కల్లోల కడలి ‘నీలి గోరింట’

“నీలి గోరింట” మందరపు హైమవతి గారి కవితా సంకలనం. ఈ పుస్తకం చదివే దాకా వారి రచనలతో నాకు పరిచయం లేదు. ఒకప్పుడు ప్రముఖ స్త్రీ వాద రచయిత్రిగా వారికి పేరుండేది అన్న విషయం కూడా ఇప్పటి దాకా నాకు తెలీదు. తెలుగులో నేను ఇష్టపడి చదివే కవిత్వం చాలా తక్కువ. తెలుగు కవిత్వం పట్ల నాకు పెద్దగ అవగాహన లేదు. కాబట్టి వారి కవిత్వంతో నాకు ఇంతకు ముందు పరిచయం లేదు. “నీలి గోరింట” పుస్తకం నా దగ్గరకు వచ్చాక పుస్తకాలన్నీ పేరుకుపోతున్నాయి. వీటిని ఓ మారు చదివి పంచేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ పుస్తకాన్ని తెరిచాను. ఒక్కో కవిత చదువుతూ పుస్తకం పూర్తి అయ్యేదాకా వదలలేదు. అద్బుతమైన కవితలని చెప్పాలా… ఏమో మరీ. వీటి గురించి ఏం చెప్పాలో తెలీట్లేదు. అసలు అద్భుతమైన కవిత్వం అని దేన్ని అంటారో నాకు తెలీదు. నాకు ఆ భావన తెలుగులో చాలా తక్కువ సందర్భాలలో కలిగింది. అందువలన ఈ కవిత్వాన్ని అద్బుతం అని అనను. కాని ఈ కవిత్వంలోని భావ వ్యక్తీకరణ మాత్రం నన్ను కట్టిపడేసింది. నాకు ప్రస్తుతం తెలుగులో వస్తున్న కవిత్వం పై కొన్ని అభ్యంతరాలున్నాయి. అస్తిత్వ వాదన అంటూ అతివాదాన్ని, రెచ్చగొట్టుతనాన్ని ప్రేరేపించే కవిత్వ ధోరణులను గమనిస్తూనే ఉన్నాను. భావుకత పేరుతో అర్ధం లేని అయోమయాన్ని చొప్పిస్తున్న కవిత్వాన్ని కొంత చదివి ఉన్నాను. భావుకత్వం, స్త్రీ వాదం, ఈ రెండు విధానాలలో కూడా ఎక్కడా తప్పని బాలెన్స్ తో రచయిత్రి ఈ కవిత్వాన్ని రచించిన విధానం మాత్రం నాకు బాగా నచ్చింది.

“కొత్త చీర కట్టుకొన్నా / పూలు పెట్టుకొన్నా/ ఏమీ పట్టించుకోని క్రూరశిక్షననుభవించే శక్తిలేక / సంప్రదాయ పంజరం ఊసలు విరిచి / రెక్కలు విప్పి /స్వేచ్ఛా గగనంలో / ఎగిరిపోదామనుకొంటా కానీ / కాళ్ళకు చుట్టుకొన్న అల్లిబిల్లి తీగల్లా / అల్లుకున్న పిల్లల్ని తప్పించుకోలేక / మాటల్లేని ఎడారిలో ఒంటరి ఒంటెను” అంటూ ఆమె రాసినప్పుడు అందులో ఓ స్త్రీ చేతకానితనం కాదు, భాద్యత కనిపిస్తుంది. “ఏడుకొండలవాడికి / ఏటా ముడుపు కట్టినట్లు / ప్రతినెలా / వేతననైవేద్యం సమర్పించి / రోజూకూలీ కోసం చేతులు చాచే కూలీలా / నిత్యావసరాలకోసం భర్తముందు / చేతులు చాచే ఆధునిక మహిళను” అని ఆమె రాసిన కవితలో పదునైన వ్యంగ్యం తొంగి చూస్తుంది. పురాణ పాత్రలను కవితా వస్తువుగా తీసుకుని, కవయిత్రి రాసిన కొన్ని