కరోనాతో జానపద కళాకారుల కష్టాలు

తెలంగాణాలోని జానపద కళలు గ్రామాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ తమ కళను ప్రదర్శించేవి. కరోనా కారణంగా ప్రదర్శనలు లేక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఈ కళారూపాల కళాకారులు సంవత్సరంలో సంచారం చేసే నాలుగు నెలలు, కరోనా తో లాక్ డౌన్ పెట్టడం, ఇప్పటికీ ఇంకా అదే వాతావరణం ఉండటంతో కళాకారుల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. ఆశ్రిత జానపద కళారూపాలు ప్రతి సంవత్సరం ఎండాకాలం ప్రారంభంలోనే వారి వారి కట్టడి గ్రామాలకు లేదా హక్కు గ్రామాలకు వెళ్లి సంవత్సరానికి సరిపోయే ఆర్థిక వనరులను, ప్రదర్శనల ద్వారా సమకూర్చుకుంటాయి. అసలే కళారూపాలకు ఆదరణ లేక ఇప్పటికే కొన్ని కళారూపాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని అంతరించే దశలో ఉన్నాయి.ఆయా కళారూపాలు అంతరించి పోవడం తో వాటి సంస్కృతితో పాటు మౌఖిక సాహిత్యం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఆశ్రిత జానపద కళారూపాల్లో కూనపులి, సాధనా శూరులు, గౌడ శెట్టి, బీరన్నలు,ఒగ్గు,కొమ్ము,గోత్రాల వారు, తెర చీరలు, కూనపులి సాధనా శూరులు మందెచ్చుల, కాకి పడగలు, అద్దపు పటం కథ, మాసయ్యపటంకథ, శారద గాళ్ళు, బండారు భక్తులు, గోంధళీలు,చిందు యక్షగానం,డక్కలిపటంకథ, గుర్రపు పటం కథ, ఏ నూటి పటం కథ, మిత్తిలి, పంబ, బైండ్ల, నులక చందయ్యలు,రుంజ. గిరిజన కళా రూపాల్లో తోటి‌, డోలి, పట్టెడ, భాట్స్, పర్ధాన్, కొర్రాజుల పటం కథ,తోటి బుర్ర మొదలైన కళలు తెలంగాణ రాష్ట్రంలో మనుగడలో ఉన్నవి. ఈ కళా రూపాలన్నీ ఒక కులానికి మాత్రమే పరిమితమై ఆ కులం యొక్క కుల పురాణాన్ని గాని,లేదా గోత్రాలను గాని కీర్తిస్తూ మనుగడ సాగిస్తున్నవి. ప్రతి సంవత్సరం తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన కట్టడి గ్రామాలు లేదా హక్కు గ్రామాలకు బయలుదేరి ఆయా కులాలను సందర్శించి తమ కళను ప్రదర్శిస్తారు.

కళాకారులు కట్టడి గ్రామాలకు వెళ్లగానే ఆయా కులాల పెద్దమనుషులను కలిసి త్యాగం నిర్ణయించుకొంటారు. కుల పెద్దలు ఏర్పాటు చేసిన వసతి లో ఉంటూ,వారిచ్చే నిత్యావసర వస్తువులతో వంట చేసుకుంటూ తాము ప్రదర్శించే అంశాన్ని కులం సూచించిన ప్రదేశంలో వేదిక నిర్మించుకొని ప్రదర్శిస్తారు. ఇది ఆ కళారూపానికి పోషక కులంతో ఉన్న సంబంధం.ఇది తరతరాలుగా వస్తున్న నియమం.ఈ నియమాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ వస్తున్నారు కళాకారులు. తమకు తరతరాలుగా సంక్రమించిన సంస్కృతి తమకు కడుపు నింపకపోయినా, ఆత్మ గౌరవం కోసం ఈ వృత్తినే నమ్ముకొని జీవిస్తూ వస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రదర్శన పూర్తి చేసిన తర్వాత ఆయా దేవతలకు బలి కార్యక్రమం చేస్తూ, ఆ కులం శ్రేయస్సును ఆకాంక్షిస్తారు. అలాగే గ్రామంలో ఆ కులం ఐక్యతకు తమ సాంస్కృతిక నేపథ్యం దోహదం చేస్తుంది.

