్న సమస్య కావాల్సినంత పెట్టుబడులు లేకపోవడం కాదు.. పెట్టుబడులు అతిగా పోగుగావడం (over accumulation of capital). పోగవుతున్న పెట్టుబడులను నిరంతరంగా ఎలా అభివృద్ధ్ది చెయ్యాలనే ప్రయత్నంలో భాగానే చౌక శ్రమశక్తి,, ప్రకృతి వనరులు, అనుకూల రాజ్యవ్యవస్థల వేటను కర్పొరేషన్లు ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తున్నాయి.

ఇటువంటి సందర్భంలో భారతదేశ బూర్జువా రాజకీయాలలో గుణాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. గత ముప్పై సంవత్సరాలుగా నూతన ఆర్థిక విధానాల పేరిట దేశం డోర్లను కార్పొరేట్‌ సంస్థల కోసం పూర్తిగా తెరిచివేశారు. అన్ని రంగాలలో వ్యవస్థాపక సంస్కరణలు అమలుచేశారు. ఒకవైపు బహుళజాతి సంస్థలను ఆహ్వానిస్తూనే మరోవైపు పాలకవర్గ అనుకూల దేశీయ కార్పొరేషన్ల అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అన్ని రకాల పబ్లిక్‌ వనరులను ప్రైవేట్‌ కార్పొరేషన్లకు ధారాదత్తం చేస్తున్నారు.

బూర్జువా పార్టీలలో కొన్ని విధానపరమైన తేడాలు ఉన్నాయి కాని ఆర్థిక సంస్కరణల విషయంలో అన్ని పార్టీలు పోటీ పడి మరీ అమలు చేస్తున్నాయి. బహుశా ఇదొక్కటి చాలు అన్ని బూర్జువా పార్టీలు ఏవిధంగా ప్రజా వ్యతిరేక అజెండాలో భాగమయివున్నాయో అర్థం కావడానికి. బహుశా ఈ ప్రక్రియ సామ్రాజ్యవాద శక్తులకు చాలా అనుకూలమైనది.

‘‘స్వదేశీ,’’ ‘‘జాతీయవాదం’’ నినాదాలతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద ప్రపంచీకరణను అమలుచేయడంలో రూపంలో కాని, సారంలో కాని ఇతర బూర్జువా పార్టీలతో ఎలాంటి భేదం లేదు. నిజానికి సంఘ్ పరివార్‌ నిర్మాతలు ఎవ్వరు కూడా నిశితంగా తమదైనా ఆర్థిక విధానాన్ని ఎక్కడా ప్రకటించలేదు. అయితే 1990లలో అమలులోకి వచ్చిన ఆర్థిక సంస్కరణలను వ్యతిరేకించడానికంటూ ఆర్‌ ఆర్‌ ఎస్‌ అనుబంధ సంస్థ ‘‘స్వదేశీ జాగరన్‌ మంచ్‌’’ను 1991లో ఏర్పరిచారు. కాని ఆ సంస్థ ఎలాంటి ప్రపంచీకరణ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించకపోగా, చివరికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను సరిగ్గా అమలుచేయకపోవడం మూలంగానే ఈ రోజు దేశం ఆర్థికంగా వెనుకబడివుందనే స్థాయికి చేరుకుందని విమర్శించారు.

మోడీ ప్రభుత్వం తనదైన విధంగా కార్పొరేట్‌ శక్తులకు సేవ చేయడం కోసం ప్లానింగ్‌ కమీషన్‌ను రద్దు చేసి దాని స్థానంలో National Institution for Transforming India Aayog (NITI Aayog) ను ఏర్పాటుచేసింది. అది చేసిందల్లా అనేక రంగాలలో ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు, విదేశీ పెట్టుబడులకు మార్గం సులుభతరం చెయ్యడం. ఇవన్నీ చేసినందుకే మోడీని ‘‘వికాష్‌ పురుష్‌’’ (Man of Development)గా స్వీయ అభినందనలు చెప్పుకున్నాడు. ‘‘మంచి రోజులు’’ వస్తాయని ఊదరగొట్టి ప్రజలకు ఎండమావులు ఎదురుచూపులనే మిగిల్చారు.

