కామ్రేడ్ పి.కే. మూర్తి అమరత్వం – వున్నత హిమాలయం !!

అమరత్వం అస్తమిస్తున్న ఎర్రని సూర్యునిలా విశ్వవ్యాపితమై ఉదయాన్నే తూర్పున ఉషోదయమై మెరుస్తుంది.

పరిచయం

కామ్రేడ్ పి.కే. మూర్తి ఒక సాదా సీదా విప్లవ కార్యకర్త. నిరాడంబర నాయకుడు. మట్టిమనిషి. నమ్మిన జెండాను, సిద్ధాంతాన్ని చివరి శ్వాస వరకు వదిలి వేయని నిరంతర శ్రామికుడు. అలుపెరుగని కష్టజీవి. నిరాడంబర మార్క్సిస్ట్- లెనినిస్ట్. పి.కే మూర్తి అంతర్జాతీయ పౌరుడు. ఎప్పుడో తాత ముత్తాతలు వియత్నాంలో స్థిరపడినారు. పి.కే. మూర్తి గారు 1941లో ఎడ్మండ్ రతినే గా పుట్టింది అక్కడే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాక కష్ట పరిస్థితుల్లో 1954 లో మూర్తి గారి అమ్మ తన పిల్లలతో సహా పుదుచ్చేరి చేరుకుంది. మూర్తి గారు పుదుచ్చేరిలో విద్యాభ్యాసం కొనసాగించి వున్నత విద్యకై ఫ్రాన్సు వెళ్లారు. కొంత కాలం ఫ్రాన్స్ లో వుద్యోగం తదనంతరం 1968లో భారత దేశం వచ్చాడు. ఫ్రాన్స్ లో మే 1968 లో ఫ్రెంచ్ విద్యార్థుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1967లో భారతదేశంలో పెల్లుబికిన భూస్వామ్య వ్యతిరేక నక్సల్బరీ వసంత మేఘ గర్జన పిలుపుతో మూర్తి గారు ఇండియాకు తిరిగి వచ్చారు. ఫ్రాన్స్ వెళ్లేనాటికే పెరియార్ రామస్వామి భావజాలం కా. మూర్తిని బాగా ప్రభావితం చేసింది. ఇండియాకు వచ్చాక మూర్తి చింద్వార మధ్యప్రదేశ్ లో బొగ్గుగని కార్మికునిగా పనిచేస్తూ ఉద్యమ నిర్మాణం చేసాడు. తర్వాత కాలంలో బొంబాయిలోనూ, నాగపూర్ లోనూ అలా చాలా ప్రాంతాల్లో విప్లవోద్యమ నిర్మాణం లో పాలుపంచుకున్నాడు. మహారాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉంటూ మధ్యప్రదేశ్ లో పార్టీ నిర్మాణంకై కృషిచేసాడు.

పి.కే మూర్తి గారితో నా అనుబంధం:

పి.కే. మూర్తి గారు నాకు 1985 నుండి పరిచయం వున్నా 1990 నుండి సాన్నిహిత్యం పెరిగింది. కా. ఎన్. వి. కృష్ణయ్య సిరిసిల్ల MLA గా గెలుపొందాక ఆదర్శ్ నగర్ లోని న్యూ MLA క్వార్టర్స్ లో తరచుగా కలుసుకోవడం జరిగింది. సెప్టెంబర్ మొదటి వారం 1985, డిల్లీలో జరిగిన మూడు రోజుల “మార్చ్ ఎగైనెస్ట్ రెప్రెషన్” పై జరిగిన సదస్సులో కా. మూర్తన్న తో పరిచయం జరిగింది. ఈ సదస్సుకు మదన్న, కోదండ, ప్రదీపన్న, వీరన్న, రామారావు, గద్దర్, స్వామి, బుర్రా రాములు ఇంకా చాలామంది మిత్రులు వచ్చారు. డా. రామనాథం హత్యచేయబడ్డ రెండు మూడు రోజులకే ఈ సభ జరిగినట్టు గుర్తు.

మొదటి నుండి ఇండియాలో విప్లవ పార్టీలు చీలుతూనే వున్నాయి. కాని 1991-1992 కాలంలో ఏడు పార్టీల ఐక్యత దేశానికి ఒక ఆశలా మెరిసింది. ఈ ఆశ కూడా అనతి కాలంలోనే అంటే 1995 నాటికే ఆవిరైపోయింది. ఈ కొద్ది కాలంలోనే కామ్రేడ్ మూర్తి గారు మరచిపోలేని జ్ఞాపకాల ముల్లెను మాత్రం నా నెత్తిన పెట్టినాడు అనడం లో ఏ మాత్రం అతియోశక్తి లేదు.

ఏడు విప్లవ పార్టీలు ఐక్యతను ప్రకటించాక బహుశా మే 1992 లో బొంబాయిలో AIFTU మొదటి మహాసభ జరిగింది. ఆ మహాసభలకు 10 రోజుల ముందే కొంతమంది మిత్రులం కలిసి మహాసభ పనుల నిమిత్తం బొంబాయికి వెళ్లినం. అక్కడ బ్యానర్స్ రాయడం, పోస్టర్స్ రాయడం, స్టేజి డెకరేషన్ లాంటి పనులు మాకు అప్పజెప్పడం జరిగింది. నేను, ఓంకారన్న మరో ఇద్దరు బొంబాయి మిత్రులు అదేపనిగా పొద్దున్నే మొదలుకుని రాత్రి వరకు ప్రచార సామాగ్రిని తయారు చేసేవాళ్ళం. ఇక్కడ పి.కే.మూర్తి మాతో ఎక్కువ కాలం గడిపాడు. మూర్తన్న తోనే మొదటి సారి నత్తలు తిన్నాను, ఇంకా గుర్తుంది. ఇక్కడ నాతో చాలా విషయాలు మాట్లాడే వాడు, ఎక్కువగా భూస్వామ్య వ్యతిరేక పోరాటాల గురించి, వాటిల్లో వచ్చిన స్తబ్దత గురించి, జపాటిస్ట్ మెక్సికన్ రైతాంగ పోరాటాల గురించి చాలా విషయాలు వివరించేవాడు. అలాగే గని కార్మికుల పోరాటాలు, తాను ఈ పోరాటాల నిర్మాణం కొరకు ఎలా కార్మికుడిగా పనిచేసాడు మొదలైన విషయాలు చెప్పేవాడు. అలాగే బొంబాయి ఎయిర్ పోర్ట్ కార్మికుల పోరాటాల గురించి, టెక్స్ టైల్ కార్మిక పోరాటాల గురించి చర్చించే వాడు. నాకు ఇంకా గుర్తున్న మాటేమిటంటే, భారత దేశం లో ఇంకా పూర్తిగా లేదా సంపూర్ణంగా కార్మిక వర్గం రూపుదిద్దుకోలేదు. దీనికి కారణం మన దగ్గర వున్న కుల పునాది అని. కార్మికులు వర్గంగా వున్నా కులాలుగా విడిపోయి కుల సంబంధాలనే కల్గివున్నారు. కావున భారతదేశానికి కుల – వర్గ విముక్తి పోరాట పంథానే అవసరమని చెప్పేవాడు.

ఇక్కడే పి.కే. మూర్తి కి కార్మిక పోరాటాల పట్ల, కార్మికుల స్వభావం పట్ల నిశితమైన లోతైన అవగాహన వుందని అర్థమౌతుంది. ఈ మహాసభలో జోష్ నింపాడు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి తోనే నేను కామ్రేడ్ దివి కుమార్ కలిసి AIFTU మహాసభల స్వాగత గీతం రాసాము. దీనిని అమరుడు రామారావు సభ ప్రారంభ పాటగా పాడాడు.