కవితలు ఈ సంకలనంలో ఉన్నాయి. కుంతివ్యధను వర్ణిస్తూ… “నిర్దేశింపబడిన వరునికి / నిశ్చయింపబడిన వధువుని నేను / సకలా భీష్టాల సమస్థాభి రుచుల / సర్వనాశన వివాహంలో / సంతానం కోసం అపరిచిత పురుషులను నియోగించినప్పుడు / కట్టు కొయ్యలా మిగిలిన దేహాగ్నిలో / మనసు కుసుమం మాడి మసైన / మానినిని…..” అన్న వాక్యాలలో ఆక్రోశం కనిపిస్తుంది. ప్రవరుడిని వరించిన వరూధిని గాధను వినిపిస్తూ… “కామమో! మోహమో / స్నేహమో! దాహమో / వలపుమైకమో తలపు జ్వలనమో / మీట ఎప్పుడూ మీ చేతిలోనే” అంటూ పురుష ప్రపంచాన్ని ప్రశ్నిస్తారు. గౌతముడు వదిలి వెళ్ళిన యశోధర జీవితాన్ని విశ్లేషిస్తూ… “ఇల్లాలి పేరు పిల్లల చదువులు / ఎంత మరచిపోతే / అంత గొప్ప సంఘసంస్కర్త /మతప్రవక్త / అదే నేనైతే / కుటుంబ పంజరాన్ని / ఛేదించి బయటకు వచ్చిన / బరితెగించిన స్త్రీ అని / బిరుదులిస్తారు అయాచితంగా” అంటూ ఇల్లు విడిచి వెళ్ళిన సిద్ధార్థుని, వెళ్ళలేని యశోధర స్థితికి మధ్య ఉన్న సామాజిక తేడాను సున్నితంగా ఎత్తి చూపుతారు. మరో చోట సీత కథను గుర్తు చేస్తూ… “పుడమితల్లి ఒడిలో / అడుగుపెట్టిన ఆత్మగౌరవ గీతం సీత అని/ శైశవంలోనే / శివధనుస్సునెత్తిన ధీర వనిత సీత అని / కొత్త కావ్యానికి శ్రీకారం చుడదాం / సఖీ పాత అర్ధాలను చెరిపేద్దాం చెలీ” అని చెప్పుకొస్తారు. సీత కథను కొత్త కోణంలోంచి చూడవలసిన అవసరాన్ని వివరించే ఈ కవిత లో కవయిత్రీ స్త్రీ వాదం ఆకట్టుకుంటుంది.

“ఎడతెరిపి లేని కన్నీటి వర్షంలో తడిసి / ముడుచుకొని బొట్లుబొట్లుగా నీరు కారుతూ / అనందం ఎండ కన్నెరుగని గుండె పిట్టను /ఆకాశంలో విహరింప చేయడమే గదా / ప్రయాణమంటే” అంటూ స్త్రీ కోణంలో ప్రయాణపు ఆనందాన్ని వర్ణించిన ఈ కవితలోని పదాల ఎంపిక ఆనందం కలిగించింది. స్త్రీ అప్పుడప్పుడు తన కోసం ఇల్లు వదిలి ప్రకృతి ఒడిలో సెదతీరాలి… తనకోసం కోంత సమయం కేటాయించుకోవాలి అని చెబుతూ “నాలుగ్గోడల నలుచదరపు పంజరంలో /గుడి గుడి గుంజం తిరుగుతూ /నడక మరచి పోతావెందుకు” అంటూ ఇల్లు వదిలి రాని స్త్రీలను ప్రశ్నిస్తారు. స్తీల ప్రేమను ఆస్తిగా భావించే సమాజాన్ని “అభిలషించిన వెంటనే /అనుభూతి సుమం వికసించడానికి /మర యంత్రం కాదుగదా మనసు” అని ప్రశ్నిస్తారు. ఇదే కవితలో “సౌందర్య నిధులపై /మోహదృష్టులు సారించే మృగాలకు /అంగస్థంభనలే తప్ప /అంతరంగ స్పందనలు కలగనప్పుడు /మా గాయాలకు మేమే లేపనాలం” అంటూ నినదిస్తారు.

