కలలు కదిలిపోతున్నప్పుడు

కలలు ప్రసాదించమని
ఈ పొలాలు ఎవరినీ వేడుకోలేదు
నేల నేలగానే ఉండాలనుకొంది
ఎవరో వచ్చి పసిడి కలలు నాలుగు
కళ్లల్లో కళ్లాల్లో చల్లి వెళ్లారు
అవి పచ్చగా మొలకెత్తాయి
కల నిక్కల అవుతుందని పొలాలు భ్రమపడ్డాయి
నేలంతా ఆకుపచ్చదనం కోల్పోయినా
పసిడి కాంతులీనుతుందని తలపోశాయి
పసిడి పదిమందికీ అని సంబరపడ్డాయి
కలల్లో హరివిల్లులే హరివిల్లులు

మరెవరో వచ్చారు
కలకీ కల్లకీ తేడా రవ్వంతేనని తేల్చారు
కలలో చీకటి తప్ప వెలుతురు లేదని బుకాయించారు
చీకటిని చెరిపెయ్యటమే మా పని అన్నారు
కలలు వెలిమబ్బులై కదలబారాయి
నీటిబుడగలై చిట్లిపోయాయి
కన్నీటి వెతలై కునారిల్లాయి
ఇంకా ఈ నేలకు మిగిలిందేమిటి?
ముక్కారు పంటలు కనుమరుగైనాక
గట్లూ గనిమలూ కుంటలూ కందకాలూ చెరిగిపోయినాక
కాడీ మేడీ బర్రెగొడ్లూ దుక్కిటెడ్లూ ట్రాక్టర్లూ
వలసపోయినాక
జడ్డిగాల్లో వెదగొర్రుల్లో సాలెగూళ్లు అల్లుకొన్నాక
లిక్కులూ కొడవళ్లూ గడ్డపలుగులూ
తుప్పుబట్టిపోయినాక
దుక్కి దున్నిన చేతులన్నీ చేవ చచ్చి యాలగిలబడ్డాక
ఏ నేలైనా ఏం చెయ్యగలదు?
తెగిపోయిన బొడ్డుతాడును
మళ్లీ ఎట్లా ముడేసుకోగలదు?

ఈ నేలంతా అడవిగా తేల్చినవాళ్లకి
జీవసారం తొణికిసలాడే భూమిని
ఎడారిగా నమ్మబలికే వాళ్లకి
పొలానికి కులాన్ని అంటగట్టినవాళ్లకి
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొనే
మట్టి మేనులపై చెమట సెలయేళ్ల గూర్చి తెలుసా?
పైరు సాలూ మూలా తెలుసా?
సేద్యమంటే ఏమిటో తెలుసా?
త్యాగ సారాంశం తెలుసా?
మట్టి ఋణం ఎలా తీర్చుకోవాలో తెలుసా?
తెలుసా?

(అమరావతి రైతుల వెతల్లో)

Leave a Reply