నక్షత్రాలని కబళించిన
రాబందు ఆకాశం రెక్కల కింద
ఏకాకి నిట్టూర్పు
కన్నీళ్ళ కొలిమిలో రగిలే ఒంటరి క్షణాలు
ఒంటరి క్షణాల కత్తి గొంతుపై వేలాడే కాలం
కాలం నాలుగు గోడల మధ్య బందీయైన శాశ్వత శిశిరం
శిశిరమై పరుచుకున్న సూర్యోదయం జాడ లేని సుదీర్ఘ నీరవ నిశీధి
నిశీధి మానని గాయమై సలిపే నిరాశ
నిరాశ చీకట్లలో
కొడిగట్టని కొనవూపిరి దీపం
విస్తరించే ఎడారులలో
ఇంకిపోని లోలోపలి సముద్రం
ముళ్ళకంచెల మధ్య
మొలకెత్తే ఇంద్రధనుస్సు
చిత్రహింసల సంకెళ్ళలో
శ్వాసించే జీవ రవళి
చిట్టచివరి బందిఖానా శిథిలాలపై
కువకువలాడే స్వేచ్ఛా విహంగం
అవనతంకాని మానవతాపతాకం
స్వేచ్ఛా గొంతులను, కలాలను వారి కలలను బంధిస్టున్న ఈ మతోన్మాద నియంతృత్వ అధికారాన్ని కూల్చె ప్రక్రియలో ఈ చిన్న కవిత ఒక భాణంలా దూసుకెల్తుంది….. కవిత చాలా బాగుంది.