కరిగిపోతున్న కార్మిక శక్తి

గడచిన దశాబ్ది కాలాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో శ్రమ శక్తి `పెట్టుబడి మధ్య సంబంధాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చిన కాలంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ పెట్టుబడికి, దేశీయ కార్మిక వర్గానికి మధ్య జరుగుతున్న పోరాటం 2011 నాటికి కీలకమైన మలుపు తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించటంలో పాలుపంచుకున్న రాజకీయ శక్తుల మధ్య ఉన్న ఏకీభావం గత దశాబ్ది కాలంగా కార్మిక వర్గాన్ని చీల్చి చెండాడుతోంది అని నిర్ధారించటం సందర్భోచితమే. మరిన్ని వివరాల్లోకి వెళ్లి చూద్దాం.

సాధారణంగా కుటుంబ పోషణ నిమిత్తం అవసరమైన వేతనాలు లేదా లాభాలు అందించే పనిలో ఉన్న వ్యక్తిని శ్రమశక్తిలో భాగంగా గుర్తిస్తాము. అటువంటి శ్రమ శక్తి 2022 ఫిబ్రవరి నాటికి భారతదేశంలో 42 కోట్ల 80 లక్షలమంది ఉన్నారు. 2022 మార్చి నాటికి ఇందులో 38 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. గత రెండేళ్లల్లో ఇదే స్థాయిలో నిరుద్యోగం ప్రబలినా ఆ నేరం నాది కాదు, కోవిడ్‌దే అని చెప్పి పాలకులు తప్పించుకున్నారు. కానీ వాస్తవం ఏమిటి? గత దశాబ్ది కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పొందికలో మారుతున్న పొందిక పర్యవసానమే ఈ ఉద్యోగాల కోత అన్నది వాస్తవం. మార్క్సిస్టు పరిభాషలో చెప్పుకుంటే భారత ఆర్థిక వ్యవస్థలో మృత పెట్టుబడి (యంత్రాలు, మౌలికవనరులు, సాంకేతిక పరిజ్ఞానం) పెరుగుతోంది. సజీవ పెట్టుబడి (కార్మికులకు వేతనాల రూపంలో ఖర్చయ్యే పెట్టుబడి) తగ్గుతోంది. ఈ తగ్గుదల సాపేక్ష స్థాయి నుండి సంపూర్ణ పతనం స్థాయికి వచ్చిందన్నది మార్చి నెలకు సంబంధించి కేంద్రం కార్మిక శాఖ జారీ చేసిన గణాంకాల నివేదికలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

కార్మికరంగంలో జరుగుతున్న పరిణామాలను మూడు కోణాల నుండి పరిశీలించాల్సిన అవసరం ఉంది. మొదటిది మార్కెట్‌ కోణం. రెండో పాలకుల కోణం. ఈ రెండు కోణాల్లో జరుగుతున్న పరిణామాలకు కార్మికవర్గ స్పందన మూడో కోణం. మార్కెట్‌ కోణాన్ని ముందు పరిశీలిద్దాం. ప్రముఖ ఆర్థిక వేత్త, గ్రీస్‌ మాజీ ఆర్థిక మంత్రి యూనస్‌ వారుఫాకిస్‌ తాజాగా ఓ ట్వీట్‌లో నిరుద్యోగం పెరుగుతుంది అందే మరోవైపున పెట్టుబడికి లాభాలు పెరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి అన్నారు. ఈ సూత్రం భారతదేశంలో పెరిగే నిరుద్యోగం సందర్భంలో కూడా వర్తిస్తుంది. గత సంవత్సరం ఏప్రిల్‌ నాటికి 40 శాతంగా ఉన్న ఉత్పాదక శ్రమ శక్తి పాత్ర 2022 మార్చి నాటికి 39.5 శాతానికి కుదించుకుపోయింది. ఈ శాతాన్ని అంకెల్లోకి మార్చి చెప్పాలంటే పైన ప్రస్తావించుకున్నట్లు 38 లక్షల మంది గత రెండు నెలల కాలంలో శ్రమశక్తి నిర్వచనం నుండి బయటకు వచ్చారు. అంటే ఇకపై వీరిని ప్రభుత్వం నిరుద్యోగుల జాబితాలో పరిగణించదు. ఫలితంగా ఉద్యోగాలు కోల్పోయారు. గత రెండేళ్ల కాలంలో ఉద్యోగుల కోతకు కోవిడ్‌ కారణమని చెప్పారు. కానీ ఈ సంవత్సరం కోవిడ్‌ సాకు లేకుండానే లక్షల మంది ఉద్యోగులు వీధిన పడ్డారు.

