కల్లోల కడలిలో ఎగసిన కవితా కెరటం

అలిశెట్టి ప్రభాకర్‌. ఓ కల్లోల కడలి కెరటం. ఉజ్వల వసంత గీతం. తలవంచని ధిక్కార గీతం. కల్లోలిత ప్రాంతాల మట్టిని గుండెలకు అద్దుకున్న కవి. వీరులు నడిచిన తొవ్వల్ని ముద్దాడినవాడు. గుండెలకు హత్తుకున్నవాడు. పోరుదారిలో నేలకొరిగిన అమరవీరుల ఆశయాల్ని కలంలో నింపుకున్న కవి. ప్రజాకవి. విప్లవ కవి. రగల్‌ జెండా నీడన అక్షరాల్ని సానబట్టిన సాహసి. వాటిని సాయుధం చేసిన విప్లవ స్వాప్నికుడు. ఆయుధాన్ని అధ్యయనం చేసిన ఆచరణశీలి. ‘జగిత్యాల జైత్రయాత్ర’ అతనిలో కల్లోలం రేపింది. కలవరపెట్టింది. ఆ కల్లోలంలో విప్లవం. కలవరింతల్లో విప్లవం. పలవరింతల్లో విప్లవం.

తన ఇంటి ముందునుంచే కదం తొక్కుతూ సాగిపోయిన జైత్రయాత్ర. ఆ దారంతా రగిలిన నినాదాలు. ఎగసిన పిడికిళ్లు. నింగీ నేలను ఏకం చేస్తూ చెలరేగిన ఎర్రెర్రని దుమ్ము. వీరులు నడిచిన దారంతా చెరగని గుర్తులు. పాదముద్రలు. రగిలించిన పోరాటం. నేల నేలంతా పరీవ్యాప్తమై అతని ఊపిరైంది. అందుకే అక్షరాల్ని సాయుధం చేశాడు. కుంచెకు తన నెత్తుటినద్ది, ఈ దేశ భవిష్యత్‌ చిత్రపటాన్ని గీశాడు. కెమెరా లెన్స్‌తో రేపటి స్వప్నాన్ని ఫొటో తీశాడు. ఆ స్వప్నావిష్కరణ కోసం తపనపడ్డాడు. అదే స్వప్నం. నిదురలోనూ. మెలకువలోనూ. అందుకే అతని అక్షరాలు రగల్‌ జెండాలా రెపరెపలాడుతాయి.

అతడు విముక్తి దారిని కలగన్నాడు. తన అక్షరాల్ని ప్రజలకే అంకితం చేశాడు. జనం గుండెల రణన్నినాదాలకు కోరసయ్యాడు. జెజ్జనక జ్జెన్‌ దరువై. కోలాట జడకొప్పుల్ల మెరిసే వెలుగై. అతనిది వెలుగు దారి. గెలుపుదారి. ‘అడవి నేను`కడలి నేను’ అంటూ విప్లవోద్యమాన్ని ఆవాహన చేసుకున్నాడు. అగ్ని పద్యమై. దగ్దగీతమై. మంటల జెండాల జాతరై. మందుపాతరై. చీకటి చెరసాలలకు నిప్పంటించే అక్షర కాగడాల్ని కలంలో నింపుకున్నాడు. ‘మరణం నా చివరి చరణం కాద’ని ప్రకటించాడు. విముక్తంటే దీర్ఘకాలిక పోరాటమని తెలుసు తనకు. అందుకే ‘ఈ దీర్ఘకాలిక యుద్ధవ్యూహంలో పీడితుడే నా అణ్వస్త్రం’ అని ప్రకటించాడు. అట్టాగే బతికాడు. చివరిదాకా. జనం బాటలోనే బతికాడు. చివరి ఊపిరిదాకా.

అలిశెట్టి ప్రభాకర్‌ కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో 1956, జనవరి 12న పుట్టాడు. చేనేత కుటుంబం. ఏడుగురు అక్కాచెల్లెళ్లు. ఇద్దరు అన్నదమ్ములు. ప్రభాకర్‌ ఐదోవాడు. తండ్రి పరిశ్రమల శాఖలో ఉద్యోగి. ప్రభాకర్‌కు పదకొండేళ్ల వయసప్పుడే తండ్రి చనిపోయాడు. పదహారేళ్లకే కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో ఇంటర్మీడియట్‌ చదువును మధ్యలోనే వదిలేశాడు. మొదట్లో చిత్రలేఖనంపై ఆసక్తితో విపరీతంగా సాధన చేశాడు. అందులో పరిణతి సాధించాడు. పెన్సిల్‌తో అందమైన చిత్రాలేసేవాడు. ఇండియన్‌ ఇంక్‌తో వేసిన చిత్రాలు పత్రికల్లో అచ్చయ్యాయి. చిత్రలేఖనమే లోకమైంది. ప్రాణమైంది. అదే కాలాన జగిత్యాలలో ‘సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయమైంది. ఆ ప్రభావంతో కవిత్వరంగంలోకి వచ్చాడు. కళ్లెదుట జరిగే సంఘటనల్ని కవిత్వంగా అల్లే ఒడుపు తెలిసింది. ఆంధ్ర సచిత్ర వారపత్రిక(1974)లో మొదటి కవిత (పరిష్కారం)అచ్చయింది. ఇది ప్రభాకర్‌కు ఉత్తేజాన్నిచ్చింది. దీంతో కవిత్వమే జీవితమైంది. జీవితమే కవిత్వమైంది. ఉద్యమమైంది.

బతుకుదెరువు కోసం సిరిసిల్లలోని ఓ ఫొటో స్టుడియోలో చేరి మెలకువలు నేర్చుకున్నాడు. జగిత్యాలలో (1975) ‘స్టూడియో పూర్ణిమ’ ప్రారంభించాడు. ఒకవైపు ఫొటోగ్రఫీ. మరోవైపు చిత్రలేఖనం. కవిత్వం. 1975 నుంచీ కవిత్వమే ప్రాణంగా బతికాడు. ఆంధ్రజ్యోతి ప్రత్యేక సంచిక(1976)లో ప్రభాకర్‌ రాసిన ‘వేశ్య’ కవిత అచ్చయింది. ‘భారతి’లో ఒకే సంచికలో రెండు కవితలు వచ్చాయి. అతని కవిత్వంలో సరళత, స్పష్టత, సూటిదనం పాఠకుల్ని విపరీతంగా ఆకర్షించాయి. దీంతో అతని పేరు తెలుగు నేలన నలుదిశలా మార్మోగింది. శక్తివంతమైన కవిత్వం రాసే కవిగా ప్రసిద్ధుడయ్యాడు.

అది ‘జగిత్యాల జైత్రయాత్ర’ సందర్భం. తన ఇంటి ముందు నుంచే ‘లాంగ్‌ మార్చ్‌’ చేస్తూ వెళ్లిన రైతాంగ జైత్రయాత్రను కళ్లల్లో నింపుకున్నాడు. ‘దున్నేవారికే భూమి’ నినాదం ఆలోచింపజేసింది. వేలాది జనం గొంతుల్లో హోరెత్తిన ‘నక్సల్బరీ ఏకీ రస్తా’ నినాదం కొత్త చూపునిచ్చింది. తను రాయాల్సిన అక్షరాలకు వెలుగు దారైంది. కొత్త పరిచయాలు. యవ్వనోద్రేకాలు. నెత్తురు మండే ఆలోచనలు. అతణ్ని పీడితుల పక్షం నడిపించాయి. మల్లోజుల కోటేశ్వరరావు, ముప్పాళ్ల లక్ష్మణరావు, సాయిని ప్రభాకర్‌, నల్లా ఆదిరెడ్డితో భుజం భుజం కలిపి నడిచాడు. జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్నాడు. ప్రభాకర్‌ జీవితంలో అదొక ప్రభంజనం. అదొక ఉజ్వల కాలం. పోరు తప్ప మరో దారిలేదని అర్థంచేసుకున్నాడు.

ప్రభాకర్‌ భావుకుడు. సున్నిత మనస్కుడు. మాటల్లో ఫైర్‌. రాతల్లో ఫైర్‌. ‘సృజన’, ‘ఎరుపు’, ‘అరుణతార’, ‘పిలుపు’, ‘నూతన’ పత్రికలు అతనిలో వర్గదృక్పథాన్ని కలిగించాయి. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, శివసాగర్‌, చెరబండరాజు పాటలు, కవిత్వం దిశానిర్దేశం చేశాయి. ఈ ప్రభావంతో నక్సల్బరీ వెలుగులో సాహితీ సృజన చేశాడు. 1977లో ‘ఎర్రపావురాలు’ ఎగరేశాడు. ఇది మొదటి కవితా సంపుటి.

ఒకవైపు కుటుంబ బాధ్యత. మరోవైపు సామాజిక బాధ్యత. లోలోపల వెల్లువెత్తే సంఘర్షణ. వర్తమాన సామాజిక సంచలనాలు. విప్లవోద్యమం… అతణ్ని రాటుదేల్చాయి. 1978లో బీడీ కార్మికురాలు భాగ్యలక్ష్మిని పెళ్లిచేసుకున్నాడు. తన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిలో భాగ్యకు బతుకును వాగ్దానం చేశాడు. అదే పెళ్లి పందిట్లో వాళ్లిద్దరూ సహచరులయ్యారు. ప్రభాకర్‌ 1979లో రెపరెపలాడే ‘మంటల జెండా’ల జాతరయ్యాడు. ఎన్ని కష్టాలెదురైనా వెనకడుగు వేయలేదు. కష్టాల కొలిమిలో రాటుదేలాడు. తన అక్షరాల్నే కాగడాగా వెలిగించాడు. ఆ వెలుగులో ప్రజల్ని చైతన్యం చేశాడు. భూస్వామ్యం, దొరతనం, దోపిడీ, పీడన, అణిచివేత, పితృస్వామ్య దోపిడీ, పార్లమెంటరీ రాజకీయాలను వ్యతిరేకించాడు. మతవర్గ తత్వం, సామ్రాజ్యవాదం, పెత్తందార్ల దోపిడీని ఎదిరించాడు. ధిక్కరించాడు. జనాన్ని పట్టించుకోని రంగు రంగుల జెండాల నాటకాల్ని బయటపెట్టాడు. రాజకీయుల వంచనను జనం ముందుంచాడు.
“ఒక నక్క
ప్రమాణ స్వీకారం చేసిందట
ఇంకెవ్వర్నీ మోసగించనని
ఒక పులి
పశ్చాత్తాపం ప్రకటించిందట
తోటి జంతువుల్ని సంహరించినందుకు
ఈ కట్టుకథ విని
గొర్రెలింకా (మంటల జెండాలు; 1979, పు.38)
పుర్రెలూపుతూనే ఉన్నాయ్‌…” ఇదీ కవిత్వం. అడవి జంతువుల్ని రాజకీయ నాయకులకు ప్రతీకలుగా తీసుకొని రాసిన అద్భుతమైన కవిత. పాలకవర్గం చరిత్ర పొడవునా నెత్తురుటేరులు పారిస్తోంది. వంచన, కట్టుకథలతో జనాన్ని మోసం చేస్తోంది. పార్లమెంటరీ కుట్రాజకీయాలను జనం ముందుంచిన కవిత ఇది. ఎన్నికల ఎండమావుల్లో ప్రజాస్వామ్య జాడల్ని వెతికే జనాన్ని తన కవిత్వంతో చైతన్యం చేశాడు.

