ధిక్కార కవి యోధుడు- లోర్కా

లోర్కా. ఓ ప్ర‌వ‌హించే విద్యుత్తేజం. ఏటికి ఎదురీదే సాహ‌సి. ధిక్కార క‌వి యోధుడు. న‌మ్మిన విశ్వాసాల కోసం ప్రాణాలిచ్చిన మ‌నీషి. అత‌డు భూమితో మాట్లాడే మ‌ట్టి మ‌నుషుల్ని ప్రేమించాడు. క‌విత్వంలో జీవించాడు. కవిత్వ‌మై మ‌ర‌ణించాడు. భౌతికంగా అత‌డిప్పుడు లేక‌పోయినా అత‌ని క‌విత్వం, ఆచ‌ర‌ణ ఈ త‌రానికొక వేగుచుక్క‌. అత‌డున్నాడు… మండుటెండ‌ల్లో స్వేదం చిందే రైత‌న్న‌ల కంటి వెలుగై. నిర్బంధం రాజ్య‌మేలుతున్న‌పుడు ఎత్తిన పిడికిలై. నిన‌దించే గ‌ళాల గ‌ర్జ‌నై. తూర్పున ఉద‌యించే సూరీడిలా అత‌నెప్ప‌డూ ఉంటాడు.

ఆ స్వాప్నికుడి పూర్తి పేరు ఫెడెరీకో గార్సియా లోర్కా (1898 – 1936). ఇరవయ్యో శతాబ్దంలో స్పానిష్ కవిత్వాన్ని శాసించిన కవి అత‌డు. కవిత్వాన్ని, నాటకాన్ని మేళవించి స్పానిష్ నాటక రంగానికి కొత్త ఒరవడులు నేర్పిన వైతాళికుడు. అపార‌మైన సృజ‌న‌శీలి. ఆయన కవి, నాటక రచయితనే కాక, పియానో వాయిద్యకారుడు. నటుడు, దర్శకుడు. ఉపన్యాసకుడు, చిత్రకారుడు. క‌డ‌దాకా ప్ర‌జ‌ల కోసమే నిలిచిన క‌వి. “కవిత, పాట, చిత్రం, ప్రజల బావుల్లో నుండి తోడిన నీళ్లే. ప్రజలకు వాటిని అందమైన పాత్రలో తాగడానికి తిరిగి ఇవ్వాలి. అవి తాగడంలో ప్రజలు తమను తాము అర్థం చేసుకోవాలి” అని తన కళనంతా ప్రజలకే అంకితం చేసిన ప్రజాకవి.

రచనే శ్వాసగా బతికిన లోర్కా అతి తక్కువ కాలంలో (1917 – 1936) పదమూడు నాటకాలు, తొమ్మిది కవిత్వ సంకలనాలు రాశాడు. “నేను ఆపాదమస్తకం కవిగా ఉండాలనుకుంటున్నాను… కవిత్వంతో జీవిస్తూ, కవిత్వంతో మరణిస్తూ” అని ప్రకటించాడు. అత‌ని ర‌చ‌న‌ల్లో ప్రకృతి అన్యత్వం, మనిషి అస్తిత్వంలోని చీకటి కోణాలు, సృజనాత్మకత, సెక్స్, బాల్యం, మరణం గురించి అద్భుతంగా మాట్లాడాడు.