ఒకవైపు పెట్టుబడుల అభివృద్ధికి అనుకూలంగా ఆర్థిక సంస్కరణలను అమలుచేస్తూనే, సామాజిక, రాజకీయ రంగంలో తన శక్తిని కేంద్రీకృతం చేసుకుంటుంది సంఘ్ పరివార్‌. ఆర్టికల్‌ 370 రద్దు, సిటిజన్షిప్‌ అమెండ్మెంట్‌ ఆక్ట్‌ వంటి వాటితో ‘‘ఒక జాతి’’ అనే తన నినాదాన్ని పాలసీగా అమలుచేస్తుంది, దానికి అనుగుణంగా సమాజంలో ఒక పెద్ద మొత్తాన్ని ఆ భావజాలంలో ముంచేస్తుంది. చరిత్రను వక్రీకరిస్తున్నారు, విద్యను కాషాయీకరణ చేస్తున్నారు. మీడియా హిందుత్వ శక్తుల జేబుసంస్థగా మారిపోయింది. న్యాయస్థానాలు సహితం మనుధర్మాన్ని తీర్పులుగా చెప్పే రోజులొస్తున్నాయి. రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. హిందువులకు ఒక బాధిత (victimhood) పాత్రను అంటగట్టి, లౌకికవాదమే వారి కష్టాలకు మూలమని మత మైనారీటీల మీద విషం చిమ్ముతున్నారు. ప్రశ్నించే అన్ని గొంతుల మీద త్రిశూలాలు వేలాడుతున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థలోని ప్రతిపక్షాలను తమలో కలుపుకోవడమో లేదా లేకుండ చేయడమో చేసినా ఆశ్చర్యపోయేది లేదు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో దేశంలోని ఏ పార్లమెంటరీ పార్టీకి కూడా (కొన్ని వామపక్షాలు మినహా) తనకంటూ ఒక వెన్నుముక లేదు. అవకాశవాదమే వాటి రాజకీయం. అన్నింటికి మించి అన్ని పార్టీలు బ్రాహ్మణీయ భావజాలంలో పుట్టి పెరిగినవే, కాబట్టి అవసరం అయితే సంఘ్ పరివార్‌ పంచన చేరడం వాటికి కష్టం కాదు.

నిజానికి సామ్రాజ్యవాదానికి, హిందుత్వ ఫాసిజానికి ఒక ఆర్గానిక్‌ సంబంధం వుంది. ఆ రెండింటిలోను ఆధిపత్యం, అణిచివేత, పరాయీకరణ స్వతహాగా వున్న లక్షణాలు. అవి ఒకదానికొకటి సహకరించుకోవడం పెద్దగా ఆశ్చర్యపోయే అంశం కాదు. సామ్రాజ్యవాద పెట్టుబడులు నియంతలను, ఫాసిస్టులను పెంచి పోషించిన చరిత్ర మన కళ్ళ ముందే వుంది. అయితే చరిత్ర మనకు మరో నిజాన్ని కూడా గుర్తు చేస్తుంది. చరిత్రలో ఏ నియంతలు, ఫాసిస్టులయినా అంతిమంగా ప్రజల చేతుల్లో ఓడిపోక తప్పదు.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

5 thoughts on “కార్పొరేటీకరణ – అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు

 1. మీ ఆర్టికల్స్ ఆసక్తిగా చదువుతాను
  చాలా బాగా రాశారు. అభినందనలు.
  చివరి మాటలను పెట్టిబడిలోని ఆంతర్గత
  వైరుధ్యాలు నెపద్యములో ఈనాటి
  స్థల కాలాల్లో ఎట్లా అర్థము చేసుకోవాలి.
  అంటే ఈ పరిణామాలను కార్మిక వర్గ పోరాటం నుండి ఎట్లా చూడగలం.
  Karlmarks 1848 నుండి 1851
  ఫ్రాన్స్ లో జరిగిన పరిణామాలను
  చూసిన పద్దతిలో.
  నాకు చాలా విషయాలూ ఈ ఆర్టికల్ వలన తెలిశాయి.

 2. చాలా విషయాలు తెలుసు కున్నాము.
  చాలా బాగుంది. విపరీత వాదాలు చేసే వారు ఎక్కువ మంది ఈ ఆర్టికల్ చదవాలి.

Leave a Reply