కరుణాకర్ ఇప్పుడు ఒక అంతర్ ప్రవాహం


యెనికపాటి కరుణాకర్ జులై 18న ఆరోగ్య కారణాల రీత్యా ఒంగోలులోని ఒక ఆసుపత్రిలో చనిపోయాడు. ఆయనకున్న విస్తృత సామాజిక సంబంధాల వలన ఆయన చుట్టూ ఉన్న సమాజంలో కలకలం, దుఃఖం పొంగి పొర్లాయి. అనేకమంది దిగ్భ్రాంతికి గురి అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన మరణవార్త అనేకుల హృదయాలలో లోతైనా గాయాన్ని, భాదనూ, ఆత్మీయులను కోల్పోయిన లోటునూ కలిగించింది. సామాజిక మాధ్యమాలకతీతంగా ఆయనతో అల్లుకొన్న అనేకానేక ప్రపంచాలు తల్లడిల్లిపోయాయి.

ఇంతకీ ఎవరీ కరుణాకర్? ఈయన ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. 90 శాతం వికలాంగుడు. మెదడు, నోరూ తప్ప మిగిలిన అన్ని భాగాలలో శారీరక వైకల్యం ఉన్నవాడు. 51 సంవత్సరాలు మాత్రమే బతికి కరుణాకర్ అనేక ప్రజా సమూహాలలో చెదరని ముద్ర వేశారు. భౌతిక వారసత్వంగా ఒక కొడుకునే సమాజానికి యిచ్చినా, అంతకు మించి వందరెట్ల ప్రజా సాంస్కృతిక, ప్రజాస్వామిక వారసత్వాన్ని తన ఆత్మీయ సమూహాలకు పంచి వెళ్లాడు. జవజవలాడే నవ యవ్వన ఆలోచనా ధోరణులను అందచేసి వెళ్లాడు. ఆయనకున్న సమూహాలలో ఆయన విద్యార్ధులు ఉన్నారు, సాహిత్య సృష్టికర్తలు ఉన్నారు, మంచి సినిమా ప్రేమికులు ఉన్నారు, కార్టూనిష్టులు ఉన్నారు. వివిధ ప్రజా రంగాల్లో పని చేసేవాళ్లూ, హక్కుల కార్యకర్తలు, ప్రజా కళాకారులు, కమ్యూనిష్టులు కూడా ఆ సమూహాల్లో ఉన్నారు. అంతే కాదు ఆయన అమితంగా ప్రేమించే అణగారిన విస్తృత ప్రజారాశి కూడా ఉంది. అందరికీ భర్తీ చేయలేని లోటు చేసి కరుణాకర్ మరణించారు.

వైకల్యం మనిషి కదలికలను నిర్దేశిస్తుంది. ఇతరుల మీద భౌతికంగా ఆధారపడేటట్లు చేస్తుంది. ఈ ఆధారపడటం భౌతికంగానే కాదు. వాళ్ల ఆలోచనా పరిధిని కూడా కుదిస్తుంది. ఆత్మన్యూనతను కలిగించి మితమైన జీవితానికి పరిమితం చేస్తుంది. వైకల్యం, వృద్ధాప్యాల అశక్తతను అర్థం చేసుకొని తమలో కలుపుకొనే ఆరోగ్యకరమైన సమాజం కాదు మనది. అయితే కరుణాకర్ ఈ పరిమితున్నిటిని జయించాడు. తన సొంత ప్రపంచాన్ని తానే సృష్టించుకొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని నాణ్యంగా తానే నిర్మించుకొన్నారు. ఆ ప్రయత్నంలో, తనకు అప్పటిదాకా అన్ని అమర్చిపెట్టే తల్లిదండ్రుల మాట కూడా వినలేదు. ఇంటా బయటా పోరాటం చేశారు. వైకల్యం ఆయన ప్రాణం తీసుకొనే దాకా, అది కరుణాకర్ ని చూసి భయపడి పారిపోయింది.