లోర్కా 1898 లో స్పెయిన్ లోని గ్రనాడ (Granada) ప్రావిన్స్ లో అత్యంత సారవంతమైన, అందమైన, నదీ మైదాన ప్రాంతంలో చిన్న ఊరిలో పుట్టాడు. అతని తండ్రి సంపన్న రైతు. తల్లి స్కూల్ టీచ‌ర్‌. తెలివైన, సున్నిత మనస్కురాలు. లోర్కాది వాళ్ళ ఊరిలో అందరికన్నా సంపన్నమైన కుటుంబం. కానీ కుటుంబంలో ఉన్న ప్రగతిశీల భావాలు, బాల్యంలో స్వతహాగా ఉన్నఉత్సుకత వల్ల సామాజిక అవరోధాలను అధిగమించి, తన చుట్టూ ఉన్న గ్రామీణ ఆండలూసియా (Andalusia) లోని పేదరికాన్ని, దుర్భర పరిస్థితులను చూశాడు. రెండో జత బట్టలు కూడాలేని తన స్నేహితుని తల్లి, “రేపు మేము బట్టలు ఉతుక్కోవాలి, రేపు మా ఇంటికి రావొద్దు,” అని చెప్పిన సంఘటన అతని మ‌న‌సులో చెరగని ముద్ర వేసింది. అట్లానే వైద్యం అందక ఆరేళ్ల‌ వయసులో గొర్రెల కాపరి కొడుకు అయిన తన స్నేహితుడు తన క‌ళ్ల‌ముందే చనిపోవడం అతన్ని బాగా కలిచివేసింది. సమాజంలో ఉన్న అసమానతలు చిన్ననాటి నుండే చాలా కలవరపెట్టాయి. సామాజిక న్యాయం కోసం తపన, ప్రజల కష్టాలను తీర్చడానికి కాథలిక్ చర్చ్ ఏమీ కృషి చేయకపోవడం పట్ల అసహనం తన తొలి రచనల్లోనే వ్య‌క్త‌మైంది.

“మీరు దౌష్ట్యాన్ని ప్రచారం చేసే నీచ రాజకీయవాదులు, వెలుగును ధ్వంసం చేసే దేవదూతలు. దేవుని పేరుతో యుద్ధాన్ని బోధిస్తారు. మీరు ప్రజలకు, మీ భావాలను పంచుకోనివాళ్లను ద్వేషించడం నేర్పుతారు… మీరు శిక్షణ ఇచ్చిన ప్రపంచంలో మొత్తం రెక్కలు కత్తిరించబడిన బుద్ధిహీనులు. మీ విధ్వంసకరమైన కుతంత్రాల నుండి జీసస్ ఆలోచనను రక్షించవలసి ఉంది” అని లోర్కా 1917లో, పందొమ్మిదో ఏట, చర్చ్ గురించి రాశాడు.

“నేను నా ఉద్వేగాలన్నింటిలోనూ భూమితో ముడిపడి ఉన్నాను” అని అన్న లోర్కాకు తను పుట్టి పెరిగిన గ్రామీణ ప్రాంతాలంటే అపారమైన ప్రేమ. ప‌ద‌కొండేళ్ల‌ వయసు నుండి తన కుటుంబం బతికిన గ్రనాడా నగరంపై ప్రేమ కూడా అతని జీవితాన్ని, రచనల్ని ప్రభావితం చేసింది.

స్పెయిన్ దక్షిణ భాగమైన ఆండలూసియా ప్రాంతానికి చెందిన లోర్కా, స్పానిష్ సాహిత్యంలో స్పెయిన్ మధ్య భాగమైన కాస్టీల్ (Castile) ఆధిపత్యాన్ని ధిక్కరించాడు. ఒక స్నేహితుడికి 1922 లో ఉత్తరంలో, “ఈ ఎండా కాలం నాకు ఏదైనా ప్రశాంతమైనది, నిర్మలమైనది రాయాలని ఉంది. నేను సముద్రపు ఒడ్డున ఉప్పునీటి కయ్యల మీద, పర్వతాల మీద, చుక్కల మీద జానపదాలు కట్టాలి. పువ్వులా పారదర్శకమయినది, మార్మికమైనది (పువ్వు అంత స్వేచ్ఛగా, పరిపూర్ణంగా ఉన్నది) రాయాలి. అంతా పరిమళంతో నిండాలి. కవులకు ఎప్పుడూ ఉనికిలోలేని ఈ అద్భుతమైన పల్లెటూర్లలో నేను తిరుగుతాను. వాళ్ళ గురించి రాస్తాను. Enough of Castile!” అని రాశాడు. ‘Enough of Castile’ అనే యుద్ధ నినాదం స్పానిష్ కవిత్వంలో కొత్త(తరం) ఒరవడులకు నాంది పలికింది.