తన బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టలేని దేశమిది. వికసించాల్సిన లేలేత బాల్యమంతా కార్ఖానాల్లో మసిబారుతోంది. దేశమంతా ఎక్కడబడితే అక్కడ, నెత్తుటి పూలలాంటి బాల్యం ఎదురవుతుంది. కూడు లేని పిల్లలు. గూడు లేని పిల్లలు. అమ్మెవరో. అయ్యెవరో. లోకం తెలియని పసి పిల్లలు. అర్ధనగ్న దేహాలతో, ఆకలితో అలమటిస్తారు. వాళ్ల కన్నీళ్లకు కారణమైన మేడిపండు లాంటి ఈ దేశ సౌభాగ్యాన్ని చెప్తూ…
“బాలకార్మికుడి
బనీను చిరుగులోంచి
చూడగలిగితే
చిగురించని
ఈ దేశమే (సిటీ లైఫ్‌; 1992, పు.178)
సాక్షాత్కరిస్తుంది” అన్నాడు. అట్లా ఎన్నికల ఎండమావుల్ని జనం ముందుంచాడు. బాల కార్మికుడి బనీను చిరుగుల్లోంచి చూడటమంటే… బాలకార్మికుల ఆకలిని చూడటం. వాళ్ల కన్నీళ్లను తుడవటం. డొక్కలెండిన బిడ్డల్ని చేరదీయటం. వాళ్ల బతుకుల్లో నెలకొన్న చీకట్లను తుదముట్టించే దారికోసం అన్వేషించటం. వాళ్లని ఈ స్థితికి తెచ్చిన రోగగ్రస్థ వ్యవస్థను ద్వేషించటం. నెత్తురోడుతున్న బాల్యం, ఇవాళ ఈ దేశ ముఖచిత్రం. ఐదారు పాదాల్లో ఈ దేశ దౌర్భాగ్యాన్ని చిత్రించాడు. సూటిగా. స్పష్టంగా. శక్తివంతంగా.

అతడు ఉరిమిన ఉత్తర తెలంగాణను గుండెల్లో నింపుకున్నాడు. ఎత్తిన జెండా దించని కరీంనగరే. అతని కళ్లల్లో. కలల్లో. కల్లోల జ్ఞాపకాల్లో. దొరల దోపిడీ కూల్చే దారినందుకున్నాడు. అది విప్లవాల దారి. ‘దెబ్బ దెబ్బ బెబ్బలకూ ఎగిసిన పిడికిళ్ల దారి’. నెత్తురు చిందిన దారి. తరతరాలుగా దొరల చేతుల్లో నలిగిన జనం తిరగబడ్డారు. మర్లబడ్డారు. జన జాతరయ్యారు. కదం తొక్కిన జనసంద్రం హోరుకు గఢీల పునాదుల్లో భూకంపం రగిలింది. ఆ హోరు సిరిసిల్లయింది. ఆ పోరు జగిత్యాలయింది. ‘దున్నేవారికే భూమి’ నినాదం ఓ జైత్రయాత్రయింది. చరిత్ర సృష్టించింది. చరిత్రను నడిపించింది.
“నీ పొట్టనిండా దౌర్జన్యపు కూడు
నీ బతుకంతా అక్రమాల ఊబి
అందుకే
ఇంత దట్టమైన చీకట్లోనూ
జగిత్యాల, సిరిసిల్లా
సరికొత్త ఆయుధాల్లా (మంటల జెండాలు; 1979, పు.52)
క్షణ క్షణం నీ గుండెల్లో తళుక్కుమంటూ…” అని పెత్తందార్లను ధిక్కరించాడు. ‘ఇంటి చుట్టూ ఎన్ని తుపాకులు కాపలా ఉన్నా మిమ్మల్నవి రక్షించలేవని’ దొరల్ని హెచ్చరించాడు. ప్రజాశక్తి ముందు ఏ శక్తీ నిలవలేదనీ, ప్రజలే చరిత్ర నిర్మాతలనే గతితర్కాన్ని చెప్పాడు.

ప్రభాకర్‌ విప్లవోద్యమానికి విప్లవ సాహిత్యోద్యమానికి తనవంతుగా ఏదైనా చేయాలని తపనపడ్డాడు. 1979 జనవరి 13`15 తేదీల్లో వరంగల్‌లో విరసం సాహిత్య పాఠశాల జరిగింది. ఈ పాఠశాల సందర్భంగానే ప్రభాకర్‌ విరసం సభ్యత్వం తీసుకున్నాడు. జగిత్యాలలో పోలీసుల దాడులు తీవ్రతరమయ్యాయి. నిర్బంధం పెరిగింది. దీంతో 1979 చివరలో కరీంనగర్‌కు మకాం మార్చాడు. మంకమ్మతోట ప్రాంతంలో(1979) ‘స్టుడియో శిల్పి’ ప్రారంభించాడు. అది ఎందరో సాహితీ మిత్రులకు నీడనిచ్చింది. అమ్మలా ఆదరించింది. కరీంనగర్‌ యువతరం సంగమ స్థలమది. ఎన్నెన్నో కవి సమయాలకు వేదికయింది.

ప్రభాకర్‌ విప్లవ రచయితల సంఘంలో సభ్యుడయ్యాక మరింత శక్తివంతమైన కవిత్వం రాశాడు. ప్రత్యామ్నాయ రాజకీయాల పట్ల కమిట్‌మెంట్‌తో ఉన్నాడు. విప్లవ సాహిత్యోద్యమంతో మమేకమయ్యాడు. అతడు నిరంతర విద్యార్థి. కవిత్వాన్ని సాధనచేస్తూ అద్భుతమైన శిల్ప పరిణతిని సాధించాడు. తెలుగు కవిత్వంలో ఎన్నటికీ చెరగని ముద్ర వేశాడు. తన కవితలకు ఇండియన్‌ ఇంక్‌తో చిత్రాలు వేసుకున్నాడు. కవిత్వం చదవలేని సామాన్య జనానికి తన భావాలు చేరాలనే తపనతో ‘కవితా చిత్రాలు’ రూపొందించాడు. వాటిని ప్రదర్శనకు పెట్టాడు. కరీంనగర్‌ జిల్లాలోని అనేక కాలేజీల్లో ప్రదర్శించాడు. బి.నర్సింగరావు, జయధీర్‌ తిరుమలరావు, మరికొందరు మిత్రుల ప్రేరణతో 1980లో హైదరాబాద్‌లోని వైఎంసీఏలో జరిగిన ‘కవితా చిత్రప్రదర్శన’ విజయవంతమైంది. కోఠి ఉమెన్స్‌ కాలేజీ, వనితా మహా విద్యాలయ, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనకు వచ్చిన వేలాదిమంది విద్యార్థులు, యువతరం ప్రభాకర్‌ కవిత్వానికి అభిమానులయ్యారు. సమాజం గురించి ఆలోచించారు. ఆదివారం వారపత్రిక 1980లో ప్రతి సంచికలో చివరి పేజీ ప్రభాకర్‌ కవితా చిత్రంతో వచ్చేది. దీంతో అతనికి యువతరంలో గొప్ప ఇమేజ్‌ వచ్చింది.

ఆ కాలంలో రాజ్యహింస పెరిగిపోయింది. కరీంనగర్‌లో ఓ అర్ధరాత్రి పోలీసు మూకలు ప్రభాకర్‌పై దాడిచేశాయి. తన ఇల్లు, స్టూడియోపై నిఘా. నిర్బంధం. కరీంనగర్‌ కల్లోలిత ప్రాంతాలపై అమలైన రాజ్యహింస, అస్తవ్యస్తమైన తన ఆర్థిక పరిస్థితులు ప్రభాకర్‌ జీవితంలో కల్లోలం రేపాయి. దీంతో 1983లో హైదరాబాద్‌కు మారాడు. విద్యానగర్‌లో ‘చిత్రలేఖ’ పేరుతో స్టూడియో పెట్టాడు. ఖర్చులు పెరిగాయి. ఆర్థికంగా చితికిపోయాడు. క్రమంగా టీబీ అటాకైంది. రోజు రోజుకూ ఊపిరితిత్తుల్ని ధ్వంసంచేస్తున్న క్షయ. గాలిలో దీపంలా అల్లాడే ప్రాణం. చావు తప్పదని తెలుసు. తీవ్ర అనారోగ్యంతోనే కవిత్వం రాశాడు. చిత్రాలు వేశాడు. ఫొటోలు తీశాడు.

‘మృత్యువు దాడిచేసిన రాత్రి అతడు అక్షరాలకు జీవం పోస్తున్నాడు’ అని కామ్రేడ్‌ వరవరరావు రాసినట్టు అతడు ‘ఒక్క స్వప్నాన్నీ నిదురపోనివ్వలేదు. ఒక్క క్షణాన్నీ వృథా కానివ్వలేదు’. తెలుగు నేలపై విప్లవ సౌందర్యాన్ని ఆవిష్కరించి వెళ్లాడు. అతడో చరిత్ర. వర్తమానాన్ని పెనవేసుకొని పారే నదీప్రవాహం. విప్లవోద్యమ ప్రవాహం. అడవుల మీదుగా మైదానాలను మండిరచిన పోరాట బావుటాల్ని గుండెలకు హత్తుకున్నాడు. పుడమి తల్లి పురిటి నొప్పుల్ని చూశాడు. కలల మేఘమై కురిశాడు. నదిలా పారాడు. నెర్రెలీనిన నేల గుండెలపై రాలిన వాన చినుకు అతని అక్షరం. ఎమర్జెన్సీ నుంచీ ప్రపంచీకరణ దాకా రెండు దశాబ్దాల పాటు కల్లోల కాలాన్ని రికార్డ్‌ చేసిన సిస్మోగ్రాఫ్‌ అతని సాహితీ సృజన.