కరుణాకర్ ఎంచుకొన్న జీవితం ఎలాంటిది? ఆయనకున్న జీవన వనరులతో ఆయనకు కాలు మీద కాలు వేసుకొని బతికే అవకాశం ఉండింది. కులపరమైన ప్రివిలేజ్ ఆయనకు సమాజంలో ఆధిపత్య స్థానం ఇచ్చింది. వైకల్యం అనే అణగారిన అస్తిత్వం తప్ప ఆయనకు ఎలాంటి దురవస్థ లేదు. కానీ ఆయన తనకున్నలాంటి సమస్త ఇతర పీడనలను అర్థం చేసుకోని; కాళ్లకిందటి పదిలమైన, మెత్తటి సుఖవంతమైన స్థలాన్ని వదిలి ప్రజల్లో పడ్డారు. ఆ ప్రయాణం హక్కుల ఉద్యమంతో మొదలైయ్యింది. 90ల కాలంలో అతి ప్రమాదకరంగా ఉన్న హక్కుల ఉద్యమంలో సగం శరీరంలో సరైన చలనం లేని కరుణాకర్ పాలు పంచుకొన్నారు. ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల ఉద్యమంలో సభ్యుడయ్యాడు. ఆ ఉద్యమపు తాత్విక చింతనలలోనూ, కార్యక్షేత్రంలోనూ తలమునకలయ్యాడు.

అప్పుడే జీవిత పోరాటం కూడా ప్రారంభం అయ్యింది. జేబులో ఉన్న అణాకాణితో ఝాన్సీ చెయ్యి పట్టుకొని అలవోకగా కన్న కుటుంబాన్ని వదిలేశాడు. తను నడవబోతున్న దారిని తానే చదును చేసుకొని పయనం మొదలు పెట్టాడు. ఒడిదుడుకులు తట్టుకున్నాడు. మెట్ల గురించి ఆయన రాసిన కవితలో తాను మెట్లు ఎక్కలేనని రాసుకొన్నారు కానీ, ఆయన ఎక్కిన మెట్లు ఒకటి రెండూ కావు. ఆకాశానికి మెట్లు వేసి ఒక్కొక్క మెట్టు ఎక్కారాయన. నిరంతర అధ్యయనం, బోధన, పుస్తక పఠనం, చర్చలకు, స్నేహాలకు ఆ ఇల్లు కేంద్రం అయ్యింది. తను చేయలేని పనులను చేయగలిగే మానవ, మేధావనరులను తన చుట్టూ చేర్చుకొన్నారు. ఒక పొద్దున్నేకరుణాకర్ నుండి ఫోన్ వస్తుంది, లేక ఫేస్ బుక్ పోస్ట్ వస్తుంది, ‘వలస కార్మికులు, చీమకుర్తి నుండి బయలుదేరారు. వాళ్లకు దారిలో తిండి, మంచి నీళ్ల వసతి ఏర్పాటు చేయగలరేమో చూడండి’ అంటూ. ఆ మాటలు వచ్చింది కరుణాకర్ నుండి. ఇక అవి చేరవలసిన వారికి చేరితే జరగాల్సిందంతా జరుగుతుంది. అప్పటికప్పుడు వనరుల కోసం అభ్యర్ధనలు వెళతాయి. అవి అన్ని వైపుల నుండి వస్తాయి. పని మొదలై నిర్విరామంగా కొనసాగుతుంది. మాటలు చెప్పి ఊరుకోడు ఆయన. వీల్ చైర్ నడుపుకొంటూ అక్కడకు వచ్చేస్తాడు -మండుటెండలో అయినా, భోరు వర్షంలోనైనా. ఆయన రాలేని నాడు ఆయన సహచరి ప్రత్యక్షమౌతుంది.
ఆయన దగ్గర సిద్దాంతపు ఉగ్గుపాలు పోయించుకున్న వాళ్లు ఎందరో. అది మార్క్సిజం కావచ్చు, సాహిత్య కృషి కావచ్చు, చిత్ర రచన కావచ్చు, అసలు ఏ సంగతి లేని ఊసుపోలు కబుర్లలో కూడా ఎంతో నేర్పించగలిగిన బోధనా మెళకువలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన పాఠాలు వట్టి మాటలుగా తేలిపోయేవి కావు. అవి మెదడును తొలుచుకొని వెళ్లి అక్కడ స్థిరపడి, జీవ శక్తులుగా మారి మనిషిని పనిలోకి దించుతాయి. అంతటి శక్తి, బలం ఉందా మాటలకు. మనసును తొలుస్తున్న అనేక తాత్విక సందేహాలకు ఆయన వద్ద సమాధానాలు దొరుకుతాయి ఎవరికైనా. ప్రతి పని, ఆలోచన దగ్గర ‘ఈ విషయంలో కరుణాకర్ అయితే ఏం చెబ్తాడు’ అనుకొని, అవసరం అయితే ఫోన్ చేసి, అవసరం లేదంటే ఆయన చెప్పేది ఊహించుకొని పనిలోకి దిగి పోవచ్చు. కరుణాకర్ మనను పూనాడంటే -అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అందుకే కరుణాకర్ ప్రేమికులు చాలామంది ఉంటారు.