సమాజంలో స్త్రీ బానిస జీవితాన్ని చెప్పుకొస్తూ “డబ్బిచ్చి కొనుక్కొంటారు బానిసలని / డబ్బిచ్చి కోరుకుంటారు బానిస బతుకులని / ఈ ప్రపంచంలో అన్నిటికన్నా /ఆమెను దోపిడి చేయడం తేలిక గదా” అని పెదవి విరుస్తారు. ఇంటి బాధ్యతలతో తన గురించి తాను పట్టించుకోలేకపోతున్న ఆధునిక స్త్రీ అంతరంగాన్ని మరో కవిత పరిచయం చేస్తుంది “నేనూ ప్రకృతి ప్రేమికురాలినే / వాహనాల కాలుష్య ధూమ భూతాలను / తరిమికొట్టి నగర శివార్లు దాటి /ఆకుపచ్చని ఆత పత్రాల తరుచ్చాయల్లో / కుంకుమపూలు ఎండబెట్టిట్లున్న/ ఉదయాకాశవీధి సౌందర్యాలను చూస్తూ / ప్రాణ హరితం పల్లవించే / తాజాగాలుల నాస్వాదిస్తూ /వృత్తి వత్తిళ్ల శత్రువును జయించి / సంసార తాపత్రయాల నరకాలు / అధిగమించి /నాలుగడుగులు నడవాలంటే / సంబరమే గదా ఎవరికైనా” అని ఆమెతో చెప్పిస్తారు… కాని ఆమె భాద్యతలు ఈ మాత్రపు ఆనందాన్ని ఆమెకు దక్కనివ్వవు. ఈ స్థితిలోని అసహాయతను చూపించిన విధానం బావుంది.

హైమవతిగారు ప్రకృతిని ప్రేమించే విధానం బావుంది. ఆమెలో భావుకత, సామాజిక స్పృహ సమపాళ్లలో కనిపిస్తాయి. “చేతి ఫోనుతో / ఎక్కడోనున్న వారితో తప్ప/ పక్కనున్న వారితో మాటలాడడం / మరచిపోయిన కాలంలో / వాకిట్లో ద్వారపాలికలా నిలచి / వచ్చే పోయేవారిని పలకరిస్తూ / స్నేహ సుగంధాలు పంచి పెట్టే / ప్రాణమిత్రునిలాటి చెట్టుకి సాటి ఎవరు” అని ఆమె ప్రశ్నిస్తున్నప్పుడు నేటి బిజీ జీవితాలలోని డొల్లతనంతో పాటు మనం చూడలేకపోతున్న పకృతి లోని గొప్పతనాన్ని తన కవితలో సందర్భోచితంగా చెప్పగలిగిన ఆమె కవితా శైలికి అబ్బురపడతాం. వర్షం కురిసిన నాటి ప్రశాంతనను వర్ణించేటప్పుడు, వారి పదాల కూర్పు చూడండి “ఎన్నాళ్ళ బట్టో /ఎదలో పేరుకొన్న / అంతరంగ వ్యధనంతా / ఆత్మీయులకు చెప్పుకొన్నాక / తేలికైన మనసులా /వర్షం కురిసి వెలిసాక / మల్లెమొగ్గల మబ్బులతో / తెల్ల తెల్లని నిర్మలాకాశం” ఈ పోలిక ఎంత అద్బుతంగా ఉందో. విషాదం మాటున తొంగి చూస్తున్న ఆశలా. నది గురించి రాసిన ఓ కవితలో “దారిపొడుగునా మౌన శిలలను కరిగిస్తూ /మాటల వీణా తంత్రులను మీటడమేగా నది లక్ష్యం…..” అంటూ నదిని తాను చూసే దృష్టితో మనలనూ చూడమని ఉత్సాహపరుస్తారు.