జీవిక కోసం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్లపాటు ‘సిటీ లైఫ్‌’కు కవిత్వం రాశాడు. ప్రభాకర్‌ ఆయుధాలు… కలం. కుంచె. కెమెరా. వీటితో కళ్లెదుట నిలిచిన వర్తమాన సంఘటనల్ని నలుపు తెలుపుల దృశ్యకావ్యాలుగా మలిచాడు. తన రక్తాన్ని కాగితంపై పారించి, కంచెల్లేని స్వప్నాల్ని రాశాడు. జగిత్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌ అతని సంచార కేంద్రాలు. వెలుగు జిలుగుల నగరం అతనికి ఎండమావైంది. తీవ్రమైన అనారోగ్యం. రోజురోజుకూ శిథిలమైన దేహం. చుట్టుముట్టిన అప్పులు. ఐనా ఎవ్వర్నీ చేయి సాచి అడగలేదు. కరీంనగర్‌లో తన తండ్రి కట్టించిన ఇంటిని అమ్మేశాడు. అప్పులు తీర్చాడు. టీబీ శరీరాన్ని శిథిలం చేసింది. కొలిమిలా రగిలే అక్షరాల్ని రాజేసిన ఊపిరితిత్తుల్ని ధ్వంసం చేసింది. అయినా ధైర్యం కోల్పోలేదు. అక్షరం అతనికో సెర్చ్‌ లైట్‌. డైనమైట్‌. తన అక్షరాలకు గెరిల్లా శిక్షణ ఇచ్చాడు. అవి కొడవలిలా పదునెక్కాయి. చిమ్మచీకట్లో నెలవంకలై మెరిశాయి. చీకటి బతుకుల్లో వెలుగులు నింపాయి. అతడు ధ్వంసమైన ప్రజల బతుకుల్ని చూశాడు. వాళ్ల కన్నీళ్లను విన్నాడు. పోరుదారిలో నడిచాడు. కెమెరా లెన్సై. అక్షరమై. ఛాయాచిత్రమై. తన అక్షరాలతో యుద్ధవ్యూహం పన్నాడు. ప్రజాయుద్ధ పల్లవులల్లాడు. వాటిని దోపిడీ గుండెల్లో పేల్చాడు. మార్చింగ్‌ సాంగ్‌లై.

అతడు అణచివేతకూ ఆయుధానికీ మధ్య కొలిమి రాజేశాడు. ఎప్పటికీ ఆరని కొలిమది. చిందించిన నెత్తుటితో చీకటి కోణాల్ని వెలిగించిన అక్షరం అతనిది. గుండె గుండెకూ మధ్య విప్లవ బాటలేసిన స్వాప్నికుడు అలిశెట్టి. కబళిస్తున్న క్షయ ఒకవైపు. గూడాల్నీ, గుడిసెల్నీ, పల్లెల్నీ ధ్వంసంచేస్తున్న రాజ్యహింస ఒకవైపు. ప్రభాకర్‌ని నిలువనీయలేదు. అందుకే అక్షరాలై పోటెత్తాడు. రోగగ్రస్తమైన ‘ఈ దేశానికి దేహమంతా శస్త్ర చికిత్స చేయాలన్నా’డు. కెమెరా లెన్స్‌తో భారతదేశ భవిష్యత్‌ చిత్రపటాన్ని ఫొటోతీశాడు. తన కుంచెతో నెత్తురోడుతున్న పదచిత్రాలను గీశాడు. వాటిని రక్తరాగరంజితం చేశాడు.

ఉద్వేగభరిత సన్నివేశాల్ని దృశ్యకావ్యంగా మలిచే విద్యేదో అతనికబ్బింది. పార్లమెంటరీ పార్టీల వంచనను ప్రజలకు అర్థంచేయించాడు. ‘ప్రతి ఓటూ నీ పచ్చి నెత్తురు మాంసం ముద్ద. చూస్తూ చూస్తూ వేయకు ఏదో ఓ గద్దకి…’ అని హెచ్చరించాడు. చీకటి నిండిన బతుకుల్లో వెలుగు కోసం సూర్యుడే కావాలన్నాడు. సూర్యుడంటే విప్లవం. విముక్తి మార్గం. అట్లాంటి మార్గం కోసం జనమంతా ప్రభంజనమవ్వాలని పిలుపునిచ్చాడు. అతనేనాడూ పొగడ్తల హోరులో కొట్టుకుపోలేదు. తలెత్తుకు నిలబడ్డ అక్షరం అతడు. జననాట్య మండలి గుండె చప్పుళ్లు అతణ్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రజల బాధలూ, గాధలే తన కవిత్వానికి ముడిసరుకని రాసుకున్నాడు. ‘ప్రజల్ని కలల్లో ముంచెత్తని వాడు విప్లవకారుడు కానేకాడని’ చారు మజుందార్‌ అన్నట్టుగా ప్రభాకర్‌ కలలు కన్నాడు. ఆ కలల సాకారానికి కవిత్వమయ్యాడు. పీడితుల పక్షాన నిలబడ్డాడు. భూస్వామ్యం, పితృస్వామ్య ఆధిపత్యం, దోపిడీని ఎదిరించే కవిత్వం రాశాడు. స్త్రీల వేదనల్ని, కన్నీళ్లని, తన ముందుతరం కవులందరి కంటే అద్భుతంగా చిత్రించాడు. శివసాగర్‌ విప్లవ కాల్పనికత, చెర సూటిదనాన్ని మరింత ముందుకు తీసుకుపోయాడు ప్రభాకర్‌. అతడు ఎవర్నీ అనుకరించలేదు. అనుసరించలేదు. తనకంటూ ప్రత్యేకమైన శైలి అలవడిరది. సరికొత్త డిక్షన్‌ సృష్టించుకున్నాడు. అది వేదనామయ జీవితంలోంచి వచ్చిన డిక్షన్‌. కలనేత కలల శిల్పం.
“నను
తొలిచే
బాధల ఉలే
నను
మలిచే (సిటీ లైఫ్‌; 1992, పు.147)
కవితాశిల్పం” అని ఊట సెలిమెలాంటి తన కవిత్వ మూలం చెప్పాడు. బాధల విముక్తి కోసం తపన అది. నమ్మిన విశ్వాసాలపై గురితప్పని విలుకాడు తను. అందుకే అతని కవిత్వంలో మార్మికత లేదు. ఊహాలోకాల్లో విహరించే ఎస్కేపిజం లేదు. ఉన్నదల్లా వాస్తవికతే. అది విప్లవ వాస్తవికత. బతుకును పెనవేసుకున్న విప్లవ కాల్పనికత. అతనికి అస్పష్ట కవిత్వం రాసే కవులంటే జాలి. అందుకే…

“ఎందుకురా కవీ
గజిబిజి ఇమేజీ
అస్పష్ట కవిత్వం కన్నా (సిటీ లైఫ్‌; 1992, పు.199)
ఆల్జీబ్రా ఈజీ” అన్నాడు. ఎవరికీ అర్థంకాని ఇమేజీలు వద్దన్నాడు. చెప్పేదేదో సూటిగా ఉండాలన్నాడు. అందుకే అతని కవిత్వం ఎక్కుపెట్టిన బాణం. గురిచూసి విసిరే వడిసెల. అట్లాగే రాశాడు. సూటిగా. స్పష్టంగా. సరళంగా. అందమైన భావాలతో. ఆలోచింపజేసే ప్రతీకలతో. వస్తుశిల్పాల కలనేతతో. అట్లాగే కవిత్వం అల్లాడు. గిజిగాడు గూడు అల్లినట్టుగా. ఎర్ర సెలకల్లో రైతన్నల నాగేటి సాళ్లలా.

ప్రతీ అక్షరం సామాన్యులకు చేరాలనే తపన ఇది. అన్నీ తెలిసిన పదాలే. వాటిని కవిత్వంగా అల్లడంలో ప్రభాకర్‌ది నూతన ఒరవడి. నిశితమైన దృష్టి. ఒళ్లమ్ముకొని బతుకుతున్న మహిళల బతుకుల్ని గుండెకు తాకేలా రాశాడు. ఈ కొత్తచూపుతోనే.
“తను శవమై
ఒకరికి వశమై
తనువు పుండై
ఒకడికి పండై
ఎప్పుడూ ఎడారై (ఎర్రపావురాలు; 1978, పు.13)
ఎందరికో ఒయాసిస్సై…”. గుండెల్నిండా ఎంత వేదన! ఎన్ని కన్నీళ్లు! తనువంతా పచ్చిపుండై సలిపే గాయాలు. బతుకంతా ఎడారైన మహిళల బతుకు చిత్రమిది. అలిశెట్టి పద్దెనిమిదేళ్ల వయసులో రాసిన కవిత ఇది. ఈ కవితే ఓ కన్నీటి కావ్యం. దృశ్యకావ్యం. ఈ కవిత నేపథ్యాన్ని చెప్తూ ‘రక్తరేఖ’లో…”వేదనాభరితమైన నా కవితాక్షరాన్ని ‘వేశ్యా’వాటికనే పలకమీద దిద్దుకున్నప్పుడూ, అక్షర నేత్రం తెరిచి ఆనాటి ‘దొర’తనాన్ని ఆగ్రహించినప్పుడూ బహుశా నాకు పద్దెనిమిదేళ్లు” అని రాసుకున్నాడు. కవిగా మొదలైన తొలినాళ్లలోనే చాలా కాన్షియస్‌గా స్త్రీపక్షం నిలిచాడు. భూస్వామ్యం, పితృస్వామ్యం జమిలిగా అణిచివేసే స్త్రీలపక్షం నిలబడ్డాడు. మగ మద మృగాల చేతుల్లో నలిగిపోయే స్త్రీల కన్నీళ్లను మన అంతరంగంలోకి ఆర్ధ్రంగా ఒంపుతాడు. బతుకునే ముళ్ల కంచెలపై ఆరేసుకున్న మహిళల వేదనల్ని రాశాడు. ‘ఆమె యౌవనం రాయని వీలునామా’ అంటూ…

