కశ్మీర్ -భారత ఉదారవాదుల దృక్పథం

అక్టోబర్ నెల మొదట్లో సతీశ్ ఆచార్య అనే ప్రముఖ కార్టూనిస్టు ఒక కార్టూన్ గీశారు. ఆ కార్టూన్ లో శ్రద్ధా బిండ్రు అనే కశ్మీరీ పండిత మహిళ, హత్యకు గురి అయిన తన తండ్రి దేహాన్ని ఒడిలో ఉంచుకొని -గడ్డాలు పెంచి, తుపాకి పట్టుకొని అచ్చూ ముస్లిం టెర్రరిష్టులాగా మనకు మీడియాలో నిత్యం కనిపించే ఒక వ్యక్తితో ‘మీరు పిరికి వాళ్లు’ అంటున్నట్లుగా గీసి ఉంటుంది. ఈ కార్టూన్ నేపథ్యం తెలియని వారికి అది ఎందుకు గీశారో అర్థం కాకపోవచ్చు.

శ్రీనగర్ నడిబొడ్డున పెద్ద ఎత్తున మందుల వ్యాపారం చేస్తున్న మఖన్ లాల్ బిండ్రు అనే కశ్మీరీ పండితుడిని అక్టోబర్ 6న గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అతని హత్య గురించి లోయ మొత్తం విలపించింది. ఎందుకంటే 1989లో వేలాది కశ్మీరీ బ్రాహ్మలు లోయను వదిలి వెళ్లిపోయినపుడు అతను కశ్మీరి ముస్లిముల మీద నమ్మకం ఉంచి ధైర్యంగా లోయలో ఉండిపోయాడు. ఆయన అలా ఉండిపోయినందుకు కశ్మీరీలు చాలా సంతోషించారు. అలాంటి 86 కుటుంబాలు ఇంకా శ్రీనగర్ లో ఉన్నాయి. కశ్మీర్ సమస్య గురించిన చర్చ వచ్చినపుడంతా -అది ప్రాణాలను హరించిన దాష్టీకమైనా, కశ్మీరి మహిళలపై అత్యాచారాలు అయినా, వాళ్ల భూములను లాక్కొంటున్న దౌర్జన్యమైనా, హిందూ ముస్లిం జనాభా నిష్పత్తిని తారుమారు చేసే కుట్ర అయినా, ఉద్యోగాలకూ ఉపాధులకూ కశ్మీరీలను దూరం చేసే దురాలోచన అయినా, వారి వనరులను కశ్మీరేతరులకు అప్పచెప్పే విష యత్నం అయినా, 370 రద్దు తరువాత కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసేసుకోవచ్చు అంటూ వచ్చిన అవమానకర వాఖ్యలు అయినా -ముందుగా మాట్లాడేది కశ్మీరీ బ్రాహ్మణుల వలసల గురించి. అనేకానేక దౌర్జన్యాలనూ, అణచివేతలకూ, అవమానాలకూ విరుగుడుగా ఈ అస్త్రాన్ని అనాదిగా భారతదేశంలో ఉపయోగిస్తూ వస్తున్నారు.

