నిజమే, ఒక కల చెదిరిపోయింది. దాదాపు ఆరు దశాబ్దాలుగా ఎన్నో నిఘాలను, నిర్భంధాలను, కల్లోలాలను, నెత్తుటి ఏరులను, వెన్నుపోట్లను అనుభవించి, అధిగమిస్తూ అట్టడుగు మనుషుల విముక్తి మార్గంగా సాగిన కల చివరికి చెదిరిపోయింది. అది అనన్య త్యాగాలు అంకితమైన కల. అపూర్వ మానవుల అద్భుత కల. అంటరాని వసంతాల కల. ఆదివాసుల గుండె గుర్తుగా మిగిలిపోయిన కల. నిజమే, ఒక కల చెదిరిపోయింది. అయితే అంతటితో కాలమాగిపోతదా?
విప్లవాల నిర్మాణం, ప్రయాణం చారిత్రక, భౌతికవాద పరిస్ధితుల మీద, శాస్త్రీయత మీద ఆధారపడే సాగినా అవి మనుషులను ఎంతో సున్నితం చేస్తూ భావోద్వేగాలకు గురిచేస్తాయి. కేవలం మన గురించో, మనవాళ్ళ గురించో కాదు. మొత్తంగా మానవాళి గురించి భావోద్వేగాలు నింపుతాయి. మనమెన్నడూ చూడని మనుషుల మీద, మనమెన్నడూ వెళ్ళని ప్రాంతాల మీద ఒక ఉద్వేగాన్ని, దగ్గరితనాన్ని కలిగిస్తాయి. మనం ఎప్పుడూ పేర్లు కూడా వినని విప్లవకారులు తాము నమ్మిన సిద్ధాంతాల కోసం అమరులయినప్పుడు గుండెలు బరువెక్కిస్తాయి. విప్లవానికి ద్రోహం చేశారని అర్థమయినప్పుడు వాళ్ళమీద విపరీతమైన కోపం వస్తుంది. విప్లవోద్యమానికి అధికార ప్రతినిధులుగా పనిచేసినవాళ్ళే చివరికి రాజ్యం చేతిలో పనిముట్లుగా మారినప్పుడు అసహ్యం వేస్తుంది. “కగార్” పేరిట ప్రజల మీద యుద్ధం మొదలైనప్పటి నుండి ఇటువంటి భావోద్వేగాలు సముద్రపు అలల్లా పోటెత్తుతున్నాయి.
“ఓవర్ట్ కగార్” బయటినుండి సైనిక, ప్రచార దాడిచేస్తూ “రాజ్యాంగ విసర్జన” చేస్తే, “కోవర్ట్ కగార్” లోపలి నుండి విద్రోహం చేస్తూ లొంగుబాట (Road to Surrender) వేసి “ఆయుధ విసర్జన” చేసింది. ఈ రెండు క్యాంపులు (వాస్తవానికి రెండు క్యాంపులుగా విడివిడిగా కనిపించినా వీటి లక్ష్యం మాత్రం ఒక్కటే) చాలా తెలివిగా మొత్తం చర్చను “రాజ్యాంగం,” “ఆయుధం” చుట్టూ నడపగలిగారు. దాని కోసం అనేక అద్దె గొంతుల, అవకాశవాద గొంతుల, అరిగిపోయిన ఆవు కథల గొంతుల, అపరాధ భావన గొంతుల, ఆగర్భశత్రు గొంతుల … అన్నింటిని ఉసిగొలిపి అందరితో ఒక్కటే పాట పాడించారు. “మారిన పరిస్థితులు” అనే బ్రహ్మ పదార్థాన్ని తలా ఇంత ఇచ్చి మీడియా, సోషల్ మీడియా ముఖంగా నమలమన్నారు.
అయితే, “మారిన పరిస్థితులు” అనే పదబంధం విస్తృతంగా వినిపిస్తున్న సందర్భంగా ఒక ప్రాథమిక ప్రశ్న వేసుకోవాలి: ఈ “మారిన పరిస్థితులు” అనే భావనకు మార్క్సిస్టు చారిత్రక భౌతికవాదం, రాజకీయ ఆర్థిక శాస్త్రం పరిధిలో నిర్దిష్టమైన, శాస్త్రీయమైన అర్థం ఏమైనా ఉన్నదా? లేక ఇది కొందరి రాజకీయ నిర్ధారణలకు అనుకూలంగా ఉండే విధంగా, ఒక అస్పష్టమైన, సిద్ధాంత రహిత సౌకర్యవాచకంగా పనిచేస్తున్నదా?
మార్క్సిస్టు సిద్ధాంత నిర్మాణంలో ఏదైనా సామాజిక మార్పు గురించి మాట్లాడాలంటే, ముందుగా పరిశీలించాల్సింది ఉత్పత్తి విధానం, దాని అధారంగా నిర్మితమైన సామాజిక సంబంధాలు. అంటే మారుతున్న ఉత్పత్తి శక్తుల (టెక్నాలజీ, శ్రమ, శాస్త్ర–సాంకేతిక పరిజ్ఞానం మొదలైనవి), ఉత్పత్తి సంబంధాల (ఆస్తి యాజమాన్యం, వర్గాల మధ్య నియంత్రణ, అధికార సంబంధాలు) కలయికలో ఏ విధమైన పునర్వ్యవస్థీకరణ సంభవించిందో అనే ప్రశ్నను పరిశీలించడం.
ఈ దృష్టిలో “మారిన పరిస్థితులు” అనే పదబంధం మార్క్సిస్టు అర్ధం పొందాలంటే అది ఉత్పత్తి విధానంలో (లేదా కనీసం ఆ విధానంలోని అంతర్గత సమతుల్యతలో) ఒక గుణాత్మక పరివర్తనను చూపగలగాలి. మార్కెట్ విస్తరణ, సాంకేతిక అభివృద్ధి, మధ్యతరగతి ఎదుగుదల వంటి అంశాలు వాటంతట అవే గుణాత్మక మార్పుకు సూచికలు కావు. అవి కొనసాగుతున్న విధానంలోని పరిమాణాత్మక మార్పులుగా మాత్రమే పరిగణించబడతాయి.
మార్క్సిజం దృష్టిలో గుణాత్మక మార్పు అంటే ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ఒక దశకు చేరుకుని, పాత ఉత్పత్తి సంబంధాలు వాటి అభివృద్ధికి అడ్డంకులుగా మారి, ఆ సంబంధాలను చీల్చివేయడానికి ఒత్తిడి సృష్టించే దశ. ఇది భూస్వామ్యం నుండి పెట్టుబడిదారీ విధానానికి జరిగిన మార్పు వంటి నిర్మాణాత్మక పరివర్తన. ఇక భారతదేశ పరిస్థితుల్లో కేవలం వర్గ సంబంధాలు మాత్రమే కాదు, కులం వర్గాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా పరిగణలోకి తీసకొని మొత్తం సామాజిక పరివర్తన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. నిర్థిష్టంగా కుల, వర్గ నిర్మాణ మార్పును నిరూపించకుండా సాధారణ సామాజిక–సాంస్కృతిక, సాంకేతిక, లేదా పరిపాలనా మార్పుల సమాహారాన్ని “మారిన పరిస్థితులు” అనే పేరుతో చర్చలు చేయడమంటే కేవలం సమాజ ఉపరితల అంశాలను పట్టుకు వేలాడటమే.
ఈ సడలించిన “విశ్లేషణ”ల ద్వారా నేటి భారత సామాజిక నిర్మాణంలో విప్లవోద్యమం, ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా, ఇకపై పనికిరాని మార్గమనే తీర్మానాన్ని ముందుగానే నిర్ధారించి దానికి మద్దతు కూడగట్టడానికి “మారిన పరిస్థితులు” అనే సాధారణ, అస్పష్ట వాదనను కేంద్రంగా ప్రతిపాదిస్తున్నారు. ఈ దుందుడుకు వాదనను తిప్పికొట్టడంలో విప్లవ శిబిరం కూడా చేయాల్సినంత మేధోకృషి చెయ్యకపోవడం మూలంగా మారిన పరిస్థితుల వాదం బాగా చలామణి అవుతుంది. ఇది చాలా లోతుగా, శాస్త్రీయంగా, సరైన మెథడలాజికల్ సాధనాలతో ఆబ్జెక్టివ్ గా చెయ్యాల్సిన పని. ఈనాటి ఓటమిని అర్థం చేసుకోవడానికి, రేపటి ఉద్యమాలను అంచనా వెయ్యడానికి చెయ్యాల్సిన ముఖ్యమైన పని.
ఈ మధ్యకాలంలో కొంతకాలంగా జరుగుతున్న అనేక రకాల చౌకబారు చర్చల మధ్యే ఐ డ్రీమ్ ఛానెల్ జర్నలిస్ట్ మురళీధర్ చేసిన ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చూశాను. అది ఆదివాసీ మహిళ గంగా @ సోనితో చేసిన సంభాషణ. ఆమెది సుకుమా జిల్లా, ధర్మపేట గ్రామం. ఆ గ్రామంలోకి వచ్చే సాయుధ, సాంస్కృతిక దళాల మాటలకు, పాటలకు, ఆటలకు గంగ ఆకర్షితురాలైంది. వాళ్లు చెప్పే మాటల్లో తన చుట్టూ ఉన్న సమాజంలోని చెడు పద్ధతులకు (చిన్నతనంలోనే ఆడపిల్లలకు బలవంతపు పెండ్లిళ్లు, ఆడవార మీద మగాళ్ల పెత్తనం) ఒక పరిష్కారం కనిపించింది. ఊర్లోకి దళం రాగానే పిల్లలందరిని జమచేసి, వాళ్లకు అన్నం, నీళ్లు తీసుకుపోవడం మొదలు పెట్టింది.
అలా పార్టీకి దగ్గరైన గంగ మొదటగా మహిళా సంఘంలో పని చేసి ఆదివాసీ మహిళల సమస్యల మీద పోరాటం చేసింది. ఆ తర్వాత వాళ్ల గ్రామంలో మావోయిస్టు పార్టీ నిర్మించిన పంచాయితీ జనతన సర్కార్ కు గంగ మొదటి అధ్యక్షురాలిగా ఎన్నికైంది. తర్వాత పదిహేను పంచాయితీ సర్కార్లను కలిపి కిష్టారంలో ఏర్పడ్డ మొదటి ఏరియా జనతన సర్కార్ కి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఆ ఎన్నికకు ముందు తాను ఆ బాధ్యతను చేపట్టనని గంగ గట్టిగానే పట్టుపట్టిందట. ఎందుకంటే అంత పెద్ద పని ఆమెవల్ల అవుతుందో లేదో అనే సంకోచంతో. కానీ అమరుడు రామన్న ఆమెతో రెండు గంటలు కూర్చొని, “నేనుంటాను. నీకు ఏది అవసరమైనా నేను నేర్పుతాను. నువ్వు చేయగలవు. నువ్వు చేస్తావని మాకు నమ్మకం ఉంది” అని చెప్పి గంగను ఒప్పించాడట. పార్టీ నమ్మినట్లే గంగ జనతన సర్కార్ నిర్వహణలో తనదైన నైపుణ్యాన్ని చూపించింది. సర్కార్ నిర్వహణ పద్ధతులు నేర్చుకుంది. తనదైన నాయకత్వ ముద్రను వేసింది. గంగ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని గుర్తించిన పార్టీ, ఆమెను దక్షిణ బస్తర్ డివిజన్ పరిధిలోని జనతన సర్కార్‌కు అధ్యక్షురాలిగా ఎన్నుకుంది.
గంగ విప్లవ ప్రయాణం ఒక గుణాత్మక మార్పును చూపిస్తుంది. ఒక సామాన్య ఆదివాసీ మహిళ, విప్లవ మార్గంలో నాయకత్వ స్థాయికి ఎదిగింది. ఎంతోమంది పార్టీ నాయకులకు ప్రియమైన కామ్రేడ్‌గా మారింది. తన పెళ్లి సందర్భంగా ఆనంద్ (కటకం సుదర్శన్) గంగకు “నీ తండ్రిలాంటోడ్ని” అని ధైర్యం చెప్పాడట. దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు పనిచేసి రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగిన గంగ, ఎంతో నిబ్బరంగా, ఆత్మవిశ్వాసంతో విప్లవోద్యమం ఆదివాసీల కోసం చేసిన ఎన్నో పనుల గురించి వివరించింది. ప్రతి సందర్భంలోను “బయటి” రాజ్యాన్ని జనతన సర్కార్‌తో పోల్చుకుంటూ సమాధానాలు చెప్పింది.
మురళీధర్ అందరినీ అడిగే రొటీన్ ప్రశ్నలే గంగను అడిగాడు; కానీ ఆమె ఎంతో లోతైన జవాబులు ఇచ్చింది. విప్లవ హింస గురించి అడిగితే, ముందు హింసను మొదలుపెట్టింది ఎవరు? అని ఎదురు ప్రశ్న వేసింది. పార్టీ గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకున్నారు కాదా అని అడిగితే, “ఒక్కసారి జనతన సర్కార్ నిర్మాణం కాకముందు దండకారణ్యంలో తవ్విన చెరువుల, బావుల లెక్కలు చూడండి” అని చెప్పింది. విప్లవ బడుల్లో పిల్లలకు సమాజం, ప్రకృతి సంరక్షణకు సంబంధించిన విలువలు ఎట్లా నేర్పుతారో విడమర్చి చెప్పింది. మొదట రేషన్ కార్డులు తీసుకోవాలనే అనుకున్నామని, కానీ అవి తీసుకోవడానికి పోతే అక్కడే వాళ్లను అరెస్టు చేస్తున్నారని గమనించి, ఇక వాటిని తీసుకోవద్దని నిర్ణయించుకున్నామని చెప్పి రాజ్యం కుట్రలను బయటపెట్టింది.
ఇలా అనేక విషయాల మీద ఎంతో గట్టిగా మాట్లాడిన గంగ, తనతో పనిచేసిన నాయకత్వ అమరులను గుర్తు చేసినప్పుడు ఒక్కసారిగా మూగబోయింది. దుఃఖంతో “తట్టుకోలేనంత బాధగా ఉంటుంది” అని గొంతు పెకలని మాటగా చెప్పింది. తనను బిడ్డలా చూసిన ఆనంద్ అమరత్వం, గంగను ఎంతో కుదిపేసినట్టుంది. “బయటపడటానికి ఒక సంవత్సరం పట్టింది” అని చెప్పింది. విప్లవం ఎంత అద్భుతమైన మానవ సంబంధాలను నిర్మాణం చేస్తుందో కదా అని అనిపిస్తుంది. గంగతో పాటుగా మనకూ కన్నీళ్ళు ఆగవు.
గంగ తీవ్రమైన అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆమెను కాపాడుకోవడం కోసం బయటకు పంపే అవకాశం కూడా లేని పరిస్థితిలో, ప్రభుత్వం ముందు లొంగిపోవడం ఒక్కటే మార్గమని నాయకత్వం చెప్పినప్పుడు, తాను ఎలా తల్లడిల్లిపోయిందో చెబుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రజలు విప్లవం కోసం ఎన్ని కష్టాలనైనా అనుభవించడానికి ఎలా సిద్ధపడతారో అర్థమవుతుంది. గంగలాంటి మనుషులు ఎన్ని వేలలో ఉంటారో, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంటారో?
అదే మురళీధర్ మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వ స్థానంలో పనిచేసి, ఆ పార్టీ అధికార ప్రనిధిగా ఉండి లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ ను కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఆయన పార్టీ “దారుణమైన తప్పులు” చేసిందని, ప్రజలు పార్టికీ దూరమవుతూ పోయారని, సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ఇవ్వాల్సి వచ్చిందని మొదలుపెట్టి చెప్తూ రాజ్యాంగం ఉండగా మావోయిజంతో పనిలేదని తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. నిజానికి వేణుగోపాల్ క్షేత్రస్థాయికి సంబంధించి లేవనెత్తిన అనేక ప్రశ్నలకు గంగ సంభాషణలో సమాధానాలు దొరుకుతాయి. వేణుగోపాల్ “మాకు అసలు రాజ్యమంటే అర్థం కాలేదని” కూడా చెప్పాడు. రాజ్యమంటే ఏమిటో అర్థం కాని ఆయన ప్రత్యమ్నాయ రాజ్య నిర్మాణం పేరిట నలభై ఐదేండ్లు విప్లవోద్యమంలో ఏం చేసినట్లు?!
అంతేకాదు, ఆయన ఇప్పుడు రాజ్యాంగానికి బ్రాండ్ అంబాసిడర్ లా మాట్లాడుతున్నాడు. రాజ్యాంగ అమలులో రాజ్యం మీద ఆయనకున్న భ్రమలను చూస్తుంటే, నిజంగానే ఆయనకు రాజ్య స్వభావం అర్థం కాలేదనే అనిపిస్తుంది. ముఖ్యంగా రాజ్యాన్ని ఒక తటస్థ అభివృద్ధి సాధనంగా, పెట్టుబడులను ఉద్యోగావకాశాలు మాత్రమే ఇచ్చే యంత్రాంగంగా చూపుతూ, శ్రమకు పెట్టుబడికి మధ్య ఉండే వైరుధ్యాన్ని పూర్తిగా మర్చిపోవడం చూస్తుంటే, ఆయన తలక్రిందులుగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది.
గడ్చిరోలి వంటి ప్రాంతాల్లో ఖనిజ ప్రాజెక్టులు, రోడ్లు, కార్పొరేట్ ప్లాంట్లు అన్నీ మిగులు విలువను సృష్టించి పెట్టుబడులను పోగుచేసుకోవడానికి, వనరుల దోపిడీకి అవసరమైన మౌలిక సదుపాయాలే అన్న బేసిక్ విషయాన్ని ఆయన మరిచిపోయినట్లున్నడు. లొంగిపోయిన మావోయిస్టులకు మైనింగ్ కంపెనీలలో షేర్లు కేటాయించడం, వారిని “షేర్ హోల్డర్లు”గా ప్రదర్శించడం, దానిని వేణుగోపాల్ గొప్ప విముక్తిగా చూడడం, ఒక ఆలోచనాపరుడిగా ఆయన ఎంత దిగజారిపోయాడో చూపిస్తుంది. కొద్దిపాటి షేర్‌హోల్డింగ్ ద్వారా కార్మికుడు “భాగస్వామి”గా భావించబడినా, ఉత్పత్తి సాధనాల యాజమాన్యం, వ్యూహాత్మక నియంత్రణ, నిర్ణయాధికారం మాత్రం నిరంతరంగా పెట్టుబడిదారీ వర్గం చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంటుందనే ప్రాథమిక విషయాన్ని ఆయన పూర్తిగా వదిలేశాడు.
నిజానికి, గడిచిన నలభై–యాభై సంవత్సరాలుగా ఆయన ఆదివాసీ జీవితం మీద “షేర్ హోల్డర్”లా ఉన్నా, ఇప్పుడు మాత్రం అదే ఆదివాసీలను తప్పుడు చైతన్యంతో నూతన బానిసలుగ రూపుదిద్దే పనిలో నిమగ్నమై ఉన్నట్టు కనబడుతుంది.
చరిత్ర విధ్వంసం అవుతున్న సందర్భంలో, అణగారిన ప్రజల్ని పునాదిగా తీసుకుని ఆ చరిత్రను కనీసం రికార్డు చేయడం బుద్ధిజీవుల కనీస కర్తవ్యం. విప్లవోద్యమ ఓటమి పూర్తిగా ఆ పార్టీ నాయకత్వ ఓటమే! ఇది top-down collapse. అయితే నాయకత్వ ఓటమిని ఆ పార్టీ పంథా ఓటమిగా సూత్రీకరించడం తొందరపాటు తనమే అవుతుంది. కానీ, ఇది చెప్పినంత తేలికైన విషయం కాదు. లోతైన పరిశోధన చెయ్యాల్సిఉంది. అనేక వైపులనుండి పరిశీలించాల్సివుంది. తప్పనిసరిగా నిజాయితీగా, భావోద్వేగాలకు తావులేకుండా, విప్లవోద్యమ చరిత్రను మళ్లీ రచించాల్సిన అవసరం ముందుకొచ్చింది. ఇది కేవలం ఆ పార్టీకే సంబంధించిన విషయం కాదు. మొత్తం సమాజానికి, భవిష్యత్తుకు సంబంధించినది.
అలాంటి చరిత్రను కేవలం డాక్యుమెంట్ల ఆధారంగా రాస్తే సరిపోదు. గంగలాంటి ఎంతోమంది ఆదివాసీలు, దళితులు, ఇతర పీడిత కులాలు, వర్గాల ప్రజల మౌఖిక చరిత్రను పరిగణలోకి తీసుకుని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ విప్లవ మార్గంలో ఎన్నో సూక్ష్మ విప్లవాలు వున్నాయి. విజయవంతం అయ్యాయి. అదే సందర్భంలో “Don’t throw the baby out with the bathwater” అనే ఇంగ్లీష్ సామెతను కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం అపజయాల ఆధారంగా విప్లవాన్ని అంచనా వేస్తే అది సాధించిన అనేక విషయాలు కనబడకుండా పోతాయి. అదే క్రమంలో రేపటి తరం భద్రత కోసమైనా, దండకారణ్య విషవృక్షాల చరిత్ర, లక్షణాలను కూడా రికార్డు చేయాల్సిందే.
మొత్తం సమాజ నిర్మాణంలో కల చెదరడం ఇదేమీ మొదటిసారి కాదు, ఇదే చివరిసారి కూడా కాదు. గంగలాంటి మనుషులు ఉన్నంత వరకు, మానవాళి మేలుకోరే కలలు కంటూనే ఉంటారు. అది ఒక రూపంలో కాకపోతే, మరో రూపంలో.