“ఆమె
బరితెగించి కాదు
బతుక్కే ఉరి బిగించుకొని
ఎన్నెన్నో అలల్ని
ఈ జీవితంలో కలుపుకున్నా (మంటల జెండాలు; 1979, పు.50)
ఒక్కసారన్నా ఉప్పొంగని సముద్రం”. ఇది పితృస్వామ్యం కాళ్లకింద పడి నలిగే స్త్రీల అంతరంగం. బాధామయ జీవితాల్లో నెలకొన్న చీకట్లివి. ఇది వ్యవస్థ సృష్టించిన చీకటి. పొట్టకూటి కోసం శరీరాన్ని అమ్ముకొనే స్త్రీల అంతరంగాన్ని విన్న అక్షరం ఇది. అందుకే స్త్రీని ఎన్నడూ ఉప్పొంగని సంద్రమన్నాడు. తనువంతా పుండైన స్త్రీల అంతరంగాన్ని చెప్తూ…

“ఒక్కోసారి
గొంతు మూగబోయిందన్నా
పాడక తప్పదు
రోజుకో పదిమంది
కీచకులకి స్వాగతం పలికే (అదే)
ఆమె యౌవనం రాయని వీలునామా” అని రాశాడు. ఇది పురుషస్వామ్యం చేతుల్లో నలిగే ఊపిరాడని స్త్రీల వేదన. ఆమె యౌవనం రాయని వీలునామా. హింసల మధ్య మానని గాయాల వలపోత ఈ కవిత. సమాజం మోపిన కట్టుబాట్లను మోయడం తప్ప ఏమీ చేయలేని స్త్రీల నిస్సహాయతను మనసుతో చూశాడు. విన్నాడు. ఆ వేదనల్ని, దు:ఖాన్ని తనలోకి ఒంపుకున్నాడు. తన అక్కా చెల్లెళ్ల లాంటి కోట్లాది మహిళల గుండె గోసను అర్థంచేసుకున్నాడు. ఇద్దరు మనుషులు కలకాలం కలిసి బతకాల్సిన పెళ్లిని వ్యాపారంలా మార్చిన వ్యవస్థంటే ప్రభాకర్‌కు కోపం. అందుకే పెళ్లిచూపుల బేరసారాలను చెప్తూ…
“చుట్టూరా క్రూర మృగాలు (చురకలు; 1981, పు.65)
నడుమ బిక్కచచ్చిన లేడిపిల్ల” అని రాశాడు. పెళ్లికూతురి అందచందాల్ని స్కాన్‌ చేస్తున్న పెద్దలు. యువతి గుండెల్లో వణుకు. లోలోపల అలజడి. రాబందుల్లా చూస్తున్న కళ్ల నుంచి. మనుషులెవరూ లేనిచోటికి పారిపోవాలనుకునే స్థితి అది. ఆ తతంగం జరిగినంత సేపూ భూమి గుండెల్లో తలదాచుకోవాలనిపించే వేదన. ప్రభాకర్‌ ఎట్లా విన్నాడీ వేదనని!. ఎట్లా చూశాడీ దు:ఖాన్ని!. ఇది తన చెల్లెళ్ల దు:ఖం. అక్కల దు:ఖం. తన చుట్టూ ఉన్న కోట్లాది మహిళల కన్నీళ్లు. తనకు అమ్మంటే ఇష్టం. ఆమెలాంటి వేలాది తల్లులు ఇష్టం. ఈ సమస్త ప్రపంచానికి తన చనుబాలిచ్చి ప్రాణాల్ని నిలిపే స్త్రీలంటే ప్రేమ. గౌరవం. అందుకే ఇంత సున్నితంగా ఆలోచించగలిగాడు. రెండే రెండు వాక్యాల్లో ఆ హింసాతల దృశ్యాన్ని చిత్రించాడు. ఇదీ మానవీయ స్పందనంటే. అందుకే అతని అక్షరాలకు ఇంతటి గుండె తడి.

వరకట్న సమిధల్లో నిలువునా కాలిపోతున్న స్త్రీలను చూశాడు. ఆ దురాచారాన్ని రూపుమాపే దారికోసం అన్వేషించాడు. స్త్రీ విముక్తి కోసం పోరాటం ఒక్కటే మార్గమని నమ్మాడు. స్త్రీ విముక్తి పోరాటాల్ని బలపరుస్తూ…
“పురుషాహంకార సముద్రం మధ్యన చిక్కి
తల్లడిల్లే ఒక రమణీయ ద్వీపం
వరకట్న దురాచారపు అంధకారంతో
పోరేందుకు (రక్తరేఖ; 1985, పు.73)
సమాయత్తమైందొక చిరుదీపం” అని రాశాడు. అలిశెట్టికి స్త్రీ అంటే ఓ గాయాల నది. చీకట్లు కమ్మిన నింగి. నెత్తురోడే నెలవంక. మంచు పర్వతం. అగ్ని సముద్రం. అతని కలం నిండా లోలోపల కుమిలిపోయే స్త్రీల ఆర్తనాదాలు. ధ్వంసమైన కలలు. ఇంకిపోయిన కన్నీళ్లు. చెదిరిన గుండె. గొంతు దాటి బయటకు రాని శోక సంద్రాలు.

“నిశ్శబ్దపు తంత్రుల మీంచి
దొర్లిపడిన
ఆర్తనాదంలా…
గాయాల పేజీలు
పురి విప్పిన (రక్తరేఖ; 1985, పు.78)
నెమలి పింఛంలా…” ఇదీ… తల్లడిల్లుతున్న గుండె కోత. ఎన్నటికీ మానని గాయాల వలపోత. నెత్తుటి గాయాల సంపుటి. రగిలే బాధల కుంపటి. ఇవి తెలిసిన కవిగనుకే ఆమెను ‘అగ్ని సముద్రం మీదే అందాల పడవ’ అన్నాడు. అతని రక్తరేఖల నిండా కల చెదిరిన బతుకులు. అందుకే మహిళల్ని ‘పత్రహరితమే హరించిన బతుకు చెట్టు’ అని రాశాడు. ఎవరు రాయగలరిట్లా? బతుకంతా మానని గాయమైనవాడు తప్ప. గుండె గాయాల్నే గేయాలల్లుకొనే క్షతగాత్రుడు తప్ప. అందుకే అతని అక్షరాల్లో నగ్న పాదాలకు తుమ్ము ముల్లు దిగి, చివ్వున చిమ్మిన నెత్తుటి ఉద్వేగం. లోలోపల వేనవేల తుపాన్‌లు రేపే అలజడి.

తన చనుబాల ధారలతో భూమినంతా బతికిస్తున్న స్త్రీ లేకుండా ప్రభాకర్‌ అక్షరాల్లేవు. అవి పెనవేసుకోని అంతరంగం లేదు. స్త్రీల అందాన్ని అంగడి సరుకుగా మార్చిన మార్కెట్‌ సంస్కృతిపై మండిపడ్డాడు.
“ధరాతలమంతా నువ్వే…
ధారాపాతంగా
కురిసే చీకట్లో (రక్తరేఖ; 1985, పు.82)
వొణికే దీపపు సెమ్మా నువ్వే…” అంటూ ప్రపంచపు అంచుల వరకూ ప్రవహించే చైతన్యాన్ని రాశాడు.
“ప్రకటనల గాలి వీచినప్పుడల్లా
రాలిపడే
ఒక నాజూకు పూలరెమ్మా నువ్వే…
అగ్నీ నువ్వే
నగ్నత్వం పునాదులపై
నాగరికతా సౌధం నువ్వే…” అని రాశాడు. స్త్రీల శరీరాలపై విస్తరిస్తున్న మార్కెట్‌. రంగు రంగుల వ్యాపార ప్రకటనల్లో స్త్రీని అంగడి సరుగా మార్చింది. అందమంటే అంగాంగ ప్రదర్శనగా స్థిరీకరించిన చోట ప్రభాకర్‌ స్పందించే హృదయానికి ప్రాముఖ్యతనిచ్చాడు. అందుకే…

“అశ్రుభరిత నయనంలో నువ్వే
క్షతగాత్రుడి నేత్రంలో నువ్వే
అయితేనేం?
ఉద్యమాల హారంలో నువ్వే (రక్తరేఖ; 1985, పు.89)
ఉజ్వల భవితవ్యంలో నీ నవ్వే” అని ఉజ్వల ఉషోదయం కోసం చీకట్లను తుదముట్టిస్తున్న మహిళల పోరాటాన్ని చిత్రించాడు. ఉద్యమాల తొలి పొద్దుల్లో వికసిస్తున్న నినాదాలను రాజేశాడు. ‘విషాద సాక్షాత్కారం’ అనే ఒక్క కవిత చాలు, ప్రభాకర్‌కు స్త్రీలంటే ఎంతటి గౌరవమో చెప్పడానికి.
“కన్నీళ్లని ఏ భాషలోకి అనువదించినా
విషాదం మూర్తీభవించిన స్త్రీయే (సంక్షోభ గీతం; 1990, పు.125)
సాక్షాత్కరిస్తుంది” అని రాశాడు. చరిత్ర పొడవునా ప్రవహించే కన్నీటి నదుల్ని అక్షరాలకెత్తాడు. ఈ ‘సంక్షోభ గీతం’ నిండా… పసిపిల్లలు, స్త్రీలపై లైంగిక దాడులు. యువతను పెడధోరణి పట్టించే అశ్లీల సాహిత్యం. అందాల పోటీల విష సంస్కృతి. స్త్రీలను అడుగడుగునా అణచివేసే పితృస్వామ్య దోపిడీ. వరకట్న మంటల్లో కాలిబూడిదవుతున్న స్త్రీలు. నగ్నంగా స్త్రీలని ఊరేగించిన నాజీల అహం. ఊచకోత. ఇవన్నీ చూసిన కలం నిండా పారే కన్నీళ్లు. వీటిని ప్రపంచం ముందుంచకుండా ప్రభాకర్‌ను నిలువనీయలేదు. అందుకే అతడు స్త్రీవిముక్తి కోసం తపించాడు.

