కవి దేశరాజు  కధకుడయ్యాడు

‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’, ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటాలతో సాహిత్య లోకంలో మంచి కవిగా గుర్తింపు పొందిన కవి దేశరాజు పద్దెనిమిది కధలతో సాహిత్య లోకానికి “బ్రేకింగ్ న్యూస్” ఇచ్చాడు. కధాభిమానులంతా బ్రేకింగ్ న్యూస్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్దెనిమిది కధలతో  దేశరాజు మంచి కవి మాత్రమే కాదు, మంచి కధకుడు కూడా అనొచ్చు. ప్రతి రచనకు స్థల, కాలాలు వుంటాయి. స్థల, కాలాతీత, అలీన సాహిత్యమనేది బూటకం. అలాగే ప్రతి రచయితకూ  ఆ స్థల, కాలాల్లో తన అస్తిత్వమూ రచనకు భూమికగా వుంటాది. రచన అనేది సామాజిక కార్యాచరణ. దేశరాజు రచనలను ఈ నేపథ్యంలో పరిశీలిస్తే ‘బ్రేకింగ్ న్యూస్’ మరింత స్పష్టంగా అర్ధమవుతుంది. 

 ‘బ్రేకింగ్ న్యూస్’లో పద్దెనిమిది కధలున్నాయి. అందులో మూడు కధలు  1991, 92, 96 లో రాసినవి. మిగిలిన కధల్లో 2016, 2018 లో రెండు రాయగా మిగిలిన పదమూడు కధలూ 2020, 21 లో రాసినవి. తొలినాళ్ళలో రాసిన మూడు కధల స్థల, కాలాలు బహుశా కళింగాంధ్రా మరీ ముఖ్యంగా శ్రీకాకుళ ప్రాంతమూ, పోరాట భావజాల కాలమూ! మిగిలిన కధలకు నగరమూ, వర్తమానమూ (ముఖ్యంగా కరోనా కాలమూ) స్థల, కాలాలు.    తొలి మూడు కధలూ రాసిన నాటికి దేశరాజు యువకుడు. (ఆదర్శాలు, పోరాటాలు నెత్తుటిని ఉరకలెట్టించే వయసు.) ప్రపంచాన్ని తనదైన పరిశీలనతో విశ్లేషించుకొనే కంటే ఇతరేతర వ్యక్తుల, శక్తుల విశ్లేషణకు ప్రభావితమయిన వయసు. శ్రీకాకుళ స్థల, కాలాల్లో నడయాడిన యువకుడు. మిగిలిన కధలు రాసిన నాటికి  మధ్య వయస్కుడు. శ్రీకాకుళం నుంచి హైదారాబాద్ మహానగరానికి వలస పోయినడు. ‘బ్రేకింగ్ న్యూస్’ ఇచ్చే నాటికి నెత్తురు ఉరకలు తగ్గి, నెమ్మదిగా ప్రవహించే వయసు, తనదయిన పరిశీలన మీద ప్రపంచాన్ని విశ్లేషించడాన్ని ఇష్టపడే వయసు. ఇన్నేళ్ల తన జీవనానుభవాన్ని, తన పరిశీలనను తనదైన వ్యక్తీకరణ చేయగలిగే దశకు వచ్చిన వాడు. భిన్నమయిన కధా వస్తువులతో, కధా కధనంతో కధ సాహిత్యావరణానికి ‘బ్రేకింగ్ న్యూస్’ ఇవ్వగలిగినాడు. 

నిజానికి దేశరాజు తొలినాళ్ళ లోని మూడు కధల్లో ఒకటి ప్రేమ కధ. స్వచ్చమైన ప్రేమ కధ, సినిమాళ్లలో లాగా వానలో తడిసి, ముద్దు పెట్టుకోవాలని కోరుకొనే యువతీ, యువకుల కధ. (ఇది రాసిన నాటికి దేశరాజు యువకుడే). ఆ యువకుడ్ని శ్రీకాకుళ పోరాటం ‘వాన ముద్దు’ నుంచి పోరాట బాట వేపు మలుపు తిప్పింది. మనుషుల్ని ప్రేమించడం నేర్పింది. మనుషుల కోసం ఆలోచించడం నేర్పింది. “నేను మీతో వుంటాను” అన్పించింది. ‘అన్నల కోసం’ యెదురు చూసేట్టు చేసింది. అయితే దేశరాజు ఆ మూడు కధలు రాసేనాటికి, యేదయితే తనను వానముద్దు నుంచి పోరుముద్దు వేపు మలుపు తిప్పిందో అది శ్రీకాకుళంలో మబ్బుల్లో మలిగిపోయింది. ఒక నాడు ఇచ్చిన ప్రేరణ ఇపుడు ఇవ్వగలిగే స్థితిలో శ్రీకాకుళం లేదు. ఇంకోవేపు ప్రపంచీకరణ అనే సామ్రాజ్యవాద అనుకూల ఆర్ధిక విధానాల ఆరంభ కాలం. మరోవేపు అస్తిత్వ వాదాలు… ముఖ్హ్యంగా, స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదం బలంగా గొంతు విప్పిన కాలం. వి‌ప్లవ భావజాలానికి ప్రత్యామ్నాయంగా లేదా భిన్నంగా, వ్యతిరేకంగా వివిధ అస్తిత్వాల వాదాలు సాహిత్యాన్నీ ఆవరించిన కాలం. ఆ కాలం లో దేశరాజు విప్లవ ఆవరణకు సంబంధించిన కధలే రాసేడు. ఒకరకంగా అవి ఆఖరి గ్యాపకాలు. ( ఈ సంపుటిలో కూడా వాటిని ఆఖరి కధలుగా పెట్టాడు).         