కశ్మీరి బ్రాహ్మణ అపరాధ భావాన్ని కశ్మీరి ముస్లిముల అణువణువులో నింపి కశ్మీరి సంక్షోభానికి కారకులుగా బాధితులైన ముస్లిములనే తలవంచుకొనేటట్లు చేసే ప్రయత్నం ఎప్పటి నుండో జరుగుతోంది కాబట్టి లోయలో మిగిలి ఉన్న కశ్మీరి బ్రాహ్మణులను కశ్మీరి ముస్లిములు జాగ్రత్తగా చూసుకొన్నారు. వారిని తమ సాంస్కృతిక వారసత్వంగా ఎక్కువ మంది కశ్మీరీలు భావిస్తారు. అలా చూసుకోబట్టే బిండ్రు మందుల వ్యాపారం శ్రీనగర్ లో మూడు పువ్వులు, ఆరు కాయలుగా గత 30 సంవత్సరాలుగా కొనసాగింది. ఆయన కొడుకు డా. సిద్దార్ధ బిండ్రు డయబెటాలజిస్ట్ గా శ్రీనగర్ లోనే చేస్తున్నాడు. ఆయన కూతురు శ్రద్ధా బిండ్రు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఢిల్లీలో పని చేస్తోంది. లోయలో ఉండిపోవటానికి ఆయన ఎంత ధైర్య సాహసాలు చూపించాడో, కశ్మీర్ లోయ అనేక రక్తపాతాల్లో మునిగి తేలినా కూడా ఆయనకు కానీ, ఆయన కుటుంబానికి కానీ కించిత్తు హాని కలగకుండా చూసుకోవటంలో కశ్మీర్ ముస్లిములు అంతే శ్రద్ధ వహించారు. మఖన్ లాల్ బిండ్రు హత్యకు హతాశులై కశ్మీర్ సభ్య సమాజం ఆయనకు నివాళి ప్రకటించింది. హంతకుల మీద ఆగ్రహం ప్రకటించింది.

అయితే ఈ ఘటన ఎలా జరిగిందనే విషయం కాసేపు పక్కన బెడితే, అంత్యక్రియల సమయంలో ఆయన కూతురు శ్రద్ధా బిండ్రు కొన్ని గాయపరిచే వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి తమకు విద్యనిచ్చాడనీ; మీ రాజకీయ నాయకులు మీకు రాళ్లూ, బుల్లెట్లూ, పెల్లెట్లూ సమర్పించారనీ కనబడని హంతకులను ఉద్దేశించి ఆమె అన్నది. బుల్లెట్లూ, పెల్లెట్లూ పదాలు వాడింది కాబట్టీ, ఈ మధ్య కాలంలో అవి కశ్మీరీ ముస్లిముల పర్యాయపదాలు అయ్యాయి కాబట్టి -ఆమె హంతకులను కశ్మీరీ ముస్లింలుగానే భావించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థం అవుతుంది. హత్య చేసింది ఎవరో నిర్ధారణ కాకుండానే ఆమె ఈ తీర్పునిచ్చింది. అంతే కాదు, కశ్మీరీలను సరిగ్గా చదువుకొని తరువాత పోరాడమని సలహా ఇచ్చింది. తన అన్న డాక్టర్ అనీ, తాను అసిస్టెంట్ ప్రొఫెసర్ ననీ, తన తల్లి ఇప్పటికీ తమ మందులో షాపులో కూర్చుంటుందనీ –పండిత స్వాభిమానం అంటే అలాంటిదనీ ఆమె అన్నది. ఆమె దుఃఖంలో ఆ మాటలు అంటున్నదని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినా కూడా కశ్మీర్ ముస్లిం యువత ఆ వ్యాఖ్యలకు నొచ్చుకొన్నారు.

