కరోనా కాలం

పారుతున్న కాలం నదిలో
పాదాలు పెట్టి కూర్చున్నప్పుడు
గడచిన క్షణాలు చేపపిల్లల్లా
అల్లుకుంటాయి చుట్టూ

ఒక్కొక్క చేప పిల్ల ఒక్కో జ్ఞాపకం

గతయేడాది ఒంటరితనాన్ని
నీటమునిగిన మన అస్పష్ట ప్రతిబింబం చుట్టూ
ముసురుకుంటూ పారిపోతుంది నది

యెంత ఒంటరితనం యెంత నిరాశ యెంత దుఃఖం
యెల్లెడలా వ్యాపించిన భీతావహ సామూహిక మృత్యుసాన్నిహిత్యం

అహంకారంతో విర్రవీగిన మనిషిని అనుక్షణం మృత్యువు అంచుల మీద
అసందిగ్ధపుటూయలలో ఊపేసిన
కనబడని శత్రువు

ప్రకృతిపై స్వైరవిహారం చేసిన మనిషికి
ఒంటరితనాన్ని రుచిచూపించి
దురహంకారపు కాళ్ళను
కర్కశంగా నేలకీడ్చిన కఠోర వాస్తవం

ముసుగులూ దూరాలూ లేనిదే
గడియ గడవని
అనునిత్య అపరిచిత స్థితి

సన్నిహితులని ఆప్తులని
ఆరడుగుల దూరం విసిరేసిన,
కరచాలనాలు కూడా కరువైన
కొత్త అంటరాని దుస్థితి

గడియారపు ముండ్ల ఉరికొయ్యలకు వేళ్లాడుతున్న
ఖండాంతర పేదరికపు
జీవన్మృత్యు మూలుగులు
మార్మోగుతున్న అతిదైన్య స్థితి

పూస్తున్న పూలనీ, పాడుతున్న పిట్టలనీ, వీస్తున్న గాలులనీ
మారుతున్న రుతువుల అందాల రంగులనీ
ఆనందించే స్వేచ్ఛకు కనబడని సంకెళ్ళు వేసి

ఎవరికి వారినే బందీలని చేసి
ఒంటరితనపు నిశీధి గహ్వరాలోకి నెట్టేసిన
కరోనా కాలం

వీస్తున్న మృత్యువు సుడిగాలులలకు పండుటాకుల్లా
రాలిపోతున్న శవాలతో ఊపిరాడక విలవిలలాడుతున్న
వర్తమానం
ప్రపంచానికి కొత్తఊపిరులనిచ్చే విజ్ఞాన తీరం కోసం
వెతుక్కుంటున్నది –

కనబడని వేనవేల కోరలతో దాడిచేస్తున్న
మృత్యువునుండి కాపాడి
కొత్త కాలాన్ని ఆవిష్కరించే విజ్ఞానాన్ని

ద్వేషపు దురహంకారపు పొరలు తొలగిన
మనిషొక్కడే ఆవిష్కరించి
కాలాన్ని
కొత్త తీరానికి మళ్లించగలడు.

పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.

22 thoughts on “కరోనా కాలం

  1. నిశీధి గహ్వారా లోకి నెట్టేసిన కరోనా కాలం

  2. సమకాలానికి సరిపడే చక్కని కవిత్వం. గుండె విరిచే బాధలోఅయిన పెన్నుతో హృదయాన్ని కదిలించడం కవికి మాత్రమే సాధ్యం.

  3. చాలా బాగుంది .
    కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉజ్జ్వల భవిష్యత్తులోకి ముందుకు సాగుదాం

  4. కవిత బాగుంది స్వామీ. ద్వేషం, దురహంకారపు పొరలు తెలగి పోవాలి!

  5. అద్భుతం సర్. ఒక్కో పంక్తి లో గాఢత, వైవిధ్యం, ఆవేదన, అంతర్మధనం, నవ్యత తొణికిసలాడుతుంది.

Leave a Reply