ఆయన పనిని పిల్లల చదువుల వరకూ పరిమితం చేసి మాట్లాడితే అది పూర్తిగా అసంపూర్ణమే అవుతుంది. ఆయన విద్యార్ధులు కేవలం స్కూలు పిల్లలు కాదు. ఒక్క మాట చెప్పాలంటే ప్రగతిశీల శక్తులు అనుకున్న వారిని ఎవరినీ ఆయన వదలలేదు. వాళ్లు ఆయన్ను వెతుక్కొని వచ్చారో, ఆయనే వాళ్లను వెదికి పట్టుకొన్నారో తెలియదు కానీ, నిరంతర బోధన ప్రక్రియలో ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర చేరి, ఒక్కోసారి దూరంగా ఉండి కూడా, ఆయన పాఠం వినటానికి ఉవ్విళ్లూరే వారిలో వివిధ వామపక్ష నాయకులు, అస్తిత్వ ఉద్యమకారులతో సహా అనేకమంది ఉన్నారు. నేర్చుకోవటం, నేర్పించటం -రెండూ ఏక కాలంలో చేసేవాడాయన. తను మాట్లాడే వాళ్లు ఏ స్థాయి వాళ్లయినా, వాళ్ల నుండి ఆయన పొందాల్సింది పొందాల్సిందే. మనుషులతో నిరంతర సంభాషణ ఆయన జరుపుతాడు. ఆ సంభాషణలలో అవతల వారి భాష్యాన్ని వినడానికే ప్రాముఖ్యత ఉంటుంది. తాను చెప్పదల్చుకొన్నది చెప్పకుండా మాత్రం దానికి ముగింపు ఉండదు. తాత్కాలిక విరామం మాత్రమే ఉంటుంది. ఒక సాయంకాలం కరుణాకర్ నుండి ఫోన్ వస్తుంది. ‘కశ్మీర్ గురించి మీరు రాస్తున్నదీ, చెబుతున్నదీ చాలదు. శాస్త్రీయ పరిష్కారాన్ని కూడా మీరు సూచించాలి’ అని వినబడుతుంది. ఎప్పటి నుండి మనసును ఇబ్బంది పెడుతున్న విషయమే అది. తాననుకొన్న పరిష్కారాన్ని మనకు అందించి ఆయన అక్కడ చిరునవ్వు నవ్వుతాడు. మనం ఇక్కడ స్వాంత్వన చెందుతాము.