1927లో ‘దేశ పౌరుల వారసత్వం’ నిర్ణయం అయ్యాక, కశ్మీర్ దర్బార్ 12 విద్యా వేతనాలను మంజూరు చేసి, అందులో ఒకటి మాత్రమే ముస్లిములకు కేటాయించింది. ఈ చర్యకు జమ్మూ, కశ్మీర్ రెండు ప్రాంతాల్లో ముస్లిం ప్రజల్లో వచ్చిన నిరసనకు కొంత భయపడి; మహారాజు ముస్లిములకూ హిందువులకూ ఇద్దరికీ సమాన ప్రాతిపదికన స్కాలర్షిప్పులు ప్రకటించాడు. అంతేకాదు, శ్రీనగర్ మున్సిపాలిటీలో కొన్ని పోస్టులు కేవలం ముస్లిములకే కేటాయిస్తూ నోటీసు ఇచ్చాడు. కశ్మీరీ పండితులు, ఈ చిన్న అవకాశాన్ని కూడా ముస్లిములకు ఇవ్వటానికి అప్పట్లో అంగీకరించలేదు. ప్రభుత్వం మతతత్వానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఈ ఆరోపణను సాకుగా తీసుకొని డోగ్రా రాజులు ఆ నోటీసును వెనక్కి తీసుకొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కశ్మీర్ లో 1934లో గ్లాన్సీ కమిషన్ వేసే సమయానికి కేవలం 2 శాతం మాత్రమే ముస్లిములు విద్యావంతులై ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా తక్కువమంది కశ్మీరీ ముస్లిములు పని చేస్తున్నారు. మైనారిటీగా ఉన్న పండితులు వివిధ ప్రభువుల కాలంలో దర్బారు భాషలను నేర్చేసుకొని ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులను పొందారు. మెజారిటీగా వున్న ముస్లిముల మాతృభాష కశ్మీరీగాని, ఉర్దూగాని ఎప్పుడు రాజభాషగా లేవు. గ్లాన్సీ కమిషన్ ఉద్యోగాల్లో, చట్టసభల్లో ముస్లిములకు వారి వంతు భాగాన్ని ఇవ్వాలని ప్రతిపాదించటం సహించని పండితులు అసంతృప్తులు అయ్యి రొట్టె ఉద్యమాన్ని కూడా అప్పుడు నడిపారు.

ఇదంతా చరిత్ర. పాలకులు మైనారిటీ హిందువులు అయ్యి, పాలితులు మెజారిటీ ముస్లిములు అయిన ఆక్రమిత రాజకీయాల పర్యవసానం ఇది. ఒక వర్గం -కొన్ని తరాలుగా ఒక సమూహాన్నిఅణచివేతకు గురి చేస్తూ, తాను కుల మతపరమైన ప్రాబల్యాన్ని అనుభవిస్తూ, ఒక దశలో అణగారిన వారికి బిక్షగా వచ్చే కొద్దిపాటి సౌకర్యాలకు కూడా ఇతర ఆసక్తులు ఉన్నాయని అనటం ఎప్పటినుండో జరుగుతుందని ఆధునిక కశ్మీర్ చరిత్ర చెప్పింది.

ఇప్పుడు ఈ శ్రద్ధా బిండ్రు అనే ఆమె తన తండ్రి చనిపోయిన బాధతోనైతేనేమీ, ఇంకో కారణంగానైతే నేమి కశ్మీరీ ముస్లిముల విద్యను తక్కువ చేసి మాట్లాడింది. గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండేవాళ్లు, ఆ గొప్పతనానికి తమ ‘పండిత ప్రత్యేకతే’ కారణం అనుకొనే తలపొగరు ఆమెది. అయితే శ్రద్ధా బిండ్రుకి తెలిసి కూడా మాట్లాడని విషయం ఒకటి ఉంది. ఆమె బుల్లెట్లూ, పెల్లెట్లూ అని వేటిని హేళన చేసి మాట్లాడిందో, వాటిని వరించి అమరత్వం పొందిన వాళ్లలో డాక్టర్లు, ఇంజనీరులు, ప్రొఫెసర్లు ఉన్నారు. జాతి విముక్తి కాంక్షతో తమ కెరీర్ ను, కుటుంబాలనూ, తమ నవ యవ్వనాలనూ త్యాగాలు చేసి ప్రాణాలు బలి ఇచ్చిన వాళ్లు కశ్మీర్ లో ఉన్నారు.