మిగిలిన కధలు … బీజేపీ రాజకీయావరణను ఆక్రమించడం, మోడి,అమిత్ షా అనే ఇద్దరు నేతలు అటు ఆరెస్సెస్, బీజేపీ కీ ఇటు దేశంలో ప్రజలకూ శక్తివంతమైన నాయకులుగా ఆదరణ పొందడం, దేశాన్ని కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేస్తుండడం, ( అనేక జాతీయ పరిశ్రమలను, సంస్థలను, సహజ వనరులను కార్పొరేట్ సంస్థల పాలు చేయడం, వ్యతిరేకించే ప్రజలను కమ్యూనిస్టులుగా, దేశద్రోహులుగా ముద్రలు వేసి వేధించడం, శాస్త్రీయ భావజాల వాదులపై దాడులు, స్త్రీలపై అత్యాచారాలు, ముస్లింల పై దాడులు.. మతోన్మాద భావజాలాన్ని ప్రణాళికాబద్ధంగా ప్రజల్లో వ్యాపింప చేయడం, అంతలో ప్రపంచ వ్యాప్త కరోన వైరస్ ప్రమాదం, జీవితాలను విధ్వంశం చేయడం వంటి అనేక అంశాలు మున్నెన్నడూ లేనంతగా బుద్ధిజీవులను వేదనకు గురిచేశాయి. అదిగో ఆ వేదన నుంచి, రగిలిన ఆలోచనల నుంచి తనదైన పరిశీలనను, వ్యక్తీకరణను పంచుకోవాలనుకున్నాడు దేశరాజు. కరోనా కారణంగా చిక్కిన తీరికను కధా రచనకు వినియోగించుకున్నాడు. గత రెండేళ్ళలో పదమూడు కధలు రాసేడంటే కారణం ఈ నేపధ్యమే.

నోట్ల రద్దు, కరోనా, వృద్ధాప్యం, బాల్యం, క్రికెట్ వంటి క్రీడలు, పండగలు, ఉద్యోగాలు, ఇల్లు, కార్యాలయాలు, ఫేస్ బుక్ , వాట్సాప్,  వడ్డీ లేని రుణాల పేరిట మోసాలు…సందట్లో సడెమియాలా మతం పేరిట ముస్లిమ్ ల మీద దాడులు…యెన్నెన్నో కధా వస్తువులు. దేశరాజు వర్తమాన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కధనం చేశాడు. కవి, జర్నలిస్ట్ కావడం వలన అదనపు సమాచారం అందుబాటులో వుంటుంది. కవి కావడం వలన ఉద్వేగాన్ని కధనంలో జోడించగలిగాడు. కళింగాంధ్ర వ్యంగ్యం కొంత వొంట బట్టినదేమో … కొన్ని వ్యంగ్యపూరిత కధలు (డీ హ్యూమనైజేషన్, జ్ఞానగుళిక కధలు), కొన్ని కధల్లో మనుషులు యే యెరుకను పొందాలో తెలియజేసే కధలు (గృహమే కదా స్వర్గ సీమ, ఏదీ దారి?) అనేకానేక కారణాలతో మనుషులు, ముఖ్యంగా అభ్యుదయ వాదులు ముడుచుకు పోవడాన్ని, కర్తవ్యం నుంచి జారుకోవడాన్ని యెత్తిపొడిచే కధలు కూడా (అనేకానేక బల్లులు, ఒకేఒక్క ఫ్లాష్ బ్యాక్) రాసేడు. వానరుడు నరుడుగా మారే క్రమం లో శ్రమ పాత్ర గురించి రాసిన యెంగెల్స్ వాక్యం మార్చి – మనుషులు బల్లులుగా మారే క్రమంలో భయం పాత్ర అన్న వాక్యం రాసేడు. అయితే భయం మాత్రమే కాదు కారణం, రాజకీయాంశాలు ముఖ్యంగా అనుకుంటాను. ఆసుపత్రుల దోపిడీ మీద రాసిన కధ ‘బ్రేకింగ్ న్యూస్’. ఫేస్బుక్, వాట్సాప్‌ల మీద ‘డబుల్ రోస్ట్’,‘జ్ఞాన గుళిక’ కధలు పాఠకుడ్ని నవ్వించడంతోపాటు ఆలోచింప చేస్తాయి. ఇప్పటి సమాజంలోని అన్ని అంశాలనూ దేశరాజు కధనం చేశాడు. కవితాత్మక శైలి ఎలాగు వుంటుంది. దానికి తోడు జర్నలిస్టిక్ పరిశోధనాత్మకత, సులభమైన వాక్య నిర్మాణం పఠనీయతను కలిగించాయి. కేవలం జర్నలిస్టిక్ పరిశోధనతో దేశరాజు ఆగలేదు, పరిశీలనాల నుంచి తన ధృక్పధమైన మార్క్సిస్ట్ భావజాలంతో అంతిమ విశ్లేషణా, పరిష్కారమూ చెప్తాడు. నిజానికి ఈ కధలు మధ్యతరగతి జీవులవి. అనేక వర్తమాన కధకులు రాసినట్టుగా మధ్యతరగతి జీవుల్ని సమాజం నుంచి, సమూహాల నుంచి విడదీసి కధనం చేయలేదు,సమూహంలో భాగంగా రాసేడు. అయితే… సమూహాల సంఘర్షణల్లోంచి మధ్యతరగతిని రాయగలిగితే మరింతగా ప్రయోజనం వుంటుంది. ఆ దిశగా ఇకముందు దేశరాజు తన కధన రథాన్ని నడపాలని కోరుకుంటున్నాను.

Leave a Reply