ఆండలూసియాను లోర్కా ఓరియెంటల్- వెస్టర్న్, గ్రీక్- రోమన్, అరబ్ – జిప్సీ, క్రిస్టియన్ – యూదు, ఇట్లా సంస్కృతుల మేళవింపుగా చూశాడు. తనను తాను కూడా ఈ భిన్న సంస్కృతుల గుమ్మిగా భావించాడు. వేరు వేరు కాలాలకు చెందిన సంస్కృతులను మేళవించి ఆండలూసియాను తన కవిత్వంలో ఆవిష్కరించాడు.

ఇరవై ఏళ్ల వయసులో లోర్కా మాడ్రిడ్ నగరంలో Student’s Residence అనే ప్రయోగాత్మక కళాశాలలో చేరాడు. స్పానిష్ సమాజాన్ని లిబరల్ భావాలవైపు నడిపే సాంస్కృతిక సారథులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన క‌ళాశాల ఇది. స్పెయిన్ లో అత్యుత్తమ సంగీతకారులు, కళాకారులు, కవులు, శాస్త్రవేత్తలతో కలిసి లోర్కా కొన్నేళ్లు గ‌డిపాడు. అక్కడనే లోర్కాకు సాల్వడార్ డాలీతో పరిచయమైంది. వాళ్లిద్దరి గాఢమైన స్నేహం ఒకరి కళాత్మక దృష్టిపై ఇంకొకరి లోతైన ప్రభావం చూపింది. హోమోసెక్సువల్ అయిన లోర్కా, డాలీల మధ్య ఉన్నభావోద్వేగ సంబంధం సంక్లిష్టమైనదైనా లోర్కా చనిపోయేవరకూ అది వాళ్ల‌ స్నేహానికి అడ్డు కాలేదు.

ముప్పై ఏళ్ల వయసు వరకే లోర్కా ఐదు కవిత్వ సంకలనాలు అచ్చు వేశాడు. తన పుస్తకం ‘The Gypsy Ballads’ (1928) కు జనం నుండి విశేషాదరణ వచ్చినప్పుడు లోర్కా చిన్నతనంలో, కౌమార్యంలో అనుభవించిన సామాజిక పరాయీకరణ నుండి ఉపశమనం దొరికింది. బార్సెలోనాలో జనం ముందు తన పుస్తకం చదివినప్పటి సన్నివేశం గురించి తన తల్లిదండ్రులకు ఉత్తరంలో ఇట్లా రాశాడు.

“నన్ను కార్మికులు ఆదరించిన తీరు నన్ను అమితంగా కదిలించింది. నిజమైన మనుషులతో నిజమైన కలయిక అది. వాళ్ల‌ని కలవడం నన్ను ఎంత భావోద్వేగానికి గురి చేసిందంటే నాగొంతు మూగబోయి, నాకు నోట మాట రాలేదు… నేను, “Ballad of the Spanish Civil Guard”, చదివినప్పుడు, హాలు మొత్తం లేచి నిలబడి, “ప్రజాకవి వర్థిల్లాలి,” అని నినాదాలు ఇచ్చారు. ఆ తర్వాత గంటన్నర సేపు నాకోసం లైనులో నిలబడి ఉన్న చేతివృత్తి నిపుణులు, కార్మికులు, మెకానిక్స్, పిల్లలు, విద్యార్థులతో కరచాలనం చేశాను. అది నా జీవితంలో అత్యంత అద్భుతమైన, అందమైన అనుభవం.”

‘The Gypsy Ballads’ నుండి రెండు కవితలు:

వెండి జాబిలి గాథ

సుగంధ లేపనాలు అద్దుకున్న
జాబిలి కొలిమి చేరవచ్చింది
అక్కడి పిల్లవాడు ఆమె వేపు చూశాడు
ఆమె వేపు దీర్ఘంగా చూశాడు
వేడెక్కిన వాతావరణంలో
గాలి తెమ్మెరలు ఆమె చేతులు కదిలించాయి
నిక్కబొడుచుకున్న ఆమె స్తనాలు
రెచ్చగొడుతూ సహజంగా బైటపడ్డాయి

