కరోనా శకం

చేతులాడే యుద్ధం చూశాం
ముడుచుకునే యుద్ధం
ఎప్పుడన్నా చేశామా
ఇది యుద్ధం కన్నా ఘోరమైంది
రథాలు ఎక్కేది లేదు
క్షిపణులు మోసేది లేదు
నిఘా కన్నుల కారం చల్లి
పారిపోతున్నది
చర్య ప్రతిచర్యల మధ్య ప్రపంచాన్ని
విచిత్ర యుద్ధశాల చేసింది
క్యాలెండర్ ముందు
వికటంగా గంతులేస్తున్నది
కాలం కన్నా వేగం అయింది
వర్ణాంతర కుటిలాన్ని
ఊదర ప్రవచనాలను
ఏక ధృవీకరణనూ
జెండర్ వివక్షతలనూ
ఏలుబాటు కాదన్నది
తప్పిపోయిన యెరుక
పట్టి ఇచ్చింది
దీన్ని కరోనా శకం అనాలి
మనిషి నిండుగ రూపొందనందుకూ
విషాలకు తలొగ్గినందుకూ అనాలి
మెదడును మైలురాయిగ
నడి తొవ్వల పాతి నందుకు అనాలి
తీరు మార్చుకొమ్మన్నందుకు అనాలి
కాలాంతకులు కలిసి పోయేదాకా అనాలి
ఔనిప్పుడు
పరిశోధనల పుటల నించి
సార్వకాలీన వాక్సిన్
ఆమోదించవలసి ఉన్నది
ఎల్లలన్నీ
చెదిరిపోతయి
మనిషి మూలం
మట్టి ఒక్కటే
మిగిలి ఉంటది
పొడగొట్టుకున్నది ఏదో
దొరి కించుకునే గుర్తు కోసం
దీన్ని కరోనా శకం అనాలి

పుట్టింది నార్సింగి, చేగుంట మండలం మెదక్ జిల్లా. హైదరాబాద్ అల్వాల్ లో ఉంటున్నారు. "మెదక్ జిల్లా రచయితల సాహిత్య కృషి - వివిధ ధోరణులు" అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేశారు. రచనలు 1) ఒక వేకువ కోసం (కవిత్వం ) 2) తెలంగాణ విస్మృత వీరుడు కేవల్ కిషన్ 3) పల్లె పూలవాన బాల్యం బతుకు కథలు 4) అక్షర శిల్పి వేముగంటి 5) గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ మోనోగ్రాఫ్ 6) మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర 7) మెతుకు కథలు (సంపాదకీయం) 8) తొలినాళ్ళ సోయి (సంపాదకీయం) 9) నూరు పూలు నందిని సిధారెడ్డి పీఠికలు (సంపాదకీయం) ముద్రించారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.

Leave a Reply