ఏ దేశంలోనైనా జనాభాలో శ్రమ శక్తి మోతాదు ఎలా తగ్గుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు శ్రమశక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి. శ్రమ శక్తి అంటే ఏ దేశ జనాభాలోనైనా శ్రమ చేయటానికి ఓపిక ఉన్న జనాభా శాతం. సాధారణంగా 21 ఏళ్ల నుండీ 65 ఏళ్ల వరకూ ఉన్న జనాభా పని చేసే సామర్ధ్యం, అవసరం కలిగి ఉంటుంది. మొత్తం జనాభాలో ఈ వయో బృందంలో ఉన్న వారి మోతాదునే శ్రమశక్తి అంటున్నారు ఆర్థిక వేత్తలు. పైన చెప్పిన వివరం ప్రకారం ప్రభుత్వం లేదా మార్కెట్‌ ఉపాధి కల్పించలేకపోవటం వలన 38 లక్షల మందికి ఏజ్‌ బార్‌ అయ్యింది. ఇకపై వీళ్లు ఏ ఉద్యోగానికీ దరఖాస్తు చేసుకోలేరు. ఇదో విచిత్ర పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తోంది. ఉత్పత్తి నాణ్యత, పరిమాణం పెరుగుతోంది. కానీ దానికి అవసరమైన కార్మిక శక్తి కరిగిపోతోంది.

మార్చి నెల్లో కేంద్రం జారీ చేసిన శ్రమ శక్తి నివేదికలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. అది నికరంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్యకు సంబంధించిన అంశం. జూన్‌ 2021 నాటికి 39 కోట్ల 60 లక్షలమంది గా ఉన్న కార్మికులు, ఉద్యోగుల్లో 2022 మార్చి నాటికి 14 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. శ్రమ చేసే వయసు మించిన పోయిన వారి సంఖ్య, నేరుగా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య కలుపుకుని చూస్తే ఈ రెండేళ్ల కాలంలోనే షుమారు 50 లక్షల మంది జీవనోపాధి, జీవనోపాధి అవకాశాలను కోల్పోయిన వాస్తవం కళ్లముందుంది. మొత్తం జనాభాలో శ్రమశక్తి, ప్రత్యేకించి ఉత్పాదక శక్తి నష్టం మోడీ పాలనలో ఉన్నంతగా ఎన్నడూ లేదు. ఇక్కడ కోల్పోయింది ఉద్యోగావకాశాలే అని చూస్తున్నాము. కానీ దేశం కోల్పోయింది ఉద్యోగాలు మాత్రమే కాదు. ఈ శ్రామిక శక్తి ఉత్పత్తి చేయాల్సిన జాతి సంపదను కూడా కోల్పోయాము అన్న కోణాన్ని తరచూ విశ్లేషకులు, విమర్శకులూ విస్మరిస్తూ ఉంటారు. ఇదీ మార్కెట్‌ నియమం కారణంగా శ్రమశక్తికి జరిగిన నష్టం.