ఇదే కాకపోయినా ఇలాంటి అనుభవాలు ఎన్నింటినో అనేకమంది ఆయన సంస్మరణ సభల్లో పంచుకున్నారు. అలా ఎందరికో కరుణాకర్ మార్క్సిస్టు దార్శనికుడు అయ్యాడు. అలాగని తిరోగమన భావజాలం ఉన్న వారి పట్ల ఆయన ఎప్పుడూ ఉదారంగా ఉండలేదు. స్నేహాలనూ, బంధుత్వాలను వదులుకోవటానికి కూడా సిద్ధం అయ్యాడు. ‘ప్రజల్లో పని చేసే వాళ్లు అన్ని రకాల మనుషులను భరించాలి’ అనే తరహా వాదనలు ఆయనకు వర్తించవు. విభేదించే దగ్గర మొహమాటాలు ఉండవు. ఎండగట్టే దగ్గర మాటల పొదుపు ఉండదు. అలా అని శాశ్వత శతృత్వాలు ఎవరితో ఉండవు.

సమాజ ప్రకంపనలను వినగలిగిన, గ్రహించగలిగిన సూక్ష్మ ఇంద్రియ శక్తి ఉన్నదాయనకు. అస్తిత్వ వేదనలను అర్థం చేసుకోవటంలో దిట్ట ఆయన. కులం, మతం, పితృస్వామ్యపు పోకడలు; ఆ పీడనలను అనుభవం పొందిన వారి ఆగ్రహాన్ని ఆయన బాగా ఆకళింపు చేసుకోగలరు. ఆ కోపానికి సముచిత గౌరవం ఇస్తూనే పరిష్కార మార్గాలను మార్క్సిజం వెలుగులో చూస్తారాయన. మార్క్సిజాన్ని విషయాలకు అన్వయించటం ఆయనకు అద్భుతంగా తెలుసు. డోగ్మాటిక్ గా కాకుండా, సాదాసీదా భాషతో చాలా సందర్భాలలో ఒప్పిస్తారు కూడా. అందుకే ఆయన స్నేహాన్ని కోరుకొనేవాళ్లు అన్ని శ్రేణుల్లో ఉంటారు.

కరుణాకర్ మాతృకకు కవర్ పేజీలు వేయటం మొదలు పెట్టాక, మేమిద్దరం అనేక విషయాలు, అనేక గంటలు మాట్లాడుకున్నాము. ఏ సమయంలోనైనా కరుణాకర్ కు ఫోన్ చేసే సౌలభ్యాన్ని ఆ దంపతులు నాకు ఇచ్చారు. మా సంభాషణలో నేను ఎక్కువ శ్రోతగానే ఉండేదాన్ని. ఆయన మాటలు వింటుంటే లోపల ఒక్కో పొర విడిపోయి ఒక స్పష్టమైన మార్గం కనబడేది. మాతృక సంపాదక వర్గ ఆలోచనను విశ్వజనీనం చేసి, చిత్ర రూపం ఇవ్వటంలో కరుణాకర్ సిద్దహస్తుడు. అలా అద్భుతమైన బొమ్మలు కరుణాకర్ కుంచె నుండి మాతృకకు వచ్చాయి. చంద్రబాబు హయాంలో మద్యం వేలంపాటల సందర్భంగా పీవోడబ్ల్యూ ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి పద్మను పోలీసులు అమానుషంగా కొట్టారు. అది సంపాదకీయంగా రాయాలి, కవర్ పేజీ మద్యం అమ్మకాల మీద రావాలని అనుకొన్నాము. కరుణాకర్ కు వివరించాను. మద్యం సీసాకు పోలీసు అవతారం వేసి లాఠీతో మహిళలను కొడుతున్న బొమ్మ వేశాడు. అలాంటి ఎన్నో బొమ్మలతో మాకు సంభ్రమాశ్చర్యాలు కలిగించాడు. మాతృక మేధో టీంలో ఆయన ఉన్నాడు. ఆ పనిని ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించేవాడు. చాలాసార్లు మాతృక కోసం ఒక హాఫ్ డే లీవ్ బడికి తీసుకొనేవాడు. ఒక్కోసారి పత్రిక డిజైనింగ్ వెళ్లాల్సిన చివరి రోజు అర్థరాత్రి దాకా మేలుకొని వేసి, మరుసటి రోజు తన బొమ్మతో నా ఉదయాన్ని సమ్మోహనం చేసేవాడు.
కరుణాకర్ మంచి అనువాదకుడు కూడా. ‘శ్మశాన శాంతి’ పుస్తకం అనువాదం అవుతున్నపుడు ఆయనను ఒక పెద్ద వ్యాసాన్ని అనువాదం చేయమని అడిగాను. తరువాత అంత వ్యాసం అనువాదం టైప్ చేయాలంటే ఆయనకు కష్టం కదా అనిపించింది. ఆ కష్టాన్ని ఆయన అవలీలగా దాటేశాడు. గూగుల్ వాయిస్ ఉపయోగించి టైప్ చేయకుండా తప్పించుకొని, కరెక్షన్స్ మాత్రం చేసి పంపారు. ఆ అనువాదంలో వాడిన సొగసైన తెలుగు నుడికారం ఆహ్లాదపరిచింది. అందులో ఉన్న లీగల్ కంటెంట్ అర్థం చేసుకోవటం కోసం ఆయన కొన్ని బుక్స్ రిఫర్ కూడా చేశాడు. చేస్తున్న పని పట్ల అంత శ్రద్ధ ఉంటాయాయనకు. త్రికరణ శుద్ధి అనే పదం ఆ పనికి విశ్లేషణగా సరిపోతుందేమో. ఆయనలోని సృజనకారుడు చిత్రకారుడి రూపంలోనే కాదు, అప్పుడప్పుడూ కవి రూపంలో కూడా బయటకు వస్తాడు. మనసు నిండిపోయే కవితలు ఇచ్చి పోతాడు. ఆయన సాహిత్య విమర్శ కూడా పదునుగా, సూటిగా, స్పష్టంగా ఉంటుంది. కారాగారి ‘జీవధార’ కథ మీద ఆయన రాసిన సమీక్ష చదివినవారికి ఆ విషయం అర్థం అవుతుంది.

విద్యార్ధులు కరుణాకర్ జీవితంలో ఒక విడదీయలేని భాగంగా ఉన్నారు. పని చేసే దగ్గరే నివాసం ఉంటూ ఇంటిని కూడా ఒక బడిని చేసుకొన్నారా దంపతులు. ఒక టీచర్ గా పిల్లలకు తన వైపు నుండి ఇవ్వాల్సిన ఇన్ పుట్స్ అన్నీ ఆయన ఇచ్చేవాడు. పాఠాలు చెప్పటానికి కొత్త కొత్త పద్దతులు ఆయన దగ్గర ఉంటాయి. అంతేకాదు. విద్యా వ్యవస్థను, సిలబస్ ను మెరుగుపర్చటానికి ఆయన చేసిన ప్రతిపాదనలు అన్నీ ఇన్నీ కావు. ఇంగ్లీష్, తెలుగు మీడియంల చర్చ వచ్చినపుడూ, నూతన విద్యావిధానం ప్రతిపాదనల మీద ఆయన గళం విప్పి అందరినీ ఒప్పించే విధంగా మాట్లాడాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆర్థిక సామాజిక మానసిక స్థితిగతులను ఆయన కాచి వడబోశాడు. ఆ పిల్లలు తమ జీవితాలను నిర్మించుకునే వివిధ దశల్లో కూడా కరుణాకర్ వాళ్లకు టీచరే.

కరుణాకర్ కు మంచి సినిమాలంటే అభిరుచి. సాంస్కృతోద్యమానికి సినిమాలు కూడా తోడ్పడతాయని ఆయన కూడా నమ్ముతారు. అయితే ఆయన తనకున్న అభిరుచులను ఎప్పుడూ తన వరకు పరిమితం చేసుకోకుండా వాటిని వెదజల్లుతారు. తన స్టూడెంట్స్ చేత పుస్తకాలు చదివించడమే కాకుండా, మంచి సినిమాలు కూడా చూపించే ప్రయత్నం చేసేవారు. మేమిద్దరం ‘మంచి సినిమా’ అనే వాట్స్ అప్ గ్రూపు అడ్మిన్స్ లో ఉన్నాము. విస్తృతమైన ప్రజాప్రయోజనాలు ఉన్న ప్రతి దగ్గరా మాతో కరుణాకర్ ఉన్నారు. ఒక్కోసారి మా వెనుకా, ఒక్కోసారి మా పక్కనా, చాలా సార్లు మాకంటే ముందు.