ప్రత్యేక సందర్భాలలో, కొన్ని సంఘటనల ప్రభావంతో వీరు రాసిన కవితలు కూడా ఈ సంకలనంలో కొన్ని ఉన్నాయి. తమిళనాడులో విరూడ్ నగర్లో 60 ఏళ్లు దాటిన వృద్దులకు కుటుంబ సభ్యులు తలైకూతల్ – తలంటు స్నానం చేయించి ఎక్కువ గ్లాసులు కొబ్బరి నీళ్ళు తాగించడం వలన రెండు రోజుల తరువాత కిడ్నీలు చెడిపోయి వాళ్ళు మరణిస్తారట. ఈ తలంటు చావుల గురించి చదివి వీరిలా స్పందిస్తారు. “ ప్రాణ పత్ర హరితం /పల్లవించే మనుషులకన్నా /ప్రాణ హీన వస్తువులనే / ప్రాణప్రదంగా చూసుకుంటున్నప్పుడు / పలకరించే మనుషులకన్నా / పచ్చ కాగితాల /ఉచ్చుల్లో పరవశిస్తున్న / మారిన భారతంలో /మరణ శాసనాలు /తలంటు స్నానాలు”. మరో సందర్భంలో అంధుల పాటకచేరి విని “ఆత్మన్యూనతాభావ చెదలు / కొరికి వేసిన గుండెలతో / కృంగి కృశించిన మరుగుజ్జులు / మానసిక వికలాంగుల కన్నా / ఆత్మవిశ్వాస రాగ సాధనలో / అనంత విశ్వాన్నే జయించిన / అపర త్యాగ రాజులు…” అని రాసుకొస్తారు. పస్తుత నాగరిక ప్రేమలపై ఓ చోట “బుల్లితెరపై పిల్లల పాటల పోటీల్లో / నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపు / అని నడుమూపుతూ / ఏమీ ఎరుగని పిల్లలు / నాట్యమాడుతుంటే / చీమకుట్టి నట్లైనా లేక / కీర్తి గాలిపటం ఎగురుతున్న దృశ్యం చూస్తూ /చిద్విలాసంగా తల్లితండ్రులు గర్విస్తున్న వేళ / అపహాస్యం చేస్తుంది ప్రేమ పురుగు” అంటూ ఆవిడ ప్రశ్నించడం ఎంతో తృప్తిగా అనిపించింది. డబ్బు సంపాదనలో అన్నీ మరచిన నాగరికుల గురించి చెబుతూ “ప్రధమ వర్షబింధువుల స్పర్శ / అపరిచితులైన అభాగ్యులకు / దుఖపు తడి కన్నీటి నది / సంతోషాల సరదాల జావళి / ఏదీ అంటని ప్రాస్టిక్ స్పర్శ” అంటూ వారు కోల్పోతున్న ఆనందాల వైపు దృష్టి మల్లించే ప్రయత్నం చేస్తారు. మరో కవితలో స్పర్శలోని ఆనందాన్ని ఇలా చెప్పుకొచ్చారు “స్పర్శ ఒక అద్భుత ప్రేమ కావ్యం / చచ్చుబడిన కణాలకు / జీవధాతువునొసగి / ప్రాణమొసగే సంజీవనీ…”
“ఇల్లు పట్టించుకోని వాళ్ళు / పిల్లల పేర్లు తెలియని వాళ్ళు / సంఘసేవకులుగా కీర్తింపబడుతున్న వేళ /మున్నూటరవై ఐదురోజులు /వంటింటి చెరసాలలోనే మగ్గిపోతూ /నిగమశర్మ అక్కలా మిగిలిపోతున్నా…..” అంటూ రెండు వర్గాల స్త్రీల నిజ జీవితాలను ధైర్యంగా చెప్పగలిగారు. ఇదే చోట “సామూహిక వంటశాలని నిర్మించాలని / ఒక చిన్న మాట రాసిన గురజాడ చేతిపై / ఒక చిన్న ముద్దు పెట్టాలని నా కోరిక” అంటూ కవయిత్రి చెప్పడం చాలా చాలా నచ్చింది. “నాలుగ్గోడల మధ్య బంధించిన మార్జాలమైనా / వ్యాఘ్రమై ఎదురు తిరిగిన ఘటనల నేపద్యంలో / బానిసత్వాన్నే గుర్తించలేని /అంధకార బుద్దిమాది / ఆంక్షలనే సన్మానాలుగా స్వీకరించే / అమాయక జాతిమాది” అంటూ స్త్రీల నిస్సహాయ స్థితిని గుర్తు చేస్తారు. మళ్ళీ ఆమె మరో చోట ఆధునిక స్త్రీ వ్యాపార వస్తువుగా మారిన వైనాన్ని “చలనచిత్ర వ్యాపారాల /అంతులేని లాభార్జన కోసం / నాలుగురోడ్ల కూడళ్ళలో /వేలాడదీసిన అరకొర దుస్తుల / అర్ధనగ్న శరీరాలు / ఆబాల వృద్దులకు /ఆనందోత్సవం చేస్తుంటే / ఎవరికైనా ఎందుకు గుర్తుకు వస్తారు / కిరణ్ బేడీలు కల్పనా చావ్లాలు….” అని చెబుతూ విషాదంతో నిట్టూరుస్తారు. కొందరు కన్న తల్లుల దీన గాధలను వర్ణిస్తూ “బ్రతికున్నప్పుడు కొండంత అండగా ఉండని వారు కన్ను మూశాక సమాధి మీద నామ ఫలకం చెక్కిస్తారు ఎవరేం చేసినా మళ్ళి నీవు తిరిగిరావు గదమ్మా” అంటూ దుఖపడే వాక్యాలలో ఆమె కనుల చెమ్మ కనిపిస్తుంది.