అంతే కాదు ఈ 74 సంవత్సరాలలో ఎంతోమంది కశ్మీరీ ముస్లిముల తండ్రులు, కొడుకులు, సోదరులు, ఇరుగుపొరుగు వాళ్లు -నిర్బంధంలోకి వెళ్లారు, హింసకు గురి అయ్యారు, అదృశ్యమై పోయారు, హత్యకు గురి అయ్యారు. బరువైన బూట్లను టకటకలాడించుకొంటూ, భారీ ఆయుధాలతో సామాన్య ప్రజల ఇళ్లల్లోకి దూసుకొని ప్రవేశించి, ఇంటి సర్వస్తాన్ని చిందరవందర చేసే దౌర్జన్యం గురించి శ్రద్ధా బిండ్రుకు తెలుసో లేదో! గ్రామాలకు గ్రామాలను చుట్టుముట్టి కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్లతో రోజుల తరబడి మోకాళ్ల మీద కూర్చోపెట్టిన అమానుషం గురించి ఆమెకు తెలియకుండా పోతుందా? ఎదురు కాల్పుల్లో మరణించటం, దారి తప్పిన మందుగుళ్లు తగిలి మరణించటం, పొరపాటు గుర్తింపుతో హత్యకు గురి అవటం, లోహపు పెల్లట్లతో చంపబడటం, ఇళ్లల్లో ఉన్నవారికి కూడా పెల్లెట్లు తగిలి అంధులవటం -ఇవన్నీ ఆమెకు తెలియవని అనుకోలేము. సంతాపాలతో, ఖండనలతో కశ్మీరీలు ఆమెకు చేరువ అవటానికి ప్రయత్నిస్తే ఆమె ప్రతీకారంతో ప్రతిస్పందించింది. అచ్చు హిందుత్వ జాతీయ గొంతుకతో ఆమె మాట్లాడింది. సరే ఇప్పుడు ఆమె ఢిల్లీ వెళ్లిపోయి ఉంటుంది. అక్కడ ఆమెకు 900000 సైన్యం చుట్టుముట్టి పహరా కాస్తూ ఉండరు. లేకపోతే రాళ్లు విసిరే పిడికడు మందితో ఆమెకు ప్రమాదం ఉండదు. ఆమె అక్కడ క్షేమంగా ఉందని ఆశిద్ధాము.

ఇంతకూ శ్రద్ధా బిండ్రు అరువు తెచ్చుకొన్న గొంతుక భారత సైన్యానిది. వాళ్లూ, వాళ్ల తోకలుగా ఉండే భారత మీడియా -ఈ హత్యతో పాటు అక్టోబర్ లో వరుసగా జరిగిన అనేకానేక హత్యలకు ‘రెసిస్టంట్ ఫ్రంట్’ పేరుతో ఉన్న మిలిటెంట్లను బాధ్యులుగా చేస్తూ చెబుతున్నారు. వాళ్ల ఆరోపణలకు ఎలాంటి ఆధారాన్ని ఇప్పటి వరకూ చూపించలేదు. అసలు రెసిస్టంట్ ఫ్రంట్ అనే బ్రహ్మ పదార్థం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు.

అక్టోబర్ లోనే, మఖాన్ లాల్ బిండ్రు హత్యకు ముందూ తరువాత కూడా అనేక హత్యలు లోయలో జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కశ్మీరీలను, కశ్మీరేతరులను కొన్ని ఎన్నుకొన్న ప్రదేశాల్లో కాల్చి చంపారు. వారిలో ముగ్గురు కశ్మీరీ పండితులు, ఇద్దరు సిక్కులు, ఇద్దరు వలస కార్మికులు, 21మంది కశ్మీరీ ముస్లిములు ఉన్నారు. 10మంది శ్రీనగర్ లో, 4గురు పుల్వమాలో, 4గురు అనంతనాగ్ లో, ముగ్గురు కుల్గామ్ లో, ఇద్దరు బారాముల్లాలో, ఒక్కళ్లు బుద్గామ్ లో -ఈ ‘గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో’ చనిపోయారు. కశ్మీరీ హత్యల కారకుల చిట్టాలో ఈ ‘గుర్తు తెలియని వ్యక్తులు’ కూడా కొత్తగా చేరారు. చనిపోయిన వారిలో ముస్లిమేతరులకు ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. ముస్లిములకు గౌరవ అంత్యక్రియలను కూడా తిరస్కరించి వాళ్ల స్వస్థలాలకు దూరంగా పూడ్చి పెట్టారు.