ఆయన కుటుంబంలో పాటించిన ప్రజాస్వామిక విలువలు ఉన్నతమైనవి. అందరికీ ఆదర్శనీయమైనవి. తాత్విక్ కు కరుణాకర్ ను మించిన స్నేహితుడు ఇంకొకరు దొరకరేమో. తల్లిదండ్రుల జ్ఞానం, తాత్వికత, సిద్ధాంత నిబద్ధతల నుండి పిల్లలకు కొంతభాగం ప్రసారం అవుతాయి. కరుణాకర్ అందరి తల్లిదండ్రుల కన్నా ఎక్కువే తాత్విక్ కు అందించి వెళ్లారు. ఝాన్సీకీ, తాత్విక్ కీ కరుణాకర్ అందచేసిన సంతోషాలలో భాగం కావాలని పోటీ పడేవాళ్లం మేము చాలామందిమి ఉన్నాము. నా వరకు నాకు కరుణాకర్ కు ముందు ఒక జీవితం, కరుణాకర్ పరిచయం అయ్యాక ఇంకో జీవితం ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పటికీ. ఈ ఆలోచన కూడా నాకొక్క దానికే పరిమితం అనుకోవటానికి అవకాశం లేకుండా చాలామంది ఇవే మాటలు చెబుతున్నారు.

కరుణాకర్ ఝాన్సీని తయారు చేశారా, ఝాన్సీ వలన కరుణాకర్ ఇంత ఉత్సాహంగా ఉంటారా అనే ప్రశ్నకు సమాధానం తెలియనంతగా వారి సహజీవనం ఉండేది. తన సాహచర్యంతో అతని శక్తులు ఎప్పుడూ ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడి -ఆ సజీవ మూర్తిమత్వం నుండి స్ఫూర్తినీ, అవసరమైన జ్ఞానాన్నీ, సంతోషాన్నీ, కార్యదక్షతనూ పొందింది ఝాన్సీ. ‘కాకలు తీరిన యోధులు’ నవలలో కధా నాయికా నాయకులు కరుణా, ఝాన్సీలు. అర్థవంతమైన, సంపూర్ణ సహజీవనానికి వాళ్లిద్దరూ ప్రతినిధులు. ‘కరుణాకర్ కు అప్పుడు వైకల్యం ఉందో లేదో కానీ, ఇప్పుడు నాకు ఇప్పుడు కాళ్లు లేనట్లు అనిపిస్తోంది’ అంటోంది ఝాన్సీ. ‘కరుణాకర్ నుండే నేను ప్రపంచాన్ని నేర్చుకొన్నాను. నేనూ, చిన్నారి ఇద్దరం ఒక సంవత్సరం తేడాతో ఒకేసారి కరుణ దగర పెరిగాము. ఒక విశిష్టమైన జీవితాన్ని నాకు అలవాటు చేసి మాయమై పోయాడు’ అంటుందామె. ‘ఒకసారి నేనన్నాను, గుర్తు ఉందా! నా పక్కన నీవు లేవని అనుకొంటున్నావేమో, నా నాసికా పుటాల అంచున నీ వాసన నన్ను చుట్టు ముట్టేస్తుందోయ్ అని నేనంటే, దాన్ని బంధం అంటారని అన్నావ్! ఇంకెక్కడికి వెళ్తావోయ్! నువ్వేసిన పూవనంలో సీతాకొక చిలుకవై రాకెక్కడికి వెళ్తావ్!’ అని భావోద్వేగంతో రాసుకొన్నది ఝాన్సీ. ‘నేనంటే నువ్వనీ, నువ్వంటే నేననీ నమ్మేవాళ్లు, నీ ప్రేమలో నిండా మునిగినోళ్లు ఒక్కొక్కరు పలకరిస్తున్నారు. కన్నీళ్లను పూస్తున్నారు. ఏం చెప్పనూ?’ అని అడుగుతోంది.