ఈ సంకలనంలో కొన్ని రచయత్రి వ్యక్తిగత కవితలున్నాయి. వారి తల్లిని, తండ్రిని సోదరుడిని, మేనగోడళ్ళని స్మరిస్తూ రాసుకున్న వాక్యాలలో వారిపై తనకున్న ప్రేమను చెప్పుకునే ప్రయత్నం చెసారు. తండ్రి గురించి “శీతాకాలం ఆకాశం మేకుకు / తగిలించిన గుండ్రని అద్దంలా మెరిసే / గోరువెచ్చని సూరీడు నాన్న” అంటారు. గొప్ప భావన ఇది. ఎవరెస్టు శిఖరాన్నిఅధిరోహించిన పూర్ణ ఆనంద్ లను తలచుకుంటూ “ఆ వార్త విన్న దగ్గర్నుంచీ /నేనే ఎవరెస్టు ఎక్కినంత సంబరం / ఆంగ్ల మాధ్యమ విద్యార్ధులే అసలైన విద్యార్ధులనే /అపప్రధకు స్వస్తి చెప్పి /ప్రభుత్వ గురుకుల పాఠశాలల ప్రతిష్టా గీతాలు నలుదిశలా /ఆలపించిన తెలుగు కోకిలలకు అభినందన హారతి” అంటూ అభినందించడం బావుంది. అమ్మ స్మరణలో మరో చోట “నీ స్మృతుల తటాకంల్లో /తనివి తీరా తడవడానికి /ఖాళీ దొరకని క్షణాలన్నీ /నిశ్చల నిష్పరిమళ రాతి పువ్వులే” అని రాసుకున్నారు.

స్త్రీని మార్కేటీకరణ చేసిన వ్యవస్థను ప్రశ్నిస్తూ మరో చోట “మహిళలంటే భోగ్యవస్తువులుగా /మార్కెట్ సరుకులుగా / అతివలంటే అవయవాల మిఠాయి అంగడిగా / భావించే వ్యవస్థలో/ స్త్రీలంటే దేహాలేగదా / స్త్రీలంటే యోనులే గదా”….అని ఆమె బాధపడుతున్న సందర్భం పాఠకులను కూడా ప్రశ్నించమని, ఎదిరించమని, వ్యవస్థను మార్చే ఆయుధాలుగా మారమని ప్రభోధిస్తుంది. స్త్రీ శరీరం పై హక్కు ఎవరికి అని ప్రశ్నిస్తూ “శత్రు రాజ్యాలను జయించినప్పటికన్నా…… వారి స్త్రీల శరీర రాజ్యాలను జయించిన సందర్భంలోనే…. నీ అహంకారం తృప్తి పడినప్పుడు.. కలిగే సందేహం.. ఈ దేహం ఎవరిది” ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే స్థితిలో మన సమాజం ఆనాడు ఈ నాడు కూడా లేదు. మరో చోట “కవయిత్రినైనా మామూలు మహిళనైనా / కాముకులకు నేనొక మాంస శిల్పాన్నైనపుడు /మృదు సుమ పత హృదయాన్ని చీల్చి వేసె / పదునెక్కిన కత్తిగాట్లు అంటూ ఆమె పడే వేదన పాఠకులకు అంటకుండా ఉండదు. మరో చోట “ఇక / నిషేధ పరంపరల మనుస్మృతులు /నియమాల సమూహాల /కుమారీ శతకాలు పక్కన పెట్టి / ఆత్మవిశ్వాస పతాకాల నెగురవేసె /ఆధునిక మగువస్మృతులే రాయాలి / భయమెరుగని ప్రపంచంలో/ బాలికలు కళ్ళు తెరవాలి.” అంటూ సమాజంలో రావలసిన మార్పు గురించి చెప్పుకొస్తారు.