మరింత లోతుగా పరిశీలిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ముంచుకొస్తున్న ముప్పు కూడా అర్థం చేసుకోవటానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయి. 2022 మార్చిలో కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన లెక్కలు మారుతున్న ఉపాధి అవకాశాల పొందిక గురించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలను వెల్లడిస్తోంది. ఈ నివేదిక ప్రకారమే ఈ కాలంలో వ్యవసాయేతర రంగంలో కోటి 67 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మొత్తం కోటిన్నరకు పైగా వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు కోల్పేతే అందులో పారిశ్రామిక రంగంలో కోల్పోయిన ఉద్యోగాలు షుమారు డెబ్బై అయిదు లక్షల వరకూ ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ నివేదిక వెల్లడిస్తోంది. అంటే అంతమందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు, వ్యవసాయేతర రంగం మూతపడిరది. వ్యవసాయేతర రంగం మూతపడటం అంటే దాంతో పాటు అనుబంధ ఉపాధి అవకాశాలు కూడా కోల్పోవటమే. అయితే ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో పని చేసే శ్రామికుల సంఖ్య కోటిన్నర అదనంగా పెరిగింది. అంటే పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు మూతపడటంతో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు గ్రామీణ ప్రాంతాలకు వలస వెళ్లి వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు వెతుక్కున్నారు. అటువంటి వ్యవసాయ రంగాన్ని నేడు మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ రంగానికి అప్పగించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఏ అభివృద్ధి చెందిన దేశంలోనైనా వ్యవసాయంపై ఆధారపడిన కార్మికుల సంఖ్య పెరగటం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోతున్న సంస్థాగత సంక్షోభానికి పునాదులు వేయటమే.

కోవిడ్‌ దాడికి ముందు ప్రపంచ దేశాల్లో సగటు ఉపాధి రేటు ఆయా దేశ జనాభాలో 55 శాతం వరకూ ఉంటుంది. కోవిడ్‌ అనంతరం కూడా చైనా జనాభాలో 63 శాతం ఉద్యోగం / వేతన శ్రమ చేస్తూ ఉంటే బంగ్లాదేశ్‌లో 53 శాతం మంది, పాకిస్తాన్‌లో 48 శాతం మంది ఉద్యోగమో లేదా వేతన శ్రమో చేస్తున్నారు. కానీ భారతదేశంలో ఈ మోతాదు 40 శాతానికి మించటం లేదు. తాజాగా ప్రపంచ బ్యాంకు, సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ జారీ చేసిన లెక్కల ప్రకారం కేవలం 38 శాతం మంది మాత్రమే వేతన ఉపాధి పొందుతున్నారు. అంటే 62 శాతం జనాభా వేతన ఉపాధికి దూరంగా బతుకెళ్లదీస్తున్నారు. జాతీయ నమూనా సర్వే సంస్థ లెక్కల ప్రకారం దేశ జనాభాలో షుమారు 14 శాతం వృద్ధులున్నారు. మొత్తం శ్రమ చేయగల నిరుద్యోగ జనాభలో వీరి మోతాదును మినహాయించినా ఇంకా 48 శాతం పని చేయగలిగిన వయస్సులో ఉన్న వారికి పని దొరకటం లేదు.

ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా శ్రమ శక్తి కుదించుకుపోవటం అంటే ఉపాధి అవకాశాలు కుదించుకుపోవటమే. పై వివరాలు పరిశీలిస్తే ఈ సంవత్సరమే దాదాపు 50లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు ఆవిరయ్యాయని అర్థమవుతుంది. మరి లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు బకాయిల ఎగవేత ద్వారా పోగేసుకున్న పెట్టుబడుల ద్వారా వస్తాయని, వచ్చాయని చెప్పుకుంటున్న లక్షల ఉద్యోగాలు ఎటుపోయాయి అన్న ప్రశ్న మాత్రం మనముందు నిలబడుతుంది. లక్షల సంఖ్యలోనో వేల సంఖ్యలోనో ఉద్యోగాలు వస్తాయన్న సాకుతో వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వ విధానాల బండారాన్ని పై వివరాలు బట్టబయలు చేస్తున్నాయి.

మార్కెట్‌ శక్తులు కార్మికవర్గం పై చేస్తున్న దాడికి తోడు ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు కూడా భారత కార్మిక వర్గాన్ని మరింతగా కుంగదీస్తున్నాయి. ప్రత్యేకించి 2019లో రెండో దఫా అధికారాన్ని చేపట్టిన మోడీ ప్రభుత్వం ఆమోదించిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ మార్కెట్‌ శక్తులు కార్మికవర్గంపై సాగిస్తున్న దాడికి కావల్సిన రక్షణ కవచాలుగా ఉపయోగపడనున్నాయి. ఉదాహరణకు కేంద్రం విడుదల చేసిన వేతన చట్టాన్ని పరిశీలిద్దాం. ఈ చట్టంలో వేతనాలు నిర్ణయించటానికి ముగ్గురు సభ్యులున్న కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుంది. దేశంలో సగటు కుటుంబం పరిమాణం నలుగురు సభ్యులు. కానీ ప్రభుత్వం ముగ్గురు సభ్యులున్న కుటుంబానికి అవసరమైన ఖర్చులు మాత్రమే దృష్టిలో పెట్టుకుని వేతనాలు నిర్ణయించాలని ఆదేశిస్తోంది. మరి కుటుంబంలో ఉన్న మిగిలిగిన సభ్యులు కడుపు నింపుకునే మార్గం ఏమిటి?