కరుణాకర్ మరణ దుఃఖం నుండి కళ్లు తుడుచుకొని, ఆయన వ్యక్తిత్వాన్ని విశ్లేషించుకొని, తనతో వున్నస్నేహ సంబంధాలను మననం చేసుకొన్న తరువాత సహజంగా వచ్చే ప్రశ్న -కరుణాకర్ కి ఈ వ్యక్తిగత సామర్ధ్యాలు ఎక్కడ నుండి వచ్చాయి? ఏదీ వ్యక్తిగతం కాదు అని నమ్మే కరుణాకర్ ఆలోచన నుండే ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తే ఆయన పుట్టి పెరిగిన ప్రకాశం జిల్లా పమిడిపాడు గ్రామం ఉమ్మడి కమ్యూనిష్టుల కాలం నుండి కమ్యూనిష్టు ఉద్యమాలకూ, వ్యక్తులకూ ప్రసిద్ధి. అలాంటి కుటుంబంలోనే పుట్టిన కరుణాకర్ అక్కడితో ఆగకుండా విప్లవ భావజాలాన్ని ఒంట బట్టించుకొన్నారు. ఆ భావజాలంతోనే మంచి మార్క్సిస్టు అయ్యాడు. సామ్యవాద ప్రేమికుడు అయ్యాడు. విప్లవ స్వాప్నికుడు అయ్యాడు. ఆ భావజాలం వలనే చిత్రకారుడు, కార్టూనిస్టు, కవి, విశ్లేషకుడు, హక్కుల కార్యకర్త అయ్యాడు. అంతిమంగా ఆయన ప్రజలందరినీ ప్రేమించే అద్భుత మానవుడు అయ్యాడు.

కరుణాకర్ లేని లోటు భర్తీ చేయలేనిది. మంచికంటి అన్నట్లు ఏ ఒక్కరితో ఆ లోటు భర్తీ కాదు. సమూహంగా ఆ భర్తీ జరపాలి. ఆయన సిద్దాంతాలనూ, వ్యక్తిత్వాన్ని అభిమానించి ప్రేమించే వాళ్లమందరం కరుణాకర్ ను ఆవాహన చేసుకోవాలి. ప్రజలతో పాలలో నీళ్లలా కలిసిపోవడానికి ఆయన సూచించి పోయిన పరికరాలను అందిబుచ్చుకోవాలి. కరుణాకర్ చూపించి పోయిన దారి పట్టుకొని ప్రయాణం చేయాలి.

కరుణాకర్ చల్లని ఆదరణగా, చిద్విలాసమైన చిరునవ్వులా, విలువైన మాటలుగా, సుందరమైన ఉద్యానవనంలా, ఆహ్లాదకరమైన సువాసనలాగా స్మృతుల్లో ఉన్నాడు. అప్పుడప్పుడూ అల్లకల్లోలం చేస్తున్న తుఫానులాగా కూడా ఉన్నాడు. కరుణాకర్ ఇప్పుడు భౌతిక రూపంలో లేడు. స్థిమితం, విశ్రాంతి ఇవ్వకుండా మునుముందుకు నడిపించే చోదక శక్తి ఇప్పుడు కరుణాకర్. లోలోన అతను ఇప్పుడు ప్రవహిస్తున్నాడు.

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

One thought on “కరుణాకర్ ఇప్పుడు ఒక అంతర్ ప్రవాహం

  1. You have brought Karunakar Y back to life with your letters Rama Sundari.
    Reading it again and again since yesterday and will read when I want to see him again.

Leave a Reply