“కాంక్షాభ్రమరానికెప్పుడూ…దేహ మందార మకరందపానమే లక్ష్యం” అంటూ స్త్రీని సమజంలో చూసే దృష్టిని మరో కవితలో ప్రస్తావిస్తారు. వితంతువులైన స్త్రీల పట్ల సమాజానికి ఉన్న చిన్న చూపు గురించి చెబుతూ ఆమె రాసిన “వికృత చిత్రం” అనే కవితలోని దుఖాన్ని అనుభవించడం ఇప్పటి రోజుల్లో కూడా మనందరికీ అత్యవసరం. ఒంటరి స్త్రీని తేలికగా చూసే తోటీ స్త్రీలకు ఈ కవిత కాసేపు వారిని ఆ వితంతువు స్థానంలోకి చేర్చి ఆ స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని అనుభవానికి తెస్తుంది. ప్రేమ మోహంలో చిన్న వయసులో దారి తప్పుతున్న అమ్మాయిలను చూస్తూ “ఏ ఎర్ర దీపాల ప్రాంగణంలోకో /అమ్మాయిల అక్రమ రవాణా వ్యాపారంలోనో / నీవొక వస్తువు కాకుంటే చాలు” ఆంటూ కవయిత్రి బాధపడడం నేటి మోహపు వలల సమాజంలో స్త్రీల స్థితిని మన కళ్ళ ముందు నిలుపుతుంది.

ఈ గంభీరమైన కవితాసంకలనంలో కొన్ని హాస్యపు గుళికలు కూడా ఉన్నాయి. చేతిలో సెల్ ఫోన్ లేకపోతే అతలాకుతలం అయిపోయే మనందరినీ చూస్తూ కవయిత్రి వ్యంగంగా ఇలా స్పందిస్తారు “రావణుడు ఎత్తుకువెళ్లాక / రాముడు ప్రాణసతి సీత కోసం / చెట్టును పుట్టను పిట్టను తీగను వెదికినట్లు /ఇంట్లో ఆఫీసులో నీ చిరునామాకోసం వెదకి వెదకి /నీవు లేవనీ నిర్ధారణ అనంతరం /ఈ ప్రపంచమే స్థంభించిన శూన్య హృదయ భావన” ఇంతకి ఈ భాధంతా సెల్ ఫోన్ కనిపించకపోవడం వలన కలిగిన దుఖం అని తెలిసి యంత్రాలకు బానిసలమయిన మనందరం మన యంత్రాధారిత జీవితాల గురించి ఒక్క క్షణం తప్పకుండా ఆలోచిస్తాం. ఎవరికి వారై బ్రతుకుతున్న ఈ ఆధునిక మనుష్యుల మధ్య మనసున్న వారిలో పేరుకుపోతున్న దిగులు ఎలా తగ్గుతుంది? అ దిగులుకి కారణం ఎంటని అడిగిన వారికి వివరించడానికి ఒకోసారి భాష సరిపోదు. “ఏభై అరు అక్షరాల నక్షత్రాలు /భాషాంబరంలో మెరుస్తున్నా/ నిర్దిష్టభావ వ్యక్తీకరణకు /నిక్కమైన ఒక్క అక్షరతారకను కోసుకొచ్చి / మనసు గుమ్మానికి తగిలించలేకపోతున్నా” అంటూ ఆమె పడే విచారం మనమూ ఎదో ఒక సందర్భంలో అనుభవించినదే.

