కరుణాకర్… ఓ విప్లవ చైతన్యం

కామ్రేడ్ కరుణాకర్ లేకుండా నెల రోజులు గడిచిపోయింది. ఆయన లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము. ఆయనతో మాట్లాడకుండా, ఒక్క మెసేజన్నా చేయకుండా ఇంత కాలం ఎప్పుడూ ఉండలేదు. చివరి క్షణాలలో ఝాన్సక్క, చిన్నారిలతో పాటు నేనూ ఉండడం వల్ల ‘మరణించినది నిజమే కదా!’ అని ముదాయించుకోవాల్సి వస్తుంది.

కరుణాకర్ గారితో నాది విప్లవ భావజాల సంబంధం. 1991లో మొదలైన పరిచయం, పెరిగి పెరిగి కొంత కాలానికి ఆయన వ్యక్తిగత జీవితంలో నాకూ ఒక ఆత్మీయమైన చోటు దొరకడం నేనెన్నెటికీ మరిచిపోలేనిది. ఆయన అభిమానించే మిత్రులలో నేను కూడా ఉండడం నాకు అత్యంత సంతోషకరమైనది. కరుణాకర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి సమీక్షకుడు. విద్యారంగంపై సునిశిత అవగాహన గల మేధావి. ఏ సమస్యనైనా మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషిస్తారు. ఒక సంఘటన మీదో, సమస్య మీదో మనం ఎంతో కొంత అవగాహన ఏర్పరుచుకుంటాం కానీ, కరుణతో మాట్లాడాక, ఆయనతో ఏకీభవించినా లేక విభేదించినా సరే, మన అవగాహన విస్తృతమవుతుంది. అందుకే ఆయనతో ఒక సారి పరిచయం అయిన వాళ్ళెవరయినా అంత తొందరగా ఆయన్ను మర్చిపోలేరు.

1969 లో జన్మించిన కరుణాకర్ స్వగ్రామం ప్రకాశం జిల్లా, జె. పంగులూరు మండలం కొప్పెరపాడు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా అనేక ప్రాంతాల్లో పనిచేసి చివరకు పమిడిపాడులో రిటైర్ అయి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కరుణాకర్ కి మూడు నెలల వయసులో పోలీయో రావడంతో తల మినహా శరీరమంతా చచ్చుబడిపోయింది. తల్లిదండ్రులు దేశంలోని అనేక ప్రాంతాల్లో వైద్యులకు చూయించి పద్నాలుగు ఆపరేషన్లు చేయించినా తనను స్వయంగా నడిచేస్థితికి తీసుకురాలేకపోయారు. కరుణాకర్ బాల్యంలో స్కూలుకు కూడా వెళ్ళలేదు. అలా స్కూలుకు వెళ్లే పిల్లల వైపు చూస్తూ ఉండేవాడు. నాలుగేళ్లప్పుడు కరుణాకర్ వైద్యం కోసం గోవా కు తీసుకువెళ్ళారు. అక్కడ హాస్పటల్లో కరుణతో వాళ్ళమ్మను వుంచి తండ్రి ఇంటికి వచ్చాడు.

కరుణాకర్ కు వైద్యం చేస్తున్న డాక్టర్ కు ఆశ్చర్యపోయే దృశ్యం ఒకటి కంటపడింది. ఒక పేపరు మీద ఒక పిల్లవాడు మంచం మీద పడుకొని ఉంటాడు. అతని కాలు పైకి లేపి ఉంటుంది. స్టాండు అవతలగా ఒక ఇసుక మూట ఆ కాలుకు వేలాడదీసీ ఉంటుంది. ”ఇది ఎవరు వేశారని” డాక్టర్ అడిగితే ”నేనే వేశానని” మెరిసే కళ్ళతో కరుణాకర్ చెప్పాడు. తాను ఉన్న స్థితినే కరుణాకర్ తన బొమ్మగా గీశాడు. కరుణ ప్రతిభ కు ఆ డాక్టర్ ఎంతో సంతోషపడి నువ్వు చాలా గొప్పోడివి అవుతావురా! అని మెచ్చుకున్నాడట. డాక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి భాస్కరరావు సంతోషపడ్డాడు.