“ఎంత అధునాతనంగా ఎదిగినా
అశ్రు బిందువు నించి
స్త్రీకింకా విముక్తి కలగలేదంటే
నిజంగా కన్నీరు సముద్రమై
నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై
ఉద్యమాల హోరెత్తితే గానీ
ఈ దోపిడీ దౌర్జన్యాల భూభాగాన్ని (అదే; పు.128)
ముంచెత్తలేదు.” అని ఉద్యమాల హోరును కలగన్నాడు. అంతరాల్లేని సమాజం కోసం ఎదురుచూశాడు. ఈ కన్నీటి నదిలో` ‘ఆమె’ జాతి గుండెల్లో రగులుతున్న శోక గీతమైంది. రాతి గుండెల్లో ఇమడని అశ్రుపుష్పమైంది. చెరచబడ్డ కాలమానమైంది. ఈ దోపిడీ, పీడన నుంచి విముక్తి కోసం…

“ఈ ఆయుధాల నీడకింద
సేద తీర్చుకో…
మా ఆశయాల సాధనలో (అదే; పు.129)
మమేకమైపో…” అని పిలుపునిచ్చాడు. స్త్రీ విముక్తి పోరాటాల్లోకి నడవాలన్నాడు. శ్రామిక విముక్తి లేకుండా స్త్రీవిముక్తి జరగదన్నాడు. ఆశయాల సాధనలో సాగిరమ్మన్నాడు.

హైదరాబాద్‌కి రావడం అనివార్యమైనా ఇక్కడి జీవితంపై అతనికి విరక్తే. అతనికి నగరం ఓ అందమైన స్మశాన వాటిక. చిక్కు వీడని పద్మవ్యూహం. చెక్కుచెదరని మయసభ. ఒకానొక సందర్భంలో ‘పుట్టిన గడ్డను వదిలి నగరానికి రావడమే తప్పయిపోయింది’ అని రాసుకున్నాడు. అప్పటికే ఆరోగ్యం చేయిదాటిపోయింది.

పదునైన రెండే రెండు కవితా పాదాలతో ‘చురకలు’ అంటించాడు. ఇది 1981 ప్రచురితమైంది. ఇందులో సూటిదనం. సరళత. బుల్లెట్‌లా గురితప్పని వాక్యాలవి. హృదయాన్ని తాకి, మీటుతాయి. ఆలోచింపజేస్తాయి. చలం చెప్పిన ‘ఎకానమీ ఆఫ్‌ వర్డ్స్‌’ ప్రభాకర్‌ కవిత్వం. పదాల్ని పొదుపుగా వాడుతూ, పొడిసే పొద్దులాంటి వాక్యాల్ని మెరిపించాడు. చురకల్లో ప్రభాకర్‌ టచ్‌ చేయని వస్తువు లేదు. రెండే రెండు పాదాల్లో అనంతమైన అర్థాన్ని పొదిగాడు. జనసంద్రాన్ని ఉప్పెనగా మార్చే నినాదాల్ని ప్రభాకర్‌ శక్తివంతంగా మలిచాడు. ‘స్లో…గన్‌’ కవితలో…
“కొందర్నే కాల్చగలదు గన్‌
ఎందర్నో మండిస్తుంది స్లోగన్‌” అని నినాదాన్ని గురిపెట్టాడు. ఏ బాట నడవాలో తెలియక సతమతమవుతున్న జనాన్ని ఉద్దేశించి…‘గొర్రెల మందతో నడిచేకంటే, చీమల బారులో చేరితె మేలు’ అన్నాడు. జనం బాటను ప్రతీకాత్మకంగా, అద్భుతంగా చిత్రించాడు. ‘గొర్రెల మంద’ను ప్రజావ్యతిరేక రాజకీయాలకు, ‘చీమల బారు’ను విప్లవ రాజకీయాలకు ప్రతీకలుగా రాశాడు. రెండే మాటలతో పెట్టుబడిదారి వ్యవస్థ స్వభావాన్ని చెప్పాడు.

“నువ్వంచి నడుమ్మీదే ఆధారం
పెట్టుబడిదారీ వ్యవస్థ ఆదాయం” అని కోట్లాది శ్రమజీవుల కష్టాన్ని కొల్లగొడుతున్న దోపిడీ వ్యవస్థను రాశాడు. పార్లమెంటరీ పార్టీల నాయకుల గురించి చెప్తూ…”వాడు ముందే వానపాము, మరి ముడ్డెటో మూతెటో” అని చురకలంటించాడు. అవి చురకలే కాదు. వాతలు. పదునైన బాణాలు. గురిచూసి విసిరిన వడిసెల రాళ్లు. అందుకే గురితప్పలేదు. లక్షలాది జనం నాలుకలపై సజీవంగా నిలిచాయి.

సామాన్య పాఠకుల కోసమే ప్రభాకర్‌ కవిత్వమంతా. 1985లో ‘రక్త రేఖ’ ప్రచురించాడు. ‘కవితా చిత్రాలు’గా మలిచాడు. ఆకలితో అలమటించే కోట్లాది జనం గుండె గోస ఇది. ‘రక్తరేఖ’ వెనక అట్టపై తన పరిస్థితిని స్పష్టంచేశాడు.
“సిద్ధాంత గ్రంథసారం ఏదీ వడబోయక పోయినా
సిద్ధార్థుడు వదిలి వెళ్లిన ఈ రాజ్యమ్మీది
నెత్తుటి ధారలను కడిగేందుకు ఆయుధమై
ఇప్పటికి పదునాలుగేళ్ళు” అని రాసుకున్నాడు. కవిత్వం సానబెట్టే క్రమంలో తనలోని చిత్రకారుడు అంతరిస్తున్నాడని ఆవేదనపడ్డాడు. “అంచెలంచెలుగా ఆనాటినించీ కవిత్వం రాస్తున్నా జీవితమనే అనేకానేక సంఘర్షణల వెనుక నాలోని చిత్రకారుడు అంతరించిపోతున్న బాధేదో నన్ను వేధిస్తోంది” అని రాశాడు. తన అక్షరాలూ, చిత్రాలూ జనంలోకి పోవాలనే తపన ఇది. వీటితో ఏ ఒక్కరు చైతన్యమైనా చాలనుకున్నాడు. అందుకే… “ఒకప్పుడు కవితాకాశంలో నేనెగరేసిన ‘ఎర్రపావురాలు’, ‘మంటల జెండా’లే నేడు మళ్లీ మళ్లీ ‘రక్తరేఖలు’గా ప్రసరించినా… ప్రచురించినా వెల్లువగా పెల్లుబికిన కవితాభిమానుల గుండెల్లో నా కవిత్వాన్ని ప్రాణవాయువుగా మార్చి నింపాలనే తపనే` నా కవితా చిత్ర ప్రదర్శనలతో ఈ సమాజాన్ని అంగుళం మేరకి కదిలించగలదనే ఆశే…” అని రాసుకున్నాడు. నిరుపేదల ఆకలి మంటల్ని అత్యంత సహజంగా కవిత్వం చేశాడు.

“ఆకలి మండిపోతున్నప్పుడు
ఎదుట ఎంతటి మనోహర దృశ్యమున్నా
దగ్ధమై పోవాల్సిందే
ఆకల్ని నిగ్రహిస్తున్న కొద్దీ
కడుపులో పేగుల్ని
కత్తిరిస్తున్న బాధే
ఆకలి
పూటకో దరిద్రున్ని వేపుకు తిని
అది ఉమ్మేసే తొక్కలే (రక్తరేఖ; 1985, పు.75)
అసంఖ్యాకపు అస్థిపంజరాలు” అని ఆకలి మంటల్లో ఎముకల గూడులా మారి, బూడిదవుతున్న నిరుపేద జనం గురించి కలవరించాడు. నిజాం నిరంకుశ కాలాన గ్రామాల్లో దొరస్వామ్యం ఆగడాలకు హద్దులేకుండా పోయింది. అడుగడుగునా అణచివేత. దోపిడీ. పీడన. వివక్ష. వెట్టిచాకిరీ. గృహదహనాలు. లైంగిక దాడులు. ‘అయ్యా…! బాంచెన్‌. నీ కాల్మొక్త’ అన్న జనాలే ఎర్రజెండా సాక్షిగా ఎదురుతిరిగితే ఎట్లుంటుందో చెప్పాడు ప్రభాకర్‌. దొరల ఆగడాల్ని చెప్తూ…

“నువ్వు
ఉరిమి చూసినప్పుడేమో
ఊరంతా పాలేర్లే
వాళ్లే ఊరినించి
తరిమికొడితే (రక్తరేఖ; 1985, పు.75)
నీ బతుకంతా పల్లేర్లే…” అని తిరగబడ్డ జనం గుండె చప్పుళ్లని రికార్డ్‌చేశాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన గఢీల్ని విడిచి పట్టణాలకు పరుగుతీశారు దొరలు. ప్రజల నుంచి గుంజుకున్న భూములు పడావు పడ్డాయి. ఆ భూముల్లో పల్లేర్లు మొలిచాయి. జిల్లేళ్లు మొలిచాయి. సమస్త దోపిడీని అంతంచేసేందుకు తిరుగుబాట్లు, పోరాటాలే మార్గమని చెప్పిన కవిత ఇది.

తరతరాలుగా ఈ దేశం సంపన్నుల చేతుల్లో నలిగిపోతోంది. ఏ హరిత విప్లవాలూ ప్రజలకింత బువ్వపెట్టలేదు. ఏ ‘గరీబీ హఠావో’ నినానాలూ కడుపు నింపలేదు. ఏ సంక్షేమ పథకాలూ ప్రజల ఆకలి, ఆర్తనాదాలను ఆపలేదు. చివరికీ దేశం ఎముకల గూడులా మిగిలింది. పరాధీన భారతాన్ని చెప్తూ…
“ఎన్ని భవనాల ఆభరణాలు తొడిగినా
హరిత విప్లవాలే కప్పినా
అస్థిపంజరమే భారతావని (రక్తరేఖ; 1985, పు.75)
ఆర్తనాదమే వర్తమానము” అన్నాడు. ప్రజల కన్నీళ్లలో కాగిపోతున్న వర్తమానాన్ని చిత్రించాడు. వాళ్ల ధ్వంసమైన స్వప్నాలను రాశాడు. ఇది చెరబండరాజు రాసిన ‘వందేమాతరం’ (1968, జూన్‌) కవితను గుర్తుకుతెస్తుంది.
“ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది?” అన్నాడు చెర. వీళ్లిద్దరూ పరాధీన భారతాన్ని కవిత్వంగా మలిచారు. తాకట్టులో భారతదేశ పరిస్థితిని ఇంత గొప్పగా చెప్పిన కవులెవరూ లేరు. ఒక్క ప్రభాకర్‌, గద్దర్‌లు తప్ప.