అంతేకాదు. కొత్త చట్టం ప్రకారం నిర్దిష్ట స్థాయిలో వేతనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీన్నే ఫ్లోర్‌ వేజ్‌ అంటున్నారు. కానీ ఈ ఫ్లోర్‌ వేజ్‌ని ఎలా నిర్ణయించాలి అన్న విషయంలో చట్టం ఏకమైన స్పష్టతా ఇవ్వలేదు. ఇక ఉద్యోగులను తొలగించే హక్కును కంపెనీలకు దఖలు పర్చింది. నూతన పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కాస్తంత విపులంగా పరిశీలిస్తే మోడీ పాలన కార్పొరేట్‌ వర్గానికి ఏ స్థాయిలో కొమ్ము కాస్తుందో అర్థమవుతుంది. ఇప్పటి వరకూ ఏ పరిశ్రమలోనైనా సమ్మె చేయటానికి రెండు వారాల ముందు నోటీసు ఇస్తే సరిపోతుంది. ఇంతవరకు సమస్య లేదు. కానీ నోటీసు ఎవరు ఇవ్వాలన్నదే సమస్య. కేవలం కార్మిక సంఘాల్లో సభ్యులుగా ఉన్న వాళ్లే సమ్మె నోటీసు ఇవ్వాలన్నది మొదటి షరతు. నోటీసు గడువు తీరిన తర్వాత కొత్త చట్టం ప్రకారం తప్పనిసరి చర్చలు జరపాలి. ఈ చర్చలు ఎంత కాలంలో ముగియాలన్నది తాజా చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. అంటే కేవలం సమ్మెను నివారించటానికి, అడ్డుకోవటానికి కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో యాజమాన్యాలకు అవధుల్లేని అధికారాన్ని అప్పగించింది. పోనీలెమ్మని నోటీసు ఇచ్చాక రెండు నెలల వరకూ చర్చలు, సంప్రదింపుల పేరుతో కాలం వెళ్లదీసిన తర్వాత కూడా కార్మికులు సమ్మెకు వెళ్లవచ్చా అంటే అదీ లేదు. మొత్తం నోటీసు నుండి మొదలు పెట్టి చర్చలు, సంప్రదింపుల వరకూ మళ్లీ కసరత్తు మొదలు పెట్టాలి. కార్పొరేట్ల ఊడిగం అంతటితో ఆగలేదు. రెండో దఫా చర్చలు కూడా ఫలించకపోతే అప్పుడు అనివార్యంగా కొత్త చట్టం కింద ఏర్పాటయ్యే లేబర్‌ కోర్టుకు వెళ్లాలి. లేబర్‌ కోర్టులో వాదోపవాదాలు విని, తీర్పు వచ్చిన తర్వాత తీర్పు కార్మికులకు వ్యతిరేకంగా వచ్చినా మరో రెండు నెలల వరకూ సమ్మెలోకి వెళ్లటానికి వీల్లేదు.గతంలో ఇంత సంక్లిష్టమైన సమ్మె సన్నాహాలు ప్రజోపయోగ పరిశ్రమలు, సేవలకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ తాజా చట్టంలో అన్ని పరిశ్రమల్లోనూ కార్మికులు సమ్మెకు వెళ్లాలంటే వ్యయప్రయాసలకు గురై ఈ మొత్తం కసరత్తు పూర్తి చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త పారిశ్రామిక వివాదాల చట్టం రూపంలో పెట్టుబడి ముందు సాగిలబడటానికి 56 అంగుళాల ఛాతీ కూడా సరిపోదేమో అనిపించేంత దారుణంగా ఉంది.