తర్వాత అంటే బహుశా1994 మార్చ్ లో మార్క్సిజం–లెనినిజం-మావో ఆలోచనా విధానం పైన అంతర్జాతీయ కాన్ఫరెన్సు హైదరాబాలో జరిగింది. ఈ సభల నిర్వహణలో నా వంతు పాత్రగా బ్రోషర్ డిజైన్, బ్యానర్స్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్, గోడ రాతలు, పోస్టర్స్ డిజైన్ మొదలైన పనులను చేస్తూ, చేయిస్తూ ప్రచార సామగ్రిని సమకూర్చడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ బషీర్ బాగ్ లోని భారతీయ విద్యాభవన్ లో జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ప్రారంభానికి వారం రోజుల ముందు మూర్తన్న బొంబాయి నుండి ఇద్దరు మిత్రులను (ఆర్టిస్ట్) తీసుకు వచ్చి నాతో జతకట్టించాడు. ఆ సమయంలో దాదాపు రోజూ సాయంత్రం మూర్తన్న తో కలిసి ఇరానీ చాయ్ తాగుతూ చాలా సేపు మాట్లాడుకునేవాళ్ళం. తన విప్లవ అనుభవాలను, గని కార్మిక జీవితాన్ని, నిర్మించిన పోరాటాలను, కష్ట నష్టాలను మాతో పంచుకునే వాడు. కాని తన వ్యక్తిగత జీవితం గురించి ఒక్క మాట కూడా చెప్పేవాడు కాదు. అలా అలా మూర్తన్న తో సాన్నిహిత్యం పెరిగింది. ఈ సభకు దేశ విదేశాల ప్రతినిధులు వచ్చారు. ఈ కాన్ఫరెన్సు లో మూర్తన్న చాలా చురుకుగా పాల్గొని, కౌశిక్ బెనర్జీ, అలోక్, ప్రదీప్ లతో కలిసి కాన్ఫరెన్సు తదనంతరం చేయబోయే కార్యక్రమానికి ఒక దిశా, నిర్దేశాన్ని రూపొందించారు. ఈ సభలు దినమంతా జరిగేవి. సాయంత్రాలు కొద్దిమంది అంతర్జాతీయ ప్రతినిధులతో మూర్తన్న చర్చలు జరిపేవాడు. ఫ్రాన్స్ నుండి వచ్చిన ఒక కామ్రేడ్ తో మూర్తన్న ఫ్రెంచ్ లో మాట్లాడడం చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను. అప్పుడు మూర్తి గారు పారిస్ లో చదివాడని తెలుసుకుని ఆయనకు విప్లవం పై వున్న అచెంచల విశ్వాసంతో ఇండియాకు రావడం… అది చూసి నాకు ఆయన పై మరింత గౌరవం పెరిగింది.

ఆ తర్వాత ఒకసారి కలకత్తా మహాసభ లో కలిసాము. ఎప్పుడు కలిసినా మూర్తన్న ఆప్యాయత ఎక్కడో స్పృశిస్తూవుండేది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాతో చాలా ప్రేమ, ఆప్యాయత, అనుబంధం కలిగిన సహచరుడు ఉండేవాడు. ఆయన పేరు కూడా మూర్తి. మేము కలిసి దాదాపు ఒకే ఇంట్లో (‘విమోచన’ ఆఫీసులో) రెండు సంవత్సరాలు కలిసే ఉన్నాము. తర్వాత చిన్న వయసులోనే ఈ కామ్రేడ్ కాన్సర్ తో మరణించాడు. ఇరువురి నాయకత్వ స్థాయి వేరే కావొచ్చు. కాని వారి పలకరింపులు, ప్రేమ, అనుబంధం, నవ్వు, ఆప్యాయత అంతా ఒకే రకంగా గోచరిస్తాయి. ఇరువురు కాన్సర్ తో చనిపోవడం యాదృచ్చికమే. బాధాకరమే.

బహుశా కొన్ని నెలల తర్వాత నాగపూర్ లో ఆదివాసీల మీద జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అన్ని విప్లవ, అభ్యుదయ ప్రజా సంఘాలతో ఒక సభ జరిగింది. ఆ సభ కు నేనూ హాజరైనాను. అక్కడ నేనున్న మూడు రోజులు పి.కే.మూర్తి గారి ఆతిథ్యంలో వున్నాను. బొంబాయిలో కలిసిన మిత్రులు అర్పిత, కకోలి, ఆశిష్ మొదలైన వారు కలిసారు. ఖాళీ సమయాల్లో మూర్తి టెలి కమ్యునికేషన్, ఆదివాసి వుద్యమాల గురించి, చింద్వార బొగ్గు గని కార్మిక పోరాటాల గురించి మాకు వివరించే వాడు. అలా తెలియకుండానే మూడు రోజులు గడిచిపోయాయి.