అలిశెట్టి ప్రభాకర్‌ మహిళల వేదన విన్నాడు. వాళ్ల కలల ప్రపంచాన్ని చూశాడు. కళ్లెదుటే ధ్వంసమై పోతున్న కలల్ని చూశాడు. ఏ దిక్కూలేని లక్షలాది మహిళల ఆర్తనాదాలను ఆర్థ్రంగా కవిత్వంలోకి ఒంపాడు. వాళ్ల కన్నీళ్లను. గాయాలను. ఎన్నటికీ మానని రక్తసిక్త గాయాలను. మత్తడయి దుంకే దు:ఖాన్ని. గుండె చెరువయ్యేలా చెప్పాడు. ‘అశ్రుకావ్యం’గా మలిచాడు.
“ఆమె నెత్తుటి గాయాల సంపుటి (రక్తరేఖ; 1985, పు.75)
రగిలే బాధల కుంపటి” అని స్త్రీల బాధామయ జీవితాలను చెప్పాడు. రెండు వాక్యాల్లోనే అనంతమైన అర్థాన్ని చెప్పడం సాహిత్యంలో శిఖరాయమానమైన టెక్నిక్‌. దీని వెనక అతని నిశితమైన చూపు ఉన్నది.

చెదలు పట్టిన చరిత్రలో, చెదరని చిహ్నాల వెనక దోపిడీ గుట్టు విప్పాడు ప్రభాకర్‌. చారిత్రక కట్టడాల పునాదుల్లో ఇంకిపోయిన కోట్లాది శ్రమజీవుల చెమటా, నెత్తురూ, కన్నీళ్లను దృశ్యమానం చేశాడు. ‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? అని ప్రశ్నించాడు శ్రీశ్రీ. ఆ కూలీల బతుకుల్లో నెలకొన్న చీకట్లను, కన్నీళ్లను ప్రభాకర్‌ కవిత్వంగా మలిచాడు. ప్రజల చెమటా నెత్తురూ ధారపోసి నిర్మించిన తాజ్‌మహల్‌ను దోపిడీ చిహ్నమన్నాడు. దాని పునాదుల్లో మౌనంగా రోధించే లక్షలాది కార్మికుల ఆర్తనాదాలను హృదయంతో విన్నాడు.
“చరిత్ర కురూపి
చెక్కిలిపైన
తాజ్‌ మహల్‌ మెరుస్తోంది
తరతరాలకు
తడియారని (రక్తరేఖ; 1985, పు.80)
కన్నీటి బొట్టులా…” అన్నాడు.
రాజ్యం అరాచకత్వాన్ని జనం ముందుంచాడు ప్రభాకర్‌. ఈ దేశ మతోన్మాద రాజకీయాల్ని తూర్పారబట్టాడు. రాముడి పేర జరుగుతున్న మారణహోమాన్ని చెప్పాడు. ఆధిపత్య రాజకీయాల అరాచకాలను చెప్తూ…
“ఈ దేశంలో
పోగేసిన శవాల గుట్టవంటి
బ్యాలెట్‌ పెట్టెపై (రక్తరేఖ; 1985, పు.79)
ఆధిపత్యమే ఒక అరాచకత్వం” అన్నాడు. జనాన్ని బ్యాలెట్‌ పెట్టెల మీదుగా పార్లమెంటరీ ఎండమావుల్లోకి నడిపిస్తోంది రాజ్యం. ఎడారుల్లోకి తోస్తోంది. ప్రజల బతుకుల్ని ధ్వంసం చేస్తోంది. న్యాయం కావాలన్నందుకు జైళ్లల్లోకి తోస్తోంది. హక్కులడగడమే నేరమైంది. ద్రోహమైంది. రాజ ద్రోహమైంది. ప్రజల బతుకుల్ని ఏమార్చే రాజకీయాల కుట్రల్ని చెప్పాడు ప్రభాకర్‌. ఆధిపత్య రాజకీయాల నగ్నత్వాన్ని కళ్లముందుంచాడు.

‘నిజ రూపం’ అనే దీర్ఘ కవితలో రాజ్యమేలుతున్న దోపిడీ గుట్టు విప్పాడు. ఈ దేశ ముఖచిత్రంపై ఆకలి సంతకమై అల్లాడే నిరుపేద బతుకుల్ని చెప్పాడు. నగరాల్లో ఒకవైపు ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల మేడలు. వాటి పక్కనే పూరి గుడిసెలు. గాలివానకు నేలకూలే గుడిసెలు. వరదల్లో కొట్టుకుపోయే బస్తాచింపుల గుడిసెలు. నిలువ నీడలేని అమాయక జనం. ఫుట్‌పాత్‌లే చిరునామాగా బతుకుతున్న అలగా జనం. వరదలు ముంచెత్తినపుడు తలదాచుకోను కాసింత జాగాలేనోళ్లు. వాళ్లెవరికీ పట్టనోళ్లు. తమ ఓట్లతో రాజ్యానికి పట్టాభిషేకం చేసేవాళ్లు. ఓటర్‌ లిస్టులో పేరుతప్ప ఏ పేరూ లేనోళ్లు. తమదేవూరో తెలియనోళ్లు. నిలువ నీడలేని నిరుపేదల గుడిసెల్ని ఏ బడా బాబో పీకేస్తాడు. ఇట్లాంటి నిరుపేద జనం కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రభాకర్‌. వాళ్ల బతుకుల్ని మార్చే దారికోసం కలలెన్నో కన్నాడు. ఆ కలల దారిలో పయనించాడు.

అధికార మార్పిడితో విలసిల్లుతున్న భారతాన్ని ప్రభాకర్‌ ఎక్స్‌రే తీశాడు. రోగగ్రస్థ వ్యవస్థను తన అక్షరాలతో స్కాన్‌ చేశాడు. దీనికి శస్త్ర చికిత్స తప్ప మరో మార్గం లేదన్నాడు.
“నామ మాత్రపు స్వతంత్ర భరతమాతని
ఎక్స్‌రే తీసి చూస్తే తెలుస్తుంది ఎన్ని రోగాల పుట్టో…
ప్రతిసారీ ప్రణాళికల పాకుడురాళ్ల మీద జారిపడి
మన వర్ధమాన దేశం (రక్తరేఖ; 1985, పు.96)
మోకాళ్ల మీద దేకటమే అనివార్యమైపోయింది…”అని పరాధీన భారతాన్ని చెప్పాడు. బడా పెట్టుబడిదారుల కనుసన్నల్లో నడుస్తున్న దేశ దౌర్భాగ్యాన్ని చిత్రించాడు.

“పుస్తకంలోంచి దులిపేసిన అక్షరాల్లా
లక్షలకి లక్షలు దేశమంతా నిరుద్యోగులై నిండుకున్నారు…” అని నిరుద్యోగ భారతాన్ని కళ్లముందుంచాడు. ఇంత స్పష్టంగా, సూటిగా చెప్పడం అతడు సాధించిన అభివ్యక్తి. సానబెట్టిన శిల్పం. ఎక్కడా తలవంచని ప్రభాకర్‌. తన అక్షరాల్లాగే బతికాడు. తలెత్తుకొనే. చండ్రనిప్పుల్లా. రగిలే కొలిమిలా. తన ఊపిరితిత్తులతో ఆరని కొలుములెన్నో రాజేశాడు. పల్లె పల్లెకూ అంటించాడు. తెలుగు నేలంతా ప్రతిధ్వనించాడు. ప్రభంజనమయ్యాడు.
“జీవితమంటే ఊడిగం చెయ్యటం
కాదుఉద్యమించటమనీ స్వప్నాల్లో పరిభ్రమించటం కాదుశ్రమిస్తూ
సంఘటితమవటమనీ
నీరు కారిపోవటం కాదు`నెత్తురు దారుల్లో నడవటమనీ (రక్తరేఖ; 1985, పు.101)
త్వరగా తెల్సుకో” అని జనాన్ని మేల్కొల్పాడు. ఏది సరైనదో, ఆ దారిలో సాగిపొమ్మన్నాడు. ఈ సందేశం యువతరం గుండెల్ని తాకింది. అణువణువునూ మండిరచింది. పీడనను ఎదిరించే సాహసాన్ని చెప్పింది. సమరమై సాగిపోయే దారిని చూపింది. ఎగుడు దిగుడు అంతరాల్ని నేలమట్టం చేసే వీరత్వాన్ని నింపింది. సమస్త గోడల్ని బద్ధలుకొట్టే వ్యూహాల్ని చెప్పింది. ఇంకా పార్లమెంటరీ దింపుడుకళ్లం ఆశల్లో మునిగిన కొందరు యువతరాన్ని నిలదీశాడు.
“రోజురోజుకో రక్తపాతం
అడుగడుగునా విప్లవ జ్వాల
నిన్నింకా రగుల్కొల్పటం లేదా…?” అని ప్రశ్నించాడు. (రక్తరేఖ; 1985, పు.102)

రాజ్యం దోపిడీ స్వభావాన్ని ‘డాక్యుమెంట్‌’గా మలిచాడు. ఇది దీర్ఘ కవిత. బూటకపు ప్రజాస్వామం, అగ్రవర్ణాల అహంకారం, చుండూరు హత్యలు, కల్లోలిత ప్రాంతాలు, మతోన్మాదం, భక్తి ముసుగులో దోపిడీ… ఇట్లా నెత్తురోడుతున్న ప్రజాస్వామ్యాన్ని కవిత్వంగా మలిచాడు. ప్రభాకర్‌ క్రాంతదర్శి. చరిత్ర పొడవునా పునరావృతమయ్యే ఇందిరమ్మ రాజ్యాన్ని చెప్పాడు. ఈ దేశం ఎవరి నెత్తురు, చెమటతో నిర్మితమైందో ఆ ప్రజల్ని బందోబస్తుగా నలిపేస్తున్న రాజ్యహింసను గుర్తుచేశాడు.
“చెమట సారం పీల్చుకొని
పెట్టుబడుల ఇంద్రధనుసులు
పుష్పిస్తూనే ఉంటాయ్‌

‘గరీబీ హఠావో’ నినాదం
రాజకీయ పరిభాషలో బుల్డోజరై (రక్తరేఖ; 1985, పు.104)
గుడిసెవాసుల ఆశల్ని నేలమట్టం చేస్తుంది”. ఇది వర్తమాన సందర్భం కూడా. రాజ్యమిప్పుడు బుల్డోజరైంది. అర్ధరాత్రి ముస్లింల ఇళ్లను కూల్చే కుతంత్రమైంది. దేశమే ఓ జైలైంది. చీకటి బజారైంది. రాజ్యానికి మతం కావాలి. మతానికి రాజ్యం అండ అవసరం. ఈ రెండూ కలిసి ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తాయి. మతోన్మాద పదఘట్టనల కింద పడినలిగే భారతాన్ని తలుచుకొని తల్లడిల్లాడు ప్రభాకర్‌. తెలుగు నేలన ఎవడు ముఖ్యమంత్రి కావాలన్నా హైదరాబాద్‌ ‘పాతబస్తీ’ని టార్గెట్‌ చేయడం ఆనవాయితీ. మత కల్లోలాల్లో తగలబడుతున్న శవాల కమురు వాసనలో అధికారాన్ని సుస్థిరం చేసుకునే దివాళాకోరు రాజకీయాల్ని అసహ్యించుకున్నాడు. మంటల్లో నిలువునా దగ్దమయ్యే భవిష్యత్‌ భారతాన్ని ముందే ఊహించాడు.
“మతం పెంచి పోషించబడి, ఉసిగొల్పబడే ఈ దేశం కాష్ఠంలో,
స్వర్ణదేవాలయంలో రక్తపాతమే పరాకాష్ఠ`
మతంతో బాటు ముక్తి మార్గాలు ఉద్బోధించబడతాయి
గనుక
ఈ దేశంలో
రోజూ బాబాగాడి గడ్డాలకు (రక్తరేఖ; 1985, పు.105)
వేలాది భక్తులు వేళ్ళాడుతుంటారు” అన్నాడు. భక్తి పేరుతో కొనసాగుతున్న దోపిడీని వ్యతిరేకించాడు.