సరే. ఇవన్నీ గుర్తు తెలియని వ్యక్తులు చేసిన హత్యలనే అనుకొందాం. నిత్యం లోయలో బరువైన ఆయుధాలతో తిరుగుతూ, కశ్మీరీల గుండెల మీద తిష్ట వేసి అందరికీ గుర్తు తెలిసిన మిలటరీ వ్యక్తులు -మఖన్ లాల్ బిండ్రు హత్య జరిగిన వెనువెంటనే ఇద్దరు సామాన్య పౌరులను చంపేశారు. అందులో ఒకరు పర్వేజ్ అహమ్మద్ అనే 26 సంవత్సరాల యువకుడు దక్షిణ కశ్మీర్ సంచార జాతికి చెందిన వాడు. వలస కూలీ అయిన అతను ఒక గ్రామంలో వరికోత కూలికి వెళ్లి, అనంత్ నాగ్ దగ్గరి మొంఘల్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న చెక్ పాయింట్ మీదుగా వస్తుండగా, అతను ప్రయాణిస్తున్న కారు ఆగకుండా వెళ్లిందనే కారణం చెబుతూ కాల్పులు చేయగా అతను అక్కడికక్కడ మరణించాడు. నిరుపేద అయిన పర్వేజ్ అహమ్మద్ కు ఇద్దరు చిన్నఆడ పిల్లలు, గర్భవతి అయిన భార్యతో సహా ఏడుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. అతని శవాన్ని పోలీసుల ఆదేశాలతో అర్థరాత్రి హడావుడిగా పూడ్చి పెట్టాల్సి వచ్చింది.

కశ్మీర్ షొపియన్ జిల్లాలోని బాబాపొర ప్రాంతపు జైన్ పొర గ్రామానికి దగ్గరలో 21 సంవత్సరాల షాహిద్ అజీజ్ అనే కుర్రవాణ్ణి సియార్పీఫ్ దళాలు కాల్చి చంపాయి. అతను అనంతనాగ్ జిల్లాకు చెందిన వాడు. షోపియాన్ ఆపిల్ తోటల్లో పని చేయటానికి వచ్చాడు. మిలిటెంట్స్ తో తాము ఘర్షణ పడుతుండగా పొరపాటున ఈ కుర్రాడికి బుల్లెట్ తగిలిందని సియార్పీస్ బొంకుతున్నది. నిజానికి అలాంటి కాల్పులు ఏవీ జరగలేదని, అజీజ్ ను కావాలనే బులెట్ తో కాల్చి చంపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షులలో అజీజ్ తమ్ముడు కూడా ఉన్నాడు. అతని నిరుపేద కుటుంబం కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది.

కశ్మీరీలు ఇప్పుడు ‘గుర్తు తెలియని వ్యక్తుల’, ‘గుర్తు తెలిసిన మనుషుల’ -ఇద్దరి చేత ప్రాణాలు కోల్పోతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుంది అర్థం కానీ స్థితి కశ్మీర్ లో ఉంది. ఇంకో పక్క ‘గుర్తు తెలియని వ్యక్తులు వీళ్లే’ అని చెబుతూ అమాయక పౌరులను ఎన్కౌంటర్ లో ‘గుర్తు తెలిసిన మనుషులు’ నిస్సంకోచంగా చంపేస్తున్నారు. షకీర్ అహమ్మద్ వాని అనే ట్రాక్టర్ డ్రైవర్ పుల్వమా కోర్టులో తన పనికి సంబంధించిన ఒక కేసు నిమిత్తం వెళ్లి, హటాత్తుగా మిలిటెంట్ అయిపోయి ఎన్ కౌంటర్ కు బలి అయిపోయాడు. ఒక కశ్మీరేతరుని మీద కాల్పులను ఇతనే చేశాడని చెబుతూ, అతన్ని ఎన్ కౌంటర్ చేశారు. తన తమ్ముడు మిలిటెంట్ అయితే అతని కోసం ఎప్పుడూ ఎందుకు పోలీసులు ఇంటికి రాలేదనీ షకీర్ అన్న ప్రశ్నించాడు. షకీర్ శరీరాన్ని కూడా, అతని స్వస్థలానికి దూరంగా కుప్వారాలో పూడ్చి పెట్టారు. అలాగే అక్టోబర్ 5న ఒక సుమో డ్రైవర్ పై కాల్పులు చేసాడని చెబుతూ బండిపొరకు చెందిన ఇంతియాజ్ అహమద్ దార్ ను ఎన్ కౌంటర్ చేశారు. అతను ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన వాడు. వరి పొలంలో కోతల పని చేస్తున్న అతన్ని రమ్మని పిలిచి, చంపాక అతనికి లష్కర్ తోయిబా మిలిటెంట్ అనే నామకరణం చేశారు.