”నేను ఊరికి పోతున్నా కరుణా… వచ్చేటప్పుడు నీకేం కావాలని” తండ్రి అడిగితే… యాపిల్ కాయలు, మామిడి కాయలు చిరుతిళ్ళు గురించి కరుణ ఎప్పుడూ అడగలేదట. ”తెల్ల పేపర్లు, పెన్సిళ్ళు బొమ్మల పుస్తకాలు తెమ్మని” కోరేవాడు. పిల్లోడికి బొమ్మల పట్ల ఉన్న ఆసక్తిని, సహజ సామర్థ్యాన్ని గమనించిన తండ్రి భాస్కర్ రావు గారు బొమ్మల పుస్తకాలు, కావాల్సిన పెన్నులు, పెయింటింగ్ లు సమకూర్చేవాడు. బందాడే వయసులో కరుణ వాళ్ళమ్మమ్మ దగ్గర నాటు వైద్యం కోసం ఉన్నాడు. కాళ్ళకు పుళ్ళు పడేలా బంతాడేవాడట.

అమ్మమ్మ బొగ్గుతో నేలమీద రాసిన అ, ఆ లే కరుణ కు మొదటి అక్షరాభ్యాసం. అలా‌ స్కూలుకు పోకుండా తమ ఇంటి దగ్గరే ట్యూషన్ పిల్లలతో కలిసి కరుణ కూర్చొనేవాడు. ట్యూషన్ మాస్టర్ ఇచ్చే చిన్న చిన్న లెక్కలు ద్వారా, రోజూ ఇంటికి వచ్చే తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు చదవడం ద్వారా కరుణాకర్ ప్రాధమిక విద్యాభ్యాసం మొదలైంది. అలా చదువు కొనసాగిస్తూ… మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. తరువాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా డిగ్రీ చేసి, బి.ఇడి పూర్తిచేసి టీచరయ్యాడు. కొన్నాళ్లకు ఎం. ఏ, కూడా చేశాడు. కరుణాకర్ గారికి ఇంగ్లీష్ మీద పట్టు ఉండడంతో అనేక అనువాదాలు చేశాడు. చిత్రకారుడుగా, కార్టూనిస్ట్ గా సమీక్షకునిగా, విమర్శకులుగా, అనువాదకుడిగా ప్రసిద్ధి చెందాడు. వీటన్నింటికంటే ముఖ్యంగా ఉపాధ్యాయుడిగా పిల్లలతో కలిసిపోవడం, వాళ్ళ మానసిక స్థితులకు అనుగుణంగా, కుల, వర్గ నేపధ్యాలను పరిగణన లోకి తీసుకుంటూ .. గొప్ప ప్రేమతో , వ్యక్తిగత శ్రద్ధతో వాళ్ళను అక్కున చేర్చుకున్న తీరు మరువలేనిది. మరోవైపు తాను పనిచేసిన స్కూలు లో సాంస్కృతిక కార్యక్రమాలు భిన్నంగా ఉండేవి. స్వతహాగా తాను మార్క్సిస్టు కావడం, అందునా విప్లవాభిమాని కావడం చేత ప్రజా గాయకుల పాటలే మొత్తం ఆ ప్రోగ్రామ్స్ లో ఉండేవి.

‘జోలాలీ పాడాలీ….’, ‘నిండు అమాసనాడు ఓ లచ్చగుమ్మడీ… ‘, ‘మదమోహం పెరిగిన మృగాళ్ల వేటలో….’ ఇలాంటి పాటలు అచ్చం అమ్మాయిలతో పాడిస్తూ…. అబ్బాయిల చేత డప్పు, డోలక్ లు వాయింపజేసేవారు. ‘కొండలు పగలేసినం బండలను పిండినం…’, ‘అడవి తల్లీ కి దండాలో…’, ‘ఏ కులమబ్బీ మా దేమతమబ్బీ…’ ఈ పాటలకు నృత్య రూపకాలు పిల్లల చేత అద్భుతంగా చేయించేవారు.