“జాబిలి జాబిలి జాబిలి పరుగెత్తుకెళిపో
జిప్సీలు వచ్చారా
నీ ఎదుర్రొమ్ము కోసి
తెలతెల్లని హారాలూ ఉంగరాలూ
చేసుకుంటారు” అరిచాడా అబ్బాయి.
“పిల్లవాడా, నన్ను కాసేపు నాట్యం చెయ్యనీ
జిప్సీలొస్తారా, రానీ
గట్టిగా కళ్లు మూసుకొని
దిమ్మ మీద పడి ఉన్న నిన్ను చూస్తారు”
“జాబిలిజాబిల్జాబిలీ పరుగెత్తు
అదిగో వాళ్ల గుర్రాల గిట్టలు వినబడుతున్నై”
“పిల్లవాడా, నన్నుండనీ
నా వెండివెన్నెల తెలుపు మీద అడుగెయ్యకు”
తప్పెట్లు మోగిస్తూ
రౌతులు రానే వస్తున్నారు
కొలిమిలోపల పిల్లవాడు
కళ్లు గట్టిగా మూసేసుకున్నాడు
కంచూ కలలూ నిండిన జిప్సీలు
ఆలివ్ వనాన్ని దాటారు
అరమూసిన కన్నులతో
తలలెత్తి నిటారుగా సాగుతున్నారు
ఓయ్… ఆ చీకటిపిట్ట ఎట్లా పాడుతుందో చూడు!
అది చెట్టు మీది నుంచేనా పాడేది!
జాబిలి ఆకాశంలోకి ఎగిరిపోయింది
ఆమె చేతిలో ఆ పిల్లవాడు
కొలిమి చేరిన జిప్సీలు కంటతడిపెట్టారు
ఏడ్చి శోకాలు పెట్టారు
గాలి కాపు కాస్తున్నది కాపు కాస్తున్నది
గాలి రాత్రంతా కాపు కాస్తూనే ఉన్నది

స్వరం లేని బిడ్డ

బిడ్డ తన స్వరాన్ని వెతుక్కుంటూ బయల్దేరింది
(కీచురాళ్ల రాజు దగ్గర ఉందది)
ఒకానొక నీటి చుక్కలో
బిడ్డకు తన స్వరం దొరికింది

ఆ బిడ్డ మాట్లాడాలని నాకేమీ లేదు
ఆ స్వరాన్ని ఒక ఉంగరంగా మార్చి
నా మౌనం దాన్ని ధరించాలి
తన చిటికెన వేలు మీద

ఒకానొక నీటి చుక్కలో
బిడ్డకు తన స్వరం దొరికింది
ఎక్కడో సుదూరాన, నిర్బంధంలో ఉన్న స్వరం
కీచురాయి దుస్తులు ధరిస్తోంది

లోర్కా జూన్ 1929 లో న్యూయార్క్ వచ్చి కొలంబియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ తరగతుల్లో చేరాడు. కానీ అక్కడ ఉన్న ఎనిమిది నెలలూ స్నేహితులతో న్యూయార్క్ మొత్తం కలియతిరిగాడు. నాటకాలూ, ఒక సినిమా స్క్రిప్ట్, ఎన్నో కవితలూ రాశాడు. అప్పుడు రాసిన కవితలు, తను చనిపోయిన తర్వాత ‘Poet in New York’ కవితా సంకలనంగా అచ్చయింది. ఆయన అమెరికాలో ఉండగా జరిగిన స్టాక్ మార్కెట్ క్రాష్ తనకు అమెరికా చీకటి కోణాన్ని చూపించింది. అమెరికా నుండి క్యూబా వెళ్లాడు. అక్కడ రెండు నెలలు సంతోషంగా గడిపి 1930లో స్పెయిన్ తిరిగి వెళ్లాడు. ‘పోయెట్ ఇన్ న్యూయార్క్’ లో అమెరికాలోని ఆధునిక నాగరికత దౌష్ట్యం, ప్రకృతి పట్ల మనిషి ఉదాసీనత, సమాజంలోని కొన్ని జాతులపై (ఉదా: నల్ల జాతీయులు) జరిగే దోపిడీలపై విరుచుకుపడ్డాడు.