ఈ ఎన్ కౌంటర్లలో బలి అయిన వారిని జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ ఒక్కొకప్పుడు లష్కర్ తోయిబా తీవ్రవాదులని అంటాడు, ఇంకోసారి ‘ఆన్ గ్రౌండ్ వర్కర్స్’ (OCW) అని కూడా అంటాడు. ఆన్ గ్రౌండ్ వర్కర్స్ అంటే మిలిటెంట్లకు బయట నుండి సహాయం చేసేవారు. ఈ సహాయానికి బలగాలు ఇస్తున్న నిర్వచనం చాలా అస్పష్టంగా ఉంటుంది. 9 లక్షల సైన్యం నీడలో, నిరంతర హింసలో, అవమానంలో, అభద్రతలో బతుకుతున్న ప్రజలకు సాయుధ తిరుగుబాటు పట్ల మనసులో మొగ్గు ఉండి ఉండవచ్చు. అలా ఉండకుండా ఉండటానికీ, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్మటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, మరిన్ని పటాలాలను దింపటం ఒక్కటే భారత ప్రభుత్వం ఇప్పటిదాకా చేస్తుంది. ఆన్ గ్రౌండ్ వర్కర్స్ అంటే మనసులో సాయుధ పోరాటం పట్ల సహానుభూతి మోస్తున్న వాడు కూడా అయి ఉండవచ్చు. ఆ పనిని అక్కడ మిలిటెంట్లకు మాటునిస్తున్న అడవుల్లోని చెట్టూ పుట్టా కూడా చేస్తున్నాయి. వాళ్లకు చాటునిస్తున్న కశ్మీరీ ఇళ్లు కూడా అదే పని చేస్తున్నాయి. వాటినన్నిటిని శిక్షించాలంటే కశ్మీర్ ను బూడిద చేయటం తప్ప మార్గం లేదు. అదే పనిని ఇళ్లు కూల్చటం దగ్గర నుండి ఇప్పటికే మొదలు పెట్టారు. మిలటరీ ప్రజాస్వామ్యానికి ఇళ్లు, కుటుంబం, హృదయం, మానవత్వం అనే పదాలు తెలియవు.

‘గుర్తు తెలియని వ్యక్తులు’ చేస్తున్న హత్యలకు బాధ్యులను చేస్తూ ఒకవైపు కొంతమందిని ఎన్ కౌంటర్ చేస్తూ, ఇంకోవైపు దాదాపు 1000మంది కశ్మీరీల మీద కేసులు పెట్టారు. అనేకమందిని భారతీయ జైళ్లకు తరలించారు. వారిలో కొంతమంది టీచర్లు కూడా ఉన్నారు. ఇటీవల అమిత్ షా కశ్మీర్ పర్యటన సందర్భంగా స్త్రీలను, పిల్లల్నీ కూడా సోదా చేశారు. దంతాలతో సహా సమస్త అవయవాలనూ పరిశీలించి కానీ ఎవరినీ వీధుల్లో పోనివ్వలేదు.