తర్వాత కాలంలో హైదరాబాద్ రాణా ప్రతాప్ హాల్ లో “భారత దేశంలో సంస్కృతిక రంగం పై సామ్రాజ్యవాద దాడి” ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా కాన్ఫరెన్సు జరిగింది. ఈ సభలను విజయవంతం చేయడానికి మిత్రులు నారాయణ స్వామి, కిరణ్, సురేష్, నిర్మలాంద, నేను శక్తివంచనలేకుండా పనిచేసాము. మిత్రులు రవిబాబు, దివికుమార్, విమల, ఉదయ్, రామ్మోహన్ సార్ తదితరులు సహకారాన్ని అందించడంతో సభలు విజయవంతమైనాయి. అన్ని రాష్ట్రాలనుండి విప్లవ, అభ్యుదయ, దళిత సంఘాల కవులు, కళాకారులు వచ్చి సభలను పరిపుష్టం చేసారు. హైదరాబాద్ వీధులన్నీ సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలతో మార్మోగాయి. ఈ సభలకు పి.కే. మూర్తి గారు కూడా హాజరైనారు. చివరి రోజున సభ ముగింపులో మూర్తన్న చాలా మందిని స్టేజి మీదికి పిలిచి “హం హోంగే కామ్యాబ్, హం హోంగే కామ్యాబ్ ఏక్ దిన్” అనే పాటను ఎత్తుకుని దాదాపు అరగంట సేపు సభను ఒక ఊపు ఊపించాడు.

సందిగ్ద కాలం

అది సభల కాలం. ఉత్సాహాన్ని నింపిన కాలం. ఒకవైపు అతి సన్నిహిత కామ్రేడ్స్ ను, కార్యకర్తలను రాజ్యహింస లో భాగంగా పోగొట్టుకుంటున్న కాలం కూడాను. పార్టీలో దళిత వాదం పెరుగుతున్న కాలం. ఐక్యతగా నిలిచిన పార్టీల మధ్య మళ్లీ లైనుల గొడవలు. నిర్మాణ సంక్షోభం తదితర కారణాల వల్ల మళ్లీ చీలికలు. క్యాడర్ లో సడలుతున్న విశ్వాసం… అలా చాలామంది ఇంటికి వెళ్లిపోవడమో, వేరే విప్లవ సంస్థలో చేరడమో జరిగింది. తద్వారా విప్లవ అభిమానులు, శక్తులు నిరుత్సాహ పడ్డాయి. నిండుగా నింపుకున్న స్ఫూర్తి అంతా నీరుకారి పోయింది. తరువాత పరిస్థితుల రీత్యా కొందరు కార్యకర్తలు, కొంత మంది నాయకులు ఎవరి దారి వారు వెతుక్కోవడం జరిగింది.

సరిగ్గా ఇదే కాలంలో (1997) నాకూ ఆఫ్రికా లో ఉపాధ్యాయ వుద్యోగం రావడం నేనూ వెళ్లిపోవడం జరిగింది. కా. పి.కే మూర్తి తోనూ మరియు ఇతర మిత్రులతోనూ సహజంగానే దూరం ఏర్పడింది. కామ్రేడ్ మూర్తి ని చివరిసారి చలపతన్న రెండవ కొడుకు పెళ్ళిలో కరీంనగర్ లో కలవడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల విరామం తర్వాత కలిసాను. కలిసిన కొద్దిపాటి సమయంలో ఆప్యాయంగా పలరించుకున్నాము. చాలా ఏళ్ళ తరువాత కలిసినందుకు సంతోషపడ్డాం.