‘Cry to Rome’ అనే కవితలో పీడితులను పట్టించుకోని చర్చ్ గురించి ఇట్లా రాస్తాడు:

కానీ ఆ నరాలు తేలిన చేతుల వృద్ధుడు
ప్రేమ, ప్రేమ, ప్రేమ అంటూనే ఉంటాడు
చనిపోతున్న లక్షలాది మందల పొగడ్తలందుకుంటూ
ఆయన అంటూనే ఉంటాడు: ప్రేమ, ప్రేమ, ప్రేమ.
మృదువుగా కదలాడే జలతారు పరదాల మధ్య
శాంతి, శాంతి, శాంతి అంటుంటాడాయన
పేలిపోయే పుచ్చకాయల మధ్య, వణికిపోతున్న కత్తుల మధ్య
ప్రేమ, ప్రేమ, ప్రేమ అంటూనే ఉంటాడాయన
పెదాలు వెండిగా మారిపోయేదాకా

ఈ మధ్యలో, అవును, ఈ మధ్యలోనే
ఉమ్ముడు కుండీలను ఖాళీ చేసే నల్లవాళ్లు
అధికారుల దుర్మార్గానికి వణికిపోయే చిన్నారి పిల్లలు
ఖనిజ తైలాలలో మునిగిపోయే ఆడవాళ్లు
సుత్తెలతో, వయొలిన్లతో, మేఘాలతో
సాగుతున్న అసంఖ్యాక జనాలు
తలలు గోడకు గుద్దుకుంటున్నా సరే ఎలుగెత్తుతారు
చర్చ్ గుమ్మటాల ముందర అరుస్తారు
మంటల్లో చిక్కుకుని గొల్లుమంటారు
చలికి బిక్కచచ్చి గొంతెత్తుతారు
తలల మీద అశుద్ధం నిండి గోల పెడతారు
రాత్రులన్నీ కలగలిసిపోయినట్టు నినదిస్తారు
హృదయవిదారకమైన హాహాకారాలు చేస్తారు
నగరాలన్నీ చిన్నపిల్లల్లా గజ్జుమని వణికిపోయేదాకా
నినదిస్తూనే ఉంటారు
చమురూ సంగీతమూ నిండిన
చెరసాలలను బద్దలు కొడతారు
మేమడిగేది ఒకే ఒక్కటి – ప్రతి రోజూ రొట్టె
చెట్లు విరబూసే పూలు
ఎప్పటికీ వట్టిపోని మృదుత్వపు పంట
మేమడిగేది భూమి ఫలాలు
ప్రతి ఒక్కరికీ అందాలని
భూమి అందరికీ చెందాలని

31 ఏళ్ల‌ వయసులో లోర్కా స్పానిష్ నాటక రంగాన్ని సంస్కరించాలనే ధృడ సంకల్పంతో స్పెయిన్ తిరిగి వెళ్లాడు. స్పెయిన్ లో 1931 లో రాజు (ఆల్ఫాన్సో XIII) ని పదవీచ్యుతుని చేసి రెండవ రిపబ్లిక్ ప్రకటించారు. ఆ సమయంలో లోర్కా విద్యార్థుల నాటక కంపనీ, ‘La Barraca’ కు డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టాడు. గ్రామీణ ప్రజలకు నాటకం, కవిత్వం, ఆధునిక చిత్రకళలను పరిచయం చేయడానికి దేశమంతా తిరిగాడు. కొత్త నటులకు శిక్షణ ఇస్తూ, కొత్త ప్రేక్షకులను చేరే ప్రయత్నం చేశాడు. క్లాసిక్స్ ను పునరుద్ధరిస్తూ, అన్వయించుకుంటూ, తనరచనలతో, సమకాలీన నాటకరంగంలో కవిత్వం ఆవశ్యకతను గుర్తు చేశాడు. ఒక సందర్భంలో “నాటకం అంటే కాగితం మీద ఉదయించి, మానవీకరణ చెందిన కవిత్వం” అన్నాడు. మధ్యతరగతి నియమాలు, ఆంక్షల నుండి నాటక రంగాన్ని విముక్తి చేయాలని తరచూ మాట్లాడేవాడు. నాటక రంగం సామాజిక మార్పుకు దోహదపడాలని చెప్తూ, “నాటకం దుఃఖానికి, సంతోషానికి ఒక స్వతంత్ర వేదిక. ఇక్కడ ప్రజలు కాలం చెల్లిన, తప్పుడు ప్రమాణాలను ప్రశ్నించి, మనిషి హృదయంలోని శాశ్వత ప్రమాణాలను సజీవమైన ఉదాహరణలతో వివరిస్తారు” అన్నాడు.