కళాకారులు తమ హక్కు గ్రామాల్లో రాత్రయితే తాము చెప్పే కథాంశం లోని రాజులు, రాణులు, దేవతలు,రాక్షసుల వేషాలు కట్టి అలరిస్తూ పొట్ట పోసుకునే కళాకారులు, కరోనా కారణంగా ఒక్కసారిగా వారి కళాత్మక జీవితం చీకటి కమ్మింది. గంటల కొద్దీ, రోజుల కొద్దీ కథా గానం చేసే కళాకారుల గొంతు మూగబోయింది. రంగస్థలం మీద తమ ప్రదర్శనతో నవరసాలను పలికించే కళాకారులు నేడు వారి జీవితంలో దుఃఖం మాత్రమే మిగిలిపోయింది.దగదగ మెరిసే కిరీటాలు, భుజకీర్తులు,ఆకర్షణీయమైన రంగులు అలంకరించుకునే కళాకారులు ప్రస్తుతం అందరితో పాటుగా మాస్కులు కట్టుకొని వారి వారి సొంత గ్రామాల్లోనే, ఎటూ కదలలేని స్థితిలో ఉన్నారు.

కరోనా మహమ్మారి సరిగ్గా ఆశ్రిత జానపద కళారూపాలు గ్రామాల మీదికి సంచారం చేసే సమయంలోనే రావడంతో కళాకారులు సంచారం చేయడానికి మానుకున్నారు. కొందరు అప్పటి వరకే గ్రామాల మీదికి వెళితే తిరిగి ఇంటికి వచ్చేశారు. సమాజంలోని ఇతర వర్గాలతో పాటు గా ఇది జరిగినప్పటికీ, కళాకారుల పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది. కళాకారులు గ్రామాల్లో సంచారం చేస్తేనే జీవనభృతి దొరుకుతుంది.ఇంతకుముందు గ్రామాల్లో ప్రదర్శించడానికి వెళ్లిన బృందం కథలు చెప్పక పోయినప్పటికీ హక్కుగా గ్రామంలో త్యాగం స్వీకరించి తిరిగి మరో గ్రామానికి వెళ్లే వారు. ఒకవేళ ప్రదర్శించ మంటే ప్రదర్శించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రదర్శన అవకాశాలు లేకపోవడంతో దీంతో కళాకారుల వస్తువులు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ప్రదర్శనలో మారుమ్రోగే మద్దెల, నగారా, డక్కీ,డోలు, కిద్దీ, వంటి చర్మ వాద్యాలు బూజు పట్టుకుపోయి చర్మాలు ముడుసుకుపోతున్నాయి. కీకిరి, మెట్ల కిన్నెర, తంబూరా వంటి తంత్రీ వాద్యాల తీగలు సిలుంబట్టీ తెగిపోతున్నాయి. నాలుగు పాటలు పాడితే కడుపునిండే కళాకారులు ప్రస్తుతం ఖాళీ సమయంలో వేరే పని చేయలేక కొందరు షికారుకెళితే,మరికొందరు ఏమీ చేయలేక తిప్పలు పడుతున్నారు. ఇక మరి కొందరైతే తమ ఇంటి ఆడవారు కూలీపని చేస్తే ఆ కూలీ డబ్బులతో జీవనం గడుపుతున్నారు. ఈ పరిస్థితి జానపద కళారూపాలకే కాకుండా గిరిజన కళారూపాలు కూడా ఉంది.

ఆశ్రిత జానపద కళారూపాల్లో ఒక్కో బృందం ఒక్కో రకంగా కరోనా కారణంగా కష్టాలు అనుభవిస్తున్నారు. రజకులను ఆశ్రయించి మడేలు పురాణం చెప్పే మాసయ్య లు ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు, నల్లబెల్లి, గణపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. వీరు ఈ సంవత్సరం కోరుట్ల ,జగిత్యాల, మెట్టుపల్లి, ఇనుగుర్తి, పెద్దకొడపాక వంటి గ్రామాల్లో మడేలయ్య గుడి కట్టడంతో అక్కడ కథ చెప్పే అవకాశం వీరికి ఉండేది. కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల వీరి అవకాశాలన్నీ వాయిదా పడటం తో తాము ఆర్థికంగా బాగా నష్టపోయామని కళాకారుడు బోనగిరి సంగయ్య మాటల్లో తెలుస్తున్నది. అంతేకాకుండా గ్రామాలకు వెళ్లి కథలు చెప్పకుండా కరోనా కారణమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వీరి బృందం కళాకారులు ఖాళీగానే ఉంటూ గడుపుతున్నారు. ఈ బృందం కూడా తెలంగాణలో ఒకే ఒక బృందం మనుగడలో ఉంది. ఈ కరోనా కారణంతో ఈ కళారూపం మనుగడ కూడా ప్రశ్నార్ధకంగా తయారైందని కళాకారులు వాపోతున్నారు.