కష్టాల బతుకే అతని కవితా శిల్పాన్ని మచిలిచింది. వేదనల్లోంచే కవిత్వం వెల్లువైంది. సిరాబుడ్లు తాగి కాగితాలు నమిలితే కవిత్వం పుట్టదన్నాడు. పెన్నుతో సమాజాన్ని సిజేరియన్‌ చేయాలన్నాడు. అతడు ఏ సిద్ధాంత గ్రంథాలనూ ఔపోసన పట్టలేదు. ప్రజలే అతని ఎజెండా. జెండా. ఐదు పాదాల కవితలో సామ్రాజ్యవాదాన్ని అర్థవంతంగా చెప్పాడు.
“ఏ దేశం శిరసు మీద
మోపిన
పాదాలైనా
హోదాలైనా (సిటీ లైఫ్‌; 1992, పు.157)
సామ్రాజ్యవాదాలే !” అని సామ్రాజ్యవాదాన్ని, దాని స్వరూపాన్ని సూటిగా చెప్పాడు. అతనికి తెలిసిందల్లా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటమే. ఏదీ దాచుకోడు. ప్రేమైనా. కోపమైనా. కవిత్వమైనా. సాహిత్య వందిమాగధుల్ని ద్వేషించాడు. అవార్డులు తీసుకోవడం నచ్చదతనికి. ప్రజా పక్షం నిలబడని ఎంతటి కవినైనా వదల్లేదు. సాహిత్య అకామీల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేసే రాయని భాస్కరుల గురించి…
“అర్భకుడైన కవి ఒకడు
అవార్డులూ
సన్మానాల కోసం
దేబిరించడం తప్ప
నగరంలో నేడు
అవాంఛనీయ (సిటీ లైఫ్‌; 1992, పు.163)
సంఘటనలేవీ జరుగలేదు!” అన్నాడు. అవార్డులు, సన్మానాలు ఫ్యూడల్‌ వ్యవస్థ అవశేషాలని తెలుసు తనకు. జీవితాంతం అట్లాంటి వాటిని వ్యతిరేకించాడు.

ప్రభాకర్‌ 1990లో ‘సంక్షోభ గీతం’ రాశాడు. నిజంగా ఆ కాలంలో ప్రభాకర్‌ జీవితమంతా సంక్షోభమే. తీవ్ర అనార్యోగం పాలయ్యాడు. టీబీ ఊపిరితిత్తుల్ని ధ్వంసం చేసింది. ఐనా కవిత్వానికి దూరం కాలేదు. కవిత్వాన్నే ఊపిరిగా చేసుకున్నాడు. ఈ కవితా సంకలనంలో దేశంలో ఉన్న సంక్షోభాన్ని అద్భుతంగా చిత్రించాడు. ‘నిరంతరం సూర్యుడే నా ముఖచిత్రం’ అని ప్రకటించిన సాహసి అతడు. చిందించిన నెత్తుటితో చీకటి కోణాలన్నీ వెలిగించాడు. గుండె గుండెకూ మధ్య విప్లవ వారధుల్ని నిర్మించాడు. అతనికి అక్షరమంటే ప్రచండ సూర్యగోళం. జ్వలనా జ్వలనంగా ప్రకాశించే సత్యం. లక్షలాది పీడితుల పిడికిళ్లు. జ్వలించే అక్షరం అతడు. అందుకే అతని అక్షరాలకు ఇంతటి తెగువ. సాహసం. ఇంతటి మట్టి పరిమళం. ఇంతటి గుండె తడి. కాలాన్ని ఖడ్గంగా పైకెత్తే వీరుడితో కరచాలనం చేసిన అక్షరం అది. అందుకే…
“శత్రు శిబిరం ముందు
అస్త్ర సన్యాసం చేసిన (సంక్షోభ గీతం; 1990, పు.131)
అహింసా సిద్ధాంత ప్రవక్తలకి నేను వీడ్కోలు పలుకుతున్నా…” అని రాశాడు. సామూహిక సమాజాల శవమ్మీద, ఎన్నికల కాగితప్పూల పరిమళాలు వెదజల్లే వాళ్లంటే అతనికి అసహ్యం.

“వేనవేల దీపాల గొంతు నులిమి
తమ చీకటి రాజ్యంగా ప్రకటించుకున్న చోట (అదే)
మిణుగుర్లతో దాడి సల్పలేం…” అని స్పష్టంచేశాడు. ఈ దోపిడీని ధ్వంసం చేయడం కోసం ‘గాయాల్ని దిక్సూచిగా ప్రసరించగల వీరుడితో కరచాలనం చేస్తున్నా…” అన్నాడు. కష్టాలకు వెనుదిరగలేదు. నమ్మిన విశ్వాసాల్ని వదులుకోలేదు. ఎక్కడా నిలకడలేనితనం, పెరిగిన అప్పుల వల్ల జగిత్యాల, కరీంనగర్‌ ఇళ్లను అమ్మేశాడు. నిలువ నీడ లేకుండా అయ్యాడు. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉన్నాడు. చాలీ చాలని జీతం. ఇద్దరు పిల్లలు. మందులు కూడా కొనుక్కోలేని స్థితి. తీవ్ర అనారోగ్యంతోనే ఆంధ్రజ్యోతిలో ‘సిటీ లైఫ్‌’ కాలమ్‌ రాశాడు (1987`1993). ‘సిటీ లైఫ్‌’తో వచ్చిన కొద్దిపాటి పారితోషికమే జీవనాధారమైంది. ఆరేళ్లపాటు క్రమం తప్పకుండా ఈ కాలమ్‌ రాశాడు. ఇందులో సుమారు 1425 కవితలు అచ్చయ్యాయి. వాటిలోంచి 425 కవితలతో 1992లో ‘సిటీ లైఫ్‌’ పేరుతో పుస్తకం వేశాడు. ఇందులో అతడు చేపట్టని వస్తువు లేదు. వర్తమాన కాలానికి టార్చ్‌ బేరర్‌లా నిలబడి రాశాడు. అదొక చరిత్ర. ఉజ్వమైన కాలం. తాను ఎంతోకాలం బతకనని తెలుసు. ఐనా కవిత్వంతో మరణాన్ని జయించాలనుకున్నాడు. ధ్వంసమైన బతుకులోంచే జవజవలాడే కవిత్వం రాశాడు. ప్రభాకర్‌ తన గురించీ, తన కవిత్వం గురించీ ఏం రాసుకున్నాడో చదివితే గానీ అతణ్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. ‘అంతరంతరాల్లో రగులుతున్న పద్యం…’ అని ‘సిటీ లైఫ్‌’ నేపథ్యాన్ని రాసుకున్నాడు.

‘ఎర్రపావురాలు’ నుంచి ‘మరణం నా చివరి చరణం కాదు’ వరకు ప్రభాకర్‌లో గొప్ప పరిణతి కన్పిస్తుంది. విప్లవోద్యమమే విముక్తి మార్గమనే ఆశావహ దృష్టి కన్పిస్తుంది. చివరి ఊపిరి వదలడానికి ముందు ఆఖరి క్షణాల్లోనూ కవిత్వం రాశాడు. ఊపిరి సలపనివ్వని దగ్గు తెరల మధ్యే దగ్ద గీతమయ్యాడు. నెత్తురు కక్కుకొని ఆగిపోయిన ఆ శ్వాస జనం గుండెల్లో మరణం లేని గీతమైంది.
“మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు” అని ఎప్పటికీ రగిలే అగ్ని పద్యం రాశాడు. ఈ నేల నేలంతా పరీవ్యాప్తమైన పోరాటాన్ని గుండెల్లో నింపుకున్న నిప్పుల పాట ఇది. పల్లె పల్లెనూ, గుండె గుండెనూ తాకే రణన్నినాదమిది. ఒకే ఒక్క సామూహిక స్వప్నం కోసం సాయుధమైన పద్యమిది. ప్రభాకర్‌ తన అక్షరాల్ని ఎగరేస్తాడు. కురిసే వెన్నెల్లా. జోరున కురిసే వానల్లా. వసంత మేఘ గర్జనలా. జయకేతనమవుతాడు. అడవినంతా రాజేసే రేరేలా పాటల్లా. నెత్తురోడుతున్న నెలవంకల్లా. అందుకే…

“అడవి నేను`కడలి నేను
ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను
అజ్ఞాతంగా అంతర్లీనంగా (మరణం నా చివరి చరణం కాదు; 1994, పు.11)
మట్టి పొరల్లోంచి పరీవ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను” అన్నాడు. సామూహిక సంఘర్షణల సారమిది. భూమి కోసం సాగుతున్న పోరాట స్వప్నమిది. అతని గుండెల్నిండా పోరాటమే. విముక్తి కోసం సాగే దీర్ఘకాలిక యుద్ధమే. ఈ ఒక్క కవితచాలు, ప్రభాకర్‌లోని విప్లవ ఆశావహ దృష్టిని చెప్పడానికి. ప్రజా పోరాటాల్లో మమేకమయ్యే సాహసాన్ని అర్థం చేసుకోవడానికి. అతడు ధ్వంసమైపోయిన జగిత్యాల పల్లె నుంచి వచ్చాడు. శిథిలమైన బతుకు నుంచి వచ్చాడు. శ్రమ దోపిడీలోంచి తెగువగా దూసుకువచ్చాడు. దగాపడ్డ నేల నుంచి ఊపిరిపోసుకున్నాడు. అందుకే మంటల జెండాల జాతరయ్యాడు. మందుపాతరయ్యాడు.