La Barraca నాటక కంపనీతో తిరుగుతున్నప్పుడు, లోర్కా ప్రసిద్ధి చెందిన తన మూడు నాటకాలు రాశాడు. Rural trilogy గా పిలువబడే ‘Blood wedding’, ‘Yerma’, ‘The House of Bernarda Alba’ అనే ఈ మూడు నాటకాలు ఈనాటికీ వివిధ దేశాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి. లోర్కా రచనలు సమాజంలో ఆమోదించబడిన స్త్రీల పాత్రను సవాలు చేశాయి. నిషిద్ధ విషయాలైన హోమో సెక్సువాలిటీ, వర్గం గురించి మాట్లాడాయి.

కళ కళ కోసం కాదు, ప్రజల కోసమని నమ్మాడు లోర్కా. “కళ కళ కోసమే అనే భావం హాస్యాస్పదమైనదే కాదు, చాలా క్రూరమైనది. మనిషి అన్నవాడెవడూ స్వచ్ఛ‌మైన కళ (pure art), కళకోసం కళ అనే అర్థంలేని భావాల్ని నమ్మడు. ఈ కీలకమైన కాలంలో, కళాకారుడు ప్రజలతో పాటు నవ్వాలి, ఏడవాలి. మనం మన చేతుల్లో ఉన్న కలువ పూలను కింద పెట్టి, కలువల కోసం వెతుకుతున్న వాళ్ల‌ కోసం నడుముల దాకా బురదలో దిగబడాలి,” అన్నాడు.

తనను తాను సోషలిస్ట్ గా ప్రకటించుకున్న లోర్కాను స్పెయిన్ అంతర్యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే 1936 లో, రైట్ వింగ్ నేషనలిస్ట్ బలగాలు వేటాడి పట్టుకున్నాయి. “నేనెప్పుడూ ఏమీలేని వాళ్ళ వైపు, లేనితనంలోని శాంతి కూడా నిరాకరించబడిన వాళ్ల‌ వైపు ఉంటాను. సంపన్న మధ్య తరగతి కుటుంబాల్లో చదువు నేర్చి బుద్ధిజీవులమైన మనం ఇప్పుడు త్యాగాలు చేయవలసిన అవసరం ఉంది,” అని చెప్పిన 38 ఏళ్ల లోర్కాను ఆగస్ట్ 18-19 రాత్రి, ఫ్రాన్సిస్కో ఫ్రాంకో సైనికాధికారులు కాల్చి చంపి గుర్తు తెలియని ప్రదేశంలో పూడ్చి పెట్టారు.

లోర్కా ను చంపిన ఫాసిస్టు అధికారులు, ‘గన్నులు పట్టిన వాళ్లకన్నా అతను తన పెన్నుతో ఎక్కువ నష్టం కలిగించాడు,’ అని అన్నారు. మాట్లాడే గొంతులను ఫాసిస్టు ప్రభుత్వాలు నలిపేసే ఈనాటి సందర్భంలో లోర్కా ధిక్కారస్వరం ఒక గొప్ప స్ఫూర్తి. తన కవిత్వంలోని ప్రాదేశికత, విశ్వవ్యాప్తత, భిన్న సంస్కృతుల పట్ల ప్రేమ, వైవిధ్యంతో ఎందరో లాటిన్ అమెరికన్, అరబిక్, అమెరికన్ కవులను ప్రభావితం చేసిన లోర్కా భావితరాలకు దిక్సూచిగా నిలిచాడు. ప్రపంచంలో విప్లవం విజయవంతమై, ఆకలి అంతమైన రోజు వెల్లివిరిసే ఆనందాన్ని మనం ఊహించలేమని అన్న లోర్కా ఒక సుందర ప్రపంచాన్ని కలగన్నాడు. లోర్కా హత్య గురించి మాట్లాడుతూ నెరూడా అన్నట్టు ఆ దుర్మార్గాన్ని లోకం ఎన్నటికీ మర్చిపోదు. క్షమించదు. అతను కల గన్న ప్రపంచాన్ని సాకారం చేసుకునే వరకు ప్రజలు నిరంతరం పోరాడుతూనే ఉంటారు.