కాపుల గోత్రాలను కీర్తిస్తూ భాగోతాలు ఆడే కళాకారులు గోత్రాల వారు. వీరికి కూడా కట్టడి గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలకు ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్లి ఆయా గ్రామాల్లో కాపుల గోత్రాలు కీర్తిస్తూ భాగవతాలు ఆడతారు. ఈ కళాకారులు కూడా కరోనా కారణంగా తమ కట్టడి గ్రామాలకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి మిగతా కళాకారుల మాదిరిగానే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కరోనా కంటే ముందు అక్కడ అక్కడ ప్రదర్శనలిస్తూ వచ్చారు. కరోనా వచ్చిందని తెలియగానే గ్రామస్తులంతా వారిని వెళ్ళిపొమ్మని అనడంతో,వారి వారి సొంత గ్రామాలకు చేరుకున్నారు.ఆయా గ్రామాల్లోనే కళారూపానికి చెందిన సామాన్లు ఉంచుకొని వచ్చేశారు.ఎండాకాలం నాలుగు నెలలు కష్టపడితే, తమ బతుకులకు ఊరుట దొరుకుతుందని ఆశించిన కళాకారుల మీద కరోనా తమ కడుపు కొట్టిందని, అంతేకాకుండా ఈ సంవత్సరం అధికంగా వర్షాలు కురవడంతో అంతంతమాత్రంగా ఉన్న కొందరి కళాకారుల ఇండ్లు కూడా కోల్పోయాయని సిద్దిపేట జిల్లా ఇబ్రహీం నగర్ కు చెందిన కళాకారుడు కొంకుళ్ల సంతోష్ మాటల్లో తెలుస్తున్నది. ఈ సంవత్సరం ప్రదర్శనలు లేక దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుందని కళాకారులు వాపోతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే ఒకే ఒక్కడు కూనపులి కళాకారుడు.వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన రమేష్ గత సంస్కృతికి సాక్షీభూతంగా నిలిచిన వాడు. తెలంగాణ రాష్ట్రంఉత్తమ జానపద కళాకారునిగా సన్మానించి గౌరవించింది. అయినప్పటికీ కరోనా కారణంగా అవకాశాలు లేక అష్టకష్టాలు పడుతున్నాడు. పద్మశాలీలను ఆశ్రయించి మార్కండేయ పురాణాన్ని పటం ఆధారంగా కథాగానం చేస్తాడు.ఈ కళారూపానికి ఆదరణ లేక పోయినా, కళారూపాన్ని బతికించుకుందామనే తాపత్రయంతో మనుగడ సాగిస్తున్నాడు. ఇదే సమయంలో అధిక వర్షాల కారణంగా తాను ఉంటున్న ఇల్లు కూడా కూలిపోయింది.తన నాలుక మీద కొలువై ఉన్న సరస్వతి కడుపు నింపడం లేదని దాతల ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నానని రమేష్ మాటల్లో తెలుస్తున్నది.

మరొక కళారూపం ఏనూటి కళారూపం. గౌడ వారిని ఆశ్రయించి పటం ఆధారంగా గౌడ పురాణం కథాగానం చేస్తారు. రాష్ట్రంలో ఒకే ఒక బృందం వరంగల్ రూరల్ జిల్లాలో ఆకుల ఏకాంబరం బృందం. ఒక గ్రామం కళాకారులు కాకుండా వివిధ గ్రామాలనుండి కళాకారులను సమీకరించు కొని బృందంగా ఏర్పడ్డారు. ఈ కళారూపం కూడ అవసాన దశలో ఉన్నది. కళాకారులు కూడా ఈ కళారూపాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. ఈ కళాబృందాన్నికూడా కరోనా వదిలిపెట్టలేదు ఈ బృందం వారంతా ఆర్థికంగా లేకపోవడం,పైగా ప్రదర్శనా అవకాశాలు కూడా లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని , ఎవరైనా దాతలు ప్రదర్శన అవకాశం కల్పిస్తే ప్రదర్శించి,మా పొట్ట నింపుకుంటామని, బృంద నాయకుడు ఆకుల ఏకాంబరం మాటల్లో వినిపిస్తున్నది. ఈ కళారూపాలే, కాకుండా మిగతా కళారూపాల పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది.