భారత కార్మికవర్గంపై ముంచుకొస్తున్న ఈ జంట ప్రమాదాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. ఇది మూడో కోణం. మనందరికీ తెలిసిన విధంగానే పై రెండు కోణాల్లో కార్మికవర్గంపై జరుపుతున్న దాడిలో కార్పొరేట్‌ ` కాషాయ పాలకుల మధ్య ఉన్న ఐక్యత కార్మికవర్గంలో కొరవడిరదన్నది నిస్సందేహం. దీనికి చక్కని ఉదాహరణ తాజాగా ముగిసిన విశాఖ ఉక్కు కర్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికలు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా ఉండాలని అఖిల పక్షాన్ని సమీకరించి నెలల తరబడి ప్రత్యక్ష ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల పక్షాన కార్మికులు నిలవలేదు. చట్టసభలకు జరిగే ఎన్నికల్లాగానే విశాఖ ఉక్కు ఎన్నికల్లో సైతం అన్ని కార్మికేతర లక్షణాలు చొరబడ్డాయి. వీటికి తోడు పోరాటంలో ఉన్న కార్మిక సంఘాలు మిత్రులను సమకూర్చుకోవటంలో విఫలమయ్యాయి. ఈ విధంగా మిత్రులు సమకూర్చుకోలేకపోవటం వలన కార్మిక ప్రయోజనాలు నష్టపోతున్న సందర్భాలు గత మూడు దశాబ్ద్లాల్లో అనేకసార్లు తారసపడ్డాయి. అయినా కార్మికవర్గం పాలక వర్గపు కుట్రలకు బలవుతూనే ఉంది.
దేశాన్నేలే కాషాయ దళాలకు కార్మికవర్గం, ఉద్యోగ వర్గంలోనూ భజన పరులు గణనీయంగానే ఉన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తుంటే ఆరెస్సెస్‌ అనుబంధ కార్మిక సంఘాలు మాత్రం సమ్మెలో చేతులు కలపలేదు. అంతేకాదు. దాదాపుగా ఈ దేశంలో మధ్యతరగతిగా ఎదిగి ఆర్థిక సుస్థిరత సాధించుకున్న కార్మికవర్గపు తరగతి అసలు సమ్మె ఆలోచన చేయటానికి కూడా సిద్ధం కాని పరిస్థితులున్నాయి. సంస్కరణలు మొదలైన సమయంలో ముప్పై నలభై ఏళ్ల వయసులో ఉన్న కార్మికులు ఇప్పుడు దాదాపుగా రిటైర్మెంట్‌ దశకు చేరుకున్నారు. ఈ మూడు దశాబ్దాల్లో కార్మికవర్గంలో చేరిన వారికి రాజకీయ చైతన్యం సంగతి పక్కన పెట్టి తమ హక్కులు, చట్టపరమైన రక్షణల గురించిన అవగాహనే నామమాత్రంగా ఉంటోంది. దీనికి తోడు మతం, కులం, కార్మికవర్గాన్ని నిట్టనిలువునా చీల్చేస్తున్నాయి. తాజాగా కేంద్రం అమలు చేస్తున్న అనేక విధానాలు కార్మికవర్గంలో సింహభాగంగా ఉన్న హిందువులకే నష్టమన్న కనీస జ్ఞానంతోనైనా మధ్యతరగతి ఉద్యోగులు స్పందించటం లేదు. ఏతావాతా భారత కార్మిక వర్గం ఈ ముప్పేట దాడికి గురవుతూ ఉంటే ఈ దాడి తీవ్రతను గుర్తించకుండా చేయటానికి కార్పొరేట్‌ అజెండాను భుజాన మోస్తున్న కాషాయ దళాలు కార్మికులను మతతత్వ సమీకరణ సాధనాలుగా వాడుకుంటున్నాయి.

ఈ మూడు పరిణామాలను కలిపి చూస్తే రానున్న కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ, కార్మికవర్గం, సామాజిక ప్రయోజనాలు పెద్దఎత్తున ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయని స్పష్టమవుతుంది.

‘మన మంచి పుస్తకం’ యూ ట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకుడు. హైదరాబాద్‌ హైకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నారు.

Leave a Reply