నేటి వ్యాపారాత్మక విద్యలపైనే ఆకర్షణలు పెంచుకుంటున్న తల్లి తండ్రులకు పిల్లల భవిష్యత్తు పట్ల నిజంగానే శ్రద్ద ఉన్నదా అన్న అనుమానం కొన్ని సందర్భాలలొ అందరికీ కలుగుతున్న వేల “ఆంగ్లమాధ్యమం వ్యామోహంలో / పిల్లల బాల్యాన్ని బలి చేస్తున్న తల్లితండ్రులని / నిస్వార్ధ పరులని ప్రేమమూర్తులని ఎలా అంటాం” అని కవయిత్రి ధైర్యంగా ప్రశ్నిస్తారు. “పట్టుమని ఒక గంటసేపు నిలబడలేని / క్రింద కాసేపు కూర్చోలేని ఈనాటి బాలవృద్దులు / ప్రవహించడం మరచిపోయిన నదులు /రెక్కలు విరిగిన జటాయువులు / కదలని స్థంబాలు” అని ఆమె విరక్తితో నిట్టూర్చడం కనిపిస్తుంది.

హైమవతి గారు అక్షరాన్ని ప్రేమిస్తారు. అక్షరమే ఏ మార్పుకయినా మూలం ఆది అని నమ్ముతారు. పెరుమాళ్ మురుగన్ పై దాడికి నిరసనగా వీరు “అక్షరమంటే /చీకటి కొలనులో విరిసిన వేకువ పువ్వు / పిరికితనం గుండే గుహలో / వెలిగించిన ధైర్యదీపం /తాడితుల పీడితుల పక్షాన /బిగించిన పిడికిలి” అని చెబుతూ తాను అక్షరాన్ని నమ్ముకున్న విధానన్ని ప్రస్తావిస్తారు. వీరి కవితలలో ఎన్నుకున్న పదాలు, భావ వ్యక్తీకరణ విధానంలోని బ్యాలెన్స్ కవయిత్రి లోని పరిపక్వతకు నిదర్శనం. భాషపై మంచి పట్టూ, భావ వ్యక్తీకరణలో ఒక లయ వీరి సొంతం. అర్ధం అందం రెండు జతగా కూడిన వీరి కవితలను చదవడం ఒక మంచి అనుభవం. “నీలిగోరింట” కవితా సంకలనం రచయిత్రి సమాజాన్ని పరిశీలీంచిన తీరును స్పష్టపరుస్తూనే, సమాజంలో రావల్సిన మార్పు స్త్రీ పట్ల మారవలసిన ఆలోచన, చాంధసవాదంలోని మూర్ఖత్వానికి ఆధునికత్వంలోని అతివాదానికి ఒక మధ్యస్థం. ఈ స్థితిలో నిలబడి సమాజాన్ని పరిశీలించవలసిన అవసరం ఇప్పుడు మనందరిదీనూ. సాంప్రదాయం పేరున, ఆధునికత పేరున కూడా నష్టపోతుంది స్త్రీనే. అయితే సాంప్రదాయంలో తనకు జరుగుతున్న నష్టాన్ని అర్ధం చేసుకోగలిగిన స్త్రీ కూడా. ఆధునికత మాటున తాను మార్కెట్టులో సరుకుగా మారుతున్న వైనాన్ని అర్ధం చేసుకోలేకపోవడం నేటి సమాజంలో స్త్రీ జీవితం ఎటువంటి ప్రమాదంలో ఉందో చూపుతుంది. అందుకే ఇప్పుడు కావలసింది. ఈ రెండు స్థితుల మధ్యన నిలిచి జీవితాలను పరిశీలించుకోవడం. ఆ పనికి “నీలిగోరింట” నిస్సందేహంగా సహకరిస్తుంది. అందుకనే ఈ కవితలు చాలా మందికి చేరాలన్న దిశగా ఈ పుస్తక ప్రయాణం జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కని కవిత్వాన్ని తెలుగు సాహిత్య ప్రపంచానికి అందిచ్చిన మందరపు హైమవతి గారికి అభినందనలు.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply