కర్పూరగంధి

1.
వేలుచివర
ప్రార్థనని మోస్తుందామె

ఉఫ్ అంటూ ఊది
గాలినీ ప్రార్థనతో నింపుతుందామె

గాలిలో వేలును ఆడిస్తూ
అక్షరాల్ని మెరుపుల్లా విడుదల చేస్తుంది

2.
పరీక్ష మొహాన
వేలును ఇనుప చువ్వచేసి
సమాధానాన్ని ముద్ర వేయగలదామె

ఆమె
విడుదల చేసే ప్రార్థనాపదాలు
స్వస్థపరిచే
సీతాకోక చిలుకలు

3.
దేశం కోసం గంటలు గంటలు ప్రార్థన చేసి
మహిమ వస్త్రాలు తొడగాలని అనుకున్న ఆమెకు
వస్త్రాలు లేకుండా చేసిన వాళ్ళ కోసం
ఆమె క్షమాపనా ప్రార్థనలే చేస్తుంది

4.
_”మీరు మమ్మల్ని వివస్త్రలను చేయండి
మా మానాలని తీసి ఊరేగించండి
ద్వేషాన్ని మా దేహాలమీద మా దారుల్లో
కుప్పలు కుప్పలుగా కుమ్మరించండి
అయినా మేము మీ కొరకు ప్రార్ధిస్తాం” అంటుందామే

తండ్రీ వీరేమి చేయిచున్నారో
వీరికి తెలియదని మీ కోసం వేడుకుంటాం
మా కొరకు మా పిల్లల కోసం కాదు
ఈ దేశం కోసం రాక్షసులవుతున్న మనుషుల మార్పు కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తామని మళ్లీ మళ్లీ మోకరిస్తూనే ఉంది

5.
ప్రేమించటం మాత్రమే తెలిసిన వాళ్ళం
ప్రేమనీ క్షమాపణనీ
చంపుతున్నా
తిరిగి ఇస్తూనే ఉంటాం
మమ్మల్ని సిలువేసినా మిమ్మల్ని ప్రేమిస్తూనే మా సోదర సొదరీలుగా హత్తుకుంటూనే ఉంటామని నగరుకై చెక్కబడిన కొండమీది దీపమై కరిగిపోతుందామే వెలిగిపోతూ వెలుగులాగే ఉంటుందామె

పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లో .  స్వస్థలం అప్పటి నల్లగొండ జిల్లా సూర్యాపేట దగ్గర వల్లభాపురం. కవయిత్రి, కథా రచయిత. సామాజిక కార్యకర్త. పన్నెండేళ్లుగా కవిత్వం రాస్తున్నారు. రచనలు: 'మాటల మడుగు', 'కాలం వాలిపోతున్న వైపు'  (కవిత్వ సంపుటాలు).  అప్పుడప్పుడు కథలు రాస్తుంటారు. 'మాటల మడుగు' పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. త్వరలో మరో కవిత్వ సంపుటి  రానుంది.

3 thoughts on “కర్పూరగంధి

  1. వేరే కోణం ఆగ్రహ ధిక్కారం లేదు

Leave a Reply