ప్రకాశం జిల్లా, కొరిశపాడు మండలం, దైవాలరావూరు హైస్కూలు నుండి ఈ విద్యార్థి బృందం జిల్లాలో, రాష్ట్రంలో ప్రదర్శనలు చేసి ఢిల్లీలో జాతీయ స్ధాయి ప్రదర్శనల్లో పాల్గొని వచ్చింది. పిల్లల చదువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేవారు. తాను ప్రత్యేక క్లాసులు తీసుకొని, మిగతా ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచేవారు. తమ స్కూలు నుండి ఏ ఒక్క విద్యార్థి ‌ప్రవేటు స్కూలు వైపు చూడకపోగా, ఉత్తమ ఫలితాలు సాధించి ప్రైవేటు స్కూలు విద్యార్థులే ప్రభుత్వ స్కూలు వైపు మళ్ళేలా చూశారు. అలా తాను పని చేసిన ప్రతి చోట ఒక చాలెంజ్ గా ప్రభుత్వ స్కూలు విద్యార్థుల ప్రతిభను బయటకు తీసి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చేసేవారు. పిల్లల కోసం లైబ్రరీకి కథల పుస్తకాలు తెప్పించి చదివించే వాడు. ఊరికే చదవడం మాత్రమే కాదు, చదివిన తర్వాత ఆ కథ మీద వాళ్ళ స్పందన (సమీక్ష) రాయించేవారు. స్కూల్లో గాని, ఇంటి దగ్గర గానీ కరుణాకర్ గారి చుట్టూ ఎప్పుడూ పిల్లలే! సందడి సందడిగా ఉంటుంది. ఇక సాహిత్యకారునిగా, విప్లవాభిమానిగా, పౌర హక్కుల సంఘం లో నాయకునిగా ఉన్నారు.

విరసం ‘అరుణతార’ కు, పి.వో.డబ్యు ” ‘మాతృక’ కు ఎన్నో కవరు పేజీలు, లోపల కథలకు అర్ధవంతమైన, అద్భుతమైన బొమ్మలు వేశారాయన. మరెన్నో పిల్లలు కథల పుస్తకాలకు కవరు పేజీలు, బొమ్మలు వేశారు. కొత్త కథకులకు కావాల్సిన మెళకువలు నేర్పాడు. విప్లవోద్యమం మీద భావజాల దాడిని, ప్రత్యేకంగా, పరోక్షంగా (సోషల్ మీడియాలో) దీటుగా ఎదుర్కొని జవాబులు ఇచ్చేవాడు. ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తుల మీద, సంస్థల మీద దాడి జరిగితే తీవ్రంగా ఖండించే వాడు. వాళ్ళు భౌతికంగా దూరమైతే అల్లాడిపోయేవాడు. తనకు అందుబాటులో వున్న ప్రజా సంఘాలకు తన సహాయ, సహకారాలు అందించడమే కాదు. తాను ఆ సంఘాల సభల్లో పాల్గొనేవాడు. ప్రభుత్వ ఉద్యోగిగా గల పరిమితుల నడుమనే ఆయా సభల్లో సందేశం ఇచ్చేవాడు. ఒక్కోసారి అందరికీ ఆశ్చర్యం వేసేది. కరుణ కు ఇంత దైర్యం ఎక్కడిదని. భిన్న భావాజాలాలు కలిగిన వ్యక్తులతోనూ సహనంగా సంభాషించేవాడు. స్కూల్లో వుంటే పిల్లలతో, ఇంటికి వస్తే సాహితీ మిత్రులతో..ఎక్కడెక్కడ నుంచో ఎంత మందో మిత్రులతో ఫోనుమీద సుదీర్ఘ సైద్ధాంతిక చర్చలూ సంభాషణలతో..ఇరవైనాలుగ్గంటలూ సరిపోని దిన చర్య తనది. తన విద్యార్థులలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలే.