(లోర్కా కవితల అనువాదం: ఎన్. వేణుగోపాల్)

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

9 thoughts on “ధిక్కార కవి యోధుడు- లోర్కా

  1. చాలా బాగా రాసారు. టచింగ్ గా ఉంది. Lorca గురించి కొంత తెలుసు కానీ ఇప్పుడు పూర్తిగా తెలిసింది. Lorca హత్యకు గురైనప్పుడు బహుశ నెరుడ అనుకుంటా ఒక కవిత రాసాడని చదివినట్లు గుర్తు ఫర్ హమ్ ద బెల్ టల్స్ అనుకుంటా. సరిగా గుర్తులేదు కానీ అది ఇలా ఉంటుంది. నేను తప్పైతే సారి చేయండి. పూర్తిగా గుర్తు కూడా లేదు. ఎప్పుడో పాతికేళ్ల క్రితం చదివింది.

    ఎవరి కోసమీ గంట మోగుతున్నది?
    ఎవరి మరణమీ చావు సంగీతాన్నీ ప్రతిధ్వనిస్తున్నది?

    ముందుపోయే వాళ్లెప్పుడూ
    మంచివాళ్ళై వుంటారు
    వాక్కు వీరులై వుంటారు
    శురులై వుంటారు

    ఓ వీరులారా సూరులారా
    అందమైన పద్యల్లారా
    కాలావధుల్ని దాటి ప్రవహించే కంటి సముద్రల్లారా!

    1. Thank you, Krishna.

      ‘For whom the bell tolls’ అనే కవిత John Donne రాశాడు. ఇక్కడ అది చదువొచ్చు. http://www.yourdailypoem.com/listpoem.jsp?poem_id=2118

      నెరూడా లోర్కా మీద గొప్ప నివాళి, కవిత రాశాడు.
      http://www.mrossman.org/winds/poets/neruda.html

      మీరు చెప్పిన కవిత సంగతి మాత్రం నాకు తెలియదు.

  2. లోర్కా ప్రస్తావనతో నెరూడా మరొక కవిత కూడ రాశాడు. కొన్ని విషయాలు వివరిస్తాను అని మొదలై రా వీథుల్లో నెత్తురు చూడు అని ముగుస్తుంది. దానికి నా తెలుగు అనువాదం అఫ్సర్ ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీ చూస్తుండగా బహుశా 1980ల చివరలో కావచ్చు అచ్చయింది. దానికి కాపీ నాదగ్గర ఉందేమో వెతుకుతున్నాను…

      1. అయితే నేనే కన్ ఫ్యూజ్ అయ్యాను. నేను రెండూ చదివాను. అయితే నాకు “ఫర్ హూం ద బెల్ టాల్స్” గుర్తుండిపోయింది. రాసిన జాన్ డోన్ పేరు గుర్తు లేదు. నెరుడా పేరు గుర్తుంది కానీ ఆయన కవిత గుర్తు లేదు. చదివి పాతికెళ్ళైంది. ఫర్ హుం ద బెల్ టాల్స్ కవితని హిమజ్వాల అనువాదం చేసారనుకుంటా.

  3. లోర్కా గురించి చదువడం గొప్ప స్ఫూర్తి నిచ్చింది. చాలా బాగుందిరా చైతూ!

  4. చాలా బాగా రాశారు లోర్కా గురించి.మొదటి సారి లోర్కా గురించి తెలుసుకున్నాను .ఒక గొప్ప ప్రజా కవిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు…

Leave a Reply