సలీం షా, సుహైల్ దార్ అనే ఇద్దరు స్వతంత్ర జర్నలిస్టులనూ, ముక్తర్ జాహూర్ అనే ఒక ఫోటో జర్నలిస్టును కూడా ఇటీవల అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ముక్తర్ జాహూర్ ఆల్ జజీర, కారవాన్, బ్లూమ్ బెర్గ్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికల కోసం పని చేస్తాడు. చాలామంది కశ్మీరీ జర్నలిస్టులు ఇప్పుడు రాయటం పూర్తిగా మానేశారు. కశ్మీర్ నుండి ఇప్పుడు వాస్తవ వార్తలు కావాలంటే వేళ్లతో లెక్కబెట్టే బయట పత్రికలే ఉన్నాయి. గతంలో సామాజిక మాధ్యమాలలో రాస్తున్న కశ్మీరీల మీద కూడా కేసులు పెట్టి టెర్రరైజ్ చేసారు. ఫేస్ బుక్ లో కశ్మీరీలకు పూర్తి మద్దతునిస్తున్న అమెరికన్ సోషలిష్టు మేరీ స్కులి లాంటి అనేకమంది ఫేస్ బుక్ అకౌంట్లను ఇండియాలో బాన్ చేశారు. కశ్మీర్ లో పత్రికా స్వేచ్ఛా సూచిక కిందకు పడిపోయింది. జవాబుదారీతనం లేకుండా, తమకు ఎలాంటి శిక్షలు పడవనే భరోసాతో జరుపుతున్న ఈ చర్యలు కశ్మీర్ లో నియంతృత్వ రాజ్యాన్ని సృష్టిస్తున్నాయనటానికి ఎలాంటి సందేహం ఉండనవసరం లేదు.

ఇంతకీ అక్టోబర్ లో మారణకాండకు పాల్పడిన ఈ ‘గుర్తు తెలియని వ్యక్తులు’ ఎవరు? గత 30 సంవత్సరాల కాలంలో లోయ అంతా సంక్షోభంలో ఉన్న అనేక సందర్భాలలో, అత్యధిక మిలిటెన్సీ ఉన్న కాలంలో కూడా -అక్కడ మైనారిటీలకూ, వలస కార్మికులకూ ఎలాంటి హాని జరగలేదు. ఆ విషయాన్ని ప్రపంచం అంతా గుర్తించింది. ఇప్పుడు పని గట్టుకొని వారిమీద దాడి చేయటం ఎవరికి ప్రయోజనం? పుల్వామాలో సైనికులు చనిపోవటానికి కారణం అయిన కుట్ర అర్థం అయినవారికి ఈ విషయం కూడా అర్థం అవుతుంది. అయితే ఈ విషయంలో ఇంకా క్లూ కావాలంటే అక్టోబర్ 24న మిష్టరీగా చనిపోయిన జియా ముస్తాఫా గురించి తెలుసుకోవాలి.

2003 మార్చి 23న, షొపియాన్ జిల్లా నడిమార్గ్ గ్రామంలో 24మంది కశ్మీరీ పండితులను ఇలాంటి ‘గుర్తు తెలియని వ్యక్తులు’ కాల్చి చంపారు. ఆ కేసులో ముద్దాయి అని చెబుతూ జియా ముస్తాఫా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతను పాకిస్తాన్ నుండి వచ్చిన మిలిటెంటు. గత 18 సంవత్సరాలుగా అతను జైల్లోనే ఉన్నాడు. పోలీసులు సాక్ష్యాలను సరిగ్గా ప్రవేశ పెట్టకపోవటంతో 2011లోనే జమ్మూకశ్మీర్ హైకోర్టు అతని మీద కేసు విచారణ చేయటానికి తిరస్కరించింది. త్వరలో అతని కేసు పూర్తిగా కొట్టి వేస్తారని స్పష్టం కాగానే -అతన్ని మిలిటెంట్లకూ సైన్యానికి ఘర్షణ జరుగుతున్న పూంఛ్ ప్రాంతానికి తీసుకొని వెళ్లి, మిలిటెంట్స్ చేతిలో అతను చనిపోయాడని ప్రకటించారు. అలా నడిమార్గ్ మారణకాండ విచారణకు తలుపులు మూసుకొని పోయాయి. జియా ముస్తాఫా హత్య, దానికి అల్లిన కథలు అర్థం అయితే, ఇప్పుడు లోయలో జరుగుతున్న హత్యలకు కారణం తెలుస్తుంది.