ప్రైవేటు క్లాసుల కోసమో, తాము చేరబోయే పై క్లాసులకై సలహాల కోసమో, ఆన్ లైన్ అప్లికేషన్ కోసమో వచ్చేవాళ్ళు. విసుగు, అలసట తెలియకుండా, కూడు, నీళ్ళు పట్టకుండా ఎవరికీ కాదనకుండా తన లాప్ టాప్ ముందు పెట్టుకొని కూర్చొని అందరి పనులూ చేసిపెడుతూండేవాడు చిరునవ్వు చెదరకుండానే. ఈ మొత్తంలో తనకు సమయమేదని ఆయన సహచరి ఝాన్సీరాణి ఎప్పుడూ అన్నట్లు లేదు. ఆయనతో పాటూ ఆమె కూడా. ఆయన ఆశయం లో మనస్ఫూర్తిగా భాగమామె. పనిలో మునిగి ఉండే కరుణకు అన్నం కలిపి పెట్టేది ఝాన్సీ. కబుర్లూ నవ్వులూ చతుర్ల మధ్య పని ఆగకుండానే ఆయన భోజనమైపోయేది.

2021 జులై మొదటి వారంలో ఝాన్సీ కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ అప్రమత్తమై హోం క్వారెంటైన్ లోకి వెళ్లారు. వీళ్ళకు సాయంగా ఝాన్సీ వాళ్ళమ్మ వుంది. పది రోజులు గడిచాయి. కరుణాకర్ కి పాజిటివ్ రానందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఝాన్సీ కి కోర్సు పూర్తవుతుంది. ఈ పది రోజులుగా ఇంట్లో వున్నా ఫోనులో మాట్లాడుకోవడమే గానీ, ప్రత్యక్షంగా చూసుకున్నదిలేదు. ఝాన్సీ గురించి కరుణాకర్ విపరీతంగా ఆందోళన చెందాడేమో! దిగులుతో ఎంత బెంగటిల్లాడో ఏమో! తనకు మొదటి నుండీ వున్న జీర్ణాశయ సమస్య ఎక్కువై విపరీతంగా కడుపునొప్పితో బాధపడ్డాడు. కొడుకు హాస్పిటల్ కి పోదామని బతిమాలినా, ‘ఝాన్సీ లేకుండా వద్దులేరా!’ అన్నాడట. ఆ రాత్రి నొప్పి ఎక్కువై, క్వారెంటైన్లో వున్న ఝాన్సీ బయటకు వచ్చి కరుణను తన ఒళ్ళో పడుకోబెట్టుకోని, కారులో వేకువజామున హాస్పిటల్ కి బయలుదేరారు. క్షణ క్షణానికీ కరుణ పల్స్ లో మార్పు రావడం గమనిస్తూ ఝాన్సీ తల్లడిల్లింది. హాస్పిటల్లో కి వచ్చి డాక్టర్ చేయిపట్టుకొని చూస్తే పల్స్ పూర్తిగా పడిపోయి ఉంది. 18 జులై 2021 వేకువజామున సుమారు 5.30 గంటలకు ఒక విప్లవ చైతన్యం ఈ ప్రపంచానికి దూరమయ్యింది.

కామ్రేడ్ యెనికపాటి కరుణాకర్ కి విప్లవ జోహార్లు.

పుట్టింది ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, చవటపాలెం. తాను ప‌నిచేస్తున్న‌చోట స‌హ‌చ‌ర కార్మికుల జీవితాల‌ను క‌థ‌లుగా మ‌లుస్తున్న‌క‌థ‌కుడు. ప్ర‌స్తుతం మైనింగ్ ఫోర్ మ‌న్ గా ప‌నిచేస్తున్నాడు.

Leave a Reply