ముగింపు

మొన్న మార్చ్ 23 న పెద్ద విమలక్క మెసేజ్ పెట్టేవరకు మూర్తన్న అమరత్వం గురించి తెలియదు. ఇక్కడే వున్నా ఎలా మనుషులం దూరమయ్యామో అని కొంత బాధేసింది. మళ్లీ ఈ రోజు అంటే ఏప్రిల్ 16 న మిత్రుడు సుధాకిరణ్ ప్రదీపన్న మూర్తన్న పైన రాసిన వ్యాసం అనువాదాన్ని పంపాడు. ఆ వ్యాసం చదువుతున్నంత సేపు నా మనసంతా మూర్తన్నతో వున్న పాత జ్ఞాపకాల, అనుభవాల చుట్టే గిర్రున తిరిగింది, దాని ఫలితమే ఈ చిన్న జ్ఞాపిక. పి.కే మూర్తన్న పుట్టుపూర్వోత్తరాలు నిజానికి ప్రదీపన్న ప్రస్తావించే వరకు చాలామందికి తెలియవు. ప్రస్తుత కాలంలో మూర్తన్న వివరాలు తెలియజేసిన ప్రదీపన్నకు, తెలుగులో ‘సారంగ’లో ప్రచురించి అందరికి తెలియజేడంలో మిత్రుడు సుధాకిరణ్ కు ధన్యవాదాలు. మూర్తన్న ఔన్నత్యాన్ని తెలుసుకోవడం, మూర్తన్నను యాది చేసుకోవడం వచ్చే తరాలకు మూర్తన్నను పరిచయం చేయడం చాలా అవసరం. ఇప్పటికే చాలా మంది అమరులను మరిచిపోయే స్థితికి వచ్చాం. కొందరి జీవితాలు ఏమాత్రం కూడా తెలియని పరిస్థితి. కొందరు శత్రు దాడుల్లో, ఇతరత్రా కారణాలతో చనిపోతే వారు ఎవరు? ఎక్కడ పనిచేసారు? ఎందుకు అమరత్వం పొందారో కూడా తెలియని స్థితి లో వున్నాం. కాబట్టి కనీస మానవీయ బాధ్యతగా వారి కృషిని, త్యాగాన్ని స్మరించుకుని వారి అమరత్వం వృథా కాదని యాది చేసుకుందాం. నివాళులు అర్పిద్దాం. మూర్తన్న ఒక సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన మరణం భారత విప్లవోద్యమానికి తీరని లోటే. ఆయన అమరత్వం హిమాలయ శిఖరం లాంటిది. మనలో ఇంకా ఎవరితో ఎలాంటి అనుబంధాలు మూర్తన్న పంచుకున్నాడో, మిగిల్చాడో అందరూ నెమరు వేసుకుంటూ అక్షర రూపంలో అందరి ముందు పరిస్తే మూర్తన్నకు నిజమైన నివాళులు అర్పించిన వారమౌతాం.

ఇక్కడ ఇద్దరు మూర్తులు మూర్తీభవించిన మూర్తిత్వాన్ని కలిగివున్నారు. ఇరువురి మరణం గుండెలో కలుక్కుమనే అంశమే. కాని కాల ప్రవాహం సాగుతూనే వుంటుంది. ఒకరు (పి.కే.మూర్తి) 80 ఏళ్ళ వయసులో, మరొకరు (మూర్తి అంకుష్ గ్రాఫిక్స్) 40 ఏళ్ళ వయసులో మనలను వీడినా వారి అమరత్వం అస్తమించిన అరుణారుణ సూర్యబింబంలా ఎర్రజెండై రేపొచ్చే ఉషోదయమౌతుందని ఆశిస్తూ ఇరువురికి నివాళులు అర్పిస్తూ…

ఊరు సిరిసిల్ల. సాహితీ ప్రియుడు. ఆఫ్రికా లో రెండు దశాబ్దాలు అధ్యాపకుడు గా పనిచేసాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం.

5 thoughts on “కామ్రేడ్ పి.కే. మూర్తి అమరత్వం – వున్నత హిమాలయం !!

  1. Chala baga rasavu Srinu! Very touching. I did not know the details about your interactions with P K Murthy. He was a wonderful human being.
    Thank you for sharing these. You should continue to write… your narration style is good

  2. బాగుంది శ్రీనూ. మూర్తి లాంటి అరుదైన వ్యక్తులతో పరిచయమూ, జ్ఞాపకాలూ మనతో నిలిచి పోతాయి. విమోచన మూర్తి కూడా..

  3. మూర్తి గురించి,మీ గురించి చక్కగా రాసారు

  4. పి. కె. మూర్తి. మ‍హామ‍నిషి అనడానికి అన్ని విధాల‍ తగిన నాయ‍కుడు. అలాంటి భౌతికంగా మాత్రమే మరణిస్తారు. శ్రీనివాస్‍, మీరు రాసిన పరిచయం చాల బాగుంది. ఆత్మీయంగా ఉంది.

Leave a Reply