ఇంత జరిగినా లోయలో మిగిలి ఉన్న కశ్మీరీ పండితులు, సిక్కులు అక్కడే ఉంటామని ప్రకటించారు. బీహార్, బెంగాల్ ల నుండి వచ్చే వలస కార్మికులు కూడా మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు. బయట నుండి కాళ్లు బార్లా చాపుకొని తీర్పులు ఇచ్చేవారికంటే అక్కడ నివసించే వారికే వాస్తవాలు తెలుస్తాయి. ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ప్రపంచానికి తెలిసే రోజు త్వరలోనే వస్తుంది.

చివరకు మళ్లీ సతీష్ ఆచార్య కార్టూను దగ్గరకు వస్తే -కశ్మీరీ బ్రాహ్మణ యువతి శ్రద్ధా బిండ్రు ప్రశ్నలను ప్రశంసిస్తూ, ఆమె ధీరత్వాన్ని ఎత్తి పడుతూ వేసిన ఆ కార్టూన్ అనేక ప్రశ్నలను ఖచ్చితంగా ముందుకు తెస్తుంది. మిలటరీ కాల్పులకు చనిపోయిన పర్వేజ్ అహమ్మద్ పేద కుటుంబానికీ ఇంగ్లీష్ రాకపోవచ్చు. నిలేసి మాట్లాడి ఇంకా ప్రమాదంలో పడే దమ్ము లేకపోవచ్చు. అలా మాట్లాడి కోర్టుల చుట్టూ తిరిగే ఆర్థిక వనరులు లేకపోవచ్చు. వాళ్ల ముందు భారత మీడియా మైకులతో క్యూలో నిలబడక లేకపోవచ్చు. కానీ చిరిగిన బట్టలతో దైన్యంగా నిలబడి, మా భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్న పర్వేజ్ అహమ్మద్ కుటుంబంతో సహా వేలాది అదృశ్యమైన, నకిలీ ఎన్ కౌంటర్లకు గురి అయిన, గుర్తు తెలిసిన సైన్యం చేతిలో ‘యాదృచ్ఛిక’ ప్రమాద హత్యలకు గురి అయిన -వేలాది మంది సామాన్యులైన కశ్మీరీ ముస్లిముల (సాయుధ తిరుగుబాటుదారులను వదిలి పెడదాం) గురించి ఎవరైనా భారతీయ కార్టూనిష్టులు బొమ్మలు గీస్తున్నారా?

ఒక క్రికెట్ గెలుపును పండగ చేసుకొన్న కశ్మీరీ యువకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేయటం, అది దేశద్రోహమనే ప్రచారానికి ఊపివ్వటం, వాళ్లను ఊపా నేరస్తులని చేయటానికి ప్రజామోదాన్ని సమీకరించటం మినహా (కాంగ్రెస్స్ విద్యార్థి సంఘం కూడా డిమాండ్ చేసింది) -30 ఏళ్లుగా ప్రపంచంలోనే అతి పెద్ద మిలటరీ సమీకరణ కింద హింసా బాధితులుగా అణగారిపోతున్న ఈ 80 లక్షల కశ్మీరీ ముస్లిముల కోసం ఒక బొమ్మ వేయమని ఏనాటికైనా భారత ఉదారవాదులు అడగగలరా!

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

Leave a Reply