ఆశ్రిత జానపద కళారూపాలే కాకుండా ఇంటింటికి తిరిగి ప్రదర్శించే గంగిరెద్దుల, కాటిపాపలు,పెద్దమ్మలు, బాలసంతు,తుపాకి రాముడు మొదలైన కళారూపాల కళాకారులు కూడా తమ కళా నైపుణ్యంతో గ్రామాల మీద ఆధారపడి జీవించేవారు.కానీ ప్రస్తుతం వారి బతుకు అగమ్యగోచరంగా తయారైంది.అత్యంత జాగ్రత్తగా ఎవరింటి దగ్గర వారే ఉంటూ కరోనా బారిన పడకుండా రక్షించు కుంటున్న ప్రజలు, ఇంతకు ముందు కళారూపాలను ఆదరించి నట్టుగా ప్రస్తుతం ఆదరించే పరిస్థితి లేదు. ఇంటి ముందుకు కాదు కదా,గ్రామంలోకి కొత్త వ్యక్తులు వస్తేనే ఆశ్చర్యంగా చూస్తూ,కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో కళారూపాల మనుగడ ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

దేశంలో కరోనా మొదలైన దగ్గరి నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిలిపి వేయడం జరిగింది. ఈ కారణంగా ప్రభుత్వ పరంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే జానపద కళారూపాలకు కూడా అవకాశాలు లేకుండా పోయాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా ప్రదర్శనలు ఇచ్చే అవకాశాలు కూడా కళాకారులు కోల్పోయారు.సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళా బృందాలు కూడా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అందించే అవకాశం కోల్పోయి ఆర్థికంగా నష్టపోయాయి.

జానపద కళారూపాల ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రభుత్వపరంగా జానపద కళారూపాల కళాకారులను ఆదుకుంటారని ఎదురు చూస్తున్నారు.కళారూపాల మనుగడ సంచారం మీదనే ఆధారపడి ఉంటుంది. కరోనా మహమ్మారి కళాకారులు సంచరించకుండా అడ్డుకట్ట వేసింది. అన్ని వర్గాల ప్రజలను కరోనా చిన్నాభిన్నం చేసినప్పటికీ అందులో జానపద కళాకారుల బతుకులను ఇంకా చిధ్రం చేసిందనే చెప్పొచ్చు. కరుణవల్ల కళాకారులమే ఎక్కువగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని జానపద కళారూపాల కళాకారులను గుర్తించి మాకు ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటున్నారు.సంవత్సరంలో కళాకారులకు నాలుగు నెలలు చాలా విలువైనవి. ఈ విలువైన నాలుగు నెలలు కరోనా దెబ్బ తీయడంతో, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని ఇప్పటికీ గ్రామాల్లో ఇంకా ప్రదర్శనలు ఇచ్చే వాతావరణ లేకపోవడంతో తమ బతుకులకు దేవుడే దిక్కు అంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జానపద కళాకారులను గుర్తించి ఆర్థిక సహాయం అందించాలని కళాకారులు వేడుకుంటున్నారు.

పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం పై కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లు కేంద్రంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, పీఠం ప్రచురించిన పరిశోధనాత్మక గ్రంధాల్లో సహ సంపాదకులుగా, సంపాదక మండలి సభ్యులుగా వ్యవహరించాడు. జానపద గిరిజన విజ్ఞాన అధ్యయనంపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

2 thoughts on “కరోనాతో జానపద కళాకారుల కష్టాలు

  1. చాల బాగ రాశారు సార్. కరోన వల్ల కళకారులవి చితికిన భతుకులు అయినాయి సార్
    *తాళ్ళ వేణు గోత్రాల*
    గోత్రాల కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
    9533 230 230

  2. మా సంచార జాతుల ప్రస్తుత పరిస్థితి గురించి కళ్ళకు కట్టినట్టు గా రాసారు, ధన్యవాదాలు సర్, ప్రభుత్వం కు సంచార జాతుల మీద కపట ప్రేమ చూపిస్తుంది, పేరుకు మాత్రం బడ్జెట్ లో డబ్బులు కేటాయించడం, ఆ డబ్బులు మాత్రం అలాగే వదిలేయడం, ఇంత దుర్భర పరిస్థితులు దృష్ట్యా ప్రభుత్వం మా సంచార ఆశ్రీత కులాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాము

Leave a Reply