“సంపదల సమతుల్యం కోసం
దోపిడీ వటవృక్షాన్ని నేలకూల్చే సైనికుల సారధ్యం నేను
చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కుచెదరని సత్యం నేను (అదే)
హింసకు ప్రతిహింసను నేను…” అంటూ విప్లవోద్యమాన్ని ఆవాహన చేసుకున్నాడు. విప్లవోద్యమాన్ని ప్రతీకగా చెప్పిన కవిత ఇది. ఇది విముక్తి పోరాటం. ఎన్నటికీ ఆగని యుద్ధం. అందుకే…
“ఈ దీర్ఘకాలిక యుద్ధవ్యూహంలో
పీడితుడే నా అస్త్రం`అణ్వస్త్రం (అదే)
శత్రువు నా పాదధూళి” అన్నాడు. పీడిత ప్రజలే నా ఎజెండా అని యుద్ధ ప్రకటన చేశాడు. తరతరాలుగా పీడితులపై ఆధిపత్యం రాజ్యమేలుతోంది. పాలకవర్గం పడగ విప్పుతోంది. ప్రజల్ని హింసిస్తోంది. ఈ సమస్త ఆధిపత్యాలూ అంతం కాకతప్పవని చెప్తూ…

“రాజముద్రే రక్షా కవచమై
వాడిని ఎన్నాళ్లు రక్షించగలదు
చట్టం పుట్టలోంచి పడగ విప్పి
నియంతృత్వం ఇంకెన్నాళ్లు బుసకొట్టగలదు” అని ఓటేస్తే, కాటేసి చంపే క్రూరత్వమిక సాగనివ్వబోమన్నాడు. ‘అరచేతిని అడ్డుపెట్టి… సూర్యకాంతినాపలేర’నే సత్యమిది. దోపిడీ రాజ్యాన్ని కూల్చే రోజొకటి తప్పక వస్తదనే ఆశావహ దృక్పథం ఇది. ఈ స్వప్నాల్లోంచే…
“ధైర్యాన్ని దేదీప్యమానంగా వెలిగించగలవాళ్లు
చీకటి చెరసాలలోంచి దేశాన్ని రక్షించేందుకు
అంచెలంచెలుగా తరలి వస్తున్నారు (మరణం నా చివరి చరణం కాదు; 1994, పు.13)
ఇక వాడి అంతం తప్పదు” అని విప్లవాన్ని కలగన్నాడు. దేశాన్ని రక్షించేందుకు చీకటి చెరసాలల్లో ఉదయిస్తున్న వేనవేల సూర్యుళ్లను కలగన్నాడు. చరిత్ర పొడవునా వెల్లువెత్తిన పోరాటాల్ని కళ్లల్లో నింపుకొని చేసిన ప్రకటన ఇది. చరిత్ర పునరావృతమవుతోంది. హిట్లర్‌లూ, నిజామ్‌ల దారిలోనే ఇటీవలి రాజపక్సే దాకా.

అలిశెట్టి ప్రభాకర్‌ వీరుణ్ని కలగన్నాడు. ఎన్నిసార్లు నేలకూలినా, శిఖరమై శిరమెత్తే వీరుణ్ని కలగన్నాడు. ఆ కలల్నిండా ప్రజాయుద్ధ వీరుల పాదముద్రలే. బూడిద రాసుల్లోంచే ఊపిరిపోసుకొని నింగినంటే ఫీనిక్స్‌ అతని స్వప్నం.
“దేశాన్ని పోగొట్టుకున్న గర్భశోకం నుంచే
మళ్లీ నేనొక వీరుణ్ని కలగనాలి
దిక్కులు కూలిన దు:ఖం నుంచే
దిగంతాల అంచులు దొరని ఆక్రోశం నుంచే
మళ్లీ మళ్లీ కుప్పకూలిపోతున్న మరణశయ్య మీంచే (అదే; 1994, పు.15)
నన్ను నేను ఆయుధంగా మలుచుకోవాలి” అని యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ దిగులెప్పటికీ శాశ్వతం కాదని తెలుసు. ఈ దు:ఖమెప్పటికీ ఉండదనీ తెలుసు. అందుకే దు:ఖాల లోయల్లోంచే విముక్తి శిఖరాలను అందుకోవాలనుకున్నాడు.
“శరీరం శిథిలాయుధమైనా
యోధుడిగా మునుముందుకే కదిలి
కదనరంగాన్ని వశపరచుకోవాలి” అన్నాడు.

రాజ్యహింసల్లో రక్తసిక్తమైన తెలంగాణ. విముక్తి పోరులో గర్జించిన వీర తెలంగాణ. ధ్వంసమైన పల్లెలు. రోజుకో రోజుకో ఎన్‌కౌంటర్‌తో తెల్లారే కాలం. వేలాది యవ్వన కలల్ని చిదిమేసిన రాజ్యం కర్కశత్వం. తలలకు వెలకట్టిన రాజ్యం. మనుషుల్ని వేటాడే రాజ్యం. ప్రభాకర్‌లో కల్లోలం రేపింది. ఆ కల్లోలం…
“చిదిమిన గాయాలకూ చిందిన వెలుతురుకూ మధ్య నేను
కన్నీటి లోయలకూ కాంతి శిఖరాలకూ మధ్య నేను
అణచివేతకూ ఆయుధానికీ మధ్య నేను” అని కల్లోల కడలిని మీటాడు. ‘ఏకీ రస్తా’ నినాదమయ్యాడు. కవిత్వాన్ని ఎరుపెక్కించాడు. ఆ ఎరుపుల్లో మెరుపులు. దగాపడ్డ గుండెల కన్నీటి మెరుపులు. చిందిన నెత్తుటి ఎరుపులు. పోరాట బాటల్లో ‘కవిత్వమింకా ఎరుపెక్కనీ’ అని కవులకు కాషనిచ్చాడు.

“ఉద్యమాలు ఒరుసుకొని కన్నీళ్లింకా ప్రవహించి
కంటి ఎర్రజీరలో కవిత్వమింకా ఎరుపెక్కనీ
పొంగిన లాఠీ దెబ్బలు చిందిన నెత్తుటి చారలే
రక్తనాళాల రహదారుల గుండా రహస్యంగా నడిచెళ్లి
వీరుడికి మళ్లీ ఒక అన్నం ముద్ద అందించనీ” అని ఉద్రిక్తమవుతున్న గాయాలను తడుముకున్నాడు. ఎంత అణిచివేత ఎదురైనా వెరవలేదు. వెనకడుగు వేయలేదు. రక్తమంతా నిండి ప్రవహిస్తున్న ఆశయం కోసం కడదాకా నడవాలనుకున్నాడు. అందుకే కవిత్వాన్ని సాయుధం చేశాడు. అక్షరాలకు గెరిల్లా శిక్షణనిచ్చాడు.

“అనేకానేక లం‘పెన్‌’లూ
క్షుద్ర సాహిత్య గూండాలూ
నెలకొన్న రాజ్యంలో
నేనక్షరాలకు
గెరిల్లా శిక్షణిస్తా!” అన్నాడు. అందుకే ప్రభాకర్‌ గెరిల్లా కవి. పదాలతో యుద్ధ వ్యూహాలల్లాడు. ప్రజల్ని మూఢత్వంలో ముంచెత్తే సాహితీకారుల్ని ఎదుర్కొన్నాడు. క్షయతో రోజురోజుకీ శిథిలమయ్యాడు. వెలిగే కళ్లు, లోలోపల కొలిమిలా రాజుకొనే కవిత్వం తప్ప అతని దేహంలో ఇంకేమీ లేవు. ఎడతెగకుండా ఉక్కిరిబిక్కిరి చేసే దగ్గుతెరల మధ్యే ఓ నడిరేయి (1993 జనవరి 12)న ప్రభాకరుడు అస్తమించాడు. ‘మరణం నా చివరి చరణం కాద’ని ప్రకటించి.

కామ్రేడ్‌ ప్రభాకర్‌ స్మరణలో దండకారణ్య రచయితలు… “జగిత్యాల జైత్రయాత్ర(1978) మొదలు చివరి శ్వాస వరకు ప్రభాకర్‌ పీడిత ప్రజల పక్షాన నిలిచాడు. ప్రజాయుద్ధ రాజకీయాలను బలపరిచాడు. సీదా సాదాగా జీవించి తన కలంతో దోపిడీ సమాజంపై తిరుగుబాటు ప్రకటించి చివరి వరకు పోరాడినాడు. ఈ పోరాటంలో ఎందరినో తన విప్లవ నిబద్ధతతో ఉత్సాహపరిచాడు. జగిత్యాలకరీంనగర్‌హైదరాబాద్‌… ఇలా తన మకాం ఎక్కడికి మారినా ఉద్యమంతో సజీవ సంబంధాలను నిలుపుకొన్నాడు. ఉద్యమంపై నిర్బంధం పెరిగిన ప్రతి సందర్భంలో ప్రతీ మలుపులో తనపై వచ్చే నిర్బంధానికి వెరవక విప్లవ పక్షమే నిలిచి తన కలాన్ని మరింత పదునెక్కించిన సాంస్కృతిక సైనికుడాయన. అందుకే కామ్రేడ్‌ ప్రభాకర్‌ అమరుడు. ఆయన నిజాయితీకి విప్లవాభిమానులంతా జోహార్లు అర్పించాలని కోరుకుంటున్నాం” అని రాశారు.

ఇదీ అలిశెట్టి ప్రభాకర్‌ జీవితం. కవిత్వం. నిబద్ధత. నిమగ్నత. కడ దాకా నమ్మిన విలువల కోసం నిలబడ్డ సాహసం. అతడు అలసిపోని సూరీడు. అతనికి జననం తప్ప మరణం లేదు. సూరీడెప్పటికీ అస్తమించడు. తొలిపొద్దై ఎదురొస్తాడు. మన కళ్లల్లో వెలుగై. పిడికిళ్లెత్తి గర్జించే రణన్నినాదమై. మంటల జెండాల జాతరై.

‘సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’.

జోహార్‌… కామ్రేడ్‌ అలిశెట్టి ప్రభాకర్